దళితబహుజన వాదం – దళితబహుజన సాహిత్య విమర్శ

దళిత,బహుజన సాహిత్యానికి ఒక సిద్ధాంతం గానీ పూర్తిస్థాయి విమర్శ విధానం గానీ లేదని అంటూ ఉంటారు కొంతమంది. వీరిలో సీరియస్ గా సాహిత్య అధ్యయనంలో ఉన్నవారూ వున్నారు. వీరికి స్పష్టత ఇవ్వడం కోసం ఈ ప్రయత్నం.

  1. ‘దళిత’నుంచి ‘బహుజన’ దాకా జరిగిన ప్రయాణం

పైన శీర్షికలో సూచితమైనట్లు దళిత వేరు, బహుజన వేరు కాదు. బహుజనుల్లో దళిత కూడా ఒక భాగం. బహుజన ఉద్యమం అంటే మొత్తం ఎస్సీలూ, ఎస్టీలూ, బీసీ లూ, ముస్లిం, మైనారిటీలూ కలిసి జరిపే ఉద్యమం అని ఈనాటి బహుజన వాదుల అవగాహన. ఈ సామాజిక శ్రేణులు సాహిత్యం లో సాగించే ఆచరణ బహుజన సాహిత్యోద్యమం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 1980ల నుంచీ 2000వరకూ కుల,మత పీడితులందరూ దళితులే అనే అవగాహన నడిచింది. కారంచేడు ఉద్యమం లో భాగంగా సాగిన దళిత మహాసభ ఎస్సీ,ఎస్టీ,బీసీ,ముస్లిం, మైనారిటీలంతా దళితులే అని నిర్వచించింది. ఈ మేరకు ఎస్సీలయిన కత్తి పద్మారావూ, బొజ్జా తారకం లతో పాటు బీసీ అయిన భీరం మస్తాన్ రావూ, ఇంకా మైనారిటీలకు చెందిన నాయకులు దళిత మహాసభ నాయకులుగా వున్నారు. అయితే ఆ తరవాతి కాలంలో కంచ ఐలయ్య లాంటి మేధావులు ఈ అందరినీ కలిపి ఓకే మాటగా దళితబహుజన అని పిలవడం మొదలు బెట్టారు. దీని బదులు ఈ అందరినీ బహుజనులని పిలుచుకోవడమే సరైనదని ప్రస్తుత అవగాహన. బుద్ధుడు తాత్విక అర్థంలో సంఖ్యాత్మకంగా వాడిన ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ నుంచి కాన్షీరాం అభివృద్ధి చేసిన ‘బహుజన అధికారం’ అనే రాజకీయ అర్ధం రీత్యా కుల,మత వివక్షలకు గురయ్యే పై శ్రేణులనన్నిటినీ ‘బహుజన’ అని పిలవడమే సరైనదని ఎక్కువ మంది ఆలోచనా పరులూ, మేధావులూ చేసిన వాదన సాధారణ ఆమోదం పొందింది. ఈ వాదన చేసిన వారిలో నేనూ వున్నాను. కనుక తెలుగు సమాజంలో పీడిత కులాల, మైనారిటీ మతాల ప్రజలు కులవ్యవస్థ కారణంగా, హిందూ మత వ్యవస్థల కారణంగా ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా సాగిస్తుతున్న ఉద్యమాన్ని ముందు ‘దళిత’ ఉద్యమమనీ, తరవాత ‘దళితబహుజన’ ఉద్యమం అనీ, ప్రస్తుతం ‘బహుజన’ ఉద్యమం అనీ వ్యవహరిస్తున్న విషయం మనం గుర్తించాలి.

ఇవే దశలూ, పరిణామాలూ పీడిత కులాల సాహిత్యోద్యమంలో కూడా చోటుచేసుకున్నాయి. సాహిత్య విమర్శకు, సిద్ధాంతానికి కూడా ఇది వర్తిస్తుందని వేరే చెప్పక్కర్లేదు. ఉదాహరణకు 1992లో ఏర్పడిన ‘దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక’ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రచయితల ఐక్యవేదికగా పనిచేసింది. దీని నాయకుల్లో సభ్యుల్లో ఈశ్రేణులన్నింటినుంచీ ప్రాతినిధ్యం ఉంది. “సమస్త కుల, మత, వర్గ వివక్షలకూ, అసమానతలకూ, బ్రాహ్మణ వాదానికీ, మను ధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. చార్వాకులు మొదలుకొని బుద్ధుడు, వేమన, పూలే, అంబెడ్కర్ ల వారసత్వాన్ని స్వీకరిస్తుంది”(1) అని ఈ సంస్థ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఇదే ధోరణిలో తరవాతి కాలంలో ‘దళిత బహుజన సాహిత్య వేదిక,’ ‘బహుజన రచయితల సంఘం’, ‘బహుజన రచయితల వేదిక’, ‘బహుజన సాహిత్య కచ్చీరు’, లాంటి అనేక సాహిత్య సంఘాలు ఏర్పడ్డాయి. నిజానికి సాహిత్య రంగంలో మాదిగ సాహిత్యం, బీసీ సాహిత్యం, ముస్లింవాద సాహిత్యం, ఎస్టీల సాహిత్యం లాంటి బహుజన శ్రేణుల ప్రత్యేక పాయలు కూడా వచ్చినప్పటికీ అవన్నీ బహుజన సాహిత్య ప్రవాహంలోనే విభిన్నంగా కొనసాగుతున్నాయి. అంటే వివిధ బహుజన శ్రేణులు తమ తమ ప్రత్యేక ఆకాంక్షల్నీ, సవాళ్ళనీ వ్యక్తం చేస్తూనే పైన పేర్కొన్న సాధారణ బహుజన తాత్వికతను అవి పంచుకొంటున్నాయి.

  1. దళితబహుజన వాదం – దళితబహుజన సాహిత్య విమర్శ:

దళితబహుజన సాహిత్య విమర్శ దళితబహుజన వాదానికి సాహిత్య సిద్ధాంత ప్రతినిధి. దళితబహుజన రాజ్యాధికార భావనకూ, దళితబహుజన సాంస్కృతిక, మానసిక ప్రత్యామ్నాయతకు సాహిత్య అనువర్తింపును అభివృద్ధిచేసే సాధనం. అంతిమంగా దళితబహుజన తాత్విక దృక్పధాన్ని సాహిత్యంలో ప్రతిష్ఠించే విమర్శనా పద్ధతి. అది ఎలాగో చూసే ముందు దళితబహుజన తాత్విక దృక్పధాన్నీ, దాని రాజకీయ సాంస్కృతిక విభిన్నతనీ క్లుప్తంగానైనా పరిశీలించాలి.

దళితబహుజన వాదం చర్చల నుంచి ఊడిపడింది కాదు. అదొక సామాజిక ఉద్యమ తాత్విక ఫలం. కులవ్యవస్ధ సృష్టించిన అన్యాయం, అసమానతల మీదా, అగౌరవాల మీదా, అమానవ పరిగణనల మీదా తరతరాలుగా పీడిత కులస్తులూ తదితర బాధితులూ సాగించిన సాగిస్తూ వస్తున్న విముక్తి ఉద్యమ సారం. అది అస్తిత్వాలకు మాత్రమే పరిమితమైనది కాదు. సామాజిక నిచ్చెనమెట్ల నిర్మాణంలో దిగువ మెట్లకు చెందిన కారణంగా ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అసమానతల్లో నలిగిపోతున్న బాధితుల స్వేచ్ఛా కాంక్షకు అద్దంపట్టే దృక్పధం. దీని కేంద్ర స్థానం అంబేద్కర్ సాగించిన ఉద్యమానికి దక్కుతుంది. చారిత్రక మూలాల్లోకి వెళితే చార్వాకులూ, బుద్ధుడూ, బసవన్న, చోక్ మేలా, సంత్ కబీర్, తుకారం, నానక్ వీరబ్రహ్మంలు తమ తమ కాలాల్లో ప్రాంతాల్లో సాగించిన కుల వ్యతిరేక పోరాటాలూ, 19 వ శతాబ్దపు మహారాష్ట్ర లో మహాత్మా పూలే నడిపిన శూద్ర -అతిశూద్ర ఉద్యమం తగిన దళితబహుజన ఉద్యమానికి పునాదిని వేశాయి. దీన్ని ఆధారం చేసుకుని తమిళనాడులో ఇయోతి థాస్ (1845-1914), తెలంగాణ లో భాగ్య రెడ్డి వర్మ(1845-1939), ఆంధ్రప్రదేశ్ లో కుసుమ ధర్మన్న (1894-1948), కేరళలో నారాయణ గురు(1856-1928) అయ్యంకాళి (1863-1941), పోయికాయిల్ యోహన్నన్(1878-1939) తదితరులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక అంబేద్కర్ అందించిన కుల నిర్మూలనా తాత్వికత, నవయాన బుద్ధిజం, పెరియార్ నడిపిన ఆత్మగౌరవ ఉద్యమం, కాన్షీరాం ఆచరణాత్మక బహుజన రాజకీయ సిద్ధాంతం – ఇవన్నీ కలిసి రూపొందిందే దళితబహుజన వాదం. ఈ మొత్తం క్రమానికి అంబేద్కర్ ఆచరణా ఆలోచనా అత్యంత కీలకంగా పనిచేసి జాతీయ, అంతర్జాతీయ ప్రభావాన్ని వేసింది కనుక దీన్ని అంబేడ్కరిజం అని పిలుస్తున్నాం. కనుక దళితబహుజన వాదానికి శస్త్రంగా శాస్త్రంగా అమరిన తాత్విక దృక్పధం ఏంటీ అంటే అంబేద్కరిజం అని స్థిరపడిపోయింది.

అభ్యుదయ, విప్లవవాదాలకు మార్క్సిజం ఎలాగో దళితబహుజన వాదానికి అంబేడ్కరిజం అలా అన్నమాట. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువల పునాదిగా ప్రజాస్వామిక సామ్యవాదాన్ని నెలకొల్పే విశిష్ట ఆశయ సాధనే దళితబహుజన వాద లక్ష్యం. ఇది దేశీయ విముక్తి సిద్ధాంతం. ఇందులో రెండు ప్రధానాంశాలున్నాయి. ఒక అంశం బుద్ధిజం పునాదిగా జరగాల్సిన మానసిక సాంస్కృతిక విముక్తి. అంటే హిందూమత తాత్వికత నుంచి, సంస్కృతి నుంచీ బయటపడి వికాస మానవులుగా, దళితబహుజన ప్రజలే కాదు మిగిలిన వారుకూడా, పరిణమించడం. రెండో అంశం రాజకీయ విముక్తి. దళితబహుజన రాజ్యాధికారం ద్వారానే దీన్ని సాధ్యం చేసుకోవాలనేది దీని సారం. దళితబహుజన వాదం మార్క్సిస్టు రొడ్డకొట్టుడు వర్గవాదాన్నీ, మావోయిస్టు సాయుధ పోరాటాన్నీ, రాజ్య నిర్మూలననూ, రాజ్యాంగ ధ్వంసాన్నీ వ్యతిరేకిస్తుంది. రాజ్య, రాజ్యాంగ నిర్మూలన కాదు కుల నిర్మూలన ఈ సిద్ధాంత సారం. “Turn in any direction you like. Caste is the monster that crosses your path. You cannot have political reform, you cannot have economic reform, unless you kill this monster “(2). అంబేద్కర్ చేసిన ఈ హెచ్చరిక దళితబహుజన వాదానికి మకుటాయమానం. కనుక రాజ్యాన్ని అవసరం మేరకు వాడుకుంటూనే దాన్ని దళితబహుజనుల పరం చేయడమే దళితబహుజనవాద ఆశయం. మన దేశంలో పేద వాళ్లలో కూడా కుల విభజనా, దాని తాలూకూ వివక్ష ఉన్న కారణంగా ఇక్కడ పేద వాళ్లంతా ఒకటి బాధలన్నీ ఒకటి అనే అభ్యుదయ అవగాహన సత్యదూరమవుతుందనీ, ఒట్టి అసమానత్వం కాకుండా శ్రేణీకృత అసమానత్వానికి దారితీసిన కులవ్యవస్ధ నిర్మూలనే ఇక్కడ జరగాల్సిన ప్రధాన మార్పని ఈవాదం చెబుతుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఆస్తులూ, ఆదాయ మార్గాలూ కులాల హోదాను బట్టీ, వాటి కంటగట్టిన గౌరవాలను బట్టీ దక్కడం అని చెప్పిన అంబేద్కర్ చూపును ఈవాదం సొంతం చేసుకుంటుంది. “They (upper castes) own land in this country. They control trade and they also own the state. Every source of revenue and profit is controlled by them. Other communities and particularly the untouchables are just hewers of wood and drawers of water. The social system helps Hindu upper castes to have a monopoly over everything”(3). భారతీయ ఆర్థికత యొక్క కుల స్వభావం మీద అంబేద్కర్ చేసిన పై విశ్లేషణ దళితబహుజన వాదానికి శిరోధార్యం. అసమానుల్ని సమానులుగా చూడటం వల్ల అసమానత్వం పెరుగుతుంది కానీ తరగదనే అంబేడ్కరిస్ట్ సూత్రీకరణను సొంతం చేసుకుని రిజర్వేషన్ విధానాన్ని సమర్థిస్తూ ప్రతిభావాదం లోని కుల అహంకారాన్ని పూర్వపక్షం చేయడము కూడా బహుజనవాద సారంలో భాగం.

  1. దళితబహుజన సాహిత్య విమర్శ విశిష్టత, విభిన్నత:

పైన వ్యక్తమైన దళితబహుజన వాద అవగాహనను సాహిత్యానికీ, సాహిత్య విమర్శకీ అనువర్తింపజేసేదే దళితబహుజన సాహిత్య విమర్శ. ఇందులోని విశిష్టత, విభిన్నతలను ఈ కింది విధంగా క్లుప్తీకరించొచ్చు.

  1. దళిత, బహుజన సాహిత్య విమర్శ అంబేడ్కరిజంను మూల తాత్వికత గా స్వీకరిస్తుంది. జాతీయవాద, అభ్యుదయ, విప్లవవాద సాహిత్య విమర్శల తాత్విక దృక్పధాల నుంచి ప్రధానంగా ఈ విషయం లోనే దళితబహుజన సాహిత్య విమర్శ దృక్పధం భిన్నమైనది. జాతీయవాదానికి గాంధీవాదంలాగా, అభ్యుదయ, విప్లవ సాహిత్య సిద్ధాంతాలకు, విమర్శలకు మార్క్సిజం లాగా దళితబహుజన సాహిత్య విమర్శకు అంబేడ్కరిజం తాత్విక దృక్పధం.
  2. ఇది దళితబహుజన సాహిత్యం లో దళిత బహుజన ప్రత్యేక అనుభవాలూ, వాస్తవికత, చైతన్యం, సంస్కృతీ చిత్రితమయ్యిన తీరుతెన్నుల్ని, వాటి బాగోగుల్నీ విశ్లేషించి చూపుతుంది.
  3. దళితబహుజన కళాతత్వాన్ని( aestheticsని) నిర్వచించి ఆ ఫ్రేమ్ లో ఆ సాహిత్యాన్ని వివరించి విశ్లేషించి చూపుతుంది.
  4. ఇతర సాహిత్యాలనూ, మొత్తం మన సాహిత్య చరిత్రను కూడా దళితబహుజన చూపునుంచి విశ్లేషించి వాటిలో వ్యక్తమైన హిందూ అగ్రకుల పురుష సంస్కృతి ని వెల్లడి చేసి పరిశీలనకు పెడుతుంది. ఉదాహరణకి మరాఠీ దళిత సాహిత్య విమర్శకుడు బాబూరావ్ బాగుల్ “the established literature of india is Hindu literature” (4) అని ప్రకటిస్తాడు. అంతటితో ఆగకుండా కాస్త వివరిస్తూ “Writers who have internalised the Hindu value-structure find it impossible to accept heroes, themes and thoughts derived from the philosophies of Phuley and Ambedkar”(5). బాగుల్ లాగే దేశవ్యాప్తంగా, తెలుగువారితో సహా, దళితబహుజన విమర్శకులు భారతీయ సాహిత్యంలో పీడిత కులాల రచయితలూ, ప్రజలూ ఎలా పక్కకు నెట్టివేయబడ్డారో, ఎలా పక్షపాత ప్రాతినిధ్యానికి గురైనారో సహేతుకంగా వివరించారు. అసలు భారతీయ సాహిత్య నిర్మాణపు పునాదినే వీరు ప్రశ్నించారు. భారత జాతీయోద్యమ చరిత్రనూ, సాహిత్య చరిత్రనూ పదే పదే పరిశీలించి వలసపాలనా సమయంలో జరిగిన గాంధీ-అంబేద్కర్ల చర్చను కూడా సరికొత్తగా పీడిత కులాల దృష్టి నుంచి ఆవిష్కరించారు. హిందూ అగ్రకుల పండిత సంస్కృతికి చెందిన భారతీయ సాహిత్యం నుంచి దళితబహుజన సాహిత్యం ఎలా వేరుపడిందో వివరించారు. ఈ కోణంలో తెలుగు బహుజన సాహిత్య విమర్శకులు చేసిన కృషిని వివరాలు తరువాత అందిస్తాను.
  5. సమకాలీన సాహిత్యానికే కాకుండా పాత సాహిత్యానికి కూడా దళిత బహుజన దృక్పధాన్ని కొలబద్దగా ఉపయోగించి విమర్శ చేయడం. వివిధ రకాల సాహిత్యాలలోని బ్రాహ్మణ వాదాన్నీ, పీడితకుల వ్యతిరేకతనీ ఎత్తి చూపి విమర్శనాత్మక విశ్లేషణకి గురిచేయడం బహుజన వాద సాహిత్య విమర్శలో అంతర్భాగం.
  6. అంతిమంగా ఇది దళితబహుజన సాహిత్య సిద్ధాంతాన్ని నిర్మిస్తుంది. ఆ సాహిత్యం చిత్రించే పీడితకుల పోరాటాల్నీ, ఆరాటాల్నీ డిఫెండ్ చేస్తూ మొత్తం సాహిత్యానికి దాని అదనపు చేకూర్పును నొక్కి ప్రకటిస్తుంది.
  7. దళితబహుజన సాహిత్య విమర్శకు ప్రధాన మార్గదర్శకాలు :

మరాఠీ రచయితల సభనుద్దేశించి మహాత్మా జోతిబా పూలే 1885 జూన్ 11 న రాసిన ఉత్తర సారాంశం దళితబహుజన సాహిత్య విమర్శకు తొలి మార్గదర్శకం. అందులో శూద్రా అతిశూద్రా రచయితలు అగ్రకుల రచయితల భావజాలంలో పడి కొట్టుకుపోకుండా తమదైన వాస్తవికతకీ, తమవైన సమస్యలకీ పట్టం కట్టాలని సూచిస్తాడు(6). తన ‘గులాంగిరి’ పుస్తకంలో దశావతారాలను ఆర్యులు ఇక్కడి మూలవాసుల్ని ఆక్రమించుకున్న చరిత్రను తెలిపే పది దశలకు సాహిత్య ప్రతిరూపంగా వర్ణిస్తాడు. దళితబహుజన సాహిత్య విమర్శలో కనిపించే పురాణాల వినిర్మాణ విధసనానికీ, మూలవాసీ చారిత్రిక స్పృహకీ పూలే ‘గులాంగిరి’ లో చేసిన పై విశ్లేషణతోపాటు మరికొన్ని భావనలు కూడా దారి చూపాయి. అలాగే భాగ్యరెడ్డి వర్మ అనే మేదరి బాగయ్య , డా. బి. ఆర్. అంబేద్కర్ హిందూ పురాణాలకూ, ఇతిహాసాలకూ, వేదాలకూ, ఉపనిషత్తులకూ చెప్పిన విమర్శనాత్మక భాష్యాలు కూడా ఈ విమర్శకు దారి వేశాయి. అంబేద్కర్ 3వ సంపుటిలో హిందూయిజం గురించీ, 4వ సంపుటిలో హిందూమత చిక్కుముడుల గురించీ, రాముని కృష్ణుని రహస్యాల గురించీ భగవద్గీత సారం గురించీ చేసిన విశ్లేషణలోనూ, ఆ తరవాత ‘శూద్రులెవరు?’ ‘అస్పృశ్యులెవరు? ‘ అనే పుస్తకాలలో హిందూ చూపును పూర్వపక్షం చేస్తూ సాగిన విమర్శలో కూడా దళితబహుజన సాహిత్య విమర్శకు, సిద్ధాంతానికీ కావలసిన సంవిధానం ఇమిడి ఉంది. కుసుమ ధర్మన్న ఇచ్చిన ‘మాకొద్దీ నల్లదొర తనం’ అనే నినాదంలోనూ ఆయన ఇతర రచనలలోనూ బలమైన పీడితకుల దృక్పధం ఉంది. ఇవన్నీ దళితబహుజన సాహిత్య విమర్శకు ప్రాథమిక మార్గదర్శకాలుగా పనిచేశాయి. 1967 లో ఉద్భవించిన మహారాష్ట్ర దళిత పాంథర్స్ సిద్ధాంత ఆచరణలు మలి మార్గదర్శకాలు గా పని చేశాయి. ఈ మొత్తం నేపథ్యం నుంచే తెలుగు దళిత బహుజన సాహిత్య విమర్శను అర్ధం చేసుకోవాలి.

  1. తెలుగు దళితబహుజన సాహిత్య విమర్శ :

తెలుగు దళితబహుజన సాహిత్య విమర్శకు తక్షణ సామాజిక, రాజకీయ ప్రేరణలుగా 1984 లో ఏర్పడిన బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భావం, 1985 లో కారంచేడు దళితుల మీద జరిగిన అగ్రకుల హత్యాకాండకు ప్రతిఘటన గా వచ్చిన ఉద్యమం లో భాగంగా ఏర్పడిన దళిత మహాసభ పనిచేశాయి. ఈ ఉద్యమాల నాయకులైన కత్తి పద్మారావు, బొజ్జా తారకం లు ఇద్దరూ సాహితీవేత్తలు. ఫలితంగా సాహిత్య సృష్టికి సంబంధించీ, విశ్లేషణకి సంబంధించీ అంబేడ్కరిస్టు స్పృహ వేగవంతమయ్యింది. నీరుకొండ, చుండూరు ఉద్యమాలతో దళిత ఉద్యమ చైతన్యం యువకుల్ని ఆలోచింపజేసింది. పాత తరాలు కూడా కొత్తగా మారిన చూపునుంచి ఆలోచించడం మొదలెట్టారు. 90లలో దళితవాద దృక్పధం బలపడి విస్తరించింది. మండల్ కమిషన్ ను కేంద్రంగా జరిగిన బీసీ రిజర్వేషన్ పోరాటాల కారణంగా కూడా పీడిత కుల సాహిత్య జీవుల్లో సాహిత్యం పట్ల అప్పటివరకూ ఉన్న దృష్టి కోణం మారింది.

మారిన ఈ దృక్కోణం నుండి ముందు పాత సాహిత్యాన్నీ, సాహిత్య చరిత్రలోని ఘట్టాల్నీ తిరిగి విశ్లేషణ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ముల్కరాజ్ ఆనంద్ ‘అన్ టచ్ బుల్’ నవలను విమర్శించినట్లుగా ఇక్కడ ఉన్నవ ‘మాలపల్లి’ నవలను బోనులో నిలబెట్టడం జరిగింది. నవలలో చిత్రితమైన మాలపల్లిలో బ్రాహ్మణ సంస్కృతి ఉందనీ, నవలా నాయకుడిలో దళితతనమే కనిపించదనీ విశ్లేషణ చేశారు. ‘వైతాళికులు’ సంకలన కర్త జాషువాను విస్మరించి ఆధునిక కవిత్వం లో అంటరానితనానికి నాంది పలికాడని గట్టిగా వాదించడం చేశారు దళితబహుజన విమర్శకులు. గురజాడ ‘కన్యాశుల్కం’ ను ఇప్పుడెలా చూడాలి’ అనే శీర్షికతో జరిగిన విశ్లేషణలో కందుకూరి, గురజాడలు చేపట్టిన సమస్యలు బ్రాహ్మణులకు చెందినవి మాత్రమేననీ కనుక బ్రాహ్మణ సమాజ సంస్కర్తలే కానీ మొత్తం అన్నికులాలకు చెందిన సంస్కర్తలు కాదనీ ప్రకటించారు. గురజాడ ‘కన్యాశుల్కం’ కంటే గుర్రం జాషువా ‘గబ్బిలం’ ఈనాడు ఎక్కువ అనుగుణ్యత కలిగి ఉందనే వాదన ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యం లో విశ్వనాథ సత్యనారాయణ కు ప్రత్యామ్నాయం శ్రీశ్రీ కాదనీ జాషువా అనే అభిప్రాయం బలంపుంజుకుంది. విశ్వనాధకు ఆదర్శమైన ‘నాల్గు పడగల హైందవ నాగరాజును’ సాహిత్యం లో పూర్వపక్షం చేసింది జాషువాయే కానీ శ్రీశ్రీ కాదని ఈ విమర్శకులు విశ్లేషించి చూపారు.

‘మాలవాళ్ళు రెండు రకాలు, సినిమాల వాళ్ళూ, డ్రామాల వాళ్ళు’ అన్న శ్రీశ్రీ చమత్కారంలోని కుల హేళనా, ‘కసాయిబు’ అని శ్రీశ్రీ సృష్టించిన పదబంధంలో వ్యక్తమైన మెజారిటీ హిందూ ధోరణీ విమర్శకు గురయ్యాయి. చలం సాహిత్యం బ్రాహ్మణవాద చట్రం లోనే చిక్కుకుపోయిందనే అభిప్రాయం రావడమూ గమనార్హం. ‘పేదవాళ్ళంతా ఒకటి, బాధలన్నీ ఒకటి’ అన్న అభ్యుదయ, విప్లవ సాహిత్య అవగాహనను తప్పుపడుతూ కుల వ్యవస్థ లోని శ్రేణీకృత అసమానతల కారణంగా పేద వాళ్ళలోనూ ఏర్పడిన సాంఘిక అసమానత్వాన్నీ, వారి బాధలలోనూ నిర్మితమైన తారతమ్యాలనూ ఉపేక్షించటం అన్యాయమని చెప్పటం ద్వారా “కులం శ్రమ విభజననే కాదు శ్రామికుల విభజననూ కలుగజేసింది”(7) అన్న అంబేద్కర్ సూత్రీకరణను అనువర్తింపజేశారీ విమర్శకులు. తెలుగు కవిత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన దిగంబర కవులుకూడా అగ్రకుల హిందూ సంస్కృతినే అంతరంగీకరించుకున్న దాఖలాలు చూపుతూ విమర్శ వచ్చింది. ఇలా “తెలుగు సాహిత్య చరిత్రంతా అగ్రకుల హిందూ పురుష దృక్పధంతో కొనసాగిందనే వాదన”(8) దళితబహుజన విమర్శ చేసింది.

ఇక మూలాల రీత్యా, తాత్వికత రీత్యా దళితవాదం విప్లవ వాదానికి ఎలా విభిన్నమో వివరిస్తూ గుర్తించదగిన విశ్లేషణ వచ్చింది. దీన్ని చూసి ఈ రెండు వాదాలకూ పలానా విమర్శకుడు పోటీపెడుతున్నాడని కొంతమంది చర్చను లేవనెత్తారు. దానికి స్పందిస్తూ విభిన్నత అంటే పోటీ కాదనీ ప్రత్యేకతను తెలపడమనీ సమాధానమూ ఇచ్చారు. మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం అనే తాత్వికత నుంచి వెలువడిన విప్లవవాద సాహిత్యానికీ, బుద్ధిజం, పూలే, పెరియార్ అంబేడ్కర్, కాన్షీరాం ఆలోచనల పోరాటాల సారం నుంచి వచ్చిన దళితబహుజన వాద సాహిత్యానికీ ఏ వ్యత్యాసమూ లేదనడం రెండూ ఒకటే అనడం ఒకరకమైన సాహిత్య దురాక్రమణకు నిదర్శనమే అని దళితబహుజన విమర్శకులు విప్లవవాదుల్ని విమర్శించారు. “విప్లవ కవిత్వం దళిత కవిత్వం ఒకటే అయితే ఇప్పటికే విప్లవ కవిత్వం పేరుతో వచ్చిన కవితల్ని ఈరోజు దళిత కవిత్వం అని పేరు మార్చి వేసుకోవలసిన అవసరం లేదు. లేదూ వీరంటున్నదంతా దళిత కవిత్వం అయితే ఇప్పటివరకు అదే కవిత్వాన్ని విప్లవ కవిత్వం అని పిలవడం తప్పని అయినా ఒప్పుకోవాలి”(9) అని ఈ విమర్శకులు వాదించారు. అలాగ సమాజాన్ని సమగ్రంగా దర్శిస్తున్నామని చెప్పుకునే విప్లవ సాహిత్య వేత్తల్లో చాలామంది సమాజంలో అధిక సంఖ్యాకుల్ని పీడిస్తున్న కులం మీదా, హిందూ మతం మీదా విమర్శపూర్వక రచనలు చేయకుండానే విప్లవ సాహిత్య వారసులుగా ఎలా చెలామణీ అవుతున్నారని కూడా అడిగారు. ఇక్కడితో ఆగకుండా విప్లవ సాహిత్యం లోనూ అభ్యుదయ సాహిత్యం లోనూ హిందూ దేవుళ్ళనూ, వారి ఆయుధాలనీ విప్లవ ప్రతీకలుగా చూపటం లోని బ్రాహ్మణవాదాన్ని కూడా వెలికితీసి చూపారు. రామబాణం, విష్ణుచక్రం, పరశురాముడి గొడ్డలీ, అర్జనుని గాండీవం, జగన్నాధ రధచక్రాలూ, కలకత్తా కాళీ నాలిక, యముని మహిషపు గంటలు లాంటి హిందూ పురాణ సంబంధిత విషయాల్ని విప్లవ ప్రతీకలుగా, ప్రగతివాద చిహ్నాలుగా చేసిన శ్రీశ్రీ, శివారెడ్డి, ఆరుద్ర తదితరులు అమలులోని బ్రాహ్మణీయ సంస్కృతి లో కూరుకుపోయినట్లేనని వీరు ప్రకటించారు. ఇదే తరుణంలో దళితబహుజన కవులు పై పురాణ ప్రతీకల్ని ప్రగతినిరోధకాలుగా ప్రకటించి రాసిన కవిత్వంలో అంబేడ్కరిస్టు ప్రగతి చూపు ఉందని వాదించారు. ఇందులో భాగంగానే దళితబహుజన ఈస్థటిక్స్ మిగిలిన సాహిత్యాల ఈస్థటిక్స్ కు ఎలా భిన్నంగా ఉంటాయో చూపారు. పీడితకుల వృత్తులనుంచీ, దళితబహుజనుల రోజువారీ అనుభవాల నుంచీ, భాష నుంచీ, యాసనుంచీ, సామెతల నుంచీ, సరససల్లాపాల నుంచీ, ఆట పాటలనుంచీ, పని నుంచీ, డప్పునుంచీ, చెప్పునుంచీ, డోలునుంచీ, తోలు నుంచీ అమరిన ప్రత్యేక దళితబహుజన ఈస్థటిక్స్ ను వీరు విశ్లేషించి చూపారు. ఈ క్రమంలో భాష మీదా దానికున్న కులమానాల మీదా పత్రికల్లో పెద్ద చర్చ నడిచింది. పురాణాల్లో దేవుళ్ళని విలన్లుగా, రాక్షసుల్ని పీడిత కులస్తులకు పూర్వీకులుగా పూలే చేసిన విశ్లేషణనూ, ఆయన మూలవాసీ సిద్ధాంతాన్నీ దళితబహుజన సాహిత్యానికి అపాదించి చూపటమూ ఈ విమర్శలో విస్తృతంగా జరిగింది.

ఇదిలా ఉండగా మాదిగ దండోరా ఉద్యమ ప్రభావంతో వచ్చిన మాదిగ సాహిత్య విమర్శ మాదిగత్వాన్నీ, మాదిగ తాత్వికత నీ మాదిగ సాహిత్యం లో అవి చిత్రితమైన విధానాన్నీ, అవే మాదిగేతర సాహిత్యం లో కనిపించిన తీరుతెన్నుల్నీ విపులంగా చర్చించింది. మాదిగ సంస్కృతి ఔన్నత్యాన్ని, అందులోని ప్రజాస్వామిక లక్షణాలనూ విశ్లేషణకి పెడుతూనే మొత్తం బహుజన సాహిత్యానికి మాదిగ సాహిత్య అదనపు చేకూర్పును వివరించింది. ఇదే సమయంలో బీసీ సాహిత్య తత్వాన్ని నిర్వచిస్తూ బీసీ సాహిత్య విమర్శ వచ్చింది. బీసీ కులవృత్తుల నేపథ్యంలో బీసీల పేదరికాన్నీ, రాజకీయ లేమినీ చిత్రించిన బీసీ సాహిత్య ప్రత్యేకతలని ఈ విమర్శ మన ముందుకు తెచ్చింది. ప్రపంచీకరణ బీసీల జీవితాలను ఎంత విధ్వంసానికి గురిచేసిందో చూపిన బీసీ సాహిత్య విశిష్టతను చర్చకు పెట్టింది. ఇదంతా మొత్తం బహుజన సాహిత్య విమర్శ తాత్వికత యొక్క మార్గదర్శనంలోనే జరిగింది. విభిన్నతల్నీ విభేదాలనూ చర్చించుకుంటూనే సాధారణ సంఘీభావాన్ని ప్రదర్శించటం వివిధబహుజన శ్రేణులు ప్రత్యేకంగా సాగించిన సాహిత్య విమర్శలో ఎన్నదగిన విషయం.

ఇతర ఏభాషాల్లో లేని విధంగా తెలుగులో బీసీ సాహిత్య విమర్శతో పాటు ముస్లింవాద సాహిత్య విమర్శ కూడా తన ప్రత్యేకతనీ, బహుజన సాధారణతనీ చెరో చేత్తో ముందుకు తీసుకెళ్లింది. ముస్లింవాద సాహిత్య ఆవశ్యకతనీ, లక్ష్యాల్నీ, ప్రత్యేకతల్నీ వివరించి విశ్లేషించి చూపటమే కాక ఆ సాహిత్యం మీద వచ్చిన విమర్శలనూ దాడులనూ తిప్పికొట్టిందీ విమర్శ. ముస్లిం వాస్తవికతకీ, ముస్లింవాద సాహిత్యానికీ ఉన్న సంబంధాన్ని చర్చించే క్రమంలో అభద్రతా, అనిశ్చితీ, నిందల పులుమూడూ ముస్లిం వాస్తవికతను పట్టి పీడిస్తున్న సమస్యలు గా గుర్తించి వాటిని ముస్లివాద సాహిత్యం చిత్రించిన విధానాన్ని ముస్లింవాద విమర్శకులు చూపారు. ఇదే కాక ముస్లిం సమాజంలోని అంతర్గత అప్రజాస్వామిక ధోరణుల్ని కూడా ఈ సాహిత్యం చర్చించిన విషయంలో అది అలా చేయడం సరైనదా కాదా అనే దానిమీద విమర్శకుల మధ్య వాడి వేడి చర్చలు జరిగాయి. ఇక్కడే ముస్లిం సమాజంలో స్త్రీల పీడనకి సంబంధించిన విశ్లేషణలో ముస్లిం స్త్రీవాద సాహిత్య విమర్శ కూడా ఒక పాయగా ముందుకొచ్చింది. షాజహానా లాంటి వారు ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహించారు. ముస్లిం వాస్తవికతను ఇస్లాం తాత్విక కోణం నుంచి చిత్రించటమే సవ్యమైనదనే మరొక వాదన కూడా తెరపైకి వచ్చింది.

కానీ దళితబహుజన సాహిత్య విమర్శకు దళితబహుజన స్త్రీవాద సాహిత్య విమర్శ సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చింది. దళితబహుజన స్త్రీల ప్రత్యేక వాస్తవికతను చిత్రించిన సాహిత్యాన్ని వివరించటమే కాకుండా దాని తాత్విక భూమికను కూడా ఇది విశ్లేషించింది. కుల పీడనా, మగ పీడనా, పేదరిక పీడనా జమిలిగా సృష్టించిన వేదనను దళితబహుజన స్త్రీలు ఎదుర్కొంటున్న వాస్తవికతను చర్చించి అది వారి సాహిత్యం లో చోటుచేసుకున్న విధానాన్ని దళితబహుజన స్త్రీవాద విమర్శకులు వెల్లడిచేశారు. అటు స్త్రీవాద సాహిత్యాన్నీ, ఇటు దళితబహుజన సాహిత్యాన్నీ పరిపూర్ణ స్థితికి తేవడంలో దళితబహుజన స్త్రీవాద సాహిత్యం నిర్వహించిన చారిత్రక పాత్రను వీరు గట్టిగా ఉద్ఘాటించారు. ఈ క్రమంలోనే దళితబహుజన క్రైస్తవ స్త్రీల వాస్తవికతను, దళితబహుజన గ్రామీణ పేద స్త్రీల దుస్థితి నీ, ముస్లిం స్త్రీల దైన్యాన్నీ సాహిత్యంతో అనుసంధానించి విస్తారంగా విశ్లేషించిన విమర్శ వచ్చింది. చల్లపల్లి స్వరూపరాణి, ఎం. వినోదినీ, జూపాక సుభద్ర, గోగు శ్యామల, షాజహానా తదితరులు ఈ విమర్శను రూపొందించి ముందుకు తీసుకెళ్లారు.

ఇప్పటివరకూ పైన చర్చించిన వివిధ దళితబహుజన సాహిత్య విమర్శ ధోరణులను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లిన వారిలో ముఖ్యులు: కత్తి పద్మారావు, బి. ఎస్. రాములు, ఖాదర్ మోహియుద్దీన్,
జి. లక్ష్మీనరసయ్య, బండి నారాయణ స్వామి, కలేకూరి ప్రసాద్, శిఖా మణి, అంబటి సురేంద్ర రాజు, అఫ్సర్, మద్దూరి నగేష్ బాబు, కోయ కోటేశ్వరరావు, పి. సీ. రాములు, ప్రసాద మూర్తి, నాగప్పగారి సుందరరాజు, దార్ల వెంకటేశ్వరరావు, కాకని సుధాకర్, గుండెడప్పు కనకయ్య, చల్లపల్లి స్వరూప రాణి, ఎం. వినోదినీ, గోగు శ్యామల, షాజహానా, జూపాక శుభద్ర, జిలుకర శ్రీనివాస్, సంగిసెట్టి శ్రీనివాస్, స్కైబాబా, ఖాజా, ఖరీముల్లా తదితరులు. వీరిలో ఏదో ఒక ధోరణికి ప్రాతినిధ్యం వహించినవారూ, పలు ధోరణులను కలిపి తీసుకొచ్చిన వారూ వున్నారు.

చివరిగా, తెలుగు దళితబహుజన సాహిత్య విమర్శ లో క్రమబద్ధమైన పరిణామం చూస్తాం. తొలి దశలో మర్క్సిజంతో జతకట్టిన అంబేడ్కరిజమే తాత్విక దృక్పధంగా పయనించింది. తరువాత పూర్తిగా అంబేడ్కరిజం వైపుగానే మొగ్గుతూ ముందుకుపోతుంది. మొత్తం మీద దళితబహుజన రాజ్యాధికార భావనకు కళాత్మక, మేధోపర సోదరిగా కొనసాగుతున్న విమర్శ బహుజనవాద సాహిత్య విమర్శ. బహుజన భారతి ఆశలకూ, ఆకాంక్షలకూ అవసరాలకూ అద్దం పట్టే సాహిత్యాన్ని ఇది దర్శిస్తుంది. ఈపని చేసే క్రమంలో హిందూ అగ్రకుల సాంస్కృతిక కళాత్మకతను మౌలిక పునర్నిర్మాణానికి గురి చేస్తుంది. ప్రత్యామ్నాయ ప్రతీకల్నీ, ప్రత్యామ్నాయ ఐతిహ్యాల్నీ, ప్రత్యామ్నాయ వైతాళికుల్నీ, ప్రత్యామ్నాయ చూపునీ, విశ్లేషణనీ తెలుగు సాహిత్య సిద్ధాంతాలలోకి దళితబహుజన సాహిత్య విమర్శ తీసుకువచ్చింది.

నోట్స్

  1. బి. ఎస్. రాములు: ‘ దళిత సాహిత్య విమర్శ దృక్పధం- పరిణామం – ఒక పరిచయం’, ” ఆధునిక సాహిత్య విమర్శ రీతులు”, ( A. V. P. G. College Telugu Department, Hyderabad – 2004) P. 280.
    2 . Dr. B. R. Ambedkar: “Annihilation of Caste”, Dr. B. R. Ambedkar Writings and Speeches Vol. 1, (Education Department, Government of Maharashtra- 1989) P. 47.
  2. Note-2
  3. Arjun Dangle, ed. , Poisoned Bread: Translations from Modern Mararu Dalit Literature ( Hyderabad: Orient Longman, 1992) P. 289.
  4. Note-4 P. 285
  5. Jotirao Phule, ” Selected Writings Of Jotirao Phule ( Left Word -2002) Pp 200-201.
  6. Note – 2
  7. జి. లక్ష్మీనరసయ్య,” దళిత సాహిత్యం – తాత్విక దృక్పథం” (దళిత సాన ప్రచురణ, విజయవాడ,1999) పేజీ. 5.
  8. జి. లక్ష్మీనరసయ్య : ‘ దళిత సాహిత్యానికీ విప్లవ సాహిత్యానికీ దృక్పధాల్లో తేడావుంది’, ” దళితవాద వివాదాలు” ( విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్- 2000) పేజీ. 217

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

4 thoughts on “దళితబహుజన వాదం – దళితబహుజన సాహిత్య విమర్శ

  1. చాలా మంచి వ్యాసం

  2. సవివరణాత్మక వ్యాసం

  3. చాలవివరణ ఉన్న వ్యాసం .

    ఈ రోజు (6 జూన్ 2021) మతఅస్తిత్వ సాహిత్య విమర్శ – మార్క్సిస్ట్ పద్దతి లో (“సాహిత్య విమర్శ జీజ్జ్ఞాస – 29” ) ముఖ్య వక్త గా ఈ వ్యాస రచయిత పాల్గొన్నారు ,

    ఆయన పై విషయం మీద అభ్యుదయ, విప్లవవాదాలకు మార్క్సిజం ఎలాగో అవి తెలుగు సాహిత్యవిమర్శలలో భాగం ఎలా అయినయో చెప్పారు.

    ఈ నాటి సమాజం లో, అగ్రకులాల కులాల మధ్య , బహుజనులు (ముస్లిం) , గిరిజనుల అస్తిత్వం చర్చిస్తున్నప్పుడు. కేవలం ఆర్దిక వ్యత్యాసం మాత్రమే కాకుండా , సామాజిక, విద్యా, ఆరోగ్యవసతులలో, వ్యత్యాసం లు కూడా పరిధి లోకి తీసుకోవాలి.

    వీటిని దృష్టిలో పెట్టుకొని కొలిమిలో ఈ వ్యాసం మంచి చర్చకు దారి తీస్తుందని భావిస్తున్నాను .ఆ చర్చ జరగాలి కూడా

  4. ఒక్కమాటలో చెప్పాలంటే దళితకుటుంబాన్ని గుర్తుచేస్తు రాసిన వ్యాసములా అనిపించింది. చక్కని వ్యాసము

Leave a Reply