దాశ‌ర‌థి వేద‌నా స్వ‌ర ‘ప్ర‌శ్న’ ప‌త్రం- ‘ఆ చ‌ల్ల‌ని స‌ముద్ర గ‌ర్భం…’

(మౌఖిక, లిఖిత సాహిత్యంలో వ‌శీక‌ర‌ణ శ‌క్తిని నింపుకున్న ప్ర‌క్రియ పాట‌. రాతి హృద‌యాల్లోనూ చిగుళ్ల‌ను మొలిపించ‌గ‌ల స్ప‌ర్శ పాట‌లో వుంది. భూ ప్ర‌కంప‌న‌ల్ని మించిన స్పంద‌న‌ల్ని సృష్టిస్తుంది పాట‌. తెలుగు నేల‌లో పాట‌కు ఉన్న‌త‌మైన చ‌రిత్ర వుంది. అదే తెలంగాణ మ‌ట్టిలో పాట మ‌రింత ఔన్న‌త్య‌పు ప‌రిమ‌ళాల్ని అద్దుకుంది. సామాన్య మాన‌వుడి వేద‌నా గీతంగా, సామాజిక చైత‌న్యాన్ని ర‌గుల్కొల్పే సృజ‌న స్వ‌రంగా పాట కొత్త ఊపిరిని పొదువుకుంది. పాట‌ల చ‌రిత్ర‌ను క‌దిలించ‌డ‌మంటే ప్రాక్త‌న మాన‌వ మూలాల‌ను స్ప‌ర్శించ‌డ‌మే అవుతుంది. ఈ నేప‌థ్యంలో తెలుగు సాహిత్యంలో అత్యంత ప్ర‌భావాన్ని క‌లిగించిన పాట‌ల‌ను, మ‌నం మ‌రిచిపోలేని మ‌హ‌త్త‌ర‌మైన పాట‌ల‌ను స్మ‌రించుకుందాం. పాట మ‌నిషికి ప్రాకృతిక ఉత్ప్రేర‌కం. అనేక అన‌నుకూల ప‌రిస్థితుల్లోనూ పాట ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని, ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది. మ‌న‌ల్ని నీడ‌లా వెంటాడిన పాట‌ను మ‌రొక‌సారి జ్ఞాప‌కం చేసుకోవ‌డ‌మే ఈ శీర్షిక ఉద్దేశం. ఆ వ‌రుస‌లో కావ్య స్థాయిని అందుకున్న దాశ‌ర‌థి ‘?’ (ప‌్ర‌శ్న‌)తో ఈ పాట‌ల మ‌నో ప్ర‌పంచంలోకి ప‌దం మోపుదాం.)

ఆధునిక తెలుగు సాహిత్య చ‌రిత్ర‌లో దాశ‌ర‌థి గొప్ప ప్ర‌భావాన్ని చూపించిన మ‌హా క‌వి. తొలి క‌వితా సంపుటి ‘అగ్నిధార’ నుండి ప్ర‌జాభ్యుద‌యం కోసం క‌విత్వం చెప్పిన ప్ర‌జా క‌వి. తెలంగాణ‌లో నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా నిజాం రాజుపై ధిక్కార స్వ‌రాన్ని వినిపించిన చారిత్రాత్మ‌క ఉద్య‌మ క‌వి. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన ప‌ద్యాన్ని, గేయాన్నే కాదు వ‌చ‌న క‌వితా ప్ర‌క్రియ‌లోనూ త‌న క‌వితా అభివ్య‌క్తి సామ‌ర్థ్యాన్ని నిరూపించుకున్న నికార్స‌యిన క‌వి. దాశ‌ర‌థి 1949లో ఇర‌వై నాలుగేళ్ళ‌ వ‌య‌సులో ‘అగ్నిధార’ క‌వితా సంపుటిని వెలువ‌రించారు. ‘?’ (ప్ర‌శ్న గుర్తు) గ‌ల శీర్షిక‌తో వ‌చ్చిన‌ ‘ఆ చ‌ల్ల‌ని స‌ముద్ర గ‌ర్భం…’ గేయం అందులోనిదే.

తెలంగాణ‌లోనే కాదు ఏ తెలుగు ప్రాంతాల‌లోనైనా ఉద్య‌మ నేప‌థ్య సంద‌ర్భాల‌లో ఉత్తేజ‌భ‌రిత వాతావ‌ర‌ణాన్ని సృష్టించేందుకు స్వాగ‌త గీతంగా ఇప్ప‌టికీ పాడుకునే పాట ఇది. స‌రిగ్గా పాడ‌డం రాని గాయ‌కులు సైతం ఈ గేయాన్ని పాడ‌టం ద్వారా ప్ర‌శంస‌లు అందుకుంటున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఈ గేయంలోని క‌వితాత్మ‌క శ‌క్తి అటువంటిది. కొన్ని త‌రాల నుండి ప్ర‌భావితం చేస్తున్న చిర‌స్మ‌ర‌ణీయ గేయం. ‘?'(ప‌్ర‌శ్న‌).

ప్ర‌శ్న‌ల రూపంలో కొన‌సాగుతూ అసంఖ్యాక‌మైన ఆలోచ‌న‌లు రేకెత్తించే గేయం ఇది. దాశ‌ర‌థి క‌వితావేశానికి సామాజిక చింత‌న‌కు నివుట‌ద్దం ఈ ప్ర‌శ్న ‘?’ గేయం 28 పంక్తుల్లో స‌మ‌స్త మాన‌వ ప్రపంచాన్ని, విశ్వ విజ్ఞాన శాస్త్ర విష‌యాల సారాన్ని ఈ గేయంలో సంక్షిప్తంగా నిక్షిప్తం చేశారు. ఇందులో మొద‌టి నాలుగు పంక్తులు (ప‌ల్ల‌వి) స‌ముద్రం, ఖ‌గోళ శాస్త్రాలు, ఐదు, ఎనిమిది పంక్తులు భూమి, మ‌నుషుల పుట్టుక‌ల తీరుని వివ‌రిస్తుంది. మిగిలిన పంక్తులు క‌వి లోకానుభ‌వం నుండి వ‌చ్చిన చారిత్ర‌క వాస్త‌వాలు. క‌వి క‌ల‌లు, అంద‌మైన ఊహ‌లు, మ‌రో కొత్త ప్ర‌పంచ‌పు ఆశ‌లు, ఆశ‌యాలు, ఆవేద‌న‌లు, ఆగ్రహాల‌తో ఉద్వేగం న‌డుస్తుంది. క‌వి సున్నిత‌మైన భావాలు మ‌న‌లో ఆర్ధ్ర‌త‌ను క‌లిగిస్తాయి. క‌వి ఆవేశ‌మంతా మ‌న‌ల్ని ఆవ‌హిస్తుంది. క‌వి ఆవేద‌నంతా మ‌న‌స్సులోకి ప్ర‌వ‌హిస్తుంది. ఆ గేయ ప్ర‌వాహంలోకి ఇలా ప్ర‌వేశిద్దాం.

”ఆ చ‌ల్ల‌ని స‌ముద్ర గ‌ర్భం
దాచిన బ‌డ‌బాన‌ల‌మెంతో?
ఆ న‌ల్ల‌ని ఆకాశంలో
కాన‌రాని భాస్క‌రులెంద‌రో?”

ఈ ప‌ల్ల‌వి పంక్తులు స‌ముద్రం, ఖ‌గోళ శాస్త్రాల స‌మ్మేళ‌నం. స‌ముద్రం పైకి చ‌ల్ల‌గా ప్ర‌శాంతంగా క‌నిపిస్తుంటుంది. ల‌య‌బ‌ద్ధంగా వ‌రుస‌గా క‌దిలే కెర‌టాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. కానీ, ఆ స‌ముద్ర గ‌ర్భంలోప‌ల క‌నిపించ‌ని అగ్ని జ్వాలా కేంద్రాలు దాగి ఉంటాయి. అవి ఒక్క‌సారిగా ఉప‌రిత‌లంపైకి ఉబికి వ‌చ్చాయంటే జ‌రిగే బీభ‌త్సాన్ని ఊహించ‌లేం. విభిన్న లోక ప్ర‌వృత్తులు గ‌ల మానవ ప్ర‌పంచం కూడా పైకి ప్ర‌శాంతంగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.
ఎన్నో అస‌మాన‌త‌లు, దోపిడీ, ఆధిప‌త్యం ఉన్న ఈ లోకంలోని అసంతృప్తి క‌ల‌వాళ్ల గుండెల్లో కూడా ఒక బ‌డ‌బాన‌లం దాగి ఉంటుంది. అది ఒక తిరుగుబాటు జ్వాల‌గా ఉవ్వెత్తున ఎగిసిందా దానిని ఆర్ప‌డం అసాధ్యం. న‌ల్ల‌ని మ‌బ్బుల‌తో నిండిపోయిన ఆకాశంలో కంటికి క‌న‌ప‌డ‌ని ఎన్నో సూర్య‌ బింబాలు దాగి ఉన్నాయి. ఈ భూమ్మీద కూడా అవ‌కాశాలు రాని ప్ర‌తిభావంతులు ఎందరో లోకానికి తెలియ‌కుండా మ‌రుగున ప‌డి ఉన్నారు. క‌వి స‌మాజంలో మ‌నుషుల్లో గూడుక‌ట్టుకున్న ఆవేశాలు, ఆవేద‌న‌ల పట్ల జాగ‌రూకులై ఉండాల‌ని ప్ర‌శ్న రూపంలో హెచ్చ‌రిస్తున్నాడు.

”భూగోళం పుట్టుక కోసం
కూలిన సుర‌గోళాలెన్నో?
ఈ మాన‌వ రూపం కోసం
జ‌రిగిన ప‌రిణామాలెన్నో?”

ప్రాణి పుట్టుక‌, విశ్వ ఆవిర్భావం గురించి అనేక శాస్త్ర ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ఎన్నో వాద‌న‌లు, సందేహాలు, చ‌ర్చ‌ల మ‌ధ్య కొన్ని స్థిర‌మైన అభిప్రాయాలు ఏర్ప‌డినాయి. భూమి గుండ్రంగా ఉందా? బ‌ల్ల‌ప‌రుపుగా ఉందా? అనే ప్ర‌శ్న చుట్టూనే లోకం కొంత కాలం ప‌రిభ్ర‌మించింది. ఆ త‌ర్వాత భూమి ఆవిర్భావంలో అనంత విశ్వంలో జ‌రిగిన విస్ఫోట‌నాలు, సౌర కుటుంబంలో కూలిపోయిన సూర్య‌గోళాలు ఎన్ని అనేవి అంతుచిక్క‌ని ఖ‌గోళ ర‌హ‌స్యాలు. డార్విన్ జీవ ప‌రిణామ క్ర‌మంలో మాన‌వుడు ఆదిమ ద‌శ నుండి నేటి ఆధునిక రూపాన్ని సంత‌రించుకున్నాడు. మ‌నం నివ‌సిస్తున్న భూమి చుట్టూ, మ‌న రూపం చుట్టూ ఎంతో చ‌రిత్ర దాగివుంది. మ‌నం ఎంత ఉదాత్తంగా, ఉన్న‌తంగా, త్యాగ‌పూరితంగా మెల‌గాల‌నే సందేశాన్ని వినిపిస్తున్నారు క‌వి. దాశ‌ర‌థి వైజ్ఞానిక శాస్త్ర జ్ఞాన నేప‌థ్యంలో సామాజిక శ్రేయ‌స్సును సాహిత్యంతో ముడివేసి తెల‌ప‌డాన్ని ఆధునిక‌త‌గా గుర్తించ‌వ‌చ్చు.

”ఒక రాజును గెలిపించుట‌లో
ఒరిగిన న‌ర కంఠాలెన్నో?
శ్ర‌మ‌జీవుల ప‌చ్చి నెత్తురులు
త్రాగ‌ని ధ‌న‌వంతులెంద‌రో?”

చ‌రిత్ర‌లో ఒక రాజును గెలిపించ‌డానికి ఎంత మంది సైనిక వీరులు త్యాగం చేశారో లెక్క తెలియ‌దు. అశోకుని నుండి అలెగ్జాండ‌ర్ వ‌ర‌కు విశ్వ విజేత‌లుగా కీర్తి పొంద‌డం వెన‌క అనేక మంది శౌర్య ప‌రాక్ర‌మ సాహ‌సాలు దాగివున్నాయి. లోకంలోని పేద‌వాళ్ళ‌ శ్ర‌మ‌ను దోచుకొని వారి స్వేదాన్ని, నెత్తురును తాగ‌డం వల్ల‌నే ధ‌న‌వంతులు త‌యార‌వుతున్నారు. ప్ర‌తి రాజు, ప్ర‌తి ధ‌న‌వంతుడు వెన‌క ఉన్నఅజ్ఞాత శ్రామిక వీరుల గొప్ప‌త‌నాన్ని స‌దా స్మ‌రించుకోవ‌డం మ‌న విధి అని గుర్తుచేస్తున్నారు దాశ‌ర‌థి.

”అన్నార్తులు అనాథ‌లుండ‌ని
ఆ న‌వ‌యుగ‌ మ‌దెంత దూర‌మో?
క‌రువంటూ కాట‌క‌మంటూ
క‌నిపించ‌ని కాలాలెపుడో?”

క‌వి ఒక కొత్త లోకాన్ని క‌ల‌గంటున్నాడు. ఆ కొత్త లోకంలో ఆక‌లి బాధ‌లు లేని అమ్మా నాన్న‌ల ప్రేమ‌ల‌కు దూరం కాని మ‌నుషులుంటారు. ప‌సివాళ్ల బాల్యం ఆనందోత్సాహాల‌తో గ‌డుస్తుంది. నిజానికి లోకంలో ఎటుచూసినా క‌రువు క‌ష్టాల‌తో రెక్క‌లు ముక్క‌లు చేసుకుని పొట్ట నింపుకొనే వారే ఎక్కువ‌గా ఉన్నారు. అటువంటి క‌రువు లేని కాలం గురించి క‌ల‌గంటున్నారు. ఇది ఒట్టి క‌ల‌గ‌న‌డ‌మే కాదు. ఆ క‌ల‌ను వాస్త‌వం చేసుకొనే దిశ‌గా కొత్త లోకాన్ని నిర్మించుకొనే మార్గంలో ప‌య‌నిద్దామ‌ని ఉద్బోధిస్తున్నాడు క‌వి.

”అణ‌గారిన అగ్ని ప‌ర్వ‌తం
క‌నిపెంచిన ‘లావా’ ఎంతో?
ఆక‌లితో చ‌చ్చే పేద‌ల‌
శోకంలో కోపం యెంతో?”

నిద్రిస్తున్న అగ్ని ప‌ర్వ‌తం వ‌ల్ల ఏ ప్ర‌మాదం లేదు. అది ఒక్క‌సారిగా బ‌ద్ధ‌లైందా ఆ లావా ప్ర‌వాహ ప్ర‌ళ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేరు. అదేవిధంగా ఆక‌లితో అల‌మ‌టిస్తూ పోయే పేద‌ల శోకం కూడా ఒక్కోసారి లావాలా ప్ర‌వ‌హిస్తుంది. ఆ పేద‌ల శోకం చూసి చ‌లించిపోయే సామాజిక చైత‌న్యం గ‌ల వ్య‌క్తుల గుండెల్లోనూ ఎంత ఆవేద‌న, కోపం దాగివుందో కొల‌వ‌గ‌ల‌మా? ఆక‌లి లేని లోకం కోసం పోరాటం చేయాల‌ని పిలుపునిస్తున్నారు క‌వి.

”ప‌సి పాప‌ల నిదుర క‌నుల‌లో
ముసిరిన భ‌విత‌వ్యం ఎంతో?
గాయ‌ప‌డిన క‌వి గుండెల్లో
రాయ‌బ‌డ‌ని కావ్యాలెన్నో?”

హాయిగా అమ్మ ప‌క్క‌లో నిద్ర‌పోయే పసిపాప‌ల క‌ళ్లు ఎంత ప్ర‌శాంతంగా, నిర్మ‌లంగా ఉంటాయో మాటల్లో చెప్ప‌లేము. అంత‌టి నిశ్చింత వాతావ‌ర‌ణం భ‌విష్య‌త్‌లో వాళ్ల‌కు దొరుకుతుందా? అనే సందేహం మొల‌కెత్తింది క‌వికి. స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. ఇన్ని అస‌మాన‌త‌లు, వైష‌మ్యాలున్న లోకాన్ని చూసి క‌వి హృద‌యం ఎంతో లోతుగా గాయ‌ప‌డింది. ఆ గాయ‌ప‌డిన మ‌నో వేద‌న‌లో మునిగిపోయి రాయ‌వ‌ల‌సిన కావ్యాల‌ను రాయ‌లేని నిరాశా నిస్పృహ‌లో కూరుకుపోయే స్థితి క‌వుల‌కు ఎదుర‌వుతుంది. లోకంలోని బాధ‌ల‌ను చూసి ఎంత స్పందించి రాస్తున్నా ఇంకా రాయ‌వ‌ల‌సిన గీతాలెన్నో ఉన్నాయ‌నే స‌త్యాన్ని వెల్ల‌డిస్తున్నారు దాశ‌ర‌థి.

”కుల‌మ‌తాల సుడిగుండాల‌కు
బ‌లియైన ప‌విత్రులెంద‌రో?
భ‌ర‌తావ‌ని బ‌ల‌ప‌రాక్ర‌మం
చెర‌వీడేదింకెన్నాళ్ల‌కో?”

కుల మ‌త జాతి వ‌ర్ణ ర‌హితంగా ఉండ‌వ‌ల‌సిన ప్ర‌పంచంలో అన్నీ సంకుచిత భావాలే ఆవ‌రించాయి. మ‌నుషులు అనేక వైష‌మ్యాల సుడిగుండంలో చిక్కుకుపోయారు. జ్ఞానం, పాండిత్యం కూడా అహంకారాన్ని పెంచింది. ఈ ఆధిప‌త్యాల కుమ్ములాట‌లో అమాయ‌కులైన ప్ర‌జ‌లు బ‌లై పోయారు. మ‌న భ‌ర‌త భూమి సాహ‌స యోధుల‌కు పుట్టినిల్లు. ప‌రాయి పాల‌న‌ను ఎదిరించి బ‌లిదాన‌మైన వీరుల‌కు లెక్క‌లేదు. అటువంటి వీరుల శ‌క్తి సామ‌ర్థ్యాలు లోకానికి వెల్ల‌డి కావాలి. ఆధిప‌త్య శ‌క్తుల‌పై అంతిమ విజ‌యం సాధించాల‌నే స్ఫూర్తిని ప్రేరేపిస్తున్నాడు క‌వి.
దాశ‌ర‌థి ఈ గేయంలో అనేక ప్ర‌శ్న‌ల‌ను వేశారు. ఇవి మాన‌వాళికి సంధించిన ఆత్మ విమ‌ర్శ‌నాత్మ‌క శ‌స్త్రాలు. మౌలిక‌మైన‌ ప్ర‌శ్న‌ల్ని సంధిస్తూ అవ్య‌వస్థ పునాదుల్ని క‌దిలించే ప్ర‌య‌త్నం చేసారు. ప్ర‌తీ ప్ర‌శ్న పీడిత మాన‌వుని బాధ చుట్టూ వేద‌నాత్మ‌కంగా తిరుగుతుంది. క‌విత్వాన్ని ఆకాశ వీధుల నుండి అన్నార్తుల దుఃఖ దారుల్లోకి తీసుకొచ్చారు. ప్ర‌పంచాన్ని చుట్టుముట్టిన ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం, స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం మ‌న‌లో ఉంది. కొద్దిగా లోతుగా ప‌రిశీలిస్తే వాటికి స‌మాధానాల‌న్నీ మ‌న ద‌గ్గ‌రే దొరుకుతాయి. క‌వి వేసే ప్ర‌శ్న సూటిగా స‌మాజానికే గుచ్చుకుంటుంది. స‌మాజ‌మంటే మ‌నుషులే క‌దా. క‌వి ఒక్కో చ‌ర‌ణం ఒక బాణంలాగా మ‌న‌ల్ని తాకుతుంది. మాన‌వీయ స్పంద‌న‌ను క‌లిగిస్తుంది. సామాజిక చైత‌న్యానికి పురిగొల్పుతుంది.

క‌వి మ‌న‌సులోంచి నిత్యం ఏదో ఒక భావం మొల‌కెత్తుతుంది. అది ఆయుధం లాంటి క‌వి చ‌ర‌ణం కావ‌చ్చు. అనుభూతినిచ్చే భావుక‌తా వర్ణ‌న కావ‌చ్చు. ఈ గేయంలో అలాంటి శ‌క్తివంత‌మైన చ‌ర‌ణాల‌తో దాశ‌ర‌థి జాతిని జాగృతం చేసే కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నాడు. త‌న క‌వితా చ‌ర‌ణాల‌తో హృద‌యాల‌ను క‌దిలిస్తూనే సామాజిక అస‌మాన‌త‌ల‌పై ఈటెల్లాంటి ప్ర‌శ్న‌ల‌ను విసిరాడు. ఈ ప్ర‌శ్న‌లు ఆనాటి స‌మ‌కాలీన దుస్థితికి ఒక ప్ర‌తిబింబం లాంటివి. నేటికీ ఈ ప్ర‌శ్న‌లు స‌జీవంగా ప్ర‌తిధ్వ‌నించ‌డం ఒక సామాజిక విషాదం. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు చోటులేని న‌వ‌యుగం కోసం క‌వి క‌ల‌లుగ‌న్నారు. ఇంత‌కంటే బ‌రువైన ప్ర‌శ్న‌లు విస‌ర‌వ‌ల‌సిన సంద‌ర్భంలో నిల‌బ‌డివున్నాం. నేటి క‌వుల ధిక్కార స్వ‌ర శిక్ష‌ణా ప్ర‌శ్నాప‌త్రం ఈ గేయం.

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

9 thoughts on “దాశ‌ర‌థి వేద‌నా స్వ‌ర ‘ప్ర‌శ్న’ ప‌త్రం- ‘ఆ చ‌ల్ల‌ని స‌ముద్ర గ‌ర్భం…’

  1. రఘు ఏది రాసిన అందులో డొక్క శుద్ధి ఉంటది. సరియైన సమయంలో రాసిన వ్యాసం ఇది. సున్నితంగా,సునిశితంగా మొదలైన ఈవ్యాస పరంపర కవులని,రచయితలను ఆలోచింప చేస్తాయని నమ్ముతున్నాను. మంచి పాఠంలా సాగింది. అభినందనలు.@ కోట్ల వెంకటేశ్వర రెడ్డి

  2. నాటికి,నేటికి,ఏనాటికీ
    సరితూగు అద్భుత గేయం..
    దానికి ఎవరూ రాయలేని
    మీదైన శైలిలో చక్కని,చిక్కని
    విమర్శనాత్మక వాఖ్యానం…
    అసాంతం,అద్భుతం,అజరామరం
    రఘు సారుకు అభినందనలు
    👍🙏🙏👍

  3. దాశరథి గారి ‘ప్రశ్నా’ంతరంగాన్ని ప్రామాణికంగా పరిశీలించిన పరిశోధనాత్మక వ్యాసమిది.
    వ్యాసం చివరిలో
    “ప్ర‌శ్న‌లు ఆనాటి స‌మ‌కాలీన దుస్థితికి ఒక ప్ర‌తిబింబం లాంటివి. నేటికీ ఈ ప్ర‌శ్న‌లు స‌జీవంగా ప్ర‌తిధ్వ‌నించ‌డం ఒక సామాజిక విషాదం. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు చోటులేని న‌వ‌యుగం కోసం క‌వులు క‌ల‌లుగ‌న్నారు. ఇంత‌కంటే బ‌రువైన ప్ర‌శ్న‌లు విస‌ర‌వ‌ల‌సిన సంద‌ర్భంలో నిల‌బ‌డివున్నాం. ”
    అనే వాక్యాలు ‘ప్రశ్నించే స్పృహను కవులకు కలిగిస్తున్నాయి. ‘కవి ఎప్పుడూ ప్రజలపక్షం ‘ అన్న సిధారెడ్డి గారి మాటను, ‘కవి ఎప్పుడూ ప్రతిపక్షమే’ అన్న సుంకిరెడ్డి గారి వాదననూ మరోసారి గుర్తుచేస్తున్నాయి. నేటి కాలంలో సాహితీలోకం ‘దాశరథి ప్రశ్న’ ను ఎట్లా స్వీకరించాలో సవివరంగా చెప్పినందుకు, విలువైన వ్యాసాన్ని అందించినందుకు
    రఘు సార్ గారికి ధన్యవాదములు.
    ‘వెంటాడే పాట ‘ శీర్షికన మరెన్నో ఉత్తమ పాటలను విశ్లేషణ చేయించి పాటల లోతును ముఖ్యంగా సమకాలీనతను ప్రతిబింబించే వ్యాసాలను అందించగలరని కోరుకుంటూ… సాహిత్య’కొలిమి’కి శుభాకాంక్షలతో,
    – నర్రా ప్రవీణ్ రెడ్డి

  4. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే పాటకు అంతే సీరియస్ గా తాత్వికంగా తనదైన శైలిలో అద్భుతంగా రాసాడు రఘు.ఇంకా ఎన్నో గొప్ప వ్యాసాలు ఆయన కాలం నుంచి రావాలని కొరుకుంటూ..
    —-బాణాల

  5. మీ వివరణ చదివాక
    నేను గాయకుణ్ణి ఎందుకు కాలేదా అనిపించింది.
    ఈ ఒక్క పాటకోసం
    నేను గాయకుణ్ణి అయిత.
    మీ వివరణ బాగుంది.

  6. నేను గాయకుణ్ణి కాను కానీ ఎన్ని సార్లో పాడాలని పాడాను… గొప్ప పాటను చరణబద్దంగా విశ్లేషించడం బాగుంది సర్… ఈరోజు దాశరథి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి.

  7. తెలంగాణ జన జీవన వేదనలను అక్షరబద్ధం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన నిఖార్సైన ప్రజాకవి దాశరథి… ఎన్నో ప్రసవ వేదనల నుండి….హృదయాంతరంతరాలలో బ్రద్ధలైన భావాల లావా నుండి వెలువడిన విస్ఫోటనం…ఆ చల్లని సముద్ర గర్భం…చిరంజీవత్వం ఉన్న ఈ పాటతో సమాజంపై దాశరథి శాశ్వత సంతకం చేశారు… అట్లూరి వెంకటరమణ ఖమ్మం

  8. అద్భుతం రఘు సార్. నేను కూడా అసలు ఈ పాటను ఏ సినిమా కోసం ,ఏప్పుడు రాశారు అని వెతికే సందర్భంలో మీ ఈ విశ్లేషణ నాకు గూగుల్ ద్వారా దొరకడం నా ఆనందానికి అవధుల్లేవు సార్. నన్ను నమ్మండి ఇది పచ్చి నిజం. ఈ పాట పాడడానికి ఎవరూ కవి కావాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇది మానవ హృదయాన్ని కదిలిస్తుంది,అంటే అతిశయోక్తి కాదు . మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్.

Leave a Reply