చూపును కాపాడుకోవాలె

చూస్తూనే వుంటావా టివి ఎక్స్ ను
వాడు చూపేదంతా చూస్తూ చెప్పేదంతా వింటూ
నిర్వీర్యునివై నిస్తేజునివై నిర్నిద్రా పీడితునివై ఇంకా చూస్తూవుండు
ఛానళ్లు ప్రసారమవుతూనే వుంటయ్
నీ మెదడు నరాల నొరుసుకొని
నీ ఆలోచనలను నోట కరచుకొని
చేజేతులా నీ తలను ఇంటర్నెట్లో బంధించుకొని
ఇంకా ఫేస్బుక్ లనేం చదువుతావు
ఆకలి కన్నుల అభాగ్య నయనాల బాధల నీడను చూడు
నీ చూపు గురి తప్పని బాణం రా మనిషీ !
అగ్ని ముఖమై వెలిగి పో !!
మట్టి ముఖాల మీది చెమటను గమనించు
దారి తప్పకుండా వేడి తగ్గకుండా
ఎప్పటికైనా నీ చూపును కాపాడుకోవాలె
నీకే చూపు లేనపుడు రేపు ఎవరికేం దారి చూపుతావు?
మన ప్రపంచాల మన శరీరాల కొనసాగింపులు పిల్లలు
తప్పకుండా పిల్లలకొక చెరువును చూపించాలె
చెరువులో బుడుంగున మునకలేసే బాతులను చూపించాలె
చెంగలిచ్చే చేపపిల్లలను చూపించాలె
సముద్రం లేని చోట చెరువును
నదులు లేని చోట వాగును తప్పకుండా చూపించాలె
నయాగారా జలపాతం కాకున్నా
మా నాగసముద్రాల మత్తడిని చూపించాలె
గాయపడ్డ పావురాన్ని చేతుల్లోకి తీసుకొని
ప్రేమగా నిమురుతున్న సిద్ధార్థున్ని చూపించాలె
ఎండిన పంటముందు రైతు
తన రెక్కలను చూసుకొని బాధ పడే సమయాన
కలలు తీరక తలనొప్పితో కనిపించని పాలపిట్టను చూపించాలె
పొదల చాటున పొంచి వున్న పులి మీదికి
బాణాన్ని గురి పెట్టే విలుకాన్ని తప్పకుండా చూపించాలె
పిల్లల కనులు విరబూసిన సింగిడి పూలు
పుస్తకాల బరువుతో వంగిపోతున్న వాళ్ల వెన్నెముకను నిటారుగా నిలిపి
బయటి లోకం వైపుకు నడిపించుకెళ్లాలె
స్వార్థం కోరలతో సంచరించే మానవ మృగాలను చూపించాలె
కులం విషపు కాటుతో శాపగ్రస్తులైన వెలివాడల మట్టిమనుషులను
అడుగడుగున గాయాలైన పీడితులనూ చూపించాలె
భూమికి ఇరవై అడుగుల ఎత్తులో సన్నని ఇనుపతీగమీద నడిచే
ఆరేండ్ల పసిపాపను చూపించాలె.
బతుకు తలక్రిందులను ఈ భూమిక్ మరోవైపునూ చూపించితీరాలె
కోడికూతనూ కోయిల పాటనూ వినిపించి
ఎగిరే పిట్టల దారుల వెంట పిల్లల చూపులను ఉరికించాలె
మనకైనా పిల్లలకైనా ఎక్కడి ఏడుపునైనా ఒక్కసారి వినే మనసొకటి వుండాలె
రూపాయి గీరెలు వారి తెగిన రెక్కలను చూసే చూపొకటి వుండాలె
ముండ్లదారుల్లోంచి నడిచే క్షతగాత్రులను ప్రేమతో స్పర్శించే చేతులు కావాలె
కుట్రలను పసిగట్టే మెలకువ వుండాలె
అన్నింటా వున్నదున్నట్టు మాట్లాడే గొంతు తప్పకుండా వుండాలె
ఎప్పటికీ మనకూ మన పిల్లలకూ ఒక మహెూదయాన్ని చూపే
తూర్పును చూసే చూపుండాలె
ఆ చూపునే ఎప్పుడూ కాపాడుకోవాలె

పుట్టింది కరీంనగర్ జిల్లా కోహెడ మండలం, నాగసముద్రాల. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రచనలు: పునాస, ఎర్రమట్టి బండి(కవితా సంకలనాలు). చిక్కనవుతున్న పాట, పొక్కిలి, మత్తడి, మునుం, ఎడపాయలు, మొగులైంది, దూదిపూల దు:ఖం, నూరు అలల హోరు(ప్రజా సాహితి)లాంటి సంకలనాల్లో పలు కవితలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply