గుండెలు బాదుకుంటున్న జాతీయ జెండా

మట్టి నుండి
మనిషి నుండి
పరాయీకరణ చెందిన రైతన్న
పత్తి చేన్లో ఉరేసుకున్నాడు

తాను బట్టకట్టించిన లోకం
నిర్దయను నగ్నంగా ప్రదర్శిస్తుంటే
‘ఓడిపోయానంటూ’ నేతన్న
మగ్గం మీదే ఒరిగిపోయాడు

చెమట, నెత్తురు కలిపి
దిమ్మె కట్టిన కూలన్న
బతుకెప్పుడు మారేదని కుంగిపోతున్నాడు

ప్రాణం పోసిన ఈ త్రిమూర్తులు
అంపశయ్య పై మూలుగుతున్న వేళ
ముఖానికి మూడు రంగులతో
నుదుటిన ధర్మచక్రంతో
వయసు ముడుతలు లెక్క చేయక
రెపరెపలాడుతుంటే
నల్లబారిన మనస్సుతో
జాతీయ జెండా తలదించుకుంటుంది

తరతరాలుగా సాగుతున్న
జెండా వందన తంతు
కాసింత త్వరగా ముగిస్తే
దింపుడు కల్లం ఆశతో
సాలు మీద సాలు దున్నుతున్న
బక్క రైతుకు బుడ్డగోసినై
రుణం తీర్చుకోవాలని
రణం చేస్తున్న రైతాంగం చేతిలో
పోరుజెండా కావాలని
గుండెలు బాదుకుంటున్నది.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

7 thoughts on “గుండెలు బాదుకుంటున్న జాతీయ జెండా

Leave a Reply