దారుణాల ఋతువు కొనసాగుతోంది! అప్రమత్తులమై ఎదుర్కోవాలి!! 

 మతాన్ని రాజ్యంతో విడదీయలేనంతగా కలిపి వేసి  పార్లమెంటరీ రాజకీయాల్ని మత  ప్రాతిపదికన పోలరైజ్ చేసి యిప్పటి దాకా భిన్న జాతుల, సంస్కృతుల సంగమంగా వున్న దేశాన్ని  ఏక మత రాజ్యంగా మార్చేందుకు  బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ప్రజల ప్రైవేట్ జీవితంలో సహజంగా ఉండే బహుళ మత విశ్వాసాలలో ఒక మతాన్నే, ప్రత్యేకించి మెజారిటీ హిందూ మతాన్నే ఏకైక ఆధిపత్య మతంగా రూపొందించే పాలక రాజకీయ విధానాలు బహుళ సంస్కృతుల ప్రజా జీవన విధానాలపై దాడి చేస్తూ స్వేచ్ఛా సమానత్వాల్ని  ప్రోత్సహించే రాజ్యాంగంలోని ఆధునికతా స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నాయి.

అధిక సంఖ్యాకుల మత విశ్వాసం విద్వేషంగా మారి ప్రజల మానసికతపై  తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజాస్వామ్యం భవిష్యత్తు మునుపెన్నడూ లేనంతగా ప్రమాదంలో పడింది. అల్ప సంఖ్యాకుల దైనందిన జీవితంలో భయం రాజ్యమేలుతోంది. ఒక అభద్రతాభావం వెంటాడుతోంది.  వాస్తవాల్ని మరుగుపరచి అబద్ధాల పునాదుల మీద  మిథ్యా చరిత్రని  నిర్మించే మిత- మతవాద రాజకీయాలు సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. హింసని గ్లోరిఫై చేసి యువతని అమానవీయంగా తయారుచేస్తున్నాయి. అయోధ్య ఆలయ ప్రారంభానికి మత  ప్రాతిపదికన ప్రజల్ని కూడగట్టి దేవుణ్ణి,  గుడినీ  ఓట్ల ఆకర్షణకి సాధనంగా ఉపయోగించుకోవటాన్ని ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలు కూడా అడ్డుకోని విభ్రాంతికర పరిస్థితిని దేశంలోని పౌర సమాజమంతా మౌనంగా వీక్షిస్తోంది.  

పాలక మనువాదం దేశాన్ని నియంతృత్వం వైపు, కాలం చెల్లిన మధ్య యుగాల తిరోగమన విలువల వైపు,  అభిప్రాయ ప్రకటనే దేశద్రోహమన్న ఫాసిజం వైపు నడుపుతున్న ప్రస్తుత సందర్భంలో కవుల, రచయితల, ప్రజాస్వామిక శక్తుల పాత్ర యెలా వుండాలి? జరుగుతోన్న  ఘటనల నుంచి యీ మొత్తం సందర్భాన్ని మనం ఎలా చూడాలి?  ఎలా ఎదుర్కోవాలి అని ‘సమూహ సెక్యులర్ రైటర్స్’ తన సభ్యులతో చేసిన మేధో మథనం నుంచి పుట్టిన కొన్ని ఆలోచనల్ని ‘కొలిమి’  పాఠకులతో పంచుకొంటున్నది. 

***

1. 

భారతదేశం ఒక లౌకిక రాజ్యం..  అంటే మతాతీత రాజ్యం. భిన్నత్వంలో ఏకత్వం అన్న గొప్ప బిరుదు గల దేశం… పరమత సహనంతో, అనేక మతాలవారు కలిసిమెలిసి జీవిస్తున్న దేశం. మనందరికీ తెలుసు –  ఇక్కడ హిందువులతో పాటుగా, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు వంటి పలు మతాలవారు జీవిస్తున్నారు.  ఎవరి ఆలయాలకి, ఎవరి ఆరామాలకి, ఎవరి మసీదులకు, ఎవరి చర్చిలకు వాళ్ళు వెళతారు.. ప్రార్థనలు చేసుకుంటారు.. అంటే ప్రజలు వ్యక్తిగతంగా మతపరమైన భావనలతో ఉన్నప్పటికీ, రాజ్యం మతపరమైన విషయాల నుండి దూరంగా ఉండేటువంటి నియమాన్ని రాజ్యాంగంలో పొందుపరచుకున్నాం. అంటే పరిపాలన విషయంలో మతాతీతంగా ఉండడం అన్నది  లౌకికతత్వం. 

కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?

లౌకిక రాజ్యంగా చెప్పబడుతున్న భారత పాలనలో, క్రూరంగా మతం ప్రవేశించి భిన్న సంస్కృతులతో ఉన్న దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం నుండి ఏకమత రాజ్యంగా మారుస్తున్న క్రమం, కొంత భయానకంగా ఉంది.. రాబోయే తరాలు ఇదే మన సంస్కృతి అని నమ్మేంతగా…

రామ మందిర నిర్మాణం పేరుతో యథేచ్ఛగా సాగుతోన్న ఓటు బ్యాంకు రాజకీయాలు  చాప కింద నీరులా (ఇంటింటికీ అక్షింతల పేరుతో) పల్లె పల్లెకు ప్రవేశించి, ప్రజల్ని పారావశ్యపు వూపులో ముంచెత్తడం చూస్తున్నాం…..అంతేనా?

ఇంకా గోపురం నిర్మాణం పూర్తి కాకుండా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట, శిరస్సులేని దేహానికి ప్రాణ ప్రతిష్ట చేయడమేనని, ఇది ధర్మ విరుద్ధమని, పీఠాధిపతులు, ధర్మశాస్త్రాచార్యులు ఘోషిస్తుంటే….. వారిని ధర్మవిరోధులుగా ద్రోహులుగా చిత్రించడం కూడా మనం చూస్తున్నాం..

ఈ నేపథ్యంలో నుండి కవులుగా రచయితలుగా మనుషులుగా మనం ఏం చేయగలం? ఎట్లా ఖండించగలం? ఎక్కడైనా సరే ప్రభుత్వము, ప్రజలు కూడా మత భావనలకు అతీతంగా, దూరంగా ఉండగలిగితే అదే నిజమైన స్వేచ్ఛ, అదే సెక్యులరిజం అని ప్రజలకి ఎలా అర్థం చేయించగలం..? ఇది మన ముందున్న పెద్ద ఛాలెంజ్. దీనికి విరుగుడు కనిపెట్టి మన రచనల ద్వారా ప్రజా సమీకరణ చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. 

వి. ప్రతిమ 

రచయిత నాయుడుపేట   

***

2. 

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రామాలయ ప్రారంభోత్సవం ఎత్తుగడ వేస్తున్న దృష్ట్యా దేశమంతా అలుముకున్న ఒక మత్తులాంటి మత భావన ప్రజాస్వామిక, లౌకిక వాదులను కలవరపెడుతున్నది. ఈ ఎత్తుగడ పాతదే అయినప్పటికీ ఈ సారి చాలా బలంగా, వేగంగా, ప్రమాదకరంగా సమాజాన్ని ప్రజాస్వామిక, లౌకిక స్ఫూర్తికి దూరంగా నెట్టివేస్తుండడం ఈ కలవరపాటుకి తక్షణ కారణం.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుందా లేదా అనేది పక్కనపెడితే, బీజేపీ దాని మాతృక RSS భావజాలం మొత్తం సమాజంలోకి చాపకింద నీరులా వ్యాప్తం అవడం, ఇపుడు బాలురుగా, యువతగా ఉన్నవారు వారు చనిపోయేవరకు అంటే సుమారుగా వచ్చే 60-70 సంవత్సరాలు ఈ మతం మత్తును తమ మెదళ్లలో మోసేలా చేయడంలో రైట్ వింగ్ ఫోర్సెస్ విజయవంతం అయ్యాయి. బీజేపీ దేశంలో అధికారంలో ఉన్నా లేకున్నా, వారు ఇప్పటికే పసి హృదయాలలో చొప్పించిన ఈ ప్రమాదకర భావజాల మార్పు దేశ భవిష్యత్తుని  ప్రమాదంలోనే ఉంచబోతుంది. ఇది జీర్ణం చేసుకోలేని విషయం.

అధిక సంఖ్యాకుల మతం అందలం ఎక్కితే ఖచ్చితంగా అల్ప సంఖ్యాకుల మత విశ్వాసాలూ, వారి జీవన పరిస్థితులు ఒక అప్రకటిత నియంతృత్వ పహారా కిందికి చేర్చబడతాయి. భద్రమైన జీవనాన్ని ఇక ఈ దేశంలో అల్ప సంఖ్యాక వర్గాలు పొందడం అటుంచి కనీసం ఊహించలేరు. ఫలితంగా సమాజంలో మునుపెన్నడూ ఊహించలేని ఉపద్రవాలు, ఒడిదుడుకులు, దాడులు, దాష్టీకాలు, మతం భూమికగా ఒక విశృంఖలత్వం, మతోన్మాదులు పేట్రేగిపోయే దమనకాండ మన ఇంటి ముంగిట్లోకి వచ్చే భయానక రోజులని ముందు ముందు చూస్తాము.

ఇలాంటి పరిస్థితుల్లో మనం త్యాగాలకు సిద్ధం కావాలి. రేపటి చిన్నారులకు ఒక స్వేచ్ఛా సమాజాన్ని బహుమతిగా ఏర్పాటు చేయడానికి మన జీవితకాలంలో చూడలేని ఒక గుప్తనిధిని చేరుకోవడానికి మనం దారి ఏర్పాటు చేస్తూనే ఉండాలి. మన జీవితంలో లక్ష్యం చేరుకున్నామా అది ఒక తృప్తి, చేరుకోలేదో రేపటి తరం స్వేచ్ఛ కోసం దారి వేశాం అనే కనీస సంతృప్తి మనకు మిగులుతుంది. పోరాటాన్ని ముందుకు తీసికువెళ్లడంలో ఒక ఆశావహ దృక్పథం, బలమయిన ప్రయత్నం, పరిమిత బలాల్ని కూడగట్టి ఒక మహా శక్తి ని ఎదుర్కొనే నిపుణత, ధైర్యం మనకి ఇప్పుడు ఉండాలి.

రాత, మాట మాత్రమే ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న వ్యూహాలు, ఇవే కాకుండా… శత్రువు అవలంబించే అధునాతన వ్యూహాలపై ఒక నిర్మాణాత్మక చర్చ మనలో జరగాలి. రాత, మాట లాంటి సంప్రదాయ వ్యూహాల్ని దాటి శత్రువు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని తన భావజాలాన్ని వేగంగా, సూటిగా వ్యాపింప చేయగల్గుతున్నాడు. మనమూ అటువంటి ఆధునికానంతర వ్యూహాల్ని మన భావజాల వ్యాప్తి కోసం ఎన్నుకోవాలి.

