తెర్ల‌యిన అడ్డా కూలీ బ‌తుకులు

వాళ్లు నేల‌ను న‌మ్ముకున్నోళ్లు. భూమితో మాట్లాడినోళ్లు. భూమిని ప్రేమించినోళ్లు. మ‌ట్టిలో పుట్టి నిత్యం మ‌ట్టిలో పొర్లాడినోళ్లు. త‌మ చెమ‌టా, నెత్తురుతో భూమిని పొతంజేసినోళ్లు. ప‌చ్చ‌ని పైరుల‌కు ఊపిరైన మ‌ట్టి బిడ్డ‌లు. త‌మ రెక్క‌ల క‌ష్టంతో దేశాన్ని త‌ల‌కెత్తుకున్న మ‌నుషులు. స‌మ‌స్త ప్ర‌పంచానికీ పాలిచ్చి పెంచే త‌ల్లిలాంటోళ్లు. త‌మ బ‌తుకులల్ల చీక‌ట్లు నిండినా దేశం కండ్ల‌ల్ల వెలుగులు నింపే రైత‌న్న‌లు. కూలీలు. కార్మికులు. ఇప్పుడు వాళ్ల ప్ర‌పంచం శిథిలమ‌యింది. కుప్ప కూలింది. వాళ్ల క‌నుపాప‌ల్లో నిండిన స్వ‌ప్నాల‌న్నీ క‌రిగి క‌న్నీళ్ల‌యిన‌యి. క‌మ్మిన క‌రువు వాళ్ల బ‌తుకులల్ల‌ చీక‌ట్లు నింపింది. రైతు కూలీల బ‌తుకంతా అమాస చీక‌టైంది. దిగులు. దుఃఖం. జాలిచూప‌ని మ‌బ్బుల్ని జూసి వాళ్ల గుండెల్నిండా ఒడువ‌ని దుఃఖం. చెరువుల‌ల్ల నీళ్లు లేవు. బావులెండిన‌య్‌. బోర్ల‌ల్ల సుక్క నీళ్లు లేవు. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల కొద్దీ న‌డ‌వ‌క త‌ప్ప‌ని దుస్థితి. దూప‌. దూప‌. గొంతెండుతున్న ప‌ల్లెలు.

భూముల‌న్నీ బీళ్ల‌యిన‌య్‌. వాన చినుకుల్లేక నేల‌ల‌న్నీనెర్రెలిచ్చిన‌య్‌. క‌రువు. అంత‌టా క‌మ్ముకున్న క‌రువు. తాగే నీళ్లు లేవు. ప‌శువుల‌కు మేత లేదు. పావురంగ పెంచుకున్న ప‌శువుల‌న్నీ అంగ‌డి పాల‌యిన‌యి. క‌న్న బిడ్డ‌ల్లెక్క జూసుకున్న ప‌శువులు క‌బేళాల‌కు త‌ర‌లుతుంటే రైత‌న్న‌ల కండ్లు దుఃఖ న‌దులైన‌యి. పుట్ల‌కొద్ది ధాన్య‌రాసుల్తోటి నిండే రైతు కూలీల వాకిళ్ల‌న్నీ పొక్కిలైన‌యి. వాళ్ల కండ్ల‌ల్ల ఆశ‌ల్లేవు. క‌నిక‌రించ‌ని ప్ర‌కృతి ప‌గ‌బ‌ట్టినాట్టాయె. న‌మ్ముకున్న నేల గుండెల‌పై త‌న్నిన బాధ‌. బోర్ల కోసం తెచ్చిన అప్పులు మోయ‌లేని భార‌మైన‌యి. చ‌క్ర‌వ‌డ్డీల మోసాల‌న్నీ రైత‌న్న‌ల వెన్నెముక‌లిరిచిన‌య్‌. అప్పులోల్ల తిట్ల‌ల్ల కుమిలిపోతున్న‌రు. అతీగ‌తీ లేక ఆగ‌మ‌యితున్న‌రు. గోస‌వ‌డ్తున్న‌రు. బిడ్డ‌ల‌కు స‌దువుల్లేవు. ఆడ‌బిడ్డ‌ల‌కు పెండ్లిజేసుడు క‌నాక‌ష్ట‌మాయె.

పాల‌కుల అభివృద్ధి న‌మూనాల‌ల్ల వ‌ల్ల‌కాడ‌యిన ప‌ల్లెలు. విధ్వంసం. అంత‌టా విధ్వంసం. అభివృద్ధి మాటున ప‌డ‌గ విప్పిన పాల‌క విధ్వంసం. భూములు కోల్పోయిన రైతులు. కూలీలు. నిలువ నీడ‌లేకుంట‌యిన్రు. కాళ్ల కింది జాగ క‌రిగిపోయింది. బ‌తుకు రోడ్డున ప‌డ్డ‌ది. పంట భూముల్లేవు. ఇంటి జాగ‌ల్లేవు. ఎక్క‌డో దూరాన న‌గరాల‌కు వ‌ల‌స‌బోతున్న‌రు. న‌గ‌ర శివారు ప్రాంతాల‌ల్ల కాలుష్య కోర‌ల్ల గుడిసెలేసుకుని బ‌తుకులీడుస్తున్న‌రు.

వాళ్లు న‌గ‌రం తారు ఎడారుల‌ల్ల ఎడ‌తెగ‌క పారే దుఃఖ న‌దులు. ఎన్ని క‌ష్టాలొచ్చినా ఎవ‌రికీ చేయిజాప‌ని ఆత్మ‌గౌరవం. అప్పులు తీర‌క ఆగ‌మైన అన్న‌దాత‌ల బతుకులు. అప్పుల బాధ‌తో మ‌నాది. ఒకానొక న‌డిరేయిన పొలం గ‌ట్టుపై వేప‌చెట్టు కొమ్మ‌కు వేలాడిన రైతు శ‌వం. అనాథ‌లైన పిల్ల‌లు. చావుకు ద‌గ్గ‌ర‌యిన ముస‌లి త‌ల్లిదండ్రులు. ప‌ల్లెల‌న్నీ ఇప్పుడొక దుఃఖిత దృశ్యం.

ఉన్న ఊరినీ, క‌న్న‌వాళ్ల‌నూ వ‌దిలి న‌గ‌రానికి వ‌ల‌స ఒచ్చిన ప‌ల్లె జ‌నం. ఇక్క‌డ చేతినిండా ప‌నుల్లేవు. నిలువ నీడ‌లేదు. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాన గుడిసెలేసుకుంటున్న‌రు. జీహెచ్ఎంసీ ప‌డావు భూముల్ల కొంద‌రు. ఫుట్‌పాత్‌ల‌పై మ‌రికొంద‌రు. ఫ్లైఓవ‌ర్ దాపున నీడ‌ల్ల ఇంకొంద‌రు త‌ల‌దాచుకుంటున్న‌రు. పొద్దున లేస్తే కూలీ అడ్డాలే దిక్కు వీళ్ల‌కు. హైద‌రాబాద్ న‌గ‌రంలో వేలాది మంది కార్మికులదీ ఇదే బ‌తుకు. వీళ్లంతా అడ్డాల ద‌గ్గ‌ర ప‌నికోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్న‌రు. ప‌టాన్‌చెరు నుంచీ హ‌య‌త్‌న‌గ‌ర్ దాకా వంద‌లాది కూలీ అడ్డాలు. వేలాది మంది కూలీలు. వాళ్ల కండ్ల నిండా ఒక‌టే ఆశ‌. ఇయ్యాల‌ ప‌ని దొరికితే చాలు. పిల్ల‌ల క‌డుపు నిండా తిండి దొరుకుద్ద‌నే ఆశ. ఏడెనిమిదేండ్ల పిల్ల‌లు కూడా కార్ఖానాల‌ల్ల వ‌సివాడ‌బ‌ట్టె. వాళ్ల బ‌తుకిపుడు దేశంబోతాంది.

ఇంకా తెల‌వార‌క ముందే అడ్డాల ద‌గ్గరికి చేరుకుంట‌రు. చేతిల పార‌, గ‌డ్డ‌పార‌, తాపీ, సుత్తెలు ప‌ట్టుకొని అడ్డామీద పొడిసే పొద్ద‌యిత‌రు. పొద్దుతో పోటీప‌డి ప‌నిచేస్తూ కుంగిన సూర్య‌బింబ‌మై గుడిసెల‌కు చేరుత‌రు. వీళ్ల పేద‌రికాన్ని ఆస‌రా చేసుకొని కొంద‌రు త‌క్కువ కూలీకే ప‌నికి తీస్క‌పోత‌రు. ప‌ని చేయించుకొని కూలీ ఎగ్గొట్టిన సంద‌ర్భాలు కూడా లెక్క‌నేన‌న్ని. కాంట్రాక్ట‌ర్‌ల దోపిడీ ఒక వైపు. ముఠా మేస్త్రీల దోపిడీ ఇంకో వైపు. వీళ్ల నెత్తురు పిండుకు తాగుతున్న‌రు. ప‌ని దొరికిన్నాడు పండుగే. లేకుంటే ప‌స్తులే.

వాళ్ల‌యి రెక్కాడితే గాని డొక్కాడ‌ని బ‌తుకులు. పొద్దుగాల లేసింది మొద‌లు పొద్దు గుంకిందాకా చేయ‌ని ప‌ని ఉండ‌దు. ప‌డ‌ని క‌ష్టం ఉండ‌దు. ఇయ్యాల గ‌డిస్తే రేపెట్ల అనే తిప్ప‌లు. కూలి కోసం ఒక‌టే గోస‌. ఒక‌రోజు ప‌ని దొరికితే వారం దాకా ప‌ని దొర‌క‌ని రోజులెన్నో. అర్ధాక‌లితో అల‌మ‌టించిన రోజులెన్నో. పిల్ల‌ల్ని చ‌దివించే స్తోమ‌త లేక ప‌నికి తీస్క‌క‌పోతున్న‌రు. ముక్కు ప‌చ్చ‌లార‌ని పిల్ల‌లు కూడా ఇటుక‌లు మోస్తున్న‌రు. కాల్వ‌లు త‌వ్వుతున్న‌రు.

ప‌టాన్‌చెరు, బీరంగూడ‌, నిజాంపేట‌, జ‌గ‌ద్గిరి గుట్ట‌, బీహెచ్ఈఎల్‌, బోర‌బండ‌, హైటెక్ సిటీ, పంజాగుట్ట‌, అడ్డ‌గుట్ట‌, మ‌ల్కాజిగిరి, మ‌ల్లాపూర్‌, నాచారం, ఈసీఐఎల్‌, ఉప్ప‌ల్‌, రామంతాపూర్‌, కాచిగూడ నింబోలి అడ్డ, నాచారం, వారాసిగూడ‌, ముషీరాబాద్‌, ఎల్బీన‌గ‌ర్‌, హ‌య‌త్‌న‌గ‌ర్‌… ఇట్లా వేలాది మంది కూలీల‌తో నిండివుంట‌యి.
ఈ కూలీలంతా ఒక‌ప్పుడు ప‌ల్లెలల్ల పుట్ల‌కొద్ది ధాన్యం పండించినోళ్లే. ఇప్పుడు వ‌ల‌స కూలీల‌యిండ్రు. ఈ కూలీల్లో మ‌హిళ‌లే ఎక్కువ‌. ఒక్కొక్క‌రి బ‌తుకూ ఒక్కో మండే కొలిమి. వీళ్లంద‌రినీ క‌దిలిస్తే క‌న్నీళ్లే. మ‌ద్దెల అండాలుది యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఎల్వెర్తి. 30 ఏండ్లుగా ఆమెకు కూలి ప‌నులే ఆధారం. ఒంట‌రి మ‌హిళ‌కు ఎన్ని అవ‌మానాలో. మ‌రెన్ని అగ‌చాట్లో. ప‌ని దొర‌క్క ఈ కూలి త‌ల్లి ఎన్ని అవ‌స్థ‌లు ప‌డుతున్న‌దో? ”ఇరువ‌యేండ్ల కింద ప‌ట్న‌మొచ్చిన‌. ప‌దేండ్ల‌ప్ప‌టి సందే ప‌నిజేస్త‌న్న‌. వారానికి రెండు మూడు రోజులే ప‌ని దొరుకుత‌ది. ఒక రోజు ప‌నిజేస్తె రెండు రోజులు ఇంటికాన్నే. ఇల్లు కిరాయి మూడు వెయ్యిలు. చేసిన ప‌ని ఖ‌ర్సుల‌కే స‌రిపోత‌ది. పానం బాగ‌లేక‌పోతె అప్పుజేసి ద‌వ‌ఖాన్ల సూయించ‌కుంటున్నం. కూలి నాలి జేసి బిడ్డ‌ను స‌దివిస్తాన్న‌. 15 స‌దువుతాంది. ఓట‌ర్ కార్డు, ఆధార్ కార్డు ఊళ్లెనే ఉన్న‌యి. శానా ఏండ్ల సంది ఊళ్లె ఉంట‌లేన‌ని పించ‌న్ సుత ఇస్త‌లేరు”.

నాగ‌మ్మ‌(60)ది తీర‌ని దుఃఖం. ఆమెది న‌ల్ల‌గొండ జిల్లా వ‌ర్ద‌మానుకోట‌. 28ఏండ్ల నుంచీ అడ్డా కూలీ బ‌తుకే. ఊర్లె గుంటెడు జాగ లేదు. పట్న‌మొచ్చి గోస‌వ‌డ్తున్న‌ది. ”మాది వ‌ర్ధ‌మానుకోట‌. ఇన్నేండ్లు కూలి ప‌నితోటే పిల్ల‌ల్ని స‌దివిచ్చిన‌. మేమిద్ద‌రం ప‌నిచేస్తెనే ఇల్లు గ‌డిచేది. ఆర్నెళ్ల కింద మా ఆయ‌నకు ప‌క్ష‌వాత‌మొచ్చింది. మంచాన వ‌డ్డ‌డు.. ఒక్క‌దాన్ని ప‌నిచేస్తె ఇల్లు గ‌డుస్త‌లేదు. ఆయ్నెకు మందులు కొన‌నీకి పైస‌ల్లేవు. చేసిన క‌ష్ట‌మంత‌ ఇంటి కిరాయికే స‌రిపోతాంది. రోగ‌మొచ్చినా నొప్పొచ్చినా ఇక్క‌డ అర్సుకునేటోల్లేరు. అర్వ‌యేండ్లొచ్చిన‌యి. ప‌నికి శాత‌గాట్లేదు. పించిన్ గూడ ఇస్త‌లేరు. మా బ‌త్కులెట్ల తెల్లార్త‌యో ఏమో”.. అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. ఆమె ముఖంలో ఎంత వేద‌నో. గుండెల్లో ఎంత బాధో. తాను ప‌నికి పోతే భ‌ర్త‌ను చూసుకునేటోళ్లు లేరు. ఆమె లోలోప‌ల కెరలుతున్న దుఃఖం. ఇట్లా ఎంద‌రో.

ఒక‌నాడు రాజ‌నాల్ పండించిన రైతులే నేడు సుతారి ప‌నికి బోతున్న‌రు. ధాన్యం మోసిన త‌ల‌పై మ‌ట్టి త‌ట్ట‌లు మోస్తున్న‌రు. రెక్క‌లు ముక్క‌లు జేసుకుంటున్న‌రు. దున్న గోపాల్‌ది మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నాగ‌దేవుప‌ల్లి. 13 ఏండ్ల కింద న‌గ‌రానికి వ‌ల‌సొచ్చిండు. సుతారి ప‌నిచేస్తున్న‌డు. లోకానిక అన్నం పెట్టే రైతు న‌గ‌రార‌ణ్యాన గోస‌వ‌డ్తున్న‌డు. ”నాలుగెక‌రాల భూమి ఉన్న‌ది. నీళ్లు లేక పంట‌లు పండుత‌లేవు. అప్పుజేసి పొలంల 23 సార్లు బోర్లేపిచ్చిన‌. ఒక్క సుక్క నీళ్లు ప‌డ‌లేదు. అప్పులు పెరిగిన‌యి. పొలం ప‌డావు ప‌డ్డ‌ది. నేను దేశ‌మొచ్చిన‌. కూలినాలి జేసుకుంటాన‌”. అత‌నితో మాట్లాడుతుంటే ఆ రైత‌న్న కండ్ల నిండా క‌న్నీళ్లు. గ‌తం గుర్తుకు వ‌చ్చి త‌ల్ల‌డిల్లిండు. నేల రాలిన రెండు క‌న్నీటి సుక్క‌లు. కూల‌న్న‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపేనా? ఒక్క గోపాలేనా? ఎంద‌రో కూలీ గోపాల్‌ల‌ది ఇదే ప‌రిస్థితి.

ఉత్త‌రాంధ్ర‌, తెలంగాణ‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులు వ‌ల‌స వ‌చ్చిండ్రు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో సెజ్ కోర‌ల్లో క‌రిగిన భూముల రైతులూ ఇక్క‌డ కూలీలే. సెజ్‌ల కోసం వాళ్ల భూముల్ని బ‌ల‌వంతంగా గుంజుకున్న‌ది ఆనాటి పాల‌క‌వ‌ర్గం. వాళ్లను సొంత భూముల్లోంచి త‌రిమిండ్రు. ప‌రిహారం అంద‌లేదు. ప‌రిహార‌మ‌డిగినోళ్ల‌పై ప‌గ‌బ‌ట్టింది రాజ్యం. ఎంతోకొంత అందిన ప‌రిహారం మ‌ధ్య‌వ‌ర్తులే రాబందుల్లా త‌న్నుకుపోయిండ్రు. ఆ రైతులిప్పుడు రోజువారీ కూలీ అయి అడ్డా కాడ ఎండల్ల నిల‌బ‌డ్డ‌రు. అభివృద్ధి విధ్వంసం మాటున వేలాది మంది కూలీలుగా మారిండ్రు. భూములు కోల్పోయి నిరాశ్ర‌యులైండ్రు. వ‌ల‌స కూలీల‌యిండ్రు. త‌మ భూముల నుంచి త‌రిమివేయ‌బ‌డ్డ రైతులు, కూలీలంతా తిర‌గ‌బ‌డే రోజొక‌టి త‌ప్ప‌క వ‌స్త‌ది. కొలిమంటుకోక త‌ప్ప‌దు.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

2 thoughts on “తెర్ల‌యిన అడ్డా కూలీ బ‌తుకులు

  1. చాలా అద్భుతంగా ఉంది వాస్తవ రూపానికి నిలువుటద్దంలా కళ్ళకు కట్టినట్టు ఆ గోస కనపడుతుంది.

Leave a Reply