చీకటి వెన్నెల

వాడు ఊహల్లో ఊగిపోతూ
వెన్నెల్తో కవిత్వం రాస్తాడు
చీకటిని తరిమేసేనంటూ!
నేనేమో వెన్నెలకీ చీకటకీ
తేడాతెలియని బతుకు బందీని
బురదలోనే బొర్లుతున్న మట్టగుడిసెని !

నాకేమో
సెలయేర్ల సవ్వడి సముద్రమంత ఉప్పుగానే,
చిరుగాలి సితారకి నాట్యం చేస్తున్న నెమలి
పెనుతుఫానుకి కూలిపోయిన గుడిసెలానే!
కవిత్వ నాయకిల వలపుల గిలిగింతలు
గుండెల మీదెక్కి గుచ్చినట్టుగానే!

కవులారా! నన్ను మీ మాటలతో మలినం చేయకండి!
నన్ను సూర్యడుని చేసినా వెన్నెల్లో విసిరేసినా
మీ రాతల్లో ఇంకని బతుకు ప్రయాణం నాది
అక్షరాలకి అవతల ఇంకా మిగిలిపోయిన వేదననాది
నేను నిత్యం కాలుతున్న కడుపు మంటని
చేతనయితే అక్షరాల్లేని భాషతో నన్ను హత్తుకో
నేను మలాన్ని చేత్తో ఎత్తేసినట్టుగా !

నా అవమానాల్ని యేవేవో అలంకారాలతో
ఉత్త ఉపమానాల్తో వూరేగించొద్దు
వీలైతే నా వెంట నాలా నడుస్తూ రా!
వెలేసిన నగరాన్ని తిట్టుకుంటూ
ఊరి దారి వెతుక్కుంటూ వెళ్లిన
చెప్పుల్లేని రోడ్డుమీద కాలిన నడకనడుగు
నన్ను పీల్చి పిప్పిచేసిన ఈ పొలాలు
ఆసామి అహంకారంలా ఎంత ఏపుగాఎదిగాయో!
చేతయితే భూస్వామి మదకన్నుల్లో
బూడిదయిన అత్యాచార ఆనవాళ్ళు పట్టుకో!
ఇదిగో చూశావా! ఈ అడవంతా నన్ను
వెంటాడి వెళ్లగొట్టిన బహుళ కంపెనీ వేట కతలే!
అడవి గర్భాన్ని చీల్చిన ప్రోక్లైన్ గాట్లులా
నా వళ్ళంతా ఇంకా సలపరిస్తున్న జ్ఞాపకాలే!
ఎట్టయితేనేం, గోడకిసిరేసిన బంతిలా నా పల్లెలోకే
ఆత్మగౌరవం అడ్డొచ్చి వదిలేసిన ఊర్లోకే ఆఖరికి!
నెర్రెలిచ్చిన దారిలో ఇంకిన రక్త ధారలెన్నోలే!
సూర్యుడూ చంద్రుడూ లేని ఆకాశాన్ని
నేను నడిసొచ్చిన దారంతా చీకటి వెన్నెలే
సెలయేరూ చిరుగాలీ నెమలి నాట్యలూ
తెలియని గాలివాటపు పరుగుని నేను
ఏ కవిత్వంలో నన్ను వొలక పోస్తావో తేల్చుకో!

**

ఆత్మగౌరవ బొమ్మ

పీడకలై పలకరిస్తున్న బులుగు బొమ్మ
మాలపల్లె ఊళ్ళోకొచ్చి కాపరముంటున్నట్టు
తినే పంచభక్ష పర్వాన్నమంతా గొడ్డుగారమైనట్టు
అర్ధం పర్థంలేని అనాగరిక కల!

బొమ్మంతా మొలుచుకొచ్చిన
చూపుడువేళ్ళు వెంటబడుతూ
బొమ్మ చేతిలో పుస్తకం
పిచ్చిపిచ్చిగా మాట్టాడుతుంది
నేరస్తుడ్ని విచారణ చేస్తున్నట్టు!

ఇది కలలా లేదు
కాలమే కదిలొస్తున్నట్టుంది
ఈ కాలాన్ని కట్టడి చేయాలి
బొమ్మని భూస్థాపితం చెయ్యాలి
మాలపల్లెని చెట్టుకి
కట్టేసి నిప్పెట్టినట్టు
మాదిగ పల్లెనికోసి
కాళ్ళకింద చెప్పుని చేసినట్టు!

నీడలు కదులుతూన్నాయి
పల్లెలు మాట్టాడుతున్నట్టు
బొమ్మ బయపెడుతుంది
ఆకాశమంత ఎత్తు ఎదుగుతూ
బొమ్మకి గుడి కడతాడు వాడు
కబ్జా కుదరని చోట
బొమ్మకి ఓట్లు పుట్టే శక్తి తెలిసి!

అది కదిలే కాలం బొమ్మ
పల్లెని కదిలించే వెలుగు రవ్వ
అది అమ్ముడుపోని ఆత్మగౌరవం
అమలుకాని రాజ్యాంగం
మూగమనుషుల కంచు కంఠం
భజనకి బందీ కాని భవిష్యత్ కావ్యం!

వాడి పీడ కల నిజంగానే
వీడి ప్రేమపూజ నటనే
వాడూ వీడూ ఒక్కటై
బొమ్మ మీదకి చెప్పులిసురుతూ
చెదరని ఆత్మ గౌరవం బొమ్మ
కోటు సవరించుకుంటూ మరింత హుందాగా
ప్రజల్ని సంఘటిత సమరానికి సిద్ధంచేస్తూ!

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply