వ్యవస్థీకృతమైన అధికారాన్ని సవాల్ చేసే వరవరరావు కవిత్వం: చందనా చక్రవర్తి

(చరిత్ర నిర్మిస్తున్న ప్రజలతో కలిసి గొంతెత్తి నినదిస్తున్న కవి వరవరరావు. ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను ప్రచారం చేస్తున్నారు. కాలాన్ని కాగడాగా వెలిగిస్తున్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వెలుగులో చరిత్రతో కలిసి ప్రవహిస్తున్నారు. యాభై ఏళ్లకు పైగా నిత్య నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన కవిత్వం సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు ప్రతిబింబం. వరవరరావు కవితల్నించి ఎంపిక చేసిన కొన్ని కవితల ఆంగ్లానువాదం, Varavara Rao : A Life in Poetry పేరుతో పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. దీనికి సంపాదకులు ఎన్.వేణుగోపాల్, మీనా కందసామి. ఈ పుస్తకాన్ని జులై 13న హైదరాబాద్ లోని లమకాన్ లో ఆవిష్కరించారు.

కవిగా, వ్యక్తిగా వరవరరావు గురించి, ఈ అనువాదం గురించి మీనా కందసామి, ప్రముఖ కవి శివారెడ్డి, వి.శ్రీధర్ (ప్రొఫెసర్, అనువాదకుడు); చందనా చక్రవర్తి (శాస్త్రవేత్త, రచయిత్రి) మాట్లాడారు. చందనా చక్రవర్తి ఉపన్యాసం తెలుగు అనువాదమిది.)

మన కాలానికి చెందిన అత్యంత ప్రభావశీలి, విప్లవవాణిని వినిపించే సుప్రసిద్ధుడు, ప్రఖ్యాతి కవి, సాహిత్య విమర్శకుడు, వక్త, ప్రజామేధావి, భాషా సాహిత్య శాస్త్రాల అధ్యాపకుడైన వరవరరావుగారి పట్ల గౌరవంతో నేను మీ ముందు నుంచున్నాను. ఆయన కవిత్వం గురించి మాట్లాడడం కంటే ఆయన పట్ల గౌరవాన్ని ప్రకటించుకోవడానికి ఉన్నతమైన మార్గం మరి ఏముంటుంది? అనేక సంవత్సరాలుగా ఆయన రాసిన కవిత్వంలో నుండి కొన్ని కవితల్ని, తెలుగు భాష తెలియని విస్తృత ప్రజాసమూహంలోకి తీసుకువెళ్ళడం ఆయన పట్ల మన గౌరవాన్ని ప్రదర్శించడం. ఆయన కవితల ఇంగ్లీషు అనువాదాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం. ఆ కవితల అనువాదకులు, సంపాదకులైన మీనా కందస్వామి, వేణుగోపాల్లు మన మధ్య వుండడం సముచితంగా వుంది. కవిత్వాన్ని అనువాదం చేయడం అత్యంత కష్టమైన పనులలో ఒకటి. అందులోనూ మన ప్రాంతీయ భాషలలో రాసిన కవిత్వంలో ఉద్దేశించబడిన లోతైన అర్థాన్ని, సున్నితత్వాన్ని అందిపుచ్చుకోవడానికి అనుగుణంగాలేని భాషలోకి అనువాదం చేయడం మరీ కష్టం. ఆ పని చేసినందుకు వాళ్ళిద్దరికీ నా అభినందనలు.

ఇంతకుముందు ప్రొఫెసర్ శ్రీధర్ ప్రస్తావించినట్లు ఈ అనువాదంలో తాము ఎదుర్కొన్న సవాళ్ళను ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో మీనా కందస్వామి వివరంగానే పేర్కొన్నారు. అంతేకాక ఈనాటి సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొంటే ఈ సమయంలో ఆ అనువాదం రావడం ఎంతో సముచితంగా వుంది.

ఈ మన కాలంలో, మన అంతరాత్మతో సంభాషణ చేయగల వరవరరావులాంటి రచయితలను పదేపదే విస్తృతంగా వినడం చాలా అవసరం. వరవరరావు పదాలు వచనంలోనైనా కవిత్వంలోనైనా, లిఖితమైనా లేక మాటల్లోనైనా న్యాయం, మానవ గౌరవం, సమత వంటి అంశాలపట్ల గాఢమైన నిబద్ధతను కలిగివుంటాయి. ఆయన సాహిత్యం భారతీయ సాహిత్యంపైనా సామాజిక చైతన్యంపైనా చెరిగిపోని ముద్ర వేశాయి.

సామాజిక న్యాయంపట్ల ఎలాంటి వూగిసలాటలేని నిబద్దత ఆయనలో ఒక కీలకమైన అంశం. మీరు ఆయన కవిత్వాన్ని ఆయన స్వరంలోనే విన్నారు. ఈ అనువాదాల్ని ప్రొఫెసర్ శ్రీధర్ చదివి వినిపించారు. ప్రతివ్యక్తికీ గౌరవంగా జీవించడం సహజంగా వుండే హక్కని ఆయన గట్టి నమ్మకం. అందుకే ఆ గౌరవాన్ని మానవ సమాజంలో స్థాపించడానికి, కాపాడడానికి ఆయన అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఆయన కవితలలో అంచులకు నెట్టివేయబడ్డ ప్రజాసమూహాల అనుభవాలు ప్రతిఫలిస్తాయి. వాళ్ళ పోరాటాలు, ఆకాంక్షలు, వాళ్ళ స్వప్నాలను ఆ కవితలు వెలుగులోకి తెస్తాయి. తన కవిత్వం ద్వారా ఆయన వాళ్ళ కథనాలకు గొంతుకనిచ్చారు. మరింత న్యాయసమ్మతమైన, సమానత్వంతో కూడిన సమాజస్థాపనకోసం పోరాడడానికి ఆయన కవిత్వం ఇతరులను ఉత్తేజితులను చేసింది.

అధికార నిర్మాణాలను ఆయన ఎలాంటి జంకూగొంకూ లేకుండా ప్రశ్నిస్తారు. అధికారంలో వున్న వ్యక్తులు చేసిన అన్యాయాలను ఎండగడతారు. అణగారిన ప్రజలను ఓదార్చి వాళ్ళలో ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తారు. గొంతుకలేని ప్రజల వాణిని అణచివేయడానికి ప్రయత్నిస్తున్న అణచివేత శక్తులపై ఆయన కవిత్వం ఒక శక్తివంతమైన ఆయుధం. వరవరరావు కవిత్వ ప్రభావం ప్రాంతీయ సరిహద్దులకు పరిమితమైంది కాదు. భారతీయ ప్రాంతీయ భాషలలోని సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి, ఇతర భాషలలోకి అనువాదం చేసి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం తప్పనసరి అవసరం. అనువాదం ఒక వంతెనలాంటిది. ప్రాంతీయ కవిత్వంలో వ్యక్తీకరించబడిన ఆలోచనలను, ఉద్రేకాలను ప్రపంచవ్యాపిత పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అనువాదం ఉ పయోగపడుతుంది. ఆయన కవితలు ఇతర భారతీయ భాషలలోకే కాక ప్రపంచ భాషలలోకి కూడా అనువాదం అయిన వాస్తవాన్ని ఇంతకు ముందటి వక్తల ద్వారా మీరు విన్నారు. ఇలాంటి అనువాదాల ద్వారా అడ్డంకులను ఛేదించగలం. సాంస్కృతిక అవగాహనను పెంపొందించగలం. భారతీయ భాషా సాహిత్యంలోని గాఢతను, రిచ్నెస్ ను విస్తృత సాహిత్య ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలం. అందుకే ఈ బాధ్యతను నిర్వర్తించిన అనువాదకులకు, పెంగ్విన్ ప్రచురణకర్తలకు మన కృతజ్ఞతలు. ఈ మహత్తర కర్తవ్యాన్ని తమ భుజాల మీద వేసుకున్న మీనాకు, వేణుగోపాల్కు కృతజ్ఞతలు.

స్థల కాలాలను, భాషను అధిగమించగల శక్తి కవిత్వానికి వుందని మనందరికీ తెలుసు. అది దాని సారం. సాహిత్యం మన ఆలోచనలను, ప్రవర్తనను సరైన మార్గంలో పెడుతుంది. మనలో సానుతాపాన్ని రగిలిస్తుంది. నిద్రాణంగా వున్న మన చైతన్యాన్ని తెలివిడిలోకి తెచ్చి మార్పువైపుగా ఉత్తేజితులను చేస్తుంది. కవిత్వానికి వుండే ఈ పరిణామాత్మక శక్తిని వరవరరావు అర్థం చేసుకున్నారు. తన కవిత్వం ద్వారా ఉనికిలో వున్న అధికార వ్యవస్థలను సవాల్ చేశారు. సరిహద్దులను వెనక్కి నెట్టివేశారు. ఆయన విమర్శనాత్మక ఆలోచనల వైపుగా ప్రజలను పురిగొల్పుతున్నారు. అలాంటి ఆలోచనలు నేడు కనుమరుగు అవుతున్నాయి. ఈ దేశంలో అలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు లేకుండా వుండడాన్ని వ్యవస్థ ప్రోత్సహిస్తుంది.

ఈ ప్రపంచంలో వివిధ సమూహాల మధ్య మానవత్వాన్ని పంచుకోవాల్సిన అవసరాన్ని కవిత్వం మనకు జ్ఞాపకం చేస్తోంది. మానవ సంబంధాలన్నీ కృత్రిమంగానూ, భౌతిక సుఖాల కోసం వెంపర్లాట పెరిగిపోతున్న ఈ సమకాలీన ప్రపంచంలో మన గుండెలోతుల్లో వున్న ఆలోచనలను ఉద్రేకాలను కనుగొనడానికి, యథాతథస్థితిని ప్రశ్నించడానికి, ఉన్నతమైన స్థితికోసం ప్రయత్నించడానికి, మరింత కరుణాత్మకమైన ప్రపంచాన్ని నిర్మాణం చేయడానికి కవిత్వం మనకు ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది.

ఈ ఆదర్శాలను వరవరరావు సాహిత్యం బలంగా వ్యక్తీకరిస్తుంది. ఆయన దృష్టిలో కవిత్వమంటే కేవలం కళాత్మక వ్యక్తీకరణ మాత్రమే కాదు. అది సమాజమార్పుకు ఒక శక్తివంతమైన సాధనం. అణచివేత వ్యవస్థలను కూలదోసి మరింతగా అందరినీ కలుపుకుపోయే న్యాయసమ్మతమైన సమాజానికి మార్గం వేయగలమని ఆయన గట్టిగా నమ్ముతారు. నిజానికి మనం చేయవలసింది అదే.

స్పష్టమైన ఊహాచిత్రాల ద్వారా, సంపన్నమైన అలంకారాల ద్వారా ఉద్వేగభరితమైన భాష ద్వారా ఆయన మనల్ని తన కవితా ప్రపంచంలోకి తీసుకువెళతారు. ఆ కవిత్వంలోని ముడి వుద్రేకాలను అనుభవించమని మనల్ని ఆహ్వానిస్తారు- అలాంటివి కొన్ని మీరు ఇప్పుడు విని వున్నారు. తన బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఉద్రేకాల వంటిది. కేవలం ఉద్రేకాలే కాదు అణచివేతకు దోపిడికి గురౌతున్న ప్రజల ఆకాంక్షలను పోరాటాలను కూడా ఆ కవిత్వంలో మనం అనుభవించవచ్చు. ఉద్రేకం, సాంఘిక నియమాలను సవాల్ చేయడం, సమష్టి బాధ్యతా తత్వాన్ని రేకెత్తించడం ఈ రోజు ఎంతైనా అవసరం. వీటన్నింటిని భాషకున్న శక్తి ద్వారా సాధించవచ్చు. అది ఆయన కవిత్వంలో మూర్తీభవిస్తుంది. మానవ అనుభవాల సారాన్ని స్వాయత్తం చేసుకుని వాటిని విశ్వవ్యాపిత అంశాలుగా అనువదించడం వరవరరావు కవిత్వానికున్న అత్యంత గణనీయమైన అంశాలలో ఒకటి. ఆయన మాటలు సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి సారాంశంలో మానవ సమాజ పరిస్థితుల గురించి మాట్లాడగలుగుతుంది. తన బిడ్డను పోగొట్టుకున్న తల్లి దు:ఖమైనా, పొలాల్లో శ్రమచేస్తున్న రైతు ధిక్కారమైనా, ఆయన కవితలు మనందరికీ సంబంధించిన పోరాటాలపైనా ఆకాంక్షలపైనా వెలుగులు ప్రసరిస్తాయి.

ఆయన సూక్ష్మ పరిశీలనలు, న్యాయం పట్ల ఆయనకున్న ఊగిసలాటలేని నిబద్దత ఆయన కవితలలో ప్రతిధ్వనిస్తాయి. అవి యథాతథస్థితిని సవాల్ చేస్తాయి. ప్రతిదానికి రాజ్యం బాధ్యతను డిమాండ్ చేస్తాయి. అది ఈనాటి తప్పనిసరి అవసరం. ఆయన కవితలు ఫిర్యాదులను వ్యక్తీకరించడానికి, అన్యాయాన్ని చిత్రించడానికి మాత్రమే పరిమితం కాకపోవడం ఒక ప్రధానమైన అంశం. అవి ఆశను చిగురింపజేస్తాయి. కార్యాచరణకు పిలుపునిస్తాయి. వరవరరావు వాడే పదాలు మార్పుకు కెటలిస్టులాగా పనిచేస్తాయి. ప్రశ్నించమని, మరింత న్యాయసమ్మతమైన, సమతా సమాజం కోసం చురుకుగా కదలమని పాఠకులను ఉత్తేజపరుస్తాయి. ఆయన తన కవిత్వం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పిస్తారు. ప్రతివాళ్ళు తమతమ గొంతులను వినిపించేటట్లు, పీడనకు వ్యతిరేకంగా నిలబడేటట్లు, వ్యక్తుల గౌరవం కోసం పోరాడేటట్లు చేస్తాయి.

జైలు నిర్బంధాన్ని అందరికంటే ఎక్కువగా అనుభవిస్తున్న మనదేశపు కవి వరవరరావు. ఈ రోజు మనం ఆయన జీవితం గురించి, కార్యాచరణ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం కేవలం ఆయన గొప్పదనాన్ని మాత్రమే గౌరవించవద్దు. విభిన్నమైన స్వరాలను, దృక్పథాలను బిగ్గరగా నిపించాలనే మన సమష్టి బాధ్యతను గుర్తిద్దాం. అధికార ఆధిపత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవటం ఈరోజున అత్యవసరం. అది వరవరరావు జీవితంలోనూ, కవిత్యంలోనూ ప్రతిధ్వనిస్తోంది. అధికారంలో వుండే వ్యక్తులు బద్దపడేటట్లు చేయడానికి, న్యాయాన్ని, సమతను ప్రచారం చేయడానికి మనం నిర్వర్తించాల్సిన పాత్రను గుర్తుచేస్తూ ఆయన కవిత్వం మనకు మార్గదర్శకంగా వుంటుంది. అసమానత, అవినీతి, అధికార దుర్వినియోగం ఒక అంటువ్యాధిలాగా ప్రబలిని ఈ ప్రపంచంలో ఆధిపత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం ఒక నైతిక బాధ్యత మాత్రమే కాక ఒక సాహసోపేతమైన చర్య కూడా. అలా చేయడం అంటే మన గొతులు నొక్కివేయబడడాన్ని తిరస్కరించడం. అన్యాయంతో రాజీపడకపోవడం.

వరవరరావు కవితలు అణచివేత వ్యవస్థలను ధైర్యంతో ఎదుర్కొంటాయి. అంచులకు నెట్టివేయబడిన, అణచివేతకు గురౌతున్న ప్రజలకు స్వరాన్నిస్తాయి. ఈ లక్షణాలన్ని ఆయన కవిత్వంలో మూర్తిభవించాయి. ఆయన కవితలు అధికారస్థానాలలో వున్న వ్యక్తుల ప్రచార కథనాలను సవాల్ చేస్తాయి. ఈనాడు కూడా అది మనందరికీ ఒక గొప్ప పాఠం లాంటిదని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఈ పుస్తకాన్ని చదవనివాళ్ళు, ఆయన కవిత్వాన్ని చదివి వాటి సారాంశాన్ని తమ జీవితానికి అన్వయించుకోవాలి.

అధికారంలో వున్న వ్యక్తుల నిర్ణయాలను, చర్యలను ప్రశ్నించడానికి, వాళ్ళ అసలు వుద్దేశాలను నిశితంగా గమనించడానికి, పారదర్శకతను, బాధ్యతను డిమాండ్ చేయడానికి ఆయన కవిత్వం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ లక్షణాలన్ని మనలో త్వరత్వరగా అదృశ్యమైపోతున్నాయనే భయం నాకున్నది. ఆ లక్షణాలతో జీవిస్తున్న ధైర్యవంతులు కొద్దిమంది వున్నారు. కాని అలాంటివాళ్ళు ఇంకా ఎక్కువ మంది మనకు అవసరం. అధికారాన్ని సవాల్ చేయడం ద్వారా మాత్రమే మనం అణచివేత వ్యవస్థలను అడ్డుకోగలం. మనలో పేరుకుపోయిన ద్వేషాన్ని తొలగించి పరిణామాత్మక మార్పుకు అవసరమైన అవకాశాన్ని సృష్టించగలం. మనం నివసిస్తున్న మన ప్రపంచాన్ని సవాల్చేసి, దాన్ని మార్చడానికి అవసరమైన శక్తి మన స్వరాలకు వుందని ఆయన నిబద్ధత మనకు శక్తివంతంగా గుర్తుచేస్తుంది. అయితే అధికారానికి వ్యతిరేకంగా నిలబడడంలో మనం కొన్ని సవాళ్ళను, ప్రమాదాలను ఎదుర్కోవల్సి వస్తుందని కూడా మనందరికీ తెలుసు.

వ్యవస్థీకృతమైన అధికారాన్ని ధైర్యంగా సవాల్ చేసినందుకు ఎవరైనా ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటారో, వరవరరావు స్వీయ అనుభవాలే మనకు నగ్నంగా తెలియపరుస్తున్నాయి. ఆయన వీటన్నింటినీ అనేక పర్యాయాలు సహనంతో ఎదుర్కొన్నాడు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఒక ఆయుధంగా తన స్వరాన్ని ధైర్యంగా వినిపించే క్రమంలో ఆయన పదేపదే వేధింపులను నిర్బంధాల్ని ఎదుర్కొంటున్నారు. అన్ని వేధింపులు ఎదురైనప్పటికీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రశ్నించడం తన విధియనీ, దాన్ని ఎన్నటికీ విడవడానికి వీలులేదనే నిబద్దతకు ఆయన కట్టుబడి వున్నాడు. ఇది మనకు మరొక పాఠం. ఆయన పిలుపును మనందరం స్వీకరిద్దాం. ఎందుకంటే మనందరి సమష్టి స్వరాల ద్వారానే మనం నిజమైన న్యాయం మానవ గౌరవం సజీవంగా వుండే ప్రపంచాన్ని నిర్మాణం చేయగలం కాబట్టి.

దేనినీ ప్రశ్నించకుండా నిర్లిప్తంగా, అన్నింటికి తలవూపుతూ వుండిపోయేవాళ్ళను సమాజం తరచుగా గౌరవిస్తుంది. సౌఖ్యాలకంటే నిజానికి విలువనిచ్చే, అసమ్మతిని గౌరవించే సంస్కృతిని పెంచి పోషించడం ఒక ముఖ్యకర్తవ్యం. మనం, మనందరం అధికారానికి వ్యతిరేకంగా ప్రశ్నించడమనే సమష్టి బాధ్యతను స్వీకరించడం ద్వారా ఇతరులు ప్రశ్నించేటట్లు, ప్రతిఘటించేటట్లు, న్యాయసమ్మతమైన సమతా ప్రపంచం కోసం పనిచేసేటట్లు ఉత్తేజపరచగలం. ప్రొఫెసర్ శ్రీధర్ వరవరరావు రాసిన కవితలలో అత్యుత్తమమైనవి కొన్ని మనకు చదివి వినిపించారు. నిజానికి అవన్నీ అద్భుతంగా వున్నాయి. నా హృదయాన్ని నేరుగా తాకే కవితలను కూడా ఆయన చదివారు. అందుచేత నేను ఒకే ఒక కవిత చదివి వినిపిస్తాను. దాన్ని వరవరరావు 2006లో రాశారు. అప్పుడు ఆయన రాసిన ప్రతిదీ ఇప్పటికీ ఎంత వాస్తవంగా వుందో తలుచుకుంటే నాకు ఆశ్చర్యమేస్తుంది.

ఆ కవిత పేరు “స్కూలు — జైలు”
స్కూలయినా జెయిలయినా
స్వేచ్ఛను బంధించడానికే
పిల్లల్ని పెద్దల్ని చేయడానికి
మనుషుల్ని నేరస్తుల్ని చేయడానికి
సంస్కరణాలయాలు

రెండుచోట్లా మాటలు రానంత కాలమే ముద్దు
రెండుచోట్లా నడక నేర్వనంత దూరమే హద్దు

ఇంట్లో తల్లిభాష మాట్లాడుతున్నారని
అధికారభాష నేర్వడానికి పిల్లల్ని స్కూల్లో వేస్తారు
వ్యవస్థలో మనుషుల భాష మాట్లాడుతున్నారని
నేరభాష నేర్చుకోవడానికి మనుషుల్ని జైల్లో వేస్తారు
పిల్లల్నయితే అల్లరికి తట్టుకోలేకపోతున్నాం అంటారు
మనుషుల్నయితే
అదుపుచేయడం అసాధ్యమైందంటారు

ఇంట్లో
అమ్మా నాన్నా అంత కీచులాడుకున్నట్లు కనిపిస్తారా
పాలకపక్షమూ ప్రతిపక్షమూ అనిపిస్తారా
శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లుగానే
ఇద్దరూ కూడబలుక్కొని పంపిస్తారు
స్కూలుకయినా జైలుకయినా

విద్య ఒసగును వినయంబు గనుక
ప్రి స్కూలు నుంచి ప్రీ యునివర్సిటీకి వచ్చేవరకు
పిల్లలు పెద్దలయి అబద్ధాలు నేర్చి
అధికారానికి అర్హులవుతారు

ఖైదీలు మాత్రం
ఆస్తి అధికారం విషయంలోనే నేరస్తులు గనుక
నేరస్వభావం అబ్బితే తప్ప
అధికశాతం మనుషులుగా మిగులుతారు
వ్యవస్థభాషలో నేరస్తులుగా

ఇవాల్టి పిల్లలు
రేపటి పెద్దలయితేనేమిటి
మళ్ళీ
పిల్లలతరం పుట్టుకొస్తూనే ఉంటుంది.

(2, ఫిబ్రవరి 2006)

మిత్రులారా ఇది ఆశావహమైన అంశం. ఆయన కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం పోరాటం కాదు, కేవలం ఆయన మనందరికీ చూపించే సమాజ ప్రతిబింబం కాదు. తన పదాల ద్వారా ఆయన మనలో కలిగించే ఆశావహ దృక్పథమే దానికి కారణం. ఈ దేశంలో వర్తమానంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనకు కావల్సింది అలాంటి ఆశాపూరితమైన వైఖరి. వరవరరావు జైలులో వున్నా, జైలులాంటి నిర్బంధ స్థితిలో వున్నా మనలో అలాంటి ఆశను చిగురింప చేస్తున్నారు. అందుచేత ఆశామయ ప్రపంచంలో కొనసాగండి.
కృతజ్ఞతలు.

అనువాదం : సి.యస్.ఆర్. ప్రసాద్

Leave a Reply