జైల్లో వేశాక: నజీమ్ హిక్మత్

టర్కీ కవి, రచయిత నజీమ్ హిక్మత్ (1902-63) రొమాంటిక్ కమ్యూనిస్టు/ రొమాంటిక్ విప్లవకారుడిగా ప్రసిద్ధి పొందాడు. విప్లవ కమ్యూనిస్టు రాజకీయ భావాలని కలిగివున్న నేరానికి సుదీర్ఘ కాలం జైళ్లలో గడిపేడు. రష్యన్ విప్లవం పట్ల ఆకర్షితుడై మాస్కో యూనివర్సిటీకి వెళ్ళాడు. టర్కీ స్వాతంత్ర్య యుద్ధం తర్వాత టర్కీకి 1924లో తిరిగి వచ్చి, వామపక్ష భావాలున్నందుకు అరెస్టయ్యాడు. 1926లో జైలు నుంచి తప్పించుకుని రష్యాకి వెళ్ళిపోయి మళ్ళీ 1928లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పదేళ్ల కాలంలో ఐదేళ్లు జైళ్లలోనే గడిపాడు. పోస్టర్లు అతికించాడనే ఆరోపణ మీద 1933లో నిర్బంధించి, సాక్ష్యాలు లేకపోవడంతో వదిలేశారు. 1929 – 36 మధ్య ఏడు సంవత్సరాలకాలంలో ఐదు సంకలనాలు, నాలుగు సుదీర్ఘ కవితలు కలిపి మొత్తం తొమ్మిది సంపుటాల కవిత్వాన్ని ప్రచురించాడు. ఒట్టోమన్ సంప్రాదాయ సాహిత్య సంప్రదాయాలని తిరస్కరించి, టర్కిష్ కవిత్వ సరళినే విప్లవీకరించాడు. తన కవిత్వం ద్వారా టర్కీ సైనికుల్ని తిరుగుబాటుకు రెచ్చగొడుతున్నాడనే నేరంపైన 1938లో అరెస్టుచేసి 28 సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

తాను అనుభవించిన హింసల గురించి, చిలీ కవి పాబ్లో నెరుడా మాటలు: “టర్కీ నావికాదళ సైనికుల్ని రెచ్చగొడుతున్నాడనే నేరారోపణతో నజీమ్ ని దారుణమైన శిక్షకు గురిచేశారు. విచారణని ఒక యుద్ధనౌకలో నిర్వహించారు. నౌక అంచున తనని బలవంతంగా నడిపించి, నడవలేని, కనీసం నిలబడలేని స్థితికి చేరుకున్నాక తనని మరుగుదొడ్లలో పడవేశారు. అందులో మలమూత్రాలు మోకాళ్ళ దాకా నిండి ఉండేవి. నా కవిమిత్రుడు తానింక తట్టుకోలేననుకున్నాడు. ఆ మలమూత్రాల కంపు కళ్ళుతిరిగి పడిపోయేలా ఉండేది. అప్పుడు, తనకి ఒక విషయం తట్టింది. నా శత్రువులు నన్ను చూస్తూ వున్నారు. వాళ్ళు నేను పడిపోవడాన్నే చూడాలనుకుంటున్నారు. నేను బాధ తట్టుకోలేక పోవడాన్ని చూడాలనుకుంటున్నారా. ఈ ఆలోచన వచ్చాక తనకి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. పాడడం మొదలుపెట్టాడు. మొదట లోగొంతుకలో, ఆ తర్వాత పెద్దగా, ఇంకా తర్వాత మరింత బిగ్గరగా పాడడం మొదలుపెట్టాడు. అన్ని పాటలనే పాడాడు. తనకి గుర్తుకొచ్చిన ప్రేమ గీతాల్ని ఆలపించాడు. తన కవితలు, రైతుల పాటలు, యుద్ధగీతాలు అన్నీ ఆలపించాడు. తనకి తెలిసిన, తనకి గుర్తుకొచ్చిన గీతాలన్నిటినీ గొంతెత్తి ఆలపించాడు. తన చుట్టూ పరుచుకున్న ఆ పంకిలాన్నీ, తనని హింసిస్తున్న పాలకులనీ కవిత్వంతోనే ఓడించాడు.”

నజీమ్ హిక్మత్ జైలులో విస్తృతంగా రాశాడు. 1948లో నజీమ్ హిక్మత్ విడుదల కోసం పికాసో, పాల్ రోబ్సన్, సార్త్రే వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కమిటీ ఏర్పడింది. 1950లో తనని విడుదల చేశారు. మళ్ళీ ఏడాది తిరగకుండానే నిర్బంధాలు, రెండు హత్యా యత్నాలు జరిగేయి, యాభై ఏళ్ళ వయసులో తనకి నిర్బంధ సైనిక విధుల్ని అప్పగించారు, రష్యా సరిహద్దుల దగ్గర. ఆ మండుటెండలో అరగంట సేపు నిలబడితే చచ్చిపోతావు నువ్వు, అయినా నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావని నేను సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉందని సైనిక వైద్యుడు తనతో చెప్పాడు. విధిలేని పరిస్థితులలో తప్పించుకు పారిపోయి మాస్కోలో తలదాచుకున్నాడు. ప్రవాసంలోనే కన్నుమూశాడు.

నజీమ్ హిక్మత్ తన కవిత్వం గురించి ఇలా చెప్పుకున్నాడు,
‘నేను నా గురించి మాట్లాడడానికీ,ఇంకొక మనిషితో మాట్లాడటానికీ, ఇంకా లక్షలాది మందితో మాట్లాడానికీ కవిత్వం రాయాలనుకుంటాను. ఒక్క యాపిల్ పండు గురించి, సాలు దున్నిన భూమి గురించి, జైలు నుంచి విడుదలైన ఒక మనిషి అంతరంగం గురించి, మెరుగైన జీవితం కోసం ప్రజల పోరాటాల గురించి, ఒక మనిషి భగ్న హృదయం గురించీ రాయాలని అనుకుంటాను. చావు అంటే భయపడడం గురించీ, చావును లెక్కచేయని ధర్యం గురించీ రాయాలని అనుకుంటాను.’

టర్కీ లో పాడుబడ్డ జైలు

నజీమ్ హిక్మత్ జైలు కవితలు మనుషుల సున్నిత అనుభూతులకీ, దృఢ సంకల్పానికీ నిదర్శనంగా నిలబడతాయి. ఒక కవితని ఇక్కడ చదవండి:

నన్ను జైల్లో వేశాక

నన్ను జైల్లో వేశాక
భూమి సూర్యుడి చుట్టూ పదిసార్లు తిరిగింది
భూమిని అడిగి చూడు
‘అదేమంత సమయం కాదు-
అది అతికొద్ది కాలమేన’ని అంటుంది
నన్ను అడిగితే,
‘అది నా పది సంవత్సరాల జీవిత కాలం’ అని అంటాను
నన్ను జైల్లో వేసినప్పుడు
నా దగ్గర ఒక పెన్సిల్ ఉండేది,
వారం రోజులలో అరిగి పోయిందది
ఆ పెన్సిల్ ని అడిగి చూడు,
‘అది ఒక జీవిత కాలం’ అని చెబుతుంది
నన్ను అడిగితే
‘వారం రోజులు, అదొక విషయమా’అంటాను

నేను జైల్లోకి వచ్చాక
హత్యా నేరానికి
ఉస్మాన్ ఏడున్నరేళ్ళశిక్ష అనుభవించి విడుదలై వెళ్ళిపోయాడు
బయట కొన్ని రోజులు గడిపి
స్మగ్లింగ్ నేరానికి మళ్ళీ లోపలికి వచ్చాడు
ఆరు నెలల శిక్ష అనుభవించి, మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు
నిన్ననే తన దగ్గర నుంచి ఉత్తరం – పెళ్లయ్యింది
వచ్చే వసంత కాలానికి తనకొక బిడ్డ పుట్టబోతోంది

నన్ను జైల్లో వేసిన ఏడాదిలో
పుట్టిన పిల్లలకి
ఇప్పుడు పదేళ్లు వస్తాయి
అప్పుడే పుట్టి, నడవడం నేర్చిన సన్నని పొడవు కాళ్ళ గుర్రపుపిల్లలు
ఇప్పుడు బహుశా బలిష్టమైన గుర్రాలుగా ఎదిగి పిల్లలని కూడా పుట్టించి ఉంటాయి
అయితే, ఆలివ్ మొక్కలు మాత్రం
ఇంకా చిన్న చెట్లుగానే వుంది ఉంటాయి
నన్ను జైల్లో వేశాక
దూరాన వున్న మా వూళ్ళో
కొత్త కూడళ్ళు ఏర్పడి ఉంటాయి
నాకు తెలియని వీధిలో
నేను చూడని ఇంట్లో
ఇప్పుడు నా కుటుంబం నివసిస్తుంది

నన్ను జైల్లో వేసిన ఏడాదిలో
రొట్టెలు దూదిపింజల్లా మెత్తగా, తెల్లగా ఉండేది
ఆ తర్వాత రొట్టెలు దొరకక రేషన్ లో పంచేవాళ్ళు
పిడికెడంత మాడిపోయిన నల్లటి రొట్టెముక్క కోసం
ఇక్కడ మనుషులని హత్య చేసేవాళ్ళు

ఇప్పుడది బాగానే దొరుకుతోంది
రుచీ, పచీలేని నల్లటి రొట్టె

నన్ను జైల్లో వేసిన ఏడాది
అప్పటికింకా రెండో ప్రపంచ యుద్ధం మొదలు కాలేదు

దాచౌ క్యాంపులో శవాలని గుట్టలుపోసి కాల్చడం ఇంకా మొదలు పెట్టలేదు
హిరోషిమా నగరంపై అణుబాంబులింకా వేయలేదు
పసిపాప తెగిన గొంతునుంచి కారే రక్తంలా కాలం ప్రవహించింది
ఆ అధ్యాయం అధికారికంగా ముగిసిపోయింది
ఇప్పుడు అమెరికన్ డాలర్లు మూడవ ప్రపంచ యుద్ధంగురించి మాట్లాడుతున్నాయి

అయినా, నను జైల్లోకి నెట్టాక
రోజులు తేలికగా మారిపోయాయి
‘చీకటి అంచుల నుంచి
బలమైన చేతులతో భూమిని తోస్తూ
వాళ్ళు లేచి నిలబడుతున్నారు, ఇంకా పూర్తిగా నిలబడలేకున్నా..

నన్ను జైల్లో వేశాక
భూమి సూర్యుడి చుట్టూ పదిసార్లు తిరిగింది
నేను అప్పటి అదే ఉద్వేగంతో వాళ్ళ గురించి
మళ్ళీ, మళ్ళీ రాస్తూ వుంటాను
నన్ను జైల్లో వేసిన నాటి ఉద్వేగంతో:
వాళ్ళు నేలపై చీమలదండులాగా లెక్క పెట్టలేనంత మంది
వాళ్ళు సముద్రంలో చేపలు
గాలిలో పక్షులు
వాళ్ళు పిరికివాళ్ళు, ధైర్యవంతులు
మూర్ఖులు, తెలివైన వాళ్ళు
పసిపిల్లలలాంటి వాళ్ళు
వాళ్ళు ధ్వంసం చేస్తారు
వాళ్ళే సృష్టిస్తారు

నా గీతాలు వాళ్ళ సాహసాల గురించే మాట్లాడుతాయి

మిగతావిషయాలు అన్నీ,
నా ఈ పదిసంవత్సరాల జైలు జీవితంలాగే
వట్టి మాటలు

(అనువాదం: సుధా కిరణ్)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

One thought on “జైల్లో వేశాక: నజీమ్ హిక్మత్

  1. నజీం హిక్మత్ ను పరిచెయడం ఈ సమయంలో అవసరం. 60 సం. పూర్వమే వున్న నిర్బంధ పరిస్తితులు నేడు మనం కల్లార చూస్తున్నాం.

    “నన్ను జైల్లో వేశాక
    భూమి సూర్యుడి చుట్టూ పదిసార్లు తిరిగింది..

    ‘అది నా పది సంవత్సరాల జీవిత కాలం’ అని అంటాను
    నన్ను జైల్లో వేసినప్పుడు
    నా దగ్గర ఒక పెన్సిల్ ఉండేది,
    వారం రోజులలో అరిగి పోయిందది
    ఆ పెన్సిల్ ని అడిగి చూడు,
    ‘అది ఒక జీవిత కాలం’ అని చెబుతుంది
    నన్ను అడిగితే
    ‘వారం రోజులు, అదొక విషయమా’అంటాను”

    యెంత బాగా పొల్చారో…… పెన్సిల్ జీవిత కాలం…..అదే వారం రోజులు కవికి…..
    అంటె జీవిత సారాన్ని కవి బాగ వ్యక్తీకరించాడు.
    ఇలాంటి కవులు ఎందరో జీవిత కాలలను త్యాగం చెసారు….. అందరికి జోహార్లు…..
    ఇలాంటి మరికొందరు కవులను సుధాకిరణ్ పరిచయం చేయాలని కొరికుంటూ…….. శ్రీను.

Leave a Reply