దళిత జీవిత రాజకీయ చిత్రణలు – ఇనాక్ మూడు నవలలు

నూతన సహస్రాబ్ది లో కొలకలూరి ఇనాక్ వ్రాసిన తొలి మలి నవలలు సర్కారుగడ్డి (2006), అనంతజీవనం (2007). రెండూ 1990 -2010 మధ్యకాలంలో అనంతపురం ఎదుర్కొన్న రెండు ప్రాకృతిక విపత్తు సందర్భాల ను నేపధ్యంగా చేసుకొని వచ్చిన నవలలు. ఆ విపత్తులలో ఒకటి నీరు లేకపోవటం. రెండవది వరద రావటం. సర్కారుగడ్డి నీటి లేమి నుండి పుట్టిన నవల అయితే అనంతజీవనం అలివిగాని నీరు నుండి పుట్టిన నవల. ఒక సమస్య దగ్గర మొదలుపెట్టి విస్తృత మానవజీవన రంగాలను, మానవ ప్రవృత్తులను శకలాలు శకలాలుగా చూపిస్తూ అనంత మానవ జీవిత యానాన్ని గురించిన ఒక దృక్పథాన్ని కలిగించటం రెండు నవలలో సాధారణాంశం.

వర్షాలు లేక , నీటి వసతులు సరిగా లేక, పంటలు పండక తరచు కరువులను ఎదుర్కొనే రాయలసీమలో ప్రజలకు తిండిగింజల కటకట ఎంత సమస్యో పశువులకు గడ్డి లేకపోవటం అంతకన్నా పెద్ద సమస్య. సాధారణంగా వ్యవసాయాధారిత జీవనంలో దానికి దన్నుగా నిలబడే ఆదాయ వనరు పశువులే. పాలఉత్పత్తులు, మాంసం వాటినుండి సమృద్ధిగా లభిస్తాయి. కానీ వానలులేక పంటలు ఎండి పోయినప్పుడు పశువులకు అవసరమైన దాణాకు కూడా కరువు ఏర్పడుతుంది. ఈపరిస్థితి రైతుల ఆర్ధిక ఆరోగ్యపరిస్థితులమీద మరింత దెబ్బ అవుతుంది. ఈ పరిస్థితులలో పాడి పరిశ్రమ అభివృద్ధికైనా , మాంస పుష్టికైనా ప్రభుత్వ వ్యవసాయ విధానంలో పశువులకు బలవర్ధకమైన ఆహరం అందేట్లు వ్యూహాలు రచించటం అత్యవసరమవుతుంది. అందులో భాగంగానే . స్థానిక పశు సంపద పెంపకానికి అవసరమైన గడ్డినిచ్చే పంటలపైన కొత్తకొత్త పరిశోధనలు జరుగుతుంటాయి. అదలా ఉంచితే అసలు వానలే లేక భూములు బీళ్లుపడే స్థితి ఉన్నప్పుడు పశువులకు పుష్టికరమైన గ్రాసం కాదు కదా పచ్చిగడ్డి అన్నది దొరకటమే కష్టమవుతుంది. పంటలు లేకపోవటం వలన ఎండుగడ్డి నిలువలు ఏ రైతుకూ వుండవు. ఆలాంటి విపత్కర పరిస్థితులలో రాయలసీమలో ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా -పశువుల కోసం గడ్డి సమృద్ధిగా వున్న ఇతర ప్రాంతాల నుంచి తరలించి- అవసరమైన ఊళ్లలో గడ్డి పంపిణీ చేయటానికి ఒక పథకం రూపొందించింది. ఆ పథకం చుట్టూ అల్లిన నవల సర్కారు గడ్డి.

ఈ నవలలో కథ అనంతపురం జిల్లాలోని ఒక పల్లెటూరు గేరి లో రాఁవుడి ఇంట ప్రారంభమై రాఁవుడి ఇంట్లోనే ముగుస్తుంది. రాఁవుడి ముగ్గురు కొడుకులు ముసలిదైన ఎద్దుకు పెట్టటానికి గడ్డి కరువై కబేళాకు తోలేద్దామని తీసుకొన్న నిర్ణయం లచ్చువాఁ అని దానినిప్రేమగా పిలుచుకొంటూ తమ్ముడిలాగా పెంచుకుంటూ వచ్చిన రాఁవుడు ఆవురు మని స్పృహతప్పి పడిపోతే కొడుకులు సేదతీర్చి ఎద్దును అమ్మము అని చెప్పి తండ్రిని సమాధానపెడతారు. ఇది నవలలో మొదటి ఘట్టం.ఈ ఘట్టం పూర్తయ్యేటప్పటికి రాముడు మాదిగ గేరి పెద్దఅనీ, వశపారంపర్యపు భూవసతి ఉన్నవాడిని, తినా కుడవా ఉన్నవాడేనని, భార్య చనిపోయిందని ముగ్గురు కొడుకులు బుద్ధిమంతులై పనులు చేసుకొంటున్నారని , వాళ్లకు పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టి ఇల్లంతా సందడిగా జీవితం సంతృప్తిగా సాగిపోతున్నదనీ , నాలుగేళ్లుగా వర్షాలు లేక బోర్లు ఎండిపోయి వరి పంట తగ్గిపోయి మిగిలిన పంటలు కునారిల్లి పాడికి లోటు ఏర్పడి కొడుకులు, కోడళ్ళు కరువు పనులకు పోయి గింజలు తెచ్చుకొనే పరిస్థితులు వచ్చాయని తెలుస్తుంది. ఆక్రమంలోనే రైతుకు ప్రాణంలోప్రాణమైన పశువుల పోషణ కూడాఒక సమస్యగా ముందుకువస్తుంది. లచ్చువాఁ ముసలిఎద్దు. ఒక ముసలి ఆవుకూడా. ఇవి కాక వ్యవసాయానికి కాడిమోసే నాలుగెడ్లు , నాలుగు దున్నపోతులు, ఒక ఆవు, నాలుగుదూడలు…వేరుశనగ పంట , వరి పంట సరిగా లేక వాటికి తగినంత మేతలేక, కొనిపెట్ట లేక రైతు పడే బాధ తెలుస్తుంది.

ఈ పరిస్థితులలో పశువులకోసం ప్రభుత్వ దాణా పంపకం పథకం వచ్చింది. మొదట్లో అది ఉచితంగా ఇచ్చారు. గడ్డి కేంద్రాలు ఏర్పరచి చుట్టుపక్కల పల్లెల పశువులను అక్కడకు తెచ్చుకొని ఎండాకాలం మూడు నెలలు మేపుకొంటూ అక్కడే ఉండవచ్చు. ఆ గడ్డి కేంద్రాల పని తీరు నవల ఇతివృత్తంలో గతానికి సంబంధించిన – అంటే సూదూరపు గతం కాదు , ఏడాది క్రితపు గతం- అనుభవ కథనం గా నమోదు అయింది. పందిళ్లు వేసి పశువుల విడిదికి వసతి ఏర్పాటు చేశారు. రోజుకు ఆరేడు లారీల గడ్డి ఆ కేంద్రాలకు వస్తుండేది. రాముడు కూడా ఆ కేంద్రానికి ముగ్గురు కొడుకులను , పశువులను వెంటపెట్టుకొని వచ్చినవాడే. అప్పటి అతని అనుభవాలు ప్రధానంగా రెండు. ఒకటి కులానికి సంబంధించింది. రైతులందరూ పశువుల మేత వెళ్ళక ప్రభుత్వ సహాయం అందుకొనటానికి వచ్చిన వాళ్ళే అయినా పందిళ్ళ కింద పెద్దవాళ్ళ పశువులకు తప్ప దళితుల పశువులకు చోటు లేకపోవటం. వాళ్ళు తమ పశువులను చెట్ల కింద కట్టేసుకొనటం. రెండవది గడ్డి సంపన్నుల పశువులకు, నోరుగల వాని పశువులకు దక్కుతున్నట్లు బీదాబిక్కీ చిన్న సన్నకారు రైతుల పశువులకు దక్కక పోవటం. “ గ్రామంలో అంటరానివాళ్ళ అవస్థలే , కేంద్రంలో వాళ్ళ పశువులకు సంక్రమించాయి. అది అగ్రవర్ణం పశువు అయినా అధమ వర్ణం పశువు అయినా , వాటి ఆకలి ఒకటేనని ,వాటి మేత ఒకటే ఉండాలని గుర్తించవలసిన అవసరం పెన్నోబులం కేంద్రంలో తెలిసివచ్చింది.“

ఈ సందర్భంలోనే గడ్డి కేంద్రాలకు రావలసిన గడ్డి లారీలు లోపాయికారీగా సంపన్నుల , అధికారవర్గాల అవసరాలను తీర్చటానికి దారి మళ్ళించబడటం, దానితో కేంద్రాలలో పశువులకు మేత సరిపోక పోవటం కూడా ఒక సమస్య . దానిని కూడా పాఠకుల దృష్టికి తీసుకు వస్తాడు రచయిత. ఒక రోజు కేంద్రానికి రావలసిన ఆరు లారీలలో ఒకటి తమ ఊరి సర్పంచ్ ఇంటికి తరలించబడటం ప్రత్యక్షంగా చూసి పట్టుకొని అందులోని అన్యాయాన్ని నిలదీసిన వారిలో రాముడి కొడుకు సన్నోడు ఉన్నాడు. అది దొంగ గడ్డి అంటే సర్పంచ్ తాను గడ్డికొనమంటే జీతగాళ్ళు సర్కారు గడ్డి కొనుక్కొచ్చారని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే ప్రయత్నం చేసాడు. సర్కారు గడ్డి ఊరందరికీ పంచాల్సిందే నని పట్టు బడితే వూరికి సగం , గేరికి సగం అన్నారు. సర్పంచ్ 300 రూపాయలు కట్టి తెప్పించిన గడ్డికనుక ఊరివాళ్ళు , గేరివాళ్ళు చెరిసగం చెల్లించాలి అని కరణం తీర్పుచేశాడు. అది వేరే విషయం.

ఇక గడ్డి పంపిణీకి సంబంధించిన వర్తమాన పద్ధతి ఏమిటి? గడ్డి కేంద్రాలు రద్దుచేసి గడ్డిని సరాసరి గ్రామాలకు పంపటం. గ్రామంలో అది అందుబాటులోకి వచ్చేట్లు పంపిణీ జరిపిస్తారు సర్పంచ్ లు. ప్రభుత్వం లారీలకు ఎక్కించి గడ్డి పంపితే రావాణా చార్జీలకింద గ్రామాలు లారీకి అయిదువందలు చెల్లించాలి. అవి రైతులు భరించాల్సినవే. గడ్డి లారీలు వస్తాయనగా అందుకు డబ్బు సిద్ధం చేసుకొనటం వాళ్ళ పని. రావుడు ఆ రకంగా ఒక లారీ గడ్డి కొనటానికి పెద్దకోడలి నగలు అమ్మి 500 రూపాయలు సిద్ధంచేసుకున్నాడు. ఆమేరకు సర్పంచ్ ను ఒప్పించటానికి నడిపి కొడుకును పంపాడు. ఊరిజనాభా , మాదిగ గేరి జనాభా చెరిసగం గా ఉన్నారు కనుక ఊరికో లారీ, గేరికో లారీ కేటాయించటం న్యాయం అని చెప్పి ఒప్పించి వచ్చాడు. లారీ గడ్డి ఏ అవాంతరాలు లేకుండా గేరీకి చేరింది. కానీ ఆ సమయానికి రాముడు అతనికి ప్రియమైన ఎద్దు లచ్చువడు మరణించారు. వాళ్ళ అంతిమ సంస్కారాలతో నవల ముగుస్తుంది.

