చూపున్న కుర్చీలు

చప్పుడు చేయకండి
మనం తర్వాత మాట్లాడుకుందాం
విరామం తర్వాత,
విశ్రాంతి తర్వాత
అనేకానేక ఆవులింతల తర్వాత
కుర్చీలు ఇప్పుడు నిద్రపోతున్నాయి.

ఆటంకపరచకండి
మనం తర్వాత చర్చించుకుందాం
మాటల కన్నా చర్చలకన్నా,
మనం చేసే తీర్మానాల కన్నా,
కుర్చీలకు దీర్ఘనిద్రలే ముఖ్యం.

తొందరపడి దేన్నీ తీర్మానించకండి
మన ఆలోచనలు మాటలు చర్చలు ఎప్పటికీ తీర్మానాలు కావు.
జనం కోసం కుర్చీలే తీర్మానించాలి
కుర్చీలకు కుర్చీల ఆలోచనలే… ముఖ్యం!

ఆలోచించినా, ఆవులించినా,
విరమించినా, విశ్రమించినా,
ఏం చేసినా
ఏంచేయకపోయినా,
దశాబ్దాలుగా ఆంక్షలు నియంత్రణలు, నిషేధాజ్ఞలు హద్దులు, సరిహద్దులు
కుర్చీల జాబితాలోనివే!.

స్వేచ్ఛ, ఊపిరులు, నిద్రలు,
మెలకువలు, సేవలు,
సౌకర్యాలు హక్కులు
ప్రాథమికంగానే ప్రైవేటీకరించబడ్డాయి కానీ,
ఆ జాబితాలోకి రాకుండా
దాగిందీ, దాచుకుంది…
పిల్లల కలలే.

కుర్చీల భాష వేరు

ఏదీ- అదుపులో
అజమాయిషీలో
పరిపాలనలో లేకపోవడం,
నియంత్రణ పరిధిలోంచి
హక్కుల జాబితాలో నుంచి
సమస్తం జారిపోవడమే
గతం, వర్తమానం.
ఒకటేమిటి, సమస్తం ప్రైవేటీకరించబడుతున్నాయి,
సేవల రంగం నిన్నటి కల
గాలి, నీరు, నేల, అగ్నీ, ఆకాశం
నిస్సందేహంగా ప్రైవేటీకరించబడ్డాయి కదా !?.

అయినా,
అన్నిటినీ మారుస్తూ
అన్నీ మారిపోతుంటే
పసిపిల్లల కల వేరేగా ఉంది.

కుర్చీలు మనుషులవటాన్ని,
లొంగి, వంగి, విరిగిన, ఆవలిస్తున్న నిద్రపోతున్న కుర్చీల స్థానంలో
ఎంత దూరమైనా నిశితంగా చూడగలిగే, వినగలిగే,
చెవులున్న చూపున్న
చురుకైన కుర్చీలను
పిల్లలు తాజాగా కలగంటున్నారు.

ఆలోచనలు,
అన్వేషణలే రేపటి
సరి కొత్త కలలు!.

పుట్టిన ఊరినే ఇంటి పేరుగా మార్చుకుని 1991 నుంచి కథ‌, కవిత్వం, నవల, విమర్శ రంగాల్లో రచనలు చేస్తున్నారు. మూడు కథా సంపుటాలు- 'గది లోపలి గోడ', 'చిగురించే మనుషులు', 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు', రెండు కవితా సంపుటాలు- 'మాటల్లేని వేళ', 'ఇద్దరి మధ్య', ఒక నవల- 'నేల నవ్వింది' వెలువరించారు. ఆంగ్ల భాషలోనూ కవిత్వం అచ్చయ్యింది. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య వ్యవస్థాపక కన్వీనర్.

Leave a Reply