తెలంగాణ జానపద ఆశ్రిత కళారూపాలు – సాహిత్యం

జానపద కళలకు కాణాచి తెలంగాణ. తెలంగాణ సంస్కృతిలో భాగమైన జానపద కళారూపాలు ‘ఆశ్రిత జానపద కళారూపాలు’ ఆశ్రితేతర జానపద కళారూపాలుగా విభజించబడి తమకు మౌఖికంగా సంక్రమించిన సంస్కృతిని కాపాడుకుంటూ మనుగడ సాగిస్తున్నాయి. `ఆశ్రితుడు` అనే పదానికి `ఆశ్రయించినవాడు`, `అవలంభించినవాడు`, `ఆశ్రయింపబడినవాడు`, `ఆధారముగా చేసుకొనినవాడు` అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఒక గుర్తింపు పొందిన సమూహాన్ని ఒక వ్యక్తియే కాక, ఒక సమూహం తమ కళ ద్వారా ఆశ్రయించి జీవంచే కళారూపాలను ఆశ్రిత కళారూపాలని చెప్పవచ్చు. ఈ కళారూపాలు కేవలం ఒక కులానికి మాత్రమే హక్కుదార్లుగా ఉంటూ, వారికి తమ ప్రదర్శన ద్వారా విజ్ఞానాన్న, వినోదాన్ని అందిస్తూ, వారిచ్చే ప్రతిఫలం మీదనే ఆధారపడి జీవిస్తాయి తప్ప, వేరే కులాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయించవు.

ఆశ్రితేతర కళారూపాల కళాకారులు కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని కులాలను ఆశ్రయించి ప్రదర్శనలిస్తూ జీవిస్తాయి. ఇందుకు ఉదాహరణగా చెక్కబొమ్మలాట, తోలు బొమ్మలాట, కాటిపాపలు, చిరతల రామాయణం, పగటి వేషాలు మొదలైనవి. ఆశ్రిత జానపద కళారూపాలను ప్రదర్శించే కళాకారులు ఒక నియమిత కులానికి చెంది సంప్రదాయమైన కట్టడి కలిగి ఉంటారు. వీరికే భిక్షుక గాయకులు, వృత్తి గాయకులు, అర్థి బిడ్డలు, ఆశ్రిత గాయకులు, హక్కుదార్లు, ఉపకులాలు, కులం బిడ్డలు ఇట్లా రకరకాల పేర్లున్నాయి. వీరు ఏ కులాన్ని అయితే ఆశ్రయిస్తారో ఆ కులాన్ని పోషక కులమని, ధాతృ కులమని, ప్రధాన కులమని వ్యవహరిస్తారు.

ఆశ్రిత జానపద కళారూపాలను ప్రదర్శించే కళాకారుల పుట్టుకకు చెందిన మౌఖిక కథలని బట్టి  వీరు మొదట పోషక కులంలోనే అన్నదమ్ములుగా పుట్టి, కులం కట్టుబాట్లను అతిక్రమించడంవల్ల కొందరు ఆశ్రితులయ్యారు. ఇందుకు ఉదాహరణగా ముదిరాజ్‌లను ఆశ్రయించే కాకి పడిగెలవారు, నాయీబ్రాహ్మణులను ఆశ్రయించే అద్దపు వారు, మాలలను ఆశ్రయించే గుర్రపువారు, గౌడ కులాన్ని ఆశ్రయించే గౌడజెట్టీి – ఏనూటి వారు, రజకులను ఆశ్రయించే మాసయ్యల వారు. మరి కొందరు పోషక కులం మూలపురుషున్ని రక్షించటం కోసం, మూల పురుషుని స్వేదం నుండి పుట్టి ఆశ్రితులుగా మారటం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా పద్మశాలి కులాన్ని ఆశ్రయించే కూనపులివారు ఆ కులం మూలపురుషుడైన భావనాఋషి స్వేదం నుండి పుట్టి అతన్ని రక్షించటంతో ఆశ్రితుడయ్యాడు. ఇదే పద్మశాలి కులాన్ని ఆశ్రయించే సాధనాశూరులు పోషక కులంలోనే పుట్టి ఆ వంశాన్ని శ్రీకృష్ణ గంధర్వరాజు నుండి రక్షించి అదే కులానికి ఆశ్రితులయ్యారు. ఈ రకంగా ఆశ్రిత కళారూపాల పుట్టుక కథలు రకరకాలుగా మౌఖికంగా ప్రచారంలో ఉన్నాయి.

ఆశ్రిత కళారూపాలు ప్రదర్శించే కులాల ప్రస్తావన ప్రాచీన కావ్యాల్లో కూడా కనిపిస్తుంది. క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు ద్విపదలో రచించిన పండితారాధ్య చరిత్ర (పర్వత పుట-237)లో…
”వీవంగ జేతులు లేవయ్యా నడచి
పోవంగ గాళ్ళును లేవయ్యా యంధ
కులమయ్య పిచ్చుక గుంటులమయ్య
తలపోయ నభ్యాగతుల– — — , మంటూ 

పిచ్చుకకుంట్ల కులం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ పిచ్చుకకుంట్ల కులంలో గంట, కత్తి, తిత్తి, తురక అనే నాలుగు తెగలున్నాయి. ఇందులో కత్తి, తిత్తి అనే పిచ్చుకకుంట్లవారు రెడ్లను, తురక పిచ్చుకకుంట్లవారు గొల్లవారిని, గంట పిచ్చుకకుంట్ల వారు కమ్మవారిని ఆశ్రయిస్తారు. ఇందులో ఎవరైనా కళారూపాన్ని ప్రదర్శిస్తూనే పోషక కులం దగ్గర ఆశ్రయిస్తారు. సోమనాథుడు పిచ్చుకకుంట్ల కులాన్ని ప్రస్తావించాడే గాని వీరు ఆశ్రితులనే విషయం చెప్పలేకపోయినప్పటికి, ఆ కాలం నాటికే ‘పిచ్చుక కుంట్ల’ కులం ఒకటుందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది. అంతేగాక కోమటి కులానికి ఆశ్రిత కళారూపమైన వీరముష్ఠుల ప్రసక్తి ‘హంసవింశతి’ తృతీయ శ్వాసం, తొమ్మిదవ రాత్రి కథలో తిరునాళ్ళ వేడుకల్లో పాల్గొన్న వివిధ కళాకారుల కులాల వారిలో వీరముష్ఠుల ప్రస్తావన ఉన్నది. విశ్వకర్మలకు ఆశ్రితులైన రుంజవారి ప్రస్తావన ‘పల్నాటి వీర చరిత్రలో కనిపిస్తున్నది. అలాగే శుకసప్తతి, హంసవింశతి కావ్యాల్లో గొల్లసుద్దులు, ఆసాదులు, మందహెచ్చుల ప్రసక్తి ఉన్నది. ఇట్లా ప్రాచీన కావ్యాలను బట్టి చూస్తే ఆశ్రిత జానపద కళారూపాలు లేదా ఆశ్రిత కులాల ప్రస్తావన 10, 11, 12 శతాబ్దం నాటికే ఉన్నట్లు తెలుస్తున్నది.

క్రీ.శ 1172 ప్రాంతంలోని కాకతీయ ప్రభువైన రుద్రదేవుడు వేయించిన నాగులపాడు శాసనంలో అష్టాదశ ప్రజ(18 కులాలు) పేర్కొనబడ్డాయి. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తంతువాయు (పద్మశాలి) మొదలైన కులాలు ప్రస్తావించబడ్డాయి. ఇందులో ప్రస్తావించబడిన కులాలన్నిటికి ఆశ్రిత ళారూపాలున్నాయి. దీనిని బట్టి ఆకాలం నాటికంటే ముందునుండే పోషక కులాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అలాగే ఆశ్రిత కులాలు లేదా ఆశ్రిత కళారూపాలు కూడా ప్రచారంలో ఉన్నట్టుగా భావించవచ్చు. ఈ రకంగా ఆశ్రిత జానపద కళారూపాల ప్రాచీనత కనిపిస్తున్నది. ఇవి గత సంస్కృతి అనుభవాలను, విజ్ఞానాన్ని వర్తమాన కాలంలో ప్రసరింపజేస్తూ విభిన్న ప్రక్రియల్లో పండితులను, పామరులను అలరిస్తూ వస్తున్నాయి.  వీటిలో పటం కథలు, యక్షగానాలు, ఇంద్రజాల ప్రదర్శనలు, కథాగానాలు, బొమ్మలాటలు వంటి విభిన్న ప్రక్రియలతో తెలంగాణా రాష్ట్రంలో ఆశ్రిత జానపద కళారూపాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క్ర.సం – జానపద పోషక కులం – ప్రక్రియ ప్రదర్శనా అంశం – ఆశ్రిత కళారూపం – దాతృకులం/ ప్రధాన కులం

  1. కూనపులి – పద్మశాలి – పటంఆధారంగా కథాగానం – మార్కండేయపురాణం
  2. సాధనాశూరులు – పద్మశాలి – ఇంద్రజాలం – ఇంద్రజాల విద్యలు
  3. గౌడజెట్టి – గౌడ – పటం ఆధారంగా కథాగానం – గౌడపురాణం
  4. ఏనూటి – గౌడ – పటం ఆధారంగా కథాగానం – గౌడపురాణం
  5. రుంజ – విశ్వబ్రాహ్మణులు – రుంజవాద్యం ఆధారంగా – విశ్వకర్మపురాణం
  6. పనస – విశ్వబ్రాహ్మణులు – కథాగానం – విశ్వకర్మపురాణం
  7. బీరన్నలు – కుర్మ – గొల్లకుర్మకథాగానం – బీరన్న కథ
  8. మందహెచ్చులు/బైకాని – గొల్ల – బొమ్మల ప్రదర్శన – కాటమరాజు కథ పటం ఆధారంగా కథాగానం
  9. ఒగ్గు – గొల్ల – కథాగానం/ ఒగ్గువాద్యం – మల్లన్న కథ ఆధారంగా కథాగానం
  10. గొల్ల భాగవతులు – గొల్ల – భాగవతం/నాటకాలు – రామాయణ, భారత నాటకాలు
  11. కొమ్ము – గొల్ల – పటం ఆధారంగా కథాగానం – కాటమరాజు కథలు కొమ్ము వాద్యం
  12. గోత్రాలవారు – గొల్ల – నాటకాలు/ కథాగానం – యాదవ కథలు
  13. గొల్ల సుద్దులు – గొల్ల – కథాగానం – దాసరి కథలు/ యాదవకథలు
  14. పిచ్చుకకుంట్ల – గొల్ల – కథాగానం – గోత్రాలు/ కథాగానం
  15. పిచ్చుక కుంట్ల – గొల్ల – కథాగానం – యాదవ కథలు/గోత్రాలు
  16. తెర చీరలు – గొల్ల – కథాగానం – గంగమ్మకథ/ మల్లన్న కథలు – గంగపుజారులు
  17. గంగిరెద్దులు – ఎర్రగొల్ల – గంగిరెద్దుల ఆట – గంగిరెద్దుల ఆటలు
  18. బేరి పనస – కోమటి – కథాగానం – కన్యకా పురాణం
  19. వీరముష్ఠి – కోమటి – కథాగానం – ఖడ్గాలు/ కన్యకాపురాణం
  20. కాకిపడిగెలు – ముదిరాజులు – పటం ఆధారంగా కథాగానం – పాండవుల కథలు
  21. పిచ్చుక కుంట్ల – రెడ్డి/ కాపు – కథాగానం – గోత్రాలు/ కుంటి మల్లారెడ్డి కథ
  22. ఆదికొడుకులు – మేదరి – కథాగానం – మేదరి కథలు
  23. ఆద్దపు – మంగలి – పటం ఆధారంగా కథాగానం – అద్దపు పురాణం
  24. పెక్కర్లు – కుమ్మరి – పటం ఆధారంగా కథాగానం – గుండబ్రహ్మయ్యపురాణం
  25. మాసయ్యలు – రజకులు – పటం ఆధారంగా కథాగానం – మడేలు పురాణం
  26. తెనుగు మాష్టి – తెనుగు/కాపు/ తెలగ – కథాగానం – మాష్టికథలు
  27. తెనుగు భోగం – తెనుగు/ కాపు/ తెలగ – ఆటలు – భోగం ఆటలు
  28. శారద గాళ్ళు – కాపు, రెడ్డి – బుర్ర కథ – శారద కథలు
  29. బండారి భక్తులు – పెక్కర్లు – కథాగానం – పెరక పురాణం
  30. గోంధళే వీధి భాగోతం – ఆరె – భాగవతాలు/ నాటకాలు – గోంధళే నాటకాలు
  31. చిందు యక్షగానం – మాదిగ – యక్షగానం – రామాయణ, భారత నాటకాలు
  32. డక్కలి – మాదిగ – పటం ఆధారంగా కథాగానం – జాంబపురాణం
  33. బైండ్ల/ బవనీలు – మాదిగ – కథాగానం – ఎల్లమ్మ కథ/ మాంధాత కథ
  34. నులక చందయ్యలు – మాదిగ – కథాగానం – జాంబపురాణం
  35. ఆసాది – మాదిగ – కథాగానం – ఆసాది కథలు
  36. మాదిగ బోగం/ మాదిగ మాష్టి – మాదిగ – మాదిగవారికి కమ్మరి – వడ్రంగి పని చేస్తారు
  37. మాల జంగాలు – మాల – కథాగానం – చెన్నయ్య కథ
  38. గుర్రపు – మాల – పటం ఆధారంగా కథాగానం – భేతాళ పురాణం
  39. మాల మాష్టి – మాల – కథాగానం – పురాణ ప్రవచనం
  40. మిత్తిలి – మాల – కడ్డీతంత్రీ వాద్యంతో కథాగానం – రామాయణకథలు/ నాటకాలు
  41. మాల భోగం – మాల – ఆటలు – భోగం ఆటలు
  42. విప్రవినోదులు – బ్రాహ్మణులు – ఇంద్రజాలం – ఇంద్రజాల విద్యలు

తెలంగాణాలోని జానపదులకు ఆశ్రిత జానపద కళారూపాలున్నట్టుగానే, గిరిజన తెగలకు కూడా ఆశ్రిత కళారూపాలు పట్టెడ, డోలి, తోటి, పర్‌ధాన్‌, కొర్రాజులు, పూజారి, భాట్స్‌, దాడి వంటి కళారూపాలు విభిన్నమైన ప్రక్రియలతో ప్రధాన తెగలను ఆశ్రయిస్తూ జీవిస్తున్నాయి. ఈ కళారూపాలు కూడా ప్రధాన తెగకు కట్టడి కలిగిఉన్నాయి.

ఆశ్రిత జానపద కళారూపాలు ఒక పోషక కులానికి భిన్నమైన ఆశ్రిత కళారూపాలు ఒకటి కంటే ఎక్కువగా   ఉన్నాయి. ఇవి భిన్నంగా ఉండటమేగాక ప్రదర్శనలో వాటి పక్రియలు కూడా వేరు వేరుగా ఉన్నాయి. పోషక కులం యొక్క వంశ కీర్తిని తెలియపరుస్తూ వారికి గత సంస్కృతి విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతూ నేటికీ తమ మూల సంస్కృతిని సాహిత్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. ఇవి ఒక నియమితమైన ట్టుబాట్లతో నిర్మించబడటమేగాక, పోషక కులాల్లో వారి కులం పట్ల ఉన్న ఆత్మనూన్యతా భావాన్ని తొలగించడానికి, అంతేగాక వారిలో ఆత్మ చైతన్యాన్ని, వ్యక్తిత్వ స్థాపనను కల్పించే విధంగా నిర్వహిస్తున్నాయి. అందుకే వాటికంటూ కొన్ని నియమాల్ని ఏర్పాటు చేసుకొని ఆ కట్టుబాట్లను అతిక్రమించకుండా పోషక కులాల అభిమానాన్ని, ఆదరణను పొందుతున్నవి.

ఆశ్రిత కళా రూపాలు పూర్వం నుండి వంశ పారంపర్యంగా వారు ఏ పోషక కులానికి అయితే ఆశ్రితులుగా ఉన్నారో వారినే ఆశ్రయిస్తారు తప్ప మిగతా కులాలను ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయించరు. ఇది తరతరాలుగా సంక్రమించిన నియమంగా పాటిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ నియమాన్ని అధిగమించడానికి సాహసించరు. ఉదాహరణకు అద్దపువారు మంగలి కులాన్ని ఆశ్రయించి పటం ఆధారంగా అద్దపు పురాణాన్ని కథాగానం చేస్తూ ప్రతిఫలం పొందుతారు తప్ప మిగతా ఇతర కులాలను మాత్రం ఆశ్రయించరు. ఒకే పోషక కులానికి ఒకటి కంటే రెండు లేదా అయిదు, ఆరు వరకు ఆశ్రిత కళారూపాలు ప్రచారంలో ఉన్నాయి. ఇట్లా ఒకే కులానికి ఎన్ని ఆశ్రిత కళారూపాలున్నప్పటికి నియమం ప్రకారం ఒకే సంవత్సరంలో రెండు కళారూపాలు పోషక కులాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నించవు. ఒకరు ఒక సంవత్సరం వస్తే మరొకరు మరో సంవత్సరంలో కట్టడి గ్రామాలకు వెళ్తారు. ఇట్లా పోషక కులం దగ్గర నియమిత కాలాన్ని పాటించి ఆయా కులాల మధ్య సంబంధాలను పెంచుకుంటారు.

ఆశ్రిత కళారూపాల కళాకారులు పోషక కులం దగ్గర మిరాశి హక్కులు కలిగి ఉంటారు. ఇవి రాగి శాసనం మీదగాని, శాసనాల మీదగాని, తాళపత్ర ప్రతుల మీదగాని వ్రాయబడి ఉంటాయి. కళాకారులు వీటినే స్థిరాస్థిగా భావించి కళాకారులు భద్రంగా దాచుకుంటారు. ఈ మిరాశి హక్కు పత్రాలనుగాని, రాగి శాసనాలను గాని పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తాయి. వీటిలో ఆశ్రిత కళాకారుల కుటుంబాలను బట్టి ప్రతి కుటుంబానికి ఇన్ని గ్రామలని ఉంటుంది. ఫలానా గ్రామంలోని పోషక కులం నా మిరాశి హక్కు, హక్కు పత్రంలో ఉంది అంటే ఆ గ్రామాన్ని ఆశ్రయించే హక్కు అతనికే ఉన్నట్టు. పోషక కులం ఆశ్రిత కులం కలిసి నిర్ణయించుకున్న శాసనమిది. కాబట్టి దీన్ని మార్చడానికి వీలుండదు. ఈ హక్కు పత్రాలను లేదా రాగి శాసనాలను ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఇందులో కట్టడి గ్రామాలు, ఆయా పోషక కులాలు, ఇంటిపేర్లు, దాతలు ఇచ్చే ధాన్యం, ధనం, గొడ్డు, గోదా, భూమి, ఆభరణాలు, వస్తువులు మొదలైన అన్ని విషయాలు రాసి ఉంటాయి. కొన్ని హక్కు పత్రాల్లో అయితే ఆశ్రిత ళారూపాల చరిత్ర రాసి ఉంటుంది కూడా. ఈ మిరాశి హక్కులను ఒక ఆశ్రిత కళారూపం మరొక ఆశ్రిత కళారూపానికి అమ్మటంగాని, కొనటంగాని చేయరు. ఏ ఆశ్రిత కళారూపమైతే హక్కుగా కలిగి ఉంటుందో ఆ కులం వాళ్ళే తండ్రి కొడుకులకు, ఒకవేళ కొడుకులు లేకపోతే అల్లుళ్ళకు మిరాశి హక్కులను ఇచ్చుకుంటారు. అమ్మాయికి కట్నం కింద కూడా కొన్ని గ్రామాలను మిరాశి హక్కుగా అల్లునికిస్తారు. ఒక ఇంటిలో తండ్రి తన కొడుకులకు మిరాశి హక్కులను పంచితే వారి హక్కులను కొత్త శాసనం మీద రాయించి ఇస్తాడు. లేకుంటే తన రాగి శాసనాన్ని రెండు ముక్కలుగా చేసైనా ఇస్తాడు కూడా. ఎందుకంటే కళాకారులు గ్రామానికి వెళ్ళినప్పుడు పోషక కులానికి తప్పని సరిగా శాసనాన్ని లేదా హక్కు పత్రాన్ని చూపించి అప్పుడు కథల గురించి, ప్రతిఫలం గురించి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు.

ఆశ్రిత కళారూపాలను ప్రదర్శించే కులాలకు కుల చిహ్నాలుగా కొన్ని ప్రత్యేకమైన గుర్తులుంటాయి. అవి వారి యొక్క మూలాల్ని సూచిస్తాయి. ఉదాహరణకు కాకిపడిగెల కళాకారులకు కాకి గుర్తుగా ఉంటుంది. అలాగే గుర్రపు కళాకారులకు కంచుతో చేయబడిన గుర్రపు బొమ్మ ఉండగా, కూనపులి కళాకారులకు పులి జెండాను కులానికి గుర్తుగా ఉపయోగిస్తారు.

తెలంగాణాలోని జానపద ఆశ్రిత ళారూపాలు పోషక కులాన్ని ఆనందింప చేయడానికి కథాగానాలు, ఇంద్రజాల విద్యలు, యక్షగాన రూపంలో ప్రదర్శనలిస్తూ ఆశ్రయిస్తూన్నారన్నది సుస్పష్టం. ప్రదర్శనలో ఆయా ఆశ్రిత కళారూపాలు మౌఖికంగా వారికి సంక్రమించిన సాహిత్యాన్నే ఆసరాగా చేసుకొని ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ నేటికీ వస్తున్నారు.

కథాగానాల రూపంలో ప్రదర్శించే కళారూపాలు పోషక కులం కుల పురాణాలను, రామాయణ భారత కథలను, కథా వస్తువుగా చేసుకొని ప్రదర్శనలో పద్యం, గేయం, వచనంతో కళాకారులు కథాగానం గాని, నాటాకాలు గాని ఆడతారు. కథాగానాలు  ప్రదర్శించే కళారూపాల్లో ముఖ్యమైనవి పటం కథల కళారూపాలు. ఇవి ప్రధాన కులం లేదా పోషక కులం యొక్క కుల పురాణాన్ని కథాగానం చేస్తారు. వీరి సాహిత్యంలో సృష్టి పుట్టుక జరిగి దేవతలు జన్మించటం, ఆ దేవతల అవసరాల కోసం కులాల పుట్టుక, వృత్తుల ఆవిర్భావం, దేవతలను హింసిస్తున్న రాక్షసులను సంహరించటం కోసం కులం యొక్క మూల పురుషులు పుట్టి వారంతా దేవకార్యాన్ని నిర్వర్తించటం, ఆ యొక్క మూల  పురుషులే కులాలకు ఆద్యులై నియమించబడిన వృత్తులను చేయడం జరుగుతుంది. అంతేగాక వీరి సాహిత్యంలో కులాలకు దైవత్వాన్ని ఆపాదించడమే గాక కులాల గౌరవాన్ని పెంచుతాయి. అలాగే వృత్తి మనుగడలో ఎదురయ్యే ఆటంకాలను  తట్టుకునేలా మనోధైర్యాన్ని కలిగించేలా ఆయా వృత్తుల్లో ఉపయోగించే వస్తువులకు కూడా దైవత్వాన్ని ఆపాదించటం కనిపిస్తుంది. అందుకే పండుగల్లో కూడా వృత్తి పరికరాలను పూజిస్తారు కూడా.

మంగలి కులాన్ని ఆశ్రయించి పటం ద్వారా అద్దపు పురాణం చేప్పే అద్దపు కళాకారుల సాహిత్యంలో దేవతల పెళ్ళిళ్ళు చేయడానికి గందమాను పర్వతం వద్ద మంగ వృక్షం కింద సుమంగలుడు తపస్సు చేస్తుండగా అతనితో త్రిమూర్తులు తీపి వరభక్తుడు కావాలనగా సుమంగళుడు విభూది గుండం ఏర్పాటు చేయగా, బ్రహ్మపాకశాస్త్రం, విష్ణువు నాభికమలం, శివుడు చిత్రకన్ను వేయగా అగ్గిపుట్టి అంగారకుడు జన్మించాడు. ఇతనికి సూర్యుడు అద్దాన్ని, చంద్రుడు కత్తి నూరుకునే చంద్రవంకను గంగనీటికై కలశపాత్ర నిస్తుంది. ఈ రకంగా మంగలి కులం యొక్క వస్తువుల పుట్టుక కనిపిస్తుంది.

కుమ్మరి కులాన్ని ఆశ్రయిస్తూ పటం ఆధారంగా గుండబ్రహ్మయ్య పురాణం చెప్పే పెక్కర్ల కళాకారులు తమ పురాణంలో కుమ్మరి కుల వృత్తి విద్యను పరమ శివుడే ప్రసాదించి, ఆ వృత్తి చేయడానికి కావల్సిన వస్తువులను ఆది కూర్మాన్ని గుచ్చి గడ్డగాను, మందర పర్వతాన్ని ముల్కిగాను, విష్ణుచక్రాన్ని కుమ్మరి సారెగాను, శివుని శూలాన్ని సారె తిప్పడానికి కావల్సిన కోలగాను, బ్రహ్మ తన ఉత్తరీయాన్ని వ్రామపాతగాను, దేవేంద్రుని వజ్రాయుధం వాము ముల్లుగాను, పార్వతీ దేవి హోమగుండాన్ని కుండలు కాల్చే వాముగాను సృష్టించటం కనిపిస్తుంది.

రజకులను ఆశ్రయించి మాసయ్యలు పటం ఆధారంగా చెప్పే మడేలు పురాణంలో మడివేలయ్యను పరీక్షింపదలచిన శివుడు తన దగ్గర ఉన్న బొంతను పిండాలని మడివేలయ్య వస్తువులన్నింటిని మాయం చేస్తాడు. వృత్తి ధర్మాన్ని పాటించడానికి మడివేలయ్య తన భార్య సీతాల దేవిని సంహరించి ఆమె అవయవాలతో బట్టలు ఉతకడానికి ఉపయోగపడే వస్తువులను సృష్టించటం కనిపిస్తుంది. డక్కలివారు మాదిగ కులాన్ని ఆశ్రయించి పటం ఆధారంగా చెప్పే జాంబ పురాణంలో విశ్వబ్రాహ్మణుల వృత్తికి ఉపయోగపడే వస్తువులను జాంబవంతుడు తన పెద్ద కొడుకు అగమునిని సంహరించి సృష్టించటం కనిపిస్తుంది. పద్మశాలి కులాన్ని ఆశ్రయించి పటం ఆధారంగా కూనపులి వారు చెప్పే మార్కండేయ పురాణంలో భావనా ఋషి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు కాలువాసురున్ని సంహరించి అతని పార్థీవ శరీర భాగాలలో మగ్గం నిర్మింప చేయటం కనిపిస్తుంది. 

గౌడ వారిని ఆశ్రయించి పటం ఆధారంగా గౌడజట్టీ మరియు ఏనూటి వారు చెప్పే గౌడ పురాణంలో కంఠమహేశ్వరుడు గజాసురున్ని సంహరించి అతని పార్థీవ శరీర భాగాలతో గౌడ కులానికి చెందిన వస్తువులన్నింటిని దేవతలు సృష్టిస్తారు. చివరకు తాటి చెట్టు ఎక్కడానికి,’మోకు’ కావాలని కోరగా పరమశివుడు తన మెడలోని నాగేంద్రున్ని ఖండించి ‘మోకు’ నిర్మించటం కనిపిస్తుంది. అలాగే విశ్వబ్రాహ్మణులను ఆశ్రయించి రుంజ కళాకారులు చెప్పే విశ్వకర్మ పురాణంలో రౌంజకాసురున్ని సంహరించి అతని పార్థీవ శరీర భాగాలతో రుంజ వాద్యాన్ని సృష్టించినట్లు కనిపిస్తుంది. ఇందులో ఆశ్రిత కళారూపం వస్తువుల సృష్టి కనిపిస్తుంది.

మాల కులాన్ని ఆశ్రయించి గుర్రపు వారు పటం ఆధారంగా చెప్పే బేతాళ పురాణం లేదా మాల చెన్నయ్య కథలో ఆ పరమ శివుడే వ్యవసాయం పనిముట్లు సృష్టించినట్టు కనిపిస్తుంది. వృత్తి పరికరాల పుట్టుకలో కొన్ని దేవతలే తమ ఆయుధాలను, ఆభరణాలను, వస్తువులుగా సృష్టించటం  ఇందులో ప్రధానంగా శివుడే తన శూలాన్ని, శ్రీమహావిష్ణువు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, శివుడు తన మెడలోని పామును, బ్రహ్మ ఉత్తరీయం, దేవతలకు నిలయమైన మందర పర్వతం, హిమగిరి పర్వతం, పార్వతీ దేవి హోమగుండం, శివుని నంది, సూర్యచంద్రులు, గంగమ్మ తల్లి మొదలైనది. ఒక రకమైతే, దేవతల అనుగ్రహంతోనే పార్థీవ శరీర భాగాలతో వృత్తి పరికరాలను సృష్టించటం, ఇదంతా పూర్తిగా మొదట దేవకార్యం నిమిత్తమై, దేవతల అంశంతో సృష్టించడినాయని, ఆయా వస్తువులకు దైవత్వాన్ని ఆపాదించబడినాయని ఆశ్రిత కళారూపాల సాహిత్యం వల్ల తెలుస్తున్నది. ఇట్లా జానపదులకు తాము ఉపయోగించే వస్తువులకు ఇంతటి గొప్పనైన సంస్కృతి పరంపర ఉందని తెలిసేలా వీరి సాహిత్యం దోహదం చేస్తున్నది.

వృత్తి మనుగడకు ఉపయోగపడే పలు అంశాలు జానపద ఆశ్రిత కళారూపాల సాహిత్యంలో నిమిడీకృతమై ఉన్నవి. పద్మశాలీని ఎవరైన బట్టలు తొందరగా చినిగిపోతున్నాయని అడిగితే కాల భైరవుని శాపమంటూ బదులిస్తాడు. ఎందుకంటే దీనికి చెందిన కథాంశం కూనపులి వారు చెప్పే మార్కండేయ పురాణంలో కనిపిస్తుంది. పద్మశాలి మూల పురుషుడు భావనాఋషి వస్త్రాలు  నిర్మించి దేవతలందరికి సమర్పించి చివరకు కాళభైరవునికి సమర్పించబోగా నాకు చివరగా ఇస్తావా! అంటూ నువ్వు నేసిన బట్టలు 3 నెలలు కొత్త, 3 నెలలు పాత అంటూ శపిస్తాడు. ఆ కారణంగా బట్టలు తొందరగా చినుగుతాయని చెప్పి పద్మశాలి ఉపశమనం చెందుతాడు. ఇదే వృత్తిలో ”పద్మశాలి కూసున్నా బొడ్డువరకే, నిలుచున్నా బొడ్డువరకే” అంటూ పార్వతీ దేవి దీవించింది. ఎందుకంటే పద్మశాలి ఎంత కష్టపడినప్పటికి ఆర్థికంగా మాత్రం అంతంత మాత్రమే, ఎవరైనా పద్మశాలిని బాగా సంపాదిస్తున్నావా! అని అడిగితే మాకు పార్వతీదేవి దీవెన ఉందని, మేం ఎప్పుడూ ఒకేలా ఉంటామని చెప్తారు. దీనికి సంబందించిన కథలో పార్వతీ దేవికి చీర తీసుకెళ్ళిన పద్మశాలి వెళ్ళిన సమయంలో ఆమె స్నానం చేస్తూ ఉంటుంది. అతను ఆలస్యమవుతుందని ఇంటి దగ్గర ‘సరి’ ఎండిపోతుందని చీరను అక్కడే ఉంచి ఇంటికి వస్తాడు. ఈ లోగా షావుకారి పార్వతీ దేవి ఇంటికి వెళ్ళి తల్లీ నేను వచ్చానని చెప్పగా, ఆ తల్లి తలుపు తీసి చాటడు వరాలు పద్మశాలి అనుకొని అతని ఒడిలో పోస్తుంది. షావుకారి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పోగానే పద్మశాలి తల్లి దగ్గరికి ఈ లోగ పోయి నేను వచ్చానమ్మా అంటూ పిలువగా ఇప్పుడే కదరా వరాలు పోసింది, అని తలుపు తీయగా పద్మశాలి కనిపిస్తాడు. అప్పుడు ఆమె పద్మశాలిని మీరు కూసున్న, నిలుచున్న బొడ్డువరకే అంటూ దీవిస్తుంది. ఇటువంటి మౌళికమైన అంశాలు వృత్తిలో కలిగే అసంతృప్తిని తొలగించడానికి దోహదం చేస్తుంది. వృత్తిలో కలిగే రకరకాల సందేహాలను తీర్చడానికి కూడా వీరి సాహిత్యం దోహదం చేస్తుంది ఉదాహరణకు బట్టలకు రకరకాల రంగులు ఎట్లా వచ్చాయనే ప్రశ్నకు సమాధానం వీరి సాహిత్యంలోనే కనిపిస్తుంది. అలాగే కుమ్మరి కుండలను ఎందుకు కాల్చాలి అంటే ఎల్లమ్మ శాపమంటూ బదులిస్తారు.

కుమ్మరి ఒక రోజున కుండను చేస్తుండగా ఒక పలుగుడు(గీత) వస్తుంది. ఆ పలుగుడును మాన్పడానికి కుమ్మరి ఊంచుడు(ఉమ్మి) పెట్టి సరి చేస్తాడు. ఇట్లా చేయడం తప్పని ఎంగిలి పోవడానికి కాల్చమంటుంది ఎల్లమ్మ. అంతేగాక ”నీ సంసారం ఎంత చేసినను, కుండ కిందనే ఉండు” అని శపిస్తుంది. ఎందుకంటే పరశురాముని బారి నుండి ఎల్లమ్మకు రక్షణ ఇవ్వనందుకు కుమ్మరిని శాపమిస్తుంది. అందుకే కుమ్మరి ఎంత కష్టపడ్డ ఆర్థికంగా స్థిరపడడు. ఎవరైనా అడిగితే ఎల్లమ్మ శాపమంటూ తృప్తి చెందుతారు. పైగా కుమ్మరివారు మైసూరు రాజులమంటూ, సచ్చిన్నాడు మాదే, పుట్టిన్నాడు మాదే, దాయాదికి మాదే, గుడికి మాదే, ఏ దేవునికైనా గింత కంచుడు బోతది మాది అంటూ తృప్తి చెందేలా కులపురాణాల సాహిత్యం ఉపకరిస్తున్నది. అట్లాగే గౌడ వృత్తికి సంబంధించి ఈ రోజు కల్లు రేపటికి పనికి రాకపోవడానికి గల కారణాన్ని, వృత్తిలో భాగంగా తాటి చెట్టుకు మెర వేస్తున్నపుడు మాట్లాడకూడదని, రేఖలు కట్టకూడదని, తాటి ముంజలు కొట్టకూడదని ఇట్లా వృత్తి మనుగడలో అవలంభించాల్సిన విషయాలన్నింటిని వారి ఆశ్రిత కళారూపం సాహిత్యంలో చూడవచ్చు. ఈ రకంగా ప్రతి కులం యొక్క మనుగడకు సంబంధించిన పలు అంశాలు ఆశ్రిత కళారూపాల సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ కళారూపాలు ప్రదర్శించే కథా వస్తువు కూడా చాలా ప్రాచీనమైన సంపదగానే చెప్పవచ్చు ఉదాహరణకు కూనపులి వారు ప్రదర్శించే ‘మార్కండేయ పురాణం’ కథాంశం 15వ శతాబ్దానికి చెందిన ‘ఎల్లకరనృసింహ కవి రచించిన అముద్రిత గ్రంథమైన మార్కండేయ పురాణానికి దగ్గరి పాటి సంబంధం కనిపిస్తుంది. ఈ యొక్క కళారూపమేగాకుండా మిగతా ఆశ్రిత కళారూపాలు ప్రదర్శించే కథావస్తువు చాలా పురాతనమైనవనే చెప్పవచ్చు. రజకులకు ఆశ్రితులైన మాసయ్యలు ప్రదర్శించే మడేలు పురాణాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఆశ్రిత కళారూపాల్లో ఎక్కువగా శైవమే కనిపిస్తుంది. వీరశైవం ఉచ్ఛాన స్థితిలో ఉన్నపుడు ఈ కళారూపాలు తమ ఉనికిని నిలుపుకొని మనుగడ సాగించాయనిపిస్తుంది. వీరి సాహిత్యంలో శివుడే ఆధ్యుడని, అన్నింటికి అతనే పరిష్కారవంతుడనే దోరణి కనిపిస్తుంది. ఆయా కథాగానాల కళారూపాలు ప్రదర్శనలో సామెతలు, పొడుపు కథలు సందర్భోచితంగా ప్రయోగిస్తూ తాము చెప్పే కథాంశాన్ని ప్రేక్షకునికి నిరాసక్తి లేకుండా, హాస్యాన్ని జోడించి అందిస్తారు. కళాకారులు తమ ప్రదర్శనతో విభిన్న సంస్కృతులను భిన్న సమూహాలను ఏకం చేయడానికి వీరి సాహిత్యమే దోహదం చేస్తున్నది. అంతేగాక తెలంగాణా ‘యాస’ కు చెందిన అనేక పదాల భాండాగారం ఆశ్రిత జానపద కళారూపాల సాహిత్యమే.

నాటకాలు లేదా యక్షగాన రూపంలో ప్రదర్శించే ఆశ్రిత కళారూపాలు భాగవతం, రామాయణ, భారత కథలను ఆయా పోషక కులాల దగ్గర ప్రదర్శిస్తూ అందులోని నీతిని నియమాల్ని, రాజనీతిని, భక్తిని, విశ్వాసాలను తమ తమ నైపుణ్యంతో ప్రేక్షకులకు అందిస్తూ, ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రసరింపజేస్తూ మనుగడ సాగిస్తున్నాయి. వీరి సాహిత్యంతో సమాజంలో మానవీయ విలువల్ని పెంచే దిశగా తరతరాలుగా కృషి చేస్తున్నారు.

ఆశ్రిత కళారూపాల్లో కొన్ని  తమ ప్రదర్శనలో ప్రేక్షకులకు అర్థంకాకుండా ఉండేందుకు, ప్రదర్శనలో ఏదైనా తప్పు దొర్లినా, సమయానికి తోటి కళాకారున్ని అప్రమత్తం చేయడానికి కళాకారులు మరుగు భాష మాట్లాడుకుంటారు. అంతేగాక కుల పెద్దల దగ్గర ‘సంభావణ’ (ప్రతిఫలం) మాట్లాడుకునేప్పుడు, ఎగతాళి చేయడానికి, తిట్టడానికి ఉపయోగిస్తారు. వీరు ఉపయోగించే భాషాపదాల్లో చిత్ర విచిత్రమైన పదాలతో పాటు, కొన్ని సంస్కృతి పదాలే ఉన్నప్పటికి వీరు ఉచ్ఛరించేపుడు ఆ పదాల మూలాన్ని కాకుండా ఒక కొత్త రూపంలో పలుకుతారు. ఇది ఎవరికి అర్థం కాకుండానే ఉంటుంది.

ఇంద్రజాల విద్యలు ప్రదర్శించే కళారూపాలు మాత్రం నాటకీయ రూపంలో ప్రదర్శనలిస్తూ, దానికి హాస్యాన్ని జోడించి మంత్ర తంత్రాలున్నాయని ప్రేక్షకులను భ్రమింప చేసి తమ ఉనికిని నిలుపుకుంటున్నాయి. ఇంద్రజాల కళారూపాల్లో ఒకటైన సాధనా శూరులు ప్రదర్శనలో అక్కడ కూడ మరుగు భాష మాట్లాడుతారు కూడా.

తెలంగాణా సంస్కృతికే మకుటంగా నిలిచే జానపద ఆశ్రిత కళారూపాల సాహిత్యం ఎంతో ప్రాచీనమైనదిగా తెలుస్తున్నది. అంతేగాక విభిన్నమైన ప్రక్రియలతో, భిన్నమైన కథావస్తువుతో పోషక కులాలను ఆశ్రయిస్తూ మనుగడ సాగిస్తున్న కళారూపాలు తెలంగాణాలోనే ఎక్కువగా ఉండటం తెలంగాణా సంస్కృతీ ప్రాచీనత  గొప్పతనమే. వీటి సాహిత్యంలో ఒక సమాజం లేదా ఒక కులం మనుగడకు కావల్సిన, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మనూన్యతా భావాన్ని తొలగించేందుకు కావల్సిన పలు అంశాలు ఉన్నవి. అంతేగాక కులాల ఐక్యతకు దోహదం చేసేదిగా ఉంది. అలాగే వృత్తులకు కులాలకు గౌరవాన్ని కలిగించే విధంగా వీరి సాహిత్యం నిర్మింపబడింది. ఇటువంటి సాహిత్య విలువలు కలిగిన వీరి సాహిత్యాన్ని కాపాడుకోవల్సిన బాద్యత ఎంతైన  ఉన్నది. భవిష్యత్తు తరాలకు వీరి గొప్పదనాన్ని, వీరి సాహిత్యాన్ని భద్రపరచాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కొన్ని ఆశ్రిత కళారూపాలు కనుమరుగయ్యాయి. కొన్ని కనుమరుగయ్యే స్థితిలో ఉన్నవి. కావునా పరిశోధనాత్మకంగా కళారూపాలను శోధించి, పరిరక్షించి, తెలంగాణ సంస్కృతీ శోభను నిల‌పాల్సి ఉంది.

ఆధార గ్రంథాలు :

1. తెలుగు జానపద గేయ సాహిత్యం – డా. బిరుదురాజు రామరాజు.
2. తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు –  డా.రావిప్రేమలత
3. తెలుగులో కులపురాణాలు -ఆశ్రిత వ్యవస్థ –  డా. పులికొండ సుబ్బాచారి
4. మల్లికార్జున పండితారాధ్య చరిత్ర – పాల్కురికి సోమనాథుడు
5. మార్కండేయ పురాణం (ద్విపద కావ్యం) – ఎల్లకర నృసింహకవి- అముద్రితం
6. మార్కండేయ పురాణం- పర్వతమంత్రి లింగనామాత్యుడు – అముద్రితం
7. రాష్ట్రస్థాయి జానపద కళోత్సవాలు -నల్లగొండ- గౌరవ సంపాదకులు – ఆచార్య యన్‌.గోపి.
8. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం- ఒక పరిశీలన –  డా. బాసని సురేష్‌
9. పటం కథలు – కథకులు –  డా. గడ్డం వెంకన్న


కళాకారుల ఇంటర్వ్యూలు:
1. ఆకుల యాకాంబరం – ఏనూటి కళాకారుడు
2. పురాణం ఎర్రగట్టు – కూనపులి కళాకారుడు
3. చింతకింది మార్కండేయుడు – సాధనాశూరుల కళాకారుడు
4. బోనగిరి సంగయ్య – మాసయ్య కళాకారుడు
5. ఏసుపాదం గుర్రపు – గుర్రపు కళాకారుడు.

పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

Leave a Reply