2004 ఏప్రిల్ మే నెలల లో ఈ కథంతా నడిచింది. 2004 మే 2 వ తేదీన తెల్లవారుఝామున అనంతపురం లో ఆగిన గూడ్సు రైలు నుండి అన్లోడ్ అయినగడ్డి అదే రోజు ఊరిని, గేరిని చేరింది. చేర్చింది రావుడి కొడుకులే . ఇల్లుచేరేసరికి తండ్రి ఎద్దుతో తోటకు వెళ్లాడని తెలిసి అక్కడకు వెళ్ళటం అక్కడ మరణంలోనూ బంధం వీడని తండ్రిని ఎద్దును ఇంటికి తేవటం జరిగింది. మర్నాడు అంటే మే 3 న నవల ముగిసింది. అయితే ఇది కేవలం రాముడి కుటుంబానికి సంబంధించిన కథ మాత్రమే కాదు ఆద్యంతాలలో దానిని కూర్చి సర్కారు గడ్డి అనే వస్తవైక్యం చెడకుండా దేశంలోని వేరువేరు ప్రాంతాలనుండి గడ్డిని మోసుకొచ్చే గూడ్సు రైళ్లు ఆగే అనంతపురం స్టేషన్ కాన్వాస్ గా ఆయన గీసిన త్రీ డి రంగుల బృహత్ చిత్రం ఆశ్చర్యకరం.

గూడ్సు బండి నుండి గడ్డి దించి లారీలకు ఎత్తవలసిన హామాలీల గురించి, ముఠామేస్త్రీ జీవితాన్నిగురించి , లారీ యజమానుల సంఘాల సెక్రటరీ గురించి, దోశ , పూరీ ఆమ్లెట్, పరోటా వంటి తిండి సరుకు బుట్టల్లో పెట్టుకొని స్టేషన్లో హమాలీలకు అమ్ముకొనే లచ్చువక్క గురించి, హమాలీలలో బక్కోడు ,దుబ్బోడుల గురించి చెప్పిన కథనాలు వేటికవి అన్నట్లుగా ఉంటూనే జీవితంలో భిన్నస్థలాలలో, తలాలలో సాగే జీవన వ్యాపారాల సరళిని వ్యాఖ్యానిస్తాయి.గడ్డి లారీలు పోతున్న అనంతపురం రోడ్లను, వాటిమీద గాలికి ఎగిరే గడ్డి పరకలు, ట్రాఫిక్ లో లారీలు ఆగితే వెనక నుండి గడ్డి అందుకొని ఆకలి తీర్చు కొనటానికి ఆరాటపడే పశువులను, చేతికందినంత గడ్డి లాక్కుపోయే మనుషులను,పశువుల వెంట పేడ కోసం తట్టబట్టుకొని తిరిగే మనుషులను కూడా చిత్రించటం వదలలేదు ఆయన. రాయలసీమలో వేసవి కాలం ప్రభుత్వం పశువుల కోసం పంపిణీ చేసే గడ్డి గురించి, అందులోని రాజకీయాల గురించి వ్రాయటం మొదలుపెట్టి గడ్డి తినే మనుషులను, వ్యవస్థలను,ప్రభుత్వాలను వెక్కిరించటంగా కొనసాగిన నవల ఇది. ఈ మొత్తం క్రమంలో రాయలసీమ ముఖ్యంగా అనంతపురం ప్రాంతాల దళిత జీవిత పరిణామాలను, చైతన్యాన్నిఫోకస్ చేయటం రచయిత అదనంగా సాధించిన మరొక ప్రయోజనం.

ప్రధాన కథ సంగతి అలా ఉంచి ఉపకథనాలు పరిశీలిస్తే దళిత జీవిత సమస్యల గురించి ఇనాక్ సందర్భవశాత్తు చేసే వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి చూస్తే రచయిత దళిత రాజకీయార్థిక దృక్పథం స్పష్టం అవుతుంది.
‘హమాలీలో నాలుగింట మూడొంతుల మంది దళితులు’.
‘అనంతపురం జనాభాలో నూటికి అయిదో వంతు దళితులు’.
‘అనంతపురం లారీ ఓనర్ల సంఘంలో నమోదైన మూడువందల లారీలలో నూరు దళితులవి’. ఇలాంటి సమాచారం ద్వారా రచయిత చెప్ప దలచుకొన్నది చాలా ఉంది.స్వాతంత్య్రం తరువాత భారతదేశ గ్రామీణ చిత్రపటంలో వచ్చిన మార్పులు ఏమిటి? ఉత్పత్తికులాల వారిని, ప్రత్యేకించి దళితులను గ్రామాలనుండి నగరాలకు నడిపిన శక్తులు ఏమిటి? దళితుల కోసం ఉన్నపథకాలు ఏమిటి? అవి ఎవరికి ఎట్లా వినియోగపడుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ నవలలోని ఉపకథనాలల భాగంగా పాఠకుల ఎరుకకు అంది వస్తుంటాయి.

స్వాతంత్రం వచ్చి ప్రభుత్వ విధానంలో భాగంగా గ్రామాలలో దళితులకు భూమి పట్టాలు, మోటార్లు , కరెంటు , పశువులు , గొర్రెలు, మేకలు ఇలా ఏ వనరులు , ఏ రాయితీలు లభించినా అవి దళితుల అనుభవంలోకి రావటం , నిలబడటం అనేది గ్రామీణ వర్ణాశ్రిత భూస్వామ్య అధికార వ్యవస్థల ఛత్రచ్ఛాయలలో అసాధ్యమవుతుంటే ఇదిలా ఎందుకు జరుగుతున్నది అన్న ప్రశ్న దళిత యువతను వేధిస్తుంటే చదువుల వల్ల , తరిమెల నాగిరెడ్డి వంటి వారి నాయకత్వంలో నడిచిన సమానత్వ ఉద్యమాల వల్ల వూళ్ళల్లోని అసమ అవమాన సంస్కృతికి, ఫ్యాక్షన్ రాజకీయాల బాంబు దాడుల మారణహోమాల కు దూరంగా బతకటానికి పల్లెల నుండి నగరానికి దళితుల ప్రస్థానం ప్రారంభం అయిందని చెప్తాడు కథకుడు. అనంతపురం అభివృద్ధి అవసరాల కు అవసరమైన మానవ వనరు అయ్యారు దళితులు. హమాలీలో నాలుగింట మూడొంతుల మంది దళితులు కావటం అందువల్లనే . ఇలాంటి అసంఘటితరంగ జీవనోపాధులు పారిశుధ్యం వంటివి ఎన్నెన్నో… అన్నిటా దళితులే. పోటీలేని పనులు ఇవి అని కథకుడు చేసిన వ్యాఖ్యానంలో వ్యగ్యం జాగ్రత్తగా గమనించవలసినది.

ఈ పరిస్థితులలో అనంతపురంలో నూరు లారీలకు దళితులు యజమానులు అయ్యారు అంటే దానిని ఎట్లా చూడాలి? అది తెలియచేయటానికి ఒక కేస్ స్టడీని ఉపకథగా ప్రవేశపెట్టాడు రచయిత. ఎస్. సి. కార్పొరేషన్ అనేది ఒకటి ఉందని , అది దళితులకు లారీలు కొనుక్కొని బాగుపడటానికి ఆర్ధిక సహాయం చేస్తుందని తెలియని దళితుల దగ్గరకు తెలిసిన దళితేతరుడు వెళ్లి వాళ్ళు కట్టవలసిన లక్ష తాను కట్టి , కార్పొరేషన్ ఇచ్చే మూడులక్షల, బాంక్ ఇచ్చే ఆరు లక్షల అప్పు తీసుకొని లారీలు కొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్లు చేయించటం ఆ లారీల అసలు యాజమాన్యం తనదిగానే మిగిల్చుకొనటం అసలు కథ. ఇవి స్వతంత్రంగా జీవిస్తున్న దళితులను లారీ క్లీనర్లుగా జీవితకాలపు బానిసలుగా చేసుకొంటున్న అగ్రవర్ణ అధికార రాజకీయాల మాయను బయటపెట్టాడు రచయిత.

రైల్వేస్టేన్ ప్లాట్ ఫారం పైన హమాలీలకు ఫలహారాలు అమ్మే లచ్చువమ్మ యంగటేశు ప్రేమ కథలో యంగటేశు దళితుడు… ఆమె బహుజన కులాల మనిషి . ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెద్దలను ఎదిరించి ఊరువదిలి అనంతపురం చేరి బతుకుతున్నారు. వాళ్ళిద్దరిమధ్యా ఉన్న అన్యోన్యత , అనురాగం అతిలోకమైనవిగా రచయిత వర్ణించి చెప్పటం వేరే సంగతి. మాల మాదిగలను అవమానిస్తే సహించని సంస్కారాన్నిఆమె అభివృద్ధిచేసు కొనటమే కాదు, ఆచరణలో దానిని ఎట్లా ప్రదర్శించేదో చూపటం ఈనవలలో విశేషం. ఉన్నవూరు వదిలేసి కొత్తచోట కాపురంపెట్టినా వెంటవచ్చే కులంగాడు ఆడించే నాటకంలో లచ్చువక్క తన భర్త కులాన్ని న్యూన పరిచి అవమానించే మాటలను విన్నప్పుడు మౌనంగా తలవంచుకు పోవటం కాక బదులు ఇయ్యటం తిట్లకు దిగి వాళ్ళరోగం కుదర్చటం చేస్తూనే వచ్చింది. రైలు ప్లాట్ ఫారం మీద పలహారాలు అమ్మటానికి వచ్చినప్పుడు ఒకరోజు హామాలీలలో దళితేతరుడు ఒకడు తాను మాదిగవాడుకడిగిన పళ్లెంలో తిననని యాగీ చేయబోయినప్పుడు ఆమె అతనితో వ్యవహరించిన తీరులో నిక్కచ్చితనమే కాదు, ‘అంటూ గింటూ అనేమొగోడు మొనగాడు..వచ్చినాడు’ అన్ననిరసన కూడా దృఢంగానే ఉంది.

ఇక అసలు కథ లో కొత్తతరం దళిత యువకుల చైతన్యం దాని వెనక ఉన్న సామాజిక శక్తుల చలనం దృశ్యాదృశ్యంగా కనబడుతూనే ఉంటాయి. దానికి తగ్గట్లే ఊళ్ళల్లో భిన్నవర్గాల మధ్య సంబంధాలు.నిజానికి ఈ నవలకు ప్రధానాంశం వర్ణ సంఘర్షణ కాదు. అలాగని జీవితంలో లేనిది కాదు.అందువల్ల వర్ణ వైరుధ్యాలు మంద్ర స్థాయిలో తలసూపటం, అంతలో సర్దుబాట్లు కావటం కూడా జరిగిపోతుంటుంది. ఈనవలలో అదేచూస్తాం మనం. ఈ నవలలో ఊరివాళ్లకు, గేరి వాళ్లకు మధ్య సంఘర్షణ సందర్భాలు రెండూ గడ్డికి సంబంధించినవే. రెండూ సర్పంచ్ సమక్షంలోనే..మొదటి సందర్భంలో దళితులకు ప్రతినిధిగా రావుడి చిన్నకొడుకుసన్నోడు ఉన్నాడు.రెండవసందర్భంలో రావుడి మధ్య కొడుకు ఉన్నాడు. సర్కారుగడ్డి, జనమందరికీ చెందాల్సిన గడ్డి సర్పంచ్ ఇంటికి ఎట్టా చేరుతుందని సన్నోడు గొడవపడినప్పుడు తనజీతగాడు మాదిగోనికి మర్యాద లేదా అని మందలించటం సర్పంచ్ కి ఇష్టంగానే ఉన్నానోరుమూసుకోమని జీతగాడ్ని గద్దించాడు.ఎందుకు?

కారంచేడు, చుండూరు ఘటనల తరువాత అగ్నిలా ఎగిసిపడుతున్న దళితుల ఆత్మగౌరవ చేతనను అవమానపరచటం కొరివితో తలగోక్కోవటమే అవుతుందని తెలిసివుండటం వల్ల. వాళ్ళు తెలివైనబడుతున్నారు.అన్యాయాన్ని నిలదీసి అడిగే చేవ పెంచుకొన్నారు. ఊరిజనాభాతో సమంగా గేరి జనాభాఉన్నారు. గేరి నుండి పదిమంది యువకులు అన్నల్లో చేరారు. వాళ్ళు వీళ్ళకోసం నిలబడితే ఏగటం కష్టం. ఇక రైతుకూలీ సంఘాలలో ఎక్కువమంది దళితులే.అవిరంగంలోకి దిగితే గొడవే.. మరీ ముఖ్యంగా వాళ్ళూ తమ ఓటు బ్యాంకులో నిధులే.వాళ్ళని అసంతృప్తి పరచి, అవమాన పరచి అధికారానికి చేటు తెచ్చుకొనటం వివేకంకాదు. ఇవన్నీ ఆలోచించే సర్పంచ్ శాంతం వహించాడు.

అయితే సన్నోడు గడ్డి విషయంలో తనను నిలదీయటం సర్పంచ్ కు లోలోన కోపంగానే ఉంది. దొంగగడ్డి వూరికి గేరికి సగం సగం పంపిణీ అయ్యాక గేరి వంతుకు కట్టవలసిన నూటయాభై రూపాయలు రావుడు తెచ్చిస్తే తీసుకోను ఒప్పుకోలేదు.సన్నోడు దగ్గర ఉంచమని చెప్పాడు.రావుడికి విషయం అర్ధమై కొడుకును ఒప్పించి పంపించాడు.తండ్రిమాట కాదన లేక సన్నోడువచ్చిక్షమాపణలు చెప్పి డబ్బు ఇయ్యబోయాడు. మీరేఉంచుకోండి అన్న సర్పంచ్ ఉదారతలోని రహస్యం- దయచూపి తమను గుప్పిట్లో ఉంచుకోవాలనుకొన్న ఆంతర్యం- అర్ధం అవుతుంటే సన్నోడు సర్పంచ్ కూర్చున్న ఉయ్యాల బల్లదగ్గరకు వెళ్లి ఆ డబ్బు అక్కడ పెట్టి వచ్చేసాడు.

రెండవ సందర్భంలో ఊళ్లోకి వచ్చే రెండు లారీల గడ్డి లో గేరి వాటా కోసం సర్పంచ్ తో మాట్లాడటానికి వెళ్లినవాడు రావుడి రెండవ కొడుకు. సర్పంచ్ అతనిప్రతిపాదనను అంగీకరించటంలో ఉన్నది ఓటు బ్యాంకును భద్రపరచుకొనటమే అన్నది స్పష్టం. లోలోపల నిజమైన ప్రేమ లేకపోయినా అగ్రవర్ణ అధికారవర్గం దళితులతో స్నేహాన్ని సహకారాన్ని ప్రదర్శించగలిగారంటే అందుకు కారణమైనవి దళిత విప్లవోద్యమాల నేపథ్యంలో పెరిగిన దళిత చైతన్య శక్తి , దళితులు రాజకీయ శక్తి గా బలపడిన చారిత్రక సందర్భం అన్న విషయం ఈ నవల లో అంతర్ధ్వని గా వినబడుతుంటుంది.

ఒకనాటి రాత్రి మొదలైన కుంభవృష్టి వంటి వాన తుఫానుగా మారి సృష్టించిన బీభత్సంలో కూలిన , కొట్టుకుపోయిన జీవాలు, జీవితాలు జీవన వ్యాపారాల భిన్న చిత్ర మాలిక అనంతజీవనం నవల. రాత్రి నుంచి పడుతున్న వర్షం తుఫానుగా తేలింది 1996 నవంబర్ 9 న అని స్పష్టంగానే కథకుడు పేర్కొన్నాడు. ఆరోజు , మర్నాడు వరద ఉధృతి.మూడోనాటికి సూర్యోదయం. నవల ముగిసింది ఇక్కడే. జమిందారీ వంశానికి చెంది ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్రం చదివి , తెల్ల దొరసానిని పెళ్ళాడి భారతదేశానికి తిరిగివచ్చి క్రిమినల్ లాయర్ గా ప్రసిద్ధుడైన రాం.పి .రెడ్డి పరిచయంతో ప్రారంభమయ్యే ఈ నవలలో అతడు పదేళ్లవాడుగా ఉండగా ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసినట్లు చెప్పబడింది. అది ముగిసింది 1919 లో కనుక ఇతను పుట్టింది 1910 అయి ఉంటుంది కథా కాలానికి అతను 95 ఏళ్ల వృద్ధుడు అని కూడా చెప్పబడింది. దీనిని బట్టి 1910 నుండి 95 లెక్క కడితే 2005 కథాకాలం కావాలి. అయితే కథాకాలం 1996 అయినా 2005 అయినా ఈ నవల ఇతివృత్తగమనానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు.

పొట్టేళ్ల మంద వరదలో కొట్టుకుపోతుంటే కాపాడటానికి ఆంకాలప్ప చేసిన విఫల యత్నం, బేలుదారీ మేస్త్రీ ఐదో భార్య ఇల్లు కూలిన ఘటన, ఇల్లు కట్టే వాడి ఇల్లే కూలితే కట్టించుకొనే వాళ్ళ విశ్వాసం ఏమి కావాలని అతను ఆలోచనలో పడటం దానిని , ఇంటినీ కూడా పునర్నిర్మించుకొనటానికి అతను ఆ వర్షపు రాత్రే చర్యకు దిగటం, రాత్రి వానకు కూలిన ఇళ్ల శిధిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవాళ్లను కాపాడటం, లేదా శవాలను వెలికి తీసుకురావటం, నాగన్నఅడితీ కొట్టుకుపోవడం, పిల్లలు కొట్టుకుపోవడం, ఇలాంటి దృశ్యాలతో పాటు ఈ వరదలో అసలే శిధిలమై ఉన్న తాతలనాటి భూస్వామ్య రాచరిక అధికారవ్యవస్థల ఆధునిక ముసుగులు కూడా జారిపోతూ కూలిపోతున్న దృశ్యాన్ని రాం .పి రెడ్డి అన్నతమ్ముల గురించిన కథనాల ద్వారా చూపించాడు రచయిత. తుఫానుల కు, వరదలకు, చెరువు ప్రాంతాలను కూడా ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకొనే మానవ దురాశను, నీటి వాలును అడ్డుకొనే విధానాలను, ప్లాస్టిక్కులతో కాలువలను నింపేసిన కాలుష్య నాగరికతను కారణంగా సూచిస్తూ సాగుతుంది ఈ నవల.

విస్తృత కాన్వాస్ ఉన్నప్పటికీ సర్కారు గడ్డి నవలలో కనబడే వస్త్వైక్యత ఇందులో లోపించింది. ఇందులోనూ పాక్షికంగా దళితుల జీవితం ఉంది అని రచయితే చెప్పుకొన్నాడు. జమిందారులను సేవించిన పనివాళ్ళు ఉత్తప్ప, సాలమ్మ, బేలుదారీ మేస్త్రీ, వరద నష్టాన్ని చవి చూచిన అంబెడ్కర్ నగర్ జనం, మరణించిన ముసలవ్వ, వరదతాకిడికి ఆలుగోలైన ప్రభుత్వ బాలుర వసతిగృహపు విద్యార్థులు వీళ్లంతా దళితులే. ఇలాంటి విపత్కాలపు కష్టనష్టాలకు ముందు గురయ్యేది, బలయ్యేది వసతి సౌకర్యాలు సరిగా లేని బడుగుబలహీన దళిత వర్గాల వారే అన్నది రచయిత ఆంతర్యం. అది వాస్తవం.

ఈ క్రమంలో ఇనాక్ పూర్తిస్థాయి దళిత నవల వ్రాయటానికి మరొక దశాబ్ది కాలం పట్టింది. అది 2018 లో వచ్చిన ‘ రంధి’ అనే నవల. అగ్రవర్ణ భూస్వామ్య పెత్తందార్లకు దళితులకు మధ్య ప్రత్యక్ష ఘర్షణ కానీ, ఆర్ధిక సమస్యలు, అంటరాని సమస్యలు కానీ ఈ నవలకు వస్తువు కాదు. వాటన్నిటి ఫలితమైన , వాటిలో భాగమైన దళిత స్త్రీల పై లైంగిక వేధింపులు ఈ నవలకు వస్తువు. అది కూడా మొత్తంగా దళిత స్త్రీల అనుభవాల కథనం కానీ , కదనం కానీ కాదు. మాదిగ కోటి కూతురు సువ్వి సమస్య. ఆమెను వెంటాడిన రాముడు అగ్రవర్ణ భూస్వామ్య కుటుంబం వాడు కాదు. సంపన్నశూద్ర రైతు కుటుంబం వాడు. రాముడికి సువ్వికి మధ్య, రాముడికి సువ్వికోసం బాధపడే తల్లిదండ్రులకు మధ్య , రాముడికి సువ్వి కోసం ఆరాటపడే చందురుకి మధ్య , రాముడికి రాముడిని ప్రోత్సహించే తండ్రికి మాదిగ పెద్దలకు మధ్య ఘర్షణగా విస్తరించబడిన ఇతివృత్తం ఈ నవలది. సవర్ణ సంపన్న వర్గ పురుష దురహంకారానికి నిలువెత్తు ప్రతినిధిగా రాముడిని ఒక్కడిని నిలిపి దళితులు ఒక్కరుగానూ అందరుగానూ అతనిని ఎదిరించి విజయం సాధించటం దిశగా ఘటనలను కల్పిస్తూ నవలను నిర్మించాడు రచయిత. వేజండ్ల గ్రామం వేదికగా నవల కథ నడుస్తుంది. కథాకాలం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో ఏర్పడ్డ పంచాయతీ రాజ్య వ్యవస్థ ఆరంభ దశాకాలం అన్న సూచనను పట్టుకొని చూస్తే 1959 – 60 కథాకాలం కావాలి.

సంపన్న వర్గాల పిల్లలు ఎలా పెరుగుతారు? దేనికీ లోటు లేకుండా .. కోరినవన్నీ వస్తుంటే కలిగే అతిశయం తో పెరుగుతారు. తండ్రులు చేసే గారాబం, డబ్బుతో , అధికారంతో కల్పించే అవకాశాలు అనుక్షణం ఆధిఖ్యభావం బలపడేట్లు చేస్తాయి. దానికి కులాధిక్యత కూడా తోడైతే ఇక పట్టపగ్గాలు ఉండవు. రాముడిది అదే పరిస్థితి. తండ్రి అతడిని చదువుకు పట్నమైతే పంపాడు కానీ సదా సేవకై వెంట వుంటూ తన ఆధిక్యాన్నిమర్చిపోకుండా నిలబెట్టే జీతగాడిని ఏర్పాటు చేయటంవల్లనేమో స్నేహాలు, ప్రపంచంతో సంబంధాలు అతనికి ఏవీ ఏర్పడినట్లు లేదు. గుంటూరుకు వెళ్లి చదువుకొంటున్నా సామాజిక సమానత్వభావన అతని బుద్ధిని,హృదయాన్ని ఎక్కడా తాకలేదు. థర్డ్ ఫారం ,చదువుతుండగా తమ వూరి మాదిగవాళ్ల అమ్మాయి గుంటూరులో ఆడపిల్లల హైస్కూల్ లోఫస్ట్ ఫారమ్ లో చేరిందని రోజూ రైల్లో బడికి వచ్చిపోతుందని తెలిసి చికాకు పడటం అందువల్లనే. కులం వల్ల తక్కువది, ఆడది కావటం వల్ల మరీతక్కువది కనుక సువ్వి స్కూల్లో చేరటం , రైల్లో రావటం రెండూ అతనికి కోపకారణంఅయ్యాయి. అక్కడినుండి మొదలైంది వేధింపు.

రైలు ప్రజలందరికీ సంబంధించిన ప్రయాణ సాధనం.కులం వల్ల అందులోకి ఎవరినీ నిషేధించే వీలులేదు. కానీ అక్కడ కూడా తన అధికారం చెల్లుబాటు కావాలన్నఆధిక్య అహంకార ధోరణి అతనిది. నల్లతుమ్మ మొద్దువు అని సువ్వి శరీరం రంగును హేళన చేసాడు.తానెక్కే రైలుపెట్టెలో ఆమెఎక్కరాదని, తనకంట పడరాదని శాసించాడు. రాముడు దొరబిడ్డ .. వాడి కంట పడకుండా కాలం గడపమనే ఆమెకు తల్లిదండ్రులు కూడా చెప్పారు . ఏడాది తరువాత అనుకోకుండా రాముడు సువ్వి ఎక్కిన రైలు పెట్టెలోకి ఎక్కటంతో గొడవ మొదలైంది. అతను తిడుతుంటే తానూ ఎదురు చెప్పింది సువ్వి . అతను ఆమెను గుండెల మీద కొట్టాడు . మళ్ళీ మళ్ళీఇలాంటి ఘర్షణలు పునరావృతం అవుతూనే మరొక ఏడాది కాలం గడిచేటప్పటికి ఆమె శరీరం ముట్టుకొనటం తన హక్కు అన్నట్లు వికృతరూపం తీసుకొన్న ఆతని ఆలోచన, చర్యలు, ఆమె లైంగికతను అవమానిస్తూ మాట్లాడే మాటలు ఆమెకు భరించరానివై ఎదురు తిరగటం.. ఆక్రమంలో తన మగ కుల ఆధిక్య భావన ప్రకటనగా అత్యాచారం చేస్తానని అతను బెదిరించటం సువ్వి చదువుమాని ఇంట్లోఉండటం , బిడ్డను కాపాడుకొనటానికి పెళ్లి మార్గమని తల్లిదండ్రులు ఆరాటపడటం , రాముడి అవమానాలనుండి తనను చాలాసార్లు కాపాడిన చిన్ననాటి స్నేహితుడు చందురుని చేసుకొంటానని చెప్పటం పెళ్లిఏర్పాట్లు అదంతా ఒకభాగం.

పెళ్ళికి ముందే ఆమెను చెరిచి తీరుతానని శపధం చేసిన రాముడు అన్నంత పనీ చేసినా అనుకున్న ముహుర్తానికే చందురు సువ్విని పెళ్లాడటం తో కథ సుఖాంతం అయిందనుకుంటాం.కానీ అక్కడి నుండి దళితుల వైపు నుండి ఆత్మగౌరవ పోరాటం మొదలై మంద్రస్థాయిలో కొనసాగుతూ నవల విస్తరించింది. తీర్చుకొనటం ఇప్పుడు వాళ్ళ సమస్య. చందురు సువ్వి పెళ్ళయితే చేసుకొన్నారు. కానీ సువ్వికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీరకుండా కాపురం చేయమన్న సంకేతాన్ని కుటుంబానికి ఇచ్చారు.దళిత కుల పెద్దలకు అది చేరింది. కొడుకుకి బుద్ధిచెప్పుకొని సువ్వి విషయంలో అత్యాచారానికి దిగకుండా ఒప్పించమని ఆపెద్దలందరూ పెళ్ళికి ముందే నాచారయ్యను వేడుకొన్నారు. అతను విన్నాడు కాడు .మావాడు చేసేది చేస్తాడని బిగిసి కూర్చున్నాడు.పెళ్ళికి ముందురోజు బయటకు పోయిన పిల్లను కట్టి కొట్టి నానా హింస పెట్టి తోపుల్లో వదిలేసి పోయిన రాముడిని , రాముడి తండ్రిని అలాగే వదిలేస్తే భవిష్యత్తు భద్రత మాట ఏమిటి? అందువల్ల దళిత కులపెద్దలు కరణం మునసబులను ప్రెసిడెంట్ ను కలిసి గోడు వేళ్ళబోసుకొన్నారు. నాచారయ్య కొడుకుది తప్పనిపించి అందుకు పరిహారం అతను చెల్లించాల్సిందేనని నష్టపరిహారం అతనే స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అప్పగించి రావాలని తీర్మానం అయ్యేట్లు సంభాషణను నడిపించారు.

రాముడు మాదిగ గేరికి సువ్వి ఇంటికి రానైతే వచ్చాడు , డబ్బు ఇయ్యబోయాడు కానీ తప్పు చేశానన్న భావం అతనిలో ఎక్కడా కనబడక పోవటంతో, ఆత్మాభిమానం గల పిల్లగా సువ్వి అతను ఇచ్చిన డబ్బును తీసుకోలేకపోయింది. అట్లా అక్కడ భంగపడిన రాముడు ఆమెను చంపటానికి రెండుసార్లు వాళ్ళ ఇంటి మీదికి పోయి విఫలుడై రావటం, ఆ అవమాన పరాజయాలకు కుంగి పోవటం అదే సమయంలో భార్యకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చి ఆమెను సంతోష పెట్టటం కర్తవ్యం అనుకొన్న చందురు అతనిని దోవగాచి అపహరించి అవమాన పరచబోవటం, ఆఖరి క్షణంలో ఆమెను తాను కొట్టి హింసపెట్టిన మాట నిజమే కానీ నిజంగా చెరచలేదని చెప్పింది విని వదిలెయ్యటం , అతను రైలు పట్టాల మీద తల పెట్టి మరణించటం వరకూ కథ కొనసాగింది. సవర్ణుల ఆధిక్యత దళితుల ఆత్మగౌరవ చేతనల మధ్య ఘర్షణలో దళితుల ఆత్మగౌరవ పోరాటం అంతిమ విజయం సాధించటం నవలకు ముగింపు అనుకోవచ్చు. కానీ రచయిత అక్కడ కూడా ఆపలేదు.

ఒకేఒక్క కొడుకు మరణం తో , ఆ చావు సమయంలో తన కష్టానికి అండగా సవర్ణుల నుండి ఏ సహకారం లభించని తరుణంలో నాంచారయ్య దళితుల పట్ల స్నేహాన్ని గౌరవాన్ని ప్రకటించే స్థాయికి హృదయ పరివర్తనకు లోనైనట్లు కథను ముగింపు వైపు తీసుకువెళ్ళాడు. అయితే వర్ణపోరాటం ఒకరోజు ఒకఘటనతో ముగిసిపోయేది కాదు. నాంచారయ్య వ్యక్తి. వ్యక్తులు సందర్భాలు తెచ్చిన ఒత్తిళ్ళ నుండి మారవచ్చు.కానీ ఎంతమంది నాంచారయ్యలు మారితే ఈవ్యవస్థలో వర్ణసమానత సాధ్యమయ్యేను!? కరణం, మునసబు, ప్రెసిడెంట్ వ్యవస్థలకు ప్రతినిధులు.ఆ వ్యవస్థలు ఎట్లాఉన్నాయి? సువ్వి విషయంలో నాంచారయ్యకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటంలో -దళితులు తిరగబడదామనుకొంటే అన్నిరకాలుగా వాళ్ళమీద ఆధారపడిన తమబతుకులు ఎంత అభద్రమైనవో తెలిసిన వాళ్ళు కావటం ఒకకారణం అయితే ఓటు బ్యాంకుగా దళితులతో అవసరాలు ఉండటం మరొకకారణం. నాంచారయ్య ఎదుగుదల తమకు పోటీ అవుతుందా అన్నఅనుమానం ఇంకొక కారణం. ఆర్ధిక అధికార రాజకీయ ప్రయోజనాలు, వ్యామోహాలు నడిపిస్తే నడిచే సమాజంలో వర్ణ అసమానతల చరిత్ర , సంఘర్షణల చరిత్ర అంతులేని కథలాగా కొనసాగుతూనే ఉంటుంది.

దళిత వాడల రీతి రివాజులు, ప్రేమ పూర్వకమైన మానవ సంబంధాలు, ఒక్కరి కోసం అందరూ నిలబడే సంస్కృతి, పెళ్లిళ్ల పద్ధతి , కాటికాపరి వంటి వృత్తి జీవితాలు ఈ నవలలో కొంతవరకు కనబడతాయి. అయితే దళితవాడలో జనం ఏ ఉత్పత్తి కార్యకలాపాలలో భాగం అవుతున్నారో , ఆయా సందర్భాలలో వాళ్ళ జీవితాలలో ఎదురయ్యే సమస్యలు , సంఘర్షణలు ఎలాంటివో ఎక్కడా సూచనలేదు. సమకాలీన సమాజ పరిణామాలతో సంవాదం లేదు . ఈ నవలలో కథ మూడు నాలుగేళ్ల కాలం మీద నడిచింది . ఆ మూడు నాలుగేళ్ల కాలంలో కోటి ఇంటి ఘటనలు తప్ప ఆ వాడలో మరొక దళిత కుటుంబ జీవిత సందర్భాలు ఒక్కటి కూడా ఇతివృత్తంలో భాగం కాకపోవటం వెలితిగానే కనిపిస్తుంది.

(ఇంకా వుంది…)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

One thought on “దళిత జీవిత రాజకీయ చిత్రణలు – ఇనాక్ మూడు నవలలు

  1. ఇనాక్ అనంత జీవనం నవల గురించి తెలియజేయండి .

Leave a Reply