నిర్మితమైన
నూతన సౌధాల నిర్మాణంలో
నీ వంతు చెమట చుక్కల చిరునామా యెక్కడ?
చిగురిస్తోన్న
చరిత్ర శకలాల పుటల్లో
నీవు రాసిన నా నుదుటి రేఖల వునికి యెక్కడ?
తల్లీ భూదేవి!
యెక్కడమ్మా నీ కడుపు పంటల
కదన కుతూహల రాగాలు?… అనుకొంటూ వుంటాం కదా… అన్వేషిస్తూ వుంటాం.
అన్వేషణ.. వో నిరంతర ప్రయాణం. ప్రతి వొక్కరు వారివారి ఆకాంక్షలకి అనుగుణంగా అన్వేషిస్తుంటారు. చరిత్రలో ఆయా సందర్భాల్లో యెప్పుడెప్పుడు యేమయింది, యెవరెవవారు యేయే పాత్రని పోషించారు, సమాజాభివృద్దికి కావల్సినవాటి కోసం వారి ప్రతిఘటన, ప్రశ్నించటం వంటివి రికార్డ్ చేస్తుంటారు. అలా నమోదు చేసిన వాటిని చదువుతున్నప్పుడు స్త్రీల కాంట్రిబ్యూషన్ ఆ యా సందర్భంలో యెలా వుంది, యెంత వరకూ నమోదుచేసారని అప్రయత్నంగా చూడటం, తెలుసుకొని సంతోషపడటం, సరిగ్గా నమోదు కానప్పుడు బాధపడటం చాల సంవత్సరాలుగా స్త్రీల చరిత్ర పట్ల ఆసక్తి, గౌరవం వున్న చదువరి జీవితంలో భాగమైపోయింది. స్త్రీలు భిన్న రంగాల్లో తాము పనిచెయ్యడానికి, తమదైన చూపుని అందించటానికి వొకప్పుడు యేమంత సులభం కాదు. చోటుని పొందటానికే యింటా బయటా వున్న నిర్భంధo నుంచి బోలెడంత యుద్ధం చెయ్యాల్సి వచ్చేదని అందరికీ తెలిసిన విషయమే అయినా యెప్పటికప్పుడు ఆ సంఘర్షణని ఆ యిరుకైన కాలాన్ని గుర్తుచేసుకొంటూ వుండాలి. వర్తమానంలో భవిష్యత్ లో తిరిగి అటువంటి అసమానతలోకి స్త్రీలని నెట్టకుండా వుండటానికి. సమభావం నింపుకోవటానికి. స్త్రీలు అందించిన దార్శనికతని నమోదు చేయ్యటం అత్యంత అవసరం. రికార్డ్ కాని స్త్రీల చరిత్రని జారిపోకుండా అక్షారాల్లో నిక్షిప్తం చేస్తూనే వున్నారు యెందరో. అలాగే నమోదు అయినవాటిని ఆయా సందర్భాలలో తడుముకొంటూ స్పూర్తిని పొందుతూ స్త్రీ చరిత్రని మననం చేసుకొంటూనే వున్నాం.
యీ దేశంలో ప్రతి వొక్కరూ గౌరవించే రాజ్యాంగాన్ని రూపొందించేందుకు యెన్నుకొన్న రాజ్యంగ సభ (Constitutional Assembly) 72 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యీ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించటమంలో పాల్గొన్న మార్గదర్శకులందరినీ స్మరించుకున్నారు. సహజమైన కుతూహలంతో మహిళలు యెంత మంది, అనే ప్రశ్న తో చిన్ని అన్వేషణ మొదలైయింది. వారిని తెలుసుకోవలని, నమోదు అయిన ఆ మహిళల గురించి పంచుకోవాలన్న ఆసక్తి కలిగింది.
మనందరికీ తెలుసు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైనది. అయితే యీ పొడవైన అత్యంత సమగ్రమైన, అత్యంత విలువైన, అత్యంత శక్తివంతమైన, చట్టపరమైన పత్రాల గ్రంథం రూపకల్పనలో స్త్రీల పాత్రని నమోదు చెయ్యటంతో చదువుకొన్నప్పుడు సంతోషంగా అనిపించింది.
ప్రస్తుతం భారత రాజ్యాంగం పీఠిక, 25 భాగాలలో 448 వ్యాసాలు,12 షెడ్యూల్‌లను కలిగిన పెద్ద గ్రంధం. అయితే అమల్లోకి వచ్చిన ప్రారంభ సమయంలో 22 భాగాలు 8 షెడ్యూల్‌లలో 395 వ్యాసాలతో వుండేది. స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించే గొప్ప చారిత్రక పనిని పూర్తి చేయడానికి రాజ్యాంగ సభకు దాదాపు మూడు సంవత్సరాలు (కచ్చితంగా చెప్పాలంటే రెండు సంవత్సరాలు, పదకొండు నెలల, పదిహేడు రోజులు) పట్టింది. యీ గ్రంధం మూసాయిదాని రూపొందించడానికి మొత్తం 165 రోజుల్లో పదకొండు సెషన్‌లను నిర్వహించారు. వీటిలో 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం పరిశీలనకే వెచ్చించారు. క్యాబినెట్ మిషన్ సిఫార్సు చేసిన పథకం ప్రకారం, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీల సభ్యులచే పరోక్ష యెన్నిక ద్వారా 389 మంది సభ్యులను రాజ్యాంగ సభకు యెన్నిక చేసారు. ఆశ్చర్యం యేమిటంటే 389 మందిలో కేవలం 15 మంది మాత్రమే మహిళా ప్రతినిధులు వుండటం.
మన దేశ భవిష్యత్తుని శాసించే చట్టాల రూపకల్పన లో కేవలం పదిహేను మంది మహిళలకే చోటుదక్కడం అనేది యిప్పటి ప్రమాణాలతో చూస్తే చాల చిన్ని సంఖ్యగా కనిపిస్తుందో, కానీ అప్పటి సామాజిక, రాజకీయ, విద్యా ప్రమాణాల ప్రకారం చూస్తే ఆ పదిహేను మందికి చోటు దక్కటమే విలువైన విషయంగానే భావించాలి. వివిధ సమాజాలకు వర్గ కుల సమూహాల నుంచి యీ పదిహేను మంది యెన్నిక కావటం గొప్ప విషయంగానే భావించి తీరాలి. ఆ 15 మంది మహిళల్లో అత్యధికులు మన రాజ్యాంగంపై, ముఖ్యంగా మహిళల ప్రయోజనాలపై అపారమైన అవగాహన స్వాతంత్ర్య సమరయోధులు, న్యాయవాదులు, సంస్కరణవాదులు, వోటు హక్కుదారులు , రాజకీయ నాయకులు. వారు కూడా మహిళా సంఘాలకు చెందినవారు. 1917 నుండి స్త్రీ వుద్యమాలలో పాల్గొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు 71 సంవత్సరాలవుతోంది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు గాను 1949 నవంబర్ 26 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ సభ యెన్నుకోపడింది. ఆ సభ రూపొందించిన రాజ్యాంగం 26 జనవరి 1950 న అమల్లోకి వచ్చింది. మన చరిత్రను మనం యెప్పటికప్పుడు తడుముకుంటూనే వుండాలి. లేకపోతే కాలక్రమంలో మన కళ్ళ నుండి జారిపోయే అవకాశం వుంటుంది. రాజ్యాంగ సభలో యీ పదిహేను మంది మహిళా సభ్యుల సహకారాన్ని మనం సులభంగా మరచిపోకూడదు. స్త్రీల భాగస్వాముని నిరంతరము మనం మననం చేసుకొంటూనే వుండాలి. రాజ్యాంగ నిర్మాణంలో తమ అమూల్యమైన జ్ఞానాన్ని అందిస్తూ నవభారత నిర్మాణంలో విలువైన పాత్రని అందించిన ఆ పదిహేను మంది శిల్పులు యెవరెవరో చూద్దాం.
దాక్షాయణి వేలాయుధన్:
దాక్షాయణి వేలాయుధన్ కొచ్చిన్ తీరంలోని బోల్గట్టి అనే చిన్న ద్వీపంలో పులయా అనే దళిత కులంలో జన్మించారు. ఆమె రాజ్యాంగ పరిషత్‌లోని యేకైక దళిత మహిళా సభ్యురాలు. 34 సంవత్సరాల అతి పిన్న వయస్కురాలు కూడా. ఆమె భారతదేశంలో పట్టభద్రులైన మొదటి దళిత మహిళ కూడా ఆమే. ఆమె కొచ్చిన్‌లోని మహారాజాస్ కాలేజీలో కెమిస్ట్రీ చదివారు . సైన్స్‌లో కోర్సును అభ్యసించిన యేకైక తొలి మహిళా విద్యార్థి కూడా ఆమే. వివక్షాపూరితమైన కుల ఆచారాలకు వ్యతిరేకంగా ఆమె కుటుంబం చేసిన పోరాటం నుంచి ఆమె రాజకీయ ప్రేరణ పొందారు. ఆమె తమ శరీరాన్ని పూర్తిగా కప్పి వుంచుకోగలిగిన మొదటి తరం కేరళ మహిళ. ఆమె 1945లో మద్రాసు నుంచి అసెంబ్లీకి నామినేట్ అయిన ఆమె అసెంబ్లీలో అంటరానితనం, నిర్బంధ కార్మికులు, రిజర్వేషన్లు, దళితులందరికీ వోటు హక్కులపై వాదించారు. అంటరానితనాన్ని నిరోధించడానికి వుత్తమ మార్గం సుస్థిర రాజ్య ప్రచారమే తప్ప శిక్ష నుంచి కాదని ఆమె విశ్వసించారు. 1977లో ఢిల్లీలో మహిళా హక్కుల సంస్థ మహిళా జాగృతి పరిషత్‌ను ఆమె యేర్పాటు చేసారు.
అమ్ము స్వామినాథన్:
కేరళలోని పాల్‌ఘాట్ జిల్లాలో వున్నత కులానికి చెందిన నాయర్ కుటుంబంలో జన్మించిన అమ్ము స్వామినాథన్ సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఆమె అన్నీ బిసెంట్, మార్గరెట్ కజిన్స్, మాలతీ పట్వర్ధన్, శ్రీమతి దాదాభోయ్ నౌరోజీ, శ్రీమతి అంబుజమ్మల్ లతో కలిసి 1917లో మద్రాసులో మహిళా భారత సంఘాన్ని స్థాపించి, మహిళలకు వయోజన విద్య, వోటు హక్కు, రాజ్యాంగ హక్కులను డిమాండ్ చేసిన మొదటి సంఘాలలో వొక సంఘంగా నిలిచారు. ఆమె వున్నత కులానికి చెందినప్పటికీ వివక్షాపూరితమైన కుల పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించారు. సమాన హోదా, వయోజన వోటు హక్కు , అంటరానితనం తొలగింపును గట్టిగా సమర్థించిన ఆమె బాల్య వివాహ నిరోధక చట్టం, వివాహ వయస్సు చట్టం, హిందూ మత చట్టాలలో సంస్కరణల కోసం ముందుకు తెచ్చిన వివిధ హిందూ కోడ్ బిల్లుల కోసం కూడా పోరాడిన అమ్ము 1946లో మద్రాసు నియోజకవర్గం నుండి రాజ్యాంగ సభలో భాగమయ్యారు. రాజ్యాంగం చాలా పొడవుగా వుందని, అది అనవసరమైన వివరాలలోకి వెళ్లిందని జేబులో లేదా పర్సులో సులభంగా సరిపోయే రాజ్యాంగం కావాలని ఆమె భావించారు.
అన్నీ మస్కరీన్:
కేరళలోని తిరువనంతపురంకు చెందిన లాటిన్ కాథలిక్ కుటుంబంలో జన్మించిన అన్నీ మస్కరీన్ ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరిన మొదటి మహిళల్లో ఆమె వొకరు. అలానే ట్రావెన్‌కోర్ స్టేట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో భాగమైన మొదటి మహిళ ఆమె. ట్రావెన్‌కోర్ రాస్ట్రాన్ని స్వాతంత్ర్య భారతదేశంలో యేకీకరణ చేసేందుకు జరిగిన వుద్యమాలకు నాయకత్వం వహించిన వారిలో ఆమె వొకరు. ఆమె 1951లో మొదటి లోక్ సభకు యెన్నికయ్యారు. కేరళ నుండి యెన్నికైన మొదటి మహిళా పార్లమెంట్ సభ్యులు ఆమె. యెన్నికలలో పార్లమెంటుకు యెన్నికైన పది మందిలో మహిళల్లో ఆమె వొకరు. ఆమె పార్లమెంటుకు యెన్నికయ్యే ముందు, ఆమె 1949-1950లో ఆరోగ్య, విద్యుత్ శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు.
బేగం ఐజాజ్ రసూల్:
పంజాబ్ లోని మలేర్‌కోట్ల రాచరిక కుటుంబంలో జన్మించిన బేగం ఐజాజ్ రసూల్ రాజ్యాంగ సభలో ఆమె వొక్కరే ముస్లిం మహిళ. ఆమె తన తండ్రితో రాజకీయ సమావేశాలకు హాజరవడంతో చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ప్రవేశించింది. కొంతకాలంపాటు తన తండ్రి కి ఆమె కార్యదర్శిగా పనిచేసారు. ఆమె తన భర్తతో కలిసి GOI చట్టం 1935 అమలులోకి వచ్చిన తర్వాత ముస్లిం లీగ్‌లో చేరారు. 1950లోభారతదేశంలో ముస్లిం లీగ్ రద్దు తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరారు. యునైటెడ్ ప్రావిన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లిం లీగ్ సభ్యురాలిగా ఆమె రాజ్యాంగ సభకు యెన్నికయ్యారు. ఆమె అసెంబ్లీలో యే కమిటీలోనూ భాగం కానప్పటికీ, ఆమె జాతీయ భాష, రిజర్వేషన్ , ఆస్తి హక్కు, మైనారిటీ హక్కుల కోసం వాదించారు. ఆమె తన ప్రసంగాలలో ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు ‘కేవలం పరిహారం’ అవసరాన్ని హైలైట్ చేసింది. మైనారిటీ హక్కులపై సలహా కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా మైనారిటీ వర్గాలకు ప్రత్యేక వోటర్లకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు. ఆమె ‘సంస్కృత హిందీ’ని జాతీయ భాషగా మార్చడాన్ని వ్యతిరేకించింది, యెందుకంటే చాలా కొద్దిమంది మాత్రమే దానిని అర్థం చేసుకోగలరు. బదులుగా హిందుస్తానీ కోసం వాదించారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్:
దుర్గాబాయి పన్నెండేళ్ల వయస్సు నుండి భారత స్వాతంత్ర్య వుద్యమంలో భాగమయ్యారు. సహాయ నిరాకరణ వుద్యమంలో భాగంగా, విద్యా మాధ్యమంగా ఆంగ్లాన్ని విధించడాన్ని నిరసిస్తూ ఆమె పాఠశాలను విడిచిపెట్టారు. 14 సంవత్సరాల వయస్సులో కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన వొక సదస్సులో స్వచ్ఛందంగా పనిచేసిన ఆమె 1930 మేలో మద్రాసు వుప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆమె జైలులో వుండగా ఆంగ్లం చదివి ఆంధ్రా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. మద్రాసు యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదివిన ఆమె కొన్ని సంవత్సరాలు బార్‌లో ప్రాక్టీస్ చేసారు. 1936లో బనారస్ హిందూ యూనివర్శిటీ నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షల కోసం మద్రాసులో తెలుగు యువతులకు శిక్షణ యివ్వడానికి ఆమె ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆమె ఆంధ్ర మహిళ అనే తెలుగు పత్రికను స్థాపించి, సంపాదకత్వం వహించిన ఆమె మద్రాసు నుండి రాజ్యాంగ సభకు యెన్నికయ్యారు. నియమాలు, విధానాలపై కమిటీ ,స్టీరింగ్ కమిటీలో భాగమయ్యారు. ఆమె న్యాయ-స్వాతంత్ర్యం , మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా కూడా వాదించారు. సంస్కృతీకరించబడిన హిందీకి బదులుగా హిందుస్తానీని జాతీయ భాషగా స్వీకరించాలని ఆమె భావించారు. అయితే, ఆమె తరువాత హిందీని జాతీయ భాషగా స్వీకరించడానికి వ్యతిరేకంగా కూడా వాదించారు.
హంసా జీవరాజ్ మెహతా:
భారతదేశంలో మొదటి మహిళా వైస్-ఛాన్సలర్ అయిన హంసా జీవరాజ్ మెహతా
1897లో జన్మించారు. రచయిత్రి, సంఘ సంస్కర్త, సామాజిక కార్యకర్త, విద్యావేత్త అయిన ఆమె 1949 వరకు కౌన్సిల్‌లో కొనసాగారు. ఆమె 1946లో ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షురాలయ్యారు. అధ్యక్షురాలిగా వున్న సమయంలో, ఆమె లింగ సమానత్వం, మహిళల పౌర హక్కుల కోసం పిలుపునిచ్చిన భారతీయ మహిళా హక్కులు విధుల చార్టర్‌ను రూపొందించారు. ఆమె 1946లో మహిళల హోదాపై UN సబ్‌కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆమె యెలియనోర్ రూజ్‌వెల్ట్‌తో కలిసి ఐక్యరాజ్యసమితి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిటీకి వుపాధ్యక్షులుగా వున్నారు. బొంబాయిలోని SNDT యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమించపడ్డారు.
ఆమె స్వదేశీ వుద్యమం, సహాయ నిరాకరణ వుద్యమంలో కూడా భాగం అయ్యారు. ఆమె కాంగ్రెస్ సభ్యురాలిగా రాజ్యాంగ సభకు యెన్నికయ్యారు. ఆమె అడ్వైజరీ కమిటీ, ప్రాథమిక హక్కుల సబ్‌కమిటీ, ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీలో భాగమైనారు.
కమల చౌదరి:
కమల చౌదరి స్త్రీవాది, కాల్పనిక రచయిత్రి, రాజకీయ కార్యకర్త. ఆమె రాజకీయ జీవితం 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరడంతో ప్రారంభమైంది. శాసనోల్లంఘన వుద్యమంలో చురుకైన పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 54వ సెషన్‌లో ఆమె వుపాధ్యక్షురాలిగా వున్నారు. ఆమె రాజ్యాంగ సభకు యెన్నికయ్యారు. కమలా చౌదరి లక్నోలోని సంపన్న కుటుంబంలో జన్మించారు. బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వానికి తన కుటుంబం విధేయత నుండి దూరంగా వున్న ఆమె జాతీయవాదులలో చేరి 1930 లో గాంధీ ప్రారంభించిన శాసనోల్లంఘన వుద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె తన యాభైవ సెషన్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వుపాధ్యక్షురాలిగా వున్నారు. డెబ్బైల చివరలో లోక్ సభ సభ్యురాలిగా యెన్నికయ్యారు. ఆమె రచించిన కథలు సాధారణంగా మహిళల అంతర్గత ప్రపంచంతో లేదా ఆధునిక దేశంగా భారతదేశం ఆవిర్భావంతోనో ముడిపడివుండేవి.
లీలా రాయ్:
లీలా రాయ్ గొప్ప సంఘ సంస్కర్త, బలమైన స్త్రీవాది, సామాజిక, రాజకీయ కార్యకర్త. సుభాష్ చంద్రబోస్ సన్నిహిత సహచరురాలు. 1923లో ఆమె ఢాకా విశ్వవిద్యాలయం MA పట్టా పొందిన మొదటి మహిళ. 1923లో మహిళా విద్య కోసం ఆమె దీపాలి సంఘాన్ని స్థాపించారు. దీపాలి పాఠశాల అనే పాఠశాలను, దీపాలి సంఘ సహాయంతో పన్నెండు యితర వుచిత ప్రాథమిక పాఠశాలలను ఆమె స్థాపించారు. తదనంతరం, 1928లో, ఆమె నారీ శిక్షా మందిర్ , శిక్షా భబన్ అని పిలువబడే మరో రెండు పాఠశాలలను స్థాపించారు. ఢాకాలోని కమ్రున్నెస్సా బాలికల పాఠశాల అనే వొక పాఠశాలను యేర్పాటు చేయడంతో ముస్లిం మహిళల విద్యకు మరొక ముఖ్యమైన సహకారం అందించారు. ఆమె విద్యార్థినుల కోసం కలకత్తాలో హాస్టళ్లను కూడా యేర్పాటు చేసారు. ఆమె మహిళల ఆర్థిక స్వేచ్ఛకు సమాన ప్రాముఖ్యత కోసం వాదించారు. 1946 డిసెంబర్ 9న బెంగాల్ నుండి రాజ్యాంగ సభకు యెన్నికైన యేకైక మహిళ లీలా రాయ్ గారు. అయితే, భారత విభజనకు వ్యతిరేకంగా కొన్ని నెలల తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
మాలతీ చౌదరి:
తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) కు చెందిన మాలతీ చౌదరి 1904లో జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో ఆమెని శాంతినికేతన్‌కు పంపించినప్పుడు ఆమె అక్కడ విశ్వభారతిలో చేరారు. ఆమె తన భర్త నబకృష్ణ చౌధురి గారితో కలిసి వుప్పు సత్యాగ్రహం సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1933లో, ఆమె తన భర్తతో కలిసి ఉత్కల్ కాంగ్రెస్ సమాజ్‌వాది కార్మిక సంఘ్‌ను యేర్పాటు చేసారు. ఆ తర్వాత అది ఆల్ ఇండియా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వొరిస్సా ప్రావిన్షియల్ శాఖగా ప్రసిద్ధి చెందారు. ఆమె 1934లో ఒడిస్సాలో గాంధీజీ గారు చేస్తోన్నపాదయాత్రలో ఆమె చేరారు. ఒడిషాలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బాజీరౌత్ ఛత్రవాస్ వంటి అనేక సంస్థలను యేర్పాటు చేసారు. ఇందిరాగాంధీ గారు యెమర్జెన్సీ ని విధించినప్పుడు యెమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఆమె తీవ్రమైన ప్రొటెస్ట్ చేసారు.
పూర్ణిమా బెనర్జీ:
సత్యాగ్రహ వుద్యమంలో, క్విట్ ఇండియా వుద్యమంలో పాల్గొన్న పూర్ణిమా బెనర్జీ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ,ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యురాలు. అలహాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ, గ్రామీణ ప్రాంతాలను ప్రోత్సహించే దిశగా పనిచేశారు. ఆమె యునైటెడ్ ప్రావిన్స్ నుండి రాజ్యాంగ సభకు నియమితులయ్యారు. ముసాయిదా ఆర్టికల్ 15A (భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22)లోని ప్రివెంటివ్ డిటెన్షన్ నిబంధన తప్పనిసరిగా వొక వ్యక్తిని నిర్బంధించలేని సమయ పరిమితులను నిర్దేశించిందని ఆమె వాదించారు. అంతేకాకుండా, నిర్బంధంలో వున్న వ్యక్తి వారి కుటుంబంలో సంపాదిస్తున్న సభ్యుడిగా వుంటే, వారికి తప్పనిసరిగా మెయింటెనెన్స్ అలవెన్స్ యివ్వాలని ఆమె నొక్కి చెప్పారు. రాజ్యంగ వుపోద్ఘాతంపై జరిగిన చర్చలో ‘సార్వభౌమాధికారం’ భారతదేశ ప్రజల నుండి వుద్భవించింది” అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు.
రాజకుమారి అమృత్ కౌర్:
స్వతంత్ర భారతదేశానికి మొదటి ఆరోగ్య మంత్రి అయిన రాజకుమారి అమృత్ కౌర్ గారు
స్వాతంత్ర్యం కోసం గాంధీ గారు చేసిన పోరాటం నుండి ప్రేరణ పొందిన ఆమె 16 సంవత్సరాల పాటు మహాత్మా గాంధీ కి కార్యదర్శిగా పనిచేశారు. అందుకోసం తన షెర్బోర్న్ , ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల వున్నత విద్యను విడిచిపెట్టారు. 1927లో ఆమె మార్గరెట్ కజిన్స్‌తో కలిసి ఆల్-ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్‌ను స్థాపించారు. 1930లో కార్యదర్శిగా, 1933లో అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె 1934 నుండి గాంధీ గారి ఆశ్రమంలో నివసించారు. దండి మార్చ్‌లో పాల్గొన్నందుకు కౌర్‌ను బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. ఆమె 1942 లో విద్యా సలహా మండలిలో సభ్యులుగా నియమితులయ్యారు. ఆ సభ్యత్వానికి రాజీనామా చేసి క్విట్ ఇండియా వుద్యమానికి తన మద్దతును ప్రకటించారు. ఆమె సెంట్రల్ ప్రావిన్సెస్ , బెరార్ నుండి రాజ్యాంగ సభకు యెన్నికయ్యారు. ఆర్టికల్స్ 14, 15, 16 కింద హామీ యిచ్చిన స్త్రీ, పురుష రాజ్యాంగ సమానత్వాన్ని భారతదేశం స్థాపించడంలో ఆమె కీలక పాత్ర పోషించించారు. ఆమె. పదేళ్లపాటు పదవిలో వున్న ఆమె ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి యెన్నికైన మొదటి మహిళ, మొదటి ఆసియా అధ్యక్షురాలు. ఆమె ఆరోగ్య మంత్రిగా వున్న సమయంలో ఆల్ ఇండియా యిన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)ని స్థాపించి, దాని మొదటి అధ్యక్షురాలిగా పనిచేశారు. 14 సంవత్సరాల పాటు, ఆమె ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్‌పర్సన్‌గా , సెయింట్ జాన్స్ అంబులెన్స్ సొసైటీ యెగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు నిరక్షరాస్యతను తగ్గించేందుకు చురుకుగా కృషి చేశారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలలో పాల్గొనే మహిళల హక్కుల కోసం కృషి చేసిన ఆమె ట్యూబర్‌క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ లెప్రసీ అండ్ రీసెర్చ్ యిన్‌స్టిట్యూట్‌ని స్థాపించారు.
రేణుకా రే:
ఐసియెస్ అధికారి సతీష్ చంద్ర ముఖర్జీ కుమార్తె రేణుకా రే లండన్ స్కూల్ ఆఫ్ యెకనామిక్స్ నుంచి బియె పూర్తి చేశారు. 1934 సంవత్సరంలో, AIWC న్యాయ కార్యదర్శిగా ఆమె ‘భారతదేశంలో మహిళల చట్టపరమైన వైకల్యం’ అనే పత్రాన్ని సమర్పించారు. 1943 నుండి 1946 వరకు ఆమె కేంద్ర శాసనసభ, రాజ్యాంగ సభ, తాత్కాలిక పార్లమెంటు సభ్యురాలు గా వున్న రేణుక గారు 1952 నుండి 1957 వరకు పశ్చిమ బెంగాల్ శాసనసభలో సహాయ, పునరావాస మంత్రిగా పనిచేశారు. దీనితో పాటు, 1957 సంవత్సరంలో, 1962 లో ఆమె లోక్ సభలో మాల్డా సభ్యురాలు. ఆమె ఆల్ బెంగాల్ మహిళా సంఘ్ మహిళా కోఆర్డినేటింగ్ కౌన్సిల్ను స్థాపించారు. ఆమె మహాత్మా గాంధీ పిలుపు నుండి ప్రేరణ పొంది నిరసనలలో పాల్గొంటూ గాంధీగారి ఆశ్రమంలో చేరారు. AIWC కార్యదర్శిగా పని చేస్తున్నప్పుడు, ఆమె రచించిన ‘లీగల్ డిసేబిలిటీ యీజ్ విమెన్ యిన్ ఇండియా; విచారణ కమిషన్ కోసం వొక అభ్యర్ధన’. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు మహిళా కూలీల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆమె కృషి చేశారు. రే అనేక మహిళల హక్కుల సమస్యలు, మైనారిటీ హక్కులు ,వుభయ సభల నిబంధనలకు సహకరించారు. యూనిఫాం పర్సనల్ లా కోడ్ కోసం ఆమె పోరాడారు. 1949లో UN జనరల్ అసెంబ్లీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1952లో ఆమె పశ్చిమ బెంగాల్ శాసనసభకు యెన్నికయ్యారు. అదే సంవత్సరంలో,ఆమె AIWC అధ్యక్షురాలైయ్యారు. శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం ప్రణాళికా సంఘం పాలకమండలిలో పనిచేసారు. 1957లో పార్లమెంటుకు యెన్నికయిన ఆమె సహాయ, పునరావాస మంత్రిగా పనిచేశారు. ప్రజా వ్యవహారాలలో ఆమె చేసిన సేవలకు 1988లో ఆమెకు పద్మ భూషణ్ అవార్డు లభించింది.
సరోజినీ నాయుడు:
నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడుగారు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు. ఆమె తన వున్నత చదువులను లండన్‌లోని కింగ్స్ కాలేజ్, తరువాత కేంబ్రిడ్జ్‌లోని గిర్టన్ కాలేజీలో చదివారు. ఇంగ్లాండ్‌లో వున్నప్పుడు ఆమె వోటు హక్కు ప్రచారాలలో కొంత అనుభవాన్ని పొందారు. భారతదేశ కాంగ్రెస్ వుద్యమం మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ వుద్యమం వైపు ఆకర్షితురాలైన ఆమె హోమ్ రూల్ వుద్యమం, వుప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె ఐదుసార్లు అరెస్టయ్యారు. వోటు హక్కు కలిగి వుండటంతో పాటు, ఆమె మహిళా హక్కుల కార్యకర్త కూడా. 1908లో మద్రాస్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్‌లో వితంతువుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణల కోసం ఆమె వాదించారు. 1917లో ఆమె ఆల్-ఇండియా వుమెన్స్ డిప్యుటేషన్‌కి నాయకత్వం వహించారు. మహిళల వోటు హక్కును సమర్థించారు. ES మోంటాగు (భారత రాష్ట్ర కార్యదర్శి). అన్నీ బిసెంట్‌తో కలిసి ఆమె వుమెన్స్ ఇండియా అసోసియేషన్‌ను యేర్పాటు చేసారు. 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రెండవ సెషన్ కోసం ఆమె గాంధీతో కలిసి లండన్ వెళ్లారు.ఆమె బీహార్ నుంచి రాజ్యాంగ సభకు నియమితులయ్యారు.
సుచేతా కృప్లానీ:
అంబాల పట్నంలో 1908 లో జన్మించిన సుచేతా కృప్లానీ భారతదేశ రాష్ట్రానికి యెన్నికైన మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. ఢిల్లీ యూనివర్శిటీలోని ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ వుమెన్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. 1939 వరకు బనారస్ హిందూ యూనివర్శిటీలో రాజ్యాంగ చరిత్రను బోధించారు. 1938లో కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా చేరి, విదేశాంగ శాఖ , మహిళా విభాగానికి కార్యదర్శిగా యేడాదిన్నర పాటు పనిచేశారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం 1940లో స్థాపించారు. ఆమె 1940లలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన ఆమె1942 క్విట్ ఇండియా వుద్యమంలో పాల్గొని 1944లో అరెస్టు అయ్యి, యేడాదిపాటు జైలు శిక్ష ని అనుభవించారు. ఆమె 1946లో యునైటెడ్ ప్రావిన్స్ నుండి రాజ్యాంగ సభకు ఫ్లాగ్ ప్రెజెంటేషన్ కమిటీ సభ్యునిగా యెన్నికయ్యారు.యీ కమిటీ రాజ్యాంగ పరిషత్ ముందు మొదటి భారత జెండాను సమర్పించారు. విభజన సమయంలో బెంగాలీ శరణార్థులకు పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన కృప్లానీ కాంగ్రెస్ పార్టీ యేర్పాటు చేసిన రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ సంస్థలు, దేశాలకు వివిధ ప్రతినిధి బృందాలలో ఆమె కూడా వొకప్రతినిధి.
విజయ లక్ష్మి పండిట్:
ఆగస్ట్ 18,1900 లో అలహాబాద్ లో జన్మించిన విజయ లక్ష్మి పండిట్ గారు మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి చెల్లెలు దౌత్యవేత్త, రాజకీయవేత్త స్వాతంత్ర్య పోరాటంలో వుత్సాహంగా పాల్గొని, మూడు వేర్వేరు సందర్భాలలో ఆమె జైలుకెళ్ళిన ఆమె రాజకీయ జీవితం అలహాబాద్ మున్సిపల్ బోర్డు యెన్నికలతో ప్రారంభమైంది. ఆమె 1936లో యునైటెడ్ ప్రావిన్సెస్ అసెంబ్లీకి యెన్నికయ్యారు. 1937లో స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్య మంత్రి అయ్యారు. క్యాబినెట్ మంత్రి అయిన మొదటి భారతీయ మహిళ విజయ లక్ష్మి పండిట్ గారు. యునైటెడ్ ప్రావిన్సెస్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కింద రాజ్యాంగ సభకు యెన్నికయ్యారు. భారత స్వాతంత్ర్యం తరువాత, ఆమె 1946- 48 , 1952-53 మధ్య ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యంవహించిన ప్రముఖ దౌత్యవేత్తగా మారారు. ఆమె మాస్కో, మెక్సికో, వాషింగ్టన్ , తరువాత ఇంగ్లాండ్ , ఐర్లాండ్‌లకు యేకకాలంలో రాయబారిగా వున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షులైన మొదటి మహిళ విజయలక్ష్మి పండిట్ గారు.
రాజ్యాంగ రూపకల్పన కోసం విశేషంగా కృషి చేసిన యీ పదిహేను మంది అద్భుతమైన మహిళలు అడుగడుగునా పితృస్వామ్య ఆధిపత్యాన్నియెదుర్కొంటూనే వచ్చారు. యెవరి చరిత్రని వారే రాసుకొని తీరాలి, పులులు చరిత్ర రాస్తే మేకలకు స్థానం వుండదు అని యెరుక వచ్చిన కాలం యిది. మేకల చరిత్రని మేకలే రాసుకుంటూ పులుల పెత్తనాన్ని నిలదీస్తున్న కాలం యిది. ఆదివాసీ మహిళ సైతం తన చరిత్రని తానే రాసుకుంటున్న కాలమిది. యిలా ప్రతి సందర్భంలో నమోదు అయిన స్త్రీల చరిత్రని స్మరించుకొంటూ యేదైనా రంగంలో రికార్డ్ కాని స్త్రీల చరిత్ర వుంటే సోధించి వెలికి తీయ్యటం యెంతో అవసరం. 71 యేళ్ళ క్రితం రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకున్న యీ పదిహేను మంది విలువైన మహిళల శక్తి సామర్ధ్యాల్ని తల్చుకోవటం యెంతో స్పూర్తిదాయకం.
అధ్బుతమైన రచన. అందరూ మర్చిపోయిన చరిత్ర. కాదుకాదు అందరూ మర్చిపోయిన, విస్మరించిన చరిత్ర. మా తరానికి ఏమాత్రం ఏరుకలేని చరిత్ర. కృతజ్ఞతలు చాలా చిన్న పదం.
ఫోటోలు కూడా ఉంటే చాలా బావుండేది.
మీ అభిప్రాయం పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
“దాక్షాయాణి వేలాయుధన్”
ఈ పేరు మలయాళీలు కూడా గుర్తుంచుకొని వుండరు.
తెలుగు దళిత మేధావులకు ఒక్కరికైనా తెల్సా?
వికీపీడియా సమాచారం కాకుండా అంత గొప్ప యోధురాలి గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి రాయండి.
దాక్షాయణి చదువుకోవడానికి ఎంత యుద్ధం చేసిందో ఎక్కడో చాన్నాళ్ల క్రితం చదివానండీ. అప్పట్లో పులయ స్త్రీలు బ్లౌజ్ వేసుకోవడం నిషిద్ధం. ఇక చదువు నేర్చుకోవడం ఎంత సాహసమో ఊహించుకోండి. తాను చదువుకోవడానికి వెళ్తుంటే నంబూద్రిలు, నంబియార్ మగ పిల్లలు ఆమె బ్లౌజ్ ని ఎన్నోసార్లు వీధిలో చించేశారు. అని చదివినప్పుడు గుండె నీరైపోయింది.
విస్మృత ధీర వనితల గురించి రికార్డు చేసిన చరిత్రను తెలియ చేసినందుకు ధన్యవాదాలు మేడం..