చలం అచంచలం: అమీనా

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర – 3)

‘అమీనా’ చలం రాసిన మూడో నవల. ఈ నవలని చలం 1924లో రాశాడు. అంటే ఇది కూడా వందేళ్ల క్రితం రాసిన నవలగానే భావించాలి. చలం ‘ఉత్తమ పురుష'(ఫస్ట్ పర్సన్)లో రాసిన మరో నవల ఇది. చలం రాసిన అన్ని నవలల్లోకి ఇతివృత్తం రీత్యా, కథన శైలి రీత్యా ‘అమీనా’ అత్యంత ప్రత్యేకమైన నవల. ‘అమీనా’ చలం స్వానుభవం నుండి వచ్చిందని ఎక్కడా చెప్పక పోవచ్చు కానీ స్వీయానుభవ నీడలు,జాడలు కనిపిస్తాయి. నవలలోని పాత్రలు కూడా వాస్తవికమైనవేనని, చలం వారికి మారుపేర్లు ఇచ్చాడని అనిపిస్తుంది. సుబ్బారావు అనే కవి ఎంకి గీతాలు పాడుతుంటాడు. బహుశా అది ‘ఎంకి గీతాలు ‘ సృష్ఠికర్త నండూరి సుబ్బారావు కావొచ్చు. ఒక నవలకి వుండాల్సిన ప్రత్యేకమైన ప్లాట్ ఏదీ ఇందులో వుండదు. తనని పెనవేసుకున్న మనుషుల వల్ల, తన చుట్టూ ఆవరించి వున్న పరిస్థితుల వల్ల రచయితలో ఏర్పడిన ఘర్షణాత్మక మనస్థితిని ప్రతిబింబించే ఆలోచనా స్రవంతి ప్రధానమై పోయిన రచన ఇది. జీవితంలో కొన్నాళ్ల పాటు జరిగిన సంఘటనల్ని ఒక డైరీలో రాసుకున్న చందాన నవల సాగుతుంది. డైరీలో ఆ రోజు జరిగిన ఏదైనా సంఘటన గురించి రాస్తే వ్యక్తుల గురించి ప్రత్యేకంగా వర్ణనలు చేయం కదా! ఇక్కడ కూడా అలానే సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా “చలం సొంత గొడవే” అనిపిస్తుంది.

ఈ నవలలో పెద్దగా సంఘటనలుండవు. పాత్రలు పెద్దగా ప్రవర్తించవు. సంభాషించవు. అసలు కథనానికి ఒక ఆర్డర్ అంటూ ఏమీ వుండదు. ఇది మొత్తం ఒక రచయిత హృదయానికి, అస్తిత్వానికి మధ్య జరిగిన అంతర్యుద్ధం నుంచి వచ్చిన కలవరింత, పలవరింత. కలల్లో తోసుకొచ్చినట్లు, పరిగెత్తినట్లు అలా రాసుకుపోతాడు. ఎక్కడా పాఠకుల్ని లక్షించడు. ఇది మొత్తం ఒక చిన్న గుంపు జీవితంలో ఓ రచయిత అంతరంగ దృశ్యం. ఆ గుంపులో మోసకారి, ఆశమోతులైన పురుషులుంటారు. వంచితులైన, అసూయాగ్రస్తులైన స్త్రీలూ వుంటారు. వీళ్లెవరూ ఎలాంటి విశ్లేషణల పరిధిలోకి రారు, ఒక్క శ్రీమన్నారాయణ అనే పాత్ర తప్పితే! చలం ఏ పాత్రనీ ఎస్టాబ్లిష్ చేయడు. నవల మొత్తం మనుషుల అనుబంధాల్లోని స్వార్ధ చింతన, అభిజాత్యం నిండి వుండగా వాటితో విసుగెత్తినా వదిలించుకోలేని అవసరమో, బలహీనతో చాపల్యమో రచయితది. (ఉత్తమ పురుషలో కథ చెప్పినందున, ఇది తన స్వంత జీవితమని చలం నిర్దిష్టంగా చెప్పనందున, ఆ పాత్రకి ఏ పేరు పెట్టనందున అతన్ని చలం అని కాక రచయిత అంటాను.) ఈ నవలలోని పాత్రలలో ఎవరితో, ఎప్పుడు, ఎందుకు, ఎలా బంధాలేర్పడ్డాయో రచయిత చెప్పడు.

అదో బ్రహ్మచారుల నివాసం అనలేం. అలాగని బుద్ధిగా ఒక కుటుంబంగా బతికే వారూ కాని కొంతమంది ఒక మొండి గోడల ఇంట్లో బతుకుతుంటారు. రచయిత, రామ్మూర్తి, శర్మ, ‘జీవం’, తాత, శ్రీమన్నారాయణ, “భర్త వద్ద నుండి క్యాజువల్ లీవ్ అన్నా పెట్టకుండా శర్మ కోసం వచ్చిన” సత్య ఆ ఇంట్లో వుంటుంటారు. హోటల్ భోజనాన్ని క్యారియర్లలో తెప్పించుకుంటూ వారు రోజూ ఏటి ఒడ్డుకి, తోటకి షికార్లు తిరుగుతూ ఒక చిత్రమైన జీవన శైలితో రచయిత మాటల్లోనే చెప్పాలంటే ఒక ‘అరాచకపు సంఘం’గా బతుకుతుంటారు. తమ అప్రాచ్యపు సంఘానికి సుబారావుని లీగల్ అడ్వైజర్ గా పేరు అచ్చు వేయిస్తానని రచయిత అతన్ని సరదాగా బెదిరిస్తుంటాడు. ఆ రోజుల్లో వారికి దినానికి ఇరవై నాలుగు గంటలు కూడా చాలవని రచయిత అంటాడు. రాత్రి పూట మొండి గోడల సందులో తడిక మంచం, మూడు కుర్చీలు వేసి కాలక్షేప సమవేశాలు నిర్వహిస్తూ వుంటారు. అలానే ఆ కుర్చీల్లో కూర్చొని నిద్ర పోయేవారు. వారిలో ‘జీవం’ చలం మంచి చెడులు చూస్తుంటుంది. “నేను స్కూలుకి వెళ్లగానే, సోమరినైన నా అజాగ్రత్తనూ, నిర్లక్ష్యాన్ని సరితీసి, నా గదిని మళ్లీ నివాస యోగ్యంగా చేసే ‘జీవం’ ప్రేమ ప్రతి ఉదయమూ, సాయాంత్రమూ నన్ను బుజ్జగించేది” అని ఆమె గురించి చెబుతాడు రచయిత. ఆ ఇంటికి వేరే ప్రాంతాల నుండి వస్తుంటారు. మళ్లీ వెళ్లిపోతుంటారు. కానీ ఆ అతిథులు రావడం అందరికీ సంబరంగా వుంటుంది. ఆ ఇంటిలోని “మొండి గోడల్లో వింత అందం ఒకటుందని, అట్లాంటి ఇళ్లల్లో సంపాదింపగల అమూల్య అనుభవాలు మేడల దొంగ మెరుగులలో, ఐశ్వర్య గర్భంలో యెన్నడూ దొరకవనీ” రచయిత అభిప్రాయం.

వారిలో కొందరికి ప్రేమ వ్యవహారాలు, ఇతర స్త్రీలతో వివావేహేతర సంబంధాలూ కొనసాగుతుంటాయి. శర్మ కోసం వివాహిత ఐన సత్య వస్తుంటుంది. పక్కింటి రిజిస్ట్రారుగారి కార్యం కాని అరవ కన్యతో రామ్మూర్తి ఫ్లర్టింగ్! తాత అంటే నిజంగా తాత వయసు వాడు కాదు. అసలు పేరు కృష్ణమూర్తి. అతనికి రాజమండ్రి ప్లీడరు కూతురుతో స్నేహం. పైకి మామూలు స్నేహమని బుకాయిస్తూ విమల కోసం శారీరక తహతహలతో పరితపించే శ్రీమన్నారాయణ. ఇంక రచయిత కోసం జీవం, శ్యామల, శారద, సుబ్బులు వంటి వారు వచ్చి పోతుంటారు. అతనికి వారి పట్ల ఆకర్షణ, ఆదరణ వుంటాయి. ఎంతో కొంత అభ్యంతరమూ వుంటుంది. కానీ ఎవరినీ నియంత్రించడు. కానీ వారు అతన్ని నియంత్రించాలని చూస్తుంటారు. తన జీవితంలో ఇతరుల ప్రమేయాన్ని ఏ కారణం చేతనైనా నియంత్రించలేని వ్యక్తి స్వేచ్ఛకి దూరమౌతాడని, పరాయీకరణ చెందుతాడని రచయిత పాత్ర ద్వారా చలం చెప్పినట్లనిపిస్తుంది. మధ్యలో ఈ మిత్రులకి ఆప్తులైన డాక్టర్ గారు వంటి వారు వస్తుంటారు. పోతరాజు, పట్టాభిరామయ్య వంటి వారు వీళ్లని తమ ఇంటికి రాత్రిళ్లు విందు కోసం ఆహ్వానిస్తుంటారు.

ఈ నేపథ్యంలో అమీనా అనే ఓ నిరుపేద, పదమూడు పద్నాలుగేళ్ల ముసల్మాను పిల్ల రచయితకి తారసపడుతుంది. తన మిత్రులతో కలిసి వెళుతున్న రచయితని చూసి అతన్ని పరిచయం చేసుకొని అతని ఇంట్లో పని చేస్తానంటుంది. అతన్ని చూడగానే ఆ పిల్లకి మంచి అభిప్రాయమేర్పడుతుంది. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఏదో ఘర్షణ, సంక్షోభం. ఆమె తల్లి వంటి స్త్రీ నిజానికి తన తల్లి కాదంటుంది అమీనా. ఆకలేస్తే బురదలోంచి ఏటిలోకెళ్లి చేపలు పట్టి, కాల్చుకు తిని కడుపు నింపుకునే అస్తిత్వ పోరాటం ఆమెది. అమీనాని పనిలోపెట్టుకుంటాడు రచయిత. అమీనా మంచి గాయకురాలు. ఆమె పాటకి అందరూ తన్మయులైపోతారు. మళ్లీ మళ్లీ అడిగి మరీ పాడించుకుంటారు. ఇంట్లో పోట్లాడి, అడవిలోకి పారిపోయినప్పుడు ఆ అడవిలో నెగళ్ల ముందు కూర్చొని పాటలు పాడే వారిని చూసి తానూ పాడటం నేర్చుకున్నానని చెబుతుంది. అమీనా ధైర్యవంతురాలని తెలుస్తుంది ఈ వివరణతో. ఆమెలోని నిర్భీతి, కళా కౌశలం బహుశా రచయితని అమితంగా కట్టిపడేసి వుండొచ్చు.

ఆ మొండి గోడల రచయిత ఇంట్లో అమీనా స్వతంత్రంగా వ్యవహరిస్తూ వుంటుంది. అందరికీ టీ కాచి పెట్టడంతో సహా అన్ని పనులు చేస్తుంటుంది. ఐతే ఆమె రాకతో రచయితకి తన స్నేహితురాళ్లతో గొడవలొస్తాయి. ఆమె పని పిల్లలా స్వతంత్రంగా వుండటం జీవం, సుబ్బులు వంటి వారికి నచ్చదు. పనిపిల్ల కుర్చీలో కూర్చోవడమేంటని, అదీ రిబ్బన్లు కట్టుకొని మరీ… అని వారి అభ్యంతరం. ఒకసారి సుబ్బులు కొడుతుంది కూడా ఆమెని. రచయిత మాత్రం ఆమెకి పూర్తి స్వేచ్ఛనిస్తాడు. ఆమెని ఎంతో మురిపెంగా చూసుకుంటుంటాడు. ఐనా ఎవరితో గొడవైనా అమీనా చెప్పకుండా వెళ్లిపోతుంది. మూడురోజులైనా తిరిగిరాదు. అలా వెళ్లిపోతుంటుంది. మళ్లీ రచయిత తెచ్చుకోవడమో, ఆమె స్వయంగా తిరిగి రావడమో చేస్తుంటుంది. అంతే కాదు రచయిత కూడా తన మిత్రుల ఊళ్లకి వెళ్లొస్తుంటాడు. అలా వెళ్లినప్పుడల్లా అమీనా ఇబ్బంది పడుతుంటుంది. అతను లేని ఇంట్లో వుండటానికి, పని చేయడానికి ఆమెకి మనస్కరించదు. తనని వదిలేసి ఎందుకు వెళ్లిపోయారని అడుగుతుంటుంది. ఆయన లేనప్పుడు మిగతా వారు ప్రవర్తించే విధానంపై అతనికి ఫిర్యాదులు చేస్తుంటుంది.

ఒక దశ వస్తుంది తాను అమీనాని నిలబెట్టుకోవాలంటే మిగతా స్నేహితురాళ్లని త్యాగం చేయాల్సి వస్తుంది. అమీనా డిమాండ్ అలానే వుంటుంది. బాల్యానికి, స్త్రీత్వానికి మధ్యనున్న ఆ వయసులో అప్పుడప్పుడే పొడుస్తున్న ఆడతనం వుంటుంది. అంతేకాదు అమీనాలో పెద్దరికం పొడసూపుతుంటుంది. తనకి చీర కట్టుకోవాలనిపిస్తుంది. అది సహజమే. చీర కొనుక్కోడానికి డబ్బులడుగుతుంది. ఆమె చీర కట్టుకొని పెద్దదైతే రచయిత ఆశించే స్వచ్ఛత నిజంగా నిలుస్తుందా? రచయిత జీతం లెక్కగట్టి జీతం ఇస్తాడు. అతను ఇచ్చిన డబ్బుతో చీర కొనుక్కోలేక పోతుంది కానీ ఒక వోణీ కొనుక్కుంటుంది. అతని జ్ఞాపకానికి ఆ వోణీ కొనుకున్నానని చెబుతుంది. ఇంట్లో తల్లి కాని తల్లితో గొడవపడి ఎక్కడికో తెలియకుండా వెళుతున్నానని రచయితకి చెప్పి మరీ వెళ్లిపోతుంది. లోక పరత్వానికి, తన బంధాలకు శిరసొగ్గిన రచయిత నిరుత్తురుడై చూస్తుండగా ఆఖరిసారిగా వెళ్లిపోతుంది. ఇంతే నవల మొత్తం. ఇలా చెబుతుంటే ఇంతే కదా సరళంగానే వుంది కదా అనిపించొచ్చు. కానీ ఎంతో ఓపికగానే చదవాల్సి వస్తుంది. నవల ఓ అరవై నాలుగు పేజీలుంటుంది. కానీ ఓ ఆరొందల పేజీల నవల చదివిన అనుభూతి కలుగుతుంది.

నవల మొత్తాన్ని ఒక ఫ్లాష్ బాక్ గా చెబుతుంటాడు రచయిత. కానీ తాను ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఎవరితో వున్నాడు, తన పరిస్థితి ఏమిటనేది చెప్పడు. కొంతమంది సాహచర్యాన్ని, స్నేహాన్ని దూరం చేసుకున్నట్లు చెబుతాడు. వారి గురించి బాధపడుతుంటాడు. కానీ వారిని ఏ పరిస్థితుల్లో దూరం చేసుకున్నాడు, ఎందుకు దూరం చేసుకున్నాడనేది వివరించడు. ఉదాహరణకు జీవం గురించి “ఒక్క మాట, ఒక్క చూపు వల్ల తన మనసులోని ఆవేదనని బయలుపరచేది కాదు కదా ‘జీవం’! మా అల్లరి, కేకలు, నవ్వులు , మా దుర్మార్గం అన్నీ భరించావు నా కోసం. ‘జీవం’ ఇప్పుడెట్లా చూపను నా కృతజ్ఞత! వెళ్లే రోజునన్నా నీతో చెప్పిన జ్ఞాపకం లేదు. లోపలికి వచ్చి కూచోమని నువ్వు నన్ను చీకటి ఇంట్లోంచి పిలిచిన సాయంత్రం మాత్రం క్రూరంగా బాధిస్తుంది మనసుని.” అంటాడు. ఇక్కడ రచయిత ఎందుకెళ్లిపోయాడో, ఆ రోజు ఏం జరిగిందో మనకి తెలియదు. అందుకే ఇదో పర్సనల్ డైరీ తరహా నవల అని అభిప్రాయపడింది. ఈ విచిత్రమైన శైలి పాఠకుడిని గందరగోళ పరుస్తుంది. ఐతే ఇది చలం తన కోసం తాను రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. తన మనసు మీద తీవ్రమైన ఇంపాక్ట్ కలగచేసిన వ్యక్తుల గురించి రాసి భారం తీర్చుకున్నాడేమో అనిపిస్తుంది.

ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ పురుష సంబంధంలోని మోహానికి, ఆకర్షణకి రచయిత స్త్రీ స్నేహితులు ప్రతీకైతే అమీనాని స్త్రీ పురుష సంబంధంలో చలం కాంక్షించే ఒక స్వచ్ఛమైన, అనిర్వచనీయమైన స్వేచ్ఛకి ప్రతీక. కానీ చలంలో దాన్ని పొందలేక పోయానన్న నిరాశ, అమీనాని నిలుపుకోలేక పోయానన్న గిల్టీ ఫీలింగ్ వుంది. ఇందుకు సాక్ష్యంగా “ఏళ్లల్లో ఎదిగి వాకిట్లో నుంచొని, వొచ్చానంటే, చిన్నప్పటి నీ వొంటి బురదని కావలించుకున్నా. పెద్దైన నీ మనసు మీద లోకం చిమ్మిన మాలిన్యాన్ని అంగీకరించలేని చలం అవమానానికి. లోక పరత్వానికి పరిహారంగా నీకు, అమీనా, ఈ పుస్తకం” అంటూ ఈ నవలని అమీనాకి అంకితమివ్వడమే నిలుస్తుంది. అమీనా పాత్ర కల్పితం కాదని, వాస్తవికమైనదేనని నిర్ధారితమవుతుంది.

అమీనా పట్ల చలం ధోరణి “పెడోఫీలియా” కిందకి రాదు. ఎందుకంటే ఎక్కడా కాముకత వుండదు. మోహపు మైమరుపు వుండదు. జననం నుండి మరణం వరకున్న అన్ని దశలలో స్త్రీ కౌమార్య దశలోనే ఒక అమాయకపు, స్వచ్ఛమైన, ప్రకృతి బద్ద్ధమైన ఔన్నత్యాన్ని కలిగి వుంటుందని ఆయన భావన కావచ్చు. అటువంటి పిల్లతో హృదయానుబంధానికి ఏ పేరూ పెట్టడం సాధ్యం కాదు. నిరంతరం స్త్రీ సౌందర్యంలో ఆధ్యాత్మికతని, ఆమెతో ప్రేమలో జీవన సాఫల్యాన్ని వెతుక్కునే చలానికి అమీనా అనుకోకుండానే ఎదురైన తాత్కాలిక గమ్యం. అందుకే ఆమె సుబ్బులు వుండగా తాను ఇంటికి తిరిగి రానని అన్నప్పుడు “నువ్వు నా నౌకరువి కాదు. నేస్తానివి కాదు. నువ్వు విధి వెయ్యి నాలికలలో ఒకదానివి. నవ్వుతో బలి కోరుతున్నావు. బలి కోరకపోతే హృదయ సామీప్యానికి ఎలా వస్తావు?” అనుకుంటాడు.

ఈ నవలకి ‘అమీనా’ అని పేరైతే పెట్టాడు కానీ నిజానికి ఇందులో అతి పెద్ద పాత్ర రచయితే. అమీనా గురించిన ఆయన ఆలోచనా స్రవంతి ఈ నవల. రచయిత ఏ ఊరెళ్లినా, ఎక్కడికెళ్లినా అతని ఆలోచనల్లో వదలని అమీనా! ఎవరిని కలిసినా, ఏ పరిస్తితులెదురైనా కలిగే అసంతృప్తికి, లోటుకి అమీనా గురించిన ఆలోచనల్లో వెదుక్కుంటాడు. ఎవరితో ఏ సంభాషణ చేసినా అమీనానే సగం నుండి ముగింపు మాట దాక వుంటుంది. వెర్రి అమీనా, పిల్ల అమీనా, పిచ్చి అమీనా, తురక అమీనా, చింపిరి అమీనా, ముసల్మాను రోషపు అమీనా అనుకుంటూనే ఆమెని అందలమెక్కించుకుంటాడు. అమీనా అతని లోలోపలి తడుములాటలో, వెతుకులాటలో ఓ గమనం! ఆమె అతనికి ఓ సంఘర్షణాత్మక సంభాషణ. ఓ వైయుక్తిక అస్తిత్వ వేదనకి నైరూప్య పరిష్కారం! ఇదంతా కౌమార్య ప్రాయపు లేలేత అమీనాకి తెలియవు. ఆమె అతనికి స్నేహితురాలి కంటే ఎక్కువ. బిడ్డని మించిన చనువు.

ఈ నవలలో చలం ఎంతో కొంత స్పష్ఠంగా చెప్పిన పాత్ర ఏదైనా వుందంటే అది శ్రీమన్నారాయణే. విమలతో శారీరిక సంబంధం కొనసాగిస్తూనే అలాంటిదేమీ తమ మధ్య లేదని బుకాయించాలని చూస్తుంటాడు. అతన్ని ఉద్దేశించి రచయిత “స్త్రీ విషయమై దొంగతనం బాగా అలవాటైంది. కామం, ప్రేమ అన్నీ తుచ్ఛమూ, సిగ్గూ, భయమూ పడ్డవలసిన విషయాలని బాగా అంతరాత్మలో నాటుకొని పోయినాయి ఈ తరము వారికి. ఎప్పటికో విముక్తి!” అనుకుంటాడు. శ్రీమన్నారాయణ ఇతరుల ప్రవర్తనల్ని నైతికంగా ఖండిస్తుంటాడు. శ్రీమన్నారాయణ పెళ్లి చేసుకోబోడని విమలని రచయిత హెచ్చరిస్తుంటాడు. చివరికి అదే జరుగుతుంది. అంతేకాదు ఆమె సంబంధం శ్రీమన్నారాయణతో కాకుండా రచయితతోనే అనేలా బైట ప్రచారం జరుగుతుంది. అందుకు ఆమె కూడా కారణమనేది రచయిత భావన. బహుశా శ్రీమన్నారాయణ మోసం చేయడం వల్ల తనకి జరిగిన ఆశాభంగంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అతని గురించి రచయిత ఇలా అనుకుంటాడు- “తిరిగి తిరిగి నాకు అనుభవంలో రూఢి అయింది. నీతిని గురించి ఉపన్యాసాలిచ్చేవాడూ, ఇతరులలో దుర్నీతిని ఖండించేవాడూ, తప్పదు- రహస్యంగా – అతి నీచపు పనులు జరుపుతో వుంటాడని.” నిజమే కదా!

రచయిత ఈ నవలలో దాదాపుగా అన్ని స్త్రీ పాత్రల పట్ల గిల్టీ గానూ, ఎంతో కరుణతోనూ వుంటాడు. వారు అతని బలంగానూ, బలహీనతగానూ వుంటారు. దాదాపు ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతుంటాడు. “ప్రతి క్షణమూ ఎడతెరపి లేక హృదయ కవాటాన్ని పెద్ద అరుపులతో తట్టే వివిధాకర్షణలతో నీ మృదు దృష్టుల్నీ, నీ మధుర గీతాల్నీ, నీవు నా పక్క మీద వదిలిపొయ్యే చామంతిరేకుల్నీ మరచాను. ‘జీవం’ నన్ను క్షమించు” అని జీవంకి క్షమాపణలు చెబుతాడు. అమీనా గురించి చెబుతూ “అమీనా! నువ్వు నిర్భాగ్యపు నా అదృష్టమే. నిన్ను జార విడిచింది నా అధైర్యమే. నా సందేహమే. నా లోక పరత్వమే. నా లాభ నష్ట గణితమే నిన్ను తరిమి మాయం చేసాయి” అంటాడు. విమల గురించి “నీ సుకుమార హృదయం, బెదిరి చెదిరి లోకాన్ని చూసే నీ కళ్లు, నీ పువ్వుల చంపలు మరిచిపోను. నిన్ను నీ దొంగతనాన్ని, నీ పేరుని రక్షించుకోడానికి నన్ను నువ్వు చేసిన బలి కూడా నీ మీది మమతను మళ్లించలేదు. పాపం ఏం చేస్తావు! స్త్రీవి. క్రూరమైన ఈ లోకంలో అనాధవైన స్త్రీవి. మిమ్మల్ని మీ సూనృతాన్ని అదిమి నాశనం చేశాం పురుషులం.” అంటాడు.

ప్రేమ, స్నేహం, సాంగత్యం, అనుబంధం…వీటన్నింటిలోనూ చలం ఏదో అన్వేషిస్తుంటాడు. “జ్ఞాపకం వుందా రామ్మూర్తీ, తాతా? ఏళ్లు గడిచాయి. ఎవరన్నా విలపించే వాళ్లు కనబడ్డారా నేస్తాలూ మీకు? నేనింకా వెతుకుతోనే వున్నాను. మీరు వెతకడం కూడా మానే స్థితికి వొచ్చారేమోనని నా దిగులు.” అంటాడు. ప్రతి అనుబంధం ఏదో దిగులు కలిగిస్తుంటుంది. “నా హృదయంలో రసికత్వం. నా మానసంలో శక్తిత్వం. నా మనసులో అధికారం, ఆవరణ, ఆక్రమణ- స్వభావం. ఇదంతా ఏం చేసుకోను?” అని బెంగటిల్లుతాడు.

వివాహ మంత్రాల మీద సంసారాల డొల్లతనం మీద చలం విసుర్లు బలంగా వుంటాయి ఇందులో. ఓసారి రచయితని శ్రీమన్నారాయణ అడుగుతాడు “సుఖంగా, నిర్మలంగా కాపరం చేస్తున్న పిల్లల్ని ఇట్లా ఆకర్సించి పది రోజులు పాడు చేసి మీ దోవన మీరు పోతే వాళ్ల గతి యేమిటి?” అని. దానికి సమాధానంగా తాత “సుఖంగానూ నిర్మలంగానూ వాళ్లు కాపరం చెయ్యడం లేదు…. ఆ బూజు గదుల్లో లేని పదార్ధం నిర్మలత్వమే! శరీరాల్లోనూ, పనుల్లోనూ, మాటల్లోనూ, పక్కల్లోనూ, గాలిలోనూ, మనసుల్లోనూ యెక్కడా లేవు నిర్మలత్వమూ, కాంతీ, ఆనందమూ. అందుకనే ఆ అశాంతి. ‘భార్యా భర్తా కదా, మంత్రాలు జరిగాయి కదా అని సంతుష్ఠ పడే నీ వెర్రి మనసులో వుందేమో ఆ నిర్మలత్వము” అంటాడు. అప్పుడు రచయిత జీవన సంతుష్ఠకి సంబంధించిన తన తాత్విక ఆలోచన ఇలా చెబుతాడు “ఆ నిరర్ధక, విచార భాజనమైన జీవితాల్లోకి పది రోజులన్నా ఆనందాన్ని ప్రవేశపెడతాము. ముసలి వాళ్లయినప్పుడు మొత్తానికి పది రోజులన్నా జీవించాము అని సతుష్ఠి పడి మా పేరు తలుచుకుని జీవిస్తారు!”

స్వేచ్ఛ గురించి పురుషుల పెర్సెప్షన్స్ ఎలా ద్వంద్వ ప్రమాణాలతో వుంటాయో ఇలా బాగా చెబుతాడు చలం. “స్వేచ్ఛగా ఎగిరొచ్చి మన గూటిలో వాలాలని, ఒకసారి వాలిన తరువాత ఇక్కడే బందీగా వుండాలని ఆకాంక్ష.” మరో చోట “నీతి బంధనాలు తెంచుకొని పావురం నా మీద వాలితే స్వేచ్ఛకి జయ్. వాగ్దాన బంధం తెంచుకుని నా నుంచి గంటలో ఎగిరిపోతానంటే పావురానికి రెక్కలు పెట్టినవాడికి బుద్ధి లేదని పద్యాలు!” అంటాడు. నిజమే కదా కొందరి ఆదర్శాలను కూడా వారి స్వార్ధపూరిత దృక్పథమే నడిపిస్తుంటుంది.

చదవండి. అమీనాని చదవండి!

స్టేషను దగ్గర ఇనుప కమ్ముల్ని ఆనుకొని ఎదురు చూసే అమీనా
బియ్యం లేక బురద లోంచి ఏటిలోకెళ్లి చేపల్ని పట్టి కాల్చుకొని కడుపు నింపుకునే అమీనా
అడవిలో నెగళ్లు ముందు కూర్చొని గొంతెంత్తి పాడే వారి నుండి పాటలు నేర్చుకున్న అమీనా
ఆకుపచ్చ రిబ్బను కట్టిన దుమ్ముల గ్రీకు రాణి అమీనా
మెరుగు పాపలూ, యెగిరే జుట్టూ, యెలిక పళ్లూ గల అమీనా
చిరిగిన పరికిణీ, మురికి వోణీతో తమాషా అమీనా
మీకు తప్పక గుర్తుండిపోతుంది.

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply