డిసార్డర్

ఆకాశ పరుపు మీద
ఆదమరిసి నిద్రపోతున్న సూరీడు
పట్టపగలుపైన పట్టపు రాణిలా
సందమామ స్వైర విహారం
చీకటికి వెలుగుకి తేడాతెలియక
కొట్టుమిట్టాడుతున్న సూర్య చంద్రుల్లా నగరం
నగరాన్ని చూసి నవ్వాపుకోలేని నక్షత్రాల్లా ఊర్లు !

సొంత గూడులోనే గిల గిల కొట్టుకుంటూ
దోమ కాటుకి బలైన వేటసాలీడు
సమాధి రాయి కింద ఊపిరాడని
ప్రేమికురాల్లా తాజమహల్
అణుబాంబుల్ని ఆరగించి
ఖాళీ ఇల్లంతా ఆక్రమించుకొన్న కాక్రోచ్లు
వింతలమారి వెర్రి ప్రపంచంలో
కంప్యూటర్లని మింగేసిన ఇన్ఫర్మేషన్ వైరస్
హార్డ్ డిస్క్ లో దాచిన చరిత్రంతా ఎరాస్
సంథింగ్ రాంగ్ ఐ సే
డేస్ ఆఫ్ డిసార్డర్ !

అకాల అగ్గి వింతలు
మసకబారుతున్న మానవ గోళం
బాధల్లేని భావప్రపంచం కోసం వెంపర్లాట
కాశీ స్మశానంలో అబద్ధాలు
అమ్ముతున్న అరిచ్చంద్రుడు
రాజ్యాన్ని అమ్మేసిన రాజు
సన్యాస స్వీకార బెదిరింపు !

నేల మీద నుంచున్న నా ప్రజలారా !
మనమెప్పుడు అక్రమానికి
ఆక్రమణకి అణిగుండాములే!
ఎన్ని తుఫానుల్ని తీరం దాటించలేదూ
ఎన్ని నిరంకుశ రాజ్యాల్ని కూల్చేయలేదూ
సంక్షోభాల్నుంచి సమాధానాల్ని
వెతుక్కోవటమేగా సంఘర్షనంటే
చరిత్రంటే చీకట్లోంచి వెలుగుని
చెక్కుకుంటూ పోవటమేగా !

2. డిస్క్వాలిఫైడ్

మనిషిని వెలివేసే మతం
ఒంటరిని వెంటాడే గుంపుస్వామ్యం
నిచ్చెన మెట్లమీదే నుంచున్న సమానత్వం
ఆకలి నోట్లో నైవేధ్యమైన గోమూత్రం
అధికారమే అన్నింటా ఆధిపత్యమై
ఆటలోనూ ద్వేషానిదే అంతిమ గెలుపై !

కులం కుండీలో పెరిగిన
అనాగరిక మరగుజ్జు మాయావృక్షం
ఎప్పటికీ పుష్పించని మనిషితనం
సువాసనలు వీచని సహజీవనంలా
భూమినొదిలేసి ఆకాశానికంటుకట్టుకుని
వేళ్ళన్నీ గాలిలో పరుచుకున్న పరాన్నజీవి
పనిచెయ్యకుండానే పెత్తన సంపాదనలో
పువ్వులు పూయకుండానే కాసే కాయలు
రంగురంగుల్లో కార్పొరేట్ ఫలాలు
మహావృక్షమై విరగ్గాస్తున్న
వికృత మరుగుజ్జు రాజకీయం !

చిరిగిన చరిత్ర చొక్కా తొడుక్కుని
భక్తి గీతాలు పాడుకుంటూ
రోడ్డు మీద చిందులేస్తున్న అరాచకం
రాజ వీధిలో చిందుతున్న ధిక్కార రక్తం
ప్రశ్నలన్నీ కత్తిగాట్లకి బలై
ఎండి పోతున్న చెట్టులా రేపు
గుప్పెడు గింజలు విత్తనానికి కూడా మిగలక !

మారిన సిలబస్లో ఎక్కడా కనిపించని
నన్ను నేను దేవులాడుకుంటుంటే
అర్ధాలు మార్చుకున్న పదాలు
పదేపదే పరిహసిస్తున్నాయి
నువ్వో అనర్హుడివని !?

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply