దళిత కథా చిత్రణ – బహుజన బతుకమ్మ

ప్రకృతిని సేవించే సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం. బతుకమ్మ అంటే తెలంగాణ ఆత్మగౌరవ పతాక. మానసిక ఉల్లాసం కలిగించే మానవతా వేదిక. సంస్కృతి ప్రతీక. అన్నింటికి మించి ఆడపడచుల ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, బౌద్ధిక నిర్మాణాత్మక ఆత్మల నివేదన. అంతరంగావిష్కరణ. ప్రకృతి ఆరాధన సింధూ నాగరికత కాలంలోనూ ఉంది. ప్రస్తుతం బతుకమ్మగా పూజాలందుకుంటుంది.

ఆటలతో పాటలతో అలరించే ఆత్మగల్ల వేదికలో అంటరాని తత్వముందా? ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే సంఘటనలు కోకొల్లలు. అక్షరాలు నేర్చిన బతుకుల్ని, అవమానాల్ని అక్షరబద్ధం చేస్తున్న దళితులు, దళితేతరులు సహానుభూతితో బాధల్ని వెళ్లబోసుకుంటున్నారు.

ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి మహాలయ అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజులపాటు తెలంగాణ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తెలుగు ప్రజలు అట్టహాసంగా జరుపుకునే పండుగ బతుకమ్మ.

బతుకమ్మ పండుగను మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవ రోజున నాన బియ్యం బతుకమ్మ, అయిదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆరోజు బతుకమ్మకు నైవేద్యం సమర్పించరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, ఆడంబరంగా జరుపుకునే కీలకమైన పండుగ రోజు సద్దుల బతుకమ్మ. తొమ్మిదో రోజున జరుపుకొని చెరువు లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.

బహుజన బతుకమ్మ అంటే సబ్బండ కులాలు, సబ్బండ ప్రజలు కలిసి ఆడే అంటుముట్టు లేని సమానత్వంగా పేర్కొనవచ్చు. కొన్ని కులాలు ఎందుకు ఆడుతున్నాయి కొన్ని కులాలు ఆడట్లేదు ఎందుకు?

దళితులు ఏ స్థాయిలో ఉన్నా వారిని కుల వివక్ష పెనుభూతమై వెంటాడుతుంది. అవమానం, నిందలు ఎన్నింటినో భరించిన దళిత జీవితాలు అనాది కాలం నుండి లిఖితం చేయలేకపోయాయి. అక్షర జ్ఞానాన్ని పెంపొందించుకున్నా దళితులు తమ బాధల్ని గాథలుగా లిఖిస్తున్నారు.

అవమానం నిందలు ఆరోపణలు అతి సహజంగా దళిత కథలో వస్తువులయ్యాయి. అక్షరాలను చదివి జీవితాన్ని పట్టిస్తున్న దళిత దృక్పథం అలవర్చుకున్న కథకులు బతుకమ్మ వద్ద జరిగిన అవమానాలను, సంఘటనలను సన్నివేశాలు తమ ఇతివృత్తాలు చేసి ఆత్మలను ఆవిష్కరిస్తున్నారు. నా దృష్టికి అందినవి కొన్ని మీతో పంచుకునే ఒక చిరుప్రయత్నం.

 1. జూపాక సుభద్ర కథ “గద్దెత్కపోయిన బతుకమ్మ”

మాదిగతనాన్ని వ్యక్తపరిచే ప్రముఖ రచయిత్రి. వక్త. వీరి కథ సంపుటాలు. ‘రాయక్క మాన్యమ్’, రిజర్వేషన్ భోగి’.

చెరువు కట్టమీద బతుకమ్మ ఆడుతున్నప్పుడు ఊరి సర్పంచి దేవవ్వ అన్ని బతుకమ్మలను చూస్తుంటుంది. అలా గౌండ్ల కులపోల్ల బతుకమ్మ గుంపు దగ్గరికి వస్తది. గౌండ్ల రామన్న దేవక్కను ఉద్దేశించి “మీవోళ్ళు గా కింది మొఖాన ఆడుతుండ్రు. గీడెందుకు ఉన్నవు? అని ప్రశ్నిస్తాడు.

దేవక్క సర్పంచ్ కాబట్టి ఆమె ఎక్కడైనా ఆడుతుందని యూత్ వీరేశం మాటలకు గౌండ్ల రామన్న ఆమె బతుకమ్మకి సర్పంచా? ఎవతో గర్కాసి చేసిన పనులకు ఆల్లు బతుకమ్మ ఆడరు అని దెప్పి పొడుస్తూ ఉంటాడు. పుండు మీద కారం చల్లి నట్లు గౌండ్ల రామన్నకు మద్దతుగా మీకు బతుకమ్మ లేకపోయినా జిద్దుకు ఆడవడ్తిరి. గీ పాపానికి నీళ్లు లేక కరువు వస్తుంది. అని రాయ పోశయ్య సుతి కలిపిండు.

మాయి పాపాలా? అని ఎదురు ప్రశ్నించిన దేవక్కకు సామి మద్దతు పలుకుతడు. కోపంతో ఈగో ఏల్లన్ని ఒక్క తీరుగా లేవు తమ్మి చిన్న అంత్రం. పెద్ద అంత్రం చూడాలి. ఇది పద్ధతి కాదు అని సాల రాజయ్యన్నడు. సర్పంచ్ మీ వాళ్ళని గింత ఉచ్చిలి పాటా? బాలకృష్ణ.

మాకాట బతుకమ్మ లేదట. ఈనింట్ల బతుకమ్మను ఎత్తుకుపోయి ఆడినట్టు కళ్ళల్లో మంటలు పెట్టుకుంటుండ్రు అని తిడుతూనే అందరినీ సముదు చేసింది. దేవమ్మ తెలంగాణ పార్టీ. పార్టీ పిలుపు మేరకు అందరూ వివక్ష లేకుండా బతుకమ్మ ఆడారు. ఇప్పుడిదేంది?

రంగయ్య పటేల్ కు ఊరు పెద్దమనుషులకు దేవక్క పంచాయతీ చెపుతున్నది. అసలు గుట్టు విప్పుతున్నది. మాతోని పనులు చేయించుకునే కాడ కులం లేదు. మేం ఇచ్చిన బతుకమ్మ పూలకు కులము లేదు గని మేం బతుకమ్మలను ఆడుకునే కాన్నే కులం తక్కువ అయిందా? మేము ఏమన్నా మీతో కలిసి ఆడుతామా అన్నది.

మాదిగ, మన్నెపోల్లనే కాక డక్కలి, చిందు, మాస్టి, బైండ్ల ఆడోళ్ళ అందర్నీ కూడా ఏగేసి బతుకమ్మలు పట్టించి డప్పులతోని చెరువు కిందికి పయనం చేయించింది. చూసినవా దేవమ్మ ఎంత పని చేసిందో? అని వాళ్ళని చూస్తూ ఊరు గుసగుస పెట్టుకుంది. ఈ లొల్లిలో మీరు ఎందుకని దేవక్క తన అత్తను బిడ్డ స్వాతితో ఇంటికి పంపించింది.

స్వాతి తన నాయనమ్మ నర్సవ్వను మనకెందుకు బతుకమ్మ లేదనిఅడిగింది.

మన గూడెపు ఆడామె దొరసాని బతుకమ్మకు పూలు తెంపుకొచ్చి ఇచ్చి ఇంటికి వచ్చే వరకు పొద్దంగిదాట. పూల తోటి బతుకమ్మని పేర్చి తీసుక పోయేటప్పుడు పలారమ్ ఏం లేదని దొబ్బ తున్కను పెట్టుకొని ఇదేమన్న తినకూడందా అనీ బతుకమ్మను చెరువు కాడికి తీసుకుపోయింది. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో గద్ద దొబ్బను ఎత్తుకొని పోయింది. బతుకమ్మ ఆడద్దని ఊరంతా తీర్మానం చేసిండ్రట. ముచ్చట గది అని చెప్పింది.

గాయింతదానికి వద్దంటరా? గాల్లెవరు అడ్డం వచ్చినా మేమైతే గీ బతుకమ్మ ఆడుతూనే ఉంటం అని స్వాతి అనడంతో కథ ముగుస్తుంది.

 1. పి. చిన్నయ్య కథ ‘అంటరాని బతుకమ్మ’
  ఈ కథ 18 – 10 – 2015 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది. కథ – 2015 ఎంపికైన కథ. వీరి కథా సంపుటి ‘పయిలం’.

పద్మ నరేష్ దంపతులు. వద్దనంగా పద్మ బతుకమ్మ ఆడానికి పోయి తన స్నేహితుల ఆబాసుపాలవుతుంది. బతుకమ్మ పేర్చేవరకు తనతో ఉన్న మిత్రులు గౌండ్ల సరిత, సాకలిలక్ష్మిల వద్దకు బతుకమ్మతో వెళ్తున్నప్పుడు సరిత అత్త మీ వాళ్ళతో ఆడుకో అని అన్నది. సరిత కూడా నువ్వు బతుకమ్మ మా గుంపులో వెడితే మా వాళ్ళు ఎవరు ఉండరు. మీతో ఆడరు. ప్లీజ్ పద్మ నువ్వు మీ వాళ్ల దగ్గరికి వెళ్ళు అని అవమానం చేస్తారు. అక్కన్నే బతుకమ్మ ను పలుగ గొడుదామనుకున్నది పద్మ.

వెనుదిరిగిన పద్మ నరేష్ కు భోజనం వడ్డిస్తూ మరీ ఇంత దారుణమా అని అక్కసు వెల్లగక్కుతూ ఉంటుంది. నరేష్ దోస్తు దుర్గయ్యకు చెబుతూ ఉంటాడు. మీకన్నా బతుకమ్మ ఉందిగాని వడ్డెర వాళ్లకు బతుకమ్మ ఉందా? మేము ఎవరి మీద అలగాలి అని ప్రశ్నిస్తాడు.

మరో మిత్రుడు గౌస్ వచ్చేవరకు ఇంటెనుకకు పోయి కూర్చుని గతంలో వీరు సానుభూతిపరులుగా ఉన్నప్పుడు చేసిన పనులు నెమరేసుకుంటారు. ఆర్.ఎం.పి భార్య కాపొల్లు, కుర్మోళ్ళు, గౌండ్లోల్లతో బతుకమ్మ ఆడింది. తర్వాత దళితులని తెలిసినందుకు వారి సామాను బయటి వేసి కొడదామని చూస్తున్నప్పుడు వీళ్లే అడ్డుపడుతారు.

రైతాంగ పోరాట సానుభూతి పరుడైన శేషయ్య పంతులు ప్రోత్సాహంతో అన్నల ప్రభావం ఉన్నప్పుడు దళిత ఎల్లవ్వ పాటల తోటి బతుకమ్మలు ఒక వేదికపై ఆడిపాడాయి. అన్నలకు ఎదురు చెప్పలేక దళితులు కూడా గ్రామ పంచాయితీ వద్ద బతుకమ్మ ఆడారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉంది అని చర్చించుకుంటారు. మీకెందుకు లేదు బతుకమ్మ అని నరేష్ ను దుర్గయ్య అడిగిండు.
ఆవు పుర్రెల బతుకమ్మ తీసుకపోతే .. దండెం మీది తూన్కలు పలహారముగా తీసుకపోతే ఊరోళ్ళు వద్దని కట్టడి చేసింది.
కరువుల ఉన్న తబుకు అమ్ముకున్నందుకు.. వివరిస్తాడు.

గౌస్ వస్తూనే గింత ఘోరమా? అని అతడు చూచినది విన్నది చెబుతూ నిన్న సద్దుల బతుకమ్మ పండుగకదా తెలంగాణ వచ్చిన సంబరంతో ఎప్పుడూ లేనిది మాల మాదిగలు వాళ్ల వాడల నుండి గ్రామపంచాయతీ దగ్గరకి వచ్చారు బతుకమ్మతో. ఇక్కడ ఆడకూడదని పై కులపోళ్లు. మీరు ఆడితే మా బతుకమ్మ మైల పడుతయని బండ బూతులు తిట్టారు. పోలీసులు వచ్చి దళితులకు సర్దిచెప్పి చెరువులో బతుకమ్మను వేయించారు. దళితులను పనుల్లోకి పిలవద్దని ఊరి పై కులపోళ్లు చేసుకున్న తీర్మానాన్ని గౌస్ చెబుతుండు.

అందరం పూలతోనే బతుకమ్మ చేసినం వాళ్లది బంగారు బతుకమ్మ ఎట్లయ్యె? మనది అంటరాని బతుకమ్మ ఎట్లయ్యె? ఇప్పటి సంధి ప్రదర్శనలకు రమ్మని ఇవ్వడం వచ్చి అడిగితే చెప్తా వాళ్ల సంగతి?.. అని కోపంగా అన్నది పద్మ. గిదే మాట మీద ఉండు అని నరేష్అన్నాడు.

 1. చిత్తలూరు సత్యనారాయణ కథ ‘బతుకమ్మలు వాలిన చెట్టు’.

అనేక కథల పోటీలలో గెలుపొందుతున్న వర్తమాన యువరచయిత. ఈ కథను రచయిత నోస్టాల్జియాలో రాస్తాడు. ఈ కథ విశాలాంధ్ర పత్రిక దీపావళి ప్రత్యేక సంచిక 2017 లో ప్రచురితమైంది. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి కానీ కులాల మధ్య గుంపుల మధ్య మనమంతా ఒక్కటనే సమానత్వం రావడంలేదని వ్యక్తీకరించిన కథ ‘బతుకమ్మలు వాలిన చెట్టు’.

తన బాల్యంలో చూసిన బతుకమ్మ కొన్ని కులాలు కొన్ని గుంపులుగా ఆడేవారు. దాదాపు 20 సంవత్సరాలు గడిచి ఆధునికత ఎంతో సంతరించుకున్నప్పటికీ ఆటలో మార్పు రాలేదు. అసమానతలలో మార్పులేదు. రాకపోగా కులాలు ఉప కులాలు గ్రూపులు తగ్గాల్సిందే పోయి వీధికో సమూహం. కులానికో గుంపు అన్నట్లుగా స్థిరపడుతుంది. ఇది వివక్షకే కదా దారి. అక్షరాస్యత పెరగటం వల్ల సమాజం పురోగతి చెందాల్సింది పోయి తిరోగమన దిశలో ఉన్నదనే విషయాన్ని వేదనా భరితంగా వ్యక్తీకరిస్తారు. ఎప్పటికైనా తను కులాలు ఉపకులాలు గుంపుల వ్యత్యాసము లేని బతుకమ్మ పండుగను చూస్తానా? అని అంతరాల దొంతరల లేని సమాజం కోసం ఆరాటపడుతుంటాడు. అలా అందరూ వొచ్చి బతుకమ్మలై ఎప్పుడు వాలుతారోనని కలలుకంటాడు రచయిత.

 1. డా. గడ్డం మోహన్ రావు కథ ‘ఎంగిలి పూలు’.
  మోహన్ రావు దృక్కోణం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. తొలి చిందు నవలా రచయిత. మాదిగ ఉప కులాలకు చెందిన రచయితకు తొలి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత కావడం దళిత జాతికి గర్వకారణం.

ఈ కథలో ప్రేమించి పెళ్లి చేసుకునే దళితుల వల్ల జీవితం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పే కథ. ఈ కథను చదివితే తమ బిడ్డల వైధవ్యమిచ్చే తండ్రులకు జ్ఞాన బోధ చేయించే కథ. ఈ కథను ఆచరిస్తే ప్రణయ్ లాంటి సంఘటనలు రావంటే రావేమో అనిపించకమానదు. ఈ కథ వివిధ కాలాల సమాహారం.

చెరువు కింద ఉన్న చిన్న మల్లల్ల వివిధ కులాల వాళ్లు సహా బతుకమ్మ ఆడుతున్నారు. సింధు మల్లమ్మ ప్రవళికలు ఆట చూడడానికి వచ్చారు. తదనంతరం పంచే పలారం కోసం ఎదురు చూస్తున్నారు. నాయనమ్మ బతుకమ్మ మనకెందుకు ఉండదు అని ప్రవళిక అడిగింది. సమాధానం చెప్పలేని మల్లమ్మ నెత్తి గోక్కున్నది.

ఊల్లే మాల మాదిగ ఇండ్లల్లకెళ్ళి తాటి చెట్ట ఎత్తంత మంటలు. మాదిగలే కాలిపోయారు. అనుకుంటా ఉరుకులు పరుగులు అది మాదుగులది కాదు. చిందు గణపతిది.

పటేల్ బాలమ్మ “ఎట్లా అయింది రా? ఏమైంది రా?” అని అడిగింది ఎలకల కోసం పిల్లి దుంకినట్లు ఉన్నది. దీపం మొత్తం కాలవడ్డది.

పటేలా నీకు దండం పెడత. ఆడు సచ్చిపోతడు. నీ కాళ్లు మొక్కుతా అని దయాకర్రెడ్డి కాళ్ల మీద పడ్డది చిందోళ్ళ పార్వతమ్మ
భీమ్ రెడ్డి ఆరాదీస్తడు.

ఈ అడుక్క తినే లంజకొడుక్కు పటేలమ్మ కావాలంట. ఇంకా నాలుగు తగిలిస్తే మాదర్ చోత్ గానికి. సావదెంగుతుంటివి అని అంటడు.

నన్ను ఎటుదొరికితే అటు తిడుతావురా? చిందుగణపతి గాని తమ్ముడు చెంద్రిగాడు నా బిడ్డ గంగ మీద మనసుపడ్డడు. ఇయ్యరమయ్యర కొట్టిన. తెల్లారేవరకు ఆళ్ళ గుడిసెలు కాలవెట్టిన. ఆస్తి ఉన్నదని ఇచ్చి పెద్దబిడ్డకు పెళ్లి చేస్తే వాళ్ళకు ఎయిడ్స్ వొచ్చింది. అయిదెండ్లల్ల ఇద్దరు సచ్చిపోయిరి. చిన్నది రమాదేవి మ్యానపిలగానికిస్తే బుద్ధిమాంద్యం పిల్లలు పుట్టిరి. ఏం సుకమున్నది?

ఎమ్మెల్యే బిడ్డ పెండ్లిల గంగను చూసిన. అన్నాల కాడ సూసిన. గంగ భర్త కామారెడ్డి కలెక్టర్. సుట్టూ గన్మెన్లు ఉన్నరు. నేను గమనించిన. వాళ్ళ దోస్తుతో మాట్లాడుతూ కులంచెడ్డా సుఖం దక్కింది. దొరసానిలెక్క ఇంటినిండా పనిమనుషులు. బంగ్లాలు, కార్లు … మంచిగుంది లైఫ్ అని చెప్పుతుంది.
చెంద్రిగాడు కలెక్టరయ్యిండానే అని దయాకర్ రెడ్డి అడిగితే చంద్రిగాడు అంటవేంరా? కలెక్టర్ ను పట్టుకొని అన్నడు. … అంటతియ్యే అని దయాకర్ రెడ్డి.

 1. డా. సిద్దెంకి యాదగిరి ‘అంటరాని బతుకమ్మ’:
  ఈ కథ ముల్కనూరు ప్రజా గ్రంథాలయం మరియు నమస్తే తెలంగాణ సంయుక్త నిర్వహణ 2019 ప్రోత్సాహక బహుమతి గెలుచుకుంది. వీరు రాసిన కథలు అనేక పోటీలలో గెలుచుకున్నవి. వీరికథా సంపుటి ‘తప్ష’.

కొంతమంది యువకులు కలిసి తేవాలనుకున్న మార్పునే సూచించే కథ. ఇంకెన్నాళ్ళు మనోౡల్లు బతుకమ్మ ఆడోద్దు. ఇంకేన్నేళ్లుచూస్తరు. వాళ్లెవలో ఆడుతుంటే మనోళ్ళు అనే ఆలోచన చేసిండ్రు. ఆ క్రమంలో పెద్దమనుషులను పిలిపించి యూతు అడుగుతుంటే ఎన్నెన్ని ప్రశ్నలో.

పోరాగాండ్ల పరాసికాల? పిలగాండ్ల మాటలా? భక్తి నిలుపకపోతే బతుకాగమైతది అని పెదమనిషి మైసయ్యన్నడు. హిందూ మతం ని ఇదిసిపెట్టిండు. లేంది ఎందుకు? ఒక అంబేడ్కరిస్టు యాదగిరి అంబేద్కర్ని మొక్కుడే. బతుకమ్మ లేదంటే తొక్కుడే అని ఒకప్పటి సానుభూతి పరుడు చిన్నరాజయ్య.

హిందూ మతం కాదు. అంబేద్కర్ణి తక్కువ చేసుడు కాదు. పూల పండుగ మనదే అని అందరినీ ఒప్పించి మెప్పించిన మహేశ్, రాజు, మునెందర్లూ కలిసి పండుగకు ముందునడిసిండ్రు. ఎంగిలిపూలనాడు గంగానీళ్లు తేవడానికి నూటయాభై కిలోమీటర్లు బైక్ మీద ధర్మపురికి వెళ్ళి తెచ్చారు.

అవి సేనుసేనుకు అలసట కోసం పాడిన పాటలు కావు. రాగాలు ఎత్తుతుంటే వంద కోయిలలు పాడుతుంటే వెయ్యి రామ చిలుకలు కోరస్ అందిస్తున్నట్లు పాటలు. నిర్బంధంలో బావయ్యో ఒక్కసారి ఒచ్చిపోవే అనే పాటలు పాడినకాడ అందుకో దండాలు అంబేద్కర అని సుతి కలిపారు. రాగాలకు రాళ్ళు కరుగుతయో కరుగవో కతనీ బతుకమ్మ వేయొద్దన్న మనసుల్నీ కరిగిచ్చినయి.

జండాకాడ ఇన్నోద్దులు అంటరాని బతుకమ్మ ఇప్పుడు అన్నీ కులాల బతుకమ్మను హత్తుకుంది. దొబ్బ ఎత్తుకపోలే, దోర్నమ్ ఎత్తుకపోలే. ఒక్కడు తొవ్వదీస్తే పదిమంది నడుస్తరు. బుద్ధి పుట్టిచ్చిన బతుకమ్మ అందరినీ సల్లగా సూస్తది అని మైసయ్య మురిసిపోతండు. వాగుల ఒకరికి ఒకరు చెక్కరి కుడ్కలు పోసుకున్నట్లు వోయినాలు తింపుతున్నరు. సెల్ఫీలు, ఫోటోలు. వీడియోలు సంబూరం అంబరాన్ని తాకుతుంది. ఒకర్నొకరు అభినందిచుకుంటున్నరు. ఫేస్ బుక్, యూట్యూల నింపుతున్నరు. మొగుల్లల్ల నీళ్ళు దెచ్చినట్లు.

పై ఐదు కథలలో కథా వస్తువు బతుకమ్మ ఒకటే అయినప్పటికీ ఒక్కొక్క రచయిత దృక్పథం ఒక్కో విధంగా ఉన్నాయి. కథనం ఎవరి శైలి వారిది.

వర్ణన: శెరువు సుట్టూ గుంపులు గుంపులుగా సిల్కు సీరెలు, పూల సీరెలు సప్పట్లతోటి, పాటలతోటి శేరువు నీల్లుగూడ తపుకు తపుకు మనుకుంట దరువు గలుపుతున్నయి. ఊరుకు వాడకు తేడుందే. కొత్తసీరెలు కట్టుకొని బతుకమ్మాడితే కండ్లల్ల ఉచ్చపోసుకుంటుండ్రు. దొబ్బ బతుకమ్మ పక్కపొంటి గాకుంట టిఫిన్ల పెట్కపోతే గద్దెత్కపోకపోవులాంటి వర్ణనలు జూపాక సుభద్ర గారు ప్రయోగించారు.

“అందరూ తెలిసినోల్లే గదానుకుంటి మనసుల ఇంత విషం ఉంటాడనుకుంటే బతుకమ్మ చేసేదాన్నే కాదు. “వాళ్ళకు కావల్సిన తెలంగాణ వాళ్ళకొచ్చే” అని పాత్రల వ్యక్తీకరణ కొట్టొచ్చినట్లు స్థానికతను పి . చిన్నయ్య.

తంగేడు చెట్లన్నే విరగబూసి తంగళ్ళపల్లికి కొంత అందాన్ని తెచ్చినయి. ఊరి మెడను బంగారంతో సింగారించినయి. పాటల ఊట సెలిమేలు ఉబికి వస్తున్నయి. తాటిచెట్టంత మంటలు.

అంబేడ్కర్ ఎత్తిన చూపుడు వేలులా రాజు చక్కగా నిలవడ్డడు. మరుపురాని మధుర చిత్రాలను అతికిస్తున్నారు. ఆకలి తీరక ముడుసు బొక్కలు ఉడుకపెట్టుకొని తిన్న బతుకు మనది. పొంగుతున్న గంగాల మూడు మునుగులు మునిగిండ్రు. రాగాలకు రాళ్ళ మాటేమో కానీ బతుకమ్మ వద్దన్న మనసులు కరిగినాయి. మొగులుమీద చంద్ర దీపం పెట్టినట్లు అందరి మోకాల్లో సంతోషం. చరిత్ర శిథిలాల్ మీద నిట్టాడు ఆనందపు శకలాల జ్ఞాపకాలను పేర్చుతున్నారు లాంటి ఉపమానాలతో సిద్దెంకి తన కథలో స్థిరపరిచాడు.

