ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన చాలా ప్రక్రియల్లో విమర్శ ఒకటని అందరికి తెలిసిన విషయమే. ఒక సంఘటనను చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుండి స్పందించినట్టు ఒక విడి రచనను, లేదా ఆయా భాషల మొత్తం సాహిత్యాన్ని, లేదా ఒక ప్రక్రియను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానించడం, అంచనా కట్టడం, మంచి చెడ్డల్ని తేల్చడం, దాని స్థానాన్ని నిర్ణయించడం, దాని ప్రభావాల్ని తూచడం చేస్తుంటారు. ఒకే టెక్స్ట్‌ను ఎన్ని దృక్కోణాల నుంచి చూసే వీలున్నదనే విషయాన్ని శాస్త్రీయంగా వివేచించి నాలుగు ప్రధాన దృక్కోణాలను సూచించారు విమర్శకులు.
- గ్రంథ రచయిత దృక్కోణం.
- రచన కేంద్ర దృక్కోణం(Text).
- విమర్శకుడి/ పాఠకుడి దృక్కోణం.
- సమాజ కేంద్ర దృక్కోణం.
వీటిలోంచి అనేక విమర్శనా పద్ధతులు ఆవిర్భవించినవి. ఈ పద్ధతులను దృష్టిలో ఉంచుకొని కొందరు వర్తమాన విమర్శకులను పరిచయం చేయడం ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం. ప్రధాన గుణాన్ని బట్టి ఒక్కొక్క విమర్శకుణ్ణి ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం. అంత మాత్రాన ఆ విమర్శకుకుడు దానికి మాత్రమే పరిమితం కాడు. అందరి విమర్శకుల్లో అన్ని విమర్శకులు అన్ని విమర్శనా పద్ధతులును ఏదో ఒక మేరకు అందరి విమర్శకుల్లు అన్ని విమర్శనా పద్ధతులు ఏదో మేరకు ఉంటవి. ఆ విషయాన్నిక్కడ గమనంలోకి తీసుకోవడం జరిగింది.
చారిత్రక విమర్శకుడు సంగిశెట్టి :
ఆధునిక తెలంగాణ పరిశోధనకు ముఖద్వారం సంగిశెట్టి. ఉద్యమ సమయంలో కె.సి.ఆర్., దేశపతి నుంచి నాదాకా అనేకమంది ఏ అంశానికైనా సంబంధించైనా రెడీరె కనార్ సంగిశెట్టి. లగడపాటి, ఆంజనేయ రెడ్డి, దగ్గుపాటి మొదలు అనేకమంది తెలంగాణ భావనను కూలదోయాలకున్న ప్రతి సందర్భంలో ప్రతివాద భయంకరుడు సంగిశెట్టి. దశాబ్దాల కాలాన్ని, లక్షలాది పైసల్ని వెచ్చించి అనేక గ్రంథాలయాలు తిరిగి తెలంగాణ అస్తిత్వ మూలాల్ని వెలికితీసిన సాహిత్య ఆర్కియాలజిస్టు సంగిశెట్టి.
షబ్నవీస్ (తెలంగాణ పత్రికా రంగ చరిత్ర), దస్త్రమ్(తెలంగాణ కథా చరిత్ర), సిర్ఫ్ హమారా (హైదరాబాద్ చరిత్ర) అచ్చమాంబ, సార్థకజీవి వట్టికోట, పిచ్చయ్య కథలు లాంటి పుస్తకాల ద్వారా ఈ పనిచేసిండు. ఉద్యమ ఉద్దీప్తికి అనేక పత్రికల్లో రాసిన వందలాది వ్యాసాల ద్వారా ఈ పని చేసిండు. సురవరం తెలంగాణ వ్యాసాలు, 1969- 73 తెలంగాణ ఉద్యమ కవిత్వం, దిమ్మిస, సింగిడి పత్రిక, తెలంగాణ తొలినాటి కథలు, తెలంగామ నూరు కథలు, తెలంగాణ ప్రచురణల ద్వారా ముద్రితమైన చాలా పుస్తకాలకు సంపాదకత్వం, సహసంపాదకత్వం వహించడం ద్వారా ఈ పని చేసిండు. తెలంగాణ హిస్టరీ సొసైటీ నుంచి వచ్చిన పుస్తకాలకు సహ సంపాదకత్వం వహించడం ద్వారా ఈ పని చేసిండు. తెలంగాణ వ్యతిరేకులకు పత్రికా వ్యాసాల ద్వారా, కరపత్రాల ద్వారా ఈ పని చేసిండు.
మరోపక్క దళిత, బహుజన అస్తిత్వ నిర్మాణంలో కూడ తనదైన ముద్ర వేసిండు. దీనికోసం కూడా అనేక వ్యాసాలు రాసిండు. గొర్కొయ్యలు, దళితోద్యమ చరిత్ర రాసిండు. బండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి, కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రి. ఈ దిశలో చేసిన ఆవిష్కరణ ఆణిముత్యాలు. అయితే సంగిశెట్టి కేవలం పరిశోధకుడు మాత్రమే కాదు. ఏ అస్తిత్వ ఉద్యమం స్థిరపడడానికైనా పరిశోధన ఎంత ముఖ్యమో పరిశోధన మిశ్రితమైన విమర్శ అంతే ముఖ్యం. సంగిశెట్టి తెలంగాణ దళిత బహుజన అస్తిత్వోద్యమాలకు కావలసిన పరిశోధన మిశ్రితి విమర్శ కూడా చేసిండు.
ఈ రెండు అస్తిత్వ ఉద్యమాల్లో ఆయన ఒక చారిత్రక విమర్శకుడి పాత్ర పోషించిండు. అందువల్ల ఆయనను “చారిత్రక విమర్శకుడు” అంటున్న. ఒక రచనను అర్థం చేసుకోవడానికి ఆ రచన వెనుక ఉన్న చారిత్రక, సామాజిక, రాజకీయ మూలాల్లోకి వెళ్లి రచనతో అనుసంధానం చేయడం చారిత్రక విమర్శ. ఈ పని ఆయన తన సాహిత్య వ్యాసాలం సంకలనం “దుర్భిణి” లో సమర్థవంతంగా చేసిండు. (ఈ పుస్తకం తెలంగాణ దళిత, బహుజన సంబంధ అనేక అంశాలకు విజ్ఞాన సర్వస్వం. అనేక సంస్థలకు సాధ్యం కాని ఇంత విజ్ఞాన భాండాగారాన్ని ఒక్కడు ఎట్లా సాధించిండని ఆశ్చర్యచకితులమవుతాం)
దోరవేటి రచించిన బాజీరావు మస్తానీ నవలకు ముందుమాటలు రాస్తూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మస్తానీ తల్లి రహనీభాయి నిజాం కాన్‌దాన్‌లోని మహిళ అని చరిత్రలోకి వెళ్లి చెప్పిండు. ఇది తెలంగాణకు వన్నె తేవడమే.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1962 వరకు కథాసంపుటాలు, కథలు రాకపోవడానికి తెలంగాణ రచయితలు తెలంగాణ భాషను వదిలిపెట్టి ఆంధ్రభాషలో రాయడానికి అలవాటుపడి వారి ఆధిపత్యాన్ని భరించడానికి ఆనాటి చరిత్రలోకి వెళ్లి ఆంధ్రప్రాంత పత్రికలు, సంపాదకులు, విమర్శకులు కారణాలుగా చెప్పిండు.
తెలంగాణలో ఉద్యమ కథలే తప్ప, మధ్యతరగతి జీవితాల్ని చిత్రించే కథలు రాలేదని అసలు మధ్య తరగతే ఏర్పడలేదన్న అపోహల్ని తొలగిస్తూ 1950 – 60ల మధ్య కాలంలో గోపీచంద్, కొడవగంటి, వాసిరెడ్డి సీతాదేవి తదితరులు మధ్యతరగతి జీవితాలను కథలుగా మలిచినట్టే, తెలంగాణలో భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరు కేశవరావు, డి.రామలింగం, సురమౌళి, సదాశివ, గూడూరి సీతారాం, ఆ తర్వాత మాదిరెడ్డి సులోచన, బొమ్మ హేమాదేవి మధ్యతరగతి జీవితాల్ని చిత్రీకరించారని ప్రస్ఫుటం చేసిండు. తద్వారా తెలంగాణ వెనుకబడి లేదని నిరూపించిండు. కాకపోతే ఈ కథలు ప్రచారానికి నోచుకోలేదు.
తెలంగాణ దళిత కవిత్వం, ఇటీవలి ఆంధ్ర దళిత కవిత్వానికి ప్రతిధ్వని ఒక అపోహ ఉంది. ఇది సరికాదని దేవేందర్ “తొండం” (1973)ను నేను వెలుగులోకి తెచ్చిన. జాషువా కన్నా ముందటి పద్యాలను చూపించిన. అంబేద్కర్ కన్నా ముందే భాగ్యరెడ్డి వర్మ ఆ స్పృహ ఉన్నవాడని సంగిశెట్టి నిరూపించిండు. అంతేకాక “దళిత” శబ్దాన్ని (1954లో) వాడింది హైదరాబాద్‌కు చెందిన “శంకర్‌దేవ్” అని నిరూపించిండు.“హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామంలో దళిత జాతికి సంబంధించిన రచనలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు విరివిరిగా తయారు అవుతున్నాయి” అనే ఆయన మాటల్ని
“పిలవండి నోరెత్తి దళిత జాతుల నెల్ల
కలిసి సంఘీభావ బల పరాక్రమముతో
మీ బానిసత్వాలు మాయ మౌనందాక
మీ వెట్టిచాకిరీ మము బాయునం దాక…..” అనే ఆయన కవిత్వాన్ని కోట్ చేసి మరీ చూపించాడు.
“మా భాషలో మేము మాట్లాడతాము, రాస్తాము అనేది కూడా అస్తిత్వ ప్రకటనే. దానిని రాజకీయార్థిక, సామాజిక, కుల, మత, జెండర్ ఆధిపత్యాల ధిక్కారణగా చూడాలనే” గొప్ప సూత్రీకరణ అస్తిత్వ ఉద్యమాల పట్ల ఆయనకు గల నిబద్ధత నుంచి వచ్చింది.
తెలంగాణ భాషే శ్వాసై రాసిన సురమౌళి ఆంధ్రాధిపత్యంతో తెలంగాణ భాషకు ఆశించిన ఆమోదనీయత రాకపోవడంతో “ప్రామాణిక భాష”కు ఎందుకు మారాల్సి వచ్చిందో చరిత్రలోకి వెళ్లి చెప్పిండు. తెలంగాణ భాషకు అప్పటి ఆంధ్రపత్రికలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రధానకారణం అన్నడు. అది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే మొన్న మొన్న కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ భాషలో రాస్తే వేయ్యం, ప్రామాణిక భాష అంటే ఆంధ్రభాషలోకి మారిస్తేనే వేస్తానని ఆంధ్రపత్రికల నిర్వాహకులు అనడం స్వయంగా నేను విన్న.
తెలంగాణ సాహిత్య అభివృద్ధి కోసం ఏర్పడిన “తెలంగాణ రచయితల సంఘం” మెల్లమెల్లగా తెలుగు రచయితల సంఘంగా మారింది. అందుకే ఈ సంస్థ నుండి తెలంగాణ ఆంధ్రప్రాంత కవుల సంయుక్త సంకలనం “ఉదయఘంటలు” వెలువడింది. విద్వాన్ విశ్వం “పెన్నేటి పాట”, నేదునూరి గంగాధరం “సెలయేరు” కూడా ప్రచురించబడ్డాయి. ఇవన్నీ తెలంగాణ సాహిత్యకారులు అమాయకంగా ఆంధ్రులను నమ్మడానికి దారి తీసినయి”
తెలుగు సాహిత్యంలో సురమౌళి గారికి దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదు. నక్సలైట్ల “హింసారాధన”ను వ్యతిరేకించినందుకు విప్లవ రచయితల సంఘం పట్టించుకోలేదు. బ్రాహ్మణుడిగా పుట్టి కుల నిర్మూలనకు నడుం కట్టినందుకు “జన సంఘం” వాళ్ళు పట్టించుకోలేదు. సోషలిస్ట్ గాంధేయవాదంతో మమేకం అయినందుకు కమ్యూనిస్ట్, అభ్యుదయ రచయితలు పట్టించుకోలేదు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినందుకు తెలంగాణవాదులు గౌరవించలేదు. (సురవరం గురించి కూడా ఇలాంటి చర్చ చేసిండు). ఇవి మంచి అబ్జర్వేషన్స్. సంగిశెట్టి నిశిత పరిశీలనా దృష్టికి నిదర్శనాలు.
ఆయన స్వభావంలో ఉన్న నిర్మొహమాటం, ఆగ్రహం ఆయన విమర్శలో కూడా కనిపిస్తవి. అసలు ఆ ఆగ్రహమే ఆయన పరిశోధనకు, విమర్శకు మూలం. సాహిత్యాన్ని ముఖ్యంగా సాహిత్య చరిత్రని చదివిన సందర్భంలో తెలంగాణ దళిత, బహుజనులకు జరిగిన అన్యాయాన్ని చూసినప్పుడు కలిగిన ఆగ్రహా ప్రకటననే ఆయన విమర్శ. తన విమర్శలో ఎంతటి వారు అనేది చూడడు. రారా, త్రిపురనేని లాంటి విమర్శకుల కరుకుదనం తోసుకొస్తొంది. ఒక ఉదాహరణ చూడొచ్చు.
“నూరేళ్ళ తెలుగు కథ” పేరులో 100 మంది తెలుగు కథకుల కథలను పునః కథనం చేస్తూ ఖదీర్ ఒక పుస్తకం వేసిండు. అందులో తెలంగాణ ఎస్సీ, బీసీలకు జరిగిన అన్యాయం చూసి ఆయనకు ఒళ్ళు మండింది ఇక చూస్కోండి.
“గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణపై చూపించిన వివక్ష, వ్యతిరేక వైఖరిని ఖదీర్‌బాబు ఈ సంకలనం ద్వారా మరోసారి విచ్చలవిడిగా ప్రదర్శించాడు. ఖదీర్‌బాబు కొంచెం పదునుపెట్టి తెలంగాణ గొంతుమీద పెట్టిండు. గతంలో సంకలనాలు వేసిన మధురాంతకం రాజారాం, వకాల్టు వేదగిరి రాంబాబు, వాడ్రేవు చిన వీరభద్రుడు, వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్, జంపాల చౌదరి, ఏ. కే. ప్రభాకర్”లు చేసిన అన్యాయమే ఈసారి ఖదీర్ చేసిండు. ఖదీర్ చేసిన అన్యాయానికి అస్తిత్వ ముసుగేసే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ పైకి కనిపించే మెత్తటి మాటలు. రహస్యంగా ఎవరికీ అంతు చిక్కకుండా సైలెంట్ గా బొడ్లె దోపుకున్న కత్తిని విశృఖలంగా వినియోగించిండు.
తను కథల్ని సెలెక్ట్ చేసుకోలేదని కథే తనకు తానుగా ఎంచుకున్నదని ఖదీర్ అన్న మాటల్ని ప్రస్తావించి వ్యంగ్య గ్రాహల మిళితంగా “కథే నగిచి వచ్చి ముందు నిలబడదు గదా. ఈ ఎంపికలో తన ప్రాంతము పనిచేసింది” అంటాడు. జ్ఞానం ఉండాలె అప్పుడే విమర్శకుడి విమర్శకు సాధికారత వస్తుంది. అపారమైన సాహిత్యం సంగిశెట్టికి మెండుగా ఉన్నది. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కథ, నవల, కవిత్వం, పత్రికలు, విమర్శలాంటి అన్ని ప్రక్రియల గురించి 1900 నుండి 1960 వరకు ఆయనకున్నంత జ్ఞానం మరెవ్వరికీ లేదు. అందుకే ఆయనేది రాసిన సాధికారంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణకు ఆయన ఒక వరం. అయితే ఆయన విశ్లేషణ పార్శ్వాన్ని ఇంకా పెంచుకోవాలె. పునరుక్తులు రాకుండా ఎడిటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలె.
మార్క్సిస్ట్ విమర్శకుడు కాశీం :
మార్క్సిస్టు విమర్శ మాయమవుతున్న తరుణంలో కొత్త తరం ప్రతినిధులుగా ఇద్దరు పుట్టుకొచ్చారు. ఒకరు పాణి, మరొకరు కాశీం. తెలంగాణ ప్రతినిధి కాశీం. మద్దుకూరి, రారా, పామలపర్తి సదాశివరావు, కె.వి.ఆర్, త్రిపురనేని, వరవరరావు, కేకే రంగనాథాచార్యులు, చెంచయ్య, సూర్య సాగర్, వల్లంపాటి, వేల్చేరు నారాయణరావు, బాలగోపాల్ (చివరిదశలో ఆధునిక అనంతరవాదం లేవనెత్తిన ప్రశ్నలను స్వీకరించినప్పటికీ) కాత్యాయని విద్మహే, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, ఎన్.వేణుగోపాల్ గత తరాలకు చెందిన వారు. తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఆవిర్భావ వికాసాలకు దోహదం చేసిన తరాల ప్రతినిధులు వీరు.
ఆధునికానంతర వాదం ప్రశ్నల్ని సంధిస్తున్న సమయంలో మార్క్సిజం సంక్షోభానికి లోనవుతున్న తరుణంలో సంక్షుభిత, సందిగ్ధ స్థితిలో ధైర్యం చేడకుండా, తడబాటు పడకుండా మార్క్సిస్ట్ విమర్శ వారసత్వాన్ని కొనసాగిస్తున్న విమర్శకుడు కాశీం.
సిద్ధాంతం ఇచ్చిన చూపు వల్ల మార్క్సిస్టులు కన్ఫ్యూజ్ కారు. గొప్ప ఆత్మవిశ్వాసంతో (కొన్నిసార్లు అతి అన్పింతేంత) ఉంటరు. మిక్కుటమైన స్పష్టతతో ఉంటరు. ఈ లక్షణాలు కాశీంకి కూడా వచ్చినవి.
కాశీం మంచి కవి. వక్త. విమర్శకు సంబంధించి ఆయనవి మూడు పుస్తకాలు వచ్చినవి. “నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న (1997), తెలంగాణ ఉద్యమాలు పాట (2010), తెలంగాణ సాహిత్యం (2015). ఈ పరిచయానికి ఈ మూడో పుస్తకాన్ని ఆధారంగా చేసుకుంటున్న.
గతితార్కిక చారిత్రక భౌతికవాదం మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావో తదితరులు కళాసాహిత్యాల గురించి చేసిన సూత్రీకరణలు మార్క్సిస్టు సాహిత్య విమర్శకు భూమిక. దానినే కాశీం అనుసరించాడు. ఆ విషయానికి చాలా సందర్భాల్లో చెప్పిండు.
“చరిత్ర, కళలు, సాహిత్యం, సంస్కృతి ఉపరితల అంశాలు. ఎప్పుడైనా పునాది అంశాలే ఉపరితల అంశాలను నిర్ణయిస్తాయి. అంటె పునాది అంశమైన ఆర్థిక, రాజకీయాధిపత్యం చరిత్ర, కళలు, సాహిత్యం, సంస్కృతిని ప్రభావితం చేస్తాయి”. (పే. 55)
“ఉత్పత్తి శక్తులలో వచ్చిన మార్పును అనుసరించే సాహిత్యంలో మార్పు వస్తుంది, కనుక ఉపరితల అంశమైన సాహిత్యం ఆర్థిక పునాది మీదనే ఆధారపడి ఉంటుంది. సాహిత్యాన్ని కేవలం సాహిత్యంగా చూడకుండా సాహిత్యంలో వ్యక్తమయ్యే ఆర్థిక రాజకీయ కోణాల నుంచి పరిశీలించాలి”. (పే.170).
తొలుత నేను కూడా ఈ దృక్పథాన్ని అనుసరించిన. ఇప్పుడు నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నావి. అయినా ఆయన అనుసరించిన దృక్పథం నుంచే ఆయన విమర్శను పరిశీలించడం సమంజసం. ఆయన కవిగా, విమర్శకుడిగా ఎదుగుతున్న క్రమంలో నాలుగు పాయలు తటస్థించినవి. 1. భూస్వామ్య వ్యవస్థపై తెలంగాణ రైతాంగ పోరాట కాలం నుంచి కొనసాగుతున్న పోరాటం. 2. దేశీయ పెట్టుబడిదారీ వ్యవస్థపై పోరాటం 3. అంతర్జాతీయ పెట్టుబడిదారీ (దీన్నే గ్లోబలైజేషన్ అంటున్నరు) వ్యవస్థపై పోరాటం 4. అంతర్గత వలసవాదంపై పోరాటం (అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం). ఈ నాలుగు పాయలను ఈ వ్యాసాల్లో స్పృహించిండు.
తెలంగాణ సాయుధ పోరాటం – నవలా సాహిత్యం, అల్లం రాజయ్య కథలు – పోరాట వస్తురూపాలు, తెలంగాణ విప్లవ సాహిత్యం, విప్లవ సాహిత్యంలో వస్తురూప వైవిధ్యం లాంటి వ్యాసాల్లో మొదటి పాయను విశ్లేషించిండు. రాజకీయ పోరాటాలకు సాహిత్యానికి ఉన్న పరస్పర సంబంధాన్ని చక్కగా విశ్లేషించిండు. భూమి ఎట్లా కేంద్రబిందువుగా ఉందో భూమి మీద అధికారం కలిగిన వర్గం సకల ప్రజలమీద ఎట్ల ఆధిపత్యం చెలాయించిండ్రో, ఎట్లా దౌర్జన్యాలు చేసిండ్రో – ఇదంతా సాహిత్యంలో ఎట్లా ప్రతిఫలించిందీ బాగా విశ్లేషించిండు. ఈ వ్యాసాల్ని పరిశీలిస్తే 1930ల నుంచి మొన్న మొన్నటి దాకా జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాట క్రమం మీద, పర్యవసనాలు, సాహిత్య ప్రతిఫలనం మీద కాశీంకు మంచి పట్టు ఉన్నదని అర్థం అవుతుంది. ఈ కింద ఉదాహరణలు చూస్తే అది అర్థం అవుతుంది.
“తెలంగాణలో ఏ పోరాటాన్ని తీసుకున్న భూమి సమస్య ఇరుసుగా ఉంటుంది”. (పే.91) అల్వార్ స్వామి జీవించిన కాలమే ఆయనకు ఒక దృక్పథాన్నిచ్చింది. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాంస్కృతిక పోరాటం, రైతాంగ సాయుధ పోరాటం ఆయన మీద మహా ప్రభావాన్ని వేశాయి. అంతేకాదు ఆయన స్వయంగా ఆ పోరాటాలలో ఉన్నాడు. అందుకే స్పష్టమైన ప్రజా దృక్పథం ఏర్పడడానికి ప్రతిపాదిక పడింది”. (పే. 92) “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఉత్పత్తి శక్తుల కోణంలో అర్థం చేసుకునే తాత్విక దృక్పథం కోణంలో చూసినప్పుడు అల్వార్‌స్వామి రాసిన రెండు నవలలు మాత్రమే ఈ విశ్లేషణ పరిధిలోకి వస్తాయి.” (పే. 86). “ప్రజల మనిషి నవలలో భూమి సమస్య ఉంది. కానీ దాని పరిష్కారం కోసం జరిగిన పోరాటానికి చాలా పరిమితులు ఉన్నాయి. కానీ గంగు నవలల్లో భూమి సమస్యను చిత్రించడంలో దాని పరిష్కారం కోసం జరిగిన పోరాటంలో గుణాత్మక మార్పు కనిపిస్తుంది”. (పే. 96). భూ పోరాటాల చేత ప్రభావితం కావటం వలన కాబోలు రాజయ్య కథలన్ని భూమిచుట్టూ తిరుగుతాయి (పే. 40). శ్రీ. శ్రీ, శివ సాగర్, చెరబండరాజు, వరవరరావు వంటి లబ్ధ ప్రతిష్టులైన వారి కవిత్వం దగ్గరే కొందరు విమర్శకులు ఆగిపోయారు. తర్వాత వచ్చిన కొత్త నీళ్లు తాగటానికి తెలుగు సాహిత్య వాతావరణం అలవాటు పడలేదు. సముద్రుడు, ఎమ్మెస్సార్, కౌముది రచనలు విప్లవ కవిత్వంలో తెచ్చిన వస్తు శిల్ప నైపుణ్యాన్ని చూడలేకపోయారు (పే. 214)
“నక్సల్బరితో మొదలైన విప్లవోద్యమానికి మార్క్సిజంతోపాటు మావోయిజం నిర్దిష్టంగా సైద్ధాంతిక భూమికనిచ్చింది. మార్క్సిజం – లెనినిజం – మావోయిజం మార్గదర్శకంగా వుండాలని నమ్మి, రాసే సాహిత్యమే విప్లవ సాహిత్యం అవుతుందని” (పే.185) కాశీం అన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఒక మంచి సూత్రీకరణ చేసిండు. “దోపిడీ వర్గాలపై కసిని, దోపిడీకి గురయ్యే వర్గాలపై ప్రేమను ప్రదర్శించకపోతే వర్గ సామరస్యానికి దారితీస్తుంది. కవులకు, రచయితలకు కూడా ఈ దృష్టి ఉండాలి” (పే.186). వర్గాల ప్రతిపాదన మార్క్స్‌దే అయినా అయినా వర్గ కసి భావన మావో నుంచి వచ్చిందే. దీర్ఘకాలిక సాయుధ పోరాటానికి అది అవసరమని భావించాడు. పాట గురించి రాస్తూ ఉద్యమ కవులు ప్రజల నుంచి బాణీలను తీసుకుని విప్లవ భావజాల పాటలు రాసి వాటి ద్వారా ప్రజలను చైతన్య పరిచారని అన్నాడు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ప్రజలకు (పే. 15) అనే సూత్రాన్ని ఉటంకించినాడు. ఈ సూత్రం మావో చేసిందే. విప్లవం విజయవంతం కావలంటే వర్గ మార్గము ఎంత ముఖ్యమో వర్గ పోరాటాన్ని నడిపించడానికి ప్రజా సైన్యం అంతే ముఖ్యం(పే. 194) దీని ప్రతిఫలనాన్ని సరిగ్గా పట్టుకున్నాడు.
భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక, విప్లవోద్యమ ప్రతిఫలనం వివిధ ప్రక్రియల్లో ఎట్ల జరిగిందో చాలా స్పష్టతతో, మంచి అవగాహనతో విప్లవ దృక్పథం నుండి విశ్లేషించాడు. ఈ సందర్భంగా ఆయన నిశిత పరిశీలన చారిత్రక జ్ఞానం పాఠకులకు అవగతమైతవి. ఆయన ప్రస్తావించిన విప్లవ నాటకాలను నాటకాల మీద రాసిన వారు ఎవరూ పేర్కొనలేదు. “తెలంగాణ విప్లవ సాహిత్య విమర్శపై, విమర్శకులపై ఇంకా అంచనాలు రావాల్సి ఉంది.” (పే.208) అని మంచి అబ్జర్వేషన్ ప్రకటించాడు. “మార్క్సిస్టు సాహిత్య విమర్శ అంటే ఏమిటి అనే ప్రశ్నకు సూటిగా సమాధానాన్ని తెలుగుసాహిత్యం లోకం ఇంకా తయారు చేయలేదు” అని కోవెల సంపత్కుమారాచార్య, ఎన్. వేణుగోపాల్‌లు (తెలుగు సాహిత్య విమర్శ దర్శనం పే .97) అన్న మాటలకు కాశీం అబ్జర్వేషన్ దగ్గరగా ఉన్నది.
1940 దశకంలోనే కార్మికవర్గ యూనియన్లు నిర్మితమైనప్పటికీ విప్లవోద్యమం భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా విస్తరించినంతగా పెట్టుబడిదారి వ్యతిరేక పోరాటంగా విస్తరించలేదు. అందుకే కార్మికవర్గ సాహిత్యం అంతగా రాలేదు. దీనిని కాశీం సరిగ్గా గుర్తించి “రైతులు, కూలీలు, మధ్యతరగతి ప్రజల గురించి వచ్చినంత కథా సాహిత్యం (మొత్తం సాహిత్యం అని చెప్పాలె) కార్మికుల జీవితాలతో రాలేదు” (పే. 42) అన్నాడు. అందుకు కారణం కార్మికవర్గం సంపూర్ణంగా రూపు దిద్దుకోకవడం, రచయితలు మధ్యతరగతి నుంచి వచ్చినందుకు వలన కార్మికుల జీవితాలను అర్థం చేసుకోలేకపోవడం కారణాలుగా చెప్పిండు. అది పూర్తిగా నిజం కాదు. మొదట చెప్పుకున్నదే ప్రధాన కారణం.
విప్లవోద్యమం సింగరేణి కార్మికులలోకి విస్తరించింది కాబట్టి ఆ కార్మికులకు సంబంధించిన సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యాన్ని కాశీం ఉద్యమంతో లింకు చేస్తూ సమాజ సాహిత్యాల గతితార్కిక సంబంధాన్ని చక్కగా విడమరచి చెప్పిండు.
ఇక మూడో పాయ అయినా ప్రపంచీకరణ వ్యతిరేకత గురించి రెండు వ్యాసాల్లో, (తెలంగాణ నవలల్లో ప్రపంచ వ్యతిరేకత, జూకంటి జగన్నాథం కవిత్వం) విడమర్చిండు. సామ్రాజ్యవాద ఆధునికానంతర రూపం ప్రపంచీకరణ. దీనిలో సుగుణాలెన్ని ఉన్నవో అంతకంటే ఎక్కువ దుర్గుణాలు ఉన్నవి. సామ్రాజ్యవాదం తొలి, మలి దశల్లో తన పెట్టుబడి విస్తీర్ణత కోసం ఉత్పత్తి విక్రమం కోసం దేశాలను, మార్కెట్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆక్రమిస్తే “ప్రపంచీకరణ దశల్లో ప్రపంచ ప్రజల మెదళ్లను ఆక్రమిస్తున్నవి. సాంస్కృతిక సామ్రాజ్యవాదంగా పరిణమించి ప్రపంచ వైవిద్య బహుళ సంస్కృతులను ధ్వంసం చేస్తున్నది. ఈ క్రమాన్నంత సాహిత్య క్షేత్రం ఆధారంగా కడు సమర్థవంతంగా దృశ్యీకరించిండు.
ఇక నాలుగో పాయ తెలంగాణ “మౌలిక మార్పుతో సంబంధం లేకుండా జరిగే చిన్న మార్పులు కూడా సామాజిక సంబంధాలను కొంతమేరకు ప్రభావితం చేస్తాయి” (పే. 169) ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆవిర్భావాలకు సంబంధించింది.
భారత స్వాతంత్రోద్యమం కాలంలో జాతీయవాదులకు భిన్నంగా వామపక్షీయులు, సమాజ సంస్కరణ వాదులు, అంబేద్కర్ వాదులు ఆలోచించినారు. రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు కొన్నిసార్లు అంతకంటే ముందే తమ డిమాండు నెరవేరాలన్నరు. సరిగ్గా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో కూడా ఇలాంటి వాదనలే వినిపించినవి. అట్లా సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ లాంటి నినాదాలోచ్చినవి. భారత స్వాతంత్ర్యం లాగానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కూడా పై డిమాండ్లను అలా ఓ పక్కన ఉంచి జరిగింది. తెలంగాణవాదాన్ని మూర్ఖం మార్క్సిస్టులు తిరస్కరించినా విప్లవ వాదులు ఏదోమేరకు నిర్దిష్టత వెంట పయనించేవారు కాబట్టి సానుకూల వైఖరి తీసుకున్నరు. కాశీం కూడా ఈ వైఖరిని స్వీకరించే అన్ని వ్యాసాలు తదనుగుణమైన విశ్లేషణ చేసిండు.
మార్క్సిస్టులు సాధారణంగా వస్తు(Content) విశ్లేషణకు ప్రాధాన్యతనిస్తరు. సాహిత్య రూప(Form) విశ్లేషణకు ఇవ్వరు. తద్భిన్నంగా కాశీం రూప విశ్లేషణ కూడా అనేక వ్యాసాలలో సమర్థవంతంగా చేసిండు. ఇది ఆహ్వానించదగినది. మానవ సంబంధాల విశ్లేషణ కూడా అలాంటిదే. ఇంత నిబద్ధ, సాధికార విమర్శకుడు కూడా కొన్నిచోట్ల పొరపాటు నిర్ధారణలు చేసిండు.
“ఇక బ్రిటీష్ పాలన ప్రభావం ఏ మాత్రం లేని తెలంగాణలో” (పే. 8), “అప్పటికే నాలుగు వందల సంవత్సరాలుగా నిజాంల పాలనలో ఉన్న తెలంగాణ” (పే.146), “సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఆధునికతలకు మూలం బ్రిటిష్ ప్రభావమే. నిజాం పాలన 1724 నుండి 1948 వరకు. “పదాల కూర్పు వలన పదచిత్రాలు ఏర్పడతాయి. భావాల కూర్పు వలన భావచిత్రాలు ఏర్పడతాయి” (పే.105) ఆంగ్ల అలంకారిక పరిభాష Imageను పద చిత్రం, బావ చిత్రం అంటున్నం. రెంటి అర్థం ఒక్కటే. మన ఉపమాన, రూపకాలంకారల మిశ్రితి రూపం ఈ Image. చెప్పదల్చుకున్న విషయాన్ని పోలిక ద్వారా బొమ్మ కట్టించడం లేదా దృశ్యమానం చేయడం దీని లక్ష్యం.
సరే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మాటకేం గాని, ఆయన ప్రామాణిక విమర్శకుడు కాగలరని అన్ని వ్యాసాలు వాగ్దానం చేస్తున్నవి.
అభిరుచి విమర్శకుడు పగడాల నాగేందర్ :
నాగేందర్ వ్యాసాల్ని ఇంకా తడి ఆరని స్థితినుంచి ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్న. ఎందుకు ఇట్ల పరస్పర విరుద్ధంగా రాస్తడు అనుకున్న. విప్లవ సాహిత్యాన్ని విమర్శిస్తూ రాసిండు, ప్రశంసిస్తూ రాసిండు. అస్తిత్వోద్యమాలను ఆకాశానికి ఎత్తిండు, అంత ఎత్తు నుంచి కిందా పడేసిండు. అంతెందుకు నా గురించి పరస్పర విరుద్ధంగా రాసిండు. ఎందుకిట్లా? అవకాశవాదమా? అస్థిర మానసిక స్థితా? అనుకున్న. ఎట్లా లోకెట్ చేయాలే నాగేందర్‌ను? ఇప్పుడు పరిచయం రాయాల్సి వచ్చి వ్యాసాలను మళ్ళీ తిరగేసిన. అప్పుడప్పుడు రాసి పెట్టుకున్న సమాధానం దొరికింది. ఆయన మాటల్లోనే దాని చూడొచ్చు.
“ఎవరమైనా ఉండబట్టలేని తనంలో రచనలు చేస్తాం. నా మాటుకు నేను కవిత్వమైనా వచనమైనా అలాగే రాశాను. ఒక పుస్తకం చదివినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు నా అనుభవ పరిధిలోకి వచ్చిన సమాజ కదలికలు, కల్లోలాలు నన్ను కలవరపరచినప్పుడు రాయకుండా ఉండలేని తనలోంచి రాశాను. కవిత్వంలోనూ, వచనంలోనూ నాకు కొన్ని ఇష్టాలున్నాయి. అభిరుచులు ఉన్నాయి. ముద్రల్లోంచి వాచకాన్ని చూడలేదు. కొంతమంది కవులు భావజాలాలకన్నా వారి కవిత్వంలోని ఇంద్రజాలమే నన్ను ముగ్దుణ్ణి చేసింది. పాఠకునికయినా, రచయితకైనా స్వతంత్ర దృష్టి ఉండాలన్నదే నా అభిమతం”(?).
ఈ మాటలు అభిరుచి విమర్శకు దగ్గరగా ఉన్నవి. ఒకానొక చారిత్రక సందర్భంలో పాశ్చాత్య సాహిత్యంలో వచ్చిన విమర్శనా పద్ధతి ఇది. సాహిత్యేతర ప్రమాణాల దృష్ట్యా చేసిన విమర్శలు కావ్య కళాతత్వం బయల్పడటంలేదని భావించిన సందర్భంలో ఈ విమర్శ వచ్చింది. ఈ చారిత్రక పరిమితులను దాటుకుని ఇది ప్రపంచమంతటా ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. అట్లా ఇది తెలుగు సాహిత్యంలోకి కూడా వచ్చింది. పశ్చాత్య విమర్శలను బాగా మదించిన వడలి మందేశ్వరరావు గారు ఈ అభిరుచి విమర్శ గురించి ఇలా అన్నరు.
“అభిరుచి విమర్శకుడు కావ్యాన్ని తన దృష్టి నుంచే, అది తనకెట్టి అనుభవాన్ని కల్గించిందో, దాని గురించి చెప్తాడు కానీ అది ఎట్టి అనుభవాన్ని ఈయదగి ఉన్నదో దానిని అంచనా వేస్తూ మాట్లాడడు. అంచేత ఈ విమర్శలో ‘తనతనం’ మిక్కిలిగా ఉంటుంది. అచ్చమైన అభిరుచి విమర్శలో విమర్శకుడు కళాకారుడే. ఒక్కొక్కప్పుడు అది విమర్శకుని ఇష్టా ఇష్టాలను హేతుబద్ధమొనరించే ప్రయత్నమన్న భావాన్ని కల్గిస్తుంది.
తెలంగాణ అస్తిత్వోద్యమ బలమైన మద్దతుదారై ఉండీ, తెలంగాణ రాష్ట్రోద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలంలో కీర్తిశేషుడైన పతంజలికి తన పుస్తకాన్ని అంకితం చేయడంలోనే తన అభిరుచి ఎంత బలమైనదో తెలుపుతుంది. పతంజలి సాహిత్య ఎంతగా ముద్ర వేసిందో విశదం చేస్తుంది.
పతంజలి మీద రాసిన వ్యాసం (విషాద హాస్య బీభత్సం – పతంజలి సాహిత్యం)లోనూ, మిత్రుల దగ్గర పతంజలి రచనల్నుంచి విస్తృతంగా కోట్ చేసే సందర్భంలోనూ, మార్క్సిస్టు, తెలంగాణ ప్రమాణాలకతీతంగా – ఆయన పారవశ్యం, ఆయన అభిరుచి విమర్శకు తార్కాణం. తుమ్మేటి రఘోత్తమరెడ్డి “చావు విందు” కథ గురించి రాస్తూ తన భావజాలానికి వ్యతిరేకులైన వారి దృక్పథం నుంచి కథ చెబుతూ, తాను విశ్వసించే దృక్పథానికి ఏమాత్రం హాని జరగకుండా రక్షించుకోడానికి రచయిత చూపించిన నైపుణ్యం ఈ కథలో చదివేవారిని దిగ్భ్రమకు లోనుచేస్తుంది. (విప్లవోద్యమ కథకి ఇరుసు – తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు) అని విప్లవోద్యమం పట్ల సానుకూల వైఖరిని కనపరుస్తడు.
అట్లాగే ఐ. వి గురించి రాస్తూ “ఆయన విప్లవ కార్యదీక్ష, త్యాగశీలత ముందు తరాలకు ఆదర్శప్రాయం”. “ఐ వి స్మృతుల్లో మనల్ని బలంగా కదిలించేది ఆయన కమిట్మెంట్. నేటి యువతరానికి ఐ.వి జీవితం ,రచనలు స్పూర్తివంతంగా ఉపయోగపడతాయనడంలో సందేహం ఎంత మాత్రం లేదు”. అదే సానుకూలత వ్యక్తం చేస్తడు.
మరొకపక్క “1980 తర్వాత స్త్రీలలో, దళితుల్లో పొడచూపుతున్న అసంతృప్తిని కూడా విరసం గుర్తించలేకపోయింది. గుర్తించలేదు సరికదా! కొన్ని సందర్భాల్లో వాటిపై దాడికి పూనుకుంది. దళిత, స్త్రీ వాదాలు విప్లవ కార్యాచరణకు, ప్రజాసాహిత్య సృష్టికి అడ్డంకి అవుతున్నాయని దుమ్మెత్తిపోసింది” “దళిత స్త్రీవాదాలు విప్లవోద్యమ ఫలాలే.” అని ఎలుగెత్తి చాటుతున్న విరసం ఇన్నేళ్ల కాలంలో దళిత స్త్రీల సమస్యల మీద సాహిత్యాన్ని ఎందుకు సృష్టించలేకపోయింది. అని విప్లవ సాహిత్యం మీద విమర్శ కూడా పెడతాడు. ఎందుకిట్లా అంటే ఆయా సందర్భాల్లో అట్లా అనిపించడమే కారణం.
“వర్తమాన మానువు నోట్లో ఉచ్చ పోస్తా” నంటూ దళిత, స్త్రీ, బహుజన, మైనారిటీ అస్తిత్వ వాదాలకు బలమైన స్వరంగా ఉన్న నాగేందర్ వాటిమీద విమర్శ పెట్టడానికి వెనుదీయలేదు.
“తొంబైలల తొలినాళ్ళలో బలంగా పాదుకున్న స్త్రీ, దళిత, బహుజన, మైనార్టీ వాదాలు ఇవాళ చౌరస్తాలో నిలిచి ఉన్నాయి” అంటాడు. “ఈ కొత్త ఉద్యమాల్లోంచి వచ్చిన కవులు, రచయితలు, తమ స్వీయ అనుభవాల నుంచి కాకుండా అరువు తెచ్చుకున్న జ్ఞానసంపదతోనే ఎక్కువగా రచనలు చేశారు. వస్తు వైవిధ్యం లేక మొనాటనీ సమస్యనే ఎదుర్కొంటుంది” అని అస్తిత్వోద్యమాల మీద బలమైన విమర్శ పెడతాడు. తనకు అనిపించింది దాచుకోకుండా నిర్మొహమాటంగా అభివ్యక్తం చేయడం వల్ల ఇలాంటి బలమైన విమర్శ వచ్చింది.
సత్యనారాయణ ‘బహువచనం’లోని కవితా పాదాలను విడిగా కోటు చేస్తూ ఇది బూతు అంటూ ఫిర్యాదు చేస్తూ పాఠకుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పాఠకుడు మొత్తంగా కవిత చదివేటప్పుడు భావావేశాన్ని కవిత సారం గుండా అనుభవిస్తాడు గాని విడి అర్థాల ద్వారా ఏహ్య భావాలనికి లోను కాడు. మార్క్సిజాన్ని, సామాజిక శాస్త్రాలను చదివినట్టుగా కవిత్వాన్ని చదివేవారికి కవి మనస్సు ఎన్ని తరాలు మారినా అర్థం కాదు. “పీడితుడితో మమేకం అవుతూ, ఆ ఆక్రోశాన్ని ఫ్రేములో బందిస్తున్నప్పుడు కవి పొందుతున్న మానసిక స్థితిని, సమానస్థాయిలో పాఠకుడు పొందుటాడని గ్రహించాలి” కవి ఆక్రోశంతో తాదాత్మ్యం చెందిన పాఠకుడు అక్కడ ఆక్రోశాన్ని అనుభూతి చెందుతాడు గాని బూతులు కాదని చేసిన ఈ విశ్లేషణ విమర్శనా శక్తికి తార్కాణం. ఇలాంటి విశ్లేషణ తను పొందిన అనుభూతిని పాఠకుడిలో కూడా కలగించే తీరు చాలా వ్యాసాల్లో ఉంది. కవిగా, వక్తగా రాణించిన నాగేందర్ మంచి విమర్శకుడు కూడా. చెప్పడానికి ‘మొగురం’లోని వ్యాసాలు అనంతర వ్యాసాలు తన పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథం చక్కని నిదర్శనం. వాటిలోని మంచి వాక్యనిర్మాణం, సుబోధక శైలి, అధ్యయన శీలత, అవగాహన స్పష్టత, లోతైన సాహిత్య శీలత తిరుగులేని నిదర్శనాలు.
అయితే అభిరుచి విమర్శ వలన కొన్ని ప్రయోజనాల (పాఠకుడి ఆస్వాద్యతను పెంపొందించడం లాంటి) తో పాటు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నవి. విమర్శకుడు తాను పొందిన అనుభవమే ఫైనల్ అని శాసించి పాఠకుడి కవాటాలను మూసివేసి స్థితి ఏర్పడవచ్చు. నాగేందర్ ఈ ఎరుకను మనసులో ఉంచుకోవాలె.
సహృదయ విమర్శకుడు ఏనుగు నరసింహారెడ్డి :
“కవిత్వంలోని మెరుపుల్ని చూడండి. మరకల్ని కాదు”. అని సినారె విమర్శకులకు ఒక Appeal చేసిండు. ఒక రచన హృదయంలో పాజిటివ్‌గా చూడండి. నెగిటివ్‌గా చూడొద్దన్నది ఆయన ఉద్దేశం. ఈ పద్ధతిలోని మంచిచెడ్డలు ఎలా ఉన్న నరసింహారెడ్డి విమర్శనా పద్ధతి ఇదే. దీన్ని సహృదయ విమర్శ అనొచ్చు. ఆయన విమర్శ గ్రంథం “అంతరంగం”లోని ప్రతి వ్యాసము ఇందుకు సాక్ష్యం. ఒకటి రెండు వ్యాసాల్లో తప్ప నెగిటివ్ చర్చ ఎక్కడ చేయలేదు. గంగుల శాయిరెడ్డి నుంచి సీతారాం దాకా పరస్పర భిన్నమయిన, విరుద్ధమైన కవుల గురించి పరామర్శించిన ఎక్కడా నెగిటివ్‌గా రాయలేదు. ఎక్కడా స్టాండ్ తీసుకొని ఆ కొలతల ప్రకారం అంచనా వేయలేదు. ఆయా రచనల కొలతలను అనుసరించే తూకం వేసిండు. ఈ పద్ధతి పాఠకుడి కేంద్ర అభిరుచి విమర్శ పాయకు చెందుతుందా? అనేది ఈ వ్యాసాల వాఖ్యానంలో తెలుస్తుంది.
దాశరధి గురించి రాస్తూ తాను తెలంగాణవాది అయి ఉండి దాశరథి (1969 ఉద్యమం వచ్చినంక కూడ) సమైక్యవాద కవితల్ని ప్రస్తావించిండు గాని నెగిటివ్ వాఖ్యానం చేయలేదు. విప్లవం దృక్పథాన్ని, అతి నవ్యతను కాదన్న ఆయనను “సమన్వయ వాది” సమన్వయం చేసిండు వ్యతిరేక వాఖ్యానం చేయలేదు.
“తెలంగాణవాదాన్ని హ్రస్వ దృష్టితో చూసిన వాళ్ల కోసం అమ్మంగి చెప్పిన ‘ప్రాంతర్శి కాలేనివాడు క్రాంతదర్శి కాలేడు’ అనే మాట సార్వజనీనతను సంతరించుకుంది. (పే. 36) అని అనగలిగింది అమ్మంగి తెలంగాణ వాది అయినందువల్ల. అటువంటి సందర్భంలో తనలోనే తెలంగాణవాది బయటికొస్తడు. “తెలంగాణ గంధం చెట్టులాంటిది అది దెబ్బలు పడ్డా, గొడ్డలి వేట్లు తిన్నా పరిమళమే వస్తుంది” అని ధర్జాగా అంటడు.
సీతారాం అనగానే ఆయనది వైచిత్రి కవిత, నైరుప్య కవిత అని తక్కువ చేసే ప్రయత్నం చేస్తరు కొందరు. కానీ నరసింహారెడ్డి నెగిటివ్గా కాక “ఆయన శీర్షికలు, భాష, ఆలోచనలు, అభివ్యక్తి ధోరణులు అన్నీ కొత్తగా ఉండేందుకు నిరంతరం పుటం పెట్టుకుని చూసే కవి సీతారాం. ఆయన కవిత్వం వ్యాఖ్యానానికి ఒదిగేది తక్కువ. అనుభవానికి అందుతుంది. వైయుక్తిక అనుభవాన్ని కవిత్వం చేసి పాఠకులను కట్టి పడేయగల శక్తివంతుడు” పాజిటివ్‌గా చూస్తూ సీతారాం కవిత్వ స్వభావాన్ని సమర్థవంతంగా పట్టుకుంటడు.
ఇట్లా వాళ్ల వాళ్ల చట్రాలననుసరించి వాళ్ళు చట్రం పరిధిలోనే సామల సదాశివ, కూరెళ్ల విఠలాచార్య, కాళోజి, జనార్ధన మహర్షి, దాసరాజు రామారావు, ఆశారాజు, విల్సన్ రావు మొదలగు వారిని నిపుణత్వంతో అంచనా కట్టిండు. ఉదాహరణకు శివారెడ్డి గురించి చూడండి. “సంఘర్షణ……. భౌతిక ప్రపంచంలోదని మార్క్స్ ప్రతిపాదించాడు. పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుడుతుందన్నాడు శ్రీశ్రీ. ఈ భావాల కొనసాగింపే శివారెడ్డి కవిత్వం. ఒక రకంగా శివారెడ్డి శ్రీశ్రీకి సమర్థవంతమైన కొనసాగింపు”.
ఆయనకు చందస్సు మీద ముఖ్యంగా గేయం ఛందస్సు మీద మంచి పట్టు ఉన్నదని గేయం మీద రాసిన రెండు వ్యాసాలు నిరూపిస్తవి. అట్లాగే గజల్ మీద కూడ.. మరి వచన కవితా రూపం మీద కూడా మంచి అవగాహన ఉంది. “దానికి ఛందస్సు లేదు, అలంకారం ఆఫ్షనల్. కథ లేదు….. కనిపించని పునాదుల మీద కట్టవలసిన రంగుల హర్మ్యం. కవి తనకు తానుగా కనిపించని సొంత ఛందస్సోక్కటి ఏర్పరచుకుని రాసుకుంటాడు” అనే వాక్యాలందుకు నిదర్శనం.
జూకంటి జగన్నాథం కవిత్వాన్ని విశ్లేషిస్తూ గొప్ప అబ్జర్వేషన్సును ప్రకటించిండు. “నాలుగు దశాబ్దాల క్రితం వరకు వర్గ విభజనలో స్పష్టత ఉండేది. అప్పుడు ప్రజల శత్రువు ధనిక వర్గాలు, భూస్వాములు. కానీ శత్రువు రూపం మారింది శత్రువును గుర్తించడం కష్టమైంది. (పే.124) చాలా కాలం నుంచి చాలా మందిలో తారట్లాడుతున్న భావన ఇది. దీనికి అక్షర రూపమిచ్చిన ఘనత మాత్రం నరసింహారెడ్డిది. అట్లాంటి సందర్భంలో అభివ్యక్తి ఇచ్చినవాడినే కవి అంటం. నాయకుడంటం. విమర్శకుడు అంటం.
విమర్శకుడికి అనేక రంగాల పరిజ్ఞానంతో పాటు చారిత్రక పరిజ్ఞానం కూడ అత్యంతావశ్యకం. అది నరసింహారెడ్డికి పుష్కలంగా ఉందని గంగుల శాయిరెడ్డి, సదాశివల గురించి రాసిన వ్యాసాలు నిరూపిస్తున్నవి. ఆ జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు. దానిని సాహిత్యంలో అనుసంధానించగల నేర్పు కావాలె. ఆ నేర్పు తగినంతగా ఉందని ఈ కింది సూత్రీకరణలు తెలుపుతున్నవి.
“11వ ఆంధ్రమహాసభ పిలుపుతో మొదలైన సాయుధపోరాటమనే గుణాత్మక మార్పు ప్రెజ్వరిల్లడానికి ముందు పరిణామాత్మక మార్పు కోసం పనిచేసిన శక్తులు, వ్యక్తులలో భాగ్యరెడ్డివర్మ, గంగుల సాయిరెడ్డి లాంటి వారు. అలాంటి భూమిక తయారు చేసిన వాళ్ళలో గంగుల సాయి రెడ్డి ఒకరు”. “విపశ్యన బులెటిన్‌లు అరసం – విరసం మధ్యకాలంలో కవిత్వ స్తబ్దతను ఛేదించడానికి జరిగిన ప్రయత్నాలలో దిగంబర, తిరుగబడు కవులతో పోల్చదగినది” ఇవి రెండు కొత్త సూత్రీకరణలు.
కవితా శిల్పానికి సంబంధించి నరసింహారెడ్డికి మంచి అవగాహన ఉంది. అందుకే వస్తు విశ్లేషణ చేసినంత విస్తృతంగా శిల్ప విశ్లేషణ కూడా చేసిండు. వస్తుశిల్పాలు జోడు గుర్రాల్లా సమన్వయంతో నడవాలనే వివేచనతో ఈ విశ్లేషణ జరిగింది. అమ్మంగి, సీతారాం, జూకంటి జగన్నాథం, నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డిల కవిత్వాన్ని గురించి రాసిన వ్యాసాల్లో ఆ విశ్లేషణ నైపుణ్యాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు కొన్ని వాక్యాలని చూడండి.
“అద్భుతమైన వస్తు, శిల్ప సమన్వయం సిధారెడ్డి ప్రత్యేకత. అది ఇక్కడి చెట్ల గాలిలో ప్రతి కవితలో గమనించవచ్చు. (పే.144)
“సుంకిరెడ్డి కవిత్వ శిల్ప సామర్థ్యాన్ని పదచిత్రాలు, భావచిత్రాలు, సంవాద శైలి, వ్యంగ్యం, సౌందర్యాత్మక శైలి, సంకేతాలు, సంక్షిప్తి, భాష వైశిష్ట్యం అనే శీర్షికల కింద పరిశీలించవచ్చు”. (పే. 189) “టెక్నిక్ మీద ఏమాత్రం అవగాహన ఉన్న వారైనా సంక్షిప్తికి ప్రయత్నిస్తారు. అయితే ఎంత సంక్షిప్తంగా వ్యక్తీకరించి విజయం సాధిస్తారన్నది వారి శక్తిని బట్టి ఉంటుంది. ఈ అర్హతలో నందిని సిద్ధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అగ్రగణ్యులు” (పే. 196)
అయితే సబబు అనిపించని ఒక్కటి రెండు ప్రతిపాదనలు చేసిండు. “నాన్ టీచర్స్ పాలిటి ప్రత్యేకం” అనే ప్రతిపాదన వాటిలో ఒకటి. Plan less Automatic of thought అలాంటి కవిత్వం లక్షణంగా చెప్పిండు. ఇలాంటి కవుల లిస్ట్ ఒకటి ఇచ్చిండు. ఈ విభజన సరి కాదు. ఎందుకంటే అధ్యాపకేతరులైన శ్రీ శ్రీ, నగ్నముని కవితలు పక్క నిర్మాణంతో ఉంటవి. అధ్యాపకుడైనా ‘మో’ కవితలు ఎట్లా వస్తే అట్లా రాసినట్టు ఉంటవి. సరె ఇలాంటి చిన్నచిన్నవి పక్కన పెడితే నేనే, కొత్తపలక, మూలమలుపు సంకలనాల ద్వారా కవిగా గణతికెక్కిన. నర్సింహారెడ్డి అంతరంగం, సమాహార విమర్శ గ్రంథాల ద్వారా విమర్శకుడు కూడానని నిరూపించుకుండు. అందుకు అభినందనీయుడు.
అవగాహన, అధ్యయనం, అనుశీలన అంచులుగా గల విమర్శకుడు – స్వామి:
స్వామి బేసికల్గా కథకుడు. తర్వాత విమర్శకుడు. ఇతర సాహిత్యంలో కవులు, కథకులు, విమర్శకులు వేరువేరుగా కంపార్ట్మెంట్లుగా ఉంటారు. తెలుగులో ముఖ్యంగా తెలంగాణలో తొలి నాటి నుండి ఈనాటి దాకా ఒకే వ్యక్తి విభిన్న ప్రక్రియలను నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడింది. సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి, ముదిగంటి సుజాతారెడ్డి, బి నరసింగరావు, బిఎస్ రాములు ఇలాంటి వాళ్లు అట్ల విభిన్న పనులను చేయవలసి వచ్చింది.
స్వామి కూడా అట్లా అవసరం కొద్దీ విమర్శకుడు అయినాడు. అవసరం కొద్దీ అయినా ఆ పనిని అల్లాటప్పాగా ఏమీ నిర్వహించలేదు. ఆ ప్రక్రియ నిర్వహణకు కావలసిన సాధన సామగ్రి, విజ్ఞాన వనరులు ఆయన వద్ద పుష్కలంగా ఉన్నట్లు ఆయన వ్యాసాలను చదివితే చెప్పున స్ఫూరిస్తుంది.
విప్లవోద్యమాన్ని, అన్ని అస్తిత్వ ఉద్యమాలను స్వీయ దృష్టి నుంచి కాక సామాజిక సందర్భం నుంచి పరిశీలించాడు. అంటే సబ్జెక్టివ్గా చూడకుండా ఆబ్జేక్టీవ్ గా చూసిండు. మొత్తంగా స్వామి ప్రగతిశీల విమర్శకుడు.
స్వామి తెలుగు సాహిత్యాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని సీరియస్గా అధ్యయనం చేస్తున్నాడని గట్టిగా చెప్పొచ్చు. అందుకే ఆయన అబ్జర్వేషన్సు నిదర్శనం.
“కాలక్షేప కథలకు వ్యాపార విలువ కథలకు తెలంగాణ ప్రాంతం తక్కువ చోటుని కేటాయించింది. వ్యక్తిగత కోణాల నుంచి సామాజిక కోణం నుంచి వచ్చిన కథలకు తెలంగాణలో ఎక్కువ చోటు దొరికింది. (పే. 34).
“ప్రపంచం ఒక్క కుగ్రామంగా మారాలన్న ఆదర్శం వల్ల భిన్న సంస్కృతులకు సమాధి కట్టడం జరిగింది”. (పే. 4).
“భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్లు ప్రాంతీయతలో సర్వజనీనత కూడా అంతర్లీనంగా ఉంటుంది” (పే.12)
“తెలంగాణలో బహుజన వెలుగులో వచ్చిన కథలు తక్కువే. కానీ ఆ జీవితాన్ని చిత్రించిన కథకులు అనేకులు” (పే.18)
“రావి శాస్త్రి ప్రభావాన్ని తప్పించుకోలేని దశలో రాసిన కథ (రఘోత్తమ రెడ్డి రాసిన ‘ఓ పిల్ల కథ’) ఇది. కథ రాసిన సమయానికి పుస్తకం వేసిన వేళకు మధ్య గల కాలంలో రచయితల్లో వచ్చిన పరిణితి కథను సంపుటిలోకి రాకుండా అడ్డుకుంది” (పే. 31)
“స్వాతంత్ర్యానంతర తెలంగాణ సాంఘిక చరిత్ర రాయడానికి ఈ మూడు నవలలు (కాలువ మల్లయ్య రచించిన భూమిపుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు) ఎంతో ఉపయోగపడతాయి” (పే. 80)
కత్తి పద్మారావు గారి ‘బౌద్ధ దర్శనం’ గ్రంథాన్ని సమీక్షిస్తూ “బ్రాహ్మణేతరులు ఆర్యీకరణకు వేగంగా గురవుతున్న సమయంలో, దానికి భిన్నంగా సంఘర్షించి, బ్రాహ్మణ వైయక్తిక వాదాన్ని కాదని సామాజిక జిజ్ఞాసను పెంచుకోవడంలోనే గౌతముని ప్రత్యేకత దాగి ఉంది” (పే. 95)
“బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో విజ్ఞానవంతమైన చర్చలు జరిగేవి. ఈ పద్ధతి గొప్ప విద్యా సంప్రదాయాన్ని నెలకొల్పింది. అంతకుముందున్న శబ్ద ప్రధానమైన ఒక మనిషి నుండి మరొక మనిషికి ప్రసారమైన విద్యకు ఇది భిన్నంగా ఉంది”. (పే. 97)
ఈ అబ్జర్వేషన్లు చాలు స్వామిలో మంచి విమర్శకుడికి ఉండాల్సిన నిశిత పరిశీలన, సాహిత్య, సామాజిక పరిణామాల దిశను, దశను గుర్తించగల నేర్పు ఉన్నదని చెప్పడానికి.
సంగిశెట్టి శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి తర్వాత తెలంగాణ కథ మీద స్వామికి గట్టి పట్టుంది. ఆయన వ్యాసాలు అన్నీ ప్రక్రియల కంటే కథ ప్రక్రియ మీద ఎక్కువ వ్యాసాలు ఉండడం అందుకు ఒక నిదర్శనం. చాలా మంది కథకులు, విమర్శకులు చదివినన్ని కథలు స్వామి చదవడం అనేది కూడా నిదర్శనం. ఆ కథల మంచి చెడ్డల సంగతి అట్లా ఉంచితే ఇన్నికథల్ని ఎట్లా చదివిండదనేది సంబ్రమాశ్చర్యం కలిగించే విషయం. మొత్తం మీద తెలంగాణ కథా పరిణామం గురించి స్వామికి మంచి అవగాహన వుందనే విషయాన్ని ఈ వ్యాసాలు తెలుపుతవి.
“అతని పదకోశం చూశాక సాహిత్య చరిత్రకు సంబంధించి ఇంత వరకు చెప్పుకున్న విషయమంతా ఒక పార్శ్వానికి సంబంధించినది మాత్రమే అనిపిస్తుంది”. (పే. 71) అని అంటాడు. నలిమెల భాస్కర్ గారి “తెలంగాణ పదకోశం” గురించి రాసిన వ్యాసంలో. అనిపించడమేమిటి వందశాతం నిజం. ఈ వ్యాసాన్ని బట్టి భాషా పరిణామం మీద కూడా స్వామికి మంచి అవగాహన ఉన్నదని తెలుస్తుంది.
బెజ్జారపు రవీందర్ రచించిన “తాటక” అనే నవల Myths ని పునర్వాఖ్యానించిన మంచి నవల. ఈ నవల మీద రాసిన వ్యాసాన్ని బట్టి స్వామికి ఆర్య అనార్య ఘర్షణ, ఉత్తర దక్షిణ భారతాల ఘర్షణ గురించి, మొత్తంగా దేశ చరిత్ర గురించి మంచి అవగాహన ఉన్నట్టు తెలుస్తుంది. “అమ్మ దేవతలు” గురించి రాసిన వ్యాసాన్ని బట్టి దళిత, బహుజన సంస్కృతి, దక్షిణ భారతదేశ సంస్కృతుల ప్రత్యేకత, విశిష్టతల గురించి మరో అవగాహన ఉన్నట్లు అర్థం అవుతుంది. “బౌద్ద దర్శనం” అనే వ్యాసాన్ని బట్టి మత, తాత్త్విక, ప్రాచీన సాహిత్యాలను గురించి కూడా స్వామికి అవగాహన ఉందని తెలుస్తుంది. ఇట్లా వివిధ అంశాల గురించి స్వామికి మంచి అవగాహన, పరిజ్ఞానం ఉన్నట్టు తెలిసి ఆశ్చర్యపోతం. ఈనాటి విమర్శకుడు వెనుకటి పండితుడు లాంటివాడు. అనేక రంగాల గురించి పాండిత్యం, అవగాహన ఉత్తమ విమర్శకుడికి ఉండాల్సిన లక్షణాలలో కొన్ని. ఈ లక్షణాలు స్వామికి తగిన విధంగా ఉన్నవని పై పరిశీలన వల్ల తెలుస్తుంది.
ఈ పుస్తకంలో అంపశయ్య నవీన్, నలిమెల భాస్కర్, వారాల ఆనంద్, వాసాల నరసయ్య, దాస్యం సేనాధిపతి, కల్వకుంట్ల రామకృష్ణలతో స్వామి చేసిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నవి. వీటిని బట్టి ఆయనలో మంచి ఇంటర్వ్యూయరు కూడా ఉన్నాడని గుర్తిస్తాం. ఇంటర్వ్యూ చూసే విలేకరులను ఎడిటర్‌లను చూస్తే ఎంతో చాణఖ్యత ఉన్న, అనుభవం ఉన్న రాజకీయ నాయకులే భయపడతారు. ఎందుకంటే క్రాస్ ఎగ్జామిన్ చేసే లాయరులాగా ఎక్కడో చోట ఇరుకున పెడతారు. తమకు కావాల్సిన విధంగా సమాధానం రాబడతారు. ఈ పనిని స్వామి సమర్థవంతంగా చేసిండు. నలిమెల భాస్కర్ నుంచి “తెలంగాణ రాష్ట్రంలో విధిగా అన్ని వ్యవహారాలు తెలంగాణ తెలుగులో జరగాలె” అన్న ఇప్పుడు అవసరమైన సమాధానాన్ని రాబట్టిండు. వారాల ఆనంద్ నుంచి “తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక స్తబ్దత ఏర్పడింది” అన్న మంచి జవాబును ఇప్పటి పరిస్థితిని తెలిపే జవాబును రాబట్టిండు. కల్వకుంట్ల రామకృష్ణతో చేసిన ఇంటర్వ్యూలో “వాదాల వెలుగులో విమర్శించడం ఎంతవరకు సమంజసం” అని ఇరుకున పెట్టే ప్రశ్న వేసిండు.
మళ్లీ వ్యాసాల దగ్గరికి వెళ్తే ఈ పుస్తకంలోని వ్యాసాలు పరామర్శ, విశ్లేషణ సమ్మిళితంగా ఉన్నవి. అయితే పరామర్శ వ్యాసాలే ఎక్కువ. అట్లని విశ్లేషణ, వ్యాకరణం, సైద్ధాంతీకరణ ఇందు లేదని అర్థం కాదు. “తాటక” నవల మీద రాసిన వ్యాసం ఆయన విశ్లేషణ సామర్థ్యానికి మచ్చుతునక. దానిని భవిష్యత్తులో మరింత ప్రదర్శించగలడని ఆశిస్తున్న.
(‘నడుస్తున్న తెలంగాణ’ ప్రత్యేక సాహిత్య సంచిక (29 జూన్-2019) కోసం రాసిన వ్యాసమిది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంచిక రాలేదు. తర్వాత ఆ పత్రిక ఆగిపోయింది.)