ఏది ఏమైనా ఒక నిరాశ, నిస్పృహ, భయం, భీతి లేని… ఒక ఆశావహ పోరాటానికి మనం సిద్ధం కావాలి. అది మనకోసం కాదు మన భవిష్యత్ తరాలకోసం మనం చేసే దాస్య విముక్తి పోరాటం అని మనం గుర్తెరగాలి.

గజవెళ్లిఈశ్వర్,

అధ్యాపకులు,  తెలంగాణ సారస్వత పరిషత్. హైదరాబాద్.

***

3. 

మతం మత్తుమందుగా ఉండిన ఒకప్పటి కాలం నుండి మతం ఒక ఉన్మాదంగా మారిన ఈనాటి కాలంలోకి మనందరమూ వచ్చి పడ్డాం. ఒకానొక విశ్వాసానికే ఆధిపత్యం ఆపాదించి ఇతర విశ్వాసాలన్నింటినీ అధీనమైనవిగా అణిచివేస్తున్నారు. ఇది ఒక మతానికి మాత్రమే పరిమితమైన విషయంగా కాకుండా సర్వత్రా వ్యాపిస్తూ వస్తున్న విషంగా కూడా మన అనుభవంలోకి ఇప్పటికే వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం మనదేశంలో ఆధునికపూర్వ పునాది ఒక భౌతిక వాస్తవంగానే కాదు, భావజాల రూపంలోనూ నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉనికిలో ఉండడమే. ఫలితంగా ఒక బలమైన సామాజిక మానసికత సృష్టించబడుతూ  విశాల ప్రజా శ్రేణులను అది తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.

ఒకవైపు సమాజంలో సమాన అవకాశాల లేమి ఉండగా, మరోవైపు దాన్ని అర్థం చేసుకుని స్వతంత్రంగా ఆలోచించి ప్రత్యామ్నాయాలు వెతుక్కునే స్వేచ్ఛాయుత భావావరణం లేకపోవడం వల్ల నిస్సహాయులైన ప్రజలు తమకు తెలియకుండానే విస్తృత ప్రచారం రూపంలో అందుబాటులో ఉన్న తప్పుడు కథనాలకు ప్రభావితమవుతున్నారు.

ప్రజల ప్రైవేటు జీవితంలో ఒక ఆధ్యాత్మిక అనుభవంగా ఉండాల్సిన మత విశ్వాసాన్ని రాజకీయీకరించడం ఇటీవలి దశాబ్దాలలో అనూహ్యంగా పెరిగింది. తత్ఫలితంగా ఇదివరకే ముక్కలుగా విభజితమై ఉన్న ప్రజా శ్రేణులను సమీకరించి మూకలుగా రెచ్చగొట్టి మత విద్వేష రాజకీయాలకు వాడుకుంటూ మూకస్వామ్యాన్ని అమలు చేస్తున్నారు. ఇతర భిన్న మత విశ్వాసులను, మతాతీతమైన భిన్న లౌకిక రాజకీయ విశ్వాసులను నిర్బంధానికి గురి చేస్తూ ఏక మతాధిపత్య నియంతృత్వాన్ని చెలాయిస్తున్నారు.

ప్రజలందరి ఉమ్మడి సంక్షేమానికి, జీవన భద్రతకు, సర్వ సమ్మిళిత అభివృద్ధికి పూచీ పడవలసిన ప్రభుత్వాలు నిస్సిగ్గుగా తమ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాయి. ఏనాడో వందల సంవత్సరాల క్రితం ధ్వంసం కాబడిందని చెప్పబడుతున్న గుడిని అయోధ్యలో పునర్నిర్మిస్తూ ఆలయ కలశం కూడా నిర్మాణం కాకముందే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయతలపెట్టారు. అందుకు ఇంటింటికీ అక్షింతలు పంపి వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పడమంటే  ప్రజలకు ఒక ఆధ్యాత్మిక ఆభాసను కల్పించడమే.

ఇదంతా ధర్మ విరుద్ధం అంటున్న శంకరా చార్యులను, ధర్మశాస్త్రాచార్యులను; ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోమని అంటున్న రాజకీయ ప్రతినిధులను ట్రోల్ చేయడం, దేశద్రోహులని, ధర్మ విరోధులని నిందిస్తున్నారంటే ఉన్నత జీవన విధానంగా చెబుతున్న హిందూమతంలో భిన్నత్వంలో ఏకత్వం లేనట్టే కదా!? ముక్కోటి దేవతలను కొలిచే హిందూమతంలో రాముడు ఒక్కడినే ఏకైక దేవుడిగా ప్రచారం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక రామున్ని రాజకీయ రాముడిగా ప్రచారం చేయడం కాదా అని సమూహ ప్రశ్నిస్తున్నది. ఇదంతా కచ్చితంగా ఆధునిక రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన కార్పోరేట్ రాజకీయ ఫాసిజమేనని సమూహ భావిస్తున్నది. ఈ సందర్భంగా యావత్ యువతను, దేశ పౌరులందరినీ బాధ్యతాయుతమైన, ప్రజాస్వామికమైన లౌకిక రాజకీయాల స్థాపన గురించి ఆలోచించాలని, అందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సమూహ విజ్ఞప్తి చేస్తున్నది.

మెట్టురవీందర్

విశ్రాంత అధ్యాపకులు, వరంగల్ 

***

4. 

రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించిన ప్రస్తుత ప్రభుత్వం దేశంలో మతరాజకీయం చేస్తోంది. ఒకే జాతి, ఒక మతం, ఒకే పౌరసత్వం అంటూ.. సర్వమత సహనంతో కొనసాగుతున్న దేశంలో ఒక ఫోబీయాను సృష్టించి భీభత్సం చేస్తోంది. ఎన్నికల ఎత్తుగడల వలె పైకి కనిపిస్తూన్నా వీటి వెనుక వ్యూహాలు దారుణంగా ఉన్నాయి. పాఠ్యాంశాలను మార్చి పసి మనుసుల్లో విషం నింపుతుంది. కొందరు మేధావులు తమ స్వార్థం కోసం మౌన గీతాలపనతో భావితరలకు ద్రోహం చేస్తున్నారు. కుల మత ప్రాంత వర్గ భేదం లేకుండా బుద్ధిజీవులందరూ ఈ దుర్మార్గాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలిసి ఉంది. బళ్ళు అవసరమైన చోట గుళ్ళు కట్టి, భక్తిని భయంగా మార్చి మూఢవిశ్వాలను పెంచి ప్రజలను అంధకారంలోకి నెట్టుతున్న కుట్రలను ఎదుర్కోవాలి. చైతన్య వంతులైన విద్యావేత్తలు ముందు నిలిచి ఉద్యమ రూపంలో నడవాలిసి ఉంది. ఇప్పటికే చాలా నష్టం జరిగింది.. ఇక ముందు జరగబోయే అరాచకాలను అడ్డుకోవాలి.

జ్వలిత

రచయిత, ఖమ్మం 

***

5.

రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా అది తప్పే. మణిపూర్ లో క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన మారణకాండ విషయంలో నోరు విప్పని అక్కడి పాలిత పార్టీ తమ మతాన్ని దేశం మొత్తం రాజకీయంతో కలిపి పులమటం శోచనీయం అలాగే ఖండించాలి కూడా. ప్రభుత్వం వేరు మతం వేరు. మతమే ప్రభుత్వంగా మారటం మా లాంటి మైనారిటీలను అభద్రతలోకి మార్జిన్ లోకి నెట్టి వేస్తుంది. దీన్ని ప్రభుత్వాలు ప్రజలు గుర్తించాలి. విగ్రహ ప్రతిష్ఠకి మేము వ్యతిరేకులం కాదు కానీ వ్యక్తిగతమైన విశ్వాసాన్ని సామూహికంగా ఉసిగొల్పేలా చూడటం భయం కలిగించే విషయం.

మెర్సీమార్గరెట్

కవి, హైదరాబాద్   

***

6. 

రాజ్యం మతం కలగసి ప్రజల్ని పీల్చి పిప్పి చేయటం భూస్వామ్య వ్యవస్థ లక్షణం.  ప్రపంచంలో అన్ని దేశాల్లో అది జరిగింది.  నూతన ఆవిష్కరణలకు అన్వేషణలకు అది  అవరోధంగా మారినందువల్ల ప్రపంచమంతటా మత ప్రమేయం లేని ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాల ఆవిర్భావం కోసం పోరాటాలు జరిగినవి,  విజయం సాధించినవి.  తద్వారా  నూతన నాగరికత వెలిసింది.  మళ్లీ ఆ రెండిటినీ  కలపటం అంటే మళ్లీ ప్రజల్ని పీల్చి పిప్పి  చేసే దశకు తీసుకెళ్లడమే.   అదెంత మాత్రం  అభిలషణీయం కాదు.  ఏకమత రాజ్యంలో ఆ మత  ప్రజలందరికీ సంక్షేమం లభిస్తోంది అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే.  ఆ మతంలోని అట్టడుగు ప్రజలు  ఎప్పటిలాగే పీడనకు గురవుతారు.  అది వాళ్ళు  గ్రహించాలి. 

సుంకిరెడ్డినారాయణరెడ్డి 

విశ్రాంత అధ్యాపకులు, నల్గొండ  

***

7. 

భారత దేశపు రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాల్లో యిపుడు హిందూ మతాధిపత్య ధోరణి ప్రబలింది.ఇది మైనారిటీ వర్గాల్ని భయపెట్టి లొంగదీసుకోవడానికీ, బిజేపీ యేతర రాజకీయ పార్టీలను కృంగదీయడానికీ ప్రయత్నిస్తున్నది. ఇదంతా అంతిమంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలను బలహీన పరచి హిందూత్వకు లొంగివుండేందుకు దారితీస్తుంది. ఏదో మేరకు పని చేస్తున్న భారత రాజ్యాంగం దీంతో మరింతగా బలహీనపడుతుంది. రాజ్యాంగం బయట పనిచేసే పౌరసమాజ విలువలు సడలిపోవడానికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రజలకు దీన్నంతా తెలియజెప్పాల్సి వుంది. ప్రజామద్దతుతో ఆచరణాత్మక పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ చేసుకోవాల్సి వుంది.

జి. వెంకటకృష్ణ 

రచయిత, కర్నూలు 

*** 

8. 

దేశాన్ని ఏక మత రాజ్యంగా చేయడం మైనారిటీ మతాలను అనుసరించేవారికి ప్రమాదకరం. రాజ్యాంగం ఏ మతానికి యెటువంటి ప్రాధాన్యత యివ్వదు. రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి ఈ ధోరణి విఘాతం కలిగిస్తుంది. ప్రజలకు బహుళ మత విశ్వాసాలు వుండడం సహజం, వారు యేదో ఒక మతం ఆధిపత్య మతంగా వుండాలని కోరుకోరు.  అలాగే ప్రజలలో యితరుల మత విశ్వాసాలను గౌరవించే తత్త్వం కూడా సహజంగానే వుంటుంది. ఆ రకంగా చూస్తే  వారు ఈనాటి మతతత్వ పాలకుల కంటే యెంతో విశాల దృష్టి కలిగినవారు.  ఒకే మతాన్ని మెజారిటీ మతంగా అందలం ఎక్కించడం ప్రజల స్వేచ్చను వారి సమానత్వ హక్కును హరించి వేస్తుంది. యిది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

నేటి మత తత్వ పాలకులు చరిత్రను కూడా ఒక మతానికి అనుకూలంగా తిరగ రాసే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి చరిత్రలో మతతత్వం లేదు, చరిత్రకారుల దృష్టిలోనే వుంది. మెజారిటీ మతస్తులలో మైనారిటీల పట్ల ద్వేష భావాన్ని పెంచేవిధంగా పాలకుల విధానాలు వుండడం దేశాన్ని మతాల రణరంగంగా మార్చివేస్తుంది. ప్రజాస్వామ్యం పూర్తిగా అనతరించిపోయి నియంతృత్వం వస్తుంది. యిది ప్రజల మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వారు యితరులతో కనీసం కలిసిమెలిసి ఉండలేని ఒక సంకుచిత ధోరణి ఏర్పడే ప్రమాదం వుంది. సామాజిక జీవితంలో ప్రజాస్వామ్యం లోపిస్తే పౌర సమాజం సంక్షోభంలో పడుతుంది.

అయోధ్య ఆలయ  నిర్మాణం, ప్రారంభం అనేవి పూర్తిగా రాజ్యంగా వ్యతిరేక విధానాలు. యివి అధికారికంగా జరగడం చట్ట విరుద్ధం. దేశ ప్రజలందర్నీ దేవుడి పేరున కూడగట్టడం, తద్వారా ఓట్లు దండుకోవాలని చూడడం దిగజారుడుతనం. యిటువంటి చర్యలు బహుశా ప్రపంచంలో యెక్కడా జరిగి వుండవు. వీటిని రాజ్యంగా బద్ధమైన సంస్థ అయిన ఎన్నికల కమిషన్ అడ్డుకోలేని దౌర్భాగ్యకరమైన స్థితి మత తత్వ పాలకులు కల్పించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఎలెక్షన్ కమిషనే ఏమీ చేయలేక చూస్తుంటే యిక సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి?  అయితే ఈ ఒంటెద్దు పోకడను కొందరైనా ప్రశ్నిస్తున్నారు.  ఒకపక్క  అభివృద్ధి అనేది లేదు, మరొక పక్క మతం పేరున అమాయక ప్రజల్ని చిత్రహింసల పాలు చేస్తున్నారు. దేవుడు, గుడి అని ఎంతకాలం జనాన్ని మోసం చేయగలరు?  ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారు. ఈ స్థితి మరెంతో కాలం కొనసాగదు. మనువాద పాలకులు దేశాన్ని మధ్యయుగాల వైపు తీసుకెళ్తున్నారు. మూఢనమ్మకాలను పెంచి పోషిస్తు పాలకులు దేశంలో శాస్త్రీయ దృష్టికి గండి కొడుతున్నారు. ఈ స్తితిని రచయితలు ఎదిరిస్తూ ఆలోచనాత్మకమైన రచనలు చేయాలి. ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ రచనలు చేయాలి. లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా మతతత్వ పాలకుల  దాష్టీకాలపై ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ వుండాలి

చల్లపల్లిస్వరూపరాణి 

ప్రధానాచార్యులు , నాగార్జున యూనివర్సిటీ – గుంటూరు 

9.  

భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని అందరూ  మర్చిపోయారు. రాజ్యంగ స్ఫూర్తి అనేది లేనే లేదు. మొత్తం అంతా ఓట్ల రాజకీయమే. మెజారిటీ స్కూళ్ళలో హిందూ మతమే ఉంది. ఆ మతమే చివరికి భారతమాత ఆహార్యంగా కూడా ఉంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నదే పిల్లలు బుర్రలో ఎక్కిoచుకుంటారు. ప్రత్యామ్నాయ ఆలోచనలకు తావులేకుండా ఉంది.  ఒక వర్గం మత మూఢత్వంలో కూరుకుపోయి  వున్నారు,  కొందరు యువత ప్రోగ్రెసివ్ గా వున్నారు. అయితే ఈ ప్రోగ్రెసివ్ కి భావ ప్రకటన స్వత౦త్రం లేదు. రాజ్యాంగ విలువలు అటకెక్కాకా ఎన్నికల కమిషన్ వంటి సంస్థలు అధికార పార్టీకి దాస్యం చేస్తూ వత్తాసు పలకడం ఎప్పుడో  మొదలయింది. దీనికి వ్యతిరేకంగా గొంతు విప్పాల్సిన వాళ్ళు బుద్ధిజీవులే. జర్నలిస్టులు రచయితలు  కళాకారులు పోషించాల్సిన పాత్ర చాలా వుంది.  కానీ వాళ్ళలో కూడా  చాలామంది అమ్ముడుపోయారు. మనలో సంభాషణ తగ్గింది, చర్చలు ఆరోగ్యంగా లేవు, చాలా కొన్ని వేదికలు మాత్రమే  ఆ విలువల్ని పోషిస్తున్నాయి. 

కొండేపూడినిర్మల

కవి, జర్నలిస్ట్ హైదరాబాద్ 

***

10. 

అవకాశాలు సమానంగా లేని సమాజంలో మనుషుల ఆకాంక్షలు, స్వప్నాలు, సంకల్పాలు ఆచరణలో  వాస్తవ రూపం ధరిస్తాతాయన్న భరోసా లేదు. అక్కడేనిస్సహాయులైన మానవులకు బత్రుకు భయం నుండి మతం, దేవుడు ఆశ్రయించవలసినవి అవుతున్నాయి. ‘దిక్కు లేనివాళ్లకు దేవుడేదిక్కు ’ అన్న నానుడిమూలం అదే. అక్కడ మతమైనా దేవుడైనా వ్యక్తిగతమే. కానీ సంపదలను, అధికారాన్ని పోగేసుకోవాలన్న ఆశకు ఆచరణ వ్యూహంగా ఈనాడు మతాన్నీ దేవుడిని రాజకీయం చేయటం వేగవంతమైంది. మూక సమీకరణకు అది మాధ్యమం అయింది. అయోధ్య కేంద్రంగా రామజన్మభూమి వివాదం దగ్గర మొదలు పెట్టి, అది రామజన్మభూమే అని న్యాయపరమైన ఆమోదాన్ని సంపాదించి రామాలయ నిర్మాణ ప్రతిష్ఠాపనల వరకు నాలుగు దశాబ్దాలకు పైబడి సాగిస్తున్న వ్యవహారమంతా అదే.

ఈ కాలమంతా వ్యక్తిగతంగా ఉండవలసిన మతాన్ని, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాది అరిషడ్వర్గాలపై స్వీయ నియంతణ్రకు, మానసిక పశ్రాంతతకు, ఆధ్యాత్మిక అనుభవానికి తొలి మెట్టు కావలసిన మతాన్ని ముస్లిం విద్వేషం, హిందూ రాజ్య భావన చుట్టూ పెంచిపోషించిన ఉద్రేక్రేం కలగలసిన క(కా)షాయంగా మార్చటంలోనే గడిచింది.

ఈ కాలంలో ఇంకేమేమి జరిగింది? ప్రజల  యొక్క ప్రజల  చేత ప్రజల కొరకు ఏర్పడే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్న సంపద్రాయం ఎక్కడో దారితప్పింది. ప్రజల కనీసావసరాలకు, సంక్షేమానికి, అభివృద్ధికి, గౌరవకరమైన భదత్రాయుతమైన జీవితాలకు పూచీ పడవలసిన ప్రభుత్వం వాటిని విస్మరించిన విషయం ప్రజలు గుర్తించలేనంతగా వాళ్లకు మతం మత్తు ఎక్కించింది. మతం యొక్క, మతం చేత, మతం కొరకు ఏర్పడేదే ప్రభుత్వం అని కొత్త నిర్వచనంతో అందుకు సమ్మతిని పోగుచేసుకొంటున్నది.

ఆలయ నిర్మాణానికి రాళ్లు చేర్చటం, నిధులు సమకూర్చటం వంటి వాటిలో భాగం చేసి అయోధ్య రామాలయం తాము కట్టిందే అన్న స్వీయాత్మక భ్రమా లోకాల సరిహద్దులలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిని వివహరించేలా చేస్తున్నది. అయోధ్యలో రామ విగహ్ర ప్రతిష్టాపన నాటికి ఎక్కడ నివసిస్తున్నవాళ్ళకైనా అందులో పాల్గొంటున్న భావనను కల్పించటానికి అక్షింతలు దేశమంతా పంపిణీచేసే బృహద్వ్యవస్థను రూపొందించింది. అవి ఆ రోజు వరకు దేవుడిముందు ఎలా పెట్టాలి? ఆ రోజు ఎలా ఉపయోగించాలి ? అని చర్చించటం జనానికి ఇప్పుడొక కార్యక్రమం అయింది.

రామాలయ విగహ్ర ప్రతిష్టాపన కేంద్ర ప్రభుత్వ ఏకైక కార్యక్రమం కావటం, అందులో భాగంగానే ప్రధాని దేశ పర్యటన సాగటంలో మతాన్ని ఎన్నికల రాజకీయ ప్రయోజనాలతో కలగలిపే సూత్రం కీలకం కాదా !? ఎన్నికల కమీషన్ దీని గురించి ఆలోచించాలి కాదా? అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ధర్మవిరోధం అన్న పీఠాధిపతులు ట్రోల్ చేయబడటం, ఆ కార్యక్రమానికిహాజరు కాము అన్న లౌకిక రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు దేశద్రోహులుఅన్న స్థాయిలో నిరసనకు గురికావటం ఇవన్నీ హిందూ మతంలో కూడా భిన్నత్వాన్ని సహించని లక్షణం కాదా!?

ముక్కో టిదేవతలతో పాటు కొత్తకొత్తగా పుట్టుకొస్తున్న దేవుళ్లను కూడా కలుపుకొనగలిగిన హిందూ మతం ఒక్క రాముడినే దేముడుగా ఎలా పచ్రారం చేస్తుంది? జైశ్రీరామ్, జైహనుమాన్ నినాదాలు అందరివీ అంటే కుదురుతుందా?

రాజులు గుడులు కట్టించారు, గుడులకు మాన్యాలు రాసిచ్చారు నిజమేకానీ ఈ ఒక్క దేవుడే అందరికీ దిక్కని చెప్పలేదు. దైవభక్తికి, రాజభక్తికి మధ్య గీతను పూర్తిగా రద్దు చేయలేదు. రాముడు దైవం కాదన్నవాళ్ళు, రాముడు దేవుడు కావచ్చు కానీ, నేను రామభక్తుడిని కాను అన్నవాళ్ళు దేశద్రోహులుగా, దేశం విడిచి వెళ్లిపోవలసినవాళ్లుగా వేధించబడటం రాజ్యాంగ విరుద్ధం కాదా ? అయోధ్య రామాలయ రాజకీయాలు కార్పొ రేట్ ఫాసిజం దిశగా కొనసాగే సూచనలు కనబడుతూనే ఉన్నాయి. ఈ రాజకీయాల గురించి, వీటినెపంగా దేశ పౌరులను మొత్తంగా వివేకాన్ని కోల్పోయి ఉద్వేగాల పవ్రాహంలో కొట్టుకు పోయేట్లు చేసే ప్రమాదం గురించి మన కార్యాచరణను నిర్ధారించు కొనవలసిన తరుణం ఇది.

కాత్యాయనీవిద్మహే

విశ్రాంత ఆచార్యులు, వరంగల్ 

***

11. 

“యూనిటీ ఇన్ డైవర్సిటీ’! ఇది మన రాజ్యాంగానికి మరో పేరు. దీన్ని మరోలా మనం అర్ధం చేసుకుంటే… డైవర్సిటీయే మన బలం. మన దేశమంటే ఆ బలమే.  ఆ బలాన్ని ఓ పథకం ప్రకారం బలవంతంగా బలహీనపరుస్తున్నది రాజ్యం. ఇందులో భాగమే ఒకే దేశం ఒకే భాష… ఒకే దేశం ఒకే ఎన్నిక… ఒకే దేశం ఒకే పౌరసత్వం లాంటి విధ్వంసకర వాక్యాల్ని ప్రవేశపెడుతోంది. నిజానికి “ఐక్యత”కి అసలు నిర్వచనం వైవిధ్యాన్ని గౌరవించడమనే. విభిన్నతను పెంపొందించడమే. ఎంత వైవిధ్యత ఉంటే ఐక్యతకి అంత బలం చేకూరుతుందని అర్ధం. 

దీని నుండి వేరుపడి ఒక ఆధిపత్య వర్గం మిగతా అణగారిన వర్గాల మీద ’నువ్వు నాలాగ’ వుండు ’నేను చెప్పిందే విను’ అని అనడం… లేదా అనిపించడం “నియంతృత్వం” కిందికి వస్తుంది. సరిగ్గా మన దేశంలో ఇదే జరుగుతుందనడానికి మత పోలరైజేషనే సాక్ష్యం. దీని కోసం రాజ్యం కొన్ని అబద్ధాలని నిజాలుగా చూపిస్తూ భ్రమలను కలిగేలా చేస్తుంది. ఈ రోజు భారతదేశంలో యువత తమకు తెలీకుండానే యీ  పోలరైజేషన్ లో భాగమైపోతూ నిద్రలో జోగుతోంది. ఇది నేటి పాలకుల వ్యూహం ఫలితం. ఇటీవల కొన్ని చానళ్ళలో రీళ్ళు(?) చూసినపుడు నాకు అర్థమయ్యింది… స్వాతంత్ర్యానికి, గణతంత్రానికి తేడా తెలీని స్థితిలో నేటి ఆధునికుల్లో కొందరున్నారని. పక్కదేశాన్ని తిట్టడమే దేశభక్తని, ఒక బెట్టింగ్ భూతాన్ని క్రికెట్ గా చూపిస్తూ అక్కడ గెలిస్తేనే దేశభక్తి ఉన్నట్టు ప్రచారం చేసిన కార్పొరేట్ శక్తులు, మీడియా మేధస్సుల వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇన్నాళ్ళూ ప్రచారం చేసిన రాజ్యం ఈ రోజు దేశమంటే రామరాజ్యమని రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ యువతని చాలా సులభంగా పోలరైజ్ చేసేస్తోంది. ఈ మాయ పొరల్ని యువతరం అర్ధం చేసుకోవాల్సివుంది. 

రాజరికపు లక్షణాలను వదిలించుకోవడానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో స్వేచ్చ, సమానత్వాలే ప్రాతిపదికగా సాగాలని వాగ్దానం చేసుకున్నాం. కానీ ఇక్కడ? ఆ రెంటినీ వదిలి వ్యతిరేక దిశలో అడుగులు వేస్తున్నాం. మతమనేది వ్యక్తిగతం. ఎవరి ఇష్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుతంగా స్వీకరించేది. కానీ ఒక బలవంతపు, అత్యవసర స్థితిగా ఎదుర్కొంటున్న సగటు జీవి అయోమయంలో పడి మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా చేస్తున్నది రాజ్యం. ఆదివాసులకు మతం లేదు. ప్రకృతి ఆరాధననే ఒక విధానం ఆచరణలో వుంటుంది. దానిని ఒక వెనుకబాటు తనంగా చూపించి, ఘర్ వాపసీ అని హిందూ మతాన్ని అడవుల్లోకి విస్తరించడం ఒక కుట్ర. ముస్లిమ్ లను దేశ ద్రోహులుగా చిత్రించడం, ఆదివాసులను అనాగరికులనడం, దళితులను అంటరానివారనడం ఈ కుట్రలో భాగమే. దీనిలో ఒక్క హిందూ మతమే గొప్పదిగా చిత్రించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమే. లౌకిక తత్వానికి గొప్ప విఘాతం. బహుళ సంస్కృతీ సమ్మేళనపు సౌరభాన్ని దెబ్బదీసే చర్య ఇది. ఇదిలాగే సాగితే రాబోవు రోజుల్లో అంతర్యుద్ధాలకు దారితియ్యవచ్చు.  సౌభ్రాతృత్వం ఒక ప్రశ్నార్థకంగా మారిపోనూవచ్చు. 

మతం ఒక విద్వేషంగా మారినపుడు మనిషి మనుగడ ప్రమాదంలో పడిపోతుంది. ప్రజల మానసిక స్థితి ఒక అయోమయానికి గురై, విద్వేషం వైపు తద్వారా యుద్ధం వైపు దారితీయొచ్చు. ప్రశాంతత అనేది కరువైపోవచ్చు. ఆధునిక ప్రజాస్వామ్యం ఇప్పటికే తన ఉనికిని క్రమక్రంగా కోల్పోయే దశకు చేరుకున్నది. చట్టాలు చేసే రాజ్యం, దానిని కాపాడాల్సిన వ్యవస్థలు కార్పొరేట్ ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్న స్థితిని సగటు పౌరుడు ఇప్పటికే అనుభూతి చెందుతున్నాడు. తీర్పులు అనుకూలంగా ఇవ్వడం వెనక ఒక పదవుంటుందని, దానికి అడ్డొచ్చిన ప్రతి అడ్డంకినీ ఒక   రాజ్యాంగ బద్ధ నియమంగా మార్చేయడం ఒక సాధారణ పౌరుడికి అర్థం కాని విషయం కాదు. చరిత్రను మార్చడం, అబద్ధపు పునాదుల మీద వాస్తవాల్ని కప్పిపుచ్చడం ఒక చారిత్రక నేరం. ఇది చట్టబద్ధంగా చేయడం ఇంకా దారుణం. దీన్ని ఖండించి ఎదుర్కోడానికి యువత సిద్ధంగా ఉండాల్సిందే. మతం వ్యక్తిగతం, రాజకీయం సామాజికం. ఇది రూపాంతరం చెందితే ఆ సమాజం ప్రమాదంలో ఉన్నట్లే.     

అయోధ్యలో రాముని ఆలయ నిర్మాణం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టడం, దాన్ని ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థ అడ్డుకోకపోవడం ఇక్కడ ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. రేపటి సమాజం ఎలా ఉండబోతోందో ఊహించడానికి పనికొస్తుంది. ఈ స్థితిని ఎదుర్కోవడానికి యువతకి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి కార్యక్రమ రూపం వెనుకా సారాన్ని అర్థం చేయించాలి. దేశ తొలి పౌరురాలిగా ఒక ఆదివాసీని కూర్చోబెట్టి అత్యున్నత రాజ్యాంగ బద్ధ నిర్మాణం పార్లమెంట్ ప్రారంభానికి ఆమెని దూరం చేయడం వెనక ఆదిపత్య మత భావాన్ని అర్థం చేసుకోవాలి. మనుస్మృతి పునాదుల్లోంచి పుట్టుకొచ్చిన మూఢభావనల్ని ఆధునికులు అర్థం  చేసుకోవాలి. దాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించుకుంటున్న రాజ్య స్వభావాన్ని ఎండగట్టాలి. 

ఇలాంటి విపత్కర పరిస్థితులు చరిత్రలో చాలా జరిగాయి. వాటినెదుర్కోడానికి అప్పటి సంస్కరణ వాదులు ఎన్నో ఇబ్బందులు పడడాన్ని మనం చదివాం. అవే పరిస్థితులు రూపాన్ని కాస్త మార్చుకుని, సాంకేతికను జోడించుకుని ఇప్పుడు ప్రజల్ని మూఢత్వం వైపు మరింత వేగంగా, నిర్లజ్జగా నడుపుతున్న ఈ స్థితిని కవులు, రచయితలు నిష్కర్షగా మాట్లాడాల్సిందే. వెనకకు నడుస్తున్న నేటి దుర్మార్గపు పోకడల్ని ఖండాల్సిందే. కవులూ గొంతెత్తక పోతే, మేధావులూ మాట్లాడకపోతే మూర్ఖులు మాట్లాడేది నిజమనే ప్రమాదమున్నది.

మల్లిపురంజగదీశ్ 

రచయిత, పార్వతీపురం  

కూర్పు : . కె. ప్రభాకర్ (సెక్యులర్ రైటర్స్ ఫోరమ్) 

Leave a Reply