తక్షణ న్యాయం

నేటి ఆత్మ”రక్షణ”లు / ఆత్మ”హత్య”లు రేపటి ఓట్లుగా మారి మరోసారి అందలమెక్కిస్తాయని, రాజ్యాంగాన్ని అలమారాలో నిశ్చింతగా నిద్రపుచ్చుతుంది అధికారం. జరిగిన నేరానికి తమదైన తీర్పు తక్షణ న్యాయమై అమలైపోతుంది.

మనిషి నేరస్థుడెందుకవుతున్నాడో, ఎలాంటి పరిసరాలు, ఎలాంటి వ్యక్తులు తనని ప్రభావితం చేస్తున్నారో తరచి చూడని రాజ్యంలో, అడుగడుగునా నేరం జరగడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఇప్పటికెన్ని తక్షణ న్యాయాలు జరిగినా… అంతకు మించి నేరాలు జరగడం దేని వైఫల్యం? ఏమైంది తక్షణ న్యాయపు స్ఫూర్తి.

నేరస్తుడికి శిక్ష పడాల్సిందే. కానీ ఆ శిక్ష వెయ్యాల్సింది ఎవరు? వేస్తున్నది ఎవరు? ఎలాంటి విచారణ జరగకుండా అన్ని న్యాయాలూ అమలైపోతూ ఉంటే అసలు కోర్టులు ఎందుకు? న్యాయ వ్యవస్థ ఎందుకు?

రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులే నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేస్తామనడమన్నది చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోవడం కాదా? ఎన్కౌంటర్ చేస్తామని పబ్లిక్ గా అలా ప్రకటించే ప్రజాసేవకులని బర్తరఫ్ చెయ్యాల్సిన అవసరం లేదా? ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే మీడియా ఇలాంటి ప్రజాప్రతినిధులని ప్రశ్నించదెందుకని? ఇప్పుడు మీడియా వ్యాపారమంతా అధికార ప్రభుత్వాల ఎడమ జేబుల్లో ఉన్నందుకా?

సామాన్య ప్రజలుగా మనవాళ్ళ మీద హత్యాచారాలు జరిగితే తల్లడిల్లిపోతాం. మా ఎదురుగా కాల్చి చంపాలంటాం. అవన్నీ మనకి జరిగిన అన్యాయం నుండి వచ్చిన ఉద్రేకం నుండి వచ్చే ఆలోచనలు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే నేరస్తుణ్ణి పట్టుకున్నా వాడికి శిక్ష పడేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని అనుభవం చెప్పిన పాఠాల నుండి నేర్చుకున్నాం మనం. కానీ ప్రభుత్వం మన ఉద్రేకాలకి అతీతంగా వ్యవహరించాలి. రాజ్యాంగ బద్ధంగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలి కానీ, ప్రజలంతా ఒక విధమైన మాస్ హిస్టీరియాలో ఉన్నప్పుడు వాళ్ళ మనసుల్ని గెలుచుకోవడానికి తామూ ఉద్రేకపడటం ప్రభుత్వాల లక్షణం కాదు.

రాజ్యాంగబద్ధంగా ఎన్నిక అయిన ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వంలో పని చేసే అధికారులు కానీ ప్రజల్లో ఉన్న ఉద్రేకానికి కోరికలకు అనుగుణంగా అన్ని సార్లూ పనిచేస్తే అంతకన్నా సంతోషించే విషయం ఉండదు కానీ, ప్రజలు ఉద్రేకం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఇచ్చింది అనుకున్నప్పుడే సమాజ విధ్వంసం జరుగుతున్నట్లు. వారిని ఎన్నుకున్నది సమాజ పరిరక్షణకై తప్ప విధ్వంసానికి కాదు.

కంటికి కన్నే తీస్తారో
పంటికి పన్నే తీస్తారో
దేనికి ఏమి తీయాలో చెప్పడానికి రాజ్యాంగం మనకో న్యాయ వ్యవస్థని ఇచ్చింది. వేసే శిక్షేదో దాన్నే వేయనివ్వాలి తప్ప ఇంకెవరో కాదు. అలా చేస్తే చేసిన వారూ నేరస్థులకిందనే లెక్క. మరి ఈ నయా నేరస్థులకు ఎలాంటి శిక్ష వెయ్యాలి? వీళ్లకు ఉండవా ఎన్కౌంటర్లు?

ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేర తీవ్రతని బట్టి పబ్లిక్ మూడ్ ఉంటుంది. పబ్లిక్ సెంటిమెంట్ ని గమనించి ఆ సెంటిమెంట్ ని ఎన్కాష్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ పబ్లిక్ రేపటి ఎలెక్షన్స్ లో తమకధికారమిచ్చే ఓటర్లు కనుక. పబ్లిక్ సెంటిమెంట్ తమకి అనుకూలంగా ఉంది కనుక నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేస్తే, పబ్లిక్ తమ మీద గులాబీ పూలని వెదజల్లుతారని… పబ్లిక్ కి అసలైన హీరోలమంటే తామేనని, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లాంటి భారతీయ సినిమాలోని పోలీస్ హీరోలు చూపించే హీరోయిజం నిజజీవితంలో చేసేది తామేనన్న అతిశయంలోకీ వెళ్ళిపోతున్నట్లుంది పోలీస్ వ్యవస్థ.

బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల వ్యధని, ఆ నేరాన్ని చూసి తమకే అలా జరిగితే ఎలా అని భయపడే పబ్లిక్ ని అర్థం చేసుకోవాల్సిందే. వాళ్ళడిగే సత్వర న్యాయం జరగాల్సిందే. కానీ ఎలా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలోగా నేరానికి తగ్గ శిక్ష వేయించడం ద్వారా!

అలా కాకుండా తాము చేసేదే న్యాయం అనుకుంటే తాలిబనిజానికి, ప్రజాస్వామ్యానికి తేడా ఏదీ? అంతా ఆ తానులో ముక్కలే అనిపించదా? లేదూ బాధిత కుటుంబాలని ఓదార్చడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు అనుకుంటే మార్చెయ్యండి చట్టాలని! రద్దు చెయ్యండి న్యాయవ్యవస్థని. చట్టాలని అలా విచ్చలవిడిగా తమ చేతుల్లోకి తీసుకుంటే రేపేమి జరుగుతుందో నీకు తెలుసా? వ్యక్తిగత కక్షలతో నిన్నో, నన్నో చంపేసి నేరస్థులంటారు. అలా నేరస్థులమైపోదామా?

ఇన్స్టంట్ జస్టిస్ పేరుతో చచ్చిపడుతున్న శవాల లెక్కలు ఒకరిని హీరోని చేయవచ్చు. కానీ అధికార వ్యవస్థ కనుసన్నల్లో చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడే ఆ హీరో, జీరో అయిపోయాడని అతని మనస్సాక్షికే తెలుస్తుంది.

పోలీస్ లే న్యాయమూర్తులుగా మారి శిక్ష విధించి, మళ్ళీ తామే తలారులై ఆ శిక్షని అమలు చేయడం న్యాయవ్యవస్థని కించపరచడం కాదా? అధికార వ్యవస్థ వాళ్ళతో ఇలానే చేయిస్తుంటే సమాజం వాళ్ళని చూసి “లైసెన్స్డ్ కిల్లర్స్” అనుకుని వెలివెయ్యదా! భయంతో భౌతికంగా వెలివెయ్యదేమో కానీ మనసులో మనుషుల నుండి వెలివెయ్యడం మాత్రం తథ్యం. పైకి వారి పట్ల గౌరవం నటిస్తూ లోపల తిట్టుకుంటూ పబ్లిక్ అంతా నటిస్తూనే ఉంటుంది. మనం స్వీకరించే గౌరవమే నటన అయినప్పుడు మన అంతరాత్మకు మనమే నిందితులం.

ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ నిర్ణీత పనివేళలు లేక తమ జీవన చిత్రమే అస్తవ్యస్తం అయిన పోలీసుల పట్ల ఉన్న జాలీ, సానుభూతీ ఏవీ కూడా వ్యవస్థని ఛిద్రం చేసే పోలీసుల పట్ల ఉండవు. వ్యక్తిగతంగా ఎంత నిజాయితీ పరుడైనా వృత్తిగతంగా నైతికతని కోల్పోయాక భ్రష్టుడిగానే పిలువబడతాడు. నైతికత కోల్పోయిన నిజాయితీ అంపశయ్య మీద ఉన్న దేహం లాంటిదే!

పోలీసుల సామర్ధ్యమంతా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు తమ సొంత అజెండాలను మరింతగా పెంచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించబడుతోంది. ఎక్కడికక్కడ అధికార నిచ్చెనలో కింద ఉన్నవాడు తనపై ఉన్నవాడి ఆదేశాలకి అనుగుణంగా పనిచేసి వాళ్ళ మెప్పుదలతో తాము అందలం ఎక్కుదామన్న ఆశతోనే పని చేస్తున్నాడు తప్ప నియమ నిబంధనలకి లోబడి కాదు.

ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏమిటంటే చట్టపరమైన ప్రక్రియ మీద పౌరులకు విశ్వాసం కలిగేలా చేయడం… నేరస్థుడికి సత్వరమే శిక్ష పడుతుందన్న నమ్మకం కలిగించడం! దానికోసం మరిన్ని మౌలిక సదుపాయాలని కల్పిస్తూ న్యాయ వ్యవస్థని సమూల ప్రక్షాళన చేసి ఏళ్ల తరబడి నానుతున్న కేసుల్ని త్వరితగతిన పరిష్కరించేలా చెయ్యాలి. అలాగే పోలీస్ వ్యవస్థను రాజకీయ వ్యవస్థ తో సంబంధంలేని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా సంస్కరించాలి.

విజయవాడ. వృత్తి రీత్యా ఎల్ఐసిలో Administrative Officerని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

One thought on “తక్షణ న్యాయం

  1. “ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏమిటంటే చట్టపరమైన ప్రక్రియ మీద పౌరులకు విశ్వాసం కలిగేలా చేయడం… నేరస్థుడికి సత్వరమే శిక్ష పడుతుందన్న నమ్మకం కలిగించడం! దానికోసం మరిన్ని మౌలిక సదుపాయాలని కల్పిస్తూ న్యాయ వ్యవస్థని సమూల ప్రక్షాళన చేసి ఏళ్ల తరబడి నానుతున్న కేసుల్ని త్వరితగతిన పరిష్కరించేలా చెయ్యాలి. అలాగే పోలీస్ వ్యవస్థను రాజకీయ వ్యవస్థ తో సంబంధంలేని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా సంస్కరించాలి.” బాగా చెప్పారు ఉమానూతక్కి గారు. మాడభూషి శ్రీధర్ గారు ఇదే నేరంలో ముద్దాయి ఆత్మహత్య గురించి రాస్తూ, అంత వేగంగా రైల్ కింద పడినప్పుడు ఆ ముద్దాయి దేహం మామూలుగా ఉండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తపరిచారు .

Leave a Reply