చలం- మతం- దేవుడు- మనం

పుస్తకం- అది ఏ కాలంలో ఏ ప్రక్రియకు సంబంధించిందైనా కావచ్చు – సాహిత్య సృజన కావచ్చు, చరిత్ర కావచ్చు, విమర్శ కావచ్చు, సామాజిక తాత్విక చింతనా సంబంధి కావచ్చు- ఏమైనా అది కాలగతిలో సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక సందర్భాలు మారుతున్నపుడల్లా చదివే పాఠకులకు ఎప్పటికప్పుడు సమకాలీన సంక్లిష్టతలను, సంఘర్షణలను అర్ధం చేసుకొనటానికి కొత్త సాధనంగా అంది రావటంలోనే సార్వకాలిక గుణాన్ని సంతరించుకొంటుంది. అది స్వీయ అధ్యయన అనుభవంలోకి రావటం మెదడులో వెలుతురు కిటికీలను తెరుస్తుంది. చలం మ్యూజింగ్స్ అలాంటి అనుభవం ఇచ్చిన పుస్తకం.

2024 మే 18. చలం 130 వ జయంతి. ఆ రోజున హైదరాబాద్ లో జరిగే ఒక సభలో మాట్లాడటానికి మ్యుజింగ్స్ చదువ వలసి వచ్చింది. 30 ఏళ్ళ తరువాత మళ్ళీ చదవటం ఇదే. 1994 చలం శతజయంతి సంవత్సరం. తెలుగు సమాజ చరిత్రను, సాహిత్యాన్ని స్త్రీవాద దృక్కోణం నుండి అధ్యయనం చేస్తున్న కాలం. ఆ క్రమం లోనే అప్పుడు స్త్రీపురుష సంబంధాల గురించి చలం ఆలోచనలు మ్యూజింగ్స్ లో ఎలా భాగమయ్యాయో తెలుసు కోవాలన్న దృష్టి మాత్రమే ప్రధానమైంది. ఇప్పుడు వర్తమాన ఫాసిస్ట్ మత రాజకీయ సందర్భం లో చదువుతుంటే మతం, వేదాంతం, దేవుడు మొదలైన వాటి గురించి చలం ఆలోచనలు ఆశ్చర్యం కలిగించాయి. వాటిలో తర్కం, వ్యంగ్యం నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. ప్రత్యేకించి రామాయణం గురించి రాముడి గురించి చలం వ్యాఖ్యలు చదువుతుంటే అసలు ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచం రామాయణాన్నిఎలా చూసిందీ, రాముడిని ఎలా వ్యాఖ్యానించిందీ ప్రత్యేకంగా అధ్యయనం చేయటం అవసరం అనిపించింది.

అనేకానేక విషయాలగురించి వ్యక్తి చింతనలో నిరంతరాయంగా కదిలే భావాలు ఆలోచనలు భిన్న సమయాలలో, భిన్న సందర్భాలలో జ్ఞాపకాలుగానో కథనాలుగానో, సంభాషణలో భాగంగానో వ్యాఖ్యనించబడే ప్రక్రియ మ్యూజింగ్స్. చలం మ్యూజింగ్స్ 1937 నుండి 1955 మధ్యకాలంలో రచించబడినవి. హిందూ సామాజిక కుటుంబవ్యవస్థల లో స్త్రీల మీద, పిల్లలమీద అమలయ్యే అధికారానికి నొచ్చుకొంటూ 1920ల నాటికే రచనలు ప్రారంభించిన చలం మ్యూజింగ్స్ అత్యంత సహజంగా హేతువాద ప్రజాస్వామిక సామ్యవాద భావ చైతన్యంతో ఆధునికమవుతున్న ఆ కాలపు ప్రశ్నలకు, సందేహాలకు, నిరసనలకు, ధిక్కారాలకు, తిరుగుబాట్లకు ప్రాతినిధ్యం వహించాయి. ప్రకృతి సౌందర్యం, స్వేచ్ఛాకాంక్ష, సుఖదుఃఖ అనుభవం, విద్యావిధానం, స్త్రీ పురుష సంబంధాలు, పాతివ్రత్యం, పిల్లలపెంపకం, హింసాహింసల విచికిత్స, వేదాంత తాత్విక విషయ వివేచన, కవిత్వం, పాట, ప్రాచీన ఆధునిక సాహిత్య రచయితలు, రచనలు, కమ్యూనిజం, జాతీయోద్యమ రాజకీయాలలో గాంధీ స్థానం వంటి అనేకానేక విషయాల మీద చలం ఆలోచనలు మ్యూజింగ్స్ లో భాగం అయ్యాయి. మతమే ప్రభుత్వం అవుతూ, రామనామం అధికార దండం అవుతూ, ఆరోగ్యకరమైన లౌకిక ప్రజాస్వామిక స్వభావం అభావం చేయబడుతున్న వర్తమాన సందర్భంలో మతం, దేవుడు, రాముడు అనే మూడంశాలకు పరిమితమై చలం భావనల పరామర్శ తక్షణ కర్తవ్యం.

1

“కుల మతాలను వొదిలిపెట్టటం ఒక మహత్కార్యం కాదు. కాని వొదిలిపెట్టలేకపోవడం అల్పత్వం, భీరుత్వం, అంధత్వం. వీటన్నిటి కన్నా గొప్పది అసలు మనిషి కారెక్టర్,” అంటాడు చలం. కుల భేదాలు సర్వమానవ సౌభృత్వత్వానికి అడ్డు అని అంగీకరిస్తూనే, కులభేదాలు పాటించే వాళ్ళలో కూడా చాలామందికి ఇరుగుపొరుగు వారి మీద నిజమైన ప్రేమ ఉండటం గమనించాడు కనుకనే వీటన్నింటికన్నా గొప్పది అసలు మనిషి క్యారెక్టర్ అనగలిగాడు. మనిషి అసలు గుణం ప్రేమ. సహజీవన సౌందర్యం. అంతే కానీ కులమూ మతమూ కాదు అని చెప్పదలచుకొన్నాడు చలం. ఆ రకంగా ఆయన జనజీవిత సంప్రదాయంలో సహజభాగంగా ఉన్న లౌకిక విలువల పట్ల గౌరవం కనబరిచాడు.

లోకంలో మనుషుల బాధల గురించి చింతిస్తూ చలం అంతా కర్మ అని సరిపెట్టుకోమనే బోధనల పట్ల అసహనం ప్రకటిస్తాడు. ‘ఈశ్వరేచ్ఛ’అని బాధలకు బాధ్యత వహించకుండా తప్పించుకొనే పద్ధతిని నిరసిస్తాడు. కష్టాలు, దురదృష్టం నీకు ఒక్కడికేనా లోకంలో అందరికీ సామాన్యమే అనే ఓదార్పులు కూడా అతని దృష్టిలో అసంబద్ధమైనవి. బాధలు మనకే కాదు ఇతరులకు కూడా ఉన్నాయని తృప్తిపడమని చెప్పే వేదాంతంలోని అమానవీయతను ఏవగించు కొన్నాడు. అంతకన్నా మనకీ, వాళ్ళకీ ఎవరికీ బాధలు లేని మార్గం గురించి అన్వేషించటం మంచిది కాదా అని అంటాడు. ఈ సందర్భంలోనే “మతగ్రంధాల్లో కనబడితే చాలు ఏదన్నా సంగతి దాన్ని గురించి మంచిచెడ్డలు విచారించే శక్తి ప్రజలకి పూర్తిగా నశిస్తుంది. అదంతా సత్యమేనని, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు దుర్మార్గులనీ…” అనుకొనే లోకపు తీరును గురించి చలం చెప్పిన మాట గమనించదగినది. మతగ్రంధాలలోని మంచిచెడ్డల విచార చర్చ నేరంగా ఆ నాటికే స్థిరపడ్డ వాస్తవం. డెబ్బై అయిదేళ్ల తరువాత అది ఎంతగా ఘనీభవించిందో మనం చూస్తూనే ఉన్నాం.

“మతం పేరిట ఏ వికృతమైనా చలామణి అయినట్లే కవిత్వం పేరిట ఏ అసందర్భమైనా మెప్పు పొందుతుంది” అంటాడు చలం. కవిత్వాన్నిగురించి వ్యాఖ్యానించటం సందర్భం. అందుకోసం మతాన్ని దాని స్వభావంతో కలిపి ఉపమానం చేసాడు. భార్యలతో సుఖంగా కాపురం చేయటం, పిల్లలను ప్రేమించటం పాపకార్యాలుగా చెప్పి నీతి పేరిట క్రూరత్వాన్ని, మతంపేరిట కలహాలను పుణ్యకార్యాలుగా చలామణిలోకి తెచ్చిన సనాతనధర్మాన్ని నిరసించాడు చలం. ఈ దేశంలో మతం సగం సెంటిమెంట్లతో సగం మూఢ విశ్వాసాలతో కూడిన స్వార్ధ ప్రధానమైన సరుకు అని అభిప్రాయపడ్డాడు.

‘నాకు కోపం లేదు,’ ‘దెబ్బలాటలంటే భయం,’ ‘నేను కోర్కెలను అణుచుకోగలను’ వంటి బడాయి మాటలు మాట్లాడే వాళ్ళను చచ్చు పీనుగలు అంటాడు చలం. ఇలాంటి చచ్చు పీనుగులు తయారు కావటానికి కారణం ‘కులాలలో కులాల ఇంటర్ బ్రీడింగ్’ అని పేర్కొన్నాడు. కులాంతర స్త్రీపురుష సంబంధాలు ఆరోగ్యకరమైనవి అని చలం భావిస్తున్నాడన్నమాట. అంబేద్కర్ చెప్పిన కులాంతర వివాహ భావనతో కలిపి దీనిని అధ్యయనం చేయవచ్చు.

శరీరం, యవ్వనం, సుఖ సంపదలు నశించిపోయేవి, ప్రేమ, కోపం మొదలైన సకల గుణాగుణాలు మనసు కల్పించుకొన్న వికారాలు, అసలు ప్రపంచమంతా మాయ అని చెప్తూ వైరాగ్యాన్ని బోధించే ఆలోచనా విధానాన్ని ప్రస్తావిస్తూ చలం ప్రపంచమంతా మాయకావచ్చు కానీ అనుభవం మాయ కాదు అని నొక్కి చెప్తాడు. అనుభవాన్ని కలిగించే సౌఖ్యాలు, అందాలు, విచారాలు మాయ కావు అంటాడు. తేలుకుడితే వేదాంతి అయినా ‘ఇదంతా మాయ,’ ‘తేలు మాయ’ అని నిర్వికారంగా చెప్పలేడన్నది ఆయన వాదన. “పాలికాపు నుదుటి చెమట/ కూలివాని గుండె చెరువు/ బిచ్చగాడి కడుపు కరువు / మాయంటావూ? అంతా / మిథ్యంటావూ ?/ నా ముద్దుల వేదాంతీ / ఏమంటావూ” అనే శ్రీశ్రీ కవితా పాదాలను ప్రస్తావిస్తూ సుఖపడటం మాయ అయినా బాధపడటం అనేది మాయ కాదు అని తీర్మానించాడు. ఆధ్యాత్మికానుభవంలోని ఆనంద కారక అనుకూల అంశాలను పూర్తిగా వెనక్కు నెట్టి, అన్ని సుఖాలు ,కామాలు ఒదులుకోవలసినవి అని ఒత్తి బోధించటం మీదనే కేంద్రీకరించిన శంకరాచార్యుడి అద్వైతం మాయావాదంగా తప్పు మార్గం పట్టిందని చలం అభిప్రాయపడ్డాడు.

హిందువులకి వేదాంతం vaseline (వాసెలైన్), నల్ల మందు, బాధనుంచి వేదాంతంలోకి వెళ్లి మనస్సుని సమాధానపరచుకొని, తమ కౄరత్వంలో, స్వార్థంలో నిద్రపోతారు. అని ఆనాడు చలం అన్నమాట తీవ్రమైనదే కానీ అందులో వాస్తవం విస్మరించరానిది. వేదాంతం ఎక్కడికీ పోని గుడ్డిగల్లీ అని చలం అభిప్రాయం. లోకంలో బాధకి, మృత్యువుకి అర్ధం తెలియచెప్పలేని ఏ మతమూ విజ్ఞానం ఇయ్యలేదనీ ఊరికే చెప్పటం కాదు, మన రీసన్ ని అవునని ఒప్పించాలనీ అంటాడు చలం. ఆ పని చెయ్యంది ఈ మతాలు మనుష్యజీవితానికి అనవసరంగా పట్టిన చీడలని, వుత్త మూర్ఖానికి, ద్వేషాలకి కారణాలని, ప్రతి ఉత్సాహానికి, ప్రయత్నానికి ఆటంకాలని చలం డెబ్భైఐదేళ్లకు ముందే చెప్పిన మాట లోని సత్యాన్ని వర్తమాన అనుభవం నుండి బేరీజు వేసుకోవాలి. రీసన్ ని ఒప్పించటం అన్నది కాలం చెల్లిన నాణెం కావటం వర్తమాన అనుభవం. రీసన్ అన్న మాటే ఈ రోజు దేశద్రోహకరమైన మాట.

సుఖదుఃఖ అనుభవాలు గీటురాయిగా విలువలను నిర్ధారించే చలం ఆధ్యాత్మిక విద్య అన్నిటికన్నా గొప్ప సుఖమిస్తే వాంఛనీయమే అంటాడు. అయితే ఆ సుఖం ఇలాంటిదని రీసన్ ని ఒప్పిస్తూ రూఢిగా ఎవరూ చెప్పలేరు కనుక అదెంతవరకు సాధ్యమన్న సందేహాన్ని మనకోసం వదులుతాడు చలం. వ్యక్తులకు ఆధ్యాత్మిక అనుభవాలు ఉండవచ్చు, కానీ గొడవ ఎక్కడ వస్తుందంటే అవి నిజమని మన అందర్నీ నమ్మమని ఒత్తిడి చేయటం లోనే అంటాడు చలం. ఆ రకంగా ఆయన వ్యక్తి అనుభవాలను, మనోభావాలను వ్యవస్థీకరించి మతంగా స్థిరీకరించటం పట్ల తద్వారా వ్యక్తి మీద అధికారం సంపాదించటం పట్ల పూర్తిగా వ్యతిరేకి.

2

ఆధ్యాత్మిక అనుభవం నైరూప్యం. ఆ అనుభవాన్ని పొందటానికి సాధనంగా సామాన్యులకు అందియ్యబడిన సాకార సగుణ ప్రతీక దేవుడు. దేవుడైనా మెదడులో పుట్టవలసిందేగా అని చెప్పి చలం దేవుడు ‘స్వయంభువు’ అనే వాదాన్ని తిరస్కరించాడు. సమస్యలకు కారణం భగవత్ సంకల్పం, భగవంతుడు నిర్ణయించినట్లే అన్నీ జరుగుతాయి వంటి లోక వాక్యాలను ఆయన తిరస్కరించాడు. ఈ కర్మకు ఈ శిక్ష అని నిర్ణయించేసి దేవుడు నిద్రపోయాడా లేక చచ్చిపోయాడా అన్నది చలం ప్రశ్న. దేవుడే సృష్టికర్త అయితే తాను సృష్టించిన వారికి కష్టాలు కలిగించటం ఎందుకు? అంటాడు. కష్టాలను కల్పించి ఎంత ప్రార్ధించినా, ఏడ్చినా కనికరించని దేవుడు రాయి కాక మరేమిటి అని ప్రశ్నిస్తాడు. దేవుడు మూఢుల్ని, మోసగాళ్ళను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు తోస్తుంది అని అభిప్రాయపడ్డాడు. ‘దేవుడి సహాయంతో మతగురువుల ప్రాపకంలో ఎటువంటి అన్యాయాల్నీ కర్మకిందా, ఈశ్వరుడి దయ కిందా సమర్ధించుకొంటున్నారు అదృష్టవంతులు’ అని దేవుడి పేరు మీద అన్యాయం సామాజిక ఆధ్యాత్మిక సమ్మతిని సంపాదించుకొనటాన్ని చలం ఆనాడే గర్హించాడు. దేవుడు సెంటిమెంట్ , అసత్యం అని తెలుసుకొంటే జీవితం సౌఖ్యప్రదం అవుతుందని చలం భావించాడు.

దేవుడు ప్రత్యేక నామవాచకాలతో అనేక రూపాలు, జీవితాలు పొందుతాడు. వాటిని వర్ణిస్తూ పురాణేతిహాస కావ్య ప్రపంచం ఎంతో విస్తరించింది. అలా ప్రత్యేక జీవితాలు, గుణాలుగల శ్రీరామ కృష్ణులు ఇద్దరు మాత్రమే మ్యూజింగ్స్ లో తరచు ప్రస్తావించబడ్డారు. కృషుడి వాస్తవత్వం, శ్రీరాముడి దైవత్వం గురించి చలం ఆలోచనలు, వ్యాఖ్యానాలు ఆసక్తికరం.

“రామ నామ్ కె దో అక్షర మే / సబ సుఖ శాంతి సమాయీ” అనే కె.సి. డె గ్రామఫోన్ పాట దగ్గర మొదలు పెట్టి రామ అనే శబ్దంలోంచే రామాయణం పుట్టిందా? మంత్ర శాస్త్రంలో వున్న గొప్ప విలువను బట్టి సాధారణ ప్రజలలో దానిపట్ల ప్రేమ కలిగించటానికి రామాయణ కథ కల్పించబడిందా? ఆ పేరున్న రాజు కథ ఏదైనా దీనికి అంట కట్టబడిందా? అని చలం వేసిన ప్రశ్నలు ఆలోచనలను రేకెత్తించేవి. రామ శబ్దంలోని ధ్వని ప్రభావానికి శరీరం మీద, మనసు మీద, నరాల మీద అధికారం ఉందేమోనని దానికి ఉద్వేగపు విలువను ఇచ్చేందుకే రామాయణ కథ వ్రాయబడిందేమోనని చలం ఒక సంభావ్యతను ప్రతిపాదించాడు.

తాను ఒక స్నేహితుడిని కలవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కన్నడ జ్యోతిష్యుడు తటస్థపడ్డాడని, మిత్రుడి పురమాయింపు మీద తన జాతక చక్రం వేసాడని చెప్పాడు చలం. లెక్కకు వచ్చే జాతక చక్రాలు రెండే అని ఒకటి శ్రీకృష్ణుడిది, మరొకటి శ్రీ రాముడిది అని చెప్తూ ఆయన చలం ది శ్రీరాముడి చక్రం అని నిర్ధారించి అంటే జీవితమంతా కష్టాలు అని ముక్తాయించాడట. ఈ సందర్భంలో చలం శ్రీకృషుడికి శ్రీరాముడికి ఉన్న భేదాలగురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. కృష్ణుడు భోగాలు అనుభవిస్తూ, లీలలు ప్రదర్శిస్తుంటే రాముడు ఆదర్శాలూ, వాటికై యత్నం, ఆ మూలంగా తెచ్చి పెట్టుకున్న అశాంతీ, బాధలూ, సంఘద్వేషం, అపవాదులూ మొదలైన వాటితో ఎన్నడూ సౌఖ్యమన్నది ఎరుగక జీవించాడని అంటాడు. రాముడు ప్రతి ఋషికి, కోతికీ, బైరాగికి లోకువైపోయాడనీ, ప్రతివాళ్ళూ ఆయనకు యోగమూ, ధర్మమూ, వైరాగ్యమూ బోధించినవాళ్లేనని ధర్మాలు వెలిగే యుగంలో స్వయంగా విష్ణువులో ముప్పాతిక అంశతో పుట్టిన శ్రీరాముడికి ఈ బోధల అవసరం ఏమిటి అని చలం వేసిన ప్రశ్నలో తిరస్కృత వాచ్యపు కొంటె తనం వినబడుతుంది. ధర్మరాజుతో కలిపి శ్రీరాముడికి ఎవరు బోధించినా చచ్చేదాకా జ్ఞానం వచ్చినట్లు లేదు అని విసుక్కొంటాడు కూడా. అదే అన్ని అల్లరి పనులు చేసిన శ్రీకృష్ణుడికి ఏమి చెప్పటానికి ఎవరికీ గుండెలు లేకపోయాయి అని కృష్ణుడి వ్యక్తిత్వం పట్ల అభిమానం ప్రకటిస్తాడు.

అసలు రాముడు తెలివితక్కువ వాడని చలం ప్రతిపాదన. చిన్నప్పుడు చందమామ కోసం ఏడవటాన్ని బట్టి, అద్దంలో చూపించిన చందమామను అందుకొన్న సంతుష్టిని పొందటాన్నిబట్టి చలం అలా నిర్ధారించాడు. అందువల్లనే తండ్రి దగ్గరనుండి ‘చాకలాడి’ వరకూ ప్రతివాళ్లకూ చులకన అయినాడని భావించాడు. అలాంటి రాముడు ఆదర్శం ఏమిటన్నది చలం ప్రశ్న. తన భార్యను తెచ్చుకోడానికి లక్షలకొలదీ కోతుల్ని వితంతువులను చేసిన రాముడి గురుత్వాన్ని అంగీకరించటం ఎంతవరకు సమంజసం అన్నది చలం విచికిత్స. జీవించటం సుఖం కోసం అనే పథం నుంచి తప్పి జీవించటం అర్పణ కోసం అని భావించటం ఆత్మహత్య సదృశం అని భావిస్తాడు కనుకనే చలం అర్పణను విలువగా బోధించటాన్ని నిరాకరిస్తాడు. అర్పణ కు ఆచరణాత్మక ప్రమాణంగా శ్రీరాముడిని చూపించటాన్ని కూడా తిరస్కరిస్తాడు. జీవితం లోంచి సారాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పిండి పిప్పిచేయటమే కదా అర్పణ అంటే అన్నది ఆయన కోణం.

నివాసం ఉండే ఇంటి పక్క సినిమాహాల్ నుండి వినబడే పాటల గురించి చలం వ్యంగ్య వ్యాఖ్యలు మ్యూజింగ్స్ లో తరచు కనబడతాయి. కరుణాసింధో, కాంచనచేలా అంటూ రాముడిని సంబోధిస్తూ వచ్చే పాట అలాంటివాటిలో ఒకటి. ఆ సంబోధనలలో కాంచనచేలా అన్నది చలం కి అభ్యంతరకరంగా అనిపించింది. కాంచనచేలా అంటే బంగారు ఉత్తరీయం వేసుకొన్నవాడా అని అర్ధం. ఎక్కడైనా ఇలాంటి సంబోధనలు ఉంటాయా అని విస్తుపోతాడు చలం. ఆ సందేహాన్ని తన సహచర మిత్రురాలు లీల ముందు వ్యక్తం చేస్తే ఆమె అది పెద్దగా పట్టించుకోవలసిన విషయం కాదన్నట్లు అది సరేలే ఆ కరుణాసింధో ఏమిటి? అని మరొక సమస్య ముందు పెడుతుంది. అసలు శ్రీరాముడు ఎవరిపైన చూపాడు కరుణ? అని సవాల్ చేస్తుంది. అలోచించి చలం అహల్య అంటాడు. రాతిని నాతిగా చేసినవాడు అన్న కీర్తి రాముడికి ఉన్నమాట నిజమే కానీ, అందులో రాముడి దయ ఏమున్నది? శాపం ఇచ్చిన భర్తే విముక్తి మార్గంగా ఇచ్చిన వరం కదా అన్నది లీల అభిప్రాయం.

ఆంజనేయుడి మీద కరుణ చూపాడా అంటే అతను అంత సహాయం చేసాడుకదా! ఆ మాత్రం చూపకపోతే ఎలా? విభీషణుడి మీదా? అంటే అన్న ను వ్యతిరేకించి వచ్చినవాణ్ణి తన కార్యసాధనకు బాగా ఉపయోగించుకున్నాడు… ఇక ప్రత్యేకం చూపిన దయ ఏముంది? శబరి మీద చూపడా అంటే అది ఆమె ఘనత కానీ ఇతనిదేముంది? పూజిస్తానంటే బాగా పూజించమన్నాడు అంతేగా!? అంటూ తర్కంతో నిరాకరించి చెప్పాడు. బాగాతెలివిగల వాళ్లకి, అన్నీ జాగ్రత్తగా విడదీసి ఆలోచించే వాళ్ళకి కూడా రామభజనతో తలకెక్కిన భక్తి వల్లనో ఏమో ఇలాంటి సందేహాలు రాకపోవటాన్ని చలం పేర్కొన్నాడు. తనంతట తానుగా సాటిమనుషులపట్ల కరుణ చూపే సందర్భం మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కరుణ మనిషిలో ఉండే నైసర్గిక లక్షణం. కరుణాసింధో అని ప్రత్యేకంగా అనటానికి ఏదో గొప్ప కరుణ కనిపించాలి అంటాడు చలం. రాముడిలో అది కనిపించదు అన్నది చలం అభిప్రాయం.

శ్రీరాముడి సెన్స్ ఆఫ్ డ్యూటీ, (విధి నిర్వహణ నిబద్ధత) స్ట్రగుల్ (పోరాటం) గొప్పవని అంటారు. దానిని కూడా చర్చకు పెట్టి లీల ముఖంగా నిరాకరింపచేసాడు. విధినిర్వహణ నిబద్ధత మెచ్చుకోదగినదేకానీ, ఆ విధి తనది అయినప్పుడు. తండ్రి సవతితల్లికి ఇచ్చిన వరం తీర్చటానికి రాముడు అడవికి వెళ్ళటం చలం దృష్టిలో విధినిర్వహణలో బాధ్యత కలిగి ఉండటం అని చెప్పటానికి వీలు లేనిది. నియమాలు, విధులు, ఆదర్శాలు ఏవైనా వ్యక్తులు తమ ఇష్టం ప్రకారం ఏర్పరచుకొనేవే కానీ ఎవరో పై నుండి రుద్దేవి కావు. తండ్రులు, తాతలు, సంప్రదాయాలు, వంశ గౌరవాలు నిర్దేశించే విధినిషేధాల చట్రంలో మెలగటాన్ని సెన్స్ అఫ్ డ్యూటీ గా భావించరాదు అన్నది చలం అభిప్రాయం. రామాయణం గొప్ప కావ్యం అయితే రాముడు ఆదర్శం కావాలా అన్నది చలం ప్రశ్న. రామాయణం వంటి రచనలను కావ్యాలుగా కాక మత గ్రంథాలుగా మార్చటం, పాత్రలను ఆదర్శంగా చూపటం అనర్ధ కారణం అంటాడు చలం. ఆదర్శాలు కాలాన్ని బట్టి, సామాజిక ధర్మాన్ని బట్టి కొత్తగా రూపొందుతుంటాయి అన్న వివేకం లేకుండా ఆ నాటి ఆదర్శాలనే ఈ నాడూ ఆదర్శాలనడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు.

ధర్మానికి మరో రూపంగా చెప్పబడే రాముడికి తనధర్మమేదో తనకు తెలియదు అంటాడు చలం. చాకలివాడో వశిష్టుడో చెప్తే గానీ రావణుడు చెరబట్టిన సీతను ఏలుకొనటం చేయగూడని పని అని తెలియనివాడు, తెలిసాక కూడా ఆ విషయాన్ని సీతకు ఎదుట పడి చెప్పటం ధర్మం అని కూడా తెలియనివాడు అంటూ చేయవలసినది చేయవలసివచ్చినప్పుడు చెయ్యటం తెలియనివాడుగా రాముడి స్వభావాన్ని తేల్చేసాడు. సీతను వదిలెయ్యటం అనేది అతని లోపల్నించి వచ్చింది కాదని, ప్రజాభిప్రాయానికి కట్టుబడి, శాస్త్రానికి కట్టుబడి చేసిందని చెప్తూ ఆ రకంగా రాముడి ధర్మం బయటివిలువలకు కట్టుబడినదే అని నిర్ధారిస్తాడు చలం. పదహారువేలమంది స్త్రీలతో ఏ సమస్యా కృష్ణుడికి రాలేదు కానీ ఒక్క సీతతోనే శ్రీరాముడికి ఇన్ని సమస్యలు అని గుర్తించి చెప్పిన చలం అందుకు కారణం స్త్రీపురుష ప్రేమ ధర్మం రాముడికి తెలియకపోవటం వల్లనే అని సూచిస్తాడు.

రామాయణం మహాకావ్యం అనటం వరకు చలం అంగీకరిస్తాడు. కానీ దివ్యచోదితం, ఆదర్శం అనటంతోనే అతనికి పేచీ. హిందూదేశంలో దాని ప్రేరణ ఈ నాడు అభివృద్ధికి గొప్ప ఆటంకం అని నిర్ద్వంద్వం గా ప్రకటించాడు.

ఈ విధమైన చలం అవగాహనకు ఆయన ప్రజాస్వామిక చింతన సమకాలీన అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక చైతన్య తలాన్ని ఎక్కడో స్పృశించి ఉండటమే కారణం అనిపిస్తుంది. ప్రభుత్వాలు ప్రజల బాహ్యక్షేమానికి చాలా ఉపకారాలు చేస్తున్నట్లు కనబడుతూనే లోపలలోపల వ్యక్తి స్వాతంత్రం హరించే ప్రక్రియ కొనసాగుతుండటాన్ని గ్రహించి చెప్పాడు. ఆ క్రమంలో ధిక్కరించే తిరుగుబాటూ, స్వతంత్రంగా యోచించే శక్తి చాలా నాజూగ్గా నొప్పిలేకుండా లాగేస్తూ ప్రభుత్వాలు అందుకు విద్యా, సంస్కృతి, లా, ఆర్డర్, దేశానికి ఉపద్రవ రక్షణ వంటి పెద్దపెద్ద పేర్లు పెడుతుంటారని అంటాడు చలం. డెబ్బై అయిదేళ్ల క్రితం రాముడి నుండి రాజ్యం వరకు చలం వేసిన ఈ ప్రశ్నలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన వ్యాఖ్యలు ఈ నాటి మత రాజకీయ సందర్భాలను స్పృశించటం మనకు తెలుస్తూనే ఉంది. చలం వంటి వాళ్ళ ప్రశ్నలు వ్యాఖ్యలు సరిగా, సారంగా సాధారణ జనజీవితంలోకి ఇంకక పోవటం వల్లనే లౌకిక విలువల కోసం ఆరాటం, పోరాటం ఈ నాటి అవసరం అవుతున్నది.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

One thought on “చలం- మతం- దేవుడు- మనం

  1. రాముడు యుధ్ధంచేసి లక్షలాది కోతులను వితంతువులను చేయటం ఏమిటీ? రామరావణయుధ్ధంలో మరణించిన వానరులందరూ తిరిగి ఆవెంటనే బ్రతికారు. రామాయణం చదివితే తెలుస్తుంది. చదవకుండా వ్యాసాలు బరికే మేతావులకు ఎలా తెలుస్తుంది?

Leave a Reply