భాష – పలుకుబడులు: దళితుల ఏ సాహిత్యపు కొలతలకందది. అది నికార్సైన జీవితపు విలువలకు మాత్రమే అందుతది. కో.కు అన్నట్లు కథకు జీవితమే ముడిసరుకు. దళిత భాషలో సౌందర్యము కొట్టొచ్చినట్లు కనబడే టట్టు ఈ కథకులు ప్రతిష్టించారు.

శెరువు కొమ్ము. గర్కాసి, కడుపుల గడ్డపారాలు దిగేసినట్లయ్యింది. ఏ ఎవ్వడే లేదని సెప్పింది వానవ్వందెంగ. వూరు గీసగిస గొట్టుకున్నది. కడుపు కుతకుత వుడికింది. నీల్లారగియ్యాలే. పలుకుబడులను జూపాక ఎత్తిపట్టి రాసింది.

మీటింగులకు పోయి పోయి కుల్పోళ్లతోనే ఆడాలనే సోయి లేకుండే. అప్పుడప్పుడే చీకట్లకు పోయిండ్రుమొదలైనవి ఈ కథ్ల్లోకి పి. చిన్నయ్య తీసుకొచ్చాడు.

బియ్యెదాకా సదివి బియ్యముల్లా ఏలుతుండు. కులంచెడ్డ సుఖం దక్కింది. ఈ అడుక్కతినే లంజెకొడుక్కు. దెంకపోయింది. సావదెంగుతుంటి. నెత్తి నోరు కొట్టుకుంటా మొత్తుకుంటున్నరు. మాదర్ చోత్ గానికి కులనుడికారాల ప్రయోగం మోహన్ రావుది.

గుండెల దమ్ములెనోడు పొద్దక పోయిరాళ్ళు పొందిచ్చిండాట. అగ్గిమీద గుగ్గిలం. నడుమంత్రాన నాలుగెంటికలు వొచ్చినవ్వ ఎగేసి ఎగేసి ఏడు కొప్పులు పెట్టిందట. ఉన్నంతల కాళ్ళు సాపుకొని బతుకాలే. ఆరాటంగాళ్ల అప్పతొర్ర. ఎప్పుడొచ్చినవు చిప్ప తొర్ర. ఉరికురికి పసుల కాస్తే పోద్దూకుతాది? లాంటి ప్రయోగాలు సిద్దెంకి తన కథలో చేశాడు.

జూపాక సుభద్ర, పి. చిన్నయ్య రాసిన రెండు కథల్లో అసలు శత్రువులనోదిలి సూద్దరోల్లే ప్రధాన శత్రువులుగా చిత్రించారు. నిజమే కానీ అందుకు ఎవరి భావజాలం తోడైందో స్పృశించకపోవటం ఆలోచించదగ్గ విషయం. కనపడే వారిని మాత్రమే పగదారులుగా పసిగట్టారు. కనపడని వారి పైన కాసింత కన్నెస్తే బాగుండు. అప్పుడేకదా బహుజనం ఏకమయ్యేది?

ఏదేమైనప్పటికీ ఇవి అసమానతల తలపై అక్షరాసుత్తేలతో బాదిన అనుభావాలు, తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే కథలుగా మిగిలిపోయాయి. అయినప్పటికీ ఇంకా రాయాల్సినా దృక్కోణాలు మిగిలి ఉన్నాయి.

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

4 thoughts on “దళిత కథా చిత్రణ – బహుజన బతుకమ్మ

 1. చాలా బాగుంది అన్న ధన్యవాదాలు

 2. అన్నా మంచి పరిశోధనాత్మక వ్యాసం. హృదయపూర్వక అభినందనలు. నిజమే ఈ అంశంపై ఇంకా అనేక కథలు రావాల్సి ఉంది.

 3. బాగుంది అన్నా
  చక్కని విశ్లేషణ మీ శైలి ప్రత్యేకత
  చాలా బాగుంది
  శుభాభినందనలు

 4. వ్యాసంలో చాలా విలువైన విషయాలు చెప్పారు

Leave a Reply