ల్యాండ్, గన్స్, కాస్ట్, విమెన్ అనే శీర్షికతో ది మెమొయిర్ ఆఫ్ ఎ ల్యాప్సెడ్ రెవెల్యూషనరి ట్యాగ్ లైన్ తో (LAND GUNS CASTE WOMAN The Memoir of a Lapsed Revolutionary) గీతా రామస్వామి రాసిన 432 పేజీల పుస్తకాన్ని నవయాన సంస్థ ప్రచురించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 1984 నుంచి 93 మధ్యకాలంలో ప్రధానంగా తన చొరవతో నిర్మాణమైన ఉద్యమాన్ని కేంద్రం చేసుకుని చాలా వివరంగా రాసిన పుస్తకం. సామాన్య పాఠకులకంటే సామాజిక కార్యకర్తలను ఆసక్తిగా ఉద్వేగంతో చదివించే పుస్తకమిది. అసలు తాను ఇబ్రహీంపట్నం ఎందుకు వెళ్ళిందో దాని వెనుక ఉన్న తన జీవిత నేపధ్యం ఏమిటో, ఏ రాజకీయ అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలు తనను అటువైపు నడిపించాయో ఆ ప్రయాణంలో వ్యక్తిగత జీవితంలోను, ఉద్యమ జీవితంలోనూ తాను ఎదుర్కున్న ఒడిదుడుకులు, సవాళ్ళు, సమస్యలు, సందేహాలు, దాడులు, మానసిక శారీరక నైరాశ్యాలు అన్నింటినీ పాఠకులతో పంచుకునేందుకు, తాను చేసిన కృషిని మదింపు చేసుకునే ఉద్దేశ్యంతో రాసిన ప్రయత్నమే ఈ పుస్తకం. తన తప్పులను ఒప్పులను తొదరపాటుతనాన్ని దాపరికంలేకుండా పాఠకుల ముందు వుంచే ప్రయత్నం చేసింది రచయిత.
ఒక సాంప్రదాయ బ్రామ్హణ కుటుంబంలో పుట్టి అనేక ఆంక్షలు కట్టుబాట్ల మధ్య కుల, పితృస్వామిక సంబంధాల చట్రంలో పెరిగిన గీతా రామస్వామి తన బాల్యం నుంచీ అడుగడుగునా వాటిని ధిక్కరిస్తూ తనదైన మార్గంలో ప్రయాణించిన తీరు వివరిస్తుంది. కులాన్ని, కుటుంబాన్ని చదువుని కాదనుకుని విప్లవ భావజాలం వైపు, ప్రజా ఉద్యమాలవైపు ఎలా ఆకర్షితురాలయ్యిందో తెలియచేస్తుంది. మార్క్సిస్టు సిద్ధాంతాన్నిబలంగా నమ్మి అది తప్ప సమాజ మార్పుకు మరో మార్గంలేదని విశ్వసించి తెలిసీ తెలియని యవ్వన ప్రాయంలోనే అన్నింటినీ వదులుకుని విప్లవ సంస్థలలో చేరి అర్ధాంతరంగా ఆ నిర్మాణాల నుంచి బయటకు వచ్చి సమాజంతో రాజీపడలేక మరోమార్గం కనిపించక డిప్రెషన్లోకి వెళ్ళిన ఎంతోమంది గీతా రామస్వామిలో కనిపిస్తారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన కృషిని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకం గురించి క్లుప్తంగానయినా మాట్లాడుకోవాలి. గీతా రామస్వామి జీవితక్రమాన్ని తెలుసుకోవాలి.
గీతా రామస్వామి తండ్రి పేరు కె.హెచ్.రామస్వామి. పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ లో ఇంజనీర్. తల్లి లక్ష్మి. వైదిక మత సాంప్రదాయాలను, ఆచారాలను త్రికరణశుద్ధిగా పాటించే కుటుంబం. సమాజంలో మిగిలిన సామాజిక వర్గాల కంటే బ్రాహ్మణులు చాలా ఉన్నతమైనవారనే అభిప్రాయం బలంగా వున్న వ్యక్తి. మధ్యతరగతి కుటుంబం. గీత తల్లితండ్రులకు అయిదుగురు ఆడపిల్లలు. గీత వారిలో నాలుగవ సంతానం. కుటుంబంలోని ఆచార వ్యవహారాలు, ఆహారపుటలవాట్లు, వేషధారణ, నియమ నిబంధనలు, విలువలు అన్నీ శుద్దశోత్రీయ చాందసవాద పద్ధతులలో కొనసాగుతున్నా, జీవితంలో స్థిరపడడానికి, ఎదుగుదలకు ఉపయోగపడతాయనుకున్న మేరకు పాశ్చాత్య సంస్కృతిని అనుమతించే మెలుకువలు తెలిసిన వ్యక్తి. తన అయిదుగురు పిల్లల్ని కాథలిక్ నన్స్ నడిపే మిషనరి స్కూళ్ళలో చదివించడం అందులో భాగమే. తల్లి లక్ష్మి పెద్దగా చదువుకోకపోయినా తన జీవితానుభవం నుంచి ఆడపిల్లలు చదువుకుని ఆర్ధికంగా స్వతంత్రంగా నిలబడాలని కాంక్షించిన స్త్రీ. గీతా రామస్వామి తండ్రికి ఉద్యోగరీత్యా తరచుగా జరిగిన బదిలీలు, ఒకరకంగా గీత ఎదుగుదలకు, నాగరిక ప్రపంచంతో, వివిధరకాల వ్యక్తులతో సంబంధాలు ఏర్పడడానికి దోహదపడ్డాయి.
గీతా రామస్వామి షోలాపూర్లో 1953 లో జన్మించింది. అద్భుతమైన గ్రహణశక్తి, తిరుగుబాటు మనస్తత్వం, ప్రతి విషయాన్ని తర్కించి చూసే వైఖరి, ముందు వెనుక ఆలోచించని సాహసం, అనుకున్నది చేసే మొండితనం, పట్టుదల, అసహనం వంటి లక్షణాలు ఈ పుస్తకం లోని గీతారామస్వామి వ్యక్తిత్వంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఉద్యోగరీత్యా తండ్రి ఊళ్ళు మారుతుండడం వల్ల గీతా రామస్వామి చదువుకూడా బొంబాయి, మద్రాసు మారుతూ హైదరాబాద్ చేరి కేంద్రీయ విద్యాలయంలో 12 వ తరగతి ముగిస్తుంది. IITలో సీటు వచ్చి చదవాలని తాను బలంగా అనుకున్నా తండ్రి ఆర్ధికస్థితి అందుకు అంగీకరించకపోవడం చేత అయిష్టంగానే కోఠి విమెన్స్ కాలేజిలో B.Sc కోర్సులో చేరుతుంది. తన అయిదారేళ్ళ వయసు నుంచే వున్న, పుస్తకాలు చదివే అలవాటు ఎంతోమంది రచయితలతో వారి సాహిత్యంతో పరిచయాన్ని ఏర్పరచింది. క్లాసులో తాను చదువుకున్న సైన్సు పాఠాలను తన శరీరంలో వస్తున్న మార్పులకు, తన కుటుంబంలో ఆనవాయితీగా అమలవుతున్న మూఢాచారాలకు, సమాజంలోనూ వున్న అనేక విషయాలకు అన్వయించుకుని హేతువాద దృక్పధంతో ఆలోచించడం ప్రారంభించింది. ఎమిడ్ బ్లైటన్, చార్లెస్ డికెన్స్, జేన్ ఆస్టిన్, యి.హెచ్.కార్, సోమర్సెట్ మామ్, గార్డెన్ చైల్డ్ వంటి ప్రముఖుల సాహిత్యం, గీతా రామస్వామిలో లిబరల్ ఆలోచనలకు తలుపులు తెరిచాయి. కోఠి విమెన్స్ కాలేజీ వాతావరణం తనకు ఏమాత్రం ఆసక్తి కలిగించకపోవడంతో బి.ఎస్.సి రెండో సంవత్సరానికి ఉస్మానియా యూనివర్సిటీకి మారింది. ఎటువంటి ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత వాతావరణం, విద్యార్ధినీ విద్యార్ధుల మధ్య అరమరికలు లేని స్నేహసంబంధాలు, జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఎడతెగని రాజకీయ మేధోపరమైన చర్చలు, డిబేట్లు సహజంగానే గీతా రామస్వామిని అమితంగా ఆకర్షించాయి. యూనివర్సిటి మేధావి, సాహసవంతుడు, ప్రగతిశీలభావాలు కలిగిన జార్జిరెడ్డి మిత్రులతో, అతని సోదరుడు సిరిల్ రెడ్డితో గీతకు పరిచయాలు కలగడం, ఆ పరిచయాలు చండ్రపుల్లారెడ్డి విప్లవ గ్రూపుతోను దాని అనుబంధ విద్యార్ధి సంస్థ అయిన పి.డి.ఎస్.యు. తో సంబంధాలు ఏర్పడి అందులోచేరి పనిచెయ్యడానికి దారితీసింది. ఇదే సమయంలో యూనివర్సిటి లోనూ ప్రపంచవ్యాప్తంగాను జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు విద్యార్థులను ఆలోచింపచేస్తున్నాయి. ఆసరికే జార్జిరెడ్డి హత్యకు గురవ్వడంతో విద్యార్థులంతా ఆగ్రహావేశాలతో దుఖంతో రగిలిపోతున్నారు. మరొకవైపు భారతదేశ విముక్తికి నక్సల్బరి, శ్రీకాకుళ సాయుధ పోరాట మార్గం తెరపైకి రావడం, వియత్నాంపై అమెరికా దాడికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, చైనాలో జరుగుతున్న సాంస్కృతిక విప్లవం, యువతరాన్ని ఉత్తేజపరుస్తున్న చే గ వేరా, సామ్రాజ్యవాదాన్ని తిరస్కరిస్తూ ఆసియా, ఆఫ్రికా దేశాలలో జరుగుతున్న తిరుగుబాట్లు, నల్లజాతి వివక్షతకు వ్యతిరేకంగా అమెరికాలో సాగుతున్న బ్లాక్ పాంథర్స్ ఉద్యమం వంటివన్నీ యూనివర్సిటీ లోని అభ్యుదయభావాలు కలిగిన విద్యార్ధులపై తీవ్ర ప్రభావం వేసి వారిలో చాలామందిని వామపక్ష సిద్ధాంతం, ఆచరణవైపు నడిపించాయి. 1973 పి.డి.ఎస్.యు. విద్యార్ధి సంస్థలో చేరిన గీతా రామస్వామి 75లో ఎమర్జెన్సీ ప్రకటించేంతవరకూ ఆ సంస్థ చేపట్టిన అనేక సమస్యలలో క్రియాశీలంగా మిలిటెంట్ గా పాల్గొంది. అభ్యుదయ మహిళా సంస్థ ఏర్పాటులో కీలక భూమిక పోషించింది. సంగీతంలో వున్న పరిజ్ఞానంతో అరుణోదయ సాంస్కృతిక సంస్థలో చేరి ప్రదర్శనలిచ్హింది. తన కుమార్తె నక్సలైట్ పార్టీలో చేరిందని నిర్ధిష్టంగా తెలియకపోయినా తన అదుపాజ్ఞలలో లేదని గ్రహించిన గీత తండ్రి చాలా ఆందోళనకు గురయ్యాడు.
జూన్ 25 ఎమర్జన్సీ ప్రకటించేనాటికి గీతా రామస్వామి పార్టీ సిటీ కమిటీ సభ్యురాలు. ఇందిరాగాంధి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని అమలుపరుస్తోంది. అక్రమ కేసులు, అరెస్టులు, బూటకపు ఎంకౌంటర్ లను విచ్హలవిడిగా సాగిస్తోంది. విద్యార్ధులు, మేధావులు, రచయితలు, ప్రగతిశీల విప్లవశక్తులతో జైళ్ళను నింపింది. విద్యార్ధి నాయకుడైన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, పార్టీ నాయకుడు నీలం రామచంద్రయ్యల బూటకపు ఎన్కౌంటర్ విద్యార్ధులలో ప్రకంపనలను సృష్టించింది. యూనివర్సిటీ లోపలా బయటా అంతటా నిరుత్సాహపూరిత భయానక వాతావరణం నెలకొంది. రాజకీయ విశ్వాసాలు సడలిన కొంతమంది ఉద్యమబాటను విడనాడి లొంగుబాట్లు, జీవితంలో స్థిరపడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉద్యమంతోనే కొనసాగదలచుకున్న విద్యార్ధులు ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకునేందుకు రహస్య జీవితంలోకి వెళ్ళారు.
వివాహం పట్ల చిన్నప్పటి నుంచీ గీతా రామస్వామిలో చాలా విముఖత వుండేదని చెప్తుంది. ‘నువ్వు నల్లగా వున్నావు నిన్నెవరు చేసుకుంటారు ‘ అని పదే పదే తల్లి అనడం, తన ఆర్ధిక స్వతంత్రతను నిలబెట్టుకోవాలని ప్రయత్నించిన తన సోదరిని ఆమె భర్త విపరీతంగా కొట్టడం వంటి సంఘటనలతో జీవితంలో తాను వివాహం చేసుకోకూడదని, మిగిలిన స్త్రీల మాదిరిగా వివాహం చేసుకోకుండా బాగా చదువుకుని అందరికంటే భిన్నంగా జీవించాలని అనుకున్నానని అంటుంది. కాని కమ్యూనిస్టు అయ్యి వివాహం చేసుకున్న అలెగ్జాండ్రా కొల్లంటాయ్ రచనలను చదివి పెళ్ళి పట్ల అంతవరకు తనకున్న అభిప్రాయాన్ని మార్చుకుని జార్జి రెడ్డి సోదరుడు, తన రాజకీయ సహచరుడు అయిన సిరిల్ రెడ్డిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ వివాహం జరిగేలