తేమలేని రాళ్ళు!

“షిట్”

ఎక్కడా చోటు లేనట్టు హాలు మధ్యలో గొబ్బెమ్మ. అందుకే చూసుకోకుండా అడుగు వేశారు నాన్న. ఒంటికాలితో అలాగే నిలబడ్డారు. అడుగు తీసి అడుగు వెయ్యడానికి లేదు. తూలుతూ నిలదొక్కుకుంటూ బాలన్స్ చేస్తూ ఫీట్స్ చేస్తున్నారు.

“యాక్”

అరచేత్తో ముక్కూ నోరూ మూసుకొని నవ్వుతూ నాన్నని చూస్తోంది స్వీటీ.

“కుయ్”

అంతవరకూ యేమూలనో వున్న పప్పీ అది తాను చేసిన గొప్పపనే’నన్నట్టు అరుస్తూ ముందుకొచ్చింది. నాన్న చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. చేస్తూ మధ్యమధ్యలో వాసన చూస్తోంది. చాలదన్నట్టు తలపైకెత్తి నాన్న ముఖంలోకి చూస్తోంది. ముఖం నిండా కప్పేసిన తెల్ల కుచ్చుల బొచ్చులోంచి దాని కళ్ళు మబ్బుచాటు చందమామల్లా మిలమిలమని మెరుస్తున్నాయి.

“ప్చ్”

లోపలినుంచి వచ్చిన అమ్మ నిట్టూర్చింది. అంతలోనే నాన్న చేస్తున్న ఫీట్స్ చూసి నవ్వింది. నవ్వి దూరంగా జరగడానికి అన్నట్టుగా అడుగులు వెనక్కి వేసింది. అంతలోనే తనూ వెయ్యకూడని దానిమీద కాలు వేసినట్టు ఆగిపోయింది. గ్రహించినట్టు చూపులు సహితం స్తంభించిపోయాయి. ఒంటికాలిమీద నిలబడింది అమ్మ. అమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేసింది పప్పీ.

అమ్మ ముఖంలో మాయమైన నవ్వు నాన్న ముఖంలో పొడిచింది. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. రెండు క్షణాలు నవ్వులు. అంతలోనే యేడుపు ముఖాలు. పసిగట్టినట్టే పప్పీ వెళ్ళి అమ్మ కాళ్ళను నాలుకతో నాకింది. కితకితలు వేసింది. అమ్మ యెత్తిన కాలిని నేలమీదికి దించేసింది. అదిరింది. వద్దన్న పని చేస్తూ పప్పీ మళ్ళీ కాళ్ళను నాకింది. ఇల్లంతా అలికినట్టయ్యింది. నొచ్చుకుంది అమ్మ.

పప్పీ పరుగున వెళ్ళి నాన్న మోకాలి కింద మూతిని ఆనించింది. ఆ వేడి శ్వాసకి కదిలిపోయారు. బాలన్స్ చేసుకోలేక రెండుకాళ్ళూ నేలమీద పెట్టేశారు. పప్పీ తనని యెక్కడ నాకుతుందోనని కంగారుపడి యిల్లంతా పరుగులు తీశారు. అచ్చోసిన అడుగుల కృష్ణాష్టమి పండుగ యింటికొచ్చింది.

నెత్తి కొట్టుకుంది స్వీటీ.

ఆనక అమ్మానాన్నా వొంటికాలితో గెంతుకుంటూ బాతురూము వైపు వెళుతుంటే అప్పుడే వచ్చిన చింటూ నమ్మలేనట్టు చూశాడు. “హాయ్… మమ్మీడాడీ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు” అని పరుగున వచ్చి వెయ్యకూడని చోట అడుగువేశాకే అర్థం చేసుకున్నాడు. తనూ వొంటికాలితో గెంతుకుంటూ అమ్మానాన్నల్ని బుద్ధిగా అనుసరించాడు.

స్వీటీ ముద్దుచేస్తూ “తప్పుకదూ” అంటూ చూసింది. చూపులు అర్థమయినట్టు వచ్చి పక్కన చేరింది పప్పీ. “కూర్చో” అంటే కూర్చుంది.

“బ్యాడ్ బోయ్”

“కుయ్”

ఒప్పుకున్నట్టు తలవంచింది పప్పీ. దాని బొచ్చుని మెచ్చుకోలుగా చేతివేళ్ళతో దువ్వింది స్వీటీ.

ఇల్లూ వొళ్ళూ శుభ్రం చేసుకొనేసరికి అరపూట పట్టింది. తప్పు పప్పీది కాదన్నట్టు “అన్నయ్య బయటకు తీసుకు వెళ్ళుంటే ప్రాబ్లమ్ అయ్యేదే కాదు” అంది స్వీటీ. “బయటకు తీసుకువెళ్తే స్ట్రీట్ డాగ్స్ వెంటపడుతున్నాయి తెలుసా?” అర్థం చేసుకోరు అన్నట్టుగా చూశాడు చింటూ. అర్థం అయినట్టు ముఖా ముఖాలు చూసుకున్నారు అమ్మానాన్నలు.

“ఈ పప్పీకి అక్కడ కరవడం రాదుకాని, యిక్కడ సిద్దూగానికి బైట్ యిచ్చింది. వాళ్ళ మమ్మీ నిన్న పొద్దుట నాతో గొడవకు దిగింది. ఏమంటాం? తప్పు మనదగ్గర పెట్టుకొని…” అమ్మ కంప్లైంట్ చేస్తుంటే అమ్మాయకపు కళ్ళతో యేమీ యెరగనట్టు చూసింది పప్పీ. ఆ చూపుతో అమ్మ కోపం యెగిరిపోయినట్టే వుంది. ముద్దుగా మొట్టింది.

“ఆ సిద్దూగాడు యెప్పుడూ- మన పప్పీ కనబడినప్పుడల్లా- దీని తోకపట్టుకొని లాగుతాడు మమ్మీ..” అని, పప్పీ తోకని కొడవలిలా నిలబెడుతూ “యూ డన్ వెరీ గుడ్ జాబ్” మెచ్చేసుకుంది స్వీటీ.

“కుయ్”

“థాంక్స్ చెపుతోంది” అంది స్వీటీ.

ఆ మాట విని పప్పీ తన కాలిని యెత్తి స్వీటీ అరచేతిలో పెట్టింది.

“పప్పీకి అన్నీ అర్థమవుతాయి” గర్వంగా అన్నాడు చింటూ. తనూ చెయ్యిచాపి షేక్ హ్యాండ్ అందుకున్నాడు.

వీధి బయట యేదో చిన్న అలికిడి అవడమే తరువాయి ‘భౌ భౌ’మని అరుస్తూ అక్కడినుండి పరుగు తీసింది పప్పీ.

పిల్లలిద్దరూ దాని వెంట పరుగులు తీశారు.

అమ్మా నాన్నా వొకర్ని వొకరు చూసుకున్నారు. వారి మౌనం యెన్నో మాటల్ని గుర్తుచేసినట్టే వుంది. ‘నేను చెప్తాగా’ అన్నట్టు కళ్ళ రెప్పల్ని సౌజ్ఞగా దించి భరోసా యిచ్చారు నాన్న. నమ్మకం చాలనట్టు అమ్మ తలను అడ్డంగా వూపి నిట్టూర్చింది.

అంతలోనే పిల్లలిద్దరూ యింట్లోపలికి వచ్చారు. వాళ్ళ కాళ్ళ మధ్యలోంచి దూరి వాళ్ళకన్నా ముందు వచ్చింది పప్పీ.

“మనం వెనకాల వుంటే పప్పీకి బోల్డు ధైర్యం, సింహం మీదికి కూడా దూకేస్తుంది” అంటూ నవ్వుతోంది స్వీటీ. ఆ మాటకు “దానికి మనమీద నమ్మకం వుంది. కాని మనకే దానిమీద నమ్మకం లేదు” నవ్వకుండా అన్నాడు చింటూ. విన్న అమ్మానాన్నాలు ముఖాముఖాలు చూసుకున్నారు.

ఎప్పటిలా ఆరాత్రి అందరూ బెడ్ మీద చేరారు. పప్పీ కూడా యెగిరి దూకి స్వీటీ చింటూల మధ్యలో కుయ్ కుయ్ మని చొరబడి చోటు చేసుకు పడుకుంది. కూ… అని రాగాలు తీసి గారాలు పోయింది. దాని మీద చెయ్యివేసి నిమిరితే గాని ఆ గారాలు ఆపలేదు. అమ్మ కథలు చెప్పడం మొదలుపెట్టకముందే యెన్నడూ లేనిది నాన్న “పెట్ స్టోరీస్ చెప్పుకుందాం” అని మొదలు పెట్టారు. “ఆవూ కుక్కా పిల్లీ ఫిష్హూ పావురాలూ కోళ్ళూ బాతులూ రాబిట్ పేరట్…” అంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు.

“మనం ఆవుని పెంచుకుంటే?” యెలావుంటుంది అన్నట్టు ఆశగా కళ్ళు యింతింతలు చేసింది స్వీటీ.

నాన్న కనుగుడ్లు అంతకంటే పెద్దగా బిగించి మరీ తేలేశారు. అదేదీ గమనించకుండా “చిన్ని ఆవుకి వో బుజ్జి వైట్ బేబీ పుడితే…” స్వీటీ చెప్పక ముందే, “మిల్క్ పేకెట్స్ కల్తీ, సో మనం నేచురల్ మిల్క్ తాగొచ్చు” అన్నాడు చింటూ. “ఛీ- సిగ్గులేదూ? బేబీ మిల్క్ మనం తాగేస్తే మరి…” స్వీటీ మాట పూర్తికాకముందే చింటూ పగలబడి నవ్వాడు. ఆ నవ్వుకి అర్థం అమ్మానాన్నలకు బోధ పడినట్టే వుంది.

అందుకనే నాన్న కల్పించుకొని “నా చిన్నప్పుడు మా యింట్లో ఆవులు వుండేవి” అన్నారు. “ఊ-ఊ” చెప్పమన్నట్టు ఆసక్తిగా అంది స్వీటీ. “వ్యవసాయం క్లోజ్ చేశాక కూడా మా అమ్మ ఆవులు పెంచింది. పాల కోసం. పాడే పరిశ్రమ. ఊళ్ళల్లో…” చెప్పకముందే “ఇప్పుడు యెందుకు వొక్క ఆవు కూడా లేదు?” స్వీటీ అడిగింది. “దాణా దొరకడం నుండి పితికిన పాలు డైరీకి పోసినదాక అన్నీ ప్రాబ్లమ్సే, నానమ్మ చెప్పింది” అన్నాడు చింటూ.

“నానమ్మనే అడుగుదాం” స్వీటీ సెల్ పట్టుకు పరుగున వచ్చింది. చింటూ అందుకొని కాల్ చేశాడు. స్పీకర్ ఆన్ చేశాడు. రింగవుతోంది. నాన్న వంక చూస్తోంది అమ్మ.

“అయ్యా…”

“మేం నానమ్మా… నేను స్వీటీని. నేను చింటూని…” పిల్లలిద్దరూ పోటీ పడ్డారు. ‘మీరు మాట్లాడొద్దు’ అన్నట్టుగా అమ్మానాన్నల్ని చూస్తూ చింటూ తలడ్డంగా వూపి నోటిమీద వేలు పెట్టుకున్నాడు. గుసగుసగా నవ్వుతూ స్వీటీ కూడా అదే చేసింది. అలాగేనన్నట్టు తలాడించింది అమ్మ. నాన్న మూగగా చూశారు. కుయ్ మంది పప్పీ.

“బాగున్నారమ్మా స్వీటూ… చింటూ…”

“ఊ…”

“మీ అమ్మా నాన్నా?”

“ఊ… సినిమాకెళ్ళారు” స్వీటీ అమ్మానాన్నలను చూసి నవ్వింది. అమ్మానాన్నలు అయోమయంగా చూస్తున్నారు.

“మీరేం వుండిపోయినారు?” నానమ్మ అడగక ముందే ఎగ్జామ్స్ వున్నాయని చెప్పేసి “మాకో డౌట్ వచ్చింది నానమ్మా?” అంది స్వీటీ. “నిన్ను అడుగుదామని…” వంతపాడాడు చింటూ. “నాకంత తెలివి వుంటే యింకేమి?” నొచ్చుకుంది నానమ్మ. టెక్స్ట్ బుక్కులో డౌట్స్ అయితే యెవరయినా చెప్తారని, యిది అది కాదని అన్నారు యిద్దరూ. “ఊ… మరి?” అంది నానమ్మ.

“నువ్విప్పుడు ఆవులు యెందుకు పెంచడం లేదు?”

సూటిగా అడిగిన ప్రశ్నను నానమ్మ వూహించలేదో అర్థం చేసుకోలేదో అటునుంచి జవాబు రాలేదు. అమ్మానాన్నలు మాటాడబోతే పిల్లలిద్దరూ నోటి మీద వేలు పెట్టుకు చూపించారు. ప్లీజ్ అన్నట్టు ప్లీజింగుగా ముఖాలు పెట్టారు. అమ్మానాన్నా ఆగిపోయారు. పిల్లలు ఫోన్లో అడిగిన ప్రశ్నే అడిగారు.

“ఇప్పుడెందుకు….”

“ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్…”

నానమ్మని చెప్పేదాకా పిల్లలు వదల్లేదు.

“మీ నాన్నే కారణం”

ఆ మాటకు వులిక్కిపడ్డట్టుగా చూశారు నాన్న. నాన్న వంక అమ్మా పిల్లలూ అంతా తలతిప్పి చూశారు.

“మా డాడీకి ఆవులు యిష్టం లేదా?”

“లేదు, ఆవులు పెంచడం యిష్టం లేదు. పిల్లుంటే పియ్యుండదా?- అని సామెత. అలాగ ఆవున్నప్పుడు రొచ్చూ వుచ్చా పేడా కసువా వుండదా? అవన్నీ మీ నాన్నో యింట్లో యెవరైనా చేస్తున్నారా? లేదు, అదీ లేదు. నేను చేస్తే వీళ్ళు అలిసిపోయేవోళ్ళు. ఏమైనా అంటే నువ్వు కష్టపడ్డం యిష్టం లేదనేవోళ్ళు… మీ అత్తలు కూడా…”

అపరాధిలా కాకుండా అర్థం కానట్టు ముఖం పెట్టారు నాన్న. నవ్వుతో తన ఫీలింగ్ కవర్ చేసుకుంటూ. అమ్మ నవ్వకుండా నాన్నని చూస్తోంది.

“నువ్వు కష్టపడకూడదని డాడీ…” స్వీటీ మాట పూర్తి కాలేదు. “పైకి రామరామ… లోపల సీతారామ. నోటికి రుచిగా పాలూ మీగడా అందాలి కాని పేడ కంపు కదా? అయినా పేడతో పిడకలు పెట్టుకోమా? మీ నాన్న ఆచేత్తో వడ్డించొద్దు అనేవాడు. మనమెల్తే కడుక్కోవడం లేదా? ఆ చేత్తో మరి యే పనీ చెయ్యడం లేదా?…”

స్పీకర్లో వస్తున్న మాటలకు వూకొడుతున్నట్టు కుయ్ మంది పప్పీ.

“…ఊళ్ళల్లో యీ రోజుల్లో యింకా వ్యవసాయం చెయ్యడమే నామోషీ.  అలాంటిది ఆవులు పెంచడం మేకా గొర్రీ పెంచడం మరీ వెనకబడిపోయినట్టు. పెద్ద లాబమొచ్చే యాపారం కూడా కాదు. పైగా స్టేటస్సు. ఆమాట చెప్పకుండా మీనాన్న డొంక తిరుగుల్లాడీవోడు. ఇల్లంతా దోమలని. కంపని. చదువుకున్న వాతావరణం లేదని అనోడు. నాకడుపున పుట్టినోడి మాటకర్దం నాకు తెలీదా తల్లీ?” నవ్వింది నానమ్మ.

నాన్న తప్పు చేసినట్టు ముఖం దాచుకోవడానికన్నట్టు తల దించుకున్నారు.

“అలాగన్నీ యెత్తిబెట్టీసాం. వెన్నా జున్నూ లేని అనాదలయ్యారు మీరు…” ముక్కు చీదిన చప్పుడు. స్వీటీ చింటూ వొకర్నొకరు చూసుకున్నారు. సైలెంటయిపోయారు.

“ఆవు లక్ష్మీదేవి అనుకొనే ఆ కాలం మాటకేం గాని మీ నాన్నకివన్నీ చెప్పకండి. బాధ పడతాడు. ఇన్నాలు నా కడుపుల పెట్టుకున్నది నా మనవలు అడిగీసరికి కక్కుకున్నాను”

“నానమ్మా… మనం అస్సలు యేమీ మాట్లాడుకోలేదు, సరేనా?” పేద్ద నంగనాచిలా అంది స్వీటీ.

“సారీ, నువ్వు పడుకో” అన్నాడు చింటూ.

“జాగర్త, మీ నాన్నా అమ్మా బాగున్నారు కదా, వుంటాను”

“ఊ… గుడ్ నైట్” చెప్పారు పిల్లలిద్దరూ.

నిశ్శబ్దం.

స్వీటీ చింటూ యేదో అడగబోతే అమ్మ ఆలస్యమైందని పడుకొమ్మని కేకలేసింది. కాని అమ్మకీ నాన్నకే కాదు, పిల్లలకీ వూళ్ళో వున్న నానమ్మకీ యెవరికీ యెందుకో అంత తొందరగా నిద్ర పట్టలేదు.

తెల్లవారింది. రోజు రోజూలాగే గడిచింది. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ బబ్లీవాళ్ళూ సెకండ్ ఫ్లోర్ సిద్ధూవాళ్ళూ దెబ్బలాడుకున్నారు. నాన్న అడిగితే అమ్మ ఆ విషయమే చెపుతోంది. “వాళ్ళకీ వీళ్ళకీ యేo లేదు, అంతా పిల్లుల వల్లే…”

“పిల్లలు యివాళ దెబ్బలాడుకుంటారు, రేపు కలుస్తారు… అవన్నీ పట్టించుకుంటే యెలా?” అన్నారు నాన్న. ఆ మాటకు స్వీటీ చింటూ పగలబడి నవ్వారు. నాన్నకి అర్థం కాలేదు. అందుకే యిందులో నవ్వడానికేముంది అన్నారు.

“పిల్లలు కాదు పిల్లులు”

అమ్మ వొత్తి పలికింది. “మ్యావ్” అనువాదం చేసింది నవ్వుతూ స్వీటీ. వెంటనే నాన్న “వాళ్ళ పిల్లి వీళ్ళ యింట్లో పాలు తాగేసిందా?” అనుమానంగా అడిగారు. అమ్మ అడ్డంగా తలూపింది. “వాళ్ళ పిల్లి వీళ్ళ యింట్లో ఎలకలు పట్టుకు పోయిందా?” నాన్న నవ్వారు.

“అసలు సిద్ధూవాళ్ళ యింట్లో ఎలకలు యెక్కువ అయిపోయాయని బబ్లీవాళ్ళ పిల్లిని తెచ్చి వదిలారు” అన్నాడు చింటూ. “అసలు ఈవిడే ఆవిడ్ని వదినా మా యింట్లో ఎలుకలు యెక్కువైపోయాయి, మీ పిల్లిని మా యింట్లో వదులూ అంది. వదిలింది. అలవాటు చేసింది. ఆ పిల్లి కూడా ఎలుకల్ని పట్టింది. ఎలుకల్ని పట్టినందుకు ఆ పిల్లికి పాలు కూడా పోసింది” అమ్మ చెపుతోంది. మధ్యలో నాన్న “ఇప్పుడు పిల్లిగల వాళ్ళ యింటికి పిల్లి వెళ్ళనంటోదా?” ఆడిన పరాచికాలకు అమ్మకు చిరాకు వచ్చినట్టుంది. చెప్పడం ఆపేసి వెళ్తుంటే అమ్మ వెంట పడ్డారు నాన్న. “సారీ” అని నాన్న తన చెవులు పట్టుకోకుండా అమ్మ చెవులు పట్టుకున్నారు. నాన్నతో పాటు అమ్మా నవ్వేసింది. అప్పుడు అసలు విషయం చెప్పింది.

ఎలకలు పట్టడం పట్టించడంతో కథ అయిపోలేదు. ఈ పిల్లి వెంట మరో మగ పిల్లి పడింది. రెండు పిల్లులూ కలసి మెలిసి తిరిగేవి. పోట్లాడేవి. ఇప్పుడు యీ పిల్లి వొట్టిది కాదు. రేపో మాపో పిల్లలు పెడుతుంది. అయితే యీ పిల్లులు రెండూ కలిసి ఎలకలు తినడంతో అయిపోలేదు. ఎక్కడో బయటకుపోయి యెండు చేపలూ పారేసిన చేపపొట్టూ దొరికినవి తెస్తున్నాయి. వాళ్ళింట్లో తరిమేస్తే వీళ్ళ యింటికి వచ్చేస్తున్నాయి. పైగా ఆ పిల్లి రేపోమాపో పిల్లలు పెడుతుంది. దాన్ని తరిమేస్తే పాపం. ఉంచుకుంటే పెంట. అదీ పెంట గొడవ.

“పిల్లి తన పిల్లల్ని యేడిళ్ళు తిప్పుతుందని సామెత. ఆ సామెతని నిలబెట్టుకోవడానికైనా పెట్టిన పిల్లల్ని తీసుకుపోతుంది, డోంట్ వర్రీ అని చెప్పు” నవ్వుతూ అన్నారు నాన్న. “అప్పుడు గాని గొడవ మనవైపు తిరగదు. మొన్న మన పప్పీ వాళ్ళ సిద్ధూని కరిచిందేమో అసలే భగ్గుమంటోందావిడ. అయినా అంత జాలి వుంటే తీసుకెళ్ళి మీ యింట్లో పెట్టుకోండి అంటే యేo చేస్తాం?” అమ్మ మాటకు నాన్న నోరు మూత పడింది.

విండోలోంచి చూస్తున్న నాన్న చూపులు అలాగే వుండిపోయాయి. పక్కనే వచ్చి నిలబడింది అమ్మ. స్వీటీ చింటూ కూడా చూస్తూ వున్నారు. కనబడకపోయినా పప్పీ కూడా వచ్చి కాళ్ళ దగ్గర కదలాడింది. బోయవాడి వలలో చిక్కుకున్న పావురం కథ కంటిముందు కదలాడింది. ఇక్కడ బోయవాడు లేడు. పావురం అయితే చిక్కుకుంది. టపటప రెక్కలు కొట్టుకుంటూ ఆ వల లోపల అన్ని దిక్కులకూ కలియదిరుగుతూంది. బయటపడడానికి ప్రయత్నిస్తోంది. దారి లేదు. ఎగిరి యెగిరి రెక్కల్లో బలమూ లేదు. చిరిగిన వలలోంచి లోపలికి వచ్చినట్టుంది. వచ్చినప్పుడు కనిపించిన తోవ దానికి వెళ్ళినప్పుడు కనిపించడం లేదు. దాని కళ్ళలో ప్రాణ భయం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా వలకు యివతల దాని జంట పావురం నజ్జుగుజ్జయిపోయి ప్రాణం వొదిలేసేలా వుంది.

“చెట్లమీద వుండకుండా పావురాలు యిళ్ళమధ్యలో యెందుకని వుంటాయి?” స్వీటీ అడిగింది.

“చెట్లు యెక్కడ వున్నాయి? కొట్టేస్తే యెక్కడో దగ్గర వుండాలి కదా?” అన్నాడు చింటూ.

ఎన్నో సాయంత్రాలు అమ్మానాన్నా టీ తాగుతూ ఆ విండో లోంచి యెన్నో పావురాలని చూసేవాళ్ళు. అవి మెడలు రాసుకోవడం మూతులు పొడుచుకోవడం వొకదాని చుట్టూ వొకటి వొదలకుండా తిరగడం… చూసి ‘వాటిలా వుండాలి’ అని నాన్న అమ్మని ముద్దుపెట్టుకోవడం గుర్తుకువచ్చిందేమో అమ్మానాన్నా యిద్దరూ వొకర్ని వొకరు చూసుకున్నారు. అలాగే యిద్దరూ గొడవ పడితే ఆ విండో దగ్గరకు రావడం పావురాల్ని చూడడం ‘మీకున్న బుద్ధి మాకు లేదు’ అనుకోవడం అన్నీ మరచి వొక్కటి కావడం… బోలెడన్ని జ్ఞాపకాలే వున్నాయి. మళ్ళీ జన్మ అంటూ వుంటే పావురాలై పుట్టాలని కూడా కోరుకున్నారు.

“ఇంక పావురాల్ని మరి చూడలేం” బాధగా అంది స్వీటీ.

“పావురాలన్నీ చేరి రెట్టలేసి గోడలన్నీ గలీజు చేసేస్తున్నాయి, కొత్త బిల్డింగులు కూడా పాతగా కనిపిస్తున్నాయి. అందుకే యిప్పుడు అందరూ నెట్టులు కట్టుకుంటున్నారు” అన్నాడు చింటూ.

చీకటి పడింది. లైట్లు వేశాక అలవాటుగా స్వీటీ చింటూ యిద్దరూ పుస్తకాలు తీశారు. వాళ్ళు చదువుకుంటూ వుంటే అమ్మా నాన్నా యిద్దరూ పక్కనే కూర్చున్నారు. అప్పుడు నాన్న పక్కకు వచ్చిన పప్పీని వొళ్ళోకి తీసుకుంటూ “యిబ్బంది పడితే తప్పదు, దేన్నయినా వొదిలించుకోక తప్పదు…” అన్నారు నాన్న. ఆ మాట అమ్మకి అర్థమయినట్టే వుంది. అందుకనే అలా వొక్క క్షణం నాన్న కళ్ళలోకి చూసింది. కాని పిల్లలకు అర్థం కాక పుస్తకాలలోంచి తలలెత్తి చూశారు.

“ఇప్పుడూ… అంటే అప్పుడు మీ అత్తయ్యవాళ్ళు కోళ్ళు పెంచేవాళ్ళు, ఇప్పుడు మానేశారు. తప్పదు. అంతే” నాన్న యేమి చెపుతున్నారో అర్థంకానట్టు క్వశ్చన్ మార్కు ఫేసులు పెట్టారు పిల్లలు.

“కోళ్ళు కూడా పెంచితే బాగుంటుంది. గుడ్లు వస్తాయి. కావలసినప్పుడు కోసుకోవచ్చు. పైగా నాటు కోళ్ళు. ఊ…” నాన్న మాటలకు తడుముకుంటూ వుంటే స్వీటీ “మరి అత్తయ్య కోడి పిల్లలు చేసింది కదా?” వుత్సాహంగా అడిగింది. “ఊ” అన్నారు నాన్న. అని ఆగలేదు. “కోళ్ళు కూడా భలే కాపలాయే యింటికి. ఎవరైనా కొత్తవాళ్ళు వస్తే యెగిరి దూకేవి. ముక్కుతో పొడిచేవి. కాళ్ళతో రక్కేవి” గుర్తుచేసుకుంటూ వున్న నాన్న వంక అమ్మ చూసింది. నాన్న గమనించలేదు.

“భలే బుజిబుజ్జిగా భలే భలే రంగు రంగులతో వుంటాయి కోడి పిల్లలు. వాటిని పట్టుకుంటే మెత్తగా మరీ గులాబీ రేకుల్లా స్మూతుగా వుంటాయి…” స్వీటీ చెప్పుకుపోతుంటే “నువ్వెప్పుడు యెత్తుకున్నావ్?” అడిగాడు చింటూ. సమ్మర్ హాలీడేస్లో వెళ్ళినప్పుడు కోడి పట్టు దించిన విషయమూ- అప్పుడు అరచేతుల్లో పుట్టిన కోడి పిలల్ని పెడితే అవి యెంత అందంగా అపురూపంగా వున్నాయో- చెంపలకు తాకించుకుంటూన్నప్పుడు కలిగిన స్పర్శ… యిప్పుడు గుర్తుచేసుకుంటున్న స్వీటీ కళ్ళలో ఆ అనుభవం చెదరకుండా కనిపించింది.

అప్పుడు అమ్మ చూసిన చూపుతో అసలు విషయంలోకి వచ్చినట్టు “కోళ్ళు యెక్కడికక్కడ షిట్ వెళ్ళేస్తాయి, కంపు. అందుకని అత్తయ్య కోళ్ళు పెంచడం మానేసింది..” అన్నారు నాన్న. అసలు విషయం చెప్పబోతుండగా స్వీటీ అంది. “డాడీ నీకు ఆవులు పెంచడం యిష్టం లేనట్టే మావయ్యకు కోళ్ళు పెంచడం యిష్టం లేదా?”

ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

స్వీటీకీ చింటూకీ విషయం యెంతో కొంత అర్థమయినట్టే వుంది. అందుకే నెమ్మదిగా పుస్తకాల్లోకి తలలు దూర్చారు. చాలదన్నట్టు పైకి కూడా చదువుతున్నారు.

అమ్మ అక్కడినుండి లేచి వెళ్ళిపోయింది. వంట చేసింది. నాన్న సాయం చేశారు. భోజనాల దగ్గర మాటల్లేవు. ఒక్క పప్పీ కూకూ-లు తప్ప. బుద్ధిగా పప్పీ తనకు పెట్టింది తింటోంది.

“పప్పీ రేపటినుంచి వుండదు”

పిల్లలు తినడం ఆపి ఆ మాట అన్న అమ్మ వంక చూశారు. ‘ఔను’ అన్నట్టు తలూపింది అమ్మ. పిల్లలిద్దరూ యింకా అర్థం కానట్టు వొకర్ని వొకరు చూసుకొని నాన్న వంక చూశారు. తలదించుకొని అన్నం తింటున్నారు నాన్న. అప్పటికే తన పేరు విన్న పప్పీ యేదో పనిపడ్డట్టు పరుగున వీధి వరండాలోకి వెళ్ళి వచ్చింది. తన వునికిని తెలియజేస్తున్నట్టు కూకూ-మంది.

“ఎందుకు?”

“ఓనరుగారు వద్దన్నారా?”

అమ్మానాన్నల నుండి జవాబు లేదు. తినమన్నట్టు సౌజ్ఞగా చూసింది అమ్మ. పిల్లలు చేతులు వేళ్ళాడేసి అలాగే కూర్చున్నారు.

“ఎవరికి యిచ్చేస్తున్నారు?”

“ఎందుకు యిచ్చేస్తున్నారు?”

తిని లేస్తూ “మీరు స్కూళ్ళకీ మేం డ్యూటీలకీ పోతే పప్పీకి రోజంతా యింట్లో బంధించినట్టు వుంచడం యెంత కష్టం?” అన్నారు నాన్న. “దానికా కష్టం? మీకా?” అడిగాడు చింటూ.

“ఔను, పప్పీ ఆలనా పాలనా చూడడం కష్టం అందుకే” అమ్మ ఖండితంగా చెప్పింది. “రోజూ చూస్తున్నారుగ, యెన్ని ప్రాబ్లమ్సో?” అని అన్నారు నాన్న.

యస్ అన్నట్టు కూ అంది మధ్యలో పప్పీ.

పిల్లలు అయిష్టంగా తిన్నామన్నట్టు తిని లేచారు. ఆ రాత్రి బెడ్ టైం స్టోరీస్ లేవు. కాని బెడ్ మీద పప్పీ వుంది. మూగగా చూస్తోంది. దాని చూపులకు స్వీటీకి యేడుపు వచ్చేసింది. తడిసిన కళ్ళని తుడుచుకోవడం అమ్మానాన్నా గమనించక పోలేదు. చింటూ పప్పీ తలని నిమురుతూనే వున్నాడు. అది గారాలు పోతూ మూతి ముందుకు పొడిచి మధ్యమధ్యలో కూకూ రాగాలు తీస్తూనే వుంది.

“పప్పీ మీద ప్రేమ లేక కాదు, కండిషన్స్” అర్థం చేసుకోమన్నట్టు నాన్న అన్నారు. పిల్లలు మూగగా వున్నారు తప్పితే జవాబివ్వలేదు.

ఆ రాత్రి తెల్లవారింది. ఎప్పటిలా పప్పీ మీదకెక్కి గెంతి లేపకుండానే స్వీటీ చింటూ యిద్దరూ నిద్ర లేచారు. చూస్తే పప్పీ లేదు.

స్కూలుకు వెళుతున్నప్పుడు “పప్పీ…” అని స్వీటీ అడగబోతే, “అదెక్కడుందో తెలిస్తే వెళ్ళి చూడాలనిపిస్తుంది. పెయిన్. అందుకే నేను కూడా ఆ విషయం తెలుసుకోలేదు… మీరు కూడా తెలుసుకోవద్దు” చెప్పింది అమ్మ.

స్కూల్లోనూ యింటికి వచ్చాక పప్పీ గుర్తుకు వస్తూనే వుంది. దేనికీ అడిక్ట్ కాకూడదు… కాస్త డిటాచ్డ్ గా వుండాలి… అని అమ్మానాన్నా యెన్ని చెప్పినా కష్టంగానే వుంది.

“పోనీ వో పని చేద్దామా?” అడిగింది అమ్మ. ఏమిటన్నట్టు చూశారు నాన్న. “మొక్కల్ని పెంచుదాం” అంది అమ్మ. ఆక్సిజన్ అని కూడా అంది. పిల్లలు విని రెస్పాండ్ కాలేదు. “అసలే నీళ్ళకు టైట్, మీరు మొక్కలేవీ పెంచకండి అని యింటి వోనరు మొహమాటం లేకుండా చెప్పేసింది కదా?” నాన్న గుర్తు చేశారు. “పర్లేదు, బియ్యం పప్పూ కాయగూరలు కడిగిన నీళ్ళతో అడ్జెస్ట్ చేస్తామని అడిగితే చెపుదాం” అంది.

“మరి మనం వూరెల్తే?” స్వీటీ మాట్లాడకూడదని అనుకున్నా మాట్లాడేసింది.

“ఏముంది? ఊర్నుంచి వచ్చి కొత్త మొక్కలు కొనుక్కొని పెట్టుకోవాలి” అన్నాడు చింటూ.

అమ్మానాన్నా ముఖాముఖాలు చూసుకున్నారు.

“పక్కింటి ఆంటీ వాళ్ళ మొక్కలు వూరెల్తే యేమయ్యాయి?” తనే అడిగి “చచ్చాయి” తనే చెప్పాడు చింటూ. పనిపిల్లకి నీళ్ళు పొయ్యమని అప్పజెపితే ఆ పిల్ల మొగుడుతో గొడవలు పడి నీళ్ళు పొయ్యడానికి రాలేదు. మొక్కలు చచ్చాయి. ఎవరూ నీళ్ళయినా పోయ్యలేదని ఆంటీ లబోదిబోమంది. అప్పుడు యెందుకో అమ్మకి సిగ్గేసింది. కాని యెవరి చావు వాళ్ళే చావడానికి కుదరనప్పుడు యింకొకరి చావు యెలా చస్తారని సరిపెట్టుకుంది అమ్మ.

“ఎట్ లీస్ట్ వొక అక్వేరియం పెట్టుకుందాం”

“హే… గోల్డ్ ఫిష్ అందులో వేసి పెంచుదాం”

పిల్లలిద్దరూ హుషారుగా అంటూ వుంటే అమ్మానాన్నా యీసారి రెస్పాండ్ కాలేదు.

చింటూ చేతిపిల్లాడుగా స్వీటీ కడుపులో వున్నప్పుడు అక్వేరియం తెచ్చుకున్నారు. ఇంట్లో పెట్టుకున్నారు. నచ్చిన రకరకాల చేపల్ని తెచ్చి పెంచారు. రంగురంగుల చేపలు. రవ్వంత చిన్న చేపలు. రయ్ రయ్ మని తిరిగే చేపలు. పడవల్లా పరిగెత్తే చేపలు. తెరచాపల్లా తోకలెత్తేవి. తోకలు ఆడించేవి. కళ్ళు తిప్పేవి. నీట్లో బుడుంగున ములిగేవి. మునిగి తేలేవి. ఆటలాడేవి. నీళ్ళల్లో ముగ్గులేసేవి. ఆవగింజంత ఆహారం కోసం పోటీ పడేవి. వేలు అక్వేరియం గ్లాసు మీద పెడితే చాలు జడుపు లేకుండా తిండి గింజలకోసం పరుగున వచ్చేవి. అటూ యిటూ గింగిర్లు తిరిగేవి. నీళ్ళలోని సరంగుని లెక్క చేసేవే కావు. వాటికి పేర్లు పెట్టడం కూడా గుర్తుంది. తిన్నవే తినేస్తున్నాయి అని నాలుగు గింజలు యెక్కువ వేశారు. అంతే, తెల్లవారేసరికి నీటి మీద తెప్ప తేలిపోయాయి.

అసలే అమ్మ ప్రెగ్నెంటు. అలాంటప్పుడు యిది చెడు సంకేతం అన్నారు యిరుగూ పొరుగు. పాపపుణ్యాలు చేతుల్లో లేకపోయినా ఫలితాలు నెత్తిమీద వెళ్ళాడతాయని అంతా భయపెట్టారు. ఆవగింజంత అనుమానమే పెనుభూతం అయ్యింది. సెంటిమెంటుకు మెంటలెక్కింది. మనసులోంచి అది తీసేయడానికి అక్వేరియం తీసేయాల్సి వచ్చింది. అసలు సంగతి అది కాదు. చాన్నాళ్ళపాటు చేపలు తింటుంటే ఆ చనిపోయిన చేపలే గుర్తుకు వచ్చేవి.

పిల్లలకి ఇవేవీ తెలీకపోయినా మళ్ళీ అక్వేరియం గురించి అడగలేదు. అలాగని డల్ గా లేకుండా కూడా లేరు. పిల్లలు డల్ గా వుండడం అమ్మానాన్నా గమనించకుండా కూడా లేరు.

‘పప్పీ’ అని అలవాటుగా అందరూ పిలిచేస్తున్నారు. మాట మార్చి అమ్మానాన్నా డైవర్ట్ చెయ్యాలని చూస్తున్నారు. కాని యిలా కాదనుకున్నారు. వేరే దేనితోనో ఫుల్ ఫిల్ చెయ్యాలనుకున్నారు. బాగా ఆలోచించారు. పెట్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేశారు. అలా పెట్ రాక్స్ గురించి చదివారు. పెట్ రాక్స్ గురించి తొలిగా ఆలోచన చేసిన గేరీ గురించిన ఆర్టికల్ కూడా యీ మధ్యే న్యూస్ పేపర్లో చదివారు. అయితే అవి యిప్పుడు వొక్కొక్కటీ పదిహేను వందలు పెట్టాలంటే- వూ- అని తేల్చుకోలేకపోతుంటే, పక్కనే వుండి కనిపెట్టిన స్వీటీ “ఆ రాక్స్ కాలిమీదో వేలిమీదో పడితే డాక్టర్స్ ఫీ మెడిసిన్స్?” అంది. తను నవ్వకపోయినా చింటూ నవ్వాడు.

స్టఫ్ డు యానిమల్స్ సాఫ్ట్ టాయ్స్ గురించి గూగులే వెతక్కుండా దారి చూపించింది. అమెజాన్లో ఆర్డర్ చేసుకోమని ఆఫర్స్ కూడా యిచ్చింది. దాని ఫలితమే మొదటిగా పప్పీ అంత టెడ్డీ బేర్ యింటికి వచ్చింది. “పప్పీకి బేర్ కీ ముక్కే తేడా” అని నాన్న నవ్వారు. అక్కడితో ఆగిపోలేదు. స్వీటీకి ఆవు యిష్టమని తెల్లని దూడతో వున్న ఆవుని కూడా అమెజాన్లోనే బుక్ చేశారు. అరచేతిలో పట్టేంత చిన్నగా వున్నా పాలరాతి నునుపుతో తళతళలాడి మెరిసిపడిపోతోంది. “ఇది కాళ్ళ మీద పడితే దెబ్బ తగలదా?” అన్న చింటూ మాటల్ని యెవరూ పట్టించుకోలేదు. వాట్సప్ వీడియో కాల్లో నానమ్మకు ఆవుదూడల్ని చూపించింది స్వీటి. బాగుంది అని నవ్వింది నానమ్మ. ఎందుకో నాన్న సిగ్గుపడి ఆ పూట ఫోనులో వాళ్ళమ్మతో మాట్లాడకుండా తప్పించుకున్నారు.

సిస్టమ్ వోపెన్ చేస్తే చాలు పెట్స్ బొమ్మలు కనిపించేవి. కవ్వించేవి. అమ్మ కూడా వాటి ఆకర్షణకు లొంగకుండా లేదు. నాన్న కూడా అమ్మ మనసు తెలుసుకున్నట్టు ‘బుక్ చేద్దామా’ అన్నట్టు చూసేవాళ్ళు. స్వీటీకి కొని చింటూకి కొనకపోతే బాగోదని అనేసుకొని, కోళ్ళూ బాతులూ పిల్లులూ పావురాలూ కుందేళ్ళూ యిలా వొక్కక్కరి కోసం వొక్కొక్కటి అని అన్నీ అల్మరాలో నింపేశారు. మట్టి అంటని వేళ్ళు లేని ప్లాస్టిక్ పూల మొక్కలు కూడా.

అందరికీ అన్నీ చూపించుకున్నారు. ఇరుగుకీ. పొరుగుకీ. ఫ్రెండ్స్ కీ. అందరూ ‘వావ్’ అన్నారు. ‘గ్రేట్’ అన్నారు. ‘గుడ్ టేస్ట్’ అని కూడా అన్నారు. అమ్మానాన్నా ప్రౌడ్ ఫీలయ్యారు.

అందానికి అందం అనుకుంటే “ఆడుకోవడానికి లేదా?” అంది స్వీటీ. ఇవి కాస్ట్లీ అనిచెప్పి షాపునుండి కీ యిస్తే అరుస్తూ పరిగెత్తే కుక్కబొమ్మని కొని తెచ్చారు.

“పిల్లల కోసం కాదుగాని పిల్లల్లో మీరూ పిల్లలైపోతున్నారు” అని అమ్మ ముద్దుగా నాన్నని తిట్టింది. “నువ్వేదో పేద్ద పెద్దదానివైపోయినట్టు మాట్లాడకు” అని నాన్న. మొత్తానికి వాటితో అందరూ కొత్తలో ఆడుకోవడం తిరిగి షోకేసులో పెట్టడం చేశారు. అలా రోజులు గడిచాక పాతబడ్డట్టు వాటి జోలికే పోలేదు. అవి వున్నాయన్న సంగతీ గుర్తులేదు. ఆ విషయం అమ్మానాన్నా గ్రహించకపోలేదు. అందుకే స్వీటీని అడిగారు.

“టెడ్డీ బేర్ తో ఆడుకోవడం లేదేం?”

“అది బేర్ కాదు, నీ పప్పీ. ఏం నీకు నచ్చలేదా?”

చిన్న స్వీటీ పెద్ద వూపిరి వదిలింది. “ఇంతింత డబ్బు పెట్టి కొన్న పెట్స్ ప్లాంట్స్ యేవీ నీకు నచ్చలేదా?” అమ్మ అనుమానంగా చూసింది. “ఎందుకు నచ్చలేదు? నచ్చింది” అంది స్వీటీ. “ఏం నచ్చింది?” అడిగారు నాన్న. “ఊ… చెప్పు” అన్నాడు చింటూ. “ఊ… నువ్వు కూడా” చింటూకూ ఆఫరిచ్చారు నాన్న.

ఒక్క క్షణం నిశ్శబ్దం.

“ఈ టెడ్డీ సారీ యీ పప్పీ ఆ పప్పీకంటే బుద్ధిగా వుంటుంది. ఎక్కడ పెడితే అక్కడే వుంటుంది. అల్మరాలో పెడితే అల్మరాలో వుంటుంది. బెడ్ మీద పెడితే బెడ్ మీద వుంటుంది. ఇంకా షిట్ కు కూడా వెళ్ళదు. పాస్ కూడా పొయ్యదు. ఇల్లు పాడు చెయ్యదు. చదువుకుంటే మధ్యలో కుయ్ కుయ్ మని అరవనే అరవదు…” స్వీటీ సీరియస్సుగా చెపుతుంటే-

“ఎవరినీ కరవదు. సో యెవరితో ఫైటుల్లేవ్. హెడ్డేకుల్లేవ్” నిజాయితీగా అందించాడు చింటూ.

అమ్మానాన్నా కన్నార్పకుండా చూస్తున్నారు.

“పడుకుంటే పక్కలో దూరదు. పరుపు మీద గెంతదు. నిద్ర లేపదు. కనీసం కదలదు” స్వీటీ చెప్పుకుపోతోంది.

“ముక్కే తేడా కాదు, అన్నీ తేడానే. కళ్ళు కూడా గాజు కళ్ళు. రెప్ప ముయ్యకుండా చూస్తుంది. కాకపోతే బొచ్చు లేదు. అదీ మంచిదే. ఇల్లంతా బొచ్చు రాలదు…” చింటూ తోచింది మళ్ళీ అందించాడు.

“ఫుడ్ పెట్టక్కర్లేదు. బాత్ చేయించక్కరలేదు. దాని జబ్బులు మనకి వస్తాయన్న భయం లేదు” స్వచ్చంగా చెప్పుకుపోతోంది స్వీటీ.

“ఆ పప్పీ వల్ల స్ట్రెస్ తగ్గినా దానికింద చేయడం వల్ల అనవసరమైన స్ట్రెయిన్… అదీ మెయిన్” ఆలోచిస్తూ చెపుతున్నాడు చింటూ.

అమ్మానాన్నా ముఖాముఖాలు మళ్ళీ చూసుకున్నారు.

చింటూ కుక్కబొమ్మకి ‘కీ’ యిచ్చాడేమో అది ‘భౌభౌ’మని అరుస్తూ అటూ యిటూ తిరుగుతూ వుంటే చూసిన స్వీటీ-

“ఇది మనం అరవమన్నప్పుడే అరుస్తుంది. మనం పరిగెత్తాలని అనుకున్నప్పుడే పరిగెడుతుంది. మనం కీ యివ్వక పోతే యెంచక్కా నోరు మూసుకు పడి వుంటుంది”

“మన కాళ్ళు కూడా నాకవు. వద్దంటే వినకుండా మనతో గెంతులాడించవు”

పిల్లల స్వరంలో మాటల్లో జన్యూనిటీ కనిపించింది అమ్మానాన్నలకి. అలాగని వాళ్ళ ముఖాల్లో ఆనందం కానరాలేదు.

“ఇప్పుడు వూరెళ్ళినా ప్రాబ్లమ్ లేదు”

“మొక్కలకయితే నీళ్ళు కూడా పొయ్యక్కర్లేదు”

“పూలు వాడవు”

“పురుగులు రావు”

“పెట్టిన డిజైన్లో పడి వుంటాయి”

“పెట్స్ గురించి తెలుసుకోవాలంటే వికీపీడియాలో చదువుకోవచ్చు”

అమ్మానాన్నా నమ్మలేనట్టు చూశారు. అదే మాట అన్నారు.

“నమ్మొచ్చా?”

“ఏం?, రాళ్ళని ప్లాస్టిక్ బొమ్మల్ని దేవుడుగా నమ్ముతున్నాం లేదు, పెట్స్ ని ప్లాంట్స్ ని నమ్మడానికి యేముంది?”

తాము నమ్ముతున్నదీ అనుభవంలో వున్నదీ మాట్లాడారు పిల్లలు.

పెద్దలకే యెందుకో జీర్ణం కావడం లేదు.

అక్కడ మూగ సాక్ష్యంగా మిగిలిపోయాయి మూగజీవాలు.

నోరున్న పప్పీ అరుపు ‘భౌభౌ’మని వీధి గుమ్మంలో వినిపించింది?!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply