దుఃఖమణిపురం

వీధులన్నీ దుఃఖాన్నే కల్లేపుజల్లి
దుఃఖాన్నే ముగ్గులేసుకుంటున్న
నా దుఃఖమణి పురమా!

ఎక్కడైనా
పచ్చని చెట్ల తలలు ఊరికే తెగిపడుతాయా?
పచ్చని బతుకుచేలు ఊరికే తెగులుపడతాయా?

నెత్తురోడే తమ్ముడితల వేలాడిన ఇంటితడికనడుగు
వొంటిబిత్తలదేహమై ఊరేగిన తల్లి భారతమ్మనడుగు
ఎత్తులు ఎవ్వరివో
వేటాడుతున్న కత్తులెవ్వరివో

మనమేమి నిజాలు తెలీని
నంగితుత్తాయి తంగబుర్రలం కాదు కదా!

విద్వేషపు మంటల చుట్టూ
గుంటనక్కలు పాడే గొబ్బియాలు వింటూ
ఉన్మాదం ఉచ్చికెక్కినజాతి
పోగేసిన వినాశనాన్ని కళ్లారా చూస్తున్నాం కదా

పట్టపగలే
అన్నదమ్ముళ్ల ఆంబోగపు వేడుకలో
చెరచబడ్డ చెల్లెళ్ళ దిశమొలలపురమా!

పగిలిన తలలు
తెగిన చేతులు
బూడిదవుతున్న ఇంటికప్పుల నడుమ
కాలి బొబ్బలు తేలిన దేహాలు
లోయవాకిట్లో గొబ్బెమ్మలుగా కొలువైన దృశ్యాలు
కళ్ళలో ముల్లుల్లా గుచ్చుతున్నాయి
ఇట్టా
కళ్ళు మూసుకుని ఎంతసేపు నటిస్తామో చెప్పు?

ప్రపంచం ముందు తలదించుకునే
కొడుకుల్నికన్న కులోన్మాదపు ‘మనువు’పురమా!

నిన్నటిదాకా
ఏ ఆకో అలమో తిని
ఆనందంగా బతికిన యీ కొండా కోనా
నేడిట్టా నెత్తురు జుర్రుకునే మృగంగా ఎందుకుమారిందో గదా!

ఏ తంటా లేకుండా
ఇట్టాంటి మంటలు పుడుతాయా.??
నిప్పులేకుండానే పోగొస్తాదా??

తమ పబ్బాలను గడుపుకునేకి
తంటాలు పెట్టిన తోడేళ్ళుగుంపు..
ఏ గెవిలో సుఖంగా నిద్రపోతోందో?

దేశం గొప్పతనం గురించి దేశాలు ముందు ఎచ్చులుపోయే దేశోద్ధారక చారలపిల్లి
ఏ దేముడిపొయ్యికాడ ముడిగుండాదో
అడగటమే అపరాదమంట కదా!
కడుపు కూడుతినేవోడెవుడైనా
దుర్మార్గాన్ని దుర్మార్గమని
అడక్కుండా ఎట్టా వుంటాడో చెప్పు??

పన్నాగమేమిటో పసిగట్టలేవా
లోపల మణులున్న పూరా!
నా కుకీజనుల ఊరా.!
పీనుగులమీద కట్టుకునే పీఠాలపై
ఎవడైనా ఎన్నిదినాలు కులుకుతాడో చెప్పు?

దేశమేమన్నా గొడ్డుపోయిందా?
దేశపు గొంతులేమన్నా వొట్టిపోయాయా?
కాలం యల్లకాలం
‘మోస’పు మంటల చుట్టూ చలికాచుకుంటూ
సంకలెగరేయదు గదా !

*

(మణిపూర్ లో దారుణాలకు..)

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply