తెలివి మీరిన తెగువ !

వొకటి రెండు గాదు…
ముప్పయ్ ఐదేండ్లుగా
కందిన దేహం ఇది…

ప్రేమాస్పదమైన
నిన్ను…
గుండెమీద నిలిపి
ఆడించుకున్నందుకు…

భుజాలమీద కెత్తుకుని
నీ ఆకలితో
ఉండచుట్టుకుపోయి…
నీ కన్నీళ్ళలో
మసలి మసలి…
నీ దుఃఖంలో
పొగిలి పొగిలి…

నేనే నీవై
నీవే తెరువై…
గుండె చెరువై
గోడాడని గుర్తులేదు…

రాలిపడిన
మెతుకుల్లో
ఏరుకున్న
బాల్యం నాది…

నోటికందని
అమ్మపొదుగు కోసం
నోరెళ్ళ బెట్టుకుని
వగచిన శైశవాన్ని
విప్పడమెందుకులే…

బతుకంతా
మనసుగాట్లు తట్టిన
ఏకునాద గీతాలే…

మలుపు మలుపులో
పొరలు పొరలుగా
విచ్చుకుంటున్న
తల్లికోడి పిల్లల తండ్లాటే…

నా అమ్మీ
నువ్వెక్కడ…

కనులు రాల్చని
కన్నీళ్లను
కలంలో కొంపుకున్నానని…
కాలం చిటికనేలుపట్టి
గంతులేస్తుంటే…

వొళ్ళోకెత్తుకుని
కళ్ళొత్తుకున్న మెరిజాన్
నువ్వెక్కడమ్మా…

నిప్పును
నీరననందుకు…

కమిలిన
చూపుడేలు
కథ చెప్పమంటే…
పొడవకుండా రాలిన
ఏ పొద్దును ఎత్తిచూపను…

ఎన్నని రాయను…
ఎన్నని పాడను…

రాయని… రప్పని…
కొండని… లోయని…
కాళ్లకు తట్టని
రేగిన శ్వాసల
తుఫాను ఘోషలు…

అలమటింపుల ఆనందంలో
కసి పెరిగిన జాడలెంట
పురుగు పుట్టకు
వెరవని తెంపుతో
పసిగట్టుకు సాగితిమే…

అక్కా… తమ్ముడూ…
నేనూ… చెల్లెలూ…
తోబుట్టు లందరం
నీడలా
నీ వెనుక…

చీకట్ల తరుముతూ
బొంగురాళ్ళ మిట్టేమీ…
జీల్దారు తిప్పేమి…
పొదపొదను తడిమి
అడివంత కలదిర్గి
దాపెరగని మన పాట్లు…

తలమీద మోపుతో
జారిపడ్డ బోడులూ…
కతువ చేరేదాకా
కడుపు నిలువదంటు
నారేప కడుపులో
తలకప్ప లీదేటి
తేటనీళ్లను జూసి
కొంగు నోటికి పెట్టి
గుట గుటా తాగితిమి…

నడినెత్తి ఎండలో
కాలేటి కంకరా
జారేటి దారిల
నెత్తినిలువని సుట్ట…

మెడసెర్లు బిగిసి
ఎనుదిర్గ నంటున్న
తలదిమ్మ వొదిలిచ్చి
నర్రెంగ నీడయ్యి
సేదదీర్చిన దది
అనసూయవ్వ సేను…

ఏమాయే…
ఏమాయే…
గులక రాళ్ల దిబ్బయ్యి
పడావు బీడాయె…

అరిగిపోయిన కాళ్ళు
సూపు దగ్గిన కండ్లు
అడుగు దీయగ రాదు
అలుపు తీరగ ముదిరె…

తెలివి మీరిన తెగువ
తడిమి సూస్తది బరువు
ఎదిరించె గుణమోళ్ళ…
ఎతికెతికి
ఏరేసే దినమొచ్చే…

వుండుడెట్లని అడుగుడా!!
ఉరువుకే ఎసరొచ్చెలేవమ్మా
బరువయ్యి బతుకుడొద్దు…
బాట కడ్డిడ్సి బయిలయ్యి
తొవ్వ దొల్గుతి
తెల్పి నాయమ్మ !!

****

నా పిడికిళ్ళై ఎగసి రావొచ్చు…!!

భూమినే నమ్ముకోవడం…
భూమితో పాటే మోసపోవడం…

బతుకంతా…
నా చూపులన్నీ నేలపైనే…
నా ఆశలన్నీ…
ఈ చారెడు మట్టిపైనే …

తరాల పాలోల్లయ్…
యుగాల పగోల్లయ్…
ప్రకృతీ… పాలకులొకటై…
తనివితీరా ఆడిన
మాయాజూదంలో…

మత్తడి ముంచిన
చిత్తడి చేతుల…
చిత్తు… చిత్తై… కుళ్ళిన పంటై…
బతుకు చెత్తయ్ పోయి…

చితిమీద సేదతీరుతున్న
దుర్గతి నాది…

అయ్యలారా…
ఆఖరి మాట
ఆకలి మంట
నాపేరు రైతు…

ఆనవాళ్లన్నీ చెరిపేసుకొని…
కొలతలు పెట్టేసుకొని…
పాతేసుకొండి..పాతేసుకోండి…
ఎల్ ఆర్ ఎస్… బి ఆర్ ఎస్…
బంగారు ప్లాటురాళ్ళు… పాతేసుకోండి… పాతేసుకోండి…

ఏ ప్యారిస్ కమ్యూనో…
ఏ ఏనాను సంకల్పమో…
మునిమనుమన్నని
తట్టిలేపి…
నాపిడికిళ్ళై
ఎగసిరావొచ్చు…

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

Leave a Reply