పల్లవి :
ధన ధన మోగే డప్పులల్లో
డప్పాయెనా నీ ఇంటి పేరు
గణ గణ మోగే గొంతులల్లో
పాటాయెనా నీ ఒంటిపేరు
ఆడిందే డప్పు గజ్జె గట్టి
పాడిందే కోయిల గొంతు విప్పి
దప్పు రమేష్ విప్లవాల పేరు
ప్రజాకళలు పలికే జోహారు – || ప్రజా ||
|| ధన ధన ||
కళలకు కాణాచి తెనాలి పక్కనే
అంగలకుదురయ్య నీ ఊరు
తలిదండ్రి బైబిల్ తో కంజరతో
తిరిగార ప్రార్థనై ప్రతి ఊరు
ప్రతి పల్లె పేదరికం
నిన్ను కదిలించెనా చూడు
ప్రతి అడుగులో పోరాటం
దారులేసింద ఆనాడు
ఎలియాజరు రమేషయ్యి
జన సంస్కృతి నాయకుడయ్యె – || ధన ధన ||
సదువులే దరిజేరి కదిలించినావయ్య
కళాశాలే నీ కదనమయ్యి
ఆటపాటలు నీకు పట్టమే గట్టెనట
విప్లవ రచనలు తోడయ్యి
వదిలావ సదువులన్నీ
సదువే సమాజమనీ
కారంచేడు ఘోరంపై
గుతుపలే ఎత్తుకోని
దళిత పులుల పాటగా
గాండ్రించిన నేతగా
|| ధన ధన||
విముక్తి ఆశయము వీపున మోసుకొని
అడవిలో నువ్వు అన్నయితివా
రోగాలు నొప్పులకు రాగాలు లొంగవని
ఆదివాసులా పాటైతివా
సంస్కృతిక రాయభారై
శాంతికోసం కదిలొస్తివా
నిర్బంధాల కొలిమిలో
నిప్పులా చెలిమైతివా
దివాకరుని గుండెగా
అమరవీరుల జెండగా – || ధన ధన ||
విప్లవాన్ని డప్పు దరువులల్లో వినిపించి
ఆగిపోయినాద నీ గుండె
జైత్రయాత్రలన్ని గళమందు మోగించి
మూగవోయినాద నీ గొంతు
సహచరుల కన్నీళ్లతో
ప్రవాహమయ్యినావా
ఆకలితో నువ్వు పోరి
అణచివేతకెదురు నిలిచి
కడకు జబ్బులతోటి
పోరాడి కనుమూసి
ఢమ ఢమ మోగే యుద్ధ భేరీ
నిప్పుల గుండంలో నిగ్గుదేలీ
కణకణ కంజెర సప్పుడయ్యి
ధనధన డప్పుల ఉప్పెనయ్యి
ఆడంగ జనమంత గజ్జె గట్టి
పాడంగ నీపాట కైగట్టి
డప్పు రమేషు నీ ఆసుపాసులు
దళిత విప్లవ జెండ ఎగరేసు
దళిత విప్లవ జెండ ఎగరేసు
దళిత విప్లవ జెండ ఎగరేసు
జననాట్య మందునా అడుగేసు
18 మార్చ్, 2023.
(సందర్భం: కామ్రేడ్ జేఎన్ఎం రమేష్ సంస్మరణ సభ ; హైదరాబాద్ )