చివరి కోరిక

“రాజ్యం మీద నమ్మకం లేదు. దేశం మంచిది. ప్రజలు మంచోళ్లు. పోరాడతారు. ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఎట్లాగైనా నాకొడుకును బయటికి తీసుకొస్తారు. అక్రమంగా ఎందుకలా నిర్భందించారు” అప్పటివరకు ఆవేశంగా మాట్లాడిన ఆ తల్లి స్వరంలో చివరి వాక్యం చెప్పేటప్పుడు ఓ సన్నటి వణుకు.

“నడకే రాదు నా తండ్రికి, తుపాకీ ఎలా పడతాడు. అసలు ఆలోచించరా జైల్లో పెట్టే ముందు” శూన్యాన్ని చూస్తూ ప్రశ్నిస్తున్న ఆ గాజుకళ్లలో లిప్తపాటులో ఎన్నో నీలినీడలు!

కబళిస్తున్న కాన్సర్ని తరిమికొట్టాలనుకుంది. కొడుకును తనకప్పగించేంత వరకూ రాజ్యంతో పోరాడాలని సంకల్పించింది. కానీ అండాసెల్లో బంధీగా ఉన్న కొడుకు అనారోగ్య వార్త విన్న ఆ తల్లి హృదయం ఓ క్షణం ఆగి మళ్లీ వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.

పెరుగుతున్న వయసుకు క్షీణిస్తున్న ఆరోగ్యం తోడై తనను వెక్కిరిస్తున్నట్టుగా… చుట్టూ ఉన్న సమాజం నుంచి తనను ఎవరో ఒక్కసారిగా లాగివేసినట్టుగా అనిపిస్తుందీమధ్య. తీరని వెలితి, అంతుచిక్కని మనోవ్యధ ఆసుపత్రిపాలయ్యేలా చేసినా… తొందరగా కోలుకుని ప్రజల పక్షాన నిలిచిన కొడుకును విడిపించాలనుకుంది. అక్రమంగా అరెస్టు చేసిన రాజ్యాన్ని నిలదీయాలనుకుంది. కానీ ఈ పోరాటంలో కాలం కూడా తనను ఓడించాలనుకుంటోందని ఆ తల్లికాక్షణంలో తెలీనేలేదు.

** **

బిడ్డనొక్కసారి చూడాలన్న కోరిక ఆవిడ మనసును కొన్నేళ్లుగా దహిస్తోంది.

“ఒంట్లో బాగలేదు నా తండ్రికి. ఎలా ఉన్నాడో ఏంటో. అందరూ కలిసి ఎలాగైనా విడిపించుకొస్తారు. అప్పటిదాక ప్రాణాలుగ్గబట్టుకుని ఎదురుచూడాల్సిందే. ఆయన్ని చూసిన తర్వాత ఈ కట్టె ఏమైపోయినా పర్లేదు” స్వగతంలో అనుకోవాలనుకున్న మాటలు పైకి దొర్లాయి. వృద్ధాప్యం, అశక్తత, అనారోగ్యం, రాజ్యం రగిల్చిన కడుపుకోత అన్నీ కలగలిపి ఆవిడ ఆత్మస్థైర్యాన్ని ఆవిడకే తెలియకుండా గాయపరుస్తున్నాయి.

“నాన్నా… కాన్సర్ ను చంపిగానీ నేను చావను. నాకోసం బాధపడకయ్యా” ఒక్కోసారి బిడ్డ తన ఎదురుగా ఉన్నట్టే ఆనందంగా మాట్లాడేస్తుందావిడ. ఇదంతా తన భ్రమ అని తెలుసుకున్న మరుక్షణం మౌనంగా ఉండిపోతుంది. భ్రమలో ఉన్న ఆనందాన్ని నిజం చేస్తే బాగుండేదని పరితపిస్తుంది. వయసు పైబడుతున్న విషయం కన్నా బిడ్డను చూడకుండానే కడతేరిపోతానేమో అన్న బాధే ఆవిడ హృదయాన్ని కనిపించని ఆయుధంతో కోస్తోంది.

** **

తెల్లటి ట్రే పట్టుకున్న సిస్టర్ ఆ గదిలోకి అడుగుపెట్టింది. అసంకల్పితంగా అటువైపు చూసింది అమ్మ. అనారోగ్యంతో నీరసంగా ఉన్న కళ్లలో ఒక్కసారిగా దివిటీల వెలుగు! సంభ్రమం!

“వచ్చేశావా… రా నాయనా!”

వచ్చింది కొడుకే అనుకుంది. పోరాటశక్తులపై ఆవిడకున్న నమ్మకం అలాంటిది!

ఏళ్ల తరబడి ఎదురుచూపులు. బిడ్డను సుడిగాలిలా చుట్టేయాలనుకుందేమో… ఒంట్లోని సత్తువంతా కూడగట్టుకుందా అన్నట్టుగ ఊపిరి గట్టిగా బిగబట్టింది. ఒక్కఉదుటున లేవాలనుకుంది. శరీరం సహకరించలేదు. ఒకప్పుడైతే గేటు దగ్గర అలికిడైనప్పుడల్లా గుమ్మంలోకి ఉరికివెళ్లేది. వయసు పెరిగేకొద్దీ బలహీనమైన కండరాలు ఇప్పుడావిడ మాట వినడానికి మోరాయిస్తున్నాయి. ఏళ్లుగా బిడ్డకోసం పడిగాపులు పడుతూ చిక్కి శల్యమైన ప్రాణాన్ని రెండు కాళ్లపై నిలబెట్డానికి చేసిన ప్రయత్నం ఆవిడను బెడ్ చివరిదాక తీసుకొచ్చి ఒంటరిని చేసింది. బిడ్డకు ఎదురెళదామన్న ఆలోచన ఫలించలేదు కానీ దానికోసం చేసిన తీవ్ర ప్రయత్నానికి చిహ్నంగా అమ్మ తూలిపడబోయింది.

పేషెంట్ ఆరోగ్యం గురించి అటెండెంటుకు వివరిస్తూ ఆ సంఘటనను చూసిన సిస్టర్ ఒక్క అంగలో ఆవిడ దగ్గరకొచ్చింది. జాగ్రత్తగా బెడ్ పై కూర్చోబెట్టింది.

వచ్చింది బిడ్డ కాదని అర్థమైందావిడకు. నిరాశను నిట్టూర్పులా మార్చేసే సగటు అమ్మ కాదావిడ. పరాయి బిడ్డల్లోనూ కన్నబిడ్డ ఆనవాళ్లు చూసుకుని సంతృప్తిపడే విప్లవమాత! అందుకే నిరాశను లోలోపలే సమాధి చేసింది. ఆ స్థానంలో నవ్వు నింపుకుంది.

“నువ్వామ్మా వచ్చింది. రా తల్లీ! నిన్నా మొన్న కనపడలేదు. ఏమైపోయావు” ఆ మాటల్లో అమ్మ ఆత్మీయత. పేగుబంధాన్ని గుర్తు తెచ్చే ఆప్యాయత. బిడ్డలను సమాజానికిచ్చేసిన త్యాగాల తల్లికి సమాజంలోని ప్రతి బిడ్డా సొంతబిడ్డే!

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆవిడను చూసి చలించిందో ఆవిడ మాటలకు ఊర్లో ఉన్న తన అమ్మే గుర్తుకొచ్చిందో ఆ సిస్టర్కి కన్నీరుబికింది.

“అమ్మా! నా భుజం మీద చేయేసి నెమ్మదిగా లేవడానికి ప్రయత్నించండి. కొంచెం నడిపిస్తాను మిమ్మల్మి” లోగొంతుకతో సాధ్యమైనంత మృదువుగా అందా అమ్మాయి.

** **

ఆ స్వరం ఆవిడకు కూతుర్ని గుర్తుకు తెచ్చింది. గుర్తురావడమేంటి? అసలు మర్చిపోతే కదా.! ఏళ్లనాటి జ్ఞాపకాలను పేజీల్లా పేర్చేసుకుంటూ రోజులు గడిపింది. వాటిని జ్ఞాపకాలు అనకూడదేమో! ఆవిడ మస్తిష్కంలో సజీవంగా కదలాడే వర్చువల్ చిత్రాలవి.!

తన చిట్టి తల్లి బోసి నవ్వులు… కోమలమైన ఆ శరీరం… తన పొత్తిళ్లలో మెల్లమెల్లగా తెరుచుకున్న కళ్లు… తప్పటడుగులు… అన్నా తమ్ముళ్ల కోసం చిన్న వయసులో ఆ అమ్మాయి చేసిన త్యాగాలు అన్నీ సజీవంగా కదలాడాయి. ఎర్రని ఏటవాలు ఎండలోని అందాన్నంతా ఇముడ్చుకున్న కూతురి కళ్లంటే తనకెంతో ఇష్టం. తన ఒడిలో చీరకొంగు చాటున ‘బూచి’ అని నవ్వే ఆ కలువల్లాంటి కళ్లని చూస్తూ తన కష్టాలన్నీ మర్చిపోయేది.!

ఎన్నో ప్రశ్నలను శూలాల్లా సంధించే ఆ కళ్లను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ లో నిర్జీవంగా మార్చారు. కటిక నేలపై శూన్యాన్ని చూస్తున్న ఆ కళ్లు వాటి వెనుక భగ్నమైన వేలాది స్వప్నాలు తనకు మాత్రమే తెలుసు. ఆ కళ్లను తనివితీరా ముద్దాడి అదే చివరిసారనీ మరెప్పుడూ వాటిని చూడలేనని అనుకోగానే గుండెలవిసేలా ఏడ్చింది.

ఎందుకో ఈమధ్య బిడ్డలను వెంటాడుతూనే ఉందామె ప్రాణం. అనారోగ్యం ముదురుతున్న కొద్ది చూపు మందగించింది. సత్తువ చచ్చిపోతోంది. మనసులోని జ్ఞాపకాలు తనువంతా అలుముకుంటున్నాయి. ఆ జ్ఞాపకాలు కరిగిపోనందుకూ తన జ్ఞాపకశక్తి క్షీణించనందుకూ ఆ తల్లికి చాలా ఆనందంగా అనిపించింది. అలా అయినా తన బిడ్డలు తనవెంటే ఉంటారన్న చిన్న కోరిక ఆ అమ్మది.

జాగ్రత్తగా ఆవిడను బెడ్ పై పడుకోబెట్టింది సిస్టర్.

“ఎక్కువగా ఆలోచింకండమ్మా. రెస్టు తీసుకోండి.”

ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయిందావిడ. అవిశ్రాంత మనసులో మిణుక్కుమంటున్న నక్షత్రాల్లాంటి ఆలోచనలు. కళ్లుమూసినా తెరిచినా ఉప్పొంగుతున్న జ్ఞాపకాలు. కన్నబిడ్డ వస్తాడన్న తపన… బిడ్డను ఎవరైనా తనకు చూపిస్తే బాగుండు అన్న ఆరాటం.!

ఆమెది మామూలు కోరిక. బిడ్డను ఒకే ఒక్కసారి తనివితీరా చూసి కళ్లలో నింపుకుని కడతేరిపోవాలన్న అతి సాధారణమైన కోరిక. దాన్ని కూడా రాజ్యం కసితీరా చిదిమేసింది. కానీ ఆశ చావలేదు. అమ్మ మరి.! ఎలాగైనా కొడుకును చూడాలనుకుంది. రాజ్యంపై నమ్మకం లేకున్నా రాజ్యంలోని మనుషులను నమ్మిన మట్టిమనిషి ఆవిడ. సమాజం కోసం జైలుకెళ్లిన కొడుకును ఆ సమాజమే బయటికి తీసుకొస్తుందని ఆశపడ్డ తల్లి. తనని చూడటానికి వచ్చిన ప్రతిఒక్కరిలో ఆవిడ ఒక పోరాట యోధుడిని ఊహించుకుంది. వారిని పోరాడమంది. ప్రశ్నించమంది. చివరి శ్వాస వరకూ ప్రతిఘటించింది. అలానే కోమాలోకీ ఆ తర్వాత శాశ్వత నిద్రలోకీ వెళ్లిపోయింది.

అదే క్షణంలో… హాస్పిటల్కి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో…

ఇవేవీ తెలియని ఆ బిడ్డ అండాసెల్లో ఓ పక్కగా ఉన్న చిన్నకిటికీలోంచి వచ్చే ఎర్రని సూర్యకిరణాలను తీక్షణంగా చూస్తున్నాడు. కిరణాలే ఎర్రగా ఉన్నాయో అతని అరుణారుణ చూపులే వాటికా రంగిచ్చాయో చెప్పడం సాధ్యంకాదు. ఇప్పుడతనో ప్రవహించే ఉత్తేజం. సమాజ శ్రేయస్సును కాంక్షించే రగల్ జెండా. ఉన్నట్లుండి చల్లగాలి తగిలినట్టు, నుదుటి చెమటను మెత్తని చీరచెంగుతో తుడిచినట్టు వింత అనుభూతి.! “అమ్మా…” అప్రయత్నంగా అతని నోటినుంచి వెలువడింది. గుండెల్లో ఏదో బాధ తీవ్రమై తీరని వ్యథలా మారింది.!

కథా రచయిత, జర్నలిస్టు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో జర్నలిజం పాఠాలు చదివాను. ఇరవయ్యేళ్ల వయసులో ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో చేరి, ఆ పత్రిక ఫీచర్స్ డెస్కులో సబెడిటర్ గా కెరీర్ ప్రారంభించారు. సండే మ్యాగజైన్ ‘స్నేహ’ లో క్యాంపస్ ఛాట్ శీర్షిక నిర్వహించారు. టీవీ9లో కొంతకాలం పనిచేశారు. పెళ్లయ్యాక సాప్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టారు. మళ్లీ సాహిత్యాభిలాషతో కథలురాయడం ప్రారంభించారు. మొదటి కథ ‘గాజుబొమ్మ’ విహంగ పత్రికలో ప్రచురితమైంది. పెళ్లి పేరుతో స్త్రీలపై జరిగే హింసను వివరించే ‘విముక్తి’, ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొనే వివక్షను చూపే ‘ఓ శిరీష్ కథ’ విహంగలోనే పబ్లిషయ్యాయి. స్త్రీలపై, హిజ్రాలపై జరుగుతున్న హింస, వివక్షలపై సమాజంలో అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

Leave a Reply