జమిడిక, కరీంనగర్ కవి కందుకూరి అంజయ్య ది.
కందుకూరి అంజయ్య తనది సబాల్ట్రన్ దృక్పథం అని చెప్పుకున్నారు. ఈ పుస్తకం లోని యాభైయైదు కవితల్లో దళిత, ఆదివాసీ, బహుజన, విప్లవానుకూల, ఫాసిస్టు వ్యతిరేక కవితలు కన్పిస్తాయి. తెలంగాణాను చిత్రించే కవితలతో పాటు స్త్రీల మీదా తెలిసిన వ్యక్తుల మీదా రాసిన స్మృతి కవిత్వం కూడా కన్పిస్తుంది. కవిత్వ కాలాన్ని చూస్తే 2013 నుంచి 2022 దాకా తొమ్మిదేళ్ళ పాటు రాసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పోరాటం, విప్లవోద్యమం మీద నిర్బంధం, ఆదివాసీ సంస్కృతి, దళిత జీవితం, కమ్ముకొచ్చిన ఫాసిస్టు ధోరణీ లాంటి వుద్యమాల కవిత్వం ఇందులో చోటు చేసుకున్నది.vఇవన్నీ చదువుతున్నప్పుడు తెలుగు లో ప్రగతిశీల వ్యక్తులు యిలా ఆలోచిస్తుంటారు కదా అనిపిస్తుంది. తమ కళ్ల ముందే నడిచిన అనేక ఉద్యమాలు ఆయా వ్యక్తులను తయారుచేసి వుంటాయి. వాటి ముగింపులూ, వాటిలో వచ్చిన కొత్త పరిణామాలూ లేదా బలహీనతలూ తమను కలవరపరచడమో, తమలో విమర్శనీయంగా మారడమో జరిగివుంటుంది, ఆ ప్రకంపనలు అక్షర రూపం తీసుకోకుండా వుండలేవు. సగటు తెలుగు ఆలోచనాపరుడు ఆ విధంగా స్పందించకుండా వుండలేడు. అంజయ్యది కూడా ఆ మార్గమే.
‘ఉగాదీ ఉగాదీ/ నీకూ నాకూ ఎంతెంత దూరం
నీకూ నాకూ తరతరాలుగా తరగనంత దూరం.’
అనే సత్యాన్ని నిష్టూరంగా గుర్తుచేసుకుంటూ…
‘పంచమ స్వరమని కొంచెం చేసిన మాకు..
స్వరమేళనల సయ్యాటల్లో సమత మమతల
సోపతి చేస్తావా?..
కోడీ కోడీ సలాం అంటే
నీ రోటికాడ నువ్వు నా రోటికాడ నేనంటావా?’ అంటూ
ప్రారంభ కవితలో ఉగాదిని నెపంగా చేసుకొని తరతరాల హిందూ వ్యవస్థ ను దళిత దృక్కోణం నుంచి ప్రశ్నిస్తాడు.
కందుకూరి అంజయ్య లో దళిత ఆదివాసీ బహుజన కోణం స్పష్టంగా కనిపిస్తుంది. దీని వెనుక అంబేద్కరైట్ దృక్పథం వుంది. అందుకే ‘ సూపుడువేలు సూర్యులు ‘ కవితలో మను ధర్మాన్నీ అది అములుచేసిన వర్ణ సిధ్ధాంతాన్ని నిరసిస్తాడు, ధిక్కరిస్తాడు. మను ధర్మం పాతచింతకాయ పచ్చడి, మా మీద ఆధిపత్యం చేయాలని చూస్తే సహించేది లేదని అంటూ,
‘వంచితే వాలం ముడుసుకొని వంగే
ఎనుకటి వానరులం కాము
ఆంక్షల ముళ్లకంచెలో ముడివేసి కదలకుండ కట్టడి చేస్తే
గురువును గుండ్రాతిగా భావించి
బొటనవేలు కోసిచ్చే ఏకలవ్యులం కాదు…
తాపసిగా మారి తామసాన్ని ఎదురించిన శంబూకులం
అన్ని అసమానత పీడనలను రూపుమాపే
సూపుడువేలు సూరులం.’ అని ప్రకటిస్తాడు.
అన్ని అసమానతలను రూపుమాపే సమూహ స్పృహ యీ కవికి వున్నందున విప్లవోద్యమాన్ని కూడా ప్రశంసాపూర్వకంగా చూస్తాడు. దాని కాంట్రిబ్యూషన్ గుర్తిస్తాడు. జగిత్యాల గురించి కవిత రాస్తూ విప్లవోద్యమాన్ని మనకు దృశ్యమానం చేస్తాడు.
‘ఎందుకో జగిత్యాల మనుషులను జల్లెడ పట్టి
నిలబడే వెన్నెముకకు నీరాజనం పట్టింది
ఊరు నిలువనీరును
చిలికి చిలికి నిప్పును చేసింది
గడీలను గాయి గాయి చేసి
గలుమ దాటితేనే ఊపిరినిలిచే గడియతీసుకొచ్చింది…
ఊరున ఉపాహారం చేసే గుంటనక్కల గుట్టు విప్పి
అప్పుకాగితాల గుట్టలకు అగ్గిపెట్టింది…’ అంటాడు.
విప్లవ కవి చైతన్య ప్రకాశ్ మరణం మీద రాసిన స్మృతి కవిత ‘ గుడిసె కొప్పు మీద జెండా ‘ లో విప్లవోద్యమం ఎదుర్కొంటున్న నిర్బంధాన్ని వివరిస్తాడు. అదే సమయంలో గద్దర్ మీద విమర్శ పెడతాడు. గద్దర్లో వచ్చిన మార్పును నిరసనగా, ప్రజావ్యతిరేకమైనదిగా గుర్తిస్తాడు.
‘యుధ్ధనౌకలు గద్దలతోని కలసి గంతులేస్తున్నాయి ‘ అంటాడు.
‘బతుకు పోరులో వెతల హారాన్ని మెడ నుండి తీసి
గడీల గల్మకాడ చిప్ప పట్టుకొని కూసున్నడు
మంది పాటలను చండ్రగాడ్పులుగా మలచి
సభలను రంజింపజేసిన అయ్యగారు
ప్రసాదానికి బమిసి ప్రాసాదానికి నడిచిండు…’ అని విమర్శిస్తున్నాడు.
కందుకూరి అంజయ్య లో గిరిజన ఆదివాసీ సమూహాల పట్ల అనురక్తి వుంది. అదే ‘మావానాటే మావారాజ్’ శీర్షికతో కొమురం భీమ్ మీద మంచి కవిత రాయించింది. కొమురం భీమ్ చేసిన సాయుధపోరాటాన్ని యీ కవిత ఎలుగెత్తి చాటుతుంది. అలాగే ‘దండరి’ కవితలో ఆదివాసీ సంస్కృతిని ఎత్తిపట్టాడు.
‘లొద్దుల్లో లోయల్లో
బొవుడల్లో బోడగుట్టల్లో
మోగే తుడుం మోతకు
గూడాలు గొంతు కలుపుతాయ్
దండరి దేవుళ్ల పున్నమ దాపు కస్తది…’అంటూ ఆదివాసీ ఆటా పాటను వివరిస్తాడు.
తెలంగాణాకే ప్రత్యేకమైన బోనాల పండుగ, బతుకమ్మ పండుగ యీ కవిత్వం లో చాలా సార్లు ప్రస్తావనకు వస్తాయి.ఆ సందర్భంలోనే జమిడిక జతుల విన్యాసాలు వివరిస్తాడు. “గ్రామదేవతలను కొలిసే/ ఊరి గొడుగులు/ పాట చెలిమెలు జమిడికలు.” అంటాడు.
అంజయ్య లో బహుజన ఆలోచనా ధోరణి యిమిడి వుంది. ‘గీతకాడు’ పేరుతో కల్లుగీత కార్మికుడి మీద కవిత రాసాడు’ మందారాల అంచులు ‘పేరుతో చేనేత మీద అనురక్తిని వ్యక్తం చేసాడు. అసలు యీ కవిలో చేనేత పరిభాష వుంది. ఏ వస్తువును కవిత్వం చేస్తున్నా చేనేత ఇమేజరీ కన్పిస్తుంటుంది. ఒక స్త్రీ గురించి కవిత్వం రాస్తూ
‘పోగుల పోకడలనూ
నాడెల వేడుకలను
నవ్వుతూనే పసిగడుతది ‘…
‘ఆసుపోతల శ్వాసలు నిలిపే
ఆలోచనలది’ అంటూ వర్ణిస్తాడు.
ఇంకో కవితలో…
‘దీని రంగుల దారాల మీద
చందమామల మందహాసాలు..
నింగిలో ఆరేసిన చీరల సింగిడీలు’
అంటాడు. ఇదంతా చేనేత పరిభాషనే.
అంజయ్య జమిడిక గానం లో విప్లవ పల్లవి వున్నట్టే బహుజన చరణం కూడా వుంది. ‘మూలం’ అనే కవితలో కాన్షీరామ్ బహుజన రాజకీయ నిర్మాణాన్ని చారిత్రక నేపథ్యం వివరించాడు.ఓటు హమారా, రాజ్ తుమారా నహీ చెలేగా నహీ చెలేగా నినాదాన్ని ఎత్తిపడుతూ
‘మనువాద భూతాన్ని
మట్టి కుండలో బంధించే మాంత్రికుడు
మేరునగధీరుల మెడలు వంచి
కంచుఢక్కాను పగులగొట్టే
కాన్షీరామ్ కాలు కదిపిండు’. అంటూ తెలుగు నేలపై బీసీల రాజకీయ చైతన్యాన్ని ఏకరువు పెడతాడు.
భారత రాజకీయాల్లో సంఘ్ పరివారం చేస్తున్న అరాచకాల పట్ల అంజయ్య లో కలవరపాటు వుంది. సంఘీయ్యుల చేతిలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వేష/ విభజన/ వివక్ష ల గురించి చాలా కవితల్లో నిరసన వ్యక్తం చేసాడు.
‘వివక్షను వీసమెత్తు తగ్గించక
అందరం బంధువులం
ధర్మజల బిందువులు మంటడు
అబద్ధపు అల్లిపువ్వులను ఏర్చి కూర్చి
అదే చరిత్రని హుంకరిస్తడు ‘.
ఇది ఫాసిస్టు శక్తుల కాలమని యీ కవికి స్పష్టంగా తెలుసు.
‘నిటారుగా నిలబడితే
నీడలను కూడా నిగరాని వెడుతడు
ఇది చీకటి శిఖరాలు చిగురించు కాలం
ఇది వెలుగును పాడే కోయిలలు వణుకుతున్న కాలం ‘.
అని అందుకే అంటాడు.
ఫాసిజాన్ని ‘వెయ్యి పుర్రెల మర్రి’ కవితలోనూ ‘కంచం చుట్టూ కంచెలు ‘ కవితలోనూ ఎండగడతాడీ కవి. ఫాసిస్టు శక్తులకు ప్రత్యామ్నాయంగా బుద్ధుడు బోధించిన బహుజన సమాజాన్ని కలగంటాడు.
‘భాషలు అనేకం సంస్క్రుతులు అనేకం
మతాలు అనేకం జాతులు అనేకం
అన్నీ కలసిన రంగుల హరివిల్లు
అదే భారతీయ ఆత్మ బహుళత్వంలో ఏకత్వం
ఏకత్వంలో బహుళత్వం
బహుజన సుఖాయ బహుజన హితాయ’
ఇదే భారతీయ సమాజానికి కావలసిందని ప్రగతిశీలురుగా మనమంతా అంగీకరిస్తున్నాం.
అంజయ్య లో గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం తెలంగాణా నుడికారం.
‘ఇక్కడ నియంత్రించే బుగ్గలు వెలగవు
నిగరానీ చేసే కాకులు అరవవు’ (రస్తా చౌరస్తా)
‘పళ్లెత్తి పలుకరించినా వాడు
పంట చేతికచ్చినంక పాలుకు నిలుసున్నడు’ (గుంటనక్క)
‘ఇంటిచుట్టూ తిరిగి ఈడ్గీల పడి
తానా అంటే తందానా అననందుకు
తనుగు తెంపుకొన్న పసరమైతడు’ (స్వంత గూటికి సాగనంపుడు)
‘అంగట్లో బెల్లం గుళ్లె లింగానికి సమర్పయామి
కొన్నది లేదు ఆరగింపు చేసింది లేదు’ (ఆలోచన -ఆచరణ)
‘ఈతాకిచ్చి తాటాకు గుంజెటోన్ని
తారీపు చేసుకుంట తాళాలు కొడుతున్నరు’ (ఇదీ సంగతి)
‘షేర్వాణి తొడిగి షేరి దారిని చేయలేదని
ఈ గింజుకునుడు ఈ గిచ్చుకునుడు’ (ద్వైదీ భావం)
‘కాశ పోసుకొని/ మోకు ముత్తాదులు
మోక సూసుకొని గుయికి గురి నేర్పుతడు’ (గీతకాడు)
‘మొదటి బుక్కలోనే/ కంకెడు రాయి వచ్చినట్టు
అనుకున్నదొక్కటైతే అయ్యింది మరొకటి’ (ఇచ్చుడా ఇచ్చుకపోవుడా)
‘పుట్టగొడుగులకు పురుడు చేసి
ప్రవాహానికి ఎదురీదుతున్నట్లు
పగటి కలలు కంటరు’ (పుట్టగొడుగులు)
‘వాడు అండ్లేము లేకున్నా సందెడు గోసి పెడుతడు
మాటలతోని మతపరిచ్చి బెల్లం ఎయ్యకుండానే
బూరెలు చేస్తడు (నల్లని గుండె)
ఇవన్నీ చదువుతున్నప్పుడు కవిత మధ్యలో చమత్కారంగా వుంటాయి. కవికి తన నుడి మీద వున్న పట్టును తెలియజేస్తాయి.
అంజయ్య లో సమూహ స్పృహను పట్టిచ్చే చాలా కవితలు యీ జమిడికలో వున్నాయి.సబాల్ట్రన్ దృక్పథంతో రాసిన చీపురు కవిత వుంది. మరాఠా రైతుల పాదయాత్ర మీద రాసిన ‘ లాంగ్ మార్చ్ ‘ ఉద్యమ కోణంలో మంచి కవిత. ‘ ముగిసిన యుద్ధం – బతికిన ఆశయం ‘ పేరుతో LTTE పోరాటం ముగిసిపోవడ గురించి వేదనతో యింకో మంచి కవిత రాసాడు. స్త్రీల శ్రమ మీద ‘ఆరుగాలం’, మెట్టినింటిలో ఆడపిల్ల స్థితి మీద ‘ ఏమో? ఎట్లుంటదో ‘ కవితలు రెండూ కవి స్త్రీ పక్షపాతాన్ని చెబుతాయి.
అంజయ్య కవిత్వాన్ని చదివినప్పుడు, జమిడిక లోని కొన్ని కవితలు సందర్భం తెలియక పోవడం వల్ల గజిబిజిగా అనిపిస్తాయి. కొన్ని కవితల ముగింపులు అసంపూర్తిగా వున్నాయనిపిస్తాయి. అంజయ్య లో కవిత ప్రారంభపు ఎత్తుగడ, కొనసాగింపు కుదిరినట్లుగా ముగింపులు కుదరలేదు. ‘ఇదీ సంగతి,’ ‘కూలిన బతుకులు,’ ‘ఇచ్చుడా? ఇచ్చుకపోవుడా’, ‘బరిపీఠం,’ ‘ఇరాం లేని రెక్కలు’, ‘మూలం’ కవితల ముగింపులు అసంబధ్ధంగానో, అసంపూర్తిగానో, నెగెటివ్ గానో, ముక్తాయింపు కుదరకుండానో వున్నాయి. ఉదాహరణకు మూలం కవిత కాన్షీరామ్ నిర్మించిన బహుజన సమాజ్ పార్టీ తెలుగు నేల మీద ఎలా తాత్వికంగా ఎదిగిందో ఆచరణలోకి ఎలా తర్జుమా అయ్యిందో తెలంగాణా వైపునుంచి కోస్తాంధ్ర వైపునుంచి వివరణాత్మక వర్ణించడం బాగానే వుంది. కవిత ఆఖరి నాలుగు భాగాలలో కోస్తాంధ్రలో బ్రిటిష్ పరిపాలనలో వచ్చిన సంస్కరణల గురించి సంస్కర్తల గురించి, బహుజన చేతనకు పాదులు వేసిన జాషువా, బోయ భీమన్న, ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వారి గురించి మాట్లాడుతూ ముగిస్తాడు. ప్రారంభమేమో బహుజన రాజకీయాల ఎదుగుదల, ముగింపేమో కోస్తాంధ్రలో బ్రిటిష్ పరిపాలనలో వచ్చిన సంస్కరణల ప్రభావం. రెండూ కలవలేదు. కవి ఏం ముక్తాయింపు యివ్వాలనుకున్నాడో అర్థం కాలేదు. నిజానికి ఒక లాంగ్ పోయెం కావాల్సిన విషయం వున్న కవిత యిది, ఎటూ కాకుండా అయిపోయింది. ఇలాంటి వాటి పట్ల శ్రధ్ధ పెట్టింటే యివన్నీ మంచి కండ కలిగిన కవితలు అయ్యుండేవి.
మొత్తానికి తెలంగాణా మారుమూల కవిని యీ జమిడిక ఎత్తిచూపింది. సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగిన ఒక ఆలోచనాపరుడిని మనకు పరిచయం చేస్తుంది. తెలుగు సమాజమనే కాదు మొత్తం భారతీయ సమాజం ప్రభావితమవుతున్న అనేక విషయాలు, ధోరణుల పట్ల స్పందిస్తున్న కవి హృదయం మనకు తెలుస్తుంది. తన స్వంత నుడికారంలో కవి చేసే వ్యాఖ్యానాలు ఎంత సమంజసమైనవో, ఎంత ప్రభావవంతమైనవో తెలుస్తాయి.
అంతిమంగా కవి హృదయం ప్రగతిశీల సమూహాలలోనే వుందనీ, విప్లవ దృక్పథంతో నడిచే బహుజన సమూహాలకు చాలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడనీ అవగతమవుతుంది. అందుకే ఈ కవిని అక్కున చేర్చుకోవాలనిపిస్తుంది.