ఇథియోపియన్ ఆధునిక నాటక వైతాళికుడు – త్సెగాయే గెబ్రె మెధిన్

త్సెగాయే గెబ్రే మెదిన్ ఇథియోపియన్ ప్రసిద్దిగాంచిన కవి, నాటక రచయిత. నటుడు కూడా. గత వంద సంవత్సరాల్లో ఇథియోపియాలో పురుడుపోసుకున్న అత్యంత ప్రాచుర్యం పొందిన ముఖ్యమైన సాహిత్యకారుల్లో త్సెగాయే ఒకడు. ఇంటా బయటా పేరు ప్రఖ్యాతులు గడించిన గొప్ప కవి. ఆధునిక ఇథియోపియన్ థియేటర్‌కు ఆద్యుడు. అతను అమ్హారిక్, ఒరోమో భాషల్లోనే కాకుండా ఆంగ్లం లోనూ రచనలు, అనువాదాలూ చేసాడు. రాజ్య ‘ఛీత్కారానికి’ గురైన మహాకవి.

త్సెగాయే గెబ్రే మెదిన్ ఇథియోపియాలోని ఒరోమియా ప్రాంతంలో అంబోకు సమీపంలోని బోడా గ్రామంలో, ఇథియోపియాపై ఇటాలియన్ ఫాసిస్ట్ దండయాత్ర సాగుతున్న సమయంలో ఫాసిస్ట్ మూకలతో పోరాడుతున్న ఒరోమో తండ్రి గెబ్రే మెదిన్, అమ్హారా తల్లి ఫెలెకెచ్ డాన్యేలకు 17, ఆగస్ట్ 1936లో జన్మించాడు. ఫలితంగా కుశిటిక్ చెందిన ఒరోమో భాష, సెమిటిక్ చెందిన అమ్హారిక్ బాషలల్లో ప్రావీణ్యత సంపాదించాడు. బాల్యంలో ఇథియోపియన్ చర్చి పురాతన భాష అయిన గీజ్ ను కూడా నేర్చుకున్నాడు. ఇది లాటిన్ తో సమానమైన ఇథియోపియన్ భాష. బాల్యంలో పశుకాపరిగా పనిచేసి కుటుంబ పోషణలో సహాయ పడ్డాడు. ప్రాథమిక పాఠశాల దశ నుండే నాటకాలు రాయడం, ప్రదర్శించడం మొదలుపెట్టాడు. పైచదువులకై అడిస్ అబాబాలోని జనరల్ వింగేట్ పాఠశాలలో, కమర్షియల్ స్కూల్లో విద్యాభాసం చేసాడు. వున్నత విద్య 1959లో చికాగోలోని ‘బ్లాక్‌స్టోన్ స్కూల్ ఆఫ్ లా’ లో స్కాలర్‌షిప్ మీద చదివాడు. ‘ప్రయోగాత్మక నాటకాన్ని’ అధ్యయనం చేయడానికి 1960లో యునెస్కో స్కాలర్‌షిప్‌ను పొంది ఐరోపాకు వెళ్లి లండన్‌లోని రాయల్ కోర్ట్ థియేటర్ మరియు పారిస్‌లోని కామెడీ-ఫ్రాంచైజ్ లో అధ్యయనం చేసాడు. ఇథియోపియాకు తిరిగి వచ్చిన తరువాత, ఇథియోపియన్ జాతీయ నాటకరంగానికి అంకితమయ్యాడు.

అతని వృత్తి, జీవిత గమనం మూడు పాలనలతో ముడిపడివుంది, అవి చక్రవర్తి హైలే సెలాసీ రాచరిక భూస్వామ్య పాలన, మార్క్సిస్ట్ నియంతృత్వ మెంగిస్తు హైలేమారియం పాలన చివరగా ప్రజాస్వామ్య మెలెస్ జెనావి పాలన. ఈ మూడు ప్రభుత్వాలు అతని నాటకాలను నిషేధించాయి. అతని 49 రచనలలో, 36 రచనలు ఎదో ఒక సమయంలో సెన్సార్ చేయబడడమో లేదా నిషేధించబడడమో జరిగింది. ఈ కాలంలో యే’దెం అజ్మెరా (బ్లడ్ హార్వెస్ట్), యిషోహి అక్లిల్ (ముళ్ళ కిరీటం) మరియు జోరో డెగెఫ్ (గవదబిళ్ళలు) అను అమ్హారిక్ నాటకాలను రచించాడు.

త్సెగాయే కు 1960 దశకం స్వర్ణ దశకం, ఇథియోపియాకు తిరిగివచ్చి అడీస్ మునిసిపాలిటి లో థియేటర్‌ ఆర్ట్ స్కూల్ స్థాపించి 1961 నుండి 1971 కాలంలో అనేక ప్రముఖ నటులను సృష్టించగలిగాడు. షేక్స్పియర్ రచించిన ‘మక్బెత్’, ‘కింగ్ లియర్’ ‘హామ్లెట్’ ‘ఒతేలో’ మొII నాటకాలు రాజకీయంగా ఇథియోపియన్ పరస్తితులకు అన్వయిస్తూ త్సెగాయే వాటిని అమ్హారిక్ లోకి అనువదించాడు. అలాగే బెర్టోల్ట్ బ్రెచ్ట్ రచించిన ‘సాహస తల్లి’ (Brave Mother) ని అనువదించారు. తాను ఆంగ్లంలో రాసిన ‘ఓడా ఓక్ ఒరాకిల్’ అనే నాటకం ఇథియోపియా, బ్రిటన్, డెన్మార్క్, ఇటలీ, రొమేనియా, నైజీరియా, టాంజానియా మరియు యుఎస్‌లోని థియేటర్లలో ప్రదర్శించబడింది. తన యెకర్‌మెవ్ సెవ్ (రేపటి మనిషి) అనే నాటకం ఇథియోపియన్ థియేటర్‌లో తనను ఒక ప్రత్యేక స్థానంలో నిలిపింది. ఈ నాటకంలో గీజ్, అమ్హారిక్, ఒరోమో భాషలనుండి పదజాలాన్ని తీసుకుని అమ్హారిక్ లో అప్పటివరకు ఉనికిలో లేని సరికొత్త వచనాలను సృష్టించి శక్తివంతమైన వ్యక్తీకరణలను పొందుపరిచి వ్యంగ రచన చేసాడు. అందుకే 1966లో 29 సంవత్సరాల వయస్సులో హైలే సెలాసీ వున్నత పురస్కారాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడయ్యాడు.

విస్తృతంగా ప్రశంసలు పొందిన అతని నాటకాలు ‘టివోద్రోస్ (Tewdros).’ ఈ నాటకంలో చక్రవర్తి తెవోద్రోస్ 1868 లో బ్రిటీష్ చేతుల్లో చావకుండా ఆత్మహత్య చేసుకుంటాడు. రెండవ నాటకం, ‘పెట్రోస్ ఎట్ ది అవర్’ కథలో ఇటాలియన్ ఫాసిస్ట్ ఆక్రమణను ప్రతిఘటించే పోరాటంలో ఇథియోపియన్ దళాలతో పనిచేసిన బిషప్ ‘అబూన్ పెట్రోస్’ అడిస్ అబాబా శివార్లలో శత్రువు చేత పట్టుబడి ఉరితీయబడుతాడు. మూడవ నాటకం, ‘ది ఓడా ఓక్ ఒరాకిల్’, ఇది ఇథియోపియన్ దేశ జీవితాన్ని వివరిస్తుంది, ఇది దేశ విదేశాలలో కూడా గొప్ప ప్రజాదరణ పొందింది.

“ఆఫ్రికన్ కల్చర్, లిటరేచర్ & బ్లాక్ ఈజిప్షియన్ స్టడీస్‌” పై పరిశోధన చేయడానికి త్సెగాయే 1971-72 సెనెగల్‌లో ‘చెఖ్ అంటా డియోప్ యూనివర్శిటీ’ లో ఫెల్లోగా గడిపాడు. అతని అమ్హారిక్ కవితల సంపుటి 1973 లో ‘ఇసాత్ వెయ్ అబేబా’ (నిప్పా పువ్వా) పేరుతో ప్రచురించబడింది. కొద్దికాలం సంస్కృతి మరియు క్రీడల మంత్రిగా నియమించబడ్డాడు. తరువాత 1974 మెంగిస్ నాయకత్వాన ఇథియోపియన్ విప్లవం జరిగింది, దాని ఆగమనాన్ని చిత్రించే, విమర్శించే నాటకాలను రచించాడు.

మార్క్సిస్ట్ మెంగిస్తు హైలేమారియం, ఎంపరర్ హైలె సెలాస్సీ పై తిరుగుబాటు చేసి పదవీచ్యుతుడిని చేసి 1974 లో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు, 1975లో నియంతృత్వ రెడ్ టెర్రర్ సమయంలో ‘త్సెగాయే’ మరో నాటక రచయిత ‘అయాల్నే ములాతు’ తమ రచనల ఫలితంగా జైలు జీవితం గడిపారు. జైలులో ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఆరోజు మరణ శిక్షకు బలికావలసిన వారి పేర్లు చదవబడుతాయి. ఒకరోజు అయాల్నే ములాతు పేరు పిలవడం జరిగింది. ఆపేరు తప్పుగా ఉచ్చరించబడింది, దానిని గ్రహించిన త్సెగాయే ఆ వ్యక్తీ వేరు ఈ వ్యక్తీ వేరు అని వాదించి అయాల్నే ప్రాణాన్ని కాపాడగలిగాడు. జైలులో ఆహారాన్ని మోసుకువచ్చిన కాగితపు సంచులపైనే కవితలు, నాటకాలు రాశారు. 1974-1979 కాలంలో త్సెగాయే రచించిన ఐదు అమ్హారిక్ నాటకాల్లో మూడు నిషేధించబడ్డాయి, అవి హా హు బె సుడుస్ట్ వెర్ (ఆరు నెలల్లో అమ్హారిక్ అక్షరాలూ), ఇన్నాత్ అలెం తెను (తల్లి ధైర్యం – బెర్టోల్డ్ బ్రెహ్ట్ యొక్క తల్లి ధైర్యం నుండి స్వీకరించబడింది) మరియు మెలెక్తే వెజ్ అడెర్ (పనివాడి సందేశం). అతను 1977 లో మత ఘర్షణల అసహనంపై ‘కొల్లిజన్ ఆఫ్ ఆల్టర్స్’ అనే నాటకాన్ని ప్రచురించాడు.

జైలు నుండి విడుదల అనంతరం అడిస్ అబాబా విశ్వవిద్యాలయంలో 1979లో అసిస్టెంట్ ఆచార్యునిగా చేరి థియేటర్ ఆర్ట్స్ విభాగాన్ని ఏర్పాటుచేసి వ్యవస్థాపక డైరెక్టరుగా పనిచేసాడు. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ అల్బెర్టో టెస్సోర్ ఛాయాచిత్రాలతో, త్సెగాయే వాఖ్యానంతో 1984లో “ఫుట్‌ప్రింట్స్ ఇన్ టైమ్” అనే టైటిల్ తో ‘లూసీ (మొదటి హోమినిడ్)’ చరిత్రపూర్వ కాలం నుండి వర్తమానం వరకు ‘కాల సమయాన్ని’ కవితాత్మకంగా వివరిస్తారు. మెంగిస్తు హైలేమారియం 1991లో పదవీచ్యుతుడైన తరువాత వర్తమాన పరస్తితులకు అనుగుణంగా ‘హ హు వేయినిస్ పె పు’ అనే నాటకం శాంతి గురించి రాసాడు, దీనిని ప్రస్తుత ప్రభుత్వం నిషేధించింది.

సామ్రాజ్యవాదులు దొంగిలించి తీసుకెళ్ళిన చారిత్రాత్మక వస్తువులను తిరిగి సాధించాలనే లక్ష్యంతో అక్సమ్ నుండి 1937లో ముస్సోలిని కొల్లగోట్టుకుపోయిన చారిత్రాత్మక ‘అక్సమ్ ఒబెలిస్క్ (స్తూపం)’ తిరిగి తేవడంలో త్సెగాయే దౌత్యపర పోరాటం చాలాగొప్పది. చక్రవర్తి టెవోద్రోస్ పర్వత కోట నుండి తీసుకున్న మాన్యుస్క్రిప్టులు, శిలువలు, గుడారాలు బ్రిటన్ తిరిగి ఇవ్వాలని త్సెగాయే గెబ్రే మెదిన్ తీవ్రపోరాటం చేసాడు.

తుదికంటా ఇథియోపియన్ సంస్కృతిని ప్రోత్సహిస్తూనే చురుకుగా ఉన్నాడు. ఆఫ్రికన్ యూనియన్ 2002లో అతని కవితలలో ఒకదాన్ని దానిని గీతంగా తీసుకుంది. ఆయనకు భార్య లాకెచ్ బితెవ్, ముగ్గురు కుమార్తెలు, యోదిత్, మహ్లేత్, అడేయిలు, ముగ్గురు కుమారులు, అయేనెవ్, ఎస్టిఫానోస్, హైలు ఉన్నారు. డయాలసిస్ సౌకర్యాలు ఇథియోపియాలో లేకపోవడంతో 1998లో తన పిల్లలు నివసిస్తున్న న్యూయార్క్ కి వెళ్ళాడు. ఫిబ్రవరి 25, 2006 న ఈ నల్లజాతి మహాకవి త్సెగాయే మహాట్టాన్ నగరంలో తుది శ్వాస వదిలారు. చక్రవర్తి హైలే సెలాసీ ఖననం చేసిన ఆడిస్ అబాబాలోని హోలీ ట్రినిటీ కేథడ్రల్ చర్చిలోనే త్సెగాయే మృతదేహాన్ని ఖననం చేశారు.

నాటక రచనతో పాటూ కవిత్వాన్ని అవలీలగా రాయగలిగిన నా శక్తి సంపన్నుడు, మచ్చుకు ఆగస్టు 1997న తాను నైలు నదిని కీర్తిస్తూ ప్రేమ తో రాసుకున్న కవిత మీ కోసం ….

ఓ…నైలూ…

నేను సకల భూసారాలకు తొలి పుడమి తల్లిని
నేను మూలాన్ని, నైలుని, ఆఫ్రికాని, నేను ఆరంభాన్ని
మీ శ్వాస ఇప్పటికీ నా నీటి బుగ్గల తంతువులపై వేలాడుతున్న వేళా
ఓ అరేబియా, నీవు నన్ను ఎంత తేలిగ్గా ఎలా విస్మృతి చెందావు?
ఓ ఈజిప్ట్, నీవు నా తొలి ప్రేమలో మొలిచిన మానస పుత్రికవి
అంతులేని తాజా జలాల నీ పట్టపు రాణిని నేను
ఎప్పుడైతే నిన్ను సృష్టించడానికి ఎత్తు పల్లాలల్లో నిన్ను కలిసినప్పుడు
నామెర్ కా మెనెస్ భుజాలపై ఎవరు నా శిరస్సును వాల్చారు?
ఓ, సుడాన్, నీవు నా గర్భము నుండే కదా పురుడు పోసుకున్నావు
నీకు నా జీవిత శాశ్వత నీటి బింధువులను నీ దోసిళ్ళలో నింపినప్పుడు
నీవు తుచ్చమైన బిలియన్ల క్యూబిక్ మీటర్లలో నన్ను ఎలా గణించగలవు?
స్వర్గం కంటి పాప నుండి ఈ భూమి రాలి పడటానికి పూర్వమే,
దాహార్తితో అవనిపై అలమటిస్తున్న వేలాది గొంతులు తడపడానికి,
నా జీవిన శ్వాసనుండి ఉబికి వస్తున్న జల ధారను నేను – నైలును.


ఓ ప్రపంచమా…
నేను నీ తొలి చెలిమెను, ఎప్పటికి నేను నీ ఇథియోపియాను
నేను నీ తొలి ప్రాణాన్ని ఇంకా మనుగడ సాగిస్తున్నానని
నీవు ఇంత తేలిగ్గా నన్ను ఎలా మర్చిపోయావు?
నేను భూకేంద్రకం నుండి సూర్యుడివలె లేస్తాను
నేను అంటురోగాలను భస్మం చేసి జయిస్తాను
నేను ఇథియోపియాను ‘చేతులు చాచి దేవుడుని ప్రార్థిస్తున్న’
నేను భూమిపై సుదీర్ఘ ప్రయాణంలో ఎత్తైన ప్రయాణికుడికి తల్లిని


నా పేరు ఆఫ్రికా…. నేను నైలు నదికి తల్లిని.
ఓ నైలు, నీవు అస్తిత్వపు లయను పునరుద్ధరించే సంగీతానివి
మధ్యప్రాచ్య అంధత్వాల ఇబ్బందికర గడబెడ వాకిళ్ళలో
నీవు శాంతిని పండించే జల వనరువువి
నా ఇథియోపియన్ పవిత్ర పర్వత భానుని దాటి
తూర్పున ఎడెన్, సినాయ్ మీదుగా ప్రవహించి
జిబ్రాల్టర్ ఆవల మొరియా పర్వతాలల్లో ఎగబాకిన ప్రవాహనివి
విశ్వ శాంతి కొరకు త్యాగనిరతితో
కేవలం ఈ ప్రపంచ హేతువుకై జీవించేవున్నావు.


ఓ… నైలూ… నీవు గర్వించదగిన పుత్రికవి
పురాతన ప్రపంచానికి నిటారుగా దయతో ఎలా నడవాలో నేర్పావు
ఓ మానస పుత్రికా.. నైలు…
ఆహారానికై తోబుట్టువును అమ్ముకున్న యాకోబును నీ చనుబాలతో ప్రాణం పోసావు.
బాల ప్రవక్త మోసెసును నీ అలల ఉయ్యాలో హత్తుకుని పోషించి తినిపించి పెంచావు
హేరోదు వధించే కసాయి కత్తుల నుండి రక్షణ కవచంగా నీ చేతులు చాచి బాల క్రీస్తును రక్షించావు.


ఓ నైలు, నా అనంత మానస పుత్రికా
తలవంచని పర్వతం లాంటి అలెగ్జాండరే శిరస్సు వంచి నీ పాదాల వద్ద వంగి నప్పుడు
నీ క్షీర జలాన్ని తీర్తంలా అందించి జీవగంజి పోసావు.
ఓ నైలు, శిరస్సులు వంచని సీజర్ లాంటి మహాకాయ దిగ్గజాలు
నెపోలియన్ లాంటి విశ్వ విజేతలు
నీకు వంగి నమస్కరించి నీ అనుగ్రహపాత్రులైనారు
నీ అపార జల సంపదతో ఉదారంగా వారి దాహార్తిని తీర్చావు
ఓ నైలు, నీవు మహత్తర కీర్తిని పొందిన ఆఫ్రికన్ రక్త రేఖవి
ప్రపంచంలోని ఆకలితో ఉన్నవారికి పంటలందిస్తావు
బధిర ప్రపంచానికి ఇథియోపియన్ మ్రోగించే మంజీరానివి నీవు
మనోహర లయవిన్యాసాల అద్భుత నర్తకివి
నీ తోబుట్టువులైన ఎత్బారా, షబలేలతో గుసగుసలాడుతావు
మీ చెల్లెళ్ళు ఆవాష్, జుబా లతో
అరేబియా నిస్సార ఇసుక భూములను సారవంతం చేస్తావు
ఓ నైలు, నీవు వరప్రసాదం కానిచో మధ్యధరా మరణ నీటి శిలనే
సహారా అస్థిపంజరాల బుట్టనే
నీవు జీవాన్ని నింపే ఆఫ్రికా నల్ల నేలవి
దాహం వేసిన జనాన్ని దాహార్తి తీర్చే క్షీర జలానివి నీవు
ఓ నైలు, నీవు నా సువార్తను మోసుకొచ్చే దూతవి
నీవు సమృద్ధిగా పంటను పేదవారి నోటికి అందించే అక్షయపాత్రవి
నీవు ఇథియోపియా తొలి నీటి ఊటవు నీవు సకల సౌభాగ్యాలను నింపిన తొలి పుడమి తల్లివి
నీవు భూకేంద్రకం నుండి సూర్యుడిలా లేస్తావు నీవు అంటురోగాలను భస్మం చేసి జయిస్తావు
నీవు ఆఫ్రికామూలవాసివి… జీవ వనరువి… నీవు ఇథియోపియావి… నీవు జీవనది నైలు నదివి.

ఇథియోపియన్ సాహిత్య ఉద్యాన వనంలో త్సెగాయే స్థానమేంటో తన అద్భుతమైన ఫుట్ ప్రింట్ ఆఫ్ టైమ్ ద్వారా విశదమౌతుంది, అతను ఇథియోపియాను ఈ విధంగా చిత్రించాడు…

“మొట్ట మొదట ఇంద్రధనస్సులోని రంగుల ఐక్యతను సృష్టించింది ఈ నేలనే. భూగోళపు మొదటి ఖండంలోని (ఆఫ్రిక) పరుపు బండల మీద నడుస్తాము. ఇక్కడే జీవ సృష్టికి మూలాలు పడింది. పరిణామక్రమంలో మొదట మానవ కుటుంబం నాటబడింది ఇక్కడే …. పరిణామక్రమంలో తరతరాలుగా పయనించిన పూర్వీకుల పాదముద్రలపై మేమూ నడుస్తాము.”

అంటూ తన అపారమైన వారసత్వాన్ని తన దేశభక్తి చాటుకున్న నల్లజాతి ఇథియోపియన్ లెజెండరీ నాటక నవ వైతాళికుడు త్సెగాయే గెబ్రే మెధిన్, చిరస్మరణీయుడు.

• నామెర్ కా మెనెస్ ఈజిప్ట్ తోలి రాజు అని ప్రజల విశ్వాసం
• ఎత్బారా, షబలే, అవాష్, జుబా – ఇథియోపియా నదులు

ఊరు సిరిసిల్ల. సాహితీ ప్రియుడు. ఆఫ్రికా లో రెండు దశాబ్దాలు అధ్యాపకుడు గా పనిచేసాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం.

5 thoughts on “ఇథియోపియన్ ఆధునిక నాటక వైతాళికుడు – త్సెగాయే గెబ్రె మెధిన్

  1. 👏👏👏Excellent article Srinu. The fact that it comes from your own experiences makes the article more authentic and organic

  2. మంచి వ్యాసం శ్రీనూ.. ఇథియోపియా, ఎరిత్రియా దేశాల రచయితలు, కళాకారుల గురించీ, సాహిత్యం గురించీ అవసరమైన, విలువైన సమాచారం. నీ నుంచి మరిన్ని వ్యాసాలను ఆశిస్తున్నాం. Thank you..

Leave a Reply