తను కావాలి

తను కావాలి…
అవును ఇప్పుడు
తను కావాలి…

వీచే గాలిలా…
పొడిచే పొద్దులా…
పోరు పరిమళంలా…

పారే నదిలా…
ఉరకలేసే ప్రవాహంలా…
ఉత్తుంగ తరంగంలా…
కుంగిన కట్టడాలను కుమ్మేసే ఉప్పెనలా…
తను కావాలి…
తను కావాలి…

చిదిమేసేకొద్దీ
చిగురు తొడిగే నల్లమలలా …

ఆకాశ దాడులతో
అంతం చేయాలని
ఆపరేషన్ కోరల్ని
అవతారాలు మార్చి మార్చి
అమలుచేస్తూ…
చతికిలబడుతున్న హింసోన్మత్తతకు
చెమటలు పట్టిస్తూ…

నిత్య నూతన
నిర్మాణ మొగ్గలు తొడిగి
నిదురపట్టని రాత్రులతో
ఫాసిస్టు రాజ్యాన్ని
నిలువు పాతర పెడుతూ…

మడమ తిప్పని
మార్చింగ్ సాంగ్ ఆలపిస్తూ
మునుముందుకు సాగుతున్న
ఎదలు పదునెక్కిన
గుబురు పొదల
దండకారణ్యంలా…

ఇప్పుడు మళ్ళీ మళ్ళీ
తను సాక్షాత్కారం కావాలి!

ఊరూ వాడా
తండా గూడెం
మైదాన మొహల్లాల
గడప గడపా
గుండెగాయాల మంటల్లోంచి
వెలిగి విరబూసిన
పోరుపతాకై రెపరెపలాడాలి!!

***

పేట్రేగుతున్న హింసే…

సప్తవర్ణ
అభివృద్ధి నినాదాన్ని
నెత్తినెత్తుకుని
ఆకాశమెత్తు
ఎగిరిపడుతూ వాళ్ళక్కడ

పెత్తనాల
రుచిమరిగిన
చప్పరింతల నాలుకల్ని
రెపరెప లాడిస్తూ…
అందమైన
అభ్యుదయం బోర్డును
మెడలేసుకు
మెరిసిపోతూ వీళ్ళిక్కడ

దర్పాలను
మెలేస్తూ
నలగని
పూల తెలుపు
ఆహార్యాలక్కడ

వీర భోగాలకు
త్యాగాల వన్నెలద్దుకుని
రాజ్య సంహారాల్ని
స్వరాలకెత్తుకుని
నినాద నాటకాలిక్కడ

ఉత్తర దక్షిణాల
కశ్మీరు కేరళ్ళో…

తూర్పు పడమరల
బస్తరు మహలు…

మణిపూరు ఒరిస్సా
ఈశాన్య భారతాలో…

ఎక్కడ
జూసినా…

ఇప్పుడు
దేశమంతా
పేట్రేగుతున్న హింసే…

భయం భయంగా
బతుకులీడుస్తున్నోళ్ల
భద్రత
భ్రమై తేలిపోతున్నది…

లౌకిక సఖ్యతల
గంజినీళ్లు కాద్దామని
తలపోతలు మొదలయ్యి…

కడుపాకలిని
కొలత పట్టి
పొయి రాజేయడానికి…

పొయిరాళ్ళ కోసం
వెతుకులాటలు
మొదలెడుతున్నారిప్పుడు…

ఇవ్వాళ
జూలై ఇరువయ్యారు…

ఇరవై దినాలాగితే
నా దేశ సొతంత్రానికి
డెబ్భై ఆరేండ్లు పూర్తి !

ధగ ధగా
వెలిగిపోతున్నది
అదిచ్చిన స్ఫూర్తి!!

***

ఎగసిన తుఫానామె…

ఎవరది…! ఎవరది…!

వోరగా చూస్తూ కూడా
చూడనట్లే లేచి
చూపుల్ని మల్లెల్లా
నేల రాల్చుకుని…

జ్ఞాపకాల రాసుల్ని
కూడేసుకుంటూ
ఎక్కిళ్ళతో
ఎగపోస్తున్నది…

ఎవరది…? ఎవరది…?

పిలిచి కూడా
పిలవనట్లు
ముఖమంతా
పాలిపోయి…

పడిగాపు కళ్ళల్లో
అరుణిమలు రాజేసి
కొంగుచాటేసుకు
కమిలిపోతున్నది…

ఎవరది…! ఎవరది…!

విప్పార్చి చాపిన
బాహువుల్లోకి
నన్నెత్తుకోకుండానే
విడిచెల్లి పోతున్నది…

ఎవరది…? ఎవరది…?

పుట్టెడు రోగాల
చెరలజిక్కిన చిన్నోడు
తమ్ముడు అన్వర్ను
సంకెత్తుకున్న మాయమ్మే…

ఇంకెవరు…? ఇంకెవరు…?

గుక్కెడు పాలకేడ్సేడ్సి
కళ్ళు తేలేసినోన్ని
గుండెకద్దుకుపట్టి
ఎగసిన తుఫానామె…

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

Leave a Reply