దుఃఖ ద్వీపాల సామూహిక గానం

భారతదేశం భిన్నత్వంలో ఏకవిత్వం కలది. ఐకమత్యమే మహాబలమని లోకానికి చాటిచెప్పింది.

స్త్రీలను దేవతలుగా పూజించే ఏకైక దేశం. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” వంటి ఎన్నో నీతులు ప్రపంచానికి చెప్పిన సమాజం.

ఆచరణలో అంజనమేసి వెతికినా కనపడదన్నట్టుగా ఎందుకు వుందో, ఎలా వుందో నిరూపించే ఘటనలు ప్రాచీనంలోనే కాదూ నేటికీ కోకొల్లలుగా మనకు కానవస్తాయి. అందుకు స్పష్టమైన ఉదాహరణగా బిల్కిస్ బానో అనే తల్లికి జరిగిన అన్యాయాన్ని యావత్తు ప్రపంచం వేలకళ్ళతో చూసింది. వేల చెవులతో వినింది. కానీ కొన్ని గొంతులతోనే విలపించింది. నిరసించింది. ఒక్క బిల్కిస్ బానో విషయమే కాదు, ఆసీపా, మనిషీ వాల్మీకి, ఉన్నావ్ తల్లులు ఒక్కొక్క ఘటన ఒక్కో దుర్మార్గపు పాలనను, అన్యాయాన్ని, బాధితులే అవమానాలు పడ్డాన్ని సభ్యసమాజం చూస్తూనే ఉన్నది. స్త్రీలను, చిన్నపిల్లల్ని నాశనం చేసి, బతుకుల్ని చిందిమేసిన నేరగాళ్లు, హంతకులు నిస్సిగ్గుగా క్షమాభిక్ష పేరుతోనో, సత్ప్రవర్తన వంకతోనో జైళ్ల నుంచి బయట పడటం, సంబరాలు చేసుకోవడం వర్తమాన సమాజపు మూతిమీద మాయని మచ్చగానూ మిగిలిపోతోంది. ఈ వాస్తవాలను వర్తమాన కవయిత్రి ఫణిమాధవి కన్నోజు తన సామభేద కవితా సంపుటిలో ‘క్షమాభిక్ష’ కవితలో చర్చించింది.

ప్రజాస్వామిక కాలపు గుండె చప్పున్ని వినిపించింది.

మతమౌఢ్యంతో చెలరేగిపోయిన ఉన్మాదం, కోరలు సాచిన కులాధిపత్యాలు సల్పిన దుర్మార్గపు చర్యకు బలైపోయిన ఒంటరి బానో ఒకవైపు, అందుకు కారణమైన దుర్మార్గులకు, నేరస్తులకు అండగా ఉంటున్న వ్యవస్థలు ఒకవైపు డెబ్భై ఐదేళ్ల అమృతోత్సవాల స్వతంత్ర భాతదేశం కల్లారచూసింది. నేరస్తులను ఊరేగించిన నీచ చరిత్రను నమోదు చేసుకుంది. అత్యంత క్రూరంగా ప్రవర్తించి, అత్యాచారాలు, హత్యలు చేసి ప్రాణాలు పొట్టన పెట్టుకున్న అమానవులకు ఎలా క్షమాభిక్ష వేస్తారని, ఈ దేశపు నీతిని, న్యాయాన్ని నిలదీసిన ఫణిమాధవి కవిత క్షమాభిక్ష. చదవండి.

క్షమాభిక్ష

సత్ అంటే ఉత్తమమైన అని
విన్నాం ఇన్నాళ్ళూ
వాళ్ళ ప్రవర్తన ఉత్తమం
అయితే సత్ అనగా అర్థమేమి

చట్టం తన పని తాను చేసుకుపోతుందని నమ్మామిన్నేళ్ళూ
వాళ్ళ విడుదల చట్టసమ్మతం
మరి చట్టం విధించిన శిక్ష సంగతేంటి

జై రామ రాజ్యంలో
రావణుని రథం ఊరేగుతోంది
పాండవ ధర్మ పాలనలో
కీచక జయధ్వానాలు మిన్నంటుతున్నాయి

దండించిన న్యాయం
దండలతో సత్కరించింది
ఇది
పవిత్ర మాతలు పూజలందుకునే
పావన దేశంలో
బిల్కిస్ మానానికి దక్కిన మన్నన
పోగొట్టుకున్న పసిప్రాణాలకు ఇచ్చిన మర్యాద

మతోన్మాదం చేతిలో మంత్రదండంతో
రావణుడైనా కీచకుడైనా
తమ వాడైతే

దోషానికి పుణ్యాహవచనం
న్యాయానికి మంగళం

తీరుతీర్లుగ దుఃఖం దిగమింగుకున్నది చాలిక

బిల్కిస్ బానో బెంగటిల్లకు
ఆసిఫా కోసం ఆక్రోశించి
ఉన్నావ్ తో ఉడికిపోయి
హత్రాస్ కు హడలెత్తిపోయిన
ఒంటరి దుఃఖద్వీపాలన్నీ
సమూహమై ఎగసి
నారింజ ఆకాశాన
నీలి వర్ణాన్ని చిత్రిస్తాయి

*

బిల్కిస్ బానో న్యాయపోరాటంలో సంఘీభావాన్ని తెలుపుతూ కవయిత్రి ఫణిమాధవి కన్నోజు రాసిన ఈ కవితలో పాలకులు మనువాదపు, మతవాదపు న్యాయానికి పూనుకుంటే ఎటువంటి అన్యాయం న్యాయమై ఊరేగుతుందో, ఉత్సవం చేసుకుంటుందో పొరలుపొరలుగా విప్పిచెప్పిన కవిత యిది.

“బలహీనుడు-బలవంతుడు, స్త్రీ-పురుష, నిమ్న-అధిక, పేద-ధనిక, పాలితులు-పాలకులు ఈ అంతరాలన్నింటిలో సదా పీడనకు గురయ్యేవారిని, పీడకులను వేరుగా చీల్చి ఇదో ఇదీ మీరు అని చెప్పాలని ఉంటుంది.” అంటున్న ఈ కాలం గుండె చప్పుడుగా ఫణిమాధవిగారి కవిత్వాన్ని అర్ధం చేసుకుంటే… ఈ దేశంలో స్త్రీలు ఏవిధంగా వివక్షకు గురతున్నారో ముఖ్యంగా దళిత, ముస్లిం మైనారీటీ స్త్రీలు ఎదుర్కొంటున్న నిరాదరణ ఎటువంటిదో సందర్భోచితంగా కవిత్వం చేయడంలో వీరి నిబద్ధతను, మానవ హక్కుల,మహిళా హక్కుల, అందునా అట్టడుగు కుటుంబాల స్త్రీల హక్కుల కోసం నిలబడటంలో నిఖార్సయిన గొంతుకను మనం వింటాం. సమకాలీన భారతీయ సమాజం మహిళలను, పీడుతులను వారి న్యాయపరమైన ఆకాంక్షలను పట్టించుకోవాల్సిన అవసరాన్ని మాట్లాడే అతికొద్దిమంది ప్రజాస్వామిక గొంతుకల్లో ఫణిమాధవి కన్నోజు ఒకరు. వీరి కవిత ద్వారా బాధితులను కులం, మతం ఎంత దుర్మార్గపు న్యాయంగా వేధిస్తాయో గ్రహిస్తాం.

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply