డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతలైన సబా దేవన్, రాహుల్ రాయ్ లను – ప్రభుత్వం ఢిల్లీ కలహాల విషయంలో ఇరికించి వారిపై దర్యాప్తు జరుపుతన్న విషయం తెలిసిందే. దీనికి నిరసనగా చాలా మంది చిత్ర నిర్మాతలతో పాటు, దేశంలోని ఐదు ఫిల్మ్ కలెక్టివ్ లు ఈ దర్శకులకు మద్దతుగా ఆన్ లైన్ లో వీరి చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సాలిడారిటీకి మద్దతుగా రాహుల్ రాయ్ 2015 లో నిర్మించిన అతి ముఖ్యమైన డాక్యుమెంటరీ ‘ది ఫ్యాక్టరీ’ గురించి పరిచయం చేసుకుందాం.
1987లో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన రాయ్ అసంఘటిత రంగ కార్మికుల సమస్యలతో మజ్మా, వెన్ ఫోర్ ఫ్రెండ్స్ మీట్, చేనేత కార్మికులపై ది సిటీ బ్యూటిఫుల్ సినిమాలు నిర్మించాడు. సంఘటిత రంగ కార్మికులపై అతడు నిర్మించిన మొదటి సినిమా ‘ది ఫ్యాక్టరీ’.
మారుతి సుజుకి 1980 లో ప్రారంభమైంది. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మారుతి 800 కారు ఈ సంస్థ తయారుచేసినదే. 2007 వరకు సుజుకి భారత ప్రభుత్వంతో మధ్య జాయింట్ వెంచర్ గా పనిచేసింది. అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ముందుంది. కానీ 2007 లో ప్రారంభమైన మానేసర్ ప్లాంట్‌లో ప్రతి 50 సెకన్లకు ఒక కొత్త వాహనాన్ని తయారు చేస్తుంది. ఈ అధిక లక్ష్యాలు సాధించడానికి వేగంగా కదిలే అసెంబ్లీ లైన్, శాశ్వత, కాంట్రాక్ట్ కార్మికుల మిశ్రమాన్ని ఉపయోగించడం, కార్మిక సంక్షేమ వ్యయం తగ్గింపు, యూనియన్ ఏర్పాటుపై నిషేధం వంటి కఠిన చర్యలు చేపట్టారు మేనేజ్మెంట్.
ఈ డాక్యుమెంటరీలో సునీల్ అనే తొలగించబడిన కార్మికుడు కర్మాగారంలో అసెంబ్లీ లైన్ రేఖాచిత్రాన్ని గీసి వివరిస్తాడు. ఇది సినిమాలో చాల కీలకమైన సన్నివేశం. ఏడు నిమిషాల టీ విరామం, 30 నిమిషాల భోజన విరామం. భోజన సమయంలో క్యాంటీన్ కి వెళ్లి రావడానికి 20 నిమిషాలు పడుతుంది, క్యూలో నిలబడి ఆహారం తీసుకుని తినడానికి కేవలం పది నిమిషాలు మాత్రమే మిగుల్తుంది. తొందరగా కదిలే అసెంబ్లీ లైన్ తప్పులను తనిఖీ చేసుకునే వీలు కూడా ఇవ్వదు. తప్పులు జరిగినప్పుడు హెచ్ఆర్డీ వారు తొలగిస్తామని బెదిరిస్తారు. తప్పు చేస్తే ‘పాఠశాల పిల్లవాడిలా చెవులు పట్టుకుని’ నిల్చోమంటారు. అందరిముందూ 8 గంటలు నిలబెట్టే శిక్షలు కూడా వేస్తారు. కేవలం నాలుగు రోజులు గైరు హాజరైతే సగం జీతం కట్ చేస్తారు. ‘మీ నోట్లో చేయి పెట్టినా మీరు కరవలేరు’ అని క్రూరులైన మేనేజర్లు కార్మికులకు చాలెంజ్ చేస్తుంటారు.
కంపెనీ వారు 2011 లో కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలను అడ్డుకున్నారు. కానీ చివరికి మారుతీ సుజుకీ వర్కర్స్ యూనియన్ (MSWU) తయారైంది. గుడ్‌గావ్ పారిశ్రామిక క్షేత్రంలోని ఇతర యూనియన్లలా కాకుండా ఈ యూనియన్ పర్మనెంట్ వర్కర్లతో పాటు, టెంపరరీ కార్మికుల హక్కుల గురించి కూడా మాట్లాడడం యాజమాన్యానికి కంటగింపైంది. ఏదో నెపంతో కార్మికులు కొందరిని తొలగించారు. ఈ గొడవల పరాకాష్టగా జూలై 18, 2012 న ఒక దుర్ఘటన జరిగింది. కార్మికుల గొడవ జరుగుతుండగా ఒక అగ్ని ప్రమాదంలో అవనిష్ కుమార్ దేవ్ అనే జనరల్ మేనేజర్ పొగ పీల్చడం వలన ఊపిరాడక మరణించారు. దేవ్ హత్య కేసులో మొత్తం 213 మంది కార్మికులపై అభియోగాలు మోపారు. 147 మందిని అరెస్టు చేశారు. ఎన్నో కోర్టు కేసుల తరువాత మార్చి 2015 లో, 79 మంది కార్మికులకు బెయిల్ లభించగా, 2017 లో 31 మందికి ఫైనల్ గా శిక్ష వేశారు. వారిలో 13 మంది (రామ్ మెహర్, సందీప్ ధిల్లాన్, రామ్ బిలాస్, సరబ్జీత్ సింగ్, పవన్ కుమార్, సోహన్ కుమార్, అజ్మీర్ సింగ్, సురేష్ కుమార్, అమర్జీత్, ధన్‌రాజ్ బాంబి, ప్రదీప్ గుజ్జర్, యోగేష్ మరియు జియాలాల్) నేటికీ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. శిక్ష పడ్డ కార్మికుల పరివారాలు చిన్నాభిన్నమయ్యాయి. మారుతీ సంఘటన జరిగిన సరిగ్గా సంవత్సరం తర్వాత జూలై 18, 2013 న ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ ప్రారంభించారు రాహుల్ రాయ్.
ఎందుకు ఈ సినిమా?
ఈ సంఘటన సమయంలో, ఆ తర్వాత ప్రధాన స్రవంతి టెలివిజన్‌లో ప్రభుత్వ స్టేట్మెంట్లు, కార్పొరేట్ కథనాలూ, మరణించిన మేనేజర్ కుటుంబ సభ్యుల ఆవేదనలూ కన్పించాయి తప్ప చాలా దయనీయంగా కార్మికుల గొంతు ఎక్కడా వినిపించలేదు. మీడియాలో ఎవరూ కార్మికుల గొంతు వినడానికి ఇష్టపడరు అని తెలిసి తను ఈ సినిమా తీసినట్టు రాయ్ చెప్పారు. పైగా సౌత్ ఆసియా ‘జస్టిస్ ప్రాజెక్ట్’ కోసం అతను పనిచేస్తూ ఉండటాన తనకొక టాపిక్ దొరికిందని అనిపించి ఈ సినిమా నిర్మాణం చేపట్టారు. తన కెమేరా పని రాహుల్ రాయ్ తనే స్వయంగా చేస్తారు.
ఇదంతా మానేజ్మెంట్ కుట్ర:
ఈ హత్య మేనేజ్మెంట్ వారి పెద్ద డిజైన్‌లో భాగం అని చాలా మంది కార్మికులు, వారి డిఫెన్సు లాయర్లు కూడా చెబుతారు. 149 మందిపై హత్యాయత్న కేసు వేయడం, 2,500 మంది కార్మికుల్ని తొలగించమే ఒక పెద్ద కుట్ర అని అంటున్నారు. మారుతి యాజమాన్యం రాయ్‌తో మాట్లాడటానికి లేదా ప్లాంట్ లోపల షూటింగుకు నిరాకరించడం కూడా అనుమానానికి తావిస్తుంది.
మారుతి మేనేజర్లు కఠినాత్ములైనా మరణించిన అవనిష్ కుమార్ దేవ్ దీనికి మినహాయింపు. కార్మికుల పట్ల సానుభూతితో వ్యవహరించిన వ్యక్తి అతడొక్కడే. MSWU యూనియన్ గుర్తింపు కోసం రాష్ట్ర కార్మిక శాఖకు దరఖాస్తు చేసుకోవడానికి కార్మికులకు సహాయం చేసిన వాడు అతడే. కార్మికులు తాము ఆరాధించిన వ్యక్తిని ఎందుకు చంపుతారు, మిగతా వారిని ఎందుకు వదిలేస్తారు అని ఒక డిఫెన్స్ న్యాయవాది అడుగుతాడు. కాబట్టి ఈ సంఘటన ఒక దెబ్బకు రెండు పిట్టల వంటి స్కీము అమలుపరచడం కాదా అనే అనుమానం వ్యక్త పరుస్తున్నారు కొందరు డిఫెన్స్ న్యాయవాదులు. కార్మికులు మరణించిన అవనిష్ కుమార్ దేవ్ ఫోటోను ముందు పెట్టుకుని అతని మరణం వెనుక రహస్యాన్ని ఛేదించమనీ, జైల్లో వున్న కార్మికులను విడిచిపెట్టాలనీ ఉద్యమం చేయడం మనకు చాలా బాధ కలిగిస్తుంది. ప్రాసిక్యూషన్ సంపాదించుకున్న సాక్షుల కథనాలు కూడా హాస్యాస్పదంగా వుంటాయి. A నుండి G వరకు అక్షరాల్తో మొదలయ్యే పేర్లున్న నిందితుల్ని ఒక సాక్షి ఒక విభాగంలో చూస్తే, H నుండి P పేర్ల వాళ్ళను మరో సాక్షి మరో విభాగంలో చూసాడట! ఆ సాక్షుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ నుండి కాపాడడానికి తంటాలు పడడం, యూనియన్‌లోని ప్రధాన నాయకుల్ని గంభీరమైన కేసుల్లో ఎలానైనా ఇరికించేలా ప్రయత్నించడం కూడా అనుమానాన్ని బలపరుస్తుంది. కాంగ్రెస్‌కు దగ్గరి వాడైన ఖరీదైన న్యాయవాదిని కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించడం కూడా అనుమానానికి తావిస్తుంది. భారతదేశంలోని ఇతర కార్మిక పోరాటాలను భయపెట్టేలా, ఈ కేసును ఒక ఉదాహరణగా చూపేలా ప్రయత్నాలు చేశారని ఒక లాయర్ అభిప్రాయం చెబుతాడు.
కొంచెం పెద్దదైనా చాలా అవసరమైన డాక్యుమెంటరీ:
1973 లో కెంటకీలో బొగ్గు గని కార్మికులు చేసిన సుదీర్ఘమైన సమ్మె, ఆ సమయంలో గని కార్మికులతో పాటు వారి కుటుంబాలు ప్రదర్శించిన సంఘీభావం, ధైర్యసాహసాలను బార్బరా కొప్లే ‘హర్లాన్ కౌంటీ USA’ (1976) అనే డాక్యుమెంటరీలో విశ్లేషిస్తుంది. రాయ్ ‘ది ఫ్యాక్టరీ’ ఆ కోవకే చెందుతుంది. సాధారణంగా కార్మికులపై వచ్చే సినిమాల్లో కార్మికుల్ని హీరోలుగా చూపుతారు. కానీ వారి భార్యలూ, పరివారాలూ బ్యాక్ గ్రౌండ్ లో ఉండిపోతారు. కానీ ఈ పోరాటంలో వారి బాధలు ఎలా వుంటాయి అన్న విషయాల్ని సుదీర్ఘంగా రికార్డు చేస్తాడు రాయ్. ఒక యువతి జైల్లోని భర్త గురించి చెబుతుంది. “మొదటిసారి కలిసినపుడు అతను తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని చెప్పాడు. అంత నిజాయితీ వున్న అతడే ఖచ్చితమైన భర్త కాగలడని అనుకున్నాను” అని ఆమె చెబుతుంది. ఆమె ఇప్పుడు తన అత్తగారి క్యాన్సర్ చికిత్స కోసం రెండు ఉద్యోగాలు చేస్తోంది. “నేను అతని కోసం పోరాడుతూనే ఉంటాను” అని ఆమె చెబుతుంది. మరో యువతి తన పసిబిడ్డకు “పాపా అంటే ఏమిటో” తెలియదని వివరిస్తుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్తను చూడటానికి చాలా దూరం ప్రయాణం చేసి కోర్టుకు వస్తుంది. ఆ రోజు వారి వివాహ వార్షికోత్సవం. “పరిస్థితులు ఏమైనప్పటికీ, నేను అతనిని ఎప్పటికీ వదిలిపెట్టను” ఆమె బలంగా చెబుతుంది.
‘హమ్ రిస్తే మే జీతే హై’ (మేం గొప్ప బాంధవ్యాల్లో జీవిస్తాం) అన్నది మారుతీ కారు అడ్వర్టైజ్మెంట్ తాలూకు ఫేమస్ పాట. ఆ పాట టీవీ లో వస్తుండగా – ‘దేవుడు తలిస్తే మా ఆయనా, నేనూ త్వరలోనే ఒకటౌతాం’ అని ఏడుస్తూ చెబుతుంది ఒక నిందితుడి భార్య.
కోర్టు హియరింగ్ కోసం ఖైదీలను ట్రక్కుల్లో ప్యాక్ చేసిన జంతువుల్లా తేవడం, ఆ వైరు గేజుల్లోంచి తమ వాళ్ళను చూట్టానికి అవతలివారు ప్రయత్నించడం, నిందితులను కోర్టు విచారణ గదిలోకి తీసుకొని పోయే అల్ప సమయంలో వారి బంధువులు, భార్యలు వారిని కలుసుకోడానికి ప్రయత్నించడం – ఇలాంటి మనసును కలచివేసే దృశ్యాలెన్నో ఈ సినిమా పొడుగునా కన్పిస్తాయి. ఒక నిందితుడు తన ఒక చేతిని ఒక కానిస్టేబుల్ పట్టుకుని వుండగా, మరొక చేయిని తనను చూట్టానికి వచ్చిన భార్య భుజంపై వేసి గబగబా విచారణ గదివైపు నడుస్తున్న దృశ్యం చాల కాలం మనకు గుర్తుంటుంది. “మాపై విచారణ జరగడం లేదు, మమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్నారు” అని ఒక న్యాయవాది కలత చెందుతాడు. “ఒక బహుళజాతి సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటమిది” – అని ఆవేదన చెందుతాడతడు.
మానేసర్ ఫ్యాక్టరీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) పథకం ద్వారా ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో స్మశానానికి గోడ కట్టడం, గోశాలలు కట్టడం వంటి చర్యలతో ఆ గ్రామాలను తనకనుకూలంగా మలుసుకుంటోంది. గ్రామ నిరుద్యోగ యువకులు ఒక రకంగా కంపెనీకి అవసరమైన దుండగులుగా ఉపయోగపడుతున్నారు. వర్షపు నీటి ప్రవాహ మార్గాలను కార్ల కర్మాగారం ఎలా దెబ్బతీసి, ఏటా వరదలకు కారణమౌతుందో వివిరిస్తారు ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు. విదేశాల్లో అయితే ఇలాంటి పర్యావరణ సమస్యలుంటే కంపెనీలకు అనుమతే లభించదు.
ఫ్యాక్టరీ హర్యానాలో ప్రారంభమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ముగుస్తుంది. ఇక్కడ మారుతి ప్లాంట్ ఏర్పాటుకై అవసరానికి మించి భూమి సేకరించారు. రైతులు అసంతృప్తితో ఉన్నారు, ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. పొగమంచు లోంచి కార్మికుల పాదయాత్ర ఫోకస్ లోకి రావడం ద్వారా సినిమా ఆరంభమౌతుంది. గుజరాత్ గ్రామంలోని గోధూళిలో సినిమా ముగుస్తుంది.
ప్రధాన ట్రేడ్ యూనియన్ల సహకారం లేకుండా కార్మికులు ఒక నూతన వర్గ చైతన్యాన్ని ఎలా పెంపొందించుకున్నారో చెప్పడానికి చక్కని ఉదాహరణ మారుతీ సుజుకీ పోరాటం. “ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఐక్యంగా ఉన్నట్లే, మనం కూడా ప్రపంచ కార్మికులందరికీ ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. ఇది ఈ కాలపు పిలుపు” అని ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో చెబుతాడు ఆ మారుతీ ట్రేడ్ యూనియన్ తాత్కాలిక కమిటీ నాయకుడు జితేందర్. ఈ సినిమాలో రామ్ నివాస్ కుష్ అనే కార్మికుడు వినిపించే కవిత కూడా వారి కార్మిక చైతన్యాన్ని తెలియజేస్తుంది. మంచి సినిమా అభిమానులు తప్పక చూడాల్సిన డాకుమెంటరీ ఇది.