కదులుతున్న కాలంతో పాటు మారుతున్న సమాజ స్థితిగతులను, జనజీవన స్రవంతిని తనలో ఇమిడిచుకొని కాలాన్ని సాహిత్యం ప్రతిబింబిస్తుంది. ఆధునిక పోకడలతో మారుతున్న సమాజం సాహిత్యంపై ప్రభావాన్ని చూపింది. జాతీయోద్యమ కాలంతో ప్రభావితమైన రచయితలు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని కాంక్షిస్తూ తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. జాతీయోద్యమం, అభ్యుదయోద్యమం, భావకవిత్వోద్యమం, అనంతరం విప్లవ కవిత్వ ఉద్యమాలు వచ్చాయి. 1970లో మహారాష్ట్రలో దళిత పాంథర్స్ ప్రభావంతో తెలుగు నేలలోని సాహిత్య దృక్పథమూ మారింది. కారంచేడు, చుండూరు, పాదిరి కుప్పం, వేంపేట లాంటి సంఘటనలు తిరుగుబాటుకు బాటలేశాయి. చదువుకున్న దళితులు తమ జాతి, కుల బాధల్ని రాయడానికి ప్రేరేపించాయి. పాట, మాట, కవిత్వం కథలుగా సాహిత్యం వివిధ ప్రక్రియలో విస్తృతమైంది.
1980వ దశకంలో అస్తిత ఉద్యమాలు ఉధృతంగా వ్యాపించాయి. అప్పటికి కథల్లోకి, కవితల్లోకి రాని అంశాలను జీవితాలను సంఘటనలను, మరుగున పడ్డ విషయాలను ఎన్నింటినో వస్తువులుగా తీసుకోని, అతి సామాన్యులే కావ్యనాయకులుగా సృజన కారులు వినూతనంగా అక్షరీకరిస్తున్నారు. అస్తిత్వ ఉద్యామాల్లో దళిత ఉద్యమం, స్త్రీవాద ఉద్యమంతో పాటు మైనార్టీ వాదం పెరుగుతూ వచ్చింది. మైనార్టీలనగానే కేవలం ముస్లింలే కాదు క్రిస్టియన్లు, బుద్ధులు, జైనులు మొదలైన అల్పసంఖ్యాకులైనవారు.
నాటి చెన్నపట్నం కేంద్రంగా క్రైస్తవ మిషనరీలు అటు తమిళనాడులోని ఇటు కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని ప్రవేశించాయి. వారు వ్యాపారంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజల మనసులు చూరగొని తమ మతవ్యాప్తికి పాటుపడ్డారు. నిన్నువలే నీ పొరుగువాని ప్రేమిచుమన్న క్రీస్తు అనుసరించి జీవించేవారు క్రైస్తవులు. ఏసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రం పై తిరుగుబాటు చేసి అందరికీ సమాన ఆధ్యాత్మికతను ప్రసాదించాడు. శాస్త్రులు పరిశయ్యులను ధిక్కరించాడు. క్రీస్తువలే ప్రేమను పంచడం వల్ల క్రైస్తవము ప్రపంచవ్యాప్తంగా విస్తృతమయ్యింది. క్రైస్తవులు ఆధ్యాత్మికంగా నశించిన దానిని వెతికి రక్షించుటకు ఏసుక్రీస్తు పేరిట ప్రేమను పంచడానికి వెళ్లారు. దళితుల్ని, రోగగ్రస్తుల్ని, ఆదరణ లేని వారిని క్రైస్తవ్యం చేరదీసి ఆదరించింది.
మారుమనస్సు పొంది రక్షణ పొందుడి అన్న యేసుమాటల్నీ పెడచెవిన పెట్టి యాకోబ్ రెడ్డి అనీ, వంకయ్య చౌదరీ అనీ కొనసాగుతున్నారు. తనను వెంబడించేవారు ఉన్న ఆస్తుల్నీ వాదులుకొని వెంబడించాలనీ చెప్పిన క్రీస్తును ఆదర్శంగా తీసుకుంటూనే తారతమ్యాలను సూచించే కుల గురుతులను వాదులుకోలేని వాళ్ళు ఆస్తులను వదులుకుంటా? వదులుకోరు.
క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అగ్రవర్ణాలైనా రెడ్లు కమ్మలు మొదలైన వారు పీఠాధిపతులుగా మఠాధిపతులుగా సంఘ(చర్చి) పెద్దలుగా, కోశాధికారులుగా, ఫాదరులు, స్వాములుగా వివిధ పదవులు అనుభవిస్తూ ఎంతగానో క్రైస్తవ సంస్థల ద్వారా వచ్చే విరాళాలు, చందాల ద్వారా లబ్ధి పొందుతూ వైద్య, విద్య సౌకర్యాలను అనుభవించారు. స్వార్థాన్నీ వదిలి క్రైస్తవ సమాజానికి అంకితం చేసిన వారూ ఉన్నారు.
క్రైస్తవంలోని అట్టడుగున ఉన్న దళితుల బాధలు సమానత్వం లేక వివక్ష మాత్రం యధావిధిగా కొనసాగింది. వైద్యాలయంలోనూ, విద్యాలయంలోనూ దళితులకు సులువుగా ప్రవేశం లేదు. అన్నిచోట్ల వివక్ష ఉన్నట్లే చర్చీలలో కూడా వివక్ష ఉంది. ఐక్యతగా ఉండకుండా దళిత క్రైస్తవులు కూడా మాలలుగా, మాదిగలుగా కులాలుగా విడకొట్టబడ్డారు.
తెలుగు సాహిత్యంలో దళిత క్రైస్తవ జీవితాన్ని చాలా మంది కథకులు కథలుగా మల్చారు. వారిలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’, వేలూరి శివరామశాస్త్రి ‘వ్యత్యయం’, ‘సదాచారుడు’, కరుణ కుమార్ (కందుకూరి అనంతం) ‘పోలయ్య’, కొలకలూరి ఇనాక్ ‘ప్రకాశం పంతులుగారు’, ‘ఏడిస్తేనే ఆనందం’. చిలుకూరి దేవపుత్ర పిలాతు, బందీ; ఇండస్ మార్టీన్ ఫాధిరి గారి అబ్బాయి, మధురాంతకం నరేంద్ర ప్రార్థన, పి. చిన్నయ్య ముత్తమ్మ ఉరఫ్ మరియమ్మ సమాధి కథతో పాటు చాలామంది కథకులు క్రైస్తవ జీవితాల్ని కథలుగా రాశారు. ఈ పరంపర సతీష్ చందర్, పీవీ సునీల్ కుమార్, ఎం ఎం వినోదిని, ఇండ్ల చంద్రశేఖర్, చరణ్ పరిమి, ఎండ్లూరి మానస, మెర్సీ మార్గరెట్, చల్లపల్లి స్వరూప రాణి కథలు రాస్తున్నారు. క్రైస్తవ్యంలో రెండు విభాగాలైన ప్రొటెస్టెంట్లు కేథలిక్ సంఘాల ఆచార వ్యవహారాలను సంప్రదాయాలను పద్ధతులను ఇంకా కథలుగా రాయవలసి వుంది.
దళిత క్రైస్తవ బాధలను కళ్ళకు కట్టినట్టుగా చిత్రించిన ధార గోపి కథలే ‘గుడిసె ఏసోబు’ కథలు. ఇండస్ మార్టీన్ ‘ఫాధిరి గారి అబ్బాయి’, ఏం. ఎం వినోదిని ‘బ్లాక్ ఇంక్’ కథలు, క్యాథలిక్ చర్చి జీవితాలను పూదోట శౌరీలు ‘సిలువగుడి కథలు” క్రైస్తవ జీవితాలను ప్రతిబింబించాయి.
కింది కులాల అడ్డడుగు దళిత బహుజనుల వెతల్ని కథలుగా బతుకు చిత్రాలను దార గోపిచే రచింపబడిన గుడిసె ఏసోబు కథలలో ప్రధానంగా అగ్రవర్ణాల వారికి మరియు దళిత క్రైస్తవులకు మధ్య ఉన్న అంతరాలను బట్టబయలు చేసి తరాల అంతరాలను, వ్యత్యాసాలను వ్యక్తిగత జీవితాలను వ్యవస్థీకృత కట్టుబాట్లను మతం ముసుగులో దాగిన ఆధ్యాత్మిక సేవా వెనుక ఉన్న రహస్యాలను బట్టబయలు చేసి చూపించింది. ఈ కథలు 1988-89 మధ్య కాలంలో విద్యార్థి విశ్లేషణ పత్రికలో ధారావాహికగా ప్రచురించబడ్డాయి.
సనాతన మతమైనా ప్రేమను పంచే మతమైనా చివరికీ బీదలకు అక్షరం అందకూడదనీ, ఆశల్నీ కుట్రపూరితంగా ఎలా చిదిమెస్తారో, ఎంత అందంగా ఉన్నత కులాలవారు నిరాకరించిన వాస్తవాలు చిత్రిక కట్టిన పరిస్తితులే ఈ కథ. శక్తిని ధారపోసి నిర్మించిన కూలీల శ్రమ పరిమళమే కాన్వెంట్ స్కూల్. తన కొడుకును కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని మరియమ్మ కోరికను ఆధారం చేసుకుని పెళ్లయ్యే వరకు పాలేరు తనం చేసిన ఏసోబు తన కొడుకు పాలేరుగా మారకూడదనుకుని కాన్వెంట్ స్కూల్ కి తీసుకెళ్తుంటాడు. తోవలో తన స్థానంలో పాలేరైన యాకోబుకు తెలుపుతాడు. కాన్వెంట్ స్కూల్ కరస్పాండెంట్ పెద్దమ్మగారు లోపల కరణంతో మాట్లాడుతుంటుంది. వేచి చూసి విసిగి అలసి ఆ ఫ్లోర్ మీద కూర్చోగానే చల్లగా ఉండటం వల్ల నిద్ర పట్టింది ఏసోబుకు. ఉరుము ఉరిమినట్టుగా ఆ యజమాని పిలవగానే దిగ్గున మేల్కొంటాడు ఏసోబు. కాన్వెంట్ స్కూల్లో చదవాలంటే ఫీజు కట్టాలి. డ్రెస్సులు కుట్టించాలి. బూట్లు కొనాలి. ఇంగ్లీషులో ఇంటి వద్ద బోధించాలి. ఇవన్నీ నీతో అయ్యే పనేనా అని యజమానురాలైన పెద్దమ్మ గారు అడ్మిషన్ నిరాకరించడమే ‘కాన్వెంట్’ కథ.
ఒకానొక క్రిస్మస్ పర్వదినాన గుడిసె ముందు అందంగా తీర్చిదిద్దిన పశువుల పాక అవసరమా అని జాన్ బాబు ప్రశ్నిస్తాడు. మనమూ మన చందాలు వాళ్ళకి అవసరం. వారికి మన బీదరికం తప్పనిసరిగా కావాలి. ఆ బీదరికాన్ని చూపిస్తూ విదేశాల నుండి సంచులు నింపుకోవడం వాళ్ల విధి. అదే వారికి సమకూర్చే నిధి. వారి కాన్వెంట్లో మన పిల్లలకు చదువు చెప్పరు. దవాఖానాలో ప్రాణం పోతున్నా మందులు ఇవ్వరు. ఆపత్కాలంలో మంచి వైద్యం కోసం పట్నానికి తీసుకువెళ్దామంటే డ్రైవర్ రాడనీ, లేదనీ అనేక ఎత్తులేస్తారు. మనకు కావలసింది బీదల యేసే కానీ ఆడంబరాలతో పెద్దారెడ్డితో వచ్చే యేసు కాదనీ చెప్పే కథ ‘బీదలయేసు’లో ఒక తిరుగుబాటు కనిపిస్తుంది.
ఇక్కడి చర్చి సభ్యులను చూపెడుతూ హాస్పిటల్స్ స్కూల్లను నిర్వహించే క్రైస్తవ యజమాన్యాల వారు పిల్లల పట్ల ప్రవర్తించే తీరును మానసిక క్షోభకు గురిచేసే చిత్రహింసలను తులనాడే కథ ‘ఆ బోర్డింగ్ కు యెళ్ళను’. సహవాసగాళ్లతో సినిమాకెళ్లి ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత హాస్టల్ కి రాగానే బాలస్వామికి మరియు అతని మిత్రులకు బడితేపూజ చేస్తాడు వార్డెన్. సెలవుల్లో ఇంటికి వచ్చి నేను ఆ బోర్డింగ్ కి వెళ్ళను అని మారాం చేస్తాడు. గమనించిన జాన్ బాబు వీరి గుట్టును బట్టబయలు చేస్తాడు. అనవసరంగా పిల్లల్ని కొడుతూ హింస పెడుతున్న క్రైస్తవ విద్యాసంస్థలపై మన పేరు చెప్పి కోట్లకు కోట్లు విరాళాలు సేకరించిన విషయాలను శౌరితాతకు వివరిస్తాడు. వచ్చే సంవత్సరం మరో స్కూల్ కి వెళ్ళుదువుగాని ఇప్పుడైతే అదే స్కూల్ కి వెళ్ళమని బాలస్వామిని బుజ్జగించి పంపిస్తారు.
నిరాటంకంగా కురిసే తుఫాను వల్ల ఎన్నో కుటుంబాలు చెదిరిపోతాయి. సరైనా నివాసాలు లేని పశుపక్షాదులు జంతువులు కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ తుఫాను దరిద్రులైన బీదలు, దళిత క్రైస్తవ జీవితాల్లో నింపిన విషాదాలను వివరించే కథ ‘మాయదారి తుఫాను’. తుఫాన్ వల్ల గుడిసెలు కూలిపోయాయి. మనుషులు చనిపోయారు. తండ్రిలేని కొడుకును కాపాడుమని మరియమ్మకు ప్రార్థన చేస్తూ విరిగిన వేపచెట్టు కింద నలిగిపోయి ప్రాణాలు విడిచింది యాకోబు తల్లి. ఒకవైపు కూలిన వేప తొలగిస్తూనే మరోవైపు పాడెను సిద్ధం చేస్తున్నారు. పెడ్డారెడ్డి కూలిన చెట్లను అధికం చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభుత్వ అధికారులకు. ఆ అధికారులు ఈ దళిత క్రైస్తవవాడలోకి రాలేదు. కొంతసేపటికి సాములోరి జీపు వచ్చింది. మేం బతికినమో లేదో చూడడానికి వచ్చారా స్వామి అని శౌరితాత వెటకారంగా అన్నాడు. తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం కూలిన గుడిసెలకు తాటాకులు ఇస్తామని ఆ వివరాలు రాసుకొని పంపితే వచ్చాము. మీరేమో పూట గడవడం కోసం డబ్బులు లేదా పప్పులు అడుగుతారు. మీకు ఇంత పొగరు కాబట్టే ఆ ఊర్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు అని వెళ్ళిపోయారు స్వాములోల్లు ఇద్దరు.
తుఫాను బాధితులకు ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద ఇస్తే అధికారులు కేవలం రెండు వందల రూపాయలు అందిస్తారు. మా డబ్బులు మాకు కావాలని నినదించినందుకు లాఠీ చార్జి పాలయ్యారని సమాధానం చెబుతారు. దళిత క్రైస్తవులకు ఆపత్కాలంలో వచ్చిన సొమ్ము అధికారులు ఇవ్వరు. క్రైస్తవులు అని గుచ్చి చెప్పే సాములోరు ఆదుకోరు. పైగా మీరు పొగరుబోతులనీ, అహంకారులనీ అసహ్యించుకుంటారు.
నేనైతే కచ్చితంగా అమ్మగార్లపై జరిగిన అన్యాయాన్ని ఖండిస్తా. అంతేకాదు దోషులు పట్టి శిక్షించే వరకు క్రైస్తవ సంస్థలను బందు పాటించాలని అంటాను. మనకు మన మతానికి అన్యాయం జరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటాం. ఇకపోతే ఇదే సమయంలో అమ్మగార్ల అందరినీ ఇంకో మాట అడుగుతాను అదేమంటే దేశంలో అనేక చోట్ల రోజూ ఎంతో మంది ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగుతుంటే ఒక్క అత్యాచారాన్ని మీరు ఖండించారా? ఏ అత్యాచారం గురించి అయినా న్యాయ విచారణ కోసం బందు పాటించారా? గురువులకు కూడా ఇంకో ప్రశ్న దళిత క్రైస్తవులపై ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఒక్కరోజైనా నిరసన తెలిపారా? అని జాన బాబుతో అందరూ తిరుగుబాటును ప్రకటించిన కథ ‘అమ్మగార్లేనా మనుషులు’. ఈ కథలో కారం చెడు చుండూరు సంఘటనలు కూడా పాత్రుల ద్వారా చర్చించారు.
వద్దని వారించిన బోర్డింగ్ కు వెళ్ళనని మొరపెట్టుకున్న బాలస్వామి చివరికి తన అలవాట్లను మార్చుకోలేక హాస్టల్ లో చేరాడు ఒకఅర్ధరాత్రి. అప్పటికే పలుమార్లు వార్డెన్ హెచ్చరించినా, కొట్టిన వినకుండా మళ్లీ దొరికిపోయాడు బాలస్వామి. అందరి సమక్షంలో గుండు గీకి దుర్మార్గంగా అవమానించాడు వార్డెన్. బాలస్వామికి పట్టిన గతే అందరికీ పడుతుందని గుణపాఠం చెప్పడానికి ఇది చేస్తున్నానని మరి చెప్పాడు. అంతటితో ఊరుకోకుండా మీ అమ్మానాన్నలు తీసుకురమ్మని పంపిస్తే ఒక డ్యామ్ లో పడి చనిపోయాడు బాలస్వామి. చచ్చిపోయేంత అవమానం ఒత్తిడితో జరిగిందా ఎందుకో తెలియాలంటే తప్పకుండా ‘మీకోసం మీ పిల్లల కోసం’ కథ చవాల్సిందే.
దళిత క్రైస్తవ బాధల్ని వివక్షల్ని చర్చకు పెట్టాయి ‘గుడిసె యేసోబు’ కథలు. ఈ సంకలనంలో ఏడు కథలే వున్నప్పటికీ అట్టడగు క్రైస్తవ వ్యథలను విశేషంగా చిత్రించాయి. ఈ పుస్తకాన్నీ ప్రచురించిన దళిత స్త్రీ సాహిత్య పరిషత్ కన్వీనర్ లీలాకుమార్ మానవత్వం గుండెకాయలేని మతం మృతమైనదనీ అంటారు. ఈ కథల ద్వారా వెల్లడైన విషయాలను. వాస్తవాలను స్వీకరించి సంస్థలు, స్వాములు ప్రక్షాళన చేసుకుంటే మంచిదనీ.. ఆరోగ్యకరమైన మానవత్వం అనీ ఈ కథలు గొప్ప సందేశం అందించాయి.