Dear కశ్మీర్

ప్రియమైన కశ్మీర్,
అందమైన లోయ,
నీలో సమ్మిళితమైన
జమ్ము, శ్రీనగర్, లదాఖ్
మనసంతా నువ్వే

శాంతికి, అశాంతికి మధ్య,
సుదీర్ఘంగా నలిగిన
political sandwich నువ్వు
70 వసంతాల విషాదానివి!
ఆజాదీ నిర్వచనం
నీకు తెలిసినంత మరెవరికి తెలుసు?
స్వేచ్ఛ కోసం నీ నేల
ఎన్ని త్యాగాలు చెసిందో
చూస్తునే ఉన్నాం కదా!

కల్లోల సముద్రమై మతం
దేశమంతా ఎగిసిపడ్డపుడు
నీ నేల కదా
ప్రశాంతతకు నెలవై నిలిచింది
కశ్మీరీయత్ సంస్కృతి అలలాడే
నీ నేల కదా
కన్నీళ్ళను దాచుకొని ప్రేమించడం నేర్పింది

Article 370 వెళ్తూ వెళ్తూ
నీ అస్తిత్వాన్ని చరిత్రకు చెప్పి వెళ్లింది
నువ్వు మౌనమైన వేళ / ప్రపంచం నీ కోసం మాట్లాడింది
మంచు శిఖరాల మీద కొండ గాలి
నీ ఆవేదన మోసుకొచ్చింది

నీ pashmina శాలువ వెచ్చదనంలో
కశ్మీరీ ప్రజల చేతి స్పర్శ
హృదయాన్ని తాకుతుంది
నీ జాఫ్రాన్ తో పరిమలించే
నా హైదరాబాద్ బిర్యానీ
నీ pink tea తో / ఉదయించే నా రోజు
ఏం చెప్పను కశ్మీర్ , నువ్వు లేనిది ఎప్పుడు ?

నీ ఊదా రంగు కేసర్ పూల దారుల్లో నడవాలనుంది
నయనాలలో నిక్షిప్తమయ్యే నీ సౌందర్యాల కోనలో
తనవితీరా తిరగాలనుంది
చినార్ వృక్షాల నీడల్లో సేదతీరాలనుంది
నవ్వడం మరిచిన నీ వీధుల్లో
చిరునవ్వు సవ్వడి వినాలనుంది

డాల్ సరస్సు హొయలు పో
సట్లెజ్ నదీ ప్రవహించు ఎప్పటిలా
జీలం, చీనాబ్ ఘనీభవించద్దు
నీ తులిప్ వనాల సోయగాలు చూడనీ ప్రపంచం
మంచు కురిసే నీ నేల మీద శాంతి విలసిల్లనీ

కవయిత్రి మహెజబీన్ మానవ హక్కుల న్యాయవాది. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో వామపక్ష విద్యార్ధి ఉద్యమాలలో పాల్గొన్నారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై కవిత్వం రాయడం మొదలుపెట్టారు. జబీన్ కవిత్వంలో ఉద్యమ ఛాయలు కనిపిస్తాయి. ఆమె తొలి కవితాసంపుటి "ఆకురాలు కాలం " 1997 లో ప్రచురించారు. ముఖ్యంగా ఆమె కవిత్వాన్ని రెండు కోణాల్లో చూడచ్చు. Feminist perspective and Revolutionary romanticism. పొలిటికల్ ఎన్కౌంటర్లకు సంబంధించిన ఆవేదన ఆమె కవిత్వం లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఒకప్పుడు విరసం సభ్యురాలు. నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ లో విరసం యూనిట్ లో పనిచేశారు. ఆమె మీద సివిల్ లిబర్టీస్ (civil liberties), మానవ హక్కుల (Human rights) ఉద్యమాలు ప్రభావం చూపాయి. ఇప్పటి వరకు సీరియస్ కవిత్వమే రాశారు. ప్రొఫెసర్ హరగోపాల్ కు స్టూడెంట్. MA(సోషల్ వర్క్ ), LLB, Human Rights (PDGHR) చదివారు. Formal fellow DAAD, Germany. కవిత్వంతో పాటు fiction, prose కూడా రాసారు. హైదరాబాద్ హై కోర్ట్ లో క్రిమినల్ లాయర్ గా ఉన్నారు.

One thought on “Dear కశ్మీర్

Leave a Reply