చెరసాలలో చంద్రుడు

విరిగిపడుతున్న సముద్రపు అలలను వీక్షిస్తూ
ఇసుక తిన్నెల్లో ఇంకిన రక్తాన్ని
దోసిళ్లలో నింపుకునే మృదుభాషి
పగిలిన గవ్వల ఊసుల్ని పాటలుగ అల్లుకుంటాడు
భగభగ మండుతున్న పురాతన స్వప్నాన్ని శిరస్సుపై ధరించి
మునుంబట్టి దేశమంతటా
మాట్లాడుతాడు
తలలు తెగిపడుతున్నా
లేత ఎరుపు కాంతులే విరజిమ్ముతున్న
చలిచీమల ప్రస్థానాన్ని, కళ్ళముందర
అద్భుత దృశ్యకావ్యంగా చూపుతాడు

వెంటాడుతున్న కల
ఊయలలూగుతున్న
వెదురువనాల్లో
తననుతాను పోగొట్టుకుంటాడు
కాకులు దూరని కీకారణ్యంలో
రాలిన పువ్వుల ఆఖరి స్వరాల్ని
కిక్కిరిసిన జనారణ్యంలో
ఉద్విగ్న కంఠంతో విసర్జిస్తాడు

అంతా సహజంగా జరుగుతున్నట్టే వుంటుంది, నిజానికి
అసమ్మతిని అఖండ అబద్దాలతో మెలిపెడుతున్న
అసహన కల్లోల సమయమిది
శాంతిని వెదికే సముద్రహోరుపై
హూంకరిస్తున్నది మరుగుజ్జు రాతిగోడ
నిరసన ఆకాశాన్ని అమాంతం మింగాలని చూస్తుంది
అది నగ్నంగా మొరగడం స్పష్టంగానే వింటున్నాం
పాలిపోయిన దాని వికృత ముఖంపై
ప్రాణమున్న నాలుగు వాక్యాలు ఈటెలుగా విసరడం తప్ప
ఇంక, ఏ సాహసమూ ఎరుగని
ఒక సున్నిత సాంస్కృతిక సృజనకారుడతడు

సనాతన క్రూరత్వపు వాసన కమ్ముకున్న
చీకటి చెరసాలలో
మిరుమిట్లు గొలిపే అతని చూపంతా
ఇపుడు
సలసల కాగుతున్న కాలం పెదవుల పైనే…

పుట్టింది నల్లగొండ జిల్లా. కవి, అధ్యాపకుడు. విరసం సభ్యుడు. రచనలు: 'లాంగ్ మార్ఛ్', 'దండకారణ్యం ఒక ఆకుపచ్చని కల'

Leave a Reply