చిటికెన వేలు నృత్యం

ఐదు వేళ్ళలో…
అన్నింటికన్నాచిన్న వేలు
నా అష్టాచెమ్మా ఆటల్లోనూ
గుజ్జెనగూళౄ… కబడ్డీ ఆటల్లోనూ
పరుగు పందాల్లోనూ…
కఠినమైన గణిత సూత్రాలు పరిష్కరించడంలోనూ
మిగతా నాలుగు వేళ్ళూ కలుపుకుని
ఆత్మవిశ్వాసపు పిడికిలిగా
మార్చిన నా చిటికెన వేలు!
బొటనవేలితో విజయాన్ని
సూచించాలన్నా భాగమవ్వాల్సిన
చిటికెన వేలు!

చివరికి ఉద్యమ నాయకురాలినైనా
రాజకీయాధినేత్రినైనా
పిడికిలెత్తి కొట్టేవాణ్ణో
ఆసిడ్ పోయాలనుకునేవాణ్ణో
చూపుడు వేలితో బెదిరించాలన్నా
నిలువరించాలన్నా
మిగతా నాలుగు వేళ్ళకూ బలాన్నిచ్చిన
చిటికెన వేలు!

కవిత్వమో పాటో
కథో ఆరోపణో రాసినప్పుడల్లా
కలాన్ని దృఢంగా పట్టుకోడానికి
నాలుగు వేళ్ళకీ
పునాది వేలుగా నిలబడి పట్టునిచ్చే
చిటికెన వేలు!

గర్వంగా తలెత్తుకుని నిలబడే
చిటికెన వేలు!
అయితే…
నాలుగు రోడ్ల కూడలిలో
నా దేహంలోని ఒక చిన్న ద్రవసంచి
కలిగించే ఒత్తిడికి
తలదించుకుంటుంది!
నాలుగు వేళ్ళ కౌగిలిలో
లొంగిపోతున్నట్లు ఒరిగిపోయి
ఒంగి పోతుంది!
భరించలేక బిగించిన పిడికిలి కూడా
ఆత్మవిశ్వాసపు ప్రతీకలా కాకుండా
పిరికిగా ముడుచుకు పోతుంది!


నేను చిన్న పిల్లగా బడికెళ్ళేప్పుడు
దేహంలో పోటెత్తిన త్సునామీని
చెప్పలేక గుబురో పొదో దొరకక
ముడుచుకు పోయినప్పుడు
ఒత్తి పట్టిన తొడల మధ్య నుంచి
పాదాల మధ్య నేలపైన
చిన్న చెరువొకటి పుట్టుకొచ్చి
ఫక్కుమన్న వెటకారపు నువ్వుల మధ్య
కళ్ళు కూడా చెలమలయ్యేవి!


నేను యవ్వనవతి నయ్యాక
శ్రావణమాసమో ధనుర్మాసమో
మాసాలు మారినప్పుడల్లా
కాలేజీకెళ్ళేప్పుడో బస్సెక్కేలోపు
చాటు -దాపు దొరికే లోపు
ఆపుకోలేక తడిసిపోయిన
రుధిర నేప్కిన్ల రసాయనాలతో
నడిచిన ప్రతి కదలికలోని రాపిడిలో
చిట్లిపోయె చర్మపు ఇన్ఫెక్షన్
కలిగించే మంటనో
పిడికిలి బిగిస్తూ భరిస్తూ
మాసాలు మారినప్పుడల్లా
భయంతో ఒంటికి పోవడం
ఒణికి పోవడం
ఒక నెలవారీ ఆనవాయితీగా మారిపోయింది!


భార్య నయ్యాక
కడుపులో పెరిగే బిడ్డకే కాదు
మొగుడు కదా
వాడు అంటించిన సుఖక్రిములకీ
నా మీద ఆధిపత్యమే!


ఆసుపత్రి కెళ్ళేలోపు
దొరకని మూత్ర శాల కోసం
బిగపట్టిన మూత్రాశయం
చిట్లిపోయే లోపల
కనిపించిన ఏ షాపింగు మాల్లోకో
దొంగలాగా నిస్సిగ్గునై
పరిగెత్తాల్సి వచ్చేది!
గర్భసంచీ – మూత్రసంచీ
రెండూ సముద్రాలయ్యేవి!
నా పిడికిలి సాధించిన ఆత్మవిశ్వాసాన్ని
చిటికెన వేలు ఓడించేది!


ఇప్పుడు…
అమ్మమ్మను కదా
మెనోపాజ్ కదా
ఆపుకొనే బలాన్ని కోల్పోయిన
మూత్ర సంచిని మోసే
వృద్ధ దేహాన్ని కదా
అమ్మమ్మ నయ్యాక
నా చిటికెన వేలు
ఇంకా నాట్య మాడుతూనే ఉంటుంది
నా మనవరాలి చిటికెన వేలితో పాటు!!

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

7 thoughts on “చిటికెన వేలు నృత్యం

  1. వాస్తవాన్ని అద్భుతంగా చిత్రించావు గీతాంజలీ..

  2. నాకు మాత్రమే తెలిసిన ఈ అద్భుతమైన అక్షరాలకు వయసు ఓ 33 ఏళ్ళు. ప్రతి అక్షరం తాను జీవం పోసుకోవాలంటే దారి చూస్కునేది గీతాంజలి చేతి స్పర్శ కోసమే… ఓ చీకటిని చీల్చుతున్న ఓ కాంతిరేఖలా…ఓ చిటికిన వేలు చూపుతున్న ఓ ఆలోచనా దారి…. ఇంకా ఎన్నో పదాలకు పురుడుపోయాలని ఆశించే ఓ సుదీర్ఘ స్నేహాన్ని….ఉదయ్ ని… భాస్కర్ ని….

    1. హాయ్ ఉదయ్ సారీ ఇప్పుడే చూసాను నీ కామెంట్ ని సారీ మాట్లాడతాను

  3. కదిలించేలా రాశారు. అందులో మీదయిన ముద్ర వుంది..

  4. చాలా బాగుంది మేడం, బాధాసారూప్యత కలిగిన అక్షరాలకు అభినందనలు

Leave a Reply