1902 లో అప్పటి ఒట్టోమన్ రాజ్యంలో భాగమైన సాలోనిక లో జన్మించిన నజీమ్ హిక్మత్, టర్కీ దేశపు మొదటి ఆధునిక కవి మాత్రమే కాదు, టర్కీ ప్రజల ఆరాధించే కవి. ఒక్క టర్కీ దేశ ప్రజలు మాత్రమే కాదు. ఇరవయ్యవ శతాబ్ద ప్రపంచ కవిత్వాన్ని ప్రభావితం చేసిన గొప్ప కవులలో ఒకరుగా హిక్మత్ గురించి చెప్పుకుంటారు. ప్రజలు అభిమానించే కవులంటే రాజ్యానికి గిట్టదు కాబట్టి, అప్పటి టర్కీ రాజ్యం హిక్మత్ ను అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేసింది.
హిక్మత్ తండ్రి టర్కీ విదేశీ వ్యవహారాలు చూసే అధికారి. తల్లి కళాకారిణి. కవిత్వం హిక్మత్ కు తాత నుండి అబ్బింది. తన 17 వ యేటనే తొలి కవితా సంపుటి ప్రకటించాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో టర్కీ ఆక్రమణకు గురయిన తరువాత ఉన్నత చదువుల కోసం హిక్మత్ మాస్కోకు వెళ్లిపోయాడు. మాస్కో విశ్వవిద్యాలయ విద్య హిక్మత్ ను సమూలంగా మార్చివేసింది. ముఖ్యంగా, అనేక దేశాల నుండి అక్కడ చేరిన యువ విద్యార్థుల సమూహాలు హిక్మత్ చూపును విశాలం చేశాయి. అక్కడ అనేక మండి కవులు, రచయితలతో జరిపిన సంభాషణలు, అక్కడ అనుభవంలోకి వొచ్చిన భిన్న జాతుల సంస్కృతులు హిక్మత్ లోని కవికి కొత్త రెక్కలు తొడిగాయి. హిక్మత్ కవిత్వం మీద మయకోవిస్కీ ప్రభావం ఎక్కువని విమర్శకులు అంటారు. కేవలం కవిత్వం మాత్రమే కాదు, హిక్మత్ నవలలూ నాటకాలూ రాశాడు. బతుకుతెరువు కోసం అనువాదకునిగా, ప్రూఫ్ రీడర్ గా, జర్నలిస్టుగా అనేక అవతారాలు ఎత్తాడు. తన ఇరవయ్యవ యేట హిక్మత్ చేసుకున్న పెళ్లి ఎక్కువకాలం నిలబడలేదు.
తరువాతి కాలంలో, తన దేశమైన టర్కీ హిక్మత్ ను ఒక ప్రమాదకరమైన కవిగా చూడడం వెనుక అతని మాస్కో చదువులు అంటించిన వామపక్ష భావజాల ప్రభావం వుంది. అది ఎంత దూరం వెళ్ళిందంటే, తన దేశంలో స్వేచ్ఛగా కవిత్వం రాసుకునే పరిస్థితులు లేక హిక్మత్ తిరిగి రష్యా కు వెళ్లిపోయాడు. 1928 లో అమ్నెస్టి సహకారంతో టర్కీ నేల మీద అడుగుపెట్టి, తదుపరి పదేళ్ళ కాలంలో 5 కవిత్వ సంపుటాలు, 4 దీర్ఘ కవితలు ప్రకటించాడు. ముఖ్యంగా, టర్కీ దేశపు పల్లెల్లో, పట్టణాలలో ప్రజలు ఎంత స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవిస్తారో వర్ణిస్తూ హిక్మత్ రాసిన ‘Human Landscape from my country’ టర్కీ ప్రజల అభిమాన గ్రంథంగా చాలా ప్రాచుర్యం పొందింది.
ప్రేమాస్పదుడైన కమ్యూనిస్టుగా, విప్లవకారునిగా టర్కీ ప్రజలు హిక్మత్ ను ఆరాధించినా, రాజ్యం మాత్రం అతడి మీద రక రకాల కేసులు పెట్టి అనేక మార్లు జైలు పాలు చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అతడి జీవితంలో ఎక్కువ భాగం, అయితే జైలులో లేదంటే ప్రవాసంలో గడిపాడు. 1938 నుండి హిక్మత్ చనిపోయేంత వరకు అతడి పుస్తకాలు టర్కీలో నిషేధిత పుస్తకాల జాబితాలో వున్నాయంటే అర్థం చేసుకోవొచ్చు, అతడి రచనలు రాజ్యాన్ని ఎంతగా బెంబేలెత్తించాయో!
చివరికి, 1951 లో టర్కీ ని శాశ్వతంగా విడిచిపెట్టి, తూర్పు యూరోపు మరియు రష్యా లలో మిగిలిన జీవితం గడిపాడు. టర్కీ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడంతో పోలాండు పౌరసత్వం స్వీకరించాడు. 1963 లో మాస్కోలో గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.
//విషాదస్వేచ్చ//
మీరు మీ చూపు పట్టుకుంటున్న దానిని పట్టించుకోవడం లేదు
మెరిసే మీ చేతుల శ్రమను వృధా చేస్తున్నారు
డజన్ల కొద్దీ రొట్టెలకు పిండి కలుపుతూ కలుపుతూ
ఒక్క రొట్టె ముక్కనూ రుచి చూడడం లేదు
మీరు బానిసలై బతికేందుకు సిద్ధపడి వున్నారు
ధనికులను మరింత ధనికులు చేసేందుకు కూడా
మీరు పుట్టిన మరుక్షణం నుండీ
మీరు బతికి వున్నంత కాలం
మీ చుట్టూ అబద్ధాలు అల్లే
యంత్రాంగాన్ని అమర్చి పెట్టారు వాళ్ళు
గొప్ప స్వేచ్ఛలో వున్నపుడు
నుదుటిపై వేలు ఆనించుకుని
సంకెళ్ళు లేని మనస్సాక్షి వుందనుకుంటారు
మెడ నుండి తెగ్గొట్టినట్టుగా తల సగం వొంగి పోయి
కాడల్లా వేలాడే పొడవైన చేతులతో మీరు
తీరుబడిగా నడుస్తూ గొప్ప స్వేచ్ఛగా వుంటారు
చేయడానికి పనేమీ లేని స్వేచ్చతో
స్వేచ్ఛగానే వున్నారు మీరు
అక్కున చేర్చుకుని, అపురూపంగా
దేశాన్ని ప్రేమిస్తారు మీరు
ఒకనాడు వాళ్ళు దేశాన్ని అమెరికాకు అప్పగిస్తారు
మీతో పాటు, మీ స్వేచ్చతో పాటు
అప్పుడు యుద్ధ విమానాలు ఎగిరే స్థలంగా
మారడానికి మీకు చాలా స్వేచ్చ వుంటుంది
అకస్మాత్తుగా మీరు ప్రకటించవొచ్చు
పనిముట్టుగానో, సంఖ్యగానో కాదు
ఎవరైనా సరే, మనిషిగా బతకాలని
వెంటనే వాళ్ళు మీ చేతులకు సంకెళ్ళు వేస్తారు
అరెస్టు కావడానికీ, జైలుకు వెళ్లడానికీ
అవసరమైతే ఉరికంబం ఎక్కడానికీ
మీకు కావలసినంత స్వేచ్చ
ఇనుప తెరలూ, చెక్క తెరలూ
పాటు వస్త్రాల తెరలూ
అసలే తెరలూ లేవు మీ జీవితంలో
మీరు స్వేచ్ఛను ఎంచుకునే అగత్యమే లేదు
మీరు స్వేచ్ఛగానే వున్నారు
కానయితే, ఇంత మనోహర నక్షత్రాకాశం కింద
ఈ స్వేచ్చ ఎంత దయనీయమో కదా
//స్త్రీలు //
మరియ దేవునికి జన్మనివ్వలేదు
మరియ దేవుని అమ్మ కాదు
భూమ్మీది అనేక మంది అమ్మలలో
మరియ కూడా వొక అమ్మ
మరియ వొక బిడ్డకు జన్మనిచ్చింది
భూమ్మీది అనేక మంది బిడ్డలలో వొక బిడ్డ
అందుకే, అనేక చిత్రాలలో
మరియ అంత అందంగా అగుపిస్తుంది
అందుకే, మన బిడ్డల మాదిరే
మరియ బిడ్డ మనకు అంత సన్నిహితుడు
మన స్త్రీల ముఖాలు
మన బాధల పుస్తకాలు
మన బాధలు, మన తప్పులు, మనం చిందించిన రక్తం
నాగలి వలె మన స్త్రీల ముఖాలపై మచ్చలు చెక్కుతాయి
కొలనులో ప్రకాశించే ఉదయాల వలె
మన సంతోషాలు
స్త్రీల కళ్ళల్లో ప్రతిబింబిస్తాయి
మన ఊహలు
మనం ప్రేమించే స్త్రీల ముఖాలలో కనిపిస్తాయి
మనం వాళ్ళని గమనిస్తామా లేదా అన్నది కాదు
వాళ్ళు మన ముందున్నారు
మన వాస్తవాలకు చాలా దగ్గరగా
లేక, అందనంత దూరంగా