గొడ్డు మాంసం

ఆ రోజు వేరే చోటుకి క్యాంప్‌ మార్చారు. ఊరుకి కొంచెం దూరంలో మకాం వేశారు. నడిచీ నడిచీ అలసిపోయి ఉన్నారు. అప్పటికే మసక చీకట్లు అలముకున్నాయి. చాయ్‌ పెట్టేసరికి చీకటైంది. చాయ్‌ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు కామ్రేడ్స్‌. పగలు కంటే రాత్రిపూట ఇంకా చిన్నగా మాట్లాడతారు. సహజంగా రాత్రిపూట చిన్నగా మాట్లాడినా ఎక్కువ దూరం వినిపిస్తది.

అలసిపోయి, కాళ్లు చేతులు ముఖం కడుక్కుని జిల్లీ పరుచుకుని ఆ చిక్కటి అడవిలో చల్లటి వాతావరణంలో రిలాక్స్‌ అవడం… కష్టం తర్వాత సుఖాన్ని అనుభవించడం లాగా జ్యోతికి చాలా బాగుండేది. ఈ సుఖం కోసం ఆ కష్టం ఇష్టంగా ఉండేది.

అందునా ఛత్తీస్‌గఢ్‌ అడవి చాలా బాగుంటుంది. చూస్తే అందులోని అబూజ్‌మాడ్‌ అడవినే చూడాలి.

కొండల మీద కొండలు. ఎన్ని కొండలు ఎక్కినా సెలయేళ్లు పారుతూ ఉంటాయి. జనం తక్కువ. అడవి ఎక్కువ. ఆ అడవిలో బతికే వారికి మంచితనమూ ఎక్కువే. నిజానికి దొంగతనం అంటే తెలియదు. తాళాలు వేయడమూ ఉండదు. ఎవరైనా దొంగతనం చేస్తే ‘పిచ్చి లేచిందంటారు’.

చాయ్‌ని తన జిల్లీ దగ్గరికే తెచ్చుకుని ఆరాంగా తాగుతున్నది జ్యోతి. ఏ శబ్ద కాలుష్యంలేని, చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే ఎలా ఉంటదో అడవిలో, రాత్రి సమయంలోనే అనుభవించాలి. నగరంలో బతికి అడవికి వచ్చిన కొత్తలో నిశ్శబ్దం అంటే మరీ ఇంత నిశ్శబ్దంగా ఉంటదా! ఆశ్చర్యపోయింది జ్యోతి. అప్పటివరకు తనకు అనుభవంలోకే రాలేదు. అడవి ధ్యానంలో ఉన్నట్టుగా ఉండేది.

చీకట్లు అలుముకున్న ఆ రాత్రి ఆ అడవిలో ఎక్కడి నుంచో పిల్లనగ్రోవి గానం… ఎంతో లీనమై ఊదుతున్నట్టున్నారు. చాలా రాగయుక్తంగా ఉన్నది. చెట్టు మొదలుకుని ఆనుకుని కూర్చుని వింటూ ఉండిపోయింది జ్యోతి.

భోజనాలకు విజిల్‌ వేశారు. అయినా లేవబుద్ధి కాలేదు. మనసును ఏదో ఆవరించినట్టు ఉన్నది. ఇంత మంచి గానాన్ని తను జీవితంలో ఎప్పుడూ వినలేదు.

”ఏం జ్యోతీ! భోజనానికి రావా?” కోస దాదా పళ్లెం తీసుకుని వెళుతూ అడిగాడు.

”వస్తున్న అన్నా” అని లేచి, కిట్టులోంచి తన పళ్లాన్ని తీసుకుని వెళ్లింది.

వేడి వేడి అన్నం, కూర వేయించుకుని పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు కొందరు. ఏ రాయో రప్పో, చెట్టు కొమ్మో చూసుకుని వాటి మీద కూర్చుని తింటున్నారు ఇంకొందరు.

అన్నం పెట్టించుకుని కోసదాద దగ్గరికి వెళ్లింది.

”అన్నా, ఇక్కడ పిల్లనగ్రోవి ఊదుతారా?!” అడిగింది.

”అవును. చాలా మంది ఊదుతారు.” నవ్వుతూ చెప్పాడు కోసదాద.

దండకారణ్యం వెళ్లిన మొదటి దళంలోని సభ్యుడు కోసదాదా. ముప్పై ఏండ్లుగా ఆదివాసుల్లో పనిచేస్తున్నాడు. వారితో మమేకమయిన వ్యక్తి. బయటి నుంచి వచ్చిన వారికి ఏవేవి వింతగా ఉంటాయో దాదాకు బాగా తెలుసు. కూచోబెట్టి వివరంగా చెప్తాడు.

”వానా కాలం తప్ప మిగతా కాలాల్లో ఆవులను వదిలిపెడ్తారు. పంట కాలంలో మాత్రం పశువులను మేపుతారు. వాటిని ఈ పిల్లనగ్రోవి ఊది కట్టు మీద ఉంచుతారు. అవి మేత మేయాలంటే, విశ్రాంతి తీసుకోవాలంటే, చేలల్లో పడి మేస్తే బెదిరించడానికి, బయటకు రప్పించడానికి, ఇంటి దారి పట్టాలంటే… రకరకాలుగా ఈ పిల్లనగ్రోవి ఊదుతారు. ఈ పిలుపులకు అనుగుణంగానే ఆవులు మసులుకుంటాయి.” చెప్పాడు కోసదాద.

”అవునా…!!” సంభ్రమాశ్చర్యాలకు లోనైంది జ్యోతి. శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి ఊదే ఆవులను మేపాడని పుస్తకాల్లో చదువుకున్న దానిని ఇక్కడ ప్రత్యక్షంగా వింటోంది.

మనసును తన్మయత్వంలో ముంచే ఇంతటి మధుర గానాన్ని నిజంగానే జ్యోతి ఎన్నడూ విని ఉండలేదు. ఏవో కొన్ని సినిమా పాటల్లో విన్నా అవి ఈ గానం ముందు దిగదిడుపే.

ఇక్కడి ఆదివాసీలు గోవుల పాలను పితకరు. పాలు పితకడమంటే పిల్లల నోరు కొట్టినట్టుగా, పాపంగా భావిస్తారు.

మనుషుల ఆధీనంలో లేని ఆవులు అడవిలో ఎలా అయితే పెరుగుతాయో అలాగే వీరి దగ్గరా పెరుగుతాయి. కొన్నిచోట్ల వాటిని కట్టేస్తారు. అబూజ్‌మాడ్‌లో మాత్రం కట్టెయ్యరు. ఇక్కడి వారి ఇళ్ల చుట్టూ రెండు మూడు ఎకరాల పెరడు ఉంటుంది. సాయంత్రం కాగానే ఇంటికి చేరుకునే ఆవులు అందులోనే తిరుగుతాయి. కట్టెయ్యరు కాబట్టి పెరడంతా కలియ తిరుగుతాయి. పేడను పెడతాయి. అదే ఎరువుగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో ఆ పెరడులో మొక్కజొన్నలు, మోరంగడ్డలు (చిలగడ దుంపలు) పండిస్తారు.

ఇక్కడి ఆదివాసీలు మంచినీళ్ల కంటే జావనే ఎక్కువగా తాగుతారు. రాగులు, మొక్కజొన్నలతో పెద్ద కుండలో రోజూ జావ తయారుచేస్తారు. పెద్ద చెక్క గరిటెతో జావను డొప్పల్లో పోసుకుని తాగుతారు. ప్రతీసారి కొత్త డొప్ప వాడాల్సిందే.

అడవికి వెళ్లి ఆకును తెంపుకు రావడం, డొప్పలను తయారు చేయడం మహిళలకు రోజువారీ పనిలో భాగం. అన్నం తినడానికి పెద్ద డొప్ప, కూరకు జావకు చిన్న డొప్పలు కుడతారు. కారిపోకుండా కుట్టడం ఒక కళనే. వాటితో కుస్తీ పట్టి మొత్తానికి డొప్ప కుట్టడం నేర్చుకుంది జ్యోతి.

ప్రతి పెరడు చుట్టూ వెదురు బద్దలతో అల్లిన తడక ఉంటుంది. దారి వదలరు. చుట్టూతా తడక ఉంటుంది. పశువులు లోపలికి వచ్చి పంటను పాడుచేస్తాయని ఇట్లా చేస్తారు. అయితే, పెరట్లోనో గుడిసె ఉంటుంది. ఈ గుడిసెలోకి వెళ్లాలంటే తడకపైనుంచే వెళ్లాలి. అందుకోసం తడకపైకి వెళ్లడానికి ఓ మొద్దు, తడక పైనుంచి పెరట్లోకి దిగడానికి మరో మొద్దు ఏటవాలుగా వేస్తారు. అది కూడా ఒక్కటే మొద్దు వేస్తారు. ఇవతలి వైపు మొద్దు ఎక్కాలి, అవతలి వైపు మొద్దు మీది నుంచి పెరట్లోకి దిగాలి. బ్యాలెన్సింగ్‌గా ఎక్కి, దిగడం మొదట్లో జ్యోతికి చాలా కష్టమయ్యేది.

అంతేకాదు, అడవిలో బ్రిటిష్‌ వారి కాలంలో తవ్విన పెద్ద పెద్ద కందకాలు ఉండేవి. కొన్నిచోట్ల ఇవి పది మీటర్ల దాకా వెడల్పు ఉండేవి. కొన్ని కిలోమీటర్లు పొడుగూతా తవ్వి ఉండేవి. లోతు కూడా రెండు మూడు మీటర్లు అంతకంటే ఎక్కువే ఉండేది. అటు నుంచి ఇటు దాటడానికి ఆ కందకంపైన కూడా ఇట్లాగే మొద్దు వేసి ఉండేది. మొదటిసారి దానిమీంచి దాటుతున్నప్పుడు ఎక్కడ కిందపడిపోతానేమో అని చాలా భయపడింది. ఎందుకనో రెండు మొద్దులను వేసేవారు కాదు. తర్వాత్తర్వాత మొద్దుల మీది నుంచి దాటడం అలవాటు అయ్యింది జ్యోతికి.

క్యాంప్‌ అంటే ఒకచోట కొద్దిరోజులు ఉంటారు కాబట్టి లంచ్‌ తర్వాత ఓ కునుకు తీసే వెసులుబాటు ఉంటుంది. అట్లా ఒకరోజు గాఢనిద్రలోంచి లేచి కూర్చుంది జ్యోతి. దగ్గర్లోనే కోసదాద మకాం.

జ్యోతిని చూసి కోసదాద పెద్దగా నవ్వాడు.

జ్యోతికి ఏమీ అర్థంకాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది.

”ఏం జ్యోతీ… ఎన్‌కౌంటర్‌ అయినట్టు కల వచ్చిందా?” అన్నాడు.

”అవునన్నా. కానీ, మొద్దు మీది నుంచి దాటుతుంటే కందకంలో పడిపోయినట్టు వచ్చింది” చెప్పింది జ్యోతి.

”అవునా! అవంటే చాలా భయపడుతున్నట్టువుగా. ఏం ఫర్వాలేదు. పడ్డా మనవాళ్లు తీస్తారులే” భరోసా ఇస్తున్నట్టుగా నవ్వుతూ కోసదాద.

”తియ్యరని కాదు, ఎందుకనో మొద్దుల మీంచి దాటటేప్పుడు కాళ్లు వణుకుతున్నయి అన్నా”

”నాలుగు రోజులు అయితే అలవాటు అయితదిలే” ధైర్యం చెప్పాడు కోసదాద.

ఆ తర్వాత అలవాటైపోయింది. లావూ తగ్గడం వల్ల కూడా వాటిని దాటడం ఈజీ అయ్యింది.

క్యాంపు గురించి చెప్పుకోవాల్సిందే. ఎవరి సెక్షన్‌ వారికి ఉంటది. కంప్యూటర్‌ పెట్టడానికి దాని ఎత్తులో వెదురు బద్దలతో టేబుల్‌ తయారు చేస్తారు. హాస్పిటల్‌ వారికి మెడిసిన్‌ పెట్టడానికి ఓ టేబుల్‌, పేషంట్లు వస్తే టెస్ట్‌ చెక్‌ చెయ్యడానికి, లేదా వారు పడుకోవడానికి ఓ మంచం, భోజనం వడ్డించే గిన్నెలు పెట్టడానికి ఓ టేబుల్‌… అన్నీ వెదురు బద్దలతో తయారు చేస్తారు. చిన్న క్యాంపు అయితే కనీసం ఎకరం స్థలం సాఫ్‌ చేస్తారు. దాదాపుగా కాలువ వెంబడే కిచెన్‌ ఉంటది. క్యాంపు చుట్టూ కాలువలు లేకపోతే, కిచెన్‌కి దగ్గర్లో ఉన్న కాలువ పైనే బాత్రూమ్‌ తయారవుతుంది. చెట్లకొమ్మలను చిక్కగా పెట్టి తయారు చేస్తారు. అదో లోకం.

***

ఆదివాసీలు… తినడానికి మాత్రమే గో సంతతిని పెంచుతారు. ఈ అభూజ్‌మాడ్‌ ప్రాంతంలో ఆవులు, ఎద్దులు తప్ప బర్లు కనిపించవు. ఒక్కో ఇంటికి ఇరవైకి తక్కువ కాకుండా ఉంటాయి. అందుకే ఏ చిన్నపాటి కార్యం ఉన్నా ఎద్దునో, ఆవునో, దూడనో కోస్తారు.

దళం దగ్గర్లో ఉంటే కొంత మాంసాన్ని పంపేవారు. లేదా ఒక వాటా మాంసాన్ని ఎండబెట్టి దళం వెళ్లినప్పుడు ఇచ్చేవారు. దళం వారి జీవితంలో భాగం. పార్టీ లేకుండా ఆదివాసీ జీవితమే లేదు.

రాష్ట్ర కమిటీ మీటింగులో, కాన్ఫరెన్సులో జరిగినప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో సభ్యులు ఉంటారు కాబట్టి గొడ్డు మాంసాన్నే వండేవారు. సాధారణంగా గొడ్డు మాంసం తినని వారికి కోడిని కోసేవారు. కాబట్టి జ్యోతికి ఎప్పుడూ ఇబ్బంది ఉండేది కాదు.

జనం తినేదే సభ్యులంతా అలవాటు చేసుకోవాలని, విడిగా కోడిని కొయ్యవద్దని ఆ క్యాంపులో గొడ్డు మాంసాన్ని మాత్రమే వండారు. కోడిని కొయ్యలేదు.

జ్యోతికి పెద్ద ఇబ్బందే వచ్చింది.

తినేవాళ్లు ఇష్టంగా తింటున్నారు. వాసన కూడా చాలా బాగొస్తున్నది. అయినా జ్యోతి వేయించుకోలేకపోయింది. ఇప్పటి వరకూ తను ఎప్పుడూ తినలేదు.

అందరూ తినగా లేనిదీ తనెందుకు తినడం లేదు. గొడ్డు మాంసం తినేవారి పట్ల తనలో చిన్నచూపు ఉందా? చిన్నప్పటి నుంచి నూరిపోసిన భావజాలమే ఇంకా పని చేస్తున్నదా? గోవు అంటే దేవత అని, దానిని పూజించాలని, అమాయకపు ఆవు అంటూ సాహిత్యం, ప్రచారమూ బోలెడంత కదా.

నిజానికి మన పురాణాల్లో పందిని వరహావతారం అని, చేపని మత్స్యావతారమని చెప్పారు కదా. మరి వాటిని తినడం తప్పు కానప్పుడు, ‘పాపం’ కానప్పుడు గొడ్డు మాంసం తింటే ఎందుకు తప్పవుతది? ఏదైనా ప్రచారాన్ని బట్టే కదా. నందిని అయినా పంది అని పలుమార్లు ప్రచారం చేస్తే పందే అనుకుంటారు కదా. గోబెల్స్‌ ప్రచారం గురించి తెలియనిదా?

ఓ వైపు గొడ్డు మాంసం తిననందుకు బాధగా ఉన్నది. తినాలంటే మనసొప్పడం లేదు.

ప్రస్తుతం జ్యోతి రెగ్యులర్‌గా దళంలో తిరుగుతోంది. అప్పటికి దాదాపు నెలన్నర అవుతోంది ఏ మాంసమూ తినక. దళంలో తిరగడమంటే శారీరక శ్రమ ఎక్కువ. కావాల్సిన పోషకాలను శరీరం డిమాండ్‌ చేస్తది.

రాత్రి పూట తినేటప్పుడు తనూ కొద్దిగా వేయించుకున్నది జ్యోతి. తర్వాత మామూలుగా అందరిలానే తినడం అలవాటు అయ్యింది.

దళాల్లో పని చేయడమంటే శారీరక శ్రమ చెయ్యడం, ప్రాణాలివ్వడానికి సంసిద్ధత ఉండటం మాత్రమే కాదు, ఏ ప్రాంతంలో పని చేస్తే ఆ ప్రాంతపు ప్రజల అలవాట్లను అలవర్చుకోవాలి. వారు తినేదే తామూ తినాలి – అది గొడ్డు కారమైనా ఆవు మాంసమైనా.

ప్రజల అలవాట్లను గౌరవించి, తమవిగా చేసుకున్న పార్టీలో తను ఆనాడున్నది. మరి ఇప్పుడు?

*

జ‌న‌నం: న‌ల్ల‌గొండ జిల్లా. అస‌లు పేరు ప‌ద్మ మిర్యాల‌. బీఎస్సీ(B.Z.C), PG Diploma in Journalism. వృత్తి: జ‌ర్న‌లిస్టు. మొద‌ట్లో 'క‌రుణ' పేరుతో క‌థ‌లు రాశారు. 23ఏండ్ల వ‌య‌సులో 'తాయ‌మ్మ' క‌థ రాశారు. ఇది క‌రుణ‌ మొట్ట‌మొద‌టి క‌థ . రాసిన మూడేండ్ల త‌ర్వాత 1996లో 'మ‌హిళా మార్గం'లో అచ్చ‌యింది. ఈ క‌థ పేరుతో 'కరుణ' '- 'తాయ‌మ్మ క‌రుణ‌'గా మారింది. ఆంధ్రప్రభ, సాక్షి, ప్రస్తుతం 'నవతెలంగాణ'లో.  మొదటి కథల సంపుటి 'తాయమ్మ మరికొన్ని కథలు' 2009లో, 2వ కథల సంపుటి 'జీవితం' 2018లో ప్రచురితమయ్యాయి. కవితలు, వ్యాసాలు అచ్చయ్యాయి. 13 ఏండ్లు విప్లవోద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు.

One thought on “గొడ్డు మాంసం

  1. Excellent. Camps information and cow meat issue is explored effectively

Leave a Reply