దయ్యం

బిభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్
(తెలుగు అనువాదం – కాత్యాయని
)

శిరీష్ ప్రామాణిక్ గారి తోటలో బాదం కాయలు ఎంత బాగుంటాయో! రోడ్డుకు ఒక పక్కగా ఉండే ఆ తోటలో ఎంతో కాలంగా పెరిగిన రకరకాల చెట్లు దట్టంగా పెరిగి ఉంటాయి. తోట మధ్యలో పట్టపగలు కూడా చిమ్మ చీకటి కమ్ముకుని ఉంటుంది.

దానికి దగ్గర్లోనే మేం చదువుకునే హయ్యర్ ప్రైమరీ స్కూల్ – దాన్నే రాఖాల్ మాస్టర్ బడి, అంటుంటారు. స్కూల్ ఆవరణ లో పెద్ద మల్బరీ చెట్టు ఉంది కాబట్టి, మేం దాన్ని “మల్బరీ చెట్టు కింది బడి” అని పిలుచుకుంటాం.

ఇద్దరు మాస్టార్లున్నారు మా బళ్ళో. ఒకరు హీరాలాల్ చక్రవర్తి. స్కూల్ పక్కనే కుండలు అమ్మే దుకాణం ఉందాయనకు. అందుకనే ఆయన్ని “కుండలమ్మే మాస్టారు” అంటుంటాం పిల్లలందరం. ఆయన్ని టీచర్ అనటంకన్నా యమధర్మరాజు, అనటమే బావుంటుంది. ఆయన చేతిలో అంత పొడవు బెత్తం చూడగానే వణుకు పుడుతుంది. మధ్యాహ్నం భోజనానికి గంట కొట్టగానే మాస్టర్లు నడుం వాల్చి ఓ కునుకు తీస్తారు. అసలు ఆ సమయం మాస్టార్లు నిద్ర పోవటం కోసమే ఇస్తారు. అప్పుడు పిల్లలందరం హాయిగా పొలాలూ, తోటలూ చుట్టేసి వస్తాం. ఒక్కోసారి ఏ గంట సేపటికో, మేం తిరిగి వచ్చే సమయానికి కూడా మాస్టర్లు నిద్రలోనే ఉంటారు. అంటే, భోజన విరామం ఇంకా పూర్తి కాలేదని అర్థం.

ఎప్పటిలాగే ఆరోజు కూడా అదే కార్యక్రమం నడుస్తోంది. బడికి దూరంగా ఉన్న రైల్వే లైన్ దగ్గరికి బయల్దేరాం మేమంతా. మాట్లా బ్రిడ్జి దగ్గరా, రైల్వే లైను మీదా చక్కర్లు కొడుతూ ఉన్నాం. మేం తిరిగి వచ్చేసరికి కుండలమ్మే మాస్టారు ఇంకా గురక పెడుతూనే ఉన్నారు.

“హుష్… ఎవరూ చప్పుడు చెయ్యకండిరా! ప్రామాణిక్ వాళ్ల తోటలో బాదం కాయలు కోసుకుందాం పదండి” అన్నాడు నారాయణ్.

అందరూ సరేనన్నారు.

“బాదం కాయలు కొయ్యటమంటే తమాషా అనుకున్నారా ఏమిట్రా? ఆ చెట్టు కింద ఏమేం ఉంటాయో తెలుసా?” అన్నాన్నేను.

“సరేలే, వెళ్ళి చూద్దాం కదా!”

అందరం కలిసి, బ్రిడ్జి కిందుగా వెళ్లే రోడ్డు మీదుగా తోట లోకి వెళ్ళాం. మధ్యాహ్నం రెండు గంటలయింది. సూర్యుడు నిప్పులు చిమ్ముతున్నాడు. అది శీతా కాలమే అయినా ఎండ మండిపోతోంది. కిందటి వానాకాలంలో, తోట నిండా రెల్లు గడ్డి, ముళ్ళ పొదలూ దట్టంగా పెరిగి పోయాయి. ఆ అడవి లోని సన్నటి బాటలోనూ చాలా చోట్ల, చెట్ల కొమ్మల నుంచి వేలాడుతున్న తీగలు నేలపై పెరిగిన పచ్చికను తాకుతున్నాయి. అప్పటిదాకా మేమెవ్వరమూ ఆ తోటను పూర్తిగా ఎప్పుడూ చూడలేదు. చాలా విశాలంగా కాంక్రీటు రోడ్డు దగ్గర నుంచి ఏటిగట్టు దాకా పరుచుకుని ఉంది.

జామ చెట్లకు కాయలు వున్నాయిగానీ, ఇంకా పచ్చిగానే వున్నాయ్. ఇంకేమన్నా పళ్ళు దొరుకుతాయేమోనని వెతుక్కుంటూ నది గట్టు దాకా వెళ్ళిపోయాం. బాదం చెట్లకు కొన్ని కాయలు కనబడ్డాయి కానీ, వాటిని పగలగొట్టి తినేంత ఓపిక లేక ఊరుకున్నాం.

అలా తిరుగుతూ తిరుగుతూ మిగతా వాళ్ళ నుంచి తప్పిపోయాన్నేను. నది ఒడ్డు దగ్గర, అడవి మరీ దట్టంగా ఉంది. ఇటువైపు ఎవరూ తిరుగుతున్నట్టు లేదు.

అడవిలో ఎక్కడో ఎండుటాకుల మీదుగా, నక్క అడుగుల చప్పుడు వినబడుతోంది. ఎత్తైన చింతచెట్టు చిటారుకొమ్మ మీంచి ఏదో పక్షి కూస్తోంది. ఒంటరితనంతో నాకు మరింత భయం పుడుతోంది. ఇలాంటప్పుడు మా బళ్ళో పిల్లలు పాడే పాట గుర్తొచ్చింది.

“మిట్ట మధ్యాహ్నం పూట
దయ్యం వొచ్చి దూకేను మీద
ఆ దయ్యం పేరేమో రోషీ
మోకాళ్లు ముడుచుకుని కూచుందాం రండి”

ఈ పాట పాడి, మోకాళ్లు దగ్గరికి ముడుచుకుని కూర్చుండి పోవాలి. అలా చేస్తే దయ్యాలు దగ్గరికి రావనీ, గుండెలో భయం పోతుందనీ నమ్మకం.

నా చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, పైగా ఇది మిట్ట మధ్యాహ్నం కూడాను! ఈ పాట పాడుకుంటూ మోకాళ్ల మీద కూచుంటే మంచిదేమో! ఐనా, ఆ దయ్యానికి రోషీ అని పేరేమిటో! శ్యామ్, కాలో, నిబారణ్ లాంటి పేర్లు ఉండవచ్చుగా!

వెనక్కి తిరిగి నడుస్తూ, దట్టమైన గడ్డి పై పెరిగిన వెదురు వనం లోకి చేరాను. అక్కడ కనబడిన దృశ్యానికి గుండె ఆగిపోయినంత పనైంది.

కాస్త దూరానున్న ఆమ్ర వృక్షం కింద, చెట్టు మొదలుకు వీపు ఆనించి కూచుని ఉంది, బోరో-బాగ్డిని! కళ్ళార్పకుండా చూశా! బోరో-బాగ్డిని, కళ్ళ ముందు చక్కగా కనబడుతోంది! దేవుడా! ఆమె చచ్చిపోయింది కదా!
మా వూళ్ళో ని గోసాయ్ పరా లో, మర్రిచెట్టు కింద గుడిసెలో ఉందేదామె. తనామనా అంటూ ఎవరూ లేరు.

పాల్ బాబుగారి ఇంట్లో పనిమనిషి. ఓసారి ఆమెకు బాగా జబ్బు చేసింది. అప్పటినుంచి ఆమె ఏమయిపోయిందో తెలీదు. అంతకు మించి నాకేమీ తెలీదు.

రెండు నెలల కిందట, దొరువు పక్కనున్న వెదురు పొదల్లో ఒక ఆడ మనిషి శవం దొరికింది. ఒక వైపునంతా కుక్కలు, నక్కలూ పీక్కుతిన్న ఆ శరీరం నల్లగా, పీలగా అచ్చం బోరో-బాగ్డిని లాగానే ఉంది. జ్వరంతో బాగా బలహీనం అయిపోయిన ఆమె, నీళ్ళు తెచ్చుకోటానికి వెళ్లి చెరువులో పడిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు.

ఇప్పుడేమో ఆమె ఇక్కడ తీరిగ్గా చెట్టుకు ఆనుకుని ఇలా కూచుని ఉంది!

తోటకు అడ్డం పడి పరిగెత్తుతూ రోడ్డు మీదికి చేరాను. మిగతా పిల్లలంతా ఉన్న బాదం చెట్టు దగ్గరికి చేరేసరికల్లా నా ఒళ్ళంతా భయంతో వణికి పోతోంది.

“ఏమైందిరా? అలా వున్నావేంటి?” అన్నారు వాళ్ళు.

“దయ్యం” అన్నాను తడబడుతూ.

“ఎక్కడ?”

“ఏమంటున్నావు రా?”

“బుధ్ధి లేకపోతే సరి!”

“బోరో-బాగ్డిని,అక్కడ పచ్చికలో కూచోనుంది. అక్కడ… ఏటి దగ్గర ఆమ్ర వృక్షం కింద. నా కళ్ళతో చూశా.”

“అదేమిట్రా? అదెట్లా?”

“కళ్ళారా చూశా, ఒట్టు! బాగా చూశాన్రా! కచ్చితంగా ఆమే!”

“ఛా ! ఏం అబద్ధాలు? చూద్దాం పదండి!”

పట్టలేని ఆశ్చర్యంతో అందరూ బయల్దేర బోతుండగా, “ఒద్దు లేండ్రా, వీడి మాటలు పట్టుకుని మనం అంత దూరం వెళ్లి తిరిగి వచ్చేసరికి బడికి ఆలస్యమై పోతుంది. మాస్టార్లు నిద్ర లేచి ఉంటారు. ఆ కుండలమ్మే మాస్టారు దగ్గర ఎంత పెద్ద కర్ర ఉంటుందో, దాంతో ఎంత చావగొడతాడో తెలుసుగా! ఎందుకొచ్చిన బాధ! నేనైతే రానబ్బా! కావాలంటే మీరందరూ పోండి! ఐనా వాడు చెప్పేది పచ్చి అబద్ధం!” అన్నాడు నిమాయ్ కోలూ.

మాస్టారి బెత్తం మహత్యం గుర్తొచ్చే సరికి కుర్రాళ్ళ ఉత్సాహం నీరుగారి పోయింది. ఒక్కొక్కరూ బడిబాట పట్టారు. నేనూ, వాళ్ల వెనకాలే బయల్దేరా!

మేం బడికి చేరేసరికి మాస్టార్లు నిద్ర లేచి ఉన్నారు.

చక్రవర్తి మాస్టారు, ఖాళీ క్లాసురూం లో చిరాగ్గా పచార్లు చేస్తున్నారు. మమ్మల్ని చూడగానే “అయినాయా ఆటలు!” అన్నారు కోపంగా.

“తమరి నిద్ర పూర్తయిందా సార్?” అని మేమూ అడగొచ్చు. కానీ ఎవరికున్నాయ్ అన్ని గుండెలు!

ఆయన కోపంగా అలా చూస్తుంటే మేమందరం చిన్నగా ముడుచుకు పోతున్నట్టుగా ఉంటుంది మాకు.

మేం క్లాసులోకి సరిగ్గా అడుగు పెట్టక ముందే “రతన్!” అంటూ ఆయన అరిచిన అరుపుకు భయపడుతూ మెల్లిగా లోపలికి వెళ్ళాను.

“ఎక్కడ తిరుగుతున్నార్రా మీరంతా?” తడిసిపోయిన గుడ్లగూబలా గజగజలాడాను. ఈ మాస్టారి చేతిలో పడటం కన్నా బోరో-బాగ్డినికి దొరికి పోయినా బాగుండేది. ఇక, నా అమ్ముల పొది లోని చిట్ట చివరి బాణాన్ని ఎక్కుపెట్టాల్సిందే.

“పండిట్ మోషాయ్, మేమెందుకు ఆలస్యంగా రావాల్సి వచ్చిందో వీళ్లలో ఎవరిని అడిగినా చెప్తారండీ! ప్రామాణిక్ గారి తోటలో బాదం కాయలు కోసుకుందామని వెళ్తే నాకు అక్కడ దయ్యం కనబడింది మాస్టారూ! అందుకనే…”

ఆయన మొహంలో భయమూ, అపనమ్మకమూ కూడా వచ్చి చేరాయి. “దయ్యమా! అదేమిట్రా!”

“ఔను సార్! దయ్యాలంటే…”

“దయ్యాలంటే ఏమిటో నాకు తెలుసులేరా, కోతి వెధవా! ఇంతకూ ఏం దయ్యమది? ఎక్కడ చూసావ్?”

అన్ని విషయాలూ వివరంగా చెప్పాను. ఆ దయ్యాన్ని చూసి నేను ఎలా వణికి పోతూ, పరిగెట్టానో నా మిత్రులు కూడా చక్కగా వర్ణించారు.

చక్రవర్తి మాస్టారు ఇదంతా విని, “ఈ సంగతి విన్నారా అన్నా!” అంటూ రాఖాల్ గారిని కేకేశారు.

“ఏమిటది?” అన్నారు పొగాకు చుట్టుకుంటున్న రాఖాల్ మాస్టారు.

“ఈ పిల్లల మాట వినండి. షోర్బో ప్రామాణిక్ వాళ్ల తోటలో ఈ రతన్ గాడికి దయ్యం కనబడిందట.”

“షోర్బో ప్రామాణిక్ ఎవరండీ?”

“అరె! శిరీష్ ప్రామాణిక్ తండ్రి కదా! ఆ తోట వాళ్ళదేగా!” జరిగినదంతా మరోసారి చెప్పించారు నాతో.

రాఖాల్ మాస్టారు, అసలైన సంప్రదాయ బ్రాహ్మణుడు. ప్రతి మూఢ నమ్మకం మీదా ఆయనకు మహా నమ్మకం.

“సహజమే కదా మరి! అది ప్రమాదవశాత్తూ జరిగిన మరణం. అట్లాంటి ఆత్మకు శాంతి ఉండదు” అన్నారు గంభీరమైన ముఖంతో.

కుండలమ్మే మాస్టారికి కాస్త నాస్తికత్వం ఉంది. ఆయన మాటల్లో ప్రతిదాని మీదా సందేహం కనబడుతూ ఉంటుంది.

“అయితే అన్నగారూ, మిట్ట మధ్యాహ్నం పూట ఆ తోటలో ఆ దయ్యం తీరిగ్గా చెట్టుకు ఆనుకుని కూర్చుని ఉంటుందంటారా?”

“ఏం, ఎందుకు ఉండగూడదూ? దయ్యాలు విశ్రాంతిగా కూచోటానికి వీల్లేదని ఎక్కడయినా రాసిపెట్టి ఉందా? మీబోటి వాళ్లకు అన్నీ అనుమానాలే!”

“సరేలెండి! వెళ్లి చూస్తే తెలుస్తుంది కదా!”

పిల్లలందరూ సంతోషంగా కేరింతలు కొట్టారు.

“మీకు ఎన్నటికీ అర్థం కాదయ్యా! దయ్యాలు అట్లా కూచొని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయా? అవి అశరీరమైనవని అంటారు… అంటే కేవలం భౌతిక శరీరా లతో మాత్రమే కనబడవని అర్థం. అవి ఒక విధమైన… అంటే… ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటాయని అర్థం” అన్నారు రాఖాల్ మాస్టారు మళ్లీ.

“వెళ్లి చూద్దాం పదండి, ఇదంతా ఎంత పిచ్చి నమ్మకమో తేలిపోతుంది. చూట్టం లో తప్పు లేదుగా!” అన్నారు చక్రవర్తి గారు.

మాకందరికీ వెళ్ళాలనే ఉంది. వెళితే ఈరోజుకిక క్లాసులు ఉండవు కదా!

మాస్టర్ల చుట్టూ మూగి, ఆ చోటుకు బయుదేరాం. నేను ముందు దారి చూపుతూ ఉండగా, మిగతా అందరూ గడ్డి దుబ్బులు, పొదలగుండా వెనక నడిచారు. అందరం కలిసి ఆమ్ర వృక్షం కిందికి వెళ్ళాం. అక్కడ కనబడ్డ దృశ్యాన్ని నా జన్మలో మరిచి పోలేను. ఇన్నేళ్ల తర్వాత కూడా అది నా కళ్ళకు కట్టినట్టే ఉంది.

చిరిగి పీలికలై, కంపు కొడుతున్న ఒక గుడ్డ ఆ చెట్టు కింద పడి ఉంది. దాని పక్కనే సగం దాకా నీళ్లున్న చిన్న కుండ ఒకటుంది. ఆమ్ర ఫలాల తొక్కలూ, గింజలూ నేల మీదంతా పడున్నాయి. వాటిలో కొన్ని తాజావీ, మరికొన్ని బాగా ఎండి పోయినవీ. వాటితోబాటు బోలెడన్ని చింత గింజలు, బెరళ్లూ కూడా కనబడ్డాయి.

ఆ చిరుగుల గుడ్డ మీద చిక్కి శిథిలమై పోయిన బోరో-బాగ్డిని నిర్జీవ శరీరం పడుంది. కొద్ది సేపటి కిందటే ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది.

మేము ఊళ్ళోకి వెళ్లి, ఈ సంగతి చెప్పాం. గ్రామ చౌకీ దారూ, డఫే దారూ వచ్చి చూశారు. ఆమె తన గుడిసెలో ఉండకుండా ఈ అడవిలోకి వచ్చి ఎందుకు దాక్కుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? ఆమెకు పిచ్చి పట్టిందని కొందరూ, ఏ దయ్యమో పట్టి ఉంటుందని మరి కొందరూ అన్నారు.

కానీ, బోరో-బాగ్డిని ఆకలితో, జబ్బుతో పట్టించుకునే మనుషులు లేక, చచ్చి పోయిందనేది కచ్చితంగా కనబడుతోంది. ప్రతిసారీ ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో చుట్టుకునే మలేరియా జ్వరం బారిన పడివుంటుంది. చివరి క్షణాల్లో ఇన్ని మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేరు. ఈ కారడవిలో ఎవరున్నారని ఇవ్వటానికి? ఇంత మారుమూల చోటులో ఆమె వున్నదని ఎవరికి తెలుసు?

ఈ అడవికి వచ్చి తల దాచుకోవాలని ఆమె ఎందుకు అనుకున్నదనే రహస్యాన్ని చివరికి తనతోబాటే పరలోకానికి తీసుకు పోయిందామె.

***

(బాగడీ – పశ్చిమ బెంగాల్, బంగ్లా దేశ్ లలో నివసించే నిమ్న కులం. ఈ కులానికి చెందిన స్త్రీని “బాగ్డినీ” అని వ్యవహరిస్తారు.)

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

6 thoughts on “దయ్యం

  1. మంచి కథ.. ధన్యవాదాలు కాత్యాయిని గారూ. పథేర్ పాంచాలి లో ఇటువంటి కథే చదివినట్టు గుర్తుంది.. అపు జ్ఞాపకాలలో అనుకుంటాను. ఏదైనా యెంత విషాదమరణం అండీ.. గుర్తుండిపోయే విషాదం.

  2. Very touching story. Her hunger and being alone has made her a deyyam. Anuvadam was very good.

  3. విషాదం. ఇప్పుడు, ఈ కరోనా సమయంలో ఎంతమంది ఆమెలా చనిపోవడం చూశాం! అరణ్యంలో దాక్కుని కాదు, తమ తమ గుడెసెల్లో దాక్కునే ప్రాణం విడిచారు.

  4. అనువాదం చాలా సరళంగా ఉంది కాత్యాయని…బెంగాల్ ల్లో బ్రాహ్మణ కుటుంబాల్లో ఉండే దుర్భర దారిద్ర్యాన్ని గజేంద్ర కుమార్ మిత్రా రచించిన కలకత్తా కి దగ్గరలో నవలలో చూస్తాము.ఈ మధ్య నేను చదివిన పుస్తకం ఇది.
    ఈ కథలో బిబూతి భూషణ్ నిమ్న కులంలో ముఖ్యం గా స్త్రీలు పడే పెదరికపు ఆకలి బాధల్ని bagdhini పాత్రలో బాగా చిత్రించారు.అభినందనలు

  5. కథ, కథనమూ బాగున్నాయి. ఒక్క పాత్రల పేర్లు తప్ప కథా వస్తువు అంతా ఇక్కడి మనదే.. మన జీవితమే .. మనబాల్యమే అనేంత గాఢమైన అనుభూతినిచ్చిన , ఒరిజినల్ కథలోని చిక్కదనాన్ని ఏమాత్రం సడలకుండా దర్పణంపట్టిన మీ అనువాదానికి ధన్యవాదాలు. అభినందనలు కాత్యాయిని గారూ.. – ఇక్బాల్.

Leave a Reply