జ్ఞానానంద కవి – 1

“విశ్వనాథ, జాషువాల ప్రభావాలు జ్ఞానానంద కవిని అభ్యుదయ కవి మార్గం కంటే భిన్నమైన నవ్యసంప్రదాయ మార్గానికే అంకితమయ్యేట్లు చేశాయి.” – జి. వి. సుబ్రహణ్యం.

ఇంటి పేరుతో కలిపి జ్ఞానాందకవి పూర్తిపేరు సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. జ్ఞానానందం పేరయితే కవి అన్న బిరుదు పేరుకు చివర చేరింది. 1922 జులై 16 న శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా పెదపెంకి గ్రామంలో జన్మించాడు. తల్లి పాపమ్మ తనకు రెండేళ్ల వయసులోనే మరణించింది. తండ్రి ఎల్లయ్య రైతు కూలి. కొద్దిపాటి స్వంత వ్యవసాయం కూడా ఉండేది. నాయనమ్మ లక్షమ్మ పెంచింది. మేనమామ గుంట యోహాను తన స్వగ్రామం పెంటకు తీసుకొని వెళ్లి చదువు చెప్పించాడు. అక్షరాలు దిద్దించటమే కాక భారత భాగవత రామాయణ గాధలు చెప్పాడు. భీముని పట్నంలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యం లో నడిచే బోర్డింగ్ స్కూల్ లో ఎనిమిదవతరగతి వరకు చదివాడు. అప్పయ్య శాస్త్రి,ఆదినారాయణ శాస్త్రి వంటి అధ్యాపకుల బోధన నుండి సాహిత్య, లక్షణ శాస్త్రాలు అధ్యయనం పట్ల ఆసక్తి పెంచుకొన్నాడు. ఎనిమిదవతరగతి తరువాత మిషనరీ ఆయనను క్రైస్తవ మతవిషయాల లో శిక్షణ పొందటానికి పంపింది. ఆ తరువాత కాకినాడ లో ఉపాధ్యాయ ట్రైనింగ్ పూర్తి చేసాడు. పాఠశాల సహాయోపాధ్యుడుగా అలజంగి పాఠశాలలో చేరి అనారోగ్య కారణాలవల్ల మేడపల్లి గ్రామపాఠశాలకు బదిలీ అయ్యాడు. అక్కడే ఆయన సృజన సాహిత్య రచన ప్రారంభం అయింది. తన సాహిత్య కృషిని తండ్రి మెచ్చి ప్రోత్సహించ లేదని కాస్త నిరాశ పడ్డా నిలదొక్కు కొన్నాడు.

విజయనగరం ఎలిమెంటరీ పాఠశాలలో పనిచేస్తూ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి, కొత్తపల్లి పున్నయ్యల స్నేహంలో సాహిత్య సృజనకు మెరుగులు పెట్టుకొన్నాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆ కాలంలోనే అక్కడ జరిగిన సన్మాన సభలో జ్ఞానానంద కవికి ‘కవి’ అన్న బిరుదు ప్రదానం జరిగింది. 1954 నాటికి కాకినాడలో మెక్లారిన్ హైస్కూల్ లో తెలుగు ఉపాధ్యాయుడుగా స్థిరపడ్డాడు. 1955లో మే 18 న సుగుణమణి ని పెళ్లిచేసుకొన్నాడు. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు. 1991 లో మే 5 న జ్ఞానాందకవి కి భార్యావియోగం సంభవించింది. 2001 జులై 17 న ఆయన 80 వ పుట్టిన రోజు వేడుకలు త్యాగరాజ గాన సభలో జరిగాయి. సాహితీ సమాఖ్య (1967) సాహిత్య కళాపీఠం (1972)జాషువాకవి సాహిత్య పీఠం (1980) స్థాపించి సాహిత్య సేవ చేసాడు. 2011 జనవరిలో మరణించాడు.

జ్ఞానానందకవి సహాయనిరాకరణ ఉద్యమ ప్రారంభకాలంలో జన్మించాడు. పాతికేళ్ల నవయౌవనంలో దేశానికి స్వతంత్రం రావటం చూసాడు. దానినుండి కవితోత్తేజం పొందాడు. విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలుస్తున్నది ( ఆమ్రపాలి 1974 కవి పరిచయము) అది కూడా ఆయన కవిత్వంలో ప్రతిఫలించింది. వీటన్నింటికన్నా జాతీయోద్యమ కాలం నుండే దానికి సమాంతరంగానో, దానిలో పాయలాగానో సాగుతున్న దళిత ఉద్యమ గతిని గమనిస్తూ వచ్చాడు. స్వాతంత్య్రం తరువాత అది తీసుకొన్న మలుపులు కూడా ఆయనకు ఆత్మీయమైనవే. అందువల్ల అది కూడా ఆయన కవిత్వానికి ప్రధాన వస్తువు అయింది.

జ్ఞానానందకవి పద్యకవి. ఆయన కవితా వ్యవసాయం 1944 లో తరంగమాల సంపుటితో మొదలైందని జివి సుబ్రహ్మణ్యం, 1947 లో వసంతగానం ‘ఆయన కవితా లతకు పూచిన తొలి ప్రసూనం’ అని శరత్ జ్యోత్స్నారాణి అన్నారు. మేడిపల్లిలో ఉండగా వ్రాసిన దీనబంధు అనే సీసపద్య శతకం తరంగమాల తరువాతదో, ముందుదో అయి ఉంటుంది. కానీ అది అయన పుస్తకాల జాబితాలో లేదు. (డా. ఎస్. శరత్ జ్యోత్స్నారాణి కళాప్రపూర్ణ డా. ఎస్. టి. జ్ఞానానంద కవి జీవితము- వాజ్ఞ్మయ సూచి, 1994)
జ్ఞానాందకవి కవి అన్న బిరుదుతో మొదలుపెట్టి కవితావిశారద, కవి కోకిల, కవిలోక విభూషణ, విద్వత్కవి చూడామణి, సాహితీవల్లభ, మహాకవి, అభినవ జాషువా, సాహితీ కృషీవలా, కవితా శ్రీనాథ, పద్యవిద్యాప్రభువు, మొదలైనవి అందుకొన్నాడు. 1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ, 1975 లో ఆమ్రపాలి కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం, 1989 లో తెలుగు విశ్వవిద్యాలయం వారి బెజవాడ పట్టాభి రామిరెడ్డి పురస్కారం ఆయనకు లభించాయి. కనకాభిషేకం, గండపెండేరం తో సహా అనేక సన్మానాలు పొందాడు. 2001లో పద్మశ్రీతో గౌరవించబడ్డాడు. ఇదంతా ఆయన కవితా కృషికి జరిగిన సత్కారం.


1
“తొలి ఖండకావ్యము “వసంతగాన” మేనాడో యచ్చువడి కొలఁది దినాలలోనే యమ్ముడు పోయినది.” జ్ఞానానంద కవి పాంచజన్యము (1955) ముందుమాటలో (భూమిక) చెప్పిన మాట ఇది.వసంతగానం దేశానికి స్వాతత్య్రం వచ్చిన తొలి నాళ్లలో వెలువడిన పుస్తకం. ఈ సందర్భంలోనే విజయనగరంలో ఆయనకు సన్మానం జరిగింది. 1947 కు ముందే వచ్చిన తరంగమాల వలెనె ఇది కూడా అలభ్యం. అయితే ఈ కావ్యాన్ని ఉదయగిరి సీతారామస్వామికి అంకితం ఇచ్చినట్లు , ఇందులో భరతమాత, తెనుగుతల్లి , జైహింద్ మొదలైన ఖండికలు ఉన్నట్లు తెలుస్తున్నది.( శరత్ జ్యోత్స్నారాణి ) దేశానికి స్వతంత్రం వచ్చిన కొన్ని నెలలలకే గాంధీ హత్యచేయబడ్డాడు. (30 జనవరి 1948) ఆయన అమరత్వం కలిగించిన దుఃఖం నుండి గాంధీ కావ్యం వచ్చింది. (1950 ) దీనిని అయ్యదేవర కాళేశ్వర రావుకు అంకితం ఇచ్చినట్లు తెలుస్తున్నది. 1955లో వచ్చిన పాంచజన్యము ఖండకావ్య సంపుటి వెనక అట్ట మీద ఆయన ఇతర కృతులు గాంధి (అమరగీత), వసంతగానము, తరంగమాల పేర్కొనబడ్డాయి.

పాంచజన్యము కడపజిల్లా మంటపం వాస్తవ్యులైన పాల వేంకటసుబ్బయ్య సౌజన్యంతో ప్రచురించబడింది. అప్పుడు సహకార శాఖామాత్యులు అయిన దామోదరం సంజీవయ్యకు అంకితం ఇయ్యబడింది. నమస్సులు అనే శీర్షిక కింద పాల వేంకటసుబ్బయ్యను ప్రశంసిస్తూ అయిదు పద్యాలు , ఇరవై ఒక్క అంకిత పద్యాలూ వ్రాసాడు కవి. “జగసన్న్యాసి శ్రీ గాంధి సూత్రా దర్షోన్నత భావపున్ శిఖర మార్గాలంబి” అని దామోదరయ్యను పేర్కొన్నాడు. “ ఇది నా కూఁతురు “పాంచజన్యము” కళా హేరాళ సల్లక్షణా/భ్యు దయ + ఔద్ధత్య రస స్వరూపిణి, గుణాంభోరాశి ! సన్మార్గపున్/ జదువు న్నేర్చిన కన్య” అని పరిచయం చేసి “ నీ కళా/ భ్యా సము నీదు జాలిగల స్వాంతమునం గనిపెట్టి నీదు సా/వాసము గోరుకొన్నయది…” అని చెప్తూ “పిల్ల నిచ్చినాడ నిల్లాలిగా నీకు / మంచివాడవంచు మంతిరయ్య “ అని సంప్రదాయ పద్ధతిలో దామోదరయ్యకు కావ్యం అంకితం ఇచ్చాడు. ఆదిమాంధ్రుల మేల్కొల్పు జాతీయోద్యమం తో ముడిపడి ఉందన్న కవి భావం అంకిత పద్యాలలో ప్రతిధ్వనిస్తుంది. “ముదురు కులాల సాంఘికపు మోసములో బడి మ్రగ్గిపోయి/ పెన్ బదవలువడ్డ” స్వీయకుల ప్రతినిధిగా సంజీవయ్య సాధించిన అభివృద్ధికి ఆనందపడతాడు. గర్విస్తాడు.

ఈ కావ్యంలో 26 కవితాఖండికలు ఉన్నాయి. వాటిలో కవుల గురించిన ఖండికలు మూడు. విశ్వనాథ సత్యనారాయణను ప్రస్తుంచే కవిత దోసిలి. విశ్వనాథను గురుదేవుడు గా సంబోధించి తెలుగు కావ్యాలు అల్లేవాళ్ళు ఆంధ్రదేశంలో ఎందరో ఉన్నారు గానీ వాళ్ళెవరూ విశ్వనాథకు సములు కాలేరని అంటాడు. రెండవది శ్రీకృష్ణదేవరాయలు. కవి, కవి పోషకుడు అయిన కృష్ణరాయల నాటి కవుల కవితా కళా వైభవాన్ని ప్రస్తుతిస్తూ వ్రాసిన 12 పద్యాల ఖండికలో చివరి పద్యం ఒక మెరుపు. ఎంతటి సత్కవి చంద్రుడైనా కులం వల్ల క్రుంగి బాధపడే సమకాలపు సమస్య శ్రీకృష్ణ దేవరాయల భువనవిజయ కవి సభలో కూడా ఉన్నదా అన్న సందేహమూ కలిగింది. తాను అప్పుడుఆ సభలో ఉంటే ఎలా ఉండేది అన్న వూహ వచ్చింది. ఆ వూహ పరిణామరూపం ఈ పద్యం.
“కాలికి గండపెండేరము గట్టిన నీ సముఖాన నేను భూ
పాలక యున్నఁ గగ్గెర ను పాదముకుం దొడగంగ నాస రా
జాలదు కాని నాకు నెద (జక్కని కైత వసంతకాల వృ
క్షాల వసించు కోయిలల గానము (దీయగ నాస గల్గెడిన్”
శ్రీ కృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన కవిత్వాన్ని మెచ్చి కాలికి గండపెండేరం తొడిగాడు కనుక ఆయన కొలువులో కవికి కూడా అలాంటి గౌరవం పొందాలని ఆశ కలుగుతుందా అంటే కలగవచ్చు. కానీ ఈ పద్యంలో కవి అలాంటి ఆశ రాజాలదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. తనకు ఆశ కలగవచ్చు కానీ ఒక దళితుడి కాళ్ళు పట్టుకొని గండపెండేరం తొడగటం రాజుగా శ్రీకృష్ణదేవరాయలలకు ఇబ్బందికరమే. అందువల్ల కవి అటువంటి ఆశ తనకు రాదని నమ్మకంగా చెప్పాడు. చక్కటి కవిత్వం చెప్పటం మీద, కవితాగానం మీదే అతని ఆశ అంతా. తిరుపతి వెంకట కవులలో ఒకరైన తిరుపతి వెంకటేశ్వర కవిని సంబోధిస్తూ అతని ప్రతిభాపాటవాలను ప్రస్తుతిస్తూ వ్రాసిన ఖండిక మరొకటి. కావ్యం, కవిత్వ శక్తి చుట్టూ అల్లిన కవితలు కావ్యకన్య, ఎరుక.

మహాభారత కథాగత పాత్రలు, కర్ణుడు, భీష్ముడు, కిరీటి కేంద్రంగా మూడుకవితలు ఇందులో ఉన్నాయి. అసమానతలు, అన్యాయం సహించలేని కవిహృదయం కర్ణుడిపట్ల కరిగి నీరవటం సహజం. ఆధునిక కవులకు, అందునా కుల అసమానతలకు అవమానానికి గురయ్యే దళిత కవులకు కర్ణుడి పట్ల అనుకంప సహజమైనది. జ్ఞానానందకవి కర్ణుడి కవిత అలా వచ్చినదే. భీష్ముడిని యుద్ధరంగంలో పాండవులు పడగొట్టిన తీరులోని అన్యాయమే భీష్ముడు కవితకు కీలకం. భారతయుద్ధం జ్ఞాతి యుద్ధం. రక్తసంబంధీకుల మధ్య యుద్ధం. ఈ పరిస్థితిలో అర్జునుడి యుద్ధ రంగ వైరాగ్యం వస్తువు కిరీటి విషాదం కవితకు.

దేశం, దేశ నాయకులు జ్ఞానానంద కవికి ఉత్తేజకరమైన కావ్యవస్తువు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలలోని ఉత్సాహం “ఎగురు చున్నది జగా మగరాల తొలిసంజ కళలీను మూఁడు వన్నెల పతాక “ వంటి పద్యాలలో తొణికిసలాడింది. నెహ్రు, సుబాసు బోసు, పటేలు, పొట్టి శ్రీరామములు. అంబేత్కర్ ఆయన కవిత్వంలో గౌరవాన్ని పొందారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీతో కలిసి నెహ్రు పాటు బడిన తీరును ప్రశంసిస్తూనే భిన్న కులాలు ఉన్న దేశంలో ధర్మం దూరమైన నేటి తీరును, పెరిగిన స్వార్ధాన్ని గమనించమని వేడుకొన్నాడు. అరుంధతీ సుతులను ప్రేమించి నివాసయోగ్యతలు కల్పించవలసిన అవసరాన్ని గుర్తుచేశాడు. పటేలు మరణాన్ని “కొంప చక్కదిద్దు కొడుకులఁ గన్నట్టి హిందూ మాతృక దురదృష్టం” గా భావించాడు. పొట్టి శ్రీములు ఆత్మాహుతికి దుఃఖిస్తూనే ఆయన ఏ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ తెలుగునాట ‘లంచాల నంగనాచి, జాతిభేదాలమ్మ జాతరమ్మ’ నర్తిస్తున్నాయని వాపోయాడు కవి. అంబేత్కర్ ఖండికలో ఆయన విద్యను, విజ్ఞానాన్ని, జాతి శ్రేయస్సు కోసం జరిపిన పోరాటాన్ని ప్రస్తుతించాడు. “కుటిల కుల పిశాచి పటు దర్పము నణంచ” వీరకంకణము కట్టాడని హృదయానికి హత్తుకున్నాడు. నిజానికి జ్ఞానాందకవి గాంధీ కి అభిమాని. ఈ సంపుటి లోని చాల కవితలలో ఆయనను జాతి నాయకుడు అన్న గౌరవంతో ప్రస్తావించాడు. నెహ్రు మొదలైన వారిని ఎవరినైనా ఆయన అనుయాయులుగానే భావించాడు. కానీ అంబేత్కర్ దగ్గరకు వచ్చేటప్పటికి గాంధీ ఆయనకు ఆనడు. ఈ పద్యం అందుకు నిదర్శనం.
“కోమటి ఎత్తుతో దొరల కొల్వున వాదము సల్పి భారత
క్షేమముఁ గోరుకొన్న ముని సిద్ధుని గాంధినెదిర్చి పంచమ
క్షేమముకై శ్రమించిన విశిష్ట గుణాలయ!నీ కతాన మా
కీ మెయి సౌఖ్యమబ్బెను మరేరికి (గావాలె మా విశేషముల్ “గాంధీని ఏదిర్చిన అంబేత్కర్ పై ఆయన గౌరవాభిమానాల ప్రకటన ఈ పద్యం. “గాంధీ దేశమునందు నిమ్నజులకున్ గంజైన లేకున్నచో హిందూ సంఘము వీడుటే సొబగు” అని అంబేద్కర్ మార్గం అనుసరణీయం అని సూచిస్తాడు.
తెలుగుతల్లి, రాష్ట్ర విజయ దుందుభి వంటి కవితలు ఆయనలోని తెలుగువాడి ని చూపిస్తాయి. తెలుగుతల్లి నన్నయ తిక్కన పోతనల కాలం నాటి కీర్తిని తిరిగి సంపాదించాలని ఆకాంక్షిస్తాడు. కుల భేదాలతో కునారిల్లుతున్న బిడ్డలమధ్య వైరుధ్యాలు చక్కదిద్దమని తల్లిని కోరుకొంటాడు. కలిసి ఉండటం నేర్పమంటాడు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు ఆనందకరమే కానీ పుత్రుల గుండెలలో సమరస భావ బీజ వ్యాప్తి గురించి, సంపదకు దూరంబైన కడగొట్టు కన్నవాని గురించి తెలుగుతల్లిని హెచ్చరించకుండా ఉండలేకపోయాడు. బొబ్బిలి, విజయవాడ వంటి ప్రదేశాలు ఆంధ్రదేశంలో ఆయనకు ఆత్మీయమైనవి. ఆత్మాశ్రయ అనుభూతి కేంద్రకాలుగా అవి ఆయన కవితలకు వస్తువు అయ్యాయి.

ఇక కులం గురించి, పేదరికం గురించి జ్ఞానానంద కవి అభిప్రాయలు , దృక్పథం అనేక ఖండికలలో వ్యక్తమైనాయి. ప్రభూ అనే ఖండిక ‘మిణుకు మిణుకని మెఱసెడు కునుకుదీపం’ ఉన్న కుటీరం లోని పేదబ్రతుకు ఘోష. “ప్రకృతిలో సమస్త వైభవాల నిమిడ్చి / నాదు భాగమింత నాకు నీక /లేమిలోన నేల ? కామమ్ము పుట్టించి / చావుదెబ్బ గొట్టినావు తండ్రి” అని సంపద పరాయీకరణకు గురైన వాళ్ళ పక్షాన భగవంతుణ్ణి నిలదీసాడు. కృపాభిక్ష ఖండిక హిందూ మాతను సంబోధిస్తూ వ్రాసినది. కన్నబిడ్డల మధ్య కులాల వైషమ్యం పరిష్కరించవా అని అడుగుతాడు. “ ‘మిసిమి వెలార్చు నా పసిడి మేడల నీడల లోన నాకటన్ విసిగి విసింగి దేహములు వీడిన పేదల మస్తకముల’ గురించి ప్రస్తావించాడు. శాసనాలవల్ల నిందా రూపకమైన భేదాలు పోగొట్టటం వీలైందా అన్న ప్రశ్నను కూడా సంధించాడు.

కృతజ్ఞత అనే ఖండికలో ఒక సీస పద్యం దళిత ఆర్తిని ప్రతిబింబిస్తుంది. “ పంచమ శబ్దంబు ప్రళయాగ్ని కీలలో దగ్ధమైపోయె నా ధన్య తనువు / యుగయుగంబులనుండి పగవాని హస్తాన నలిగి జీర్ణించె నా కలిమి బలిమి /కొఱగాని శాసనోత్కర బంధనపు చాయ చాటున మణగె నా చదువు సంధ్య / ఆలంబ మిసుమంతయైన లేని కతాన యుడిగి చల్లారె నా యూహ శక్తి / అంటూ దళితులు ఈ సమాజంలో ఎన్నింటికి పరాయీకరింపబడ్డాడో చెప్పుకొచ్చాడు. యుగయుగముల నుండి దళితులకు పగవాళ్ళు అంటే అగ్ర వర్ణ హిందువులే అన్నది ఇందులో సూచ్యం. నిరాశ అనే ఖండికలో కులం వల్ల, కులం పట్ల కవిలో కలిగిన అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

“ఎవడు సృష్టించినాడో ? యస్పృశ్యజాతి /కలదే? వానికి శాంతి స్వర్గమున నేఁడు / నెందరెందరు చితికెక్కి యేడ్చినారో ?/ ఇంక నెందరు చితికెక్కి యేడ్తురొక్కొ” అని అంటరాని వారినిగా కొందరిని చేసిన కులవ్యవస్థ హింసా స్వభావాన్ని ఏవగించుకొన్నాడు. దేశమాతను సంబోధిస్తూ కొడుకులు ఖద్దరు ధారులై స్వాతంత్య్రం తెచ్చారు సరే నీవు ఎడం పెట్టిన జాతివారి శాంతి సౌఖ్యాల మాటేమిటి? అని నిలదీస్తాడు. ‘సమగ్రపుం భారతరాజ్యంబందు’ తమకు గుర్తింపు, గౌరవకరమైన జీవితం లభిస్తుందనుకొన్న దళితుల ఊహలన్నీ, ఆశలన్నీ అడుగంటిన స్థితిని అనుభవం నుండి ఆరేడుఏళ్ళలోనే గ్రహించి వేదనపడటం జ్ఞానాందకవి కవిత్వంలో( స్వేచ్ఛా కాంక్ష) కనబడుతుంది. వర్ణభేదాలు, అవినీతి, లంచగొండి తనం , నల్లబజారు వ్యాపారం సమాజపు చీడలుగా 1955 నాటికే పైకి తేలి ఆందోళనకరంగా తయారైందని పాంచజన్యం దిక్కులకు చాటింది.

ఈ ఖండకావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ విపులమైన పీఠిక వ్రాసాడు. జ్ఞానాందకవికి వున్న కవికోకిల, కవితా విశారద అన్న బిరుదులు ఎలా సార్ధకలో ఖండకావ్యంలోని పద్యాలను ఉదహరిస్తూ వివరించాడు. కవికోకిల అనే బిరుదు మధురంగా కవిత్వం వ్రాసే శక్తిని, కవితావిశారదా అన్న బిరుదు రచనారహస్యం తెలిసిన లక్షణాన్ని సూచిస్తుందని నిర్వచించి ఆ నిర్వచనాలకు అన్వయిస్తూ జ్ఞానానంద కవి భావనా శక్తిని, ఆలోచనా లక్షణాన్ని, పద్యనిర్మాణశక్తిని నిరూపించాడు విశ్వనాథ. మతం చేత క్రైస్తవుడైన జ్ఞానాందకవిలో భారతీయలక్షణం సజీవంగా నిలిచే ఉందని విశ్వనాథ ఆనందించాడు. కర్మ సిద్ధాంతాన్ని సమర్ధిస్తూ కవిత్వం వ్రాసిన సందర్భాలను, “అఖిల భారతమునకు దివ్యామృతంబు( /జెపి రక్షించు గోమాత “ (హితబోధ ) వంటి పద్యాపంక్తులను ప్రస్తావిస్తూ అదంతా భారతజాతి లక్షణమని తీర్మానించాడు విశ్వనాథ.

(ఇంకావుంది)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply