పసిప్రాయం లోనే వికసించిన కవిత్వం: డెనిస్ లేవర్టోవ్

1923 లో ఇంగ్లండ్ లోని ఎసెక్స్ లో జన్మించిన డెనిస్ చాలా చిన్న వయసులోనే తనను తాను కవయిత్రిగా పరిగణించుకున్నది. యూదు జాతికి చెందిన తండ్రి జర్మనీలో చదువుకునే కాలంలో క్రైస్తవం స్వీకరించాడు. డెనిస్ పుట్టి పెరిగే సమయానికి ఇంగ్లండ్ కు వొచ్చి స్థిరపడ్డారు. తల్లి పూర్వీకులు వేల్స్ కు సంబంధించిన వారు. డెనిస్ చిన్నతనంలో ఆమె తల్లి, చార్లెస్ డీకేన్స్, టాల్ స్టాయ్ వంటి గొప్ప రచయితల రచనలను ఇంట్లో కుటుంబ సభ్యులకు బిగ్గరగా చదివి వినిపించేది. పన్నెండేళ్ళ వయసులో డెనిస్ తాను రాసిన కవితలను టి ఎస్ ఇలియట్ కు పంపిస్తే, ఆమెను అభినందిస్తూ ఇలియట్ రెండు పేజీల ఉత్తరం రాశాడు. డెనిస్ కు పదిహేడేళ్ళ వయసు వచ్చేసరికే ఆమె రాసిన కవితలు ఇంగ్లీషులో ప్రసిద్ధమైన కవిత్వ త్రైమాసిక పత్రికలో అచ్చవుతూ వుండేవి.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్ అంతటా బాంబుల వర్షం కురుస్తున్న రోజులలో డెనిస్ నర్సుగా క్షతగాత్ర సైనికులకు సేవలు అందించింది. 23 ఏళ్ల వయసులో డెనిస్ వెలువరించిన తొలి కవిత్వ సంపుటి ‘డబుల్ ఇమేజ్’, నూతన రొమాంటిక్ కవిత్వంగా పేరు తెచ్చుకున్నది.

1946 లో మిచెల్ గుడ్ మన్ అన్న అమెరికన్ రచయితను పెళ్లాడిన డెనిస్ ఆ తరువాతి సంవత్సరం భర్తతో కలిసి అమెరికా లోని న్యూ యార్క్ కు వలస పోయింది. 1956 లో అమెరికా పౌరసత్వం లభించింది.
అమెరికా వెళ్ళిన తరువాత, కొంతకాలం పాటు అక్కడి కవుల ప్రభావం డెనిస్ కవిత్వం మీద పడినా, అనతికాలంలోనే తనదైన సొంత గొంతుతో డెనిస్ కవిత్వం రాయడం మొదలు పెట్టింది. 1956 లో అమెరికాలో డెనిస్ వెలువరించిన కవిత్వ సంపుటి ‘హియర్ అండ్ నౌ’ ఆమెకు గొప్ప పేరు సంపాదించి పెట్టింది. 1959 లో వెలువడిన ‘విత్ ద ఐస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ అవర్ హెడ్స్’ తో అమెరికన్ సాహిత్య లోకం ఆమెను అమెరికాలోని ప్రఖ్యాత కవులలో ఒకరిగా చూడడం ప్రారంభించింది. 1960 ల నాటి యుద్ధ కాలంలో డెనిస్ కవిత్వం తిరుగుబాటు తనం, స్త్రీ వాదంతో నిండిపోయింది.

జీవిత కాలంలో 20 కి పైగా కవితా సంపుటులు, మూడు వచన రచనల సంకలనాలు, అనేక అనువాద రచనలు చేసిన డెనిస్ 74 ఏళ్ల వయసులో 1997 లో వాషింగ్టన్ లో మరణించింది.

గతించిన కాలం

దారాలు దారాలుగా మంచు కురుస్తోన్న ఆ ఉదయం
గుమ్మం ముందున్న చెక్క మెట్ల మీద
అట్లా నేను సేద తీరుతున్నపుడు
మెట్ల కింద నీ రాక అలికిడి విని
పట్టలేని సంతోషం నన్ను నిలువనీక
నిన్ను చూసి పెద్దగా చెప్పింది
ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా అని

ఇప్పుడా పాత చెక్క మెట్లు లేవు
కొత్త ధృడమైన బూడిదరంగు గ్రానైట్ మెట్లు వొచ్చాయి
ఆ పాత చెక్క మెట్లు నాలో సజీవంగా వున్నాయి
నా పాదాలు, తొడలకు అవి ఇంకా జ్ణాపకం వున్నాయి
నా చేతులు ఇప్పటికీ ఆ చెక్క మెట్ల
చీలికల స్పర్శను పలవరిస్తాయి
ఆ ఇల్లు ఎన్నో జ్ణాపకాలను మోసుకొస్తుంది
నా సహచరుడి గురించీ, నేను కన్నవాడి గురించీ
గుమ్మం ముందున్న ఆ పాత చెక్క మెట్లు కూడా
నా స్నేహితురాలు, మరణించిన ఆమె కొడుకుతో
ఆ మెట్ల మీద గడిపిన రోజులు తేటగానే వున్నాయి

అయినప్పటికీ
ఆ ఒకే ఒక్క సందర్భం
ఏ పక్షి కూతా భగ్నం చేయని మౌనంలో
నేలకు జారే పసుపు పచ్చ ఆకులను
ఏ చిరుగాలీ విసిరేయని నిశ్శబ్దంలో
వెరపు లేక, యవ్వనోత్సాహంతో నీవు నాకు
బదులు ఇచ్చిన సందర్భం
‘నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను’
ఆ వెచ్చని పురాతన చెక్క మెట్ల చీలికల్లోంచి
నా శిరసు గుండా నా దేహం గుండా ప్రవహిస్తున్నది

ఇప్పుడు ఆ చెక్క మెట్లు ఎక్కడో
తగలబడడానికి సిద్ధంగా వున్నాయి

పెళ్లి ఉంగరం

బావి అడుగున పడి వున్నట్టు
నా పెళ్లి ఉంగరం పాత బుట్ట లోపల పడి వుంది
దాన్ని తిరిగి పైకి తెచ్చి
నా వేలికి తొడిగే దారి ఏదీ లేదు
అది పాడుబడిన ఇళ్ల తాళం చెవుల నడుమ
అవసరమైనపుడు గోడకు కొట్టే మికుల నడుమ
పేర్లు తెలియని ఫోన్ నెంబర్ల నడుమ
పనికిరాని వార్తా పత్రికల క్లిప్పింగుల నడుమ
నా పెళ్లి ఉంగరం అట్లా పడి వుంటుంది
దురదృష్టం పలకరిస్తుందనే భయం వలన
దానిని తిరిగి ఇవ్వడం కుదరదు
అమ్మివేయడం కూడా కుదరదు
ఎందుకంటే, అప్పటి కాలంలో పెళ్లి మంచిదే
మంచిదైన ఆ కాలం కరిగిపోయినా

ఎవరైనా స్వర్ణకారుడు ఈ ఉంగరానికి
రంగు రంగుల రాళ్లని అద్ది కొత్తగా మార్చగలరా?
నెరవేర్చలేని వాగ్దానాల గంభీర నిశ్చితార్థాల కోసం
ఎవరూ దీనిని తీసుకోకుండా
ఎవరైనా స్నేహితుడికి చిన్న బహుమతిగా
ఇచ్చేందుకు వీలుగా ఈ ఉంగరాన్ని మార్చి ఇవ్వగలరా?

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

2 thoughts on “పసిప్రాయం లోనే వికసించిన కవిత్వం: డెనిస్ లేవర్టోవ్

  1. చాలా బావుంది అనువాదం.ఎంపిక చేసుకున్న కవితలు ఆర్థ్రంగా వున్నాయి.డెనిస్ కవిత్వం చదవాలనిపించేలా వున్నాయి.ఉత్తమ కవిత్వం అందిస్తున్న కోడూరి అన్నకు మప్పిదాలు.

Leave a Reply