బీడుబడిన పొలాలను చూసి రైతుల కన్నీళ్లతో తడిసిపోయిన నేలమీద సదాశివుడి పాట బోరున వర్షంలా కురిసింది. పల్లెలన్నీ పనులు లేక పస్తులుంటుంటే తన పాటల సద్దిమూటను విప్పిన కవి, సింగరేణి బొగ్గు గుండెల్లోని శ్రామికుల స్వేదాన్ని పాటలోకి ఒంపుకున్న ఆర్ద్రకవి, కార్మికలోకం మధ్య సంచరిస్తూ పాటలు అల్లుకున్న ప్రజాకవి సదాశివుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని గోదావరి తీర గ్రామం మూర్ మూర్ లో 1945లో సెప్టెంబర్ 2న మల్లావఝల సదాశివుడు జన్మించాడు. వెంకట కిష్టయ్య, లక్ష్మీనర్సమ్మల పెద్ద కొడుకే ఈ సదాశివుడు. సంప్రదాయంగా వచ్చిన పౌరోహిత్యంతో పాటు బాల్యం నుండే భజనలు చేయడం, కీర్తనలు పాడటంతో సదాశివుడి పాటల సృజనకు పాదులు ఏర్పడ్డాయి. పాఠశాల విద్యలోకి ప్రవేశించిన తర్వాత పద్యం, పాట ప్రక్రియల మీద ఆసక్తి పెరిగింది. దానికితోడు తెలుగు సాహిత్యంపై ఏర్పడిన అభిరుచి రేపటి ఉద్యమ కవికి పునాదిని ఏర్పరిచింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నా మనసు మాత్రం పీడిత జనావళి కోసం తపించిపోయేది. తన భద్ర జీవితంతో సంతృప్తి పడకుండా చుట్టూ వున్న ప్రజానీకం సంక్షేమం కోసం చింతన చేసేవాడు. వామపక్ష భావజాల స్పూర్తితో ఒక రహస్యోద్యమకారుడిగా మారాడు. సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా తన అక్షరాన్ని, గళాన్ని ఆయుధంగా మలచుకున్నాడు.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఆవిర్భావ నేపథ్యంలో సదాశివుడి పాటలో కొత్త నెత్తురు ఉబికింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బిగ్గరగా గొంతు విప్పాడు. ‘తలాపున పారుతోంది గోదారి’ పాటతో జల దోపిడిదారుల గుండెల్లో సుడిగుండాన్ని సృష్టించాడు. అటువంటి సంచలనాత్మక గీతాన్ని మరోసారి పాడుకుందాం.
“తలాపున పారుతుంది గోదారి
నీ చేను నీ చెలకా ఎడారి,
రైతన్నా, నీ బతుకు అమాసా
ఎన్టిపీసి చూస్తోంది తమాషా”
తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు ఒక కీలకమైన అంశం. మనచుట్టూ నదులు, ప్రాజెక్టులున్నా చుక్క నీరందని దుస్థితి. సాగునీరు కాదు కదా తాగునీరు సైతం కరువైన విషాదకర సందర్భం. తెలంగాణ ప్రాంతం పట్ల ఇంతగా వివక్ష చూపుతూ కరువులోకి నెట్టివేసిన దుర్మార్గ పాలకులపై సదాశివుడు మోగించిన ఢమరుక ధ్వని ఈ పాటలో ధ్వనిస్తుంది. నెత్తిమీది నుంచి గోదావరి నది పారుతున్నా మన చేను ఎండిపోతున్న భయంకరమైన దృశ్యాన్ని చూపుతూ లోతైన ఆలోచనలను ప్రేరేపిస్తుంది. పాటలో ఆరంభ పాదాల్లోని ఎత్తుగడ ఉద్యమకారుడి గెరిల్లా దాడిలా విభ్రాంతికి గురిచేస్తుంది. ‘గోదారి – ఎడారి’ పదాల మధ్యనున్న అంతరార్థం పఠితల్ని ఆవేశానికి గురిచేస్తుంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నా అవసరానికి ఉపయోగపడని కరెంట్ కొరత రైతు బతుకుల్లో మరింత చీకట్లను నింపింది. రైతు బతుకుల్లో అలముకున్న అమావాస్య తెలంగాణమంతటా వ్యాపించిందనేది కవి విస్తృత భావంగా చెప్పుకోవచ్చు.
“నీ చుట్టు సిరులు వున్నా – నీకేది దక్కదన్న
నీ చేతిలోని బువ్వే – నీ నోటి కందదన్న
చేతికి మూతికి నడుమ గీత గీసిరన్న
మోసపోతివన్న – అరిగోస పడితివన్న”
తెలంగాణ సహజ వనరుల ఖజానా. మిగులు నిధులున్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ కొల్లగొట్టబడింది. పరిస్థితి దయనీయంగా మారింది. చుట్టూ నీళ్ళున్నా చుక్కనీరు దక్కడం లేదు. చేతిలో అన్నం ముద్ద వున్నా నోటికి అందడం లేదు. ఒక్క మనిషే కాదు ప్రాంతమే పరాయీకరణకు గురైన ఘోరాన్ని సదాశివుడు ప్రభావితంగా వర్ణించాడు. చేతికి మూతికి మధ్య గీసిన ఆధిపత్యపు సరిహద్దు రేఖలను గుర్తించాడు. సామాజిక, ఆర్థిక, పరాయీకరణతో మనిషి ఎంత తీవ్రంగా ఆవేదన చెందుతాడో ‘అరిగోస’ పదంలో వ్యక్తమవుతుంది. పెద్దమనుషుల చేతుల్లో తెలంగాణ ఎంతగా మోసపోయిందో ఈ పాదాలు వెల్లడిస్తాయి.
“కొండమీద భ్రమరాంబ చిన్న చూపె చూసింది
శ్రీశైలం కుడి కాలువ వెన్నుపోటు పొడిసింది
ఉన్ననీళ్ళ నాంధ్రకు ఊడ్చుకోని పోయింది
ఎడమ కాలువ ఎలుక తోక ధార నీకు మిగిలింది
కృష్ణానది చిరునామా – కోస్తా కొబ్బరి బొండం
నమ్మి నారు బోసుకుంటే, నీ ఎవుసం దినగండం”
ఈ పాటంతా నీళ్ళ విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతుంది. ఇది తెలంగాణ ఉద్యమం రూపొందించిన ‘కవితాత్మక వాటర్ వార్ మేనిఫెస్టో’ శ్రీశైలం కొండమీది అమ్మవారిపై కూడా కవి కనికరం చూపలేదు. నీటి పంపకాల్లో చోటు చేసుకున్న మోసాల్ని ఎండగట్టాడు కవి. శ్రీశైలం కుడికాలువకు ఎక్కువశాతం నీళ్ళు విడుదల చేస్తూ, తెలంగాణకు వెళ్ళే ఎడమ కాలువకు చేస్తున్న కుట్రను ‘ఎడమ కాలువ ఎలుకతోక ధార’ అనే పోలికతో శక్తివంతంగా బట్టబయలు చేస్తాడు. కృష్ణానది ప్రవాహంతో కోస్తా ప్రాంతం కోనసీమగా మారింది. తెలంగాణ ప్రాంతంలో నారుసైతం ఎండిపోయి ఎడారిగా మారిపోయింది. ఈ విషయాన్ని మరింత పదునుగా ఎత్తిచూపుతూ ‘కోస్తా కొబ్బరి బొండం – నీ ఎవుసం దినగండం’ అనే పద ప్రయోగాలతో ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల మధ్య వున్న వ్యత్యాసాన్ని అద్భుతంగా చూపుతాడు.
“శ్రీరామ సాగరమూ – నీ ఆశలు తీర్చలేదు
తెలంగాణ నేల తల్లి – గొంతునైన తడుపలేదు
సాలానా పారుకము – చారానాకు పడిపోయె
కొంత నీరు ఎన్టిపీసి కరెంటుకు సరిపాయె
నీ నీరు నీదిగాక – నీ వెలుగు నీదిగాక
వైజాగున వేలుగునీక – తరలిపోయెరన్నా”
తెలంగాణ నేలమీద నిర్మితమైన ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు సంపూర్ణంగా వినియోగంలోకి రాకుండాపోయాయి. ఇక్కడి బొగ్గు ఆంధ్ర ప్రాంతంలో వెలుగులను అందించడానికే ఉపయోగపడుతుంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో ఇసుక మేటలను తొలగించకపోవడం వలన దాని సామర్థ్యం తగ్గిపోయింది. గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా ఆ నీరు ఇక్కడ నిలవకుండా ఆంధ్ర ప్రాంతానికి చేరేది. ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యంతో శ్రీరాంసాగర్ పనికిరాని ప్రాజెక్టుగా మిగిలిపోయింది. మేధావుల ఉపన్యాసాలు, ఉద్యమకారుల వ్యాసాలకు ధీటుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టినట్లుగా గ్రామీణ ప్రజలకు తన పాట ద్వారా చైతన్యవంతుల్ని చేశాడు కవి. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో ఈ పాట ఉప్పెనలా ఎగసిపడింది.
“ఇచ్చంపల్లి ప్రాజెక్టును వాయిదాలు వేస్తాన్రు
తవ్వుకున్న బావులకు పవరు కోట పెడతాన్రు
వంగిన నీ నడుం మీద సవారీలు చేస్తాన్రు
పన్నుపోటు పొడిచి నిన్ను బిచ్చగాణ్ణి చేస్తాన్రు
పొలాలలో దుర్గన్నల శవాలేమో తేలుతాంటే
జన్మభూమి జాతరల జేగంటలు కొడతాన్రు”
ఈ పాటలో ఆనాటి పాలకవర్గాలు అనుసరించిన మోసపూరిత విధానాలను ఎండగడుతాడు కవి. ఎంతో గొప్పగా నిర్మిస్తామనుకున్న ప్రాజెక్టు వాయిదాల మీద వాయిదాలు పడటం కూడా తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. అది దేవాదుల ఎత్తిపోతల పథకంగా మారినా పరిస్థితిలో మార్పు రాలేదు. తవ్వుకున్న బావుల నుంచి నీరు తోడుకోవడానికి కూడా వీలు లేకుండా కరెంట్ కోతలతో రైతుల పొలాలు ఎండిపోయాయి. దీనికి తోడు పన్నుపోటు. ఈ కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఎంతమందో! సదాశివుడి స్వరం నిర్భయంగా రాజ్యంపై ధిక్కార సైరన్ ను మోగించింది.
జన్మభూమి పేరిట ఇంకుడు గుంతల ప్రణాళికలతో పాలకుల కుతంత్రాలను పాట ద్వారా ప్రశ్నించాడు. రాజ్యం మీదికి తన పాటల చరణాలతో దండెత్తాడు. “రేపటి ధర్మయుద్ధానికి రూపాన్ని నేను/ బాణాన్ని నేను/వ్యూహాన్ని నేను/వంగిపోయిన వెన్నెముకను/వజ్రాయుధం చేసింది నేను” అంటూ అన్ని దిశలనుండి తన అక్షరాయుధాలను సంధించాడు. తెలంగాణ ఉద్యమం రేపటి ధర్మయుద్ధంగా, దానికి తానొక బలమైన సేనాధిపతిగా నిలబడ్డాడు.
“నోరు మూసుకుంటే నిన్ను దేకటోడె కరువాయె
కడుపు మండి కేకవేస్తే నీ ఊరె కాల్తదాయె
బతికున్నా పేరెగాని రోజుకొక్క చావాయె
చిచ్చోలె మండలేని చచ్చు బతుకులైపాయె
ఎన్నాళ్ళీ మూగనోము నాగలి మర్రెయ్యరన్న
కన్నేర్రజేసి నువ్వు పోరుబాట నడువరన్న
వీర తెలంగాణ నీకు హరతులే పట్టరన్నా”
ఆ శివుడు గొంతులో గరళాన్ని దాచుకున్నాడు. ఈ శివుడు గొంతులోని దుఃఖ గరళాన్ని ప్రజలను ఉద్యమోన్ముఖుల్ని చేయడానికి సిరాగా మార్చుకున్నాడు. నోరు మూసుకుని మౌనంగా వుండకూడదనుకున్నాడు. ప్రశ్నించే గొంతుకలుగా మారమన్నాడు. ఆకలితో కడుపు మాడ్చుకోవడం కాదు అగ్గిరవ్వ లెగరాలని కోరుకున్నాడు. ప్రతిక్షణం చస్తూ బతకడం కంటే ఎదురు తిరిగి బతకమనే ఉత్తేజాన్ని అందిస్తున్నాడు. చేతులు ముడుచుకుని కూర్చోవడం కంటే చేతిలోని నాగలినే ఆయుధంగా మార్చుకోమని సూచిస్తున్నాడు. పోరాటాల పురిటి గడ్డయిన ఈ వీర తెలంగాణ కొత్త పోరు బాటలోకి పయనిస్తుంది. ఆ ప్రత్యేక రాష్ట్ర సాధనలో గ్రామీణ ప్రజానీకమంతా ఉవ్వెత్తున ఎగసిపడుతూ రావాలని ఆహ్వానిస్తున్నాడు. కొత్త విప్లవ మార్గాన్ని నిర్దేశించాడు. తెలంగాణ తల్లి కడుపులో దాచుకున్న విషాదాన్నంతా ఈ పాటలో ప్రవహింపజేశాడు సదాశివుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో భాగంగా జరిగిన “ధూ౦ దా౦’ కార్యక్రమాల్లోనూ, జలసాధన యాత్రలోనూ ఈ పాట నదీగర్భం లోతుల్లో ప్రతిధ్వనించేటట్లుగా మార్మోగింది. నేటికీ రగులుతున్న జలవివాదాల నేపథ్యంలో ఈ పాట మరోసారి శత్రువుల గుండెల్లో ప్రకంపనాలు పుట్టిస్తుంది.
మల్లావఝల సదాశివుడి ఉద్యమ సంతకం ‘తలాపున పారుతుంది గోదారి’ అనే ఈ ఒక్క పాటతోనే ముగియలేదు. తెలంగాణ రాష్ట్రోద్యమానికి ఆయా సందర్భాలలో ఎన్నో ఉద్వేగభరిత గీతాలను అందించాడు. అవన్నీ ‘ఎర్ర కుంకుమ’ పేరుతో గ్రంథస్తమయ్యాయి. ఆయా సామాజిక సన్నివేశాలలో రాసిన కవిత్వాన్ని ‘సైరన్’ శీర్షికతో సంపుటిని అందించాడు. ‘ఉన్నవూరు, నమ్ముకున్న నేల పరాయిదయినప్పుడు, దళారుల పరిహాసాల మధ్య దుఃఖిస్తూ “ఎమున్నదక్కో” అంటూ వలస వేదనను గుండెలు పిండేసేలా ఆలపించాడు. నిర్మొహమాటంగా, నిరాడంబరంగా గ్రామీణ ప్రజల నుడికారాన్ని తన చరణాలుగా మార్చుకొని గానం చేశాడు. గోదావరిఖని పరిసరాల్లోని విప్లవావేశాన్ని, ఉత్తర తెలంగాణాలోని పోరాట స్పూర్తిని ఈ పాటలో పొదిగాడు. “తెలంగాణమూ సమరనాదము / సామాన్యుడి ఎద భగభగ మండిన అనలవేదము” అనే నినాదమిచ్చిన ఈ శివకవి పాటకు ఏ నది హృదయమైనా కరిగి తెలంగాణ తలాపుకు ప్రవహించాలని కోరుకుంటుంది. ఈ పాటతో సదాశివుడు మన మదిలో నిత్యం పారుతూనే ఉంటాడు.
మొత్తం పాట :
తలాపున పారుతుంది గోదారి
నీ చేను నీ చెలకా ఎడారి,
రైతన్నా, నీ బతుకు అమాసా
ఎన్టిపీసి చూస్తోంది తమాషా
నీ చుట్టు సిరులు వున్నా – నీకేది దక్కదన్న
నీ చేతిలోని బువ్వే – నీ నోటి కందదన్న
చేతికి మూతికి నడుమ గీత గీసిరన్న
మోసపోతివన్న – అరిగోస పడితివన్న
కొండమీద భ్రమరాంబ చిన్న చూపె చూసింది
శ్రీశైలం కుడి కాలువ వెన్నుపోటు పొడిసింది
ఉన్ననీళ్ళ నాంధ్రకు ఉడ్చుకోని పోయింది
ఎడమ కాలువ ఎలుక తోక దార నీకు మిగిలింది
కృష్ణానది చిరునామా – కోస్తా కొబ్బరి బొండం
నమ్మి నారు బోసుకుంటే, నీ ఎవుసం దినగండం
శ్రీరామ సాగరమూ – నీ ఆశలు తీర్చలేదు
తెలంగాణా నేల తల్లి – గొంతునైన తడుపలేదు
సాలానా పారుకము – చారానాకు పడిపోయె
కొంత నీరు ఎన్టిపీసి కరెంటుకు సరిపాయె
నీ నీరు నీదిగాక – నీ వెలుగు నీదిగాక
వైజాగున వేలుగునీక – తరలిపోయెరన్నా
నోరు మూసుకుంటే నిన్ను దేకటోడె కరువాయె
కడుపు మండి కేకవేస్తే నీ ఊరె కాల్తదాయె
బతికున్నా పేరెగాని రోజుకొక్క చావాయె
చిచ్చోలె మండలేని చచ్చు బతుకులైపాయె
ఎన్నాళ్ళీ మూగనోము నాగలి మర్రెయ్యరన్న
కన్నేర్రజేసి నువ్వు పోరుబాట నడువరన్న
వీర తెలంగాణ నీకు హరతులే పట్టరన్నా
ధన్యవాదాలు సార్… మంచి విశ్లేషణతో సమాచారం అందించారు.
తెలంగాణ జలగోసను, అన్ని రంగాల్లో వివక్షకు గురైన ప్రజల అరిగోసను గోదారి గుండెల్లో ప్రవహింపచేసి ఉద్యమబావుటా ఎగురవేసిన సదాశివుని పాటకు డా.రఘు సార్ గారు తనదైన ప్రత్యేకశైలిలో అందరి మనస్సులకు హత్తుకునే విధంగా చేసిన అధ్భుతమైన విశ్లేషణ ఆనాటి స్థితిగతులను కళ్ళకట్టినట్లుగా చూపించింది. మరొక్కసారి మీకు వందనాలు అన్నా🙏