చలం అచంచలం: వివాహం

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-4)

‘వివాహం’ చలం రాసిన నాలుగో నవల. ఈ నవలని చలం 1928లో రాశాడు. అంటే 95 సంవత్సరాల క్రితం రాసిన నవల. తొంభై, వందేళ్ల క్రితం రాసిన చలం రచనలు ఇప్పటి సమాజానికేం పనికొస్తాయనే సందేహం, అప్పటి నుండి ఇప్పటి వరకు సమాజం ఏం మారలేదా అనే ప్రశ్న, స్త్రీలు వందేళ్ల క్రితం వున్నట్లే ఈ రోజున వున్నారా అనే వాదనా కొత్తేం కాదు. సమాజంలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి ఎన్నో మార్పులు సంభవించినా స్త్రీ పురుష సంబంధాలలోని ఆధిపత్య రాజకీయాలు మౌలికంగా మార్పు రాలేదు కాబట్టి అలాంటి మార్పు సంభవించేంత వరకు చలం సాహిత్యం సాపేక్షంగానే వుంటుంది. వివాహ వ్యవస్థలోని పురుషాధిపత్య స్వభావం ఒక అందమైన వ్యక్తిత్వమున్న, సృజనాత్మకత, సామర్ధ్యం వున్న యువతిని ఎలా భర్తకి బానిసగా మార్చగలదో తెలియచేసిన నవల “వివాహం”. ఒక వందేళ్ల క్రితమే చలం స్త్రీల బానిసత్వం గురించి ప్రదర్శించిన కన్సర్న్, చేసిన అభివృద్ధికరమైన ఆలోచనలు ఈ నవల నిండా పుష్కలంగా కనిపిస్తాయి.

ఈ నవల కథానాయకి రవణ. ఆమె తండ్రి రామ్మూర్తి సంస్కరణవాది. అప్పట్లో సంఘ సంస్కరణ, స్త్రీ జనోద్ధరణ అంటే బాలికా విద్య, రజస్వలానంతర వివాహం, వితంతు వివాహాలే. చలం రాసిన ఇతర నవలల మాదిరే ఇందులో కూడా బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం (థియోసఫికల్ సొసైటీ)ల పరోక్ష ప్రస్తావన, ఆయా సమాజాల సంస్కరణోద్యమాలచే ప్రభావితమైన పాత్రలూ వుంటాయి. రామ్మూర్తి కూడా అలాంటి సంస్కరణవాదే. నిజానికి ఈ నవల రామ్మూర్తి చావుతోనే ప్రారంభమవుతుంది. రామ్మూర్తి అన్న వెంకన్న పంతులు బ్రిటీష్ ప్రభుత్వంలో డిప్టీ కలెక్టర్గా పని చేస్తుంటాడు. ఈయన తమ్ముడికి పూర్తి విరుద్ధంగా సనాతనవాది. లోకం దృష్ఠిలో “సదాచార సంపన్నుడు”. ఆయన దృష్ఠిలో రామ్మూర్తి “ఇంపాసిబుల్ ‘ వ్యక్తి. రామ్మూర్తి తనేదైనా ఆదర్శ వివాహం చేద్దామంటే తన కుటుంబంలో వితంతువులెవరూ లేరు. అంచేత కూతురు రవణకి రజస్వలానంతర వివాహం సంకల్పించాడు. తమ్ముడి సంస్కరణ వాదం తట్టుకోలేని వెంకన్న పంతులు అతనితో భోజన సంబంధం మానేస్తాడు. ఐతే రామ్మూర్తి హఠాత్తుగా చనిపోవడంతో సంఘ భయంతో అతని దహన సంస్కారాలు చేయించిన అనంతరం మరదలిని, రవణని తనతో తీసుకెళ్లక తప్పలేదతనికి.

పదమూడేళ్ల రవణ చాలా చలాకీ పిల్ల. అందమైనదే కాదు, చాలా తెలివైనది కూడా. వెంకన్న పంతులింట్లో ఇట్టే కలిసిపోతుంది. తండ్రి నుండి విషయ జ్ఞానాన్ని, సాహిత్యాభి రుచిని వంటబట్టించుకుంటుంది. తాను చలం రచనల్ని చదివానని వెంకన్న పంతులుతో చెబుతుంది. ఆ రకంగా చలం రచయితగా తన ప్రస్తావన తీసుకొస్తాడు నవలలో. ఆమె వెంకన్న పంతులు ఇంటి నిర్వహణ బాధ్యత అంతా నెత్తినేసుకుంటుంది. ప్రతిదీ ఒక పద్ధతిలో సర్దడం చేస్తుంది. వెంకన్న పంతులు ఇంట్లో ఆఫీసు గదిని కూడా సౌకర్యవంతంగా అమరుస్తుంది. వెంకన్న పంతులుకి, ఆయన భార్యకి ఆమె అంటే అమితమైన ఇష్టం కలుగుతుంది.

వెంకన్న పంతులుకి భార్య తరపున బంధువైన వెంకట్రావనే జిల్లా జడ్జి రవణ కోసం ఓ సంబంధం తీసుకొస్తాడు. వరుడి పేరు గోపాల్రావు. అతని తల్లి వెంకంట్రావింట్లో వంట చేస్తుంటుంది. రవణని గోపాల్రావుకిచ్చి పెళ్లి చేస్తే అతని చదువు బాధ్యత అంతా వెంకన్న పంతులే స్వీకరించాల్సి వస్తుందని చెబుతాడు వెంకట్రావు. ఆమె వివాహ బాధ్యత తన మీద వున్నందుకు, పెళ్లి ఎలా చేయాలా ఈ ‘రిఫారం’ పిల్లకి అని గింజుకుంటున్నప్పుడు కట్నం లేకుండా సంబంధం వస్తున్నందుకు వెంకన్న పంతులు సంతోషించి ఓ గుళ్లో ఆమె వివాహం సింపుల్గా జరిపించేస్తాడు. పేదరికం వల్ల బాల్యం నుండి ఎవరో ఒకరి ఇంట్లో పరాధీనంగా బతకడం అలవాటైన గోపాల్రావులో విపరీతమైన ఆత్మ న్యూనతా భావం వుంటాయి. అతనికి లోకువ పడే తత్వం, దాస్యమూ అలవాటై వుంటాయి. అతని మాటలో, నడకలో నిరంతర యాచకత్వం కనబడుతుంటుంది. ఎంత ప్రయత్నించినా అతనికి ‘అల్లుడి దర్జా’ అలవడలేదు. దానితో అతనికి ఎవరూ విలువిచ్చే వారు కాదు. అతన్ని సరుకులు, కూరగాయలు తీసుకొచ్చే పనివాడిగా చూడటం మొదలెడతారు వెంకన్న పంతులు, అతని భార్య. ఇంక గోపాల్రావు తల్లి అప్పమ్మ వంట మనిషిగా, రవణని ఇంటి పని చేసేదానిగా, వెంకన్న పంతులు పిల్లలిద్దరికి చదువు చెప్పడంతో పాటు బైటి పనులు చేసేదానికి గోపాల్రావు అలవాటైపోతారు. వాళ్లనలా వాడేసుకుంటుంటారు వెంకన్నపంతులు దంపతులు. గోపాల్రావు స్కూలు ఫైనల్ పాస్ కాగానే అతన్ని వెంకన్న పంతులు ‘ఓవర్సీర్’ (అంటే ఇప్పటి పాలిటెక్నిక్ సివిల్ వంటిది కావొచ్చు) పరీక్షకి చెన్నపట్నం పంపిస్తాడు. ఎండాకాలం సెలవులకు గోపాల్రావు చెన్నపట్నం నుండి వచ్చే లోపు రవణ పెద్దమనిషవుతుంది. గోపాల్రావు సెలవులకు వచ్చినపుడు కొంత తన ప్రవర్తన మార్చుకొని దర్జాతనం తెచ్చుకున్నా కూడా గోపాల్రావుకి ఇంట్లో గౌరవం దక్కదు. చివరికి వెంకన్న పంతులు కొడుకులు కూడా అతన్ని వేధిస్తుంటారు. అతని బాధ చూడలేకపోతుంది రవణ. అతని కారణంగా రవణ తమకి దూరమై పోతుందని కోపం వెంకన్నపంతులుది. అవమానాల పాలైన గోపాల్రావు మళ్లీ చదువుకోడానికి వెళ్లిపోతాడు.

పుండు మీద పుట్రలా వెంకన్న పంతులు బావమరిది సుబ్బారావు ఊడిపడతాడు. అతనో కవి. వివాహితుడు. రవణకి తన కవిత్వమంతా వినిపిస్తూ వెంటపడుతుంటాడు. అతని గురించి చలం ఇలా అంటాడు “ఈ కవి కుమారుడికి అంతరాత్మ తక్కువ. సంఘ బంధనాలు అంటవు. స్వేచ్ఛా విహారం వల్ల కలిగే బాధ్యతలను మాత్రం సహించడు. పర స్త్రీ హృదయాన్ని జయించి, శరీరాన్ని అనుభవించి, సంతానాన్ని కటాక్షించే వరకే యితని బాధ్యత.” అతని చూపులు రవణని కలవర పెడుతుంటాయి. అతను చేయగలిగే అపాయాలేవీ ఆమెకి తెలియదు. అలాగని ఆమె అతని మాయలో పడదు. కానీ అతను ఆమెని కలవర పెట్టగలుగుతాడు. అతను తిరిగి తమ ఊరికి వెళ్లిపోయే ముందు రోజు రాత్రి వేళ ఆమె పడుకొని వుండగా ఆమె మీద పడతాడు కానీ ఆమె “ఎవరూ?” అనగానే భయంతో పారిపోతాడు.

చదువు మధ్యలో మరోసారి సెలవులకి వచ్చిన గోపాల్రావుకి వేధింపులు మరీ ఎక్కువవుతాయి? వెంకన్న పంతులు పిల్లలిద్దరూ అతన్ని మరీ అవమానిస్తుంటారు. పెద్దలకి చెప్పబోతే పట్టించుకోరు. తిరిగి ఇతన్నే నిందిస్తారు. చివరికి అతని మీద దొంగతనం నేరం కూడా మోపుతారు. అతని అసహాయత పట్ల రవణ కుమిలిపోతుంది. వెంకన్నపంతులికి చెప్పినా ప్రయోజనం వుండదు. ఆ ఇంట్లో సుబ్బారావులానే వెంకన్నపంతులు కూడా ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు ఒక రాత్రి. ఇంక అక్కడ వుండలేక వెంకట్రావుగారితో కలిసి బందరు వెళ్లిపోతారు గోపాల్రావు, రవణ. బందరు అంతకుముందు రవణ వాళ్ల ఊరే. అక్కడ రవణ పాత నేస్తాలైన పిల్లలు రావడంతో గోపాలం కలవరపడతాడు. ఆమె మగపిల్లలతో చనువుగా వుండటాన్ని భరించలేక పోతాడు. వెంకట్రావుకి ఫిర్యాదు చేసినా ప్రయోజనముండదు. వెంకట్రావు అధునాతన భావాలున్న వ్యక్తి. ఇతని ఫిర్యాదుల్ని పట్టించుకోడు. “చూడు, రవణ చాలా అమూల్యమైన పిల్ల. జీవితమంతా కూడా నీకు నిక్షేపం వంటిది. స్వతంత్రపు టాలోచనలు గలది. ఉపయోగించుకున్నావా, స్వర్గమనుభవిస్తావు. చెరుపుకున్నావా? నీ అంత దౌర్భాగ్యుడుండడు. రవణ ఏమౌతుందో అని నీకేమీ భయం వద్దు. అవసరం యేమీ లేదు. దాన్ని బంధించావా, చస్తుందో, ఎగిరిపోతుందో జాగ్రత్త!” అని గోపాల్రావుని హెచ్చరిస్తాడాయన.

గోపాల్రావుకి రవణ సౌందర్యం కనబడదు. అతను రవణ తన సొత్తు అనుకుంటాడే కానీ తన సుఖానికి, సంతోషానికి, జీవిత ప్రయాణానికి ఆమె భాగస్వామిగా గుర్తించలేడు. ఎవరితోనూ మాట్లాడవద్దని ఆమెని నిర్బంధపూర్వకంగా హెచ్చరించేందుకు తనకి సమయం ఇవ్వనందుకు అతను ఆమె పట్ల మోటుగా ప్రవర్తిస్తాడు. ఇంతలో వెంకట్రావు కూతురు అరవింద చదువు నుండి సెలవులకు వస్తుంది. ఆమె స్నేహంలో పడి రవణ గోపాల్రావుని పట్టించుకోదు. ఆమె ఆలోచనలు వేరే తీరుగా వుంటాయి. తాను గోపాల్రావుకి చవకగా లోబడకూడదనే సంకల్పం ఆమెది. “మూర్ఖులైన వారు అధికారం చూపి, నలిపి, చంపి, శవాల్ని చేసి స్త్రీలను అవతల పారేస్తారు” అని చలం గోపాల్రావు వంటి వ్యక్తుల గురించి వ్యాఖ్యానిస్తాడు ఈ సందర్భంగా. ఏదో యోగ సమాజం (బహుశా అప్పటిలో ఒక రకంగా కల్ట్ జీవితాలు గడిపే థియొసఫికల్ సొసైటీ అంటే దివ్య జ్ఞాన సమాజంని ఉద్దేశించి చలం రాసుండొచ్చు)కి చెందిన అరవింద స్నేహితుడు వాగ్లీ అనే అతను ఆ ఇంటికి వస్తాడు. అతనికి అనేక మహిమలున్నాయని అరవింద నమ్ముతుంటుంది. అతని బోధనల్లో, స్నేహంలో అరవింద, రవణ గడుపుతుంటారు. ఇంక గోపాల్రావు తట్టుకోలేకపోతాడు. ఆ ముగ్గురితో తాను సన్నిహితం కాలేకపోగా తన సంకుచిత పురుషాధిపత్య అహంకార బుద్ధితో ఆమెని నియంత్రించాలని, అణగతొక్కాలని చూస్తాడు. ఆమెని కొడతాడు. ఇది గమనించిన వాగ్లీ గోపాల్రావుని చితక బాదేస్తాడు. అతని బారి నుండి రవణ గోపాల్రావుని కాపాడుకుంటుంది. ఆ ఘర్షణలో గోపాల్రావు తెగించి రవణని వదిలేసి వెళ్లడానికి సిద్ధమైతే రవణ అతని పాద దాసిగా వుండిపోతానని హామీ ఇచ్చి, బ్రతిమిలాడి, అతన్ని ఆపుతుంది. వాళ్లిద్దరికీ జిల్లా జడ్జి ఐన వెంకట్రావు వేరు కాపురానికి డబ్బులిచ్చి పంపటంతో నవల ముగుస్తుంది.

ఈ నవలకి “వివాహం” అనే టైటిల్ పెట్టడం చాలా సబబుగా అనిపిస్తుంది. ఎందుకంటే తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఏ మాత్రం లేక పోవడం, అందుకు తగ్గ వయసు రాకమునుపే ‘ఆమె’కి వివాహం చేసేసే విధానం వల్ల స్త్రీల జీవితాల్ని రిస్కులో పెట్టే లేదా నిస్సారం చేసే సామాజిక విలువల్ని చలం ఈ నవలలో గొప్పగా అక్షరబద్ధం చేస్తాడు. సంస్కరణవాద వాతావరణంలో పెరిగిన, ఒక అందమైన, తెలివైన, వ్యక్తిత్వమున్న, దక్షత కలిగిన, సృజనాత్మకత వున్న ఓ యువతిని కేవలం వివాహ ప్రక్రియ వల్ల మాత్రమే మొగుడు స్థానంలో వున్న ఒక అర్భకుడైన, ఆత్మ న్యూనతా భావాలతో కుంగిపోయే, యాచక స్వభావం కలిగిన, స్వంత కాళ్ల మీద నిలబడలేని పరాధీన స్వభావంతో బతికే పురుషుడు ఎలా లొంగ తీసుకోగలిగాడనేది నవల సారాంశం. ఈ నవలలో రవణకి చలం ఇతర నాయికల్లా మరీ తిరుగుబాటు చేసే స్వభావముండదు. సాంప్రదాయ కుటుంబ పరిధిలోనే జీవితాన్ని అందంగా, ఆనందంగా బతకాలనే కాంక్ష తప్ప మరోటి వుండదు. తన కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమించి, వారి పట్ల సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించే తత్వం ఆమెది. తన ఆత్మ గౌరవాన్ని, ఆలోచనల్లో తర్కాన్ని కోల్పోని యువతి. తండ్రి మరణంతో తన పెద్దనాన్న వెంకన్న పంతులు పంచన చేరిన ఆమె ఆ ఇంటి స్వరూపాన్నే మార్చేస్తుంది. ఎడ్డిగా, మడ్డిగా కనిపించే గృహ వాతావరణాన్ని తన సృజనాత్మక ఆలోచనలతో ఒక అందమైన, సౌకర్యవంతమైన జీవన శైలిలోకి తీసుకొస్తుంది. ఆమెని అందరూ ప్రేమిస్తారు. “మా గోపాలం అదృష్టం” అని అత్తగారు అనుకుంటుంది. “ఇట్లాంటి పిల్లని ఆ వెధవ చేతుల్లో పెట్టాము. సుఖపడిపోతాడు దరిద్రుడు” అని పెద్దమ్మ అనుకుంటుంది రవణ గురించి. తనకి అండగా, రక్షకుడిగా, తోడుగా వుంటాడనుకున్న గోపాల్రావు బేలగా, పరాధీనంగా, న్యూనతా భావాలతో వ్యవహరిస్తుంటే తానే అతన్ని కాపాడాలని తహతహలాడిపోతుంటుంది. వెంకన్న పంతులు పిల్లలు గోపాల్రావుని వేధిస్తుంటే వారిని నివారించాలని చూస్తుంది. వెంకన్న పంతులుతో కూడా గోపాల్రావుకి జరుగుతున్న అవమానాల గురించి గొడవ పడుతుంది. ఎప్పుడూ జీవితం పట్ల సానుకూల దృక్పథంతో కొత్తదనం కోసం ఎదురుచూస్తుంటుంది. ఆ అభిరుచి వల్లనే సుబ్బారావు కవిత్వాన్ని కూడా ఆసక్తిగా వింటుంది. వెంకట్రావు ఇంటికి ఆశ్రయం కోసం వెళ్లినప్పుడు అటు పూర్తి యవ్వనవతి కాని, ఇటు ఇంకా బాల్యావస్థని వదలనితనంతో తన చిన్ననాటి స్నేహితులతో చనువుగా వుంటుంది. అందుకు గోపాల్రావు అడ్డు చెప్పడంతో ఆమె ఖాతరు చేయదు. ఆమె గొప్ప స్నేహశీలి కావడంతో అరవిందతో తొందరగా స్నేహం చేయగలుగుతుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి వల్ల వాగ్లీ ఏం చెబుతున్నాడనేది ఆమెకి ఆకర్షణీయంగా వుంటుంది. జీవనోత్సాహం వల్ల వారితో షికార్లకి, విహారాలకి వెళుతుంటుంది. ఇవన్నీ గోపాల్రావు ఎందుకు వ్యతిరేకిస్తాడో, తానేం తప్పు చేస్తున్నదీ ఆమెకి అర్ధం కాదు. ఆమె ఎంత సమర్ధురాలైనా, ఆమెని ఎంతగానో ప్రేమించే వాళ్లున్నప్పటికీ ఆమె చివరికి నిస్సహాయ అవుతుంది. ఆమెని అంతగా నిస్సహాయని, బలహీనని చేయగలిగింది పురుషాధిపత్యమైన వివాహ ప్రక్రియ, కుటుంబ వ్యవస్థ. ఇది నిజానికి ఒక్క రవణ కథ కాదు. ఎన్నో కోట్లమంది రవణల కథ ఇది. ఈ రోజున స్త్రీలకి ఎంతో చైతన్యం వచ్చిందనుకున్నా తమ శక్తి సామర్ధ్యాలు, సృజనాత్మకత, తెలివితేటల్ని భర్తల ఇష్టాయిష్టాలకి బలి పెడుతున్న లక్షలాదిమంది రవణలు అనేకమంది ఇంకా వున్నారు. ఈ నవల ముగింపు చదువుతుంటే ఇదేదో వందేళ్ల క్రితం రచనలా అనిపించదు. అవడానికి రవణ బ్రాహ్మణ యువతే కానీ ఈ నవల ఇతివృత్తం బ్రాహ్మణ యువతికి మాత్రమే సంబంధించిన కథలా అనిపించదు. సనాతనత్వపు బాణం తగిలిన ఏ స్త్రీ ఐనా రవణలానే గాయపడుతుందని మనం తెలుసుకోవాలి.

గోపాల్రావు పాత్రని చలం అత్యంత సహజంగా రూపొందించాడు. అతనిలోని ఆత్మ గౌరవరాహిత్యం, న్యూనతాభావం, యాచక ధోరణికి మూలాలు బాల్యంలో అతను ప్రత్యక్షంగా చూసిన, ఎదుర్కొన్న పితృస్వామ్య హింసలోనే వుంటాయి. అతని తల్లి గురించి చలం ఇలా రాస్తాడు “అప్పమ్మకి నోరెత్తడం చాతకాదు. ఎక్కడా కోపమూ, చిరాకూ, రోషమూ, ఏమీ లేకుండా తండ్రీ, మొగుడూ ఆమె జీవనం చావగొట్టేశారు. పతివ్రత కింద చాలా పేరు తెచ్చుకుందే కానీ వితంతువై లోకంలో మెలగవలసి వొచ్చినప్పుడు యెందుకూ పనికిరానిదయింది. మొదట చిన్నప్పుడు తన మాట వినకుండా పెంకెతనం చేస్తే తన కంఠం వినేటప్పటికి వొణికేట్టుగా తండ్రి చావగొట్టే తన కుక్కని చేసుకున్నాడు. ఆ తండ్రి సరైన కట్నం ఇవ్వలేదని అతని పేరెత్తితే తన్నేవాడు ఆ భర్త. ఆ భర్త పోయిన తరువాత ఆ భర్త పేరూ, అతని పునర్వివాహపు చెల్లు పేరూ యెత్తితే నోరు నొక్కింది సంఘం. చివరికి ఏమీ చాతకాక, కొడుకుని కాపాడుకోలేని అప్పమ్మా, నోరెత్తడానికి భయపడేట్లు ఆమె పెంచి తయారుచేసిన గోపాలరావూ మిగిలారు. ఆమెనట్లా పిరికిదానిగా తయారు చేసి, గోపాలరావు చిన్నప్పుడు పిరికితనం చూపితే “పిరికి వెధవని కన్నావు” అని వెక్కిరించేవాడు ఆ భర్త.” అణచివేత, నిర్బంధ పరిస్థితులు లేని వాతావరణంలో పెరిగిన రవణకి – ఎప్పుడూ అభద్రతాభావంతో విలవిల్లాడుతూ, కూటికీ, గుడ్డకి కక్కుర్తి పడాల్సిన పరిస్థితుల్లో పెరిగిన గోపాలరావుకీ ఇక్కడే తేడా పడింది. నిజానికి “అతని హీనత్వమూ, నమ్రత, యాచక బుద్ధీ ఇతరులలో కనిపిస్తే ఆమెకి పరమ అసహ్యం కలిగివుండును. కానీ తన భర్తలో కనబడితే ఆమెకి విచారమూ, దయా, ప్రేమా కలిగాయి” అని చలం రాయడంలో స్త్రీల మీద సులువుగా అమలుకాగల పితృస్వామ్యపు కండిషనింగ్ గురించి వివరణ వుంది. రవణ అందాన్ని, ఆమె ఆకర్షణీయ దృక్కుల్ని పసిగట్టలేని గోపాల్రావు ఆమె ఇతరులతో చనువుగా వుండటాన్ని సహించలేడు. ఆమె జారిపోతుందేమోనని సతమతమవుతాడు. ఒక మానవీయ స్త్రీ పురుష సంబంధంలో ప్రేమికుడుగా కాక పితృస్వామ్యపు ఆధిపత్య సంబంధంలో తనని తాను యజమానిగానే భావించుకుంటాడు. అతనిలోని “సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్” ఆమె కంఠంలోని మాధుర్యాన్ని, మార్దవాన్ని వినవు. తాను చాటుమాటుగా పిలిస్తే పలకక పోవడాన్ని పెంకెతనంగానే భావిస్తాడు కానీ అతనికి చవకగా లొంగకూడదన్న ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించలేకపోతాడు. కానీ చివరికి అతని మొండి, మూర్ఖపు ఆధిపత్య ధోరణే అతనికి రవణ మీద పై చేయి సాధించేలా చేస్తాయి.

గోపాల్రావు తరువాత వెంకన్న పంతులు ఈ నవలలో ముఖ్యమైన అల్పబుద్ధిగల వాడు. అంతేకాదు, ఆ నాటి సనాతన దృక్పథానికి ప్రతినిధి. నిజానికి సనాతన దృక్పథం అనేది ఇతరుల నుండి సనాతన ఆచరణని ఆశించేదే కానీ ఖచ్చితంగా ఎవరికి వారు పాటించే విలువ కాదనేది వాస్తవం. ఒకరి మీద మరొకరికి ఏదో సాంఘీక విలువ పేరుతో పెత్తనాన్ని ఏర్పాటు చేసేది సనాతనం. ఆ ఆధిపత్య విలువల ఆధారితంగానే వర్ణ వ్యవస్థ కాలం నుండి ఈ రోజు వరకు అది బతికి బట్ట కట్టగలుగుతున్నది. బాధ్యత స్వీకరించే నెపంతో ఇతరుల జీవితాల్ని కొల్లగొట్టే తత్వం వెంకన్న పంతులుది. గమనించే వారెవరూ లేరనుకున్నప్పుడు అతని వంటి వారిలో వంకర బుద్ధులూ బైట పడనీయకుండా ఏ సనాతనమూ అడ్డుకోలేదు.

ఈ నవలలో మరో రెండు ఆసక్తికరమైన పాత్రలుంటాయి. ఒకటి వెంకట్రావు కాగా మరోటి వాగ్లీ. వెంకట్రావు ఉదారవాది. కూతురుని పై చదువులకి దూరంగా పంపుతాడు. ఆమెకి పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. ఆ కాలంలోనే కూతురి ఇష్టాయిష్టాల ప్రకారం పెళ్లి జరగాలనే వాడు. అతని కూతురు వాగ్లీ అనే యోగ సమాజ సభ్యుడితో చనువుగా వుంటున్నందుకు గోపాల్రావు గాభరా పడితే వాళ్లకిష్టమైతే పెళ్లి చేసుకుంటారు కదా అంటాడు. వాగ్లీ ప్రబోధించే యోగ జ్ఞానం పట్ల వెంకట్రావుకి అపనమ్మకం. లోకం మొత్తం అశాంతిమయంగా వున్నప్పుడు కొంతమంది తమ శక్తి సామర్ధ్యాలను ఇలాంటి అలౌకిక విషయాలకు వెచ్చించడాన్ని ఖండిస్తాడు. వాగ్లీతో గట్టిగా వాదిస్తాడు. ఆ నాటి సంఘ సంస్కరణోద్యమాల ప్రభావాన్ని వెంకట్రావు పాత్ర ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాడు చలం. వాగ్లీ కర్మ సిద్ధాంతం తాలూకు మెట్ట వేదాంతంతో కాలక్షేపం చేసే సమూహాలకు ప్రతినిధి. కర్మ గురించి, కర్మానుభవం గురించి, కర్మ తాలూకు అనివార్యతల గురించి ఉపన్యాసాలిచ్చి, ప్రతి సమస్యకి దాని మూలాల్లోకి వెళ్లకుండా కర్మ పరిధిలోకి తీసుకొచ్చి సొల్లు మాట్లాడుతూ తాము మాత్రం సుఖంగా బతికే మెట్ట వేదాంతం అతనిది. అతనికి, వెంకట్రావుకి మధ్య చాలా మంచి చర్చని చలం సృష్ఠిస్తాదు. “ఏమో! నా మనసుకి సుఖంగా తిని కూచునే వాళ్ల వేదాంతంలాగు తోస్తుంది యీ కర్మ వ్యవహారం. మరి అంతా కర్మ ఐతే ధనానికి, కీర్తికీ ప్రజలెందుకీ ప్రయత్నాలు? మరి ఈ సంఘ సంస్కరణం, యీ రాజకీయ యుద్ధం, యీ “ఎకనామిక్” బాధలు, యివన్నీ యేమిటి?” అని వెంకట్రావు వాగ్లీని ప్రశ్నిస్తాడు. ఈ చర్చ ద్వారా నిరర్ధకమైన ఆధ్యాత్మిక చింతనని చలం బలంగా ఎండగడతాడు ఈ నవలలో.

ఇది కూడా చిన్న నవలే. కానీ అనేక జీవితాలు కనిపిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా ఆ పదిహేనేళ్ల పిల్ల రవణ మనకి బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించి ఎక్కడో మీ గుండె లోతులో కలుక్కుమంటుంది. చదవండి!

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

One thought on “చలం అచంచలం: వివాహం

 1. మా సత్యం
  అరణ్య కృష్ణ గారు
  ” చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-4)
  మీయొక్క విస్తృత పరిచయ విశ్లేషణ బాగుంది.
  చలం జీవితమంతా ఒక అన్వేషణ.
  చలాన్ని చివరకంట నడిపించిన సూత్రం ‘జీవితానందం.’మ్యూజింగ్స్‌’లో ఒకచోట అంటాడు. “ఇన్ని తీరని యిబ్బందుల్నీ, ఇవి యెందుకు వుండాలని పోట్లాడుతాను గాని,జీవితమనేది చాలా గొప్ప సంగతి. చివరికి తూనికలకి వాసే సుఖం దుఃఖం కన్న యెన్నో రెట్లు. పక్క సినిమాలో యెన్ని అరుపులు అరపించిన యెప్పుడో ఒకప్పుడు నాయుడు గారి ఫిడేలో, సుబ్బలక్ష్మి “యింగు మిరల దాయోయి అనే రికార్డు పెడుతూనే వుంటారు పాపం. నిన్న రాతి తిన్న చేపల పులుసు. దాన్ని తినేందుకే ఈ జన్మ ఎత్తితేనే మనిపించింది. ఎప్పుడూ కను మరుగు కాని ఆకాశం, ఎక్కడ చూసినా గడ్డి నించి ములగచెట్టు వరకు విరగపూసే పువ్వులు, ఒకప్పుడు ఉక్క_పెట్టినా, పియురాలి హస్తాలమళ్లే తాకి ముద్దుచేసే గాలి, ఉచితమై ముంచె ఈ ఎండ, అప్పుడప్పుడు ఏ పుంతల్లోనో కనిపించే అందం మైన వృతపు తీరూ, పక్షుల రెక్కల వూపు, పురుగుల మీద నత్తగుల్లల వర్ణాలు, లీల గారి కళ్ళనించి దయగల చూపు, ఏ దూరాన్నించో హృదయంతో పలకరించే ఓ ఉత్తరం, కారణం లేకుండా నన్ను చూసి సంతోషించే పాపాయి చిరునవ్వు …. యెంత అందం జీవితం.
  ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? చలం అంటాడు. చలం బ్రహ్మసమాజం రోజుల్లో కాకినాడలో రత్నమ్మతో పేమలో పడ్డప్పుడు మొట్ట మొదటి సారిగా అతనికి ఈ జిజ్ఞాస కలిగింది ఈ ప్రేమ పాపమా? అట్లా వారిలో చాలా చాలా సందేహాలు ఉత్పన్న మయ్యాయి. నిజంగా ఇటువంటి ఎన్నెన్నో సందేహాలు రేగటంతో చలం బ్రహ్మ సమాజానికి కూడా ఎదురు తిరిగాడు. 1940లో చెలమంటాడు ” ఈ 15 ఏళ్లలో చాలా దూరం ప్రయాణం చేశాను (లోపల. బయట కాదు.)ఏళ్లలో కాకా మనసుల్లో ఎదిగే వాళ్ళకి యీ ఆయాస ప్రయాణాలు తప్పవు.” ఇంకా అంటాడు ” ….ఎప్పుడూ రాస్తున్నాను. ఏనాటి కేది సత్యమని తోస్తే అది నమ్మడానికి ఎదురు చూస్తోండాలని ఆ విధమైన open-mindednsss ఉండాలని.” మిత్రమా! ఇంకా చలం సాహిత్యం పైన చాలా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

Leave a Reply