చైతన్యపు నెలవంక

ఒడిసంచికట్టి ఊరేగించిన పీర్లని
ఊరిముందల హనుమాన్ దేవునికాడ
నిమ్మకాయల దిష్టితీసి, మొక్కిపించుకొచ్చే
సవర్కాని సోపతి సోబ్ధరిలా
మనుషుల మధ్య సోదర భావం ఉండాలి.

కాలిగజ్జలు కట్టి అలావు దుంకే
చిన్నపిల్లల మొదలు
జీవితం బరువు తెలిసిన ముసలోళ్ళ వరకూ
అందరూ రంగుల ధట్టిలవుతారు

ఇక్కడ
రౌండ్ టేబుల్ సమావేశాల చర్చలు
అస్సలే ఉండవు
అంతా కలుపుగోలు తనపు మాలిజ తీపి.

దట్టిలు కప్పి
ఊద్దనితో ఊదుపొగ లేపి
దోస్తరావ్ దిన్ చెప్పడానికి
మతం కాదు!
నెమలికన్నుల మనుషులు కావాలి.

ఇంటికొక మొద్దుతెచ్చి
అలైగుంతని అగ్నిగుండం చేసి
అసమానతల్ని తగలవేయడమే
మనిషి గెలిచే ఉదయం

యీ పీరుల మెడలో ఉన్నది
కుడకల దండ కాదు
అది సమానత్వపు మాల

పిల్లల్ని మధ్యలో నిలబెట్టి
బొడ్డెమ్మ వేయడానికి
అమ్మలక్కలంతా ఒకదగ్గరికి చేరిన
ఊరిముందల జాగ
కులమతాల గోడల్ని కూల్చిన,
చైతన్యపు నెలవంకలా ఉంటది.

చేనుల పనులన్ని తొందరగా ముగించుకొని
పగటి సరియతుకి హాజరు కమ్మని కబురెట్టే
చెట్టుమీది మైకుపిట్టల భాష వేరు
అయినా! చెవులకు
అమ్మా భీమి ఫాతీమల పాటలా
అందంగా వినిపిస్తది…

సజ్జరొట్టెలు తిని,
పీర్లని బాయికి సాగనంపి
ఒకరి బాధను ఒకరు
అలాయ్ – బలాయ్ తీసుకున్నట్టు
మనుషులమంతా
శాంతి గీతాన్ని ఎత్తుకోవాలి.

గ్రామం : దేవర్ ఫసల్ వాద్
మండలం : దౌల్తాబాద్
జిల్లా : వికారాబాద్
పిన్ కోడ్ : 509336
మొబైల్ నెంబర్ : 7675831976

Leave a Reply