జనం పాటకు వందనం

ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కు “కొలిమి” జోహార్లు అర్పిస్తోంది.

తెలుగు సమాజంలో గద్దర్ పాట, ఆట, మాట రెండు, మూడు తరాలను ప్రభావితం చేశాయి. తాను నమ్మిన సామాజిక న్యాయ సూత్రాల కోసం అనేక రూపాలలో ప్రజల కోసం తన జీవిత కాలమంతా పని చేశాడు. అతనే అనేక వేదికల మీద చెప్పుకున్నట్లుగా తన ప్రజా జీవితం “తల్లిలాంటి విప్లవోద్యమం”తో మొదలయ్యింది. గుమ్మడి విఠల్ రావ్ గద్దర్ గా రూపాంతరం చెందాక తెలుగు నేల మీద జననాట్య మండలి నాయకుడుగా సాంస్కృతిక ప్రభంజనం సృష్టించాడు. విప్లవ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించాడు. రాజకీయ విస్తరణ కోసమే కాదు, వాటిని సమాజంలో వున్న అట్టడుగు మనుషుల దగ్గరకు తీసుకుపోవడంలో గద్దర్ కృషి చాలా గొప్పది. గాఢమైన సిద్ధాంతాలను, సంక్లిష్టమైన రాజకీయ, సామాజిక, నిత్యజీవిత సమస్యలను ప్రజలకు అతి సులువుగా అర్థం చేయించే సాంస్కృతిక సృజనకారుడు గద్దర్. విప్లవంలో భాగంగానే కుల, వర్గ, లింగ, ప్రాంతీయ అసమానతలను, వాటి నిర్మూలకు జరగాల్సిన పోరాటాలను పాటలల్లాడు. ఒక మనిషి సమాజపు అంచులనుండి వచ్చి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసి, తాను జీవించిన కాలాన్ని ఇంతగా వెలిగించడం ఒక అద్భుతం. బహుశా గద్దర్ వంటి ఒక ఫినామినాన్ ప్రపంచ చరిత్రలోనే అరుదు.

గద్దర్ తన జీవితంలో అనేక ప్రయోగాలు చేశాడు. అనేక రాజకీయ వ్యక్తీకరణలు చేశాడు. అనేక సిద్ధాంత నిర్మాణాలకు, ప్రచారాలకు తన మేధస్సును, గొంతునిచ్చాడు. వాటిలో ఎంతో విశాల దృక్పథాలు ఉన్నాయి, ఇరుకు ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఎవరైనా ఎలాగైనా అంచనాలు వెయ్యొచ్చు. ఎందుకంటే ఆయన చేసినవన్నీ బహిరంగమే. అయితే అతను మొదటగా ఎంచుకున్న, తర్వాత మార్చుకున్న దారి ఏదైనా అన్నింటిలోను తాను స్థూలంగా ప్రజాపక్షం ఉన్నాడు. తన విప్లవోద్యమానంతర కాలంలో ఏ దారి ఎంచుకున్నా, గద్దర్ ను ఆయన అభిమానులు, ప్రజలు గుర్తుపెట్టుకునేది ఒక విప్లవ సాంస్కృతిక సేనానిగానే. విప్లవ ప్రచారంలో ఆయన చేసిన కృషి, అతను లక్షలాదిమందిపై వేసిన ప్రభావం అతను విప్లవానికి దూరమైనా చెరిగిపోనటువంటిది.

తెలంగాణ సామాజిక చరిత్రలో గద్దర్ ది ఒక విలక్షణమైన స్థానం. గద్దర్ మరణాంతర జీవితం కూడా ఆ చరిత్రను ప్రభావితం చేస్తూనేవుంటుంది. గద్దర్ పాట సామాజిక, రాజకీయ అసమానతలు ఉన్నంతవరకు ఉంటుంది. అమరుడు గద్దర్ కు మా ‘కొలిమి’ వందనాలు!

3 thoughts on “జనం పాటకు వందనం

  1. సుక్కలల్ల కలిసినావా, సూర్యుడల్లే మొలిసి రావా!!
    కామ్రేడ్ గద్దరన్నకు ఎర్రెర్రని దండాలు.

  2. Great guy /Lal salam gadder
    Meeting with BABU —kissing RAHUL GANDHI—believe in god —HE CROSSED THE LINES

Leave a Reply