దీప అడవికి వెళ్లి మూడేండ్లు దాటింది. అనారోగ్యం వల్ల రెగ్యులర్ దళాల్లో తిరుగలేని పరిస్థితి. టీచర్ బాధ్యతలను అప్పగించింది పార్టీ.
తెలుగు, హిందీ, సైన్స్, సోషల్, లెక్కలు వారికి బోధించాలి. నెల రోజుల క్యాంపు. విద్యార్థులంతా స్క్వాడ్ ఏరియా కమిటీ (ఎస్‌ఏసీ) సభ్యులు. అంటే తమ దళం పరిధిలోని ఇరవై నుంచి ముప్పై ఊర్లను గైడ్ చేసే ముఖ్యులు.
ముగ్గురు టీచర్లు. తెలుగు, లెక్కలు సబ్జెక్టులను దీప, సైన్స్, సోషల్ సబ్జెక్టులను శ్యామ్, హిందీని నర్మద బోధిస్తున్నారు.
దీపది కమాండర్ స్థాయి. సహచరుడు రాష్ట్రకమిటీ సభ్యుడు. శ్యామ్ జిల్లా కమిటీ సభ్యుడు. భార్య దళ సభ్యురాలుగా పనిచేస్తోంది. డెన్ వర్క్ నుంచి దళంలోకి కొత్తగా వచ్చారు. నర్మద జిల్లా కమిటీ సెక్రటరీ. ఈమె సహచరుడిది కమాండర్ స్థాయి.
ఈ క్యాంపుకు వచ్చేవారంతా దళంలోకి వచ్చిన తర్వాతే చదువు నేర్చుకున్నవారు. ఎట్లాగో కష్టపడి చదివినా, రాయడంలో చాలా తప్పులు దొర్లుతున్నాయి. ప్రాథమిక పాఠశాల స్థాయికి సంబంధించిన జ్ఞానాన్ని వారికి నెల రోజుల్లో ఆ నాలుగు సబ్జెక్టుల్లో అందించాలనేది లక్ష్యం.
అందరూ ఆదివాసీలే అయినప్పటికీ కొందరు హిందీ, కొందరు తెలుగు నేర్చుకున్నారు. ముఖ్యంగా దక్షిణ బస్తర్, గఢ్‌చిరోలి ప్రాంతం వారు.. దళాలు ప్రవేశించిన కొత్తలో రిక్రూట్ అయిన వా రు.. చాలామంది తెలుగు నేర్చుకున్నారు. మిగతావారు హిందీ నేర్చుకున్నారు.
దాదాపు ఎకరం స్థలంలో క్యాంపు ఏర్పాటు చేశారు. మంచి వర్షాకాలం. పెద్ద వాగు పక్కనే మకాం. కింద నుంచి నీరు ఊరుతోంది. అందుకని వెదురుతో మంచాలు ఏర్పాటు చేశారు. అంటే… ఆ చివరా, ఈ చివరా రాళ్లను లేదా కట్టెలను పాతి, వెదురుతో తయారు చేసిన బెడ్‌ను వాటి మీద పెట్టడం. ఒక్కో టెంట్‌లో ఆ వెదురు బెడ్ మీద ఏడు నుంచి పది మంది వరకు పడుకునే వారు. వాగుకు దూరంగా నీరు ఊరేది కాదు. అందుకని అటువైపు వారు కిందనే పడుకునే వారు.
భీమన్న కమాండర్. విమలక్క డిప్యూటీ కమాండర్. వీరిద్దరూ సహచరులు. వీరు ప్రధానంగా క్యాంపు ఏర్పాట్లతో పాటు రక్షణ బాధ్యతలను చూస్తారు. మరికొందరు దళసభ్యులు ఉన్నారు. అలాగే వీరితో పాటు పత్రిక నిర్వహణా బాధ్యుడు మాలు, జూరీ ఉండేవారు. ఎరుపుగా ఉన్నవారిని ఆదివాసీలు ‘మాలు’ అని పేరు పెడతారు. ఇతను తెల్లగా ఉండటం వల్లనేమో మాలు అని పేరు పెట్టారు. మాలు సహచరి ఎన్‌కౌంటర్‌లో చనిపోయి ఇంకా ఏడాది కాలేదు. అందుకే కావచ్చు… తక్కువగా మాట్లాడతాడు. నలుపు రంగులో ఉన్నవారిని మహిళ అయితే జూరీ అని, పురుషుడు అయితే జూరు అని పిలుస్తారు. జూరి పేరుకు తగ్గట్టే ఉండేది. జూరీ సహచరుడు రాష్ట్ర కమిటీ సభ్యుడు. మాలు, జూరీ బయటి నుంచి వచ్చిన కామ్రేడ్స్. చదువుకున్నవారు. అందువల్ల వీరికి పత్రిక బాధ్యతలు ఇచ్చారు. ఈ టీమంతా ఎప్పుడూ కలిసే ఉంటారు.
ఓ రామె పిట్టను పెంచారు విమలక్క, భీమన్నలు. ఇది చిలుక కంటే కూడా స్పష్టంగా మాట్లాడేది. దీనిని పట్టుకున్న మొదట్లో రెక్కలు తీసేశారు. ఆ తర్వాత క్యాంపుకు, దళ సభ్యులకు అలవాటై పోయింది. క్యాంపు పరిసరాల్లో ఎగురుతూ ఉండేది. రెక్కలు లేకపోయినా అడవిలో కలిసిపోతే పట్టుకోవడం కష్టం. కానీ అది వెళ్లేది కాదు. దళ సభ్యులు పాడే పాటలను తనకు తాను అప్పుడప్పుడు పాడుకునేది. కొన్ని మాటలను వల్లించేది. ఊ అంటే ‘కామ్రేడ్… కామ్రేడ్’ అనేది. ముచ్చటగా ఉండేది. అప్పటి వరకు చిలుక మాట్లాడతదనే తెలిసిన దీపకు ఆ రామె పిట్ట మాట్లాడటం చూసి చాలా అబ్బురం అనిపించింది.
ఆ పిట్ట కూడా ఈ క్యాంపుకు వచ్చింది.
క్యాంపు ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. తెల్లారితే క్యాంపు ప్రారంభమవుతది. కూరగాయలు ఇంకా రాలేదు. క్యాంపుకు వచ్చే ఒక బ్యాచీతో పాటు అవి వస్తాయి. పప్పు, ఆలుగడ్డలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవి రెండు రోజుల వరకు సరిపోతాయి. కానీ ఏదైనా కారణం చేత కూరగాయలు రాకపోతే వీటిని వండవచ్చు. అందుకని వాటిని కదిలించవద్దనుకున్నారు.
”భీమన్నా, రాత్రికి ఏం కూర చేయాలి?” దీప అడిగింది. కిచెన్ డ్యూటీ దీపదే. కొద్దిసేపు ఆలోచించి… ”దీపక్కా నువ్వు కూరకు ఉల్లిగడ్డలు గిన కొయ్యి. నేను ఇప్పుడే వస్తా” అని టార్చిలైట్ తీసుకుని వాగులోకి దిగిండు భీమన్న. ఓ నాలుగు పెద్దవి ఎండ్రకాయలను పట్టుకొని వచ్చాడు. వాటితో కూర చేశారు.
మొదట్లో దీపకు ఎండ్రకాయలు పట్టడం వచ్చేది కాదు. ఇప్పటికీ పెద్ద ఎండ్రకాయలు పట్టడం అంటే భయమే. మొదట చిన్న చిన్నవి పట్టడం నేర్చుకుంది. ఓ కామ్రేడ్ వాటిని ఎట్లా పట్టాలో నేర్పాడు దీపకు. వాటిపైన చెయ్యిని అదాటున వెయ్యాలి. అట్లా వెయ్యగానే అది కొండ్లు ఉన్న ముందరి కాళ్ల (చేతుల)ను కడుపు కిందకు లాక్కుంటది. అప్పుడు దానిపైనున్న అరచేతిని కదల్చకుండా నెమ్మదిగా చేతివేళ్లను దాని ముందు భాగం నుంచి కడుపు కిందకు పోనిచ్చి పట్టుకోవాలి. ఇక అది తన చేతులను వెడల్పు చెయ్యలేదు. కాబట్టి కరువలేదు.
వీటిది మరో విశేషమేమంటే.. పేగుల నీసు వాసన చూసినవంటే ఎంత లోపలి బొరియలో ఉన్నవైనా సరే బయటికి వచ్చేస్తాయి.
ఒక్క కోడి ఉండి, సభ్యులు ఎక్కువ మంది ఉన్నప్పుడు కోడి పేగులను పెద్ద కర్రకు చుట్టి, దానిని బొరియలో పెట్టి, నెమ్మదిగా బయటకు తీసేవారు. కర్రతో పాటు ఎండ్రకాయా బయటికి వచ్చేది. ఆ కర్రను నీళ్ల నుంచి బయటకు తీసినా దానితోపాటే ఎండ్రకాయా వచ్చేది. ఏదో మత్తు పెట్టినట్టే ఆ పేగుల చుట్టే తిరుగేది. తన ప్రాణ రక్షణ ఏవీ గుర్తు ఉండవు దానికి. ప్రకృతిలో ఎన్ని వింతలు! అట్లా కొన్ని ఎండ్రకాయలను పట్టి మరో కూర చేసేవారు. ఎండ్రకాయ కాళ్లను విరిచి, మధ్య డొప్ప భాగాన్ని కూడా రెండు ముక్కలుగా చేసి కూర వండుతారు. మంచిగా మసాలా పెట్టి, వేపుడు చేస్తే రుచిగా ఉంటుంది కూర. అన్నిటికి మించి పోషకాలున్న ఆహారం. ఎండ్రకాయలకు అభూజ్‌మాడ్ అడవిలో కొదువలేదు.
ఆ మరుసటి ఏడు, ఎనిమిది గంటలకల్లా బ్యాచ్‌లన్నీ ఒకదాని తర్వాత ఒకటి దిగాయి. కోలాహలం. స్టూడెంట్స్‌తో పాటు రక్షణకు వచ్చిన సభ్యులతో క్యాంపులో దాదాపు డెబ్బై మంది అయ్యారు. ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం కావాల్సిన క్లాస్ గంట ఆలస్యమైంది.
లంచ్ బ్రేక్ ఒరటిగంటకు. గంట విరామం తర్వాత రెండు గంటలకు మధ్యాహ్నం క్లాస్ ప్రారంభం. ఐదు గంటలకు స్కూల్ అయిపోతది. మళ్లొక గంటన్నర టీ బ్రేక్. ముచ్చట్లు. తిరిగి ఆరున్నర గంటలకు ట్యూషన్. అంటే ఇచ్చిన హోంవర్క్‌ను చేయడం.
‘ఎర్రని జెండా ఎగురుతున్నది’ పాట (ప్రార్థన)తో ప్రతి రోజు స్కూల్ ప్రారంభమయ్యేది.
వారం ఇట్టే తిరిగిపోయింది. వారానికో రోజు ఒకపూట గేమ్స్. ఒక పూట సెలవు. సాయంత్రం టీ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు.. నాటికలు, పాటలు, ఏకపాత్రాభినయం. ఏది చేయాలనుకుంటే అది.
ఐక్యూ పెడితే బాగుంటుందని మాలు సూచించాడు. దీంతో అప్పుడప్పుడు సాయంత్రాలు… రాష్ట్ర రాజధానులు మొదలు, వ్యక్తుల పేర్లు, దేశాల పేర్లు, పలు తేదీల ప్రాముఖ్యతల వరకు ఓ ఇరవై వరకు పోస్టర్లు పెట్టడం. ఆ టెంట్‌లోకి ఒక్కో బ్యాచ్‌ని ఐదు నిమిషాలు పంపించడం, తర్వాత తాము చూసిన వాటిని రాయమనడం.
అప్పటి వరకు జరిగిన క్లాసులపై ప్రతీ వారం పరీక్ష.
రోజులు తెలియకుండా జరిగిపోతున్నాయి.
టీచర్లకూ, విద్యార్థులకు టైమ్ ఉండేది కాదు.
రూపాయికి ఎన్ని పావళాలో తెలియని వారు కూడా ఈ నెల రోజుల్లో కూడికలు, తీసివేతలు, ఎక్కాలు, భాగాహారాలు, హెచ్చవేతలు వరకు దాదాపు అందరూ నేర్చుకున్నారు. నిజానికి భూమి, చుట్టు కొలతలు కూడా నేర్పాలనుకున్నారు. కానీ ఆచరణ సాధ్యం కాలేదు. తెలుగు, హిందీ సబ్జెక్టులయితే మరీ కష్టమైపోయింది. కొందరిలో స్పెల్లింగ్ మిస్టేక్స్ తగ్గాయి కానీ, ఇంకా చాలా మందిలో వాటిని మాన్పించలేకపోయారు.
ఇంకో రెండు రోజుల్లో క్యాంపు అయిపోతది. ఎవరి ఏరియాలకు వాళ్లు వెళ్లిపోతారు. ఆ రోజు పున్నమి. అడవంతా తెల్లటి వెన్నెల పరుచుకుంది. దీపకు నిద్ర రావడం లేదు. కీచుమంటూ తీతువు అరుచుకుంటూ వెళ్లిపోయింది. చిన్న శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దం. ఎక్సైజ్ చేసే గ్రౌండ్‌లోకి వెళ్లి కొద్దిసేపు నడిస్తే బాగుండు అనిపించింది. చలిగా ఉంది ఎందుకులే అని పడుకుంది. తెగని ఆలోచనలు.
తను పార్టీలోకి వస్తానని ఎన్నడైనా అనుకుందా? ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ తేలింది. బీఈడీని మధ్యలోనే వదిలేసి వచ్చింది. ఈ రోజు ఇక్కడ వీళ్లకు పాఠాలు చెప్తోంది.
క్యాంపులో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొని వచ్చినవారే కదా. అటవీ ఉత్పత్తులను అమ్మబోయినా, ఏదైనా సరుకు కొనబోయినా దోచుకోవడమే. కడుపు రగిలిపోయినా ఎదురించలేని స్థితి. సంతనే వారికి అతి పెద్ద మార్కెట్. అక్కడే ప్రభుత్వమూ, చట్టాలు, రాజ్యమూ. సంతలోని వ్యాపారుల దగ్గర నుంచి, సరైన ధర చెల్లించని తునికాకు, వెదురు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, రీతి రివాజుల పేరుతో పెద్దల అణచివేతల దగ్గర నుంచి ఎన్నో అవమానాలు, అన్యాయాలను ఎదుర్కొన్నవారే కదా వీరంతా.
చనిపోయిన రోజు చనిపోతారు కావచ్చు. దాని గురించిన దిగుల్లేదు. కానీ నిత్యం ఉండే శారీరక శ్రమ. నిద్రలేమి. పట్టుదల లేకుండా వీటిని అధిగమించడం ఎంత కష్టం.
వీరికి చదవడం సక్రమంగా రాకపోవచ్చు. ఇరాక్ మీద అమెరికా ఎందుకు దాడి చేసిందో స్పష్టంగా తెలుసు. ఆ దాడి ఎందుకు అన్యాయమో తెలుసు. సామ్రాజ్యవాద మంటే ఏమిటో తెలుసు. దళంలోకి వచ్చాక నిత్యం ఏదో రూపంలో యుద్ధం ఎందుకు చెయ్యాలో, ప్రాణాలెందుకు ఇవ్వాలో నేర్చుకుంటారు. దోచుకునే వాడిని, పోలీసుల అండదండలున్న వాడిని, అధికారమున్న వాడిని ‘అమ్మా, బాపు’ అంటే వినడని వారికి అనుభవపూర్వకంగా తెలుసు. మరి ”చదువు రానివారు ఉద్యమం ఎట్లా చేస్తారు” అని ఎంత ఈజీగా అంటారు ‘చదువుకున్నవారు’. అంత చదువుకున్న వారు దళంలోకి వచ్చి ఒక్క రోజు ఉండగలరా? తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టగలరా? ఎంత మంది తమ ఒక నెల సంపాదనను కష్టంలో ఉన్నవారికి నిండు హృదయంతో ఇవ్వగలరు? అంతెందుకు తమకు ఏ ప్రయోజనం ఉండదనుకుంటే ఒక గంట సమయాన్ని ఇతరుల కోసం వెచ్చించగలరా? ప్రాణాలంటే భయం, కష్టాలంటే భయం, పలకరింపుగా చిరునవ్వు నవ్వడానికి కూడా ఆలోచించేవారు…. అన్నిటినీ, అన్నిటినీ వదిలి ఉద్యమంలో పాల్గొంటున్న వీరి గురించి అంత సులభంగా ఎలా మాట్లాడగలరు?
కళ్ల ముందే జరుగుతున్న అన్యాయానికి తమ గొంతుకను కలుపలేని ఈ ‘చదువుకున్నవారు’, తమ సుఖసౌకర్యాలను ఇసుమంతన్నా వదులుకోలేని ఈ ‘చదువుకున్నవారు’… ఇతరుల కష్టాలను తమవిగా చేసుకున్న ‘ఈ చదువురాని వారిని’ అంత సులువుగా ఎట్లా కొట్టిపారేయ గలరు? ఇసుమంతైనా ఆలోచించరా?
ఎట్లా అర్థం అవుతది వారికి, ఇక్కడి వారి గురించి. అన్నీ ప్రచారం చేసుకోవాల్సిందేనా? అయినా చదువుకున్నవారు కదా. ఆ మాత్రం అర్థం కాదా? ఆలోచిస్తూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది దీప.
క్యాంపుకు వచ్చిన వారు దీపకు తనను ఉద్యమంలోకి తీసుకువచ్చిన కామ్రేడ్ భవానీ రాసిన ఉత్తరాన్ని ఇచ్చారు. ఈ మధ్య బయటి నుంచి కలిసిన ఓ అన్న ‘చదువురాని వారు ఉద్యమాన్ని ఎట్లా గైడ్ చేస్తారు’ అని తనను పలువురు ప్రశ్నించారని చెప్పాడట. ఉద్యమం గురించి బయటివారి ఆలోచిస్తున్న తీరును ఉత్తరంలో రాసింది. ఈ దృష్టితో కథ రాయమని కోరింది.
ఉదయం ఆరు గంటలవుతోంది. రోల్‌కాల్ విజిల్‌తో మెలకువ వచ్చింది దీపకు. సాధారణంగా అందరూ కాలకృత్యాలు తీర్చుకుని రోల్‌కాల్‌కు వస్తారు. లేట్ అవడం వల్ల తుపాకిని భుజానికి తగిలించుకుని వెళ్లి రోల్‌కాల్‌లో నిలుచుంది.
యథావిధిగా క్లాస్ తొమ్మిదిన్నరకు మొదలైంది. ప్రతీ స్టూడెంట్‌కు ఒక తెల్ల కాగితం ఇచ్చింది దీప. తెలుగు పీరియడ్‌తోనే క్లాస్ మొదలవుతది. ప్రత్యేక అతిథిగా వచ్చిన ‘మాలు’ ఆ తెల్లకాగితం ఎందుకు ఇచ్చారో వివరించాడు. పాటో, పద్యమో, కవితో, కథో, నాలుగు లైన్ల వ్యాసమో, తమ అనుభవమో ఏదో ఒకటి ప్రతి ఒక్కరూ తప్పక రాసివ్వాలి. సమాజాన్ని సాహిత్యం మార్చుతదని మనం చదువుకుంటున్నాం. సాహిత్యకారులకు అంత బలముంటది. కథ ద్వారా, కవిత్వం ద్వారా, వ్యాసం ద్వారా ప్రజలను ఆలోచింప చేయవచ్చు అని కూడా చదువుకున్నాం. అందుకోసం మనం కూడా రాయాలి కదా. ఏదో ఒకటి రాయండి. ఏమీ రాయలేకపోతే మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఇవ్వండి. అంతే తప్ప తెల్లకాగితం ఇవ్వవద్దు. చెప్పి వెళ్లిపోయాడు ‘మాలు’.
అతను వెళ్లిపోగానే ‘మేము రాయలేము’ అన్నారు స్టూడెంట్స్. తప్పక రాసివ్వాల్సిందే అన్నది దీప. జనానికి ఇన్ని మాటలు చెప్తారు. ఇంటి దగ్గర, దళంలోకి వచ్చాక ఎన్నో అనుభవాలున్నాయి మీకు. అవే రాయండి. అయినా రేపటి వరకు టైముంది కదా కొంచెం భరోసానిచ్చింది దీప.
ఇక ఒక్క రోజుతో క్లాసెస్ అయిపోతాయి కాబట్టి ఆ రోజు హోంవర్క్ ఏమీ ఇవ్వలేదు. అదీగాక, టీచర్ల బోధన గురించి కూడా తమ అభిప్రాయాలను రాసివ్వమని కోరారు.
మరుసటి రోజు సాయంత్రం విద్యార్థులు రాసిచ్చిన కవిత, కథ, వ్యాసాలను శ్యామ్ దాదా కలెక్ట్ చేసాడు.
శ్యామ్ దాదా క్లాస్ నుంచి బయటకు రాగానే విద్యార్థులు రాసిన వాటిని దీప అడిగి తీసుకుంది. వాళ్లందరు రాసిన వాటిని పుస్తకంగా తీసుకురావాలని, వాటిని గుండ్రంగా రాయడం, గోండీ భాష నుంచి తెలుగులోకి అనువాదం చేయడం దీపకు అప్పజెప్పారు. వాళ్లు ఏమి రాసి ఉంటారా అని ఉత్సుకతగా ఉన్నది దీపకు. చాలా బాగున్నాయి. కొన్ని మాత్రం వారు మాత్రమే రాయగలవి ఉన్నాయి.
క్లాస్ నుంచి బయటికి రాగానే సెలవులొచ్చనంత సంబరం. నెల రోజులు క్షణం తీరిక లేకుండా గడిపిన వారంతా ఒకటే ముచ్చట్లు. నవ్వులు. సాయంత్రం టీ తాగేటప్పుడు మేమంటే మేమంటూ పాటలు పాడుతున్నారు. కొందరు క్యాంపులో అక్కడక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
తెల్లవారి ఎవరి ప్రాంతాలకు వారు బయలుదేరి వెళ్లిపోతారు. బయటి మాదిరి స్కూల్‌కు పొయిన అనుభూతిని తీసుకురాగలిగారు.
మొత్తానికి ఏ ఆటంకమూ లేకుండా క్యాంపు ముగిసింది. రాత్రి భోజనాలైన తర్వాత అందరూ ఒక్కచోట జమ అయ్యారు.
ఇక్కడ నేర్చుకున్న దానిని రోజూ సాధన చెయ్యాలని, మీ మీ దళాల్లోని సభ్యులకు నేర్పాలని ఇన్ని రోజులుగా క్యాంపును పర్యవేక్షిస్తున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు కోస దాదా మాట్లాడారు. ఈ నెల రోజుల్లో పోలీసుల కూంబింగ్ ఎక్కువైందని, వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు.
మరుసటి రోజు రోల్‌కాల్ సమయంలోనే చేతులు కలిపి రెండు బ్యాచ్‌లు వెళ్లిపోయాయి. టిఫిన్ తర్వాత కొన్ని, లంచ్ తర్వాత మరికొన్ని బ్యాచ్‌లు వెళ్లిపోయాయి.
క్యాంప్ ఖాళీ అయ్యింది. బోసిపొయినట్టుగా ఉన్నది.
మనం కూడా రేపు పొద్దున క్యాంపు మార్చుతున్నామని సాయంత్రం టీ టైంలో భీమన్న చెప్పాడు. అప్పటికే మిగిలిపోయిన సరుకులను మార్చబోతున్న క్యాంపుకు చేరవేశారు.
రాత్రి భోజనాలు చేస్తున్న సమయంలో ఒక ఊరి దాదా వచ్చి భీమన్నను కలిశాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి ఆ దాదా కూడా భోజనానికి ప్లేట్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కోసదాదా, మాలు, భీమన్న…పక్కకు వెళ్లి మాట్లాడుకుని వచ్చారు. దాదాపుగా అందరి భోజనాలు అయిపోయాయి. కొందరు తమ డేరాలకు కూడా వెళ్లారు.
భీమన్న విజిల్ వేయడంతో అందరూ కిచెన్ దగ్గర జమ అయ్యారు. ఎందుకు విజిల్ వేశాడో అర్థం కాలేదు. ”కామ్రేడ్స్… మన దగ్గర నుంచి పొద్దున వెళ్లిన గఢ్‌చిరోలి బ్యాచ్‌పై మధ్యాహ్నం నాలుగైదు గంటల మధ్యలో ఫైరింగ్ జరిగింది. ముగ్గురు కామ్రేడ్స్ జయంతి, సోమె, నరేష్ చనిపోయారు. ఇంకా ఎవరెవరికి గాయాలైనాయో తెలియదు. మనం ఓ అరగంటలో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం. కొంత దూరం వెళ్లి పడుకుంటాం. ఏమన్నా ఉంటే పొద్దున చూసుకుందాం. మీ మీ కిట్లు సర్దుకోండి” చెప్పాడు భీమన్న.
దీప వెళ్లి తన కిట్టును సర్దుకుంది. కామ్రేడ్స్ రాసిచ్చిన వాటిలోంచి జయంతి, సోమె, నరేష్‌ల పేపర్లను బయటకు తీసి, మళ్లొకసారి చదివింది.
మొదటి పేపర్‌లో…
కవిత శీర్షిక : వెలుగు కోసం
పేరు : జయంతి
బండపై కూచున్నాను
నా చుట్టూ చిక్కటి చీకటి
ఏమీ కనిపించడం లేదు
ఎక్కడికి వెళ్లాలి
ఇందులో నుంచి బయటపడటం ఎట్లా?
ఆలోచిస్తూ ఉన్నాను
దూరంగా వెలుగు
నక్షత్రాల గుంపది
లేచి నిలబడ్డాను
ఆ వెలుగును చేరుకోవాలని
కొండలు, గుట్టలు, సెలయేళ్లు, నదులు
నేను దాటగలనా
భయపడ్డాను
ఏది ఏమైనా ఈ చీకట్లో ఉండలేను
ఆ వెలుగుకై నడక సాగించా.
దీప కళ్ల నుంచి కన్నీటి చుక్కలు రాలి పేపర్‌పై పడ్డాయి.
రెండో పేపర్ తీసింది.
కథ శీర్షిక : అమ్మాయి
పేరు : సోమె
దళం ఎప్పుడు వస్తదా అని కోసి ఎదురుచూస్తూ ఉన్నది. ఆమెకు నిండా పద్నాలుగేండ్లు కూడా లేవు. వయసు కంటే కూడా చాలా చిన్నగా ఉన్నది. పీలగా ఉన్నది. దీదీలు, దాదాలంటే చాలా ఇష్టం ఆమెకు. వాళ్లు వస్తే మీటింగ్ అయిపోయే వరకు అక్కడి నుంచి కదిలేది కాదు. దళం ఆ రోజు వచ్చింది. వాళ్ల దగ్గరకు వెళ్దామంటే అమ్మ చాలా పనులు చెప్పింది. నీళ్లు తెచ్చి పెట్టమన్నది, గిన్నెలు తోమమన్నది. తమ్ముడిని ఆడించమన్నది. నీళ్లు తెచ్చింది, గిన్నెలు తోమింది. దాదాలు, దీదీలు పోతరేమోనని గబగబా చేసింది. తమ్ముడిని ఆడించకుండానే దళం దగ్గరకు పరుగెత్తింది. వాళ్ల నాన్న కోసి వెంట పడ్డాడు. పిట్టలెక్క ఉరికి ఓ పొదలో దాక్కుంది. వాళ్ల నాన్నకు దొరకలేదు.
అమ్మకు దళంతోరు అంటే ఇష్టం లేదు. నాన్న సంఘం వెంట తిరుగతడని అమ్మ భయం. కోసిని పట్టుకుందామన్నట్టుగా వచ్చి నాన్న దళం దగ్గరికి పొయిండు.
కోసి నాన్నను చూసింది. ఎట్లా వెళ్లేది. దాదాలు, దీదీలతో ఎట్లా మాట్లాడేది. వాళ్లు పాడే పాటలు ఎట్లా వినేది? కనిపిస్తే నాన్న పట్టుకుంటాడు. ఆలోచించి చెట్టెక్కి కూచున్నది. పాటలన్నీ విన్నది. మీటింగ్ అయిపోయింది. జనం వెళ్లిపోయారు. నాన్న ఏదో మాట్లాడుతూ అక్కడే ఉన్నాడు. దళం సర్దుకుని వేరే ఊరి దారి పట్టింది.
నేను కూడా వాళ్లతో పని చేస్తా అనుకున్నది కోసి. చిన్నపిల్లను, తుపాకీ కూడా మొయ్యలేను కదా అనుకున్నది. అమ్మో వాళ్లలాగా అన్నన్ని ఊర్లు తిరగగలనా అనుకున్నది. ఏదో ఆలోచించుకున్నది. చెట్టు దిగి దళం వెళ్లిన దారినే పరిగెత్తడం మొదలుపెట్టింది.
కథ అయిపోయింది.
3వ పేపర్‌లో…
కథ పేరు : నక్క- ఎలుగొడ్డు – జింకలు
పేరు : నరేష్
ఒక ఊరు. ఆ ఊర్లో పూజారి నక్క ఉన్నది. ఈ నక్క మంత్రాల పేరుతో అమాకయపు జింకల నుంచి బియ్యం, కొహల, కల్లు వసూలు చేసేది. ఏ పనీ చేసేది కాదు. జింకలు నక్కకు భయపడేవి. అది దేవుని రూపమని, దానిని ఎదిరిస్తే మంత్రాలు చేసి చంపేస్తదని భయపడేవి. కొన్ని జింకలు నక్క మంచిది కాదని, దానిని ఎదిరించాలని చెప్పేవి. ఎలుగొడ్డు జింకల దగ్గర ఉన్నప్పుడు జింకల వైపు, నక్క దగ్గర ఉన్నప్పుడు నక్కవైపు మాట్లాడేది. ఆఖరికి జింకలన్నీ కలిసి నక్కని చావగొట్టాయి. ఏది న్యాయమో అర్థంకాక ఎలుగ్గొడ్డు బండమీద కూర్చుండి పోయింది.
కథ అయిపోయింది.
‘చదువురాని వారు’ రాసిన వాటిని దీప భద్రంగా తన కిట్టులో పెట్టుకున్నది.