గగుర్పాటుకు గురిచేసే అరాచక కవి

చార్లెస్ బ్యుకోస్కి (1920-1994), తన కవిత్వంతో, జీవన విధానంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కవులను ప్రభావితం చేసిన ప్రఖ్యాత జర్మన్ – అమెరికన్ కవి. తన ఇరవై ఏళ్ళ ప్రాయంలోనే తోలి కవిత్వం, కథలు ప్రకటించినప్పటికీ, అమెరికన్ సాహిత్యంలో సరైన స్థానం లభించలేదన్న బెంగతో పది సంవత్సరాల పాటు అనేక ఉద్యోగాలు మారుతూ, మధుశాలల వెంటా, స్త్రీల వెంటా తిరుగుతూ కొంత కాలం పాటు సీరియస్ రైటింగ్ కు దూరమైన అరాచక కవి. ఆ పది సంవత్సరాలను ‘తాగుతూ కూర్చున్న సంవత్సరాలు’ అంటాడు. చివరికి, లాస్ ఏంజెల్స్ లోని తపాలా ఆఫీసు ఉద్యోగంలో కాస్త కుదురుకున్నాడు. అతని జీవితమంతా పిచ్చితనం, మృత్యువు అనే రెండు సరిహద్దుల నడుమ గడిచింది. అందుకే, అతని కవిత్వంలో కూడా ఈ రెండూ పునరావృతం కావడం కనిపిస్తుంది.

అప్పటిదాకా రూపకాలతో, మార్మికతతో, లయతో ప్రవహిస్తూ వొచ్చిన ఆధునిక కవిత్వాన్ని, తన మొహమాటం ఎరుగని సంభాషణ శైలితో కొత్త దారులు తొక్కించిన కవి బ్యుకోస్కి. ‘అతనివి కవితలు కావు – ఆవేశ పూరిత అడ్డగోలు రాతలు’ అని కొందరు విమర్శకులు తిట్టిపోసినప్పటికీ, ఆ కవితల లోని తీవ్రమైన భావోద్వేగాలు చార్లెస్ బ్యుకోస్కి కి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ఒక కవి కవిత్వాన్ని, అతడు జీవించిన కాలం నుండి వేరు చేసి చూడలేము. బ్యుకోస్కి బతికిన కాలం, రెండు ప్రపంచ యుద్ధాలను, వియత్నాం యుద్ధాన్ని చూసింది. అందుకే, అతడి కవిత్వంలో ఆ కాలపు సంశయాలు, చేదు అనుభవాలు గోచరిస్తాయి. అట్లా అని అతడి కవితలలో యుద్ధాలు మనుషుల జీవితాల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా మోపిన భారం మాత్రమే కనిపించదు. అనేక ప్రేమ కవితలు, విఫల ప్రేమ కవితలు కూడా కనిపిస్తాయి. అయితే, పైకి కనిపించినట్టు ప్రేమ కవితలు కూడా కాదు. ఎంత వెతికినా దొరకని ఒక మంచి తోడు కోసం కవి పడిన తపనగా ఈ ప్రేమ కవితలు అగుపిస్తాయి.

దాదాపు 60 పుస్తకాలు రచించిన బ్యుకోస్కి, కవిగా మాత్రమే కాదు; కథా నవలా రచయితగా, కాలమిస్టుగా కూడా అమెరికన్ సాహిత్యంలో సుప్రసిద్ధుడు. అమెరికా మురికి వీధులలో బతుకుతూ, శారీరక శ్రమతో బతుకును వెళ్లదీస్తూ, మధువు, మగువల నడుమ బతికే సగటు అమెరికా పౌరుల జీవితాలే అతడి సాహిత్య వస్తువులు. ఒకానొక కాలంలో అతడు రాసే ఒక కాలమ్ మీద ఎఫ్ బి ఐ సైతం నిఘా పెట్టింది. 1986 లో టైమ్ మ్యాగజైన్ బ్యుకోస్కి ని ‘అమెరికా బడుగు జీవితాల సాహిత్యవేత్త’ అని కొనియాడింది.

చార్లెస్ బ్యుకోస్కి సమాధి మీది వాక్యాలు కూడా అబ్బురపరుస్తాయి. ఆ వాక్యాలు సృజనకు, జీవించే పద్ధతికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాన్ని కవితాత్మకంగా చెబుతాయి. ఆ వాక్యాలు ఇట్లా సాగుతాయి –
“ప్రయత్నించకు! ఇది చాలా ముఖ్యం! ఖరీదైన కారు కొరకు, సృజన కొరకు, అమరత్వం కొరకు ప్రయత్నించకు! వేచి చూడు! ఏదీ సంభవించకపోతే మరికొంత కాలం వేచి చూడు! గోడ పైన అంతెత్తున వున్న పురుగు వంటిది అది. అది కిందకు దిగే వరకు వేచి చూడు! అది నీ చేరువకు రాగానే గట్టిగా ఒక్క దెబ్బ వేసి చంపి వేయి! లేక, అది నీ కంటికి ఇంపుగా అనిపిస్తే దానిని పెంచుకో!”

కవిత్వం

భరించలేనంత
నిరాశ
అసంతృప్తి
భ్రమ
కావాలి
కొన్ని
మంచి కవితలు
రాయడానికి

కవిత్వం
ఎవరు పడితే వారు
రాసేది కాదు

ఆ మాటకొస్తే
చదివేది కూడా కాదు

గ్రహాంతర వాసులు

మీరు నమ్మకపోవొచ్చు గానీ
కొందరు వుంటారు
ఘర్షణ, బాధ, నొప్పి అన్నవి పెద్దగా
తెలియకుండా జీవితాలు గడిపే వారు
వాళ్ళు చక్కటి దుస్తులు వేసుకుంటారు
చక్కటి తిండి తింటారు
చక్కగా నిద్రపోతారు
వాళ్ళు వారి కుటుంబ జీవితంతో
తృప్తిగా వుంటారు
దుఃఖ పడే క్షణాలు ఉన్నప్పటికీ
అవి వాళ్ళని పెద్దగా కలవరపరచవు
చాలాసార్లు వాళ్ళ మరణం కూడా
సుళువుగానే ఉంటుంది
తరచుగా నిద్రలోనే ఉంటుంది
మీరు అస్సలే నమ్మకపోవొచ్చు గానీ
అటువంటి వాళ్ళు కొందరున్నారు
కానీ
నేను వాళ్లలో ఒకడిని కాను
అయ్యో !
వాళ్ళ దరిదాపుల్లోకి కూడా రాను నేను
వాళ్ళు అక్కడ వున్నారు
నేను ఇక్కడ

రాయడం

తరచుగా అసంభవానికీ నీకూ
నడుమ మిగిలేది ఇది మాత్రమే
మధువు, స్త్రీ ప్రేమ, ఐశ్వర్యం
అన్నీ దీని ముందు దిగదుడుపే
రాయడం తప్ప
మరేదీ నిన్ను రక్షించదు
కూలిపోయే గోడలను
కమ్ముకొచ్చే సమూహాలను
రాయడమే నిలువరిస్తుంది
చీకటిని ధ్వంసం చేస్తుంది
గొప్ప మానసిక వైద్యుడు రాయడం
దేవుళ్లలోకెల్లా దయగల దేవుడు
రాయడం మృత్యువును నిలువరిస్తుంది
నిష్క్రమించడం తెలియదు దానికి
తనను తాను చూసి నవ్వుకుంటుంది
తన నొప్పిని చూసి నవ్వుకుంటుంది
రాయడం ఒక చివరి ఆశ
చివరి వివరణ

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply