చిరంజీవి

స్టీరింగు ముందు తనకు తెలియకుండానే వణికిపోతున్న చేతులతో ఖాసిం, ఆ ప్రాంతాలకు ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. మట్టిరోడ్డంతా గతుకులు గతుకులు. ఒక్కొక్కసారి స్టీరింగు జారిపోయేంతగా ఎగిరిపడుతోంది జీపు. దట్టమైన మంచులా ఎర్రని దుమ్ము ఆకాశానికెగురుతోంది. అప్పటికి అయిదారుసార్లు అయినా తుడిచి వుంటాడు, అద్దం మీది దుమ్మును. చలి కూడా బాగానే వేస్తోంది. ఏదో భయం నరాల్ని క్రుంగదీస్తోంది. డోక్కునేట్లు పెట్రోలు వాసన కడుపులో తిప్పుతోంది. చలి, ఆకలి. ఏది కనిపించినా దండన తప్పదు. జాగ్రత్తగా నడుపుతున్నాడు జీపును.

ప్రక్కనే డి.యస్. పి. రెడ్డి గబ్బిలాల్లా మీసాల్లో ముక్కుపుటాల్ని పగలగొట్టే చుట్టకంపుతో ఓ చేయి పిస్తోలు మీద వేసి విగ్రహంలా కూర్చున్నాడు. దుమ్మును చీల్చుకుని చూస్తున్నాడు ముందుకు.

అతని ప్రక్కనే కుర్రవాడు పద్నాలుగేళ్ళుంటాయి. నిక్కరు, బుషర్టు వేసుకున్నాడు. చెరగని చిరునవ్వులో, సన్నని పెదాలు ఏవో పాటల్ని నెమరువేసుకుంటున్నాయి. అతనికి రెండో వైపు మెషిన్‌గన్‌తో మరో ఇన్‌స్పెక్టర్.

రెండు బండరాళ్ళ మధ్య విరిసిన గడ్డిపువ్వులా నిబ్బరంగా కూర్చున్నాడు రాంబాబు.

మెషిన్‌గన్‌ బయటికి పెట్టి అదేపనిగా చూస్తూ కూర్చున్న ఇన్‌స్పెక్టర్ని చూసి నవ్వుకున్నాడు రాంబాబు.

“సార్! ఇది మైదాన ప్రాంతం. అంత భయం అక్కర్లేదు” అన్నాడు. నోర్ముయ్యరా వెధవా” గర్జించాడు మెషిన్‌గన్‌ శివలింగం.

లోడ్ చేసిన తుపాకులతో ఆర్గురు పోలీసులు ప్రాణాలు బిగబట్టుకొని లోపల ఎవరి భయంతో వాళ్ళు. ఎవరి ఆరాటంతో వాళ్ళు. చలికో భయానికో ఒకరినొకరు వొదిగొదిగి కూర్చుంటున్నారు.

మైలుకో రెండు మైళ్ళకో గూడెం. పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు. జీపు చప్పుడు. తలెత్తగానే పోలీసుల వేళ్ళు ట్రిగ్గర్ల మీదికి వెళ్తున్నాయి.

కర్రతో పసుల కాపరి కనిపించినా, చిన్నపిల్లలు ఆటగాళ్ళతో ఎదురుపడ్డా, కొడవళ్ళతో కూలీలు తారసపడ్డా, జీపులో కలకలం బయలుదేరుతుంది.

ఎదురుగా వస్తోన్న వో బాటసారి సూర్యుడికడ్డంగా అరచేయి ఎత్తి జీపుని చూసి ఆగిపోయాడు.

ఫర్లాంగు దూరంలో వుంది జీపు. బాటసారి క్షణం ఆగి, వెనక్కిచూసి మళ్ళీ నడక ప్రారంభించాడు. “పోనీ జీపు” హుకుం జారీచేసాడు డి.యస్.పి. రెడ్డి. ఖాసిం ‘సర్’ అంటూ వేగం పెంచాడు. ఉక్కిరిబిక్కిరి అయి దుమ్ముతో బాటసారి. మళ్ళీ కళ్ళు తెరిచేలోగా కనిపించకుండా జీపు.

అదేదో కొంచెం పెద్దపల్లే. రెండో మూడో పెంకుటిండ్లు. మిగిలినవన్నీ పూరిండ్లే. మధ్యాహ్నం మనుషులెవరూ లేరు. దుమ్మురేపుకుంటూ వెళ్తోంది జీపు. సందుల్లో స్టీరింగు తిప్పి తిప్పి చలిలోనూ చెమటలు పట్టాయి ఖాసింకు. ఎంత ప్రయత్నించినా స్పీడు తగ్గుతూనే వుంది. వేగం తగ్గగానే గుడ్లురిమి చూస్తున్నాడు డి.యస్.పి.

మూల మలుపులో “అదిగో అదిగో రాంబాబు” అంటూ ఒక్కసారిగా కేకలు వినిపించాయి.

చెడుగుడు ఆడుకుంటున్న పిల్లలు చెల్లాచెదురు అయిపోయారు. రాంబాబు నవ్వుతూ సంకెళ్ళ చేతులెత్తాడు.

ఆ పిల్లలు చేతులెత్తి సైగచేశారు. జీపుకూ గూడానికీ మధ్య దట్టంగా దుమ్ము.

ముందున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఇంగ్లీషులో మాట్లాడుకొని రాంబాబుని జీపులోపలికి పంపించారు.

“ఎందుకు సార్ అంత భయపడతారు?” అంటూ రాంబాబు లోపలికెళ్ళాడు.

“కుర్రాడి చూపులు బాణాల్లా ఉన్నాయిరా”

“కళ్ళు నక్షత్రాల్లా అందంగా వున్నాయి.”

“ఏమిటి, ఆ కనుబొమలు అంత నల్లగా సిరావొలికినట్టే వున్నాయి”

“పాపం! మీసకట్టు ఇప్పుడిప్పుడే వస్తోందిరా!”

“అచ్చం మా బాబులాగే నవ్వుతున్నాడు.”

“వేలెడంత లేడు వీడూ వున్నాడు దళంలో!”

“మనల్ని చంపేవాడు ఎంతవాడైతేనేం? శత్రువు శత్రువేరానాన్న”

“మావాడు ఇలాంటి దేశ సేవలోన పాల్గొన్నాడు కాదు”

ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకోసాగారు పోలీసులు. ఆ వుద్యోగంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వీలులేదని అందరికీ తెలుసు. పైవాడి మాటలకే చెల్లుబడి. నోరెత్తితే పనిష్‌మెంట్, మాటకోసం నిలబడితే డిస్‌మిస్.

రాంబాబు ఒకర్నొకరే చూస్తున్నాడు.

ఏ ఒక్క పోలీసు వొంటిమీద కిలో మాంసమున్నట్టు లేదు. కంటినిండా నిద్రలేక ఎన్నాళ్ళయిందో, లోతుకు పీక్కుపోయినాయి కళ్ళు. చెరుకుగడల్లాంటి చేతులు తుపాకుల్ని ఎలా మోస్తున్నాయో! స్పష్టంగా నరాలు పైకి తేలి దారపు పోగుల్లా వున్నాయి. ఎవరి ముఖంలోనూ కళాకాంతులు లేవు. చూసి రాంబాబు కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

“పోలీసులూ మీరందరూ పేదలే,” అన్నాడు ఆవేశంగా తలపంకించి రాంబాబు.

పోలీసులందర్నీ ఏదో వెలుగు చుట్టుముట్టినట్టు, ఆకలి తీరబోతున్నట్టు ఆశ్చర్యంగా చూశారు.

వెయ్యి కంఠాలు ఒక్కసారి ఆమాటే అన్నట్లు వినిపించింది కానిస్టేబుల్ రామ్మూర్తికి.

“బాబూ!”

కన్నకొడుకు తప్పుచేస్తే వారించినట్లుంది రామ్మూర్తి పిలుపు.

“టూ నాట్ వన్, ఏం చేస్తున్నావ్?” ముందునుంచి గద్దింపు.

“ఆవాజ్ బంద్ కరో,” కళ్ళెర్ర చేశాడు హెడ్డు.

“మీరొట్టి అంకెలుకారు, మీకూ పేర్లున్నాయండీ.”

ఓ చేయి చినబాబు నోరునొక్కి వెనక్కి నెట్టేసింది. కాని వెంటనే అతని ఉంగరాల జుట్టుమీద అప్యాయంగా నిమిరింది, ఎందుకో.

రాంబాబు మాటలు వినాలని అందరికీ కుతూహలంగా వున్నట్టుంది.

వారి చూపుల్లో కరుణ, జాలి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రామ్మూర్తికి రాంబాబు కంఠం, నటన, తెలివి, ఎటువంటివో తెలుసు. అతనింతవరకు అలాంటి పిల్లవాడ్ని చూడలేదు. వినలేదు కూడాను. సాహిత్యం తెలుసు. సంగీతం తెలుసు. రాజకీయ సిద్ధాంతాలు తెలుసు. వాటితోడు అపారమైన లోకజ్ఞానం. రాంబాబును ఒక్కసారి చూస్తే చాలు. మరిచిపోవడమంటూ జన్మలో జరగదు. మూడేళ్ళ క్రితం విజయవాడ గవర్నరుపేట సెంటరులో డ్యూటీ మీద వెళ్ళి రాంబాబు చెప్పే బుర్రకథ విన్నాడు ఆనాటినుండీ, అతనిదదే అభిప్రాయం.

రామ్మూర్తి చెవుల్లో ఇప్పటికీ ఆకథే మార్మోగుతుంది. లేడిపిల్లలా ఎగురుతూ. నాట్యంచేస్తూ తంబురా మీటుతూ కథచెప్పే రాంబాబు రూపం, ఆ వెలుగు ప్రవాహం. పాదరసం లాంటి ఆ చురుకుదనం, ఆ నవ్వులు, పరిహాసాలు అతని కళ్ళలో బొమ్మకట్టాయి.

“ఒక్కపాట పాడించుకుంటే బావుణ్ణు.” రామ్మూర్తి మనసు ఆరాటపడుతోంది.

ఇంటి దగ్గర అల్లరి చిల్లరగా తిరిగే తన కొడుకు ఎందుకూ పనికిరాడు, బడికెళ్ళడు. తల్లి పోయిన్నాటినుంచి వూరిమీద పడ్డాడు. తాను మళ్ళీ పెళ్ళిచేసుకోలేదు. చాలీచాలని జీతం. రాత్రులకు రాత్రులు డ్యూటీ మీద వెళ్ళి తన భార్యను సుఖ పెట్టలేకపోయాడు. మందులిప్పించడానికి డబ్బులుండేవి కావు. ఉద్యోగంలో సెలవు దొరికేది కాదు. తీసుకుని తీసుకుని కన్నుమూసింది భార్య చచ్చి తాను సుఖపడిపోయింది. బతికిన కుర్రవాడు బతికే మార్గంలేక, బాగుపడే వీలులేక చస్తున్నాడు. తనకింకా పెళ్ళెందుకు? తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు రామ్మూర్తి.

భార్య వున్నప్పుడు చాలా పోరు పెట్టేది. రాక్షసుల్ని తయారుచేసే పోలీసు ఉద్యోగమనీ, మానెయ్యమనీ. ఉద్యోగం వదిల్తే రిక్షా తొక్కుకోవాలి. వయసా, మీదపడింది. తన వల్ల ఆ పని అయ్యేది కాదు. సగం మనసుతో స్ట్రయికుల్లో లాఠీచార్జి చేసేవాడు. గ్యాసుబుడ్లు విసిరాడు. విద్యార్థుల మీదికి తుపాకులు పేల్చాడు. మనసు రాయే అయ్యింది. ఎంతోమంది పోలీసుల్లాగా తానూ యంత్రంలా పనిచేశాడు. ఎద్దులా బతికాడు. కూటికోసం తప్పిస్తే, ప్రభుత్వానికి కీలుబొమ్మలా ఉపయోగపడడం తప్పిస్తే, దేశాన్ని కాపాడేది పోలీసులేనని అనుకోలేకపోయాడు. ఆమాటకొస్తే మొట్టమొదటి దేశభక్తుడు పోలీసే కావాలి. మంచీ మర్యాద లేనిదే పోలీసు ఉద్యోగం, డి.యస్.పి. రెడ్డిని చూశాక, అక్రమంగా ఆర్జించడానికి పెద్దిళ్ళ విద్యావంతులు ఈ డిపార్టుమెంటులోకి వచ్చి ఎంత కర్కశంగా ప్రవర్తిస్తారో, కానిస్టేబుళ్ళను ఎంతగా హింసిస్తారో, రామ్మూర్తి కళ్ళారా చూశాడు.

ఒక్కొక్కసారి చేతిలోని తుపాకీతో కాల్చుకుని చావాలనిపించేది. బందిపోటు దొంగలా మారిపోవాలనిపించేది.

ఎప్పటికప్పుడు ఏవో సమస్యలు. విరామంలేని పరుగులు. శ్రీకాకుళం వచ్చాక జీవితమంటే పోరాటమనే అభిప్రాయం బలంగా కుదురుకుంది. ఆత్మరక్షణ పేరుతో పోలీసులు చేసే అన్యాయాలకు లెక్కా పత్రం వుండదు. ఇన్‌స్పెక్టర్ల దృష్టిలో పోలీసులు మనుషులుకారు. గానుగెద్దులు, రాళ్ళు. ఆత్మవంచనతో కూడిన ఈ ఉద్యోగాన్నుంచి, నటన విముక్తి ఎన్నాళ్ళకో? ఇలా నిట్టూర్పులతోనే పదేళ్ళ సర్వీసు చేశాడు రామ్మూర్తి.

రాంబాబును చూశాక అతనిలో ఏవేవో భావాలు ప్రాణం పోసుకున్నాయి. శవప్రాయంలాంటి జీవితం చిగిర్చినట్టుగా వుంది. “తన కొడుకు చినబాబే” అనే ఆలోచన అతనికెంతో ఉత్సాహాన్ని, బలాన్నిచ్చి నిలబెట్టింది.

“అవును, బాబూ, పోలీసులు నిరుపేదలే. తుపాకి ఎత్తితే పశువులం. లేకపోతే ఎందుకూ కొరగాం” నోటి వరకు వచ్చిన మాటల్ని ఆపుకున్నాడు రామ్మూర్తి.

రాంబాబును ఓదార్చాలని, ధైర్యం చెప్పాలని మనసులో రకరకాల ఆలోచనలు. అడవిలో కొంతదూరం వెళ్ళి టక్కున జీపు ఆగిపోయింది. అందరూ తుపాకులతో సిద్ధంగా నిల్చున్నారు.

“పదండి, నడవాలి. ఆ కుర్రకుంక జాగ్రత్త.”

డి.యస్.పి., ఎస్.ఐ. శివలింగం దిగారు. ఖాసిం కూడా తుపాకితో సిద్ధమయ్యాడు.

వాళ్ళ మామూలు పద్ధతి ప్రకారం రాంబాబును మధ్యలో నడిపిస్తున్నారు. ముందు యస్.ఐ. వెనక డి.యస్.పి. రెడ్డి.

రాంబాబు చేతి సంకెళ్ళు గణగణమంటున్నాయి. వొరుసుకుపోయి ముంజేతులు నొప్పి పెట్టాయి. అడవి దగ్గినట్టుగా బూట్లు చప్పుడు.

దట్టమైన అడవిగుండా ప్రయాణం.

దారిపొడుగునా రాంబాబు మాట్లాడుతూనే వున్నాడు. మానవుడు, నిజమైన స్వేచ్ఛ, ఈనాటి దేశ పరిస్థితులు, రాజకీయ సిద్ధాంతాలు, రాజీ మార్గాలు, ప్రపంచం నిండా రగులుతున్న విప్లవ జ్వాలలు, పోరాటాలు, దోపిడీ వర్గాలు, కోర్టులు చేస్తున్న మోసాలు, వర్గాలుగా చీలిపోతున్న భారతీయులు, వాటి ఆవశ్యకత, ఒకటేమిటి ఎన్నో తెలిసినవాడిలా అంత చిన్న వయసులలో అనర్గళంగా మాట్లాడుతూ, మధ్య మధ్య ఛలోక్తులతో, నవ్వులతో, పోలీసుల వెంట నడుస్తూ వున్నాడు రాంబాబు.

రాంబాబు వీపుమీద తుపాకీ గురి పెట్టివుంది. అయినా అతనిలో ఇసుమంతైనా భయంలేదు.

“నేను దేశద్రోహిని. పద్నాలుగేళ్ళ పసివాడు దేశద్రోహి. నేను పీల్చేగాలి దేశ ద్రోహులకు సాయంచేసేది. నేను పుట్టి పెరిగిన భూమి నాది కాదు. నా పాటలు, నా కథలు, వేలాది లక్షలాదిమంది విన్నారు. విన్నవాళ్ళు వినిపిస్తారు. నా గీతాల్లోని సాహిత్యాన్ని, సత్యాన్ని ప్రచారం చేస్తారు. నన్ను మాయం చేయగలరు కానీ నా గీతాన్ని ఏంచేయగలరు? మీరు ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో వున్నారు. మాది ప్రజల పక్షం. మేము గెలిచేదీ లేనిదీ చరిత్ర తప్పకుండా రుజువు చేస్తుంది. కాని, ఇష్టంలేని, ఆత్మ అంగీకరించని, శత్రుపక్షంలో నిల్చొని ఏం సాధిస్తారు? ఏ వ్యవస్థను నిలబెట్టదలుచుకున్నారో అదే పరోక్షంగా మిమ్మల్ని ఖూనీ చేస్తుంది. ఆలోచించండి?” మధ్య మధ్య ఆగుతూ, సాగుతూ రాంబాబు చెపుతున్న మాటల్లోని సారాంశాన్ని అందరూ మౌనంగా వింటున్నారు.

గమ్యం చేరుకున్నారు కాబోలు, ఇన్‌స్పెక్టర్లు ఆగిపోయారు.

వ్యూహం ప్రకారం పోలీసులు నించున్నారు.

యస్.ఐ. శివలింగం తెచ్చి పెట్టుకున్న ప్రేమతో, “ఒరేయ్ బాబు. నువ్వింకా కుర్రాడివిరా, తెలిసీ తెలియకుండా, చాలా చాలా మాట్లాడుతున్నావు. నువ్వెంత నీ వయసెంతరా?” అన్నాడు.

పార్టీ పరిజ్ఞానానికి వయసక్కరలేదు. సార్. ఆడా మగా, చిన్నా పెద్దా తేడా కూడా వుండదు. మా చదువులు, మీ న్యాయాలకు పరిమితాలు కావు. అవి విశ్వవ్యాప్తమైనవి. నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది, మీరు మాదగ్గరకాని, మేము మీదగ్గర కాదు, సార్.”

“చూడు రాంబాబూ! ఇంటికెడతానంటే పువ్వుల్లో పెట్టి మీ వూళ్ళో దిగబెడతాం. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం స్కాలర్‌షిపు ఇచ్చి చదివిస్తోంది. తల్లిదండ్రి కడుపు కాల్చకు. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతూందిరా,” అన్నాడు.

రాంబాబు కిలకిలా నవ్వి, “సార్ మీ సానుభూతికి థాంక్స్. నా మాటేంటో దారేంటో చెప్పాను. అదే నా నిర్ణయం. మీరే ఆలోచించుకోండి” అన్నాడు.

డి.యస్.పి. “అంతేనంటావా?”

“అయితే, మీ నాయకుల స్థావరాలు ఎక్కడో చెప్పు.”

రాంబాబు నవ్వి, “స్థావరాలా, సార్? మీకేం గుండెలున్నాయి. అక్కడికెళ్ళడానికి? ఒకనాడుండేవి. ఇవాళ లేవు. ప్రతి మనిషీ, ప్రతి అడుగూ, అడుగులోని ప్రతి మట్టీ, అటువంటి స్థావరంగానే తయారయ్యింది. చాతనైతే తేల్చుకోండి. నేను చెప్పేది అదీ,” అన్నాడు.

“అధిక ప్రసంగం చేస్తున్నావు.”

“మాకు హద్దంటూ వుంటేగదా అధిక ప్రసంగం చేయడానికి? సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరి ప్రాణాలకు తెగించి పోరాడే ప్రతీ వ్యక్తి నాలాగే మాట్లాడుతాడు. ప్రపంచంలో ఏ పుట తిరగేసినా ఇదే సత్యం కనబడుతుంది. మీరు ప్రభుత్వం కాదు. ఈ తుపాకులు తయారు చేసేవాళ్ళు ప్రభుత్వం. మీ శరీరం ప్రభుత్వానిది కాదు. ఈ కాకీ నిక్కర్లు తొడిగించిన వాళ్ళు ప్రభుత్వం. మీరు కాల్చే ధైర్యం ప్రభుత్వం కాదు. డ్యూటీ పేరుమీద మిమ్మల్ని భయపెట్టి కాల్చండి, లేదా చావండి అంటూ వెన్నంటి తరిమే యంత్రాంగం ప్రభుత్వం. మీరుండే ఇళ్ళూ, కాలనీలు ప్రభుత్వం కాదు. దేశంలో వేలాది ఎకరాల్ని పెట్టుబడుల్ని గుప్పిట్లో పెట్టుకొని పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు ప్రభుత్వం.”

“అన్నలారా ఆలోచించండి. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమో, దోపిడీ ప్రభుత్వమో తర్కించుకొని శాస్త్రీయమైన మా పోరాటంలో చేరండి. తుపాకులు అప్పగించి దేశంకోసం వీరుల్లా పోరాడండి.”

“యూ షటప్ బ్లడీ” గాండ్రిస్తూ రెచ్చిపోయాడు డి.యస్. పి. రెడ్డి.

. “టూట్వెంటీ షూట్ హిమ్”.

రాంబాబు మళ్ళీ నవ్వి, “సార్, నన్ను చంపగలరుకాని న్యాయాన్ని చంపలేరు. నా సిద్ధాంతాన్ని చంపలేరు. ఊఁ కానీయండి. మీపని,” అని కళ్ళు మూసుకు నించున్నాడు.

రామ్మూర్తి “నో సర్!” అని తుపాకీ దించాడు.

“వన్ నైంటీ నైన్!”

“నో సర్!”

“టూ హండ్రెడ్!”

“నో సర్!”

ఒకరొకరే పోలీసులందరూ తుపాకులు దించారు. ఇన్‌స్పెక్టర్లు ఒకర్నొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. కాసేపట్లో డి. యస్.పి. పిస్తోలు ఢామ్మని మోగింది. రాంబాబు నేలకొరిగాడు. నేలంతా భరించలేనట్లు రక్తాన్ని చిమ్మింది. ఆకాశం అరుణారుణమై ప్రకాశిస్తోంది.

పని పూర్తిచేసుకొని జీపు వెనక్కి బయలుదేరింది, అడవి దాటకుండానే నీళ్ళు అయిపోయి ఆగింది జీపు. ఈ అడవిలో నీళ్ళు ఎట్లా అంటే ఎట్లా అని తర్కించుకోసాగారు అంతా.

చివరికి రామ్మూర్తి, “ఇప్పుడు వెళ్తుంటేచూశాను, సార్, ఆ డొంకలోనే సెలయేరున్నట్లుంది.” అన్నాడు భయం భయంగా డి.యస్.పి.తో.

“అయితే, ఏయ్, వన్ నైంటీ నైన్, నువ్వు రామ్మూర్తికి తోడుగా వెళ్ళు” యస్.ఐ. శివలింగం.

“నే వెళ్ళను సార్, భయంగా వుంది.” ఒక్క రామ్మూర్తి తప్ప అందరూ భయాన్నే వ్యక్తం చేశారు.

“మీ పని స్టేషను కెళ్ళాక చూడాల్సిందే” అంటూ రామ్మూర్తితో పాటు డి.యస్. పి. రెడ్డి మీసాలు దువ్వుకుంటూ బయలుదేరాడు.

పొదలూ, గుంటలూ దాటారు ఇద్దరు.

రామ్మూర్తి మనసులో తుఫాను బయలుదేరింది. అడవంతా రాంబాబు మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. అడుగు అడుగులో రాంబాబు నవ్వే ప్రతిఫలిస్తోంది.

“భయమేస్తుందా, రామ్మూర్తీ?” అన్నాడు డి.యస్. పి.

“లేదు సార్.”

నడక సాగుతూనే వుంది.

రామ్మూర్తి మనసు గట్లు వొరుసుకొని తిరగబడ్డ నదిలా వుంది ఏ క్షణానికాక్షణం రాంబాబు కళ్ళముందు నించుని కిలకిలా నవ్వుతున్నాడు. రక్తం మడుగులో పొర్లాడుతున్న రాంబాబు దేహం చేతులందిస్తున్నట్టుగా వుంది.

ధైర్యం తెచ్చుకున్నాడు. తుపాకి ఎత్తి క్షణంలో డి.యస్. పి. రెడ్డిని కాల్చి అతని పిస్తోలు లాగేసుకొని రాంబాబు మృత కళేబరం వైపు పరుగు లంకించాడు రామ్మూర్తి.

రెండు రోజుల తర్వాత, “పోరాటంలో ఇద్దరు నక్సలైట్లు వధ అందులో ఒకడు పద్నాలుగేళ్ళ కుర్రవాడని అధికారయుతంగా తెలుస్తోంది. ఒక తుపాకి, రెండు చేతిబాంబులూ, మావో సాహిత్యం లభ్యం. పోలీసులెవరికీ గాయాలు తగలలేదు” అని మాత్రం వచ్చింది.

(ముద్రణ : “ఇప్పుడు వీస్తున్నగాలి” (సంకలనం) 1970-71)

అస‌లు పేరు బ‌ద్ధం భాస్క‌ర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టాడు. హైద‌రాబాద్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేశాడు. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. 'న‌న్నెక్క‌నివ్వండి బోను'తో క‌వితాకాశంలో సూర్యుడిలా పొడుచుకొచ్చాడు. విర‌సం వ్య‌వ‌స్థాప‌క కార్య‌వ‌ర్గ స‌భ్యుడు. 1971-72లో విర‌సం కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాడు. శ్ర‌మ‌జీవుల జీవితాల‌పై ఎన్నెన్నో పాట‌లు రాశాడు. విర‌సం మీద ప్ర‌భుత్వం బ‌నాయించిన సికింద్రాబాద్ కుట్ర‌కేసులో ముద్దాయి. క‌వితా సంపుటాలు: 'దిక్సూచి', 'ముట్ట‌డి', 'గ‌మ్యం', 'జ‌న్మ‌హక్కు'. న‌వ‌ల‌లు: ప్ర‌స్థానం, మా పల్లె. గంజినీళ్లు(నాటిక‌), చిరంజీవి, మ‌రికొన్ని క‌థ‌లు రాశారు. . ప్ర‌భుత్వం చెర‌బండ‌రాజుని నిరుద్యోగానికీ, అనారోగ్యానికీ గురిచేసి బ‌లితీసుకుంది. మెద‌డు క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు.

 

Leave a Reply