గుంటూరు కవులు నలుగురు

తెలుగు ‘దళిత సాహిత్య చరిత్ర’ (2000) వ్రాసిన పిల్లి శాంసన్ జాషువా మార్గంలో వచ్చిన దళిత సాహిత్యం గురించి వ్రాస్తూ పేర్కొన్న కవులలో కెసి( కంతేటి చిన్న) జాన్ ( 1906- 1980), అత్తోట రత్నకవి (1909-1999), బొడ్డుప్రకాశం (1912- 1980), గోవాడ వెంకట రత్నం( 1915- 1989) నలుగురూ గుంటూరు జిల్లాకు చెందినవాళ్లు. అయితే వాళ్లలో బొడ్డు ప్రకాశం రచన ఒకటి, గోవాడ వెంకట రత్న కవి రచన ఒకటి మాత్రమే లభించాయి. శాంసన్ రచన ఆధారంగానైనా వాళ్ళ సాహిత్య వ్యాసంగాన్ని గురించి మాట్లాడుకొనటం ఆయా కవుల రచనల అన్వేషణకు ఈ కాలపు వారిని ఎవరినైనా ప్రేపించక పోతుందా అన్న ఆశతోనే.

1

కంతేటి జాన్ గుంటూరు జిల్లా తుళ్లూరు కు చెందినవాడు. తల్లి రత్నమ్మ తండ్రి అననీయ. ఈయన రచనలు ముద్రితాలు ఎనిమిది, అముద్రితాలు పదిహేను అని చెప్పారే కానీ శాంసన్ వాటి పేర్లు చెప్పలేదు. ‘ధర్మ చక్రం’ అనే ఒక రచనను మాత్రం పేర్కొన్నారు.1948 లో వ్రాసిన కావ్యం అయినా ప్రచురించబడింది మాత్రం 1977లో. దళితుల దుస్థితికి చింతిస్తూ నిద్రించిన కవికి వచ్చిన కలరూపంలో ఈ కావ్యకథ అల్లబడింది. కలలో కవికి ఒక సంస్కర్థ, ధర్మదేవత కనిపిస్తారు. ఈ ముగ్గురూ కలిసి ప్రయాణం చేస్తుండగా దళితుల కష్టాలను గురించి వాళ్ళ మద్య సాగే సంభాషణ ఈ కావ్యం. అంటరానితనం,ఆకలి దళితుల సమస్యలు. కూడు, గుడ్డ లేని బ్రతుకులు. కన్నీరే తిండిగా బతుకు ఈడుస్తున్నవాళ్ళు అని కవి, సంస్కర్త దళితుల స్థితి చూసి వేదనపడతారు .సంస్కర్త వాళ్ళ విముక్తికై ధర్మదేవతను ప్రార్ధించటం, ధర్మదేవత త్రిమూర్తులకు చెప్పి అందుకు కృషిచేస్తానని చెప్పటంతో కావ్యం ముగుస్తుంది.
“అత్తోటరత్నమను నొక
యుత్తమ హరిదాసు నేటి యుత్సవమునకున్
విత్తనము నాటె, నాకుం
బత్తు ( డతని కిచ్చువాడ బ్రథమా శిషముల్”

గుర్రం జాషువా అత్తోట రత్నకవి గురించి వ్రాసిన పద్యం ఇది. 1946 జనవరి ఒకటి, రెండు తేదీలలో జాషువాకు విజయవాడలో పౌర సన్మానం, గజారోహణ గౌరవం, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిచేత గండపెండేర సత్కారం జరిగాయి. ఆ సందర్భంలో జాషువా అందుకు కారకులు భాగస్వాములు అయిన వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్తూ వ్రాసిన 31 పద్యాల కవితా ఖండికలో 26 వ పద్యం ఇది. అత్తోట రత్నకవి తనకు భక్తుడట. ఉత్తమ హరిదాసు. హరికథలు చెప్పటం, యక్షగానాలు ప్రదర్శించటం అత్తోట రత్నకవి అభిమానవిషయాలు. సాంస్కృతిక అభిరుచికి సంబంధించిన విషయాలు. జాషువా కవిత్వం పట్ల ఉన్న ఇష్టంతో, జాషువాపై అభిమానంతో ఆ నాటి గండపెండేర ఉత్సవానికి విత్తనం నాటిన వాడు, అది వాస్తవం అయ్యేవరకు వెంటవున్నాడు అత్తోట రత్నకవి అన్న విషయాన్ని ప్రస్తావించి జాషువా అతనికి ప్రథమ ఆశీస్సులను అందించాడు.

ఆ అత్తోట రత్నకవి గుంటూరు జిల్లా ఎడ్లపల్లి గ్రామస్థుడు. తల్లి నాగమ్మ, తండ్రి గోవిందయ్య. దళిత చైతన్య వికాసానికి స్వయంగా హరికథలు,యక్షగానాలు వ్రాసి ప్రయోగాలు చేస్తూ ప్రచారం కల్పించాడు. ఆయనవి 10 ముద్రిత రచనలు, 15 అముద్రిత రచనలు ఉన్నట్లు తెలుస్తున్నది. వాటిలో ఒకటి హరిజనాభ్యుదయం. 1955 నాటికే వ్రాయబడి,ప్రదర్శించబడిన ఈ రచన 1970 లో ప్రచురించబడింది. అంటరానితనం నేరం అని నిర్ధారించే 1955 చట్టానికి ప్రచారం కల్పించటం, అస్పశ్రుస్యతా నివారణకు, హరిజనుల దేవాలయ ప్రవేశానికి సామాజిక సాను కూలతను కూడగట్టడం లక్ష్యంగా ఈ యక్షగానం రచించబడింది. ‘అంబేద్కర్ ఆదర్శవాది’ అన్నది ఆయన వ్రాసిన మరొక కావ్యం. భాగవత రత్న, కవిరత్న, కవిశేఖర, నూత్నభవ రత్నాకర అనే బిరుదులు ఆయనకు ఉన్నట్లు తెలుస్తున్నది.

అత్తోట రత్నకవి కొలకలూరి ఇనాక్ కు బంధువు. “కొలకలూరి వారి కొమరిత మా తల్లి /ఆమె యగ్రజు సతియైన శాంత/ మాంబ పతిని నేను నకళంక చరితగ /లట్టి మిమ్ము మరల నభినుతింతు” అని అత్తోట రత్నకవి తన తల్లిని గౌరవించేవాడని ఇనాక్ పేర్కొన్నారు. కోలకలూరివాళ్ళు తన తల్లికి అన్నదమ్ములు, తన భార్యకు చిన్నాన్న పెదనాన్నలు కాబట్టి ఇనాక్ తనకు మామ అవుతాడని వాదిస్తూ పాతికేళ్ల రత్నకవి పసివాడైన తనను తన తల్లి వారిస్తున్నా వినక మామా అని సంబోధించేవాడని మురిపంగా చెప్పుకొన్నారు ఆయన. ఆయన హరికథలు చెప్పేవాడని వస్తూపోతూ తమ యింటికి వచ్చేవాడని, అద్భుతమైన గాత్రంతో కథలు చెబుతూ, పద్యాలు పాటలూ పాడుతూ ఉంటే ఆసక్తిగా వినేవాడిని అని తన బాల్యానుభవాలను గుర్తు చేసుకొన్నారాయన. ఆ రకంగా ఇనాక్ పద్య కావ్య రచనకు ప్రేరణ ఆయనే అన్నది సూచ్యం. అత్తోట రత్నకవిని ‘అరక’ అనే వాళ్ళని కూడా ఇనాక్ మాటలను బట్టి తెలుస్తున్నది. (ఆది ఆంధ్రుడు, 2008, నేపధ్యం)

2

“తొలుతున్నా కవితాభిమానియయి మిత్రుండై తుదంజుట్టమై
నిలిచెం బొడ్డు ప్రకాశరాయకవి యాంధ్రీ మండలఆశీస్సులన్
దలపై దాల్చి తెలుంగు వాజ్మయ చరిత్రన్ గావ్య సంసారియై
పొలుచుం గాక సహస్రవర్షము శతంబుల్ శ్రీ సుఖోపేతుడై “
బొడ్డు ప్రకాశం గురించి గుఱ్ఱం జాషువా వ్రాసిన పద్యం ఇది. బొడ్డు ప్రకాశం 1912 లో గుంటూరు జిల్లా బాపట్లలో పుట్టాడు. తల్లి రమణమ్మ, తండ్రి చినవీరయ్య. సాహిత్య అధ్యయానాసక్తులు, కవిత్వ రచనా రుచి హైస్కూల్ చదువుల కాలం నాటికే అలవడ్డాయి. ఆ క్రమంలో జాషువా కవిత్వ అభిమాని అయినాడు. ఉద్యోగరీత్యా వినుకొండలో నివసించిన కాలంలో జాషువాతో పరిచయం పెంచుకొని దగ్గరయ్యాడు. తన వివాహానికి ఆహ్వానించి సత్కరించాడు. ఆ సందర్భంలో జాషువా ఆశీర్వచన పద్యాలు ఆరు వ్రాసాడు.(1952 లో ప్రచురించిన అయిదవ ఖండకావ్య సంపుటిలో ఆశీస్సులు అనే శీర్షికతో ఈ పద్యాలు ఉన్నాయి) 1962 లో ప్రచురించిన నా కథ అనే పేరుతో తాను వ్రాసుకొన్న స్వీయ చరిత్ర మూడవభాగాన్ని జాషువా ఆ బొడ్డు ప్రకాశానికే అంకితమిచ్చాడు. ముప్పది ఏళ్ల తీయని పరిచయం తమది అని చెప్పుకొన్నాడు జాషువా. అంకితము శీర్షిక కింద వ్రాసిన 15 పద్యాలను బట్టి ప్రకాశం జీవిత విషయాలు అనేకం గ్రహించవచ్చు. ప్రకాశం భార్య మేరీ అని వాళ్ళ పెళ్లి జరిగి అప్పటికి ముప్ఫయ్ సంవత్సరాలని తెలుస్తుంది. అంటే ప్రకాశం పెళ్లి 1932 లో జరిగి ఉంటుంది. ప్రకాశం వూరు అయిదరుపేట అని ఏసురత్నం అతని అన్న అని తెలుస్తుంది. విను కొండలో ప్రభుత్వంలో తనది కొద్ధి ఉద్యోగం అంటూ జాషువాకు తనను తాను పరిచయం చేసుకొన్న బొడ్డు ప్రకాశం 1962 లో నా కథ మూడవభాగం అంకితం తీసుకొనే నాటికి తహసీల్దారు అయినాడు. అయినా కావ్యకళా కృషిని ఏనాడూ విడువని వాడని అతనిని మెచ్చుకున్నాడు జాషువా.

1978 నాటికి బొడ్డు ప్రకాశం తహసీల్దారుగా పదవీవిరమణ చేసాడు. ఆ సంవత్సరమే ‘ప్రతిజ్ఞాశాలి’ అనే పద్యకావ్యాన్ని ప్రచురించాడు. ప్రచురించటం అప్పుడు అయినా వ్రాసి 20 ఏళ్ళు దాటిపోయిందని నామాట అనేపేరుతో వ్రాసిన ముందుమాటలో పేర్కొన్నాడు. అంటే ఈ కావ్య రచనా కాలం 1958 కి ఒకటి రెండేళ్లయినా ముందే అయి ఉంటుంది. తన గురువరేణ్యులు ‘నవయుగ కవి చక్రవర్తి’ జాషువాగారు చదివి చాలా సంతోషించి ప్రకటింపుమని కోరారు కానీ ప్రభుత్వోద్యోగి కావటం వలన సర్వీసురూల్స్ ప్రతిబంధకమై అప్పుడు ప్రచురించలేకపోయానని చెప్పుకొన్నాడు. బొడ్డు ప్రకాశం జాషువాను గురువుగా సంభావించాడు అనటానికి ‘ప్రతిజ్ఞాశాలి’ కావ్య ప్రారంభంలోని అవతారిక లో “ బలుకన్నేర్చితి జాషువా కవి గురుత్వప్రాప్తమింపొందగన్ “ అని గురుస్తుతి చేయటం నిదర్శనం. గురు పూజ అనే కావ్యం కూడా వ్రాసాడు అని తెలుస్తున్నది. అయితే అది అలభ్యం.

ప్రతిజ్ఞా శాలి బైబిల్ ఆధారిత పద్యకథా కావ్యం. పాతనిబంధనలోని న్యాయాధిపతులు 2వ అధ్యాయంలోని యెఫ్తా చరిత్రను కావ్య సౌందర్యం కోసం అవసరమైన కొన్ని మార్పులు, చేర్పుల తో ఆరు ఆశ్వాసాల కావ్యంగా రచించాడు బొడ్డు ప్రకాశం.సంప్రదాయ కావ్య రచనా పద్ధతిలో వ్రాసిన అవతారికలో ఈ తన రచనను ప్రబంధంగా పేర్కొన్నాడు.
“శ్రీకరు (డాది దేవుఁడు విశిష్ట గుణాఢ్యుల బ్రోచు దాత, శో
భాకరు(డవ్యయుండు, వరాభక్త జనాశ్రిత పోషకుండు, లో
కైక విభుండు, రక్షకుఁడ ఖండ దయా పరుఁడై చెలంగు ది
వ్యాకర శక్తి మూర్తి, పరమాత్ము(డు క్రీస్తు ప్రభున్నుతించెదన్“
అని క్రీస్తు ప్రభు ప్రార్ధనతో కావ్యాన్ని ప్రారంభించాడు. తరువాతి రెండు పద్యాలు కూడా క్రీస్తు కీర్తనమే. హిందూ దేవతల ప్రార్ధనతో ప్రారంభం అయ్యే తెలుగు కావ్య సాధారణ పద్ధతికి ఇది పూర్తిగా భిన్నమైనది. “అట్టి త్రీ యేక మూర్తి వాక్య స్వరూప/ వర్తి, శ్రీ యేసు సత్క్రుపా వరముచేత/ వ్రాసినా(డను జన్మ సార్ధకము(గాగ/ భక్త యెఫ్తాఖ్యు చరిత ప్రబంధ సరణి” అని చెప్పి కావ్య వస్తు మూలాన్ని హిందూ మత ఐతిహాసికపురాణాల నుండి క్రైస్తవమత పురాణ గాధల వైపు మళ్ళించాడు. కావ్య రచన నిర్విఘ్నంగా సాగటానికి కవులు చేసే గణేశ ప్రార్ధన స్థానంలో విఘ్నకారుడైన సాతాను తనమార్గంలో అవరోధాలు కల్పించకుండా చేయమని క్రీస్తును ప్రార్ధించటం ఈ అవతారికలో చూస్తాం. ఒకేఒక పద్యంలో సంస్కృత ఆంధ్రకవులకు ఆంగ్ల కవులలో మిల్టన్ కు నమస్కరించి ‘కావ్య ప్రశస్తి’ చేసాడు. కావ్య ప్రశస్తి అంటే తాను వ్రాయ పూనుకొన్న కావ్య విశిష్టతను వర్ణించటం. తనది బైబిల్ కావ్యం అన్నాడు. తిక్కన బమ్మెరపోతన ఎఱ్ఱాప్రగడల ఫక్కీ లో వ్రాస్తున్నానని ‘విశ్వసాహిత్య మహిమంబు విస్తరింప’ వలెనన్న ఆకాంక్షతో తెలుగులో తానీ రచనకు పూనుకొన్నాని చెప్పుకొన్నాడు.

“భారతమో, రామాయణ / సారంబో వ్రాయ నేను” సంకల్పింప కోరలేదు అని స్పష్టం చేసి “ బైబిలు” నంగల / సారస వృత్తమును గొంటి సరసత మెఱయన్” అని ప్రధాన స్రవంతి కావ్య వస్తువు కు భిన్నంగా నూతన కావ్య వస్తు నిర్దేశం చేసుకొన్నాడు బొడ్డు ప్రకాశం.

ఈ కావ్యంలో ‘కవి వంశాభి వర్ణనము’ ఉంది. ఈ ప్రాచీన కావ్య రచనా సంప్రదాయం కవి జీవిత విశేషాలు, రచనలు, కావ్యకళా ప్రత్యేకతలు తెలుసుకొనటానికి సాధికారమైన వనరు. ప్రతిజ్ఞా శాలి కావ్యంలోని వంశాభివర్ణం కవి బొడ్డుప్రకాశం జీవిత విశేషాలను తెలియచేయటంతో పాటు కోస్తా ఆంధ్రలో క్రైస్తవ మతవ్యాప్తికి సంబంధించిన చరిత్ర గురించిన కుతూహలాన్ని కూడా రేకెత్తిస్తుంది. కవి తిక్కనను కన్న గర్తపురి (గుంటూరు) లో కవులన్నా, కవిత్వమన్నా, కావ్య చర్చలన్నా ఇష్టపడే రసజ్ఞ శేఖరుల వంశంలో పుట్టి క్రీస్తును నమ్మి క్రైస్తవులై వెలిగిన తమ పూర్వీకులు క్రీస్తు శక్తిని దశదిశలలో బోధచేశారని చెప్పుకొన్నాడు ప్రకాశం. ఈ అవతారికను బట్టి ఆయన తల్లి తండ్రి చంద్రనార్యుడు వైదిక బ్రాహ్మణుడు. తండ్రి తండ్రి పేరనార్యుడు నియోగి బ్రాహ్మణుడు. బొడ్డు వారి ఇంటిపేరు. వాళ్ళు పిలకలు, జంధ్యాలు, బొట్లు మానేసి క్రైస్తవులు అయినారు. వాడవాడలు తిరిగి యేసు వార్తలను చాటారు. శాశ్వత పరలోక రాజ్య సుఖభాగ్యం ఆశించి పని చేశారు.” కులము(గలుగు మతము కుచ్ఛితంబని మాని / కులము లేని మతము గొప్పదనుచు” తెలుసుకొని ప్రవర్తించారని, “అగ్రహారములలో అగ్ర పీఠము వీడి/ యేసునాధుని దివ్యకృపను” పొందారని, కులము వీడి మాల కులంలో, మతము వీడి మాల మతములో కలిసారని భ్రష్టులు అని ఎవరెంత నిందించినా జంకక వేదాలలో గుట్టువిప్పి చెప్పి, విగ్రహారాధనవెఱ్ఱి వదిలి అసలు సిసలైన క్రైస్తవులుగా తన వంశ పూర్వీకులు జీవితం గడిపారని చెప్పుకొచ్చాడు బొడ్డు ప్రకాశం. ఆంటే ఆయన తాతల కాలంలో క్రైస్తవంలోకి మార్పిడి జరిగిందన్నమాట. తరానికి తరానికి మధ్య కనీస కాల వ్యవధి ఇరవై ఏళ్ళు గరిష్ట కాల వ్యవధి పాతికేళ్ళు అంటారు. ఆరకంగా చూస్తే 1912లో పుట్టిన బొడ్డు ప్రకాశం మాతామహ పితామహులు కనీస పక్షం 40 ఏళ్ల వెనకటి వాళ్ళు అనుకొంటే 1872 నాటివాళ్ళు, గరిష్ట పక్షం లెక్కవేస్తే 1862 నాటి వాళ్ళు అవుతారు.

ఆంధ్రప్రాంతంలోకి 1840 నుండి క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభం అయింది.తొలుత అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ 1840 నుండి నెల్లూరు కేంద్రంగాను, చర్చ్ మిషనరీ సొసైటీ 1841 నుండి మచిలీపట్నం కేంద్రంగానూ, ది అమెరికన్ లూథరన్ మిషన్ 1842 నుండి గుంటూరు కేంద్రంగాను పనిచేశాయి. రాబర్ట్ టర్లింగ్ టన్ నోబుల్ 1843 లో మచిలీపట్నంలో నోబుల్ స్కూల్ ను ప్రారంభించాడు. బ్రాహ్మలను తదితర ఉన్నత కులాలవారిని క్రైస్తవంలోకి ఆకర్షించటానికి కులీన కులాల వారి కోసమే ఆ బడి ప్రారంభించబడింది. మూలయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు బ్రాహ్మణులు బాప్టిజం తీసుకొన్నారని 1852 నాటికి మరికొంతమంది బ్రాహ్మలు, వెలమలు క్రైస్తవం తీసుకొన్నారు. వారిలో మంచాల రత్నం ఒకరు. (church missionary society in coastal Andhra, 1850- 1950 mediating change among the Malas – V. santha kumari http://www. mission theologyanglican.org) ఈ క్రమంలో ఖమ్మం ని ఆనుకొని ఉన్న ఆంధ్రా సరిహద్దు గ్రామం రాఘవాపురం క్రైస్తవ మత మార్పిడుల కేంద్రం . 1859 లో ఆ వూళ్ళో సహపంక్తి భోజనాలు కూడా జరిగాయి.1876 లో అక్కడ క్రైస్తవంలోకి మారిన బ్రాహ్మలు, శూద్రులు, మాలమాదిగల తో కలిసి యూరోపియన్ క్రైస్తవులు నిర్వహించిన మొదటి ప్రొవిన్షియల్ నేటివ్ చర్చ్ కౌన్సిల్ ఇండియాలోనే భిన్న సామాజిక వర్గాల నుండి క్రైస్తవులైన వాళ్ళతో జరిగిన సభగా చరిత్రలో గుర్తింపు పొందింది. ఇటువంటి సంరంభం సందర్భంలో ఎప్పుడో బొడ్డు ప్రకాశం మాతామహ పితామహులు బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి క్రైస్తవం స్వీకరించి ఉంటారు.

ప్రకాశం తల్లి రమణాంబ. అన్నమ్మ అని కూడా అంటారామెను. తండ్రి వీరయ్య. దావీదు అతని క్రెస్తవ నామం. వాళ్లకు ముగ్గురు కొడుకులు. ఒక కుమార్తె. పెద్దకొడుకు ఏసురత్నం. భీమబలుడు. చదువుకొని సువార్త సేవలో పేరెన్నిక గన్నాడు. రెండవ కొడుకు దేవ సహాయం. వాస్తుశాస్త్ర నిపుణుడు. వ్యవసాయం చేసి పాడిపంటలు సమకూర్చిన శక్తియుక్తుడు. మూడవ కొడుకు బుల్లెయ్య అనే వాడుక నామం కల ప్రకాశం. బాల్యంలోనే కవిత్వం అల్లటం నేర్చినవాడు. చిట్టచివరిది కూతురు. ఆమె పేరు కమలాక్షి. వారసత్వంగా సంక్రమించిన సారవంతమైన భూములు దానధర్మాల కింద వ్యయం చేసి భార్యను పిల్లలను వదిలి వీరయ్య మరణించాడు. మేనమామ చెల్లెలి వ్యవహారాలు చక్కబెట్టి కుటుంబాన్ని ఆదుకున్నాడు. ప్రకాశం దొరవారల సహాయంతో చదువుకున్నాడు. కవి అయినాడు. తాను వ్రాసిన ఈ యెఫ్తా చరిత్ర వస్తువుగా గల ప్రతిజ్ఞా శాలి కావ్యాన్ని ‘ సత్కావ్యము దైవదత్తమయి గ్రాలిన స్వర్గ సౌఖ్యంబులుండు’ అని ఏసు ప్రభువుకు అంకితం చేసాడు. కవిరాజులు దేవుని శాంతి దూతలని, కావ్యజగత్తు దేవుని జగత్తు అని సంభావించాడు ‘కమ్మని జాను తెన్గు నుడికారములన్ విరజిమ్ము కావ్యరూపమ్మును తీర్చి దిద్దగల పండిత సత్కవిని’ అని తన కవితాప్రతిభను ప్రకటించుకున్నాడు. ‘సరసకవి చక్రవర్తి’ అన్నది ఆయన బిరుదు. ఇన్ని వివరాలతో ఉన్న ఈ అవతారికలో తన ఇతర రచనల పేర్లు ఏవీ ప్రస్తావించలేదు ప్రకాశం. అందువల్ల అంతకు ముందు ఆయన చేసిన కవితాభ్యాసం ఏమిటోగానీ ప్రతిజ్ఞాశాలి ప్రబంధమే ఆయన మొదటి రచన అనుకోవచ్చు.

తల్లి దండ్రులు ఇశ్రాయేలు, సంతోషమ్మ ల పేరున ఈ పుస్తక ముద్రణకు ద్రవ్యం ఇచ్చిన ఆచార్య బి. ప్రసాదరావు కు జేజేలు పలుకుతూ కావ్యం మొదట్లోనే పన్నెండు పద్యాలు వ్రాసాడు ప్రకాశం. బురదగుంట ప్రసాదరావు ఆంధ్ర ఆంగ్ల భాషలలో పండితుడని, గుంటూరులో ధనాన్ని, స్నేహాన్ని సత్కర్యాలకు వినియోగించే క్రైస్తవుడని ఆయనను ప్రశంసించాడు. అతని మాతాపితృభక్తిని కొనియాడాడు. అతని భార్య సుగుణమ్మ సుగుణశీల అని మెచ్చుకొంటూ ఆమె పుట్టిల్లు అయిన ‘ఆలకూరపాడు ఆది ఆంధ్రుల్ ఘనులు’ అని పేర్కొన్నాడు.

యెఫ్తా ఇజ్రాయిల్ ను పాలించిన న్యాయాధిపతులలో ఒకడు. ఇతని పాలనాకాలం ఆరేళ్ళు. అతని తండ్రి గిలాదు. వైవాహికేతర సంబంధం వల్ల కలిగిన కొడుకు అని సోదరులు అతనిని ఇంటినుండి వెళ్లగొట్టారు. అతను టోబు దేశానికి వెళ్ళిపోయాడు. ఆతరువాత కొంతకాలానికి ఇజ్రాయిలు వారికి అమ్మోనీయులతో యుద్ధం సంభవించింది. ఆయుద్ధానికి నాయకత్వం వహించి దేశాన్ని, ప్రజలను కాపాడాలని తమ్ములు, పెద్దలు వచ్చి కోరగా అంగీకరించి తిరిగివచ్చాడు యెఫ్తా . అమ్మోనీయులతో రాయబారం నడిపి అది విఫలం కావటంతో యుద్ధం తప్పని సరి అయింది. యుద్ధానికి పోతూ తనకు విజయం సమకూరితే తిరిగి వచ్చినప్పుడు తన ఇంటి ద్వారం నుండి ఏది వస్తే దానిని కానుకగా ఇస్తానని యేసుకు మొక్కుకున్నాడు. యెఫ్తా ఆ యుద్ధంలో విజయం సాధించి వచ్చేసరికి అతనికి స్వాగతంచెప్పటానికి సంతోషంతో కూతురు వస్తూ కనబడింది. మొక్కు ప్రకారం ఆమెను యేసుకు సమర్పించాలి. మొదట దుఃఖపడ్డా చివరకు గుండె దిటవుచేసుకొని కూతురిని యేసుకు బలి ఇచ్చి మాటనిలుపు కొన్నాడు. అప్పటి నుండి ప్రతిసంవత్సరం ఇజ్రాయిల్ దేశపు ఆడపిల్లలు ఆమె పేర నాలుగురోజులు సేవలు, సంకీర్తనలు కావిస్తారు. సంక్షిప్తంగా బైబిల్ లోని యెఫ్తా కథ ఇది.

ప్రతిజ్ఞా శాలి ప్రబంధం లో 36 పద్యాల అవతారిక తరువాత మిస్సానగర వర్ణనతో అసలు ప్రబంధం మొదలవుతుంది. 115 పద్యాల ఈ ఆశ్వాసంలో యెఫ్తా పరిచయం, తమ్ముల తిరస్కారానికి పరితాపం చెంది టోబు దేశపు అరణ్యాలలో తిరుగుతూ అడవిరాజులైన చెంచుల ఆదరం పొందటం, రాజు కూతురు చిత్రను పెళ్ళాడి మోహిని అనే కూతురిని పొందటం మొదలైన ఘట్టాలతో ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు వచ్చేవరకు జరిగిన కథ చెప్పబడింది. బైబిల్ లో యెఫ్తా కూతురి బలి సమర్పణ ప్రస్తావన ఉంది కానీ పెళ్లి ప్రస్తావన లేదు. బైబిల్ లో లేని యెఫ్తా వివాహం, అరణ్యంలో అతని జీవితం, అడవి జాతులతో అతని సంబంధాలు మూలకథార్దానికి అనుకూలంగా పెంపు చేయబడినవి. అరణ్య వర్ణన, బోయలు, చెంచులు, కోయలు, లంబాడీలు, ఎరుకలు మొదలైన గిరిజన జాతుల వైవిధ్యం జీవన వ్యవహారాల కథనం, అంధకార వర్ణన దీనికి ప్రబంధ గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. ఈ రకమైన రచనను ఆయన ఇండియనైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిస్టియానిటీ అని పేర్కొన్నాడు.

ద్వితీయాశ్వాసం పునర్దర్శనం. తమ్ముళ్లు, మిస్సాపుర వాసులు యెఫ్తాను వెతుక్కొంటూ వచ్చి అమ్మోనీయులతో యుద్ధానికి నాయకత్వం వహించాలని, మార్గదర్శివి, తీర్పరివి నీవేనని ప్రార్ధించడం, గిరిజన జాతులవారు ఆయనకు వీడ్కోలు చెప్పటం, నగరం స్వాగతం పలకటం, యెఫ్తా అమ్మోనీయులకు పంపిన రాయబారం విఫలం కావటం మొదలైన ఘటనలతో కూడిన కథ 74 పద్యాలలో చెప్పబడింది. తృతీయాశ్వాసం ప్రతిజ్ఞా0శము. యుద్ధసన్నాహం, ప్రార్ధన, మొక్కుబడి, యుద్ధం, విజయం మొదలైన అంశాలతో 45 పద్యాలలో విస్తరించింది. బైబిల్ వాక్యర్ధ సూచనలను పట్టుకొని యుద్ధవర్ణనలు చేసాడు.

చతుర్దాశ్వాసము విషాద ఘట్టము. జయశీలుడై మిస్సా నగరానికి వచ్చిన తండ్రికి స్వాగతం పలకటానికి ఇంటివాకిట్లోకి వచ్చిన కూతురు ఎదురుపడటంతో చేసిన ప్రతిజ్ఞ గుర్తుకువచ్చి తన ఏకైక కుమార్తెను యెహోవాకు అర్పణ చేయటం గురించి దుఃఖపడటం, కూతురు తండ్రిని ఓదారుస్తూ చావు ఎప్పటికైనా సత్యమే అయినప్పుడు ఇలా పోవటం తనకు గౌరవకరమేనని చెప్పి ప్రతిజ్ఞాపాలనకు తండ్రిని ఉత్సాహపరచటం 84 పద్యాలలో ఒక అధ్యాయంగా విస్తరించింది. పంచమాశ్వాసం తపస్సమాధి. మోహిని కొండపైకి వెళ్లి పరమాత్ముని దివ్య సురూపం సంభవిస్తూ తపస్సు చేసుకొనటం 25 పద్యాలలో వర్ణించబడింది. 50 పద్యాలుగల షష్టాశ్వాసంలోసృష్టి కథనం మోహిని ని బలిగా సమర్పించటం వర్ణితం. దానితో ప్రబంధం ముగిసింది. యెఫ్తా కూతురి ధీరోదాత్తత, తాత్విక పరిణితి నిరూపణకు సంభాషణల కల్పన, తపస్సమాధి వర్ణన జరిగాయి. సరళము, ధారాళమూ అయిన పద్యరచన ప్రకాశం ప్రత్యేకత.

ఆ తరువాతి కాలంలో ఆయన కింకిణులు, అంబేద్కర్ ప్రశంస, భారత వర్షము, అభ్యుదయము వంటి దళిత కావ్యాలు రచించాడని 20 కి పైగా అముద్రిత కావ్యాలు ఉన్నాయని, కళా వీర అనే మరొక బిరుదు కూడా ఉన్నదని తెలుస్తున్నది. ( పిల్లి శాంసన్). కింకిణులు 1968 నాటి ఖండ కావ్యం. భరతవర్షము 1976 లో ప్రచురితం. గద్య పద్యాలతో కూడిన ఈ రచనలో ఆది ఆంధ్రులు మూలవాసులని, వర్ణవ్యవస్థను నిరసించి వైదిక మతం నుండి వైదొలగిన వాళ్ళే అంటరాని వాళ్ళుగా చేయబడ్డారని ఆయన అంటాడు. 1977లో అంబేద్కర్ ప్రశంస అనే కావ్యం వచ్చింది. ప్రకాశం ముద్రితాముద్రిత రచనలన్నీ లభించేకొద్దీ ప్రకాశం దళిత సామాజిక చేతనా సారం మరింతగా ఈ కాలానికి వారసత్వంగా అందివస్తుంది.

3

నడకుర్తి వెంకటరత్నం గుంటూరు జిల్లా లోని గోవాడ లో పుట్టాడు. గోవాడ వెంకటరత్నకవిగా సాహిత్య రంగంలో ప్రసిద్ధుడయ్యాడు. తండ్రి వెంకటస్వామి, తల్లి రామమ్మ. ఆయన భార్య ఐ. రత్న మరియాంబ. ఎన్. మంగాదేవి అని కూడా ఆమెకు మరొక పేరు. ఆమె ఉపాధ్యాయిని. వెంకట రత్నకవికి బతుకు తెరువు మార్గం గుమస్తా ఉద్యోగం. సాహిత్య అధ్యయనం అభిరుచి. రచన ప్రవృత్తి. అర్ధశతాధిక గ్రంధకర్త అని ఆయన కూతురు కొలకలూరి స్వరూపరాణి శివకేశవ యుద్ధం నాటకానికి కవిత్వ విజేత అనే శీర్షికతో వ్రాసిన ముందుమాటలో చెప్పింది. ఆయనను కవితయోద్ధ అంటుంది ఆమె. శివకేశవ యుద్ధము నాటకం 1941 లో వ్రాసినట్లు ఆమె వ్రాసిన ముందుమాట వల్ల తెలుస్తున్నది. బ్రహ్మాండ పురాణంలోని చిన్నకథను పెంచి ఆయన ఈ నాటకంగా వ్రాసినట్లు కూడా ఆమె పేర్కొన్నది. 1990లో ఆయన ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈ నాటకం పునర్ముద్రణ జరిగింది. కాళిదాసు కుమార సంభవ కథ కొంత,భారత కథ కొంత కలిపి ఇతివృత్తాన్ని అల్లి అందుకు అనుగుణంగా కొంత కల్పనను జోడించి, కొత్తపాత్రలను సృష్టించి గయోపాఖ్యానం నమూనాలో గోవాడ వెంకట రత్నకవి ఈ నాటకం వ్రాసాడు. ఇందులో అయిదు అంకాలు ఉన్నాయి. అర్జునుడికి ఉలూచివల్ల పుట్టిన కొడుకు ఇరావంతుడు కాగా ఆతని పేరును నాగార్జునుడుగా మార్చి శివపార్వతుల రక్షణలో పెరుగుతున్నవాడుగా కల్పన చేసి గండా మృగం నెపం గా వాళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని సృష్టించి ఆయుద్ధంలో అర్జునుడు విగత జీవుడైనట్లు కల్పన జరిగింది ఈ నాటకంలో. భారతంలో అర్జునుడికి చిత్రాంగద యందు పుట్టిన బభృవాహనుడికి యుద్ధం జరిగినట్లు ఉండగా గోవాడ వెంకట రత్నకవి ఆ యుద్ధాన్ని ఉలూచి కొడుకుతో జరిగిన యుద్ధంగా కల్పించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో, అందువల్ల సాధించదలచిన ప్రయోజనం ఏమిటో తెలియదు. శివకేశవ భేదాభేదా చర్చకు నాగార్జునుడు, అతని మిత్రులు నారదుడితో చేసిన వికట భాషణ పరిణామంగా ఈ ఇతివృత్తాన్ని కల్పించినట్లు అర్ధం అవుతుంది. అర్జునుడిని చంపిన నాగార్జునుడిని చంపటానికి శ్రీకృష్ణుడు శపథం పూని రంగంలోకి దిగగా, నాగార్జునుడిని రక్షించటానికి శివుడు రంగంలోకి దిగి పరస్పరం సంఘర్షించినట్లు కల్పించి ఇద్దరూ నిజానికి ఒకటే అయినా భక్త జనోద్ధరణ కోసం వేరువేరుగా కనబడతారని నిరూపించటం తో నాటకం సుఖాంతం అవుతుంది. ఈ నాటకం ముఖపత్రాన్ని బట్టి బాలకవి, కవిభూషణ అనే బిరుదులు గోవాడ రత్నకవికి ఉన్నట్లుగా తెలుస్తున్నది.

కొలకలూరి స్వరూపరాణి ముందుమాటను బట్టి గోవాడ రత్నకవి ‘విజయ ఫిరదౌసి’ అనే నాటకం వ్రాసినట్లు తెలుస్తున్నది. పిల్లి శాంసన్ మహోదయం అనే నాటకం గురించి పేర్కొన్నాడు. ఇవి అన్నీ ప్రాచీన నాటక సంప్రదాయ పద్ధతిలో నాందీ, భరతవాక్యం వంటి లక్షణాలతో వ్రాయ బడిన పద్యనాటకాలు. బాలకోటీశ్వర తారావళి, ధ్యానాంజలి ఆయన పద్య కావ్యాలు. అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ ఆయన వ్రాసిన ఖండకావ్యం అముద్రితం. ఆయన వ్రాసినట్లు చెప్పబడిన అర్ధ శతాధిక రచనలలో ఒక నాటకం తప్ప మరేవీ లభించకపోవటం విచారకరమే.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply