జాషువా కవిత్వం లోకి

తెలుగు వాక్యానికి వాడ సౌందర్యం అద్దినవాడు మహాకవి జాషువా. పుట్టుక కారణంగా మనిషిని అమానవీకరించిన కుల సమాజంతో పోరాడి గెలిచినవాడు. తనను ఎగతాళి చేసిన ప్రతి నొసటి మీదా పద్య రత్నాలు పొదిగాడు. పద్యాన్ని సమాజ సంస్కరణ కోసం వాడిన అసలు సిసలు ప్రజాకవి. అందుకే ఇన్నేళ్ళుగా ఆయన కవిత్వం ‘ప్రజల నాల్కల యందు’ జీవిస్తూనే ఉంది. తరం తరువాత తరం మీద పరిమితులు లేని ప్రభావాన్ని వేస్తూనే ఉంది. జాషువా కేవలం గొప్ప భావాల్ని మాత్రమే వ్యక్తం చేసి ఊరుకోలేదు. అవి ప్రజల నాల్కల మీద ఆడే తీరులో, వారు సొంతం చేసుకునే స్థాయిలో రాశాడు.

తనకాలంలో వస్తున్న కవిత్వానికి ప్రత్యామ్నాయ కవిత్వాన్ని రాసి మెప్పించినవాడు జాషువా. తన కవితా ప్రస్థానంలో ఎన్ని అడ్డంకులూ, అవమానాలూ ఎదుర్కొన్నాడో అన్ని నీరాజనాలూ అందుకున్నాడు. జాషువా కవిత్వ వస్తు విప్లవం తెలుసుకోవాలంటే ఆయన సమకాలీన కవిత్వం నుంచి ఆయన కవిత్వం ఎంత భిన్నంగా ఉందో చూడాలి. తాను రంగంలోకి దిగేసరికి తెలుగు కవిత్వంలో మూడు ధోరణులు ప్రధానంగా నడుస్తున్నాయి. కృష్ణ శాస్త్రి, రాయప్రోలుల నాయకత్వంలో భావకవిత్వం ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. విశ్వనాథ సత్యన్నారాయణ నాయకత్వం లో హిందూ సనాతన కవిత్వం మరోపక్క సవ్వడి చేస్తుంది. శ్రీశ్రీ నాయకత్వంలో అభ్యుదయ కవిత్వమూ ఉద్యమంలా వస్తుంది. ఈ మూడు ధోరణులకు భిన్నంగా రాస్తూ ప్రత్యామ్నాయ కవిత్వాన్ని సృష్టించాడు జాషువా. ఈ ప్రత్యామ్నాయతే ఆయన సాధించిన కవితా విప్లవం. ప్రేమనూ, విరహాన్నీ ఊహించి విలపించే భావకవిత్వం వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించాడు. విశ్వనాథ సనాతన హిందూ ధర్మాన్నీ ఎండగట్టాడు. ‘ప్రణయ కవి యొకండు, పాషాణ కవి యొక్కడు’ అని పై రెండు ధోరణుల కవుల్ని అధిక్షేపించాడు.’ నేనాచరించని నీతులు బోధించి/ రాని రాగము తీయగలేను నేను’ అంటూ అభ్యుదయ కవుల మీదా చురకలు వేశాడు.

తన కాలపు కుల, మత వాస్తవికతనూ, అంటరానితనాన్నీ, అంధవిశ్వాసాలనూ, పేదరికాన్నీ, దోపిడీనీ, స్త్రీల పీడననీ శక్తివంతమైన కవిత్వంగా మలిచాడు. ప్రకృతి మీదా, పిల్లల మీదా, ప్రేమా, కరుణల వంటి విలువల మీదా, కళల మీదా, మానవ అశాశ్వతత్వం మీదా, మరణం మీదా- ఇలా విభిన్న అంశాల మీద వైవిధ్యపూరితమైన కవిత్వం రాశాడు. వివిధ తరహాల పాఠకులు కనెక్ట్ కాగలిగే వస్తు విస్తృతి జాషువాది. విభిన్నత నుంచి విశ్వజనీనతను చేరుకున్న కవిత్వం రాయడం ద్వారా ‘విశ్వ నరుడ్ని నేను’ అని సగర్వంగా ప్రకటించుకోగలిగాడు.

ఒకపక్క రాయప్రోలు ‘పొగడరా నీదు తల్లి భూమి భారతిని /నిలపరా నీజాతి నిండు గౌరవము’ అని దేశభక్తిని గానం చేస్తుంటే జాషువా ఈ దేశాన్ని విమర్శించాడు. కులవ్యవస్థ తో పంచముల్ని పీక్కుతినే ఈ దేశం భయంకరమైనదని అన్నాడు.

“ఇది భయంకర దేశము
వర్ణభేదముల్ గూడలు గట్టినవనరాదు పంచమ జాతివారికిన్
కూడు హుళక్కి, మానవత గూడ హుళక్కి, హుళక్కి జన్మమున్”

నిచ్చెనమెట్ల కుల సమాజంతో మనుషుల్ని ఎక్కువ తక్కువలుగా విభజించి, పంచములకు ఆహారాన్నీ, ఆత్మగౌరవాన్నీ, మనిషితనాన్నీ నిరాకరించిన ఈ దేశం భయంకరమైనదని బాధతో ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చాడు. ‘లేదురా ఇటువంటి భూమి ఎందులేదురా/ మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక’, అని ఈ నేలనూ, ప్రజల్నీ బ్రాహ్మణ కవులు వైభవీకరించటాన్ని జాషువా తప్పు పట్టాడు. ఈ భూమి నీచమైనదనీ, ఈ పౌరులు కులోన్మాదులై దళితుల శ్రమను దోచుకునేవారనీ రాశాడు.

“నేను చిందులాడి నేను డప్పులు గొట్టి
యలసి సొలసి సత్తి కొలువు గొలువ
ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు
నీచమైన భూమి జూచినావె?”

అని అందుకే నిలదీశాడు. దళితుల గురించి దేశమూ, దళితేతరులూ ఏమనుకుంటున్నారనేది కాదు, దేశాన్ని గురించీ, తమను నిత్యం పీడిస్తున్న కులాల పౌరుల గురించీ దళితులు ఏమనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేశాడు కవి. అందుకే ఈయన దృక్కోణం ప్రత్యామ్నాయ దృక్కోణమయ్యింది.

ఇలా ఈవ్యవస్థ గురించి సంప్రదాయ కవులూ, మేధావులూ, నాయకులూ అల్లిన పవిత్ర భ్రమల్నీ, కట్టుకథల్నీ భగ్నంచేసే వాటి వెనకవున్న నిజాల్ని వెల్లడిచేయటంలోనే జాషువా ప్రత్యామ్నాయ దృక్కోణం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ పేరుతో హిందూమతాన్ని వైభవీకరిస్తే, జాషువా దానికున్న కుల స్వభావాన్ని బయటపెట్టాడు. దళితుల్ని అంటరాని వాళ్లుగా కసరి కొడుతూ ఆకలితో అలమటింపజేసిన హైందవ సంస్కృతిని గాఢమైన కవితాభివ్యక్తిలో పట్టుకున్నాడు:

” ఆ అభాగ్యుని రక్తమునాహరించి
ఇనుపగజ్జలతల్లి నర్తనము చేయు
కసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గు పడగల హైందవ నాగరాజు”

మనిషిని పశువుకన్నా హీనంగా జూసిన, చూస్తున్న చరిత్రను ఇంతకన్నా బలంగా ఎవరు చెప్పగలరు.

శ్రమ గురించీ, దోపిడీ గురించీ, అసమానతల గురించీ రాసినప్పటికీ, శ్రీశ్రీ వాటి ముఖ కవళికల గురించీ, నిర్దిష్ట రూపురేఖల గురించీ రాయలేదు. ఆ పని జాషువా చేశాడు. ఈదేశ వర్గ దోపిడీ కుల పెత్తనంలో భాగంగా ఉండీ, ఇక్కడ వర్గాలు కులాలలో మనుగడ సాగిస్తున్నాయనే అంబేడ్కరిస్టు అవగాహనను జాషువా సమర్థంగా పలికించాడు.

వాని రెక్కల కష్టంబు లేనినాడు
సస్య రమ పండి పులకింప సంశయించు
వాడు చెమటోడ్చి ప్రపంచమునకు
భోజనము పెట్టువానికి భుక్తి లేదు,”

అని ఈ దేశంలో దోపిడీ యొక్క నిర్దిష్ట రూపాన్ని స్పష్టంగా పట్టుకున్నాడు. ‘కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి/ స్వార్ధలోలురు నా భుక్తి ననుభవింత్రు’ అని దళితుడి చేత చెప్పించాడు.

కులవ్యవస్థ కారణంగా దేశాన్ని విమర్శించినప్పటికీ దేశప్రేమను జాషువా దాచుకోలేదు. బుద్ధుడినీ, గాంధీ నీ, అంబేడ్కర్నూ ప్రేమిస్తూ పద్యాలు రాశాడు. స్వాతంత్రోద్యమ అవసరాన్ని ఆకాంక్షించాడు. దళితుల్ని అగ్రకులాలు పీడించటాన్ని విమర్శించి ఊరుకోకుండా దళితుల్లో సఖ్యత లేని తనాన్ని కూడా ఎద్దేవా చేశాడు.

“వాని గుడిసె మీద వాలిన కాకి నా గుడిసె మీద వాలగూడదెప్పుడు
కాకులందు మాలకాకి మాదిగ కాకి
రూఢిసేయు మా విరోధములను”

అంటూ మాలమాదిగల విభేదాల్ని బయటపెట్టాడు. ‘దేవుడొక్కడు మాకు దేవళంబులు రెండు/ దేశమొకటి మాకు తెగలు రెండు’ అంటూ విమర్శించాడు. స్వతంత్ర భారతం దళితులకు రాజ్యాధికార భాగాన్ని తీసుకువస్తుందని విశ్వాసం వెలిబుచ్చాడు.

“వెరపు వలదు నీకు హరిజన సోదరా
స్వీయ రథము వెడలి వచ్చె
లాగికొమ్ము నీకు భాగంబు కలదంచు
పాడుచుండె రత్న భరతమాత”

ఇలా ఈనాటి దళిత రాజ్యాధికార భావనను ఆనాడు పలికించాడు.

కులమతాల విమర్శ తోనూ వేదనతోనూ ఆగిపోకుండా స్త్రీల పీడననూ ఎత్తిచూపాడు. స్త్రీలకు ‘ఎదిరింప జాలని చిలుకల చదువు నేర్పి’ బానిసలుగా పడుండే స్థితిని తెచ్చిన పురుష స్వామ్యాన్ని గట్టిగా ఎండగట్టాడు. స్మశానం మీద రాసిన పద్యాలతో మానవ జీవితాన్నీ, మరణాన్నీ తాత్వీకరించాడు. ‘ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు’ లాంటి బలమైన భావాల్ని స్మశానానికి ఆపాదించాడు. పలనాటిని ప్రస్తావిస్తూ, ‘గడ్డి మొలిచెను పులి చారల గద్దెమీద’ అంటాడు. ఇంత గంభీర కవిత్వం రాస్తూనే, మరొకపక్క జీవితంలోని అందాల్నీ, ప్రకృతి సౌందర్యాన్నీ కవిత్వంలో సున్నితంగా ప్రతిభావంతంగా పండించాడు. గిజగాడినుద్దేశించి,

“తేలిక గడ్డిపోచలను దెచ్చి రచించెదవీవు
తూగుటుయ్యేల గృహంబు మానవుల కెరీకి సాధ్యము కాదు”

అంటాడొకచోట. పసి బాలుడ్ని “గానమాలింపక కన్నుమూయని రాజు/ అమ్మ కౌగిటి పంజరమ్ము చిలక” అని అద్భుతంగా వర్ణిస్తాడు.

ఇలా జీవితంలోని పలు పార్శ్వాలను పదునైన వ్యక్తీకరణతో సాధికారికంగా, సజీవంగా తన కవిత్వంలో చిత్రించాడు జాషువా. నిండైన కవిగా పరిణమించాడు. అతి సామాన్యమైన మాటలూ, అంతకు ముందు కవులెవ్వరూ వాడని పదాలూ, పదబంధాలూ, నిత్యం జనం వాడుకలో ఉన్న పలుకుబడినీ ప్రయోగించి కవిత్వానికి సరికొత్త జీవశక్తిని ప్రసాదించాడు. అవమానించిన వారినుంచే అభినందనలు పొందాడు. ‘విశ్వ నరుడను నేను’ అని సగర్వంగా చాటాడు.

జాషువా సృజించిన కవిత్వాన్ని మొత్తంగా చూసినప్పుడు, ఆయన ప్రత్యామ్నాయ కవే కాదు పరిపూర్ణ కవి కూడా. రవీంద్రనాద్ ఠాగూర్ లా, సుబ్రమణ్య భారతిలా జాతీయ స్థాయి కవని నిస్సందేహంగా చెప్పొచ్చు. కవిత్వంలో కొత్త వస్తు హార్మ్యాల తలుపులు తెరవడం ద్వారా కవిత్వ సంస్కర్తగా నిలబడిపోయాడు. ఇవ్వాళ విస్తృతంగా వస్తున్న బహుజన కవిత్వానికి బాటలు వేసింది జాషువా కవిత్వమే. బహుజన భారతి సాహిత్య మూలాలకు చిరునామా జాషువా కవిత్వం.

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

17 thoughts on “జాషువా కవిత్వం లోకి

  1. జాషువా గారి ఫై రచించిన విమర్శ నాత్మక వ్యాసం పాఠకులు ను చక్కగా ఆకర్షిచి నది జాషువా గారి ధిక్కార స్వరం పద్య రూపంలో ఎలా రచించిచాలరో అలనాటి సాఘిక పరిస్థితులు ఎదురుకొని కవుల లో మేటి గా ఎలా వర్దిలిన తీరు కవితలు లతో చెప్పిన సమాధానం చక్కగా విశిదీకరిచారు చక్కగా వివరణ విమర్శ అందించి న లక్ష్మి నరసయ్య గారి కి మస్ఫూర్తిగా ధన్యవాదములు…. గూనుకుల మాలియాద్రి

  2. ఉన్పదున్నట్టుగ కవిత్వమల్లి గుండెలను పిండిన జాషువా కవిత్వాన్ని అంతే సూటిగా విశ్లేషించిన వ్యాసం….

  3. జాషువా కవిత్వరంగం లోకి వచ్చేసరికి సాహిత్యం లో మూడు ధోరణులు ఉన్నాయనేది చెప్పటమే కాకుండా దాన్ని సోదాహరణంగా చెప్పారు. ఒక కొత్త కోణాన్ని పాఠకులకు అందించారు.అభినందనలు.

  4. నిండైన విశ్లేషణాత్మక విమర్శ. మహాకవి జాషువాని తూచడం అంటే ఏ విమర్శకుడికైనా పెద్ద సవాలే. వారి కవిత్వాన్ని బహుముఖీయంగా సృశిస్తూ, సాధారణ పాఠకుడిని సైతం ఆలోచింపజేసేలా, సాహితీవేత్తలను అబ్బురపరిచేలా వ్యాసాన్ని హాయిగా నడిపించారు సార్. గతానికి వర్తమానానికి మధ్య చరించిన మీ అక్షరాలు భవిష్యత్తుకు శిలాక్షరాలు. పశువు నొక్కి సాటి మనిషిని తొక్కే దుర్నీతిని జాషువా నిరసించడం దగ్గర నుండి విశ్వ మానవుడు గా ఎదిగిన తీరును అద్భుతంగా అక్షరీకరించారు. ఈ సందర్భంగా వేదిక నిర్వాహకులకు, వ్యాస రచయితకు ధన్యవాదాలు. శుభాకాంక్షలు.

  5. నిండైన విశ్లేషణాత్మక విమర్శ. మహాకవి జాషువాని తూచడం అంటే ఏ విమర్శకుడికైనా పెద్ద సవాలే. వారి కవిత్వాన్ని బహుముఖీయంగా సృశిస్తూ, సాధారణ పాఠకుడిని సైతం ఆలోచింపజేసేలా, సాహితీవేత్తలను అబ్బురపరిచేలా వ్యాసాన్ని హాయిగా నడిపించారు సార్. గతానికి వర్తమానానికి మధ్య చరించిన మీ అక్షరాలు భవిష్యత్తుకు శిలాక్షరాలు. పశువును మొక్కి సాటి మనిషిని తొక్కే దుర్నీతిని జాషువా నిరసించడం దగ్గర నుండి విశ్వ మానవుడు గా ఎదిగిన తీరును అద్భుతంగా అక్షరీకరించారు. ఈ సందర్భంగా వేదిక నిర్వాహకులకు, వ్యాస రచయితకు ధన్యవాదాలు. శుభాకాంక్షలు.

  6. బావుంది విశ్లేషణ. స్పష్టంగా, సూటిగా, వాస్తవిక దృష్టితో మహాకవి జాషువా లోని సంపూర్ణత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అభినందనలు

  7. వాస్తవిక వ్యాసం..ఆలోచింపజేసేది గా ఉంది సార్

  8. జాషువ గారి కలం స్పృశించిన ప్రకృతి సౌందర్యాల గురించి కొత్త విషయాలు తెలిసాయి. విపులాత్మకంగా ఉంది సర్ వ్యాసం.

  9. తాకని అంచు లేదు
    చూడని లోతు లేదు
    చూపని లొసుగు లేదు
    తీయని ముసుగు లేదు

    మరింత ఘాటుగా, క్రిటికల్ గా వ్యాసం ఎక్స్ పెక్ట్ చేసా

  10. సర్!
    ఇందులో జాషువా గారి గురించి వ్యక్తీకరించిన విషయాలు ఇంతకు ముందు నేనెప్పుడూ విననివి… చడవనివి విభిన్నమైన విశ్లేషణ మీకు మాత్రమే సాధ్యమని మరోసారి!!
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  11. చాలా విలువైన వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు …అభినందనలు సార్

  12. జాషువాగారంటే నాకు మక్కువ . మీవ్యాసం చదివిన తర్వాత చిక్కనైంది 👏👏

  13. “గడ్డి మొలిచెను పులిచారల గద్దెమీద” అంటూ కులవ్యవస్థ నడ్డి విరుస్తూ, చిందులేసి నృత్యమాడిన శ్రమ జీవుల ఫలసాయాన్ని దోచుకునే దొరబాబులపై తిరుగుబాటు పిడికిలి బిగిస్తూ, జోల పాట పరవశంతో నిదురిస్తూ అమ్మ కౌగిలి పంజరంలో బంధీయైన పసివాని వర్ణనతో ప్రేమ స్వరూపాన్ని పంచుతూ, హైందవ విదానాలను ఎండగడుతూ విభిన్న పార్శ్వాలను స్పృశించిన కవితా ధీరుడు గుర్రం జాషువా గారిపై మీరు రాసిన వ్యాసం చాలా బాగుంది. అభినందనలు. 🌿🌿🌿

  14. సరళమైన భాషలో సామాజిక స్థితిని పద్యారూపంలో
    సందర్శింపజేసిన అరుదైన కవి గూర్చి అద్భుత పరిచయం.

Leave a Reply