చీకటి వెలుగుల రేఖ

నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అమ్మాయి జీవితం. రాత్రికి రాత్రే ఇంటి పెద్దరికం మీద పడి బాల్యాన్ని కోల్పోయిన ఒక ఆడపిల్ల అనుభవాల పాఠం. తళుకు బెళుకుల సామ్రాజ్యంలో ఉండే చీకటి కోణాలు తెలిసీ తప్పని పరిస్థితుల్లో అందులోకి దిగిన ఆడపిల్ల పడిన తడబాటు. సాధారణ ఆడపిల్లలా ఒక నమ్మకమైన ప్రేమ పంచే భర్త , పిల్లా పాపలతో కలిసి ఒక మామూలు జీవితానికై ఆశ పడిన ఒక అమ్మాయి పడిన ఆరాటం. ఆ అమ్మాయి ఎవరో కాదు.. భార్య హోదా తప్ప ఏదైనా ఇస్తా అని తల్లితో అన్న తండ్రి యొక్క కూతురిగా పుట్టి అక్రమ సంతానం అనే పేరు తలపై మోస్తూ లోకసహజమైన పుకార్లు, గుసగుసలు నడుమ నలుగురి నోళ్ళలో నానుతూ ఎదిగిన అభినయ రేఖ. భారత సినీపరిశ్రమలో ఒక చరిత్ర సృష్టించిన సౌందర్యదేవత జీవితమిది.

యాసర్ ఉస్మాన్ రాసిన ‘రేఖ ద అన్ టోల్డ్ స్టోరీ’ నవలకు తెలుగు అనువాదం శ్రీదేవి మురళీధర్ చేతిలో ‘స్వయంసిద్ధ’గా రూపు దిద్దుకుంది. పుస్తకం చదువుతూ ఉంటే అనువాదం అన్న ఫీలింగ్ అస్సలు కలగకుండా చాలా అద్భుతంగా రాశారు శ్రీదేవి గారు. ఒకటే అంశాన్ని ఇద్దరు రచయితలు అందులోనూ ఒక పురుషుడు , ఒక స్త్రీ ఐతే పరిశీలించే విధానంలో తేడాలు ఉంటాయి. ప్రేమ, పెళ్ళి మీద ఉన్న పాతకాలపు అభిప్రాయాన్ని మార్చేసే పుస్తకం అనిపించింది.

ఒరిజినల్ నవలలో తనకు నచ్చని విషయాలు, అవమానకరం అనిపించే విషయాలు తొలగించినట్టుగా రచయిత్రి ముందుగానే చెప్పుకుంది. అది ఒక మహిళగా సాటి మహిళ పట్ల ఆమె చూపిన గౌరవంగా భావించవచ్చు. ఎంతో అనుభవం కలిగిన సంప్రదాయ మహిళగా వయసు తెచ్చిపెట్టిన సంయమనంతో రాసిన ఈ పుస్తకంలో రేఖ ఎదుర్కున్న అల్లకల్లోల పరిస్థితులు వాటి నుండి ఎలా బయట పడింది అనే విషయాలు చాలా హృద్యంగా రాయడం జరిగింది. సినిమా ప్రపంచం బయటికి కనిపించేంత ఆకర్షణీయం కాదు.

సినిమా ప్రపంచంలో స్త్రీల పట్ల ఉన్న వివక్ష, ద్వంద్వ ప్రమాణాలు ఎప్పటి నుండో ఉన్నాయి. నాటి నుండి నేటి వరకు ఒక్క సినిమా రంగం అనే కాదు ఎక్కడైనా స్త్రీ ఈ పరిస్థితి ఎదుర్కొంటూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ గురించి , తమ మీద వత్తిళ్ళ గురించి ఈ మధ్య కాలంలో కొంత మంది తారలు మాట్లాడుతున్నారు. విమర్శలు అవమానకరమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోరాడుతూ తమ ప్రతి కదలికలపై తీర్పు చెప్పే పరిశ్రమలో తమదైన విలువ ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా మాట్లాడినందుకు కూడా ట్రోలింగ్ బారిన పడుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి సమస్యల గురించి దశాబ్దాల కిందటే మాట్లాడిన ధైర్యవంతురాలు రేఖ.

ఈ ప్రపంచంలో అందరికీ సులభంగా వచ్చే పని ఇతరులను జడ్జ్ చేయడం. ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండు, అలా చేయకుండా ఉండాల్సింది ..ఇలా..

రేఖ కెరియర్ ప్రారంభంలో ఆలోచించకుండా చాలా సినిమాలు చేసింది. అవేవీ చెప్పుకోదగ్గవి కావు. కానీ ఆమె మీద ఒక పెద్ద కుటుంబం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆమెకు సంపాదన చాలా అవసరం. తప్పలేదు కాబట్టి తప్పులేదు. జడ్జ్ చేసేవాళ్ళు అన్నం పెట్టరు కదా. చేసే పని పెడుతుంది అన్నం.

అవడానికి తండ్రి పెద్ద నటుడు తలుచుకుంటే అవకాశాలు కాళ్ళ దగ్గరికే వస్తాయి. కానీ అక్రమ సంతానం అనే పేరు మోస్తున్న రేఖకు ఆ అవకాశం దక్కలేదు. అందుకే జెమిని గణేశన్ ను చూడడానికి అభిమానులు ఎండలో వేచి ఉంటే…, స్టూడియోల ముందు ఆడిషన్స్ కోసం ఎర్రటి ఎండలో పడిగాపులు కాసేది రేఖ.

గణేశన్ అనే ఇంటి పేరు ఉండాలని కలలు గన్న తల్లికి ఆ హక్కు కల్పించలేదు తండ్రి. అందుకే
ఆ ఇంటి పేరుతో తనకు యే ప్రయోజనం లేదని. ఆపేరు తనకు తన తల్లికి జరుగుతున్న ద్రోహంగా భావించిన రేఖ ఇక ఆ పేరును వాడదలుచుకోలేదు. తన తల్లి పొందని, ఆమెకు న్యాయంగా దక్కని గౌరవాన్ని ఆమెకు తెచ్చి ఆమె ఒడిలో పోయాలని భావించింది.

జీవిత సాఫల్య అవార్డును రేఖ నుండి అందుకుంటున్న సందర్భంలో రేఖ తన కూతురు అని జెమిని గణేశన్ ప్రకటించారు. కానీ ఆనందించేందుకు పుష్పవల్లి లేదు. ఆమె ఉన్న కాలంలో ఇలా బహిరంగంగా ఆమోదం తెలుపక పోవడం రేఖ, పుష్పవల్లి జీవితాల్లో లోతైన గాయమై బాధించింది. రేఖ అనుకున్నది సాధించింది కానీ కొంచెం ఆలస్యంగా.

రేఖ 14 ఏళ్ల వయసులో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి తల్లి సహకారంతో దక్షిణాదిన చిన్న చిన్న పాత్రలు వేసింది. అంత చిన్న వయసులోనే దర్శక నిర్మాతల నీచమైన దృష్టిని, వెకిలి పోకడలను ఎదుర్కొంది.

తల్లి ఆశ మేరకు ఒక కీకారణ్యం వంటి బొంబాయి నగరంలోకి నిరాయుధంగా ప్రవేశించి తన జీవితంలో అత్యంత భయానకమైన దశలోకి అడుగు పెట్టింది. ఆమె అమాయకత్వాన్ని నిస్సహాయతను అందరూ ఉపయోగించుకున్న వాళ్ళే.

రేఖకు ఆ వయసులో సంయమనం పాటించడం రాదు. మంచి, చెడు అర్ధం చేసుకుని తనను తాను బేరీజు వేసుకోవడం తెలియలేదు. ఒంటరిగా అక్కడికి నెట్టి వేసినందుకు తల్లి మీద కోపం వచ్చేది. జెమినీ గణేశన్ అక్రమ సంతానం అనే పేరు బొంబాయికి కూడా చేరింది. అక్కడికి అడుగు పెట్టాక మగవాళ్ళు ఎక్కడైనా ఒకటే అని తెలుసుకుంది. ఏ అండా లేకుండా ఒంటరి అమ్మాయిపై ఎవరైనా జాలిగా ఉన్నారు అంటే వెనకాల ఏదో ఒక ఉద్దేశ్యం ఉంటుంది. తారగా తన ప్రయాణంలో వివిధ వ్యక్తుల చేతుల్లో శోషణకు గురైంది. ఆ అనుభవాలు ఆమె సులభంగా మరిచిపోలేక తన మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపాయి.

ప్రారంభంలోనే నిర్మాత కుల్జీత్ పాల్, హీరో బిశ్వజిత్ కలిసి రేఖకు తెలియకుండా చేసిన ముద్దు సన్నివేశం పెద్ద దుమారాన్నే లేపింది రేఖ జీవితంలో..చిత్ర విజయం కోసం చేసిన సంచలనాత్మక ప్రచార విన్యాసానికి బాధితురాలు అయింది అమాయకపు రేఖ. 15 ఏళ్ల రేఖ మనసులో ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు చుట్టూ వున్న వాళ్ళ ఈలలు వెకిలి కేకలు చాలాకాలం వెంటాడాయి. రేఖకు తాను శోషణకు గురైనట్టు తెలిసింది. కానీ ఎదిరించి మాట్లాడితే వచ్చే ఫలితాల గురించి అలోచించి మౌనంగా ఉండిపోయింది. తన కెరియర్ ప్రారంభం కాకుండానే ముగిసి పోతుందని భయపడింది. ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. అవి వారికి మచ్చ తెచ్చినవే. అప్పుడు ఆ అమ్మాయి వయసు 15 ఏళ్ళు మాత్రమే అని కూడా మరిచి పోయి ప్రచారం కోసం కుతంత్రాలు పన్నే నటిగా అంచనా వేయడం మొదలైంది పరిశ్రమలో . లైఫ్ అంతర్జాతీయ పత్రిక ముద్దు గురించి కవర్ స్టోరీ రాస్తూ రేఖ చిత్రాల్ని వేశారు.

ప్రతి అపవాదు ఒక ప్రచారం. ప్రతి విషాదం ఒక అవకాశం.

మొదటి సినిమా విడుదల కాకుండానే అంతర్జాతీయ పత్రిక ముఖ చిత్రంగా విపరీతమైన ప్రచారం లభించింది.

ప్రెస్ మీట్స్ లో మాట్లాడడానికి ఎలాంటి బెరుకు ఉండేది కాదు. జీవితం నేర్పిన తెగువతో నిర్భయంగా నిర్భీతితో సమాధానాలు చెప్పేది. విలేకరుల మనసు గెలుచుకునేది.

ఎంత నటి అయినా ఆమెలో కూడా ఒక సున్నితమైన మనసు ఉండేది . అందరు ఆడపిల్లల్లాగే మనసుకు నచ్చిన వారిని ఇష్టపడింది . కానీ మొదటిగా ఇష్టపడ్డ జితేంద్ర విషయంలో తనతో ప్రేమ అనేది కేవలం కాలక్షేపం కోసం అని తెలిసి గుండె పగిలింది. ఆ గాయానికి వినోద్ మెహ్రా పరిచయం మందులా పని చేసింది. కానీ సంప్రదాయ వాది అయిన అతని తల్లి వల్ల ఆ బంధం కొనసాగలేదు. ఆ తరువాత విలన్ జీవన్ కుమారుడు కిరణ్ తో కూడా ఇదే అనుభవం. ఆమె ‘ అక్రమ సంతానం’ అనే విషయం ప్రతి చోట అడ్డమైంది. వినోద్, కిరణ్ ఇద్దరి విషయాల్లో సమాజపు అర్ధంలేని ఛాందస భావాలు ఆమెకు జీవితంలోని మౌలిక ఆనందాన్ని దూరం చేసాయి. ప్రేమలో ఉన్నప్పుడు రేఖ చాల ప్రమాదకరంగా ఉండేది. ఎంత అంటే… ఆమె ఆలోచనలో ప్రేమ మాత్రమే గాఢంగా ఉండేది. మిగతా అన్ని అంత ప్రాధాన్యత లేనివి. దానికోసం షూటింగ్స్ కి ఆలస్యంగా రావడం లాంటివి చేసి నిర్మాతలకు కష్టం కలిగించేది. అప్పుడు ఆమెకు ప్రేమ మాత్రమే ముఖ్యం అనిపించేది. ఎప్పటికప్పుడు మీడియాకు తన ప్రతి బంధం గురించి చెప్పేది.

ఆమెలో అసలైన మార్పుకు కారణం అమితాబ్. అతని ఎఫెక్ట్ వల్ల రేఖ పని తీరు మారింది. టైం కి షూటింగ్ కి రావడం పాత్రను గురించి ఎక్కువ ఆలోచించడం చేసేది. తన సహజమైన నిర్లక్ష్య వైఖరి అమితాబ్ సమక్షంలో నిగ్రహంగా, అణుకువగ మారేది. ఆమె తహ తహ లాడుతున్న గౌరవం దక్కింది ఆమె నటనను నలుగురు మెచ్చుకున్నారు. దీని క్రెడిట్ అమితాబ్ దే అంటుంది రేఖ. ఒక వ్యక్తిలో ఆమె కోరుకున్న ప్రతి సుగుణానికి అతడు చిహ్నం అయ్యాడు. నెమ్మది నెమ్మదిగా అతన్ని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటికే అతనికి జయబాదురితో పెళ్లి ఐన విషయం తెలిసి కూడా . చిన్నప్పటి నుండి అసహ్యించుకున్న ముళ్ళ దారిలోనే తను కూడా నడుస్తున్నట్టు రేఖ గుర్తించలేదు.తల్లి పుష్పలత తలరాత రేఖ తలుపు తట్టింది. చరిత్ర పునరావృతం అయింది.

ఆ తరువాత ఆమె జీవన శైలి మారింది. తన వ్యక్తిత్వాన్ని మెరుగు పరుచుకోవాలని నిర్ణయించుకుంది. ఇది అమితాబ్ తో ఏర్పడిన అనుబంధం తీసుకువచ్చిన పరిణామం. యే ఆశయాలు ఆదర్శాలు లక్ష్యాలు లేకుండా జీవితాన్ని ఏ రోజుకా రోజు మాత్రమే జీవిస్తూ వృత్తి గురించి పెద్దగా పట్టించుకోని స్వేచ్చాజీవి మాయం అయింది. మూడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. శరీరంలో కొవ్వు కరిగేలా వ్యాయామం చేసింది. రేఖ రూపమే కాక వ్యక్తిత్వం కూడా సంపూర్ణంగా రూపాంతరం చెందడం సినిమా కథ అనిపించే నిజ జీవిత సంచలన గాధ. ఒక సాదా సీదా అమ్మాయి సమ్మోహనమూర్తిగా దేశమంతా మెచ్చే సౌందర్యరాశి గా ఫ్యాషన్ అంశాలకు ప్రతీకగా, కాలగతిలో వయసు ఏ మాత్రం ప్రభావం చూపని అప్సరసలా తన పరివర్తన అనే ప్రక్రియను ఒక స్పూర్తిమంతమైన నిజ జీవిత గాధగా మలిచింది. తన మేకప్, నటనా శైలి మెరుగు పరుచుకుంది. దీనికంతటికీ కారణం అమితాబ్ అని ప్రస్తావించింది. దీనిపై అమితాబ్ ఎన్నడూ స్పందించలేదు.

ఒక శాశ్వతమైన ప్రేమ చూపించే బంధం కోసం ముఖేష్ ను పెళ్ళి చేసుకుంది. వారం రోజుల హనీమూన్ లోనే ఇద్దరి ప్రపంచాలు వేరు అనే చేదు నిజం తెలిసింది. ఇద్దరి దృక్కోణాలు వేరైనప్పుడు ఘర్షణలు పెరగడం సహజం. ఈ పెళ్ళి అవివేకంతో తీసుకున్న తొందరపాటు నిర్ణయం అని మూడు నెలల్లోనే తెలుసుకుంది. భర్త అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, దాంపత్యం అంటే స్వర్గతుల్యం అని భావించే రేఖ కు అది మాత్రం లభించలేదు. కోరుకున్నది ఒకటి దొరికింది ఒకటి. ఇక్కడే రేఖ ఆలోచన చాలా క్లియర్ గా ఉంది.

“జరగని దాన్ని నమ్మి జీవితం గడిపేదాన్ని కాదు. భవిష్యత్తు లేని సంబంధాన్ని పొడిగించడం అర్దం లేని పని” అనేది ఆమె ఆలోచన.

సినీరంగానికి చెందని మనిషిని పెళ్ళి చేసుకుని సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ పిల్లలతో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకున్న రేఖ.. మనిషిని ఎంచుకోవడంలో మాత్రం అతి సాధారణమైన మహిళలా మిగిలిపోయింది. ఈ బంధం ఒక చేదు అనుభవంగా మిగిలింది. క్రూరమైన మీడియా వేట నుండి బయట పడడం చాలా సాధారణమైన విషయం కాదు. .

తన తల్లి అనుభవించిన అవమానాలు చూసి రేఖకు’ మరో ఆడదాని ‘పాత్ర పట్ల అసహ్యం కలగాలి. కానీ తన సినీ జీవితంలో అవే పాత్రలు ఎక్కువ చేసింది. ఒంటరితనం పట్ల ఆమెకు ఉన్న సానుభూతి అనుకోవచ్చు.

తనని తాను మరొక ఆడదానిగా పేర్కొంటూ

భార్య స్థానం ఎక్కువ అంటారు..ఎందుకంటే ఆమె పక్కన భర్త ఉంటాడు . కానీ మరొక ఆడది అంతకంటే వంద రెట్లు ఎక్కువ అని నేను చెప్తాను. భార్య ఉన్నా కూడా ఆమెను కోరుకుంటాడు పురుషుడు. ఇలా మాట్లాడేందుకు జంకలేదు ఎన్నడూ.

రేఖ స్వేచ్చాప్రేమ , పెళ్లికి ముందు సెక్స్, పెళ్ళి కాకుండానే పిల్లలు వంటి వివాదాస్పద విషయాలపై మాట్లాడడానికి వెనకాడలేదు. అందరు మాట్లాడడానికి వెనకాడే విషయాలను గురించి బహిరంగంగా మాట్లాడగలదు.

రేఖ పోరాటపటిమ గల నిత్య యోధురాలు. ఫీనిక్స్ లాగా పైకి లేస్తుంది మళ్లీ.

జీవితంలో ఓడిపోయే పరిస్థితి వచ్చినా తన తల్లి పుష్పవల్లి, పినతల్లి సావిత్రిలా వ్యసనాలకు బానిస కాలేదు. అందుకే జీవితం ఆమె చేజారిపోలేదు. అమితాబ్ లెజెండ్ అయినప్పుడు తను ఆరాధకురాలిగా స్వీయ నియంత్రణలో రాజరికంగా ధీమాగా మిగిలింది.

ఆమె సినిమాలకు ఆదరణ తగ్గిపోయాక తానే ముఖ్యాంశంగా స్వీయానురక్తిని ప్రదర్శించే ఫోటోషూట్స్ ప్రారంభించి తద్వారా తన ఉనికిని ఎవరూ మరిచిపోకుండా చేసింది. కెమెరా ఆమెను ఆమె కెమెరాను ప్రేమిస్తుంది. కెమెరాతో ఆమెకున్న అనుబంధం సంపూర్ణం.

ఆమె ఒక చిన్ననటిగా ప్రయాణం ప్రారంభించి తారగా కొనసాగి అసలు సిసలైన స్త్రీగా పరిణితి చెందింది. అంతిమంగా ఆమె ఒక ‘ దివా ‘ అంటే అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఒక ప్రసిద్ధ మహిళగా మారినట్టుగా రచయిత్రి చెప్తుంది. అవును మరి ఆమె నిజంగా స్వయంసిద్ధ. తన జీవితాన్ని తన శక్తితో నభూతో నభవిష్యతిగా మలుచుకున్నది.

దక్షిణాది తారలను వాణిజ్యపరంగా వినియోగించుకుంటునే వారిని కించపరిచేలా చులకనగా చూసే హిందీ పరిశ్రమకు రేఖ ఒక హెచ్చరిక. డెబ్భై ఏళ్ళ వయసులో ఇప్పటికీ ఆమె పేరు ప్రసార మాధ్యమాల్లో వినిపించడం మామూలు విషయం కాదు.

తనకు తానే అమితాబ్ ద్వారా ప్రేరణ పొంది సంస్కరించుకున్నా అని చెప్తున్నప్పటికీ… ఇందులో గొప్పతనం ఆమెలోని సంకల్పదీక్షదే అంటుంది రచయిత్రి. ప్రేరణ ఎవరి వల్ల పొందినా తమను తాము వినూత్నంగా రూపొందించుకోవడానికి చేసిన కృషి గొప్పది అంటుంది. నిజానికి చిత్ర పరిశ్రమలో అమితాబ్ ను అనుసరించే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఎంత మంది నిలదొక్కుకున్నారు. ఎంత మంది రేఖలా సంపూర్ణ పరిణామం పొందగలిగారు. అందుకే ఈ గొప్పతనం కేవలం రేఖది మాత్రమే అని నమ్మిన శ్రీదేవి మురళీధర్ ఈ పుస్తక అనువాదానికి పూనుకున్నారు.

పుస్తకంలో రేఖ నటించిన చిత్ర విశేషాలు వివరంగా రాశారు. ఇంత మంచి పుస్తకం అందమైన ముఖచిత్రంతో, మంచి పేపర్ క్వాలిటీతో చూడగానే చదవాలి అనిపించే విధంగా వంగూరి ఫౌండేషన్ ద్వారా ప్రచురించారు.

కథా రచయిత, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ఆడియో ప్రెసెంటేటర్, వాయిస్ ఆర్టిస్ట్, వ్లాగ్ మేకర్. కాకతీయ యూనివర్సిటీ నుంచి కామర్స్ లో మాస్టర్స్ చదివారు. 150 కవితలు, పది కథలు రాశారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మిత్రులతో కలసి 'పొయ్యిరాళ్లు' పేరుతో ఛానెల్ ప్రారంభించారు. నాలుగు షార్ట్ ఫిల్మ్స్ రాసి దర్శకత్వం వహించారు. ఫైనాన్షియల్ సెక్టర్ లో జోనల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం హన్మకొండలో ఉంటున్నారు.

One thought on “చీకటి వెలుగుల రేఖ

  1. కోవెల అనురాధ గారి సమీక్ష బాగుంది ,పుస్తకం కొని చదవడానికి తగిన స్ఫూర్తిని కలిగించే విధంగా ఉంది.రచయిత శ్రీదేవి మురళీధర్ గారి రచన విశిష్టతను చక్కగా వివరించారు.

Leave a Reply