తరలిపోయిన సముద్రం

తీరం ఎపుడూ లేనంత
కల్లోలంగా ఉంది
భూగోళం అరచేతిలో ఇమిడిపోయాక
ఎక్కడ కార్చిచ్చు అంటుకున్నా
అదిక్కడ నీళ్ళ మీద మంటలు రేపుతోంది
పడవలూ, పడవలతో ముడిపడ్డ బతుకులూ
ఆకలి గుంజకు కట్టేసిన లేగదూడలౌతాయి

రాజకీయం కానిదంటూ
ఇక్కడింకా ఏం మిగిలిందని.
అనుబంధాల మధ్య గోడలు మొలిచినట్టు
సముద్రాన్ని రెండుగా చీల్చడం ఎవరితరం?
కానీ అదే జరిగేలా వుంది

ఇక ఖాళీ పడవల్లో బతుకునేసుకుని
బయల్దేరడమే మిగిలింది.
సముద్రాన్ని అమ్మేసినవాడు
మహా బైరాగి, గొప్ప ఉదారవాది
దేని మీదా అస్సలు వ్యామోహం లేనివాడు
సముద్రాన్ని దక్కించుకున్న వాడు
మహా వ్యాపారి, గొప్ప కాలజ్ఞాని
వందేళ్ల వరకూ వెనక్కి తిరిగి చూడ్డానికి లేదు

పిల్లలెలా తట్టుకుంటారో,
సాయంత్రం వాళ్ళొల్లోచ్చే సరికి
సముద్రం
తరలిపోయి వుంటుంది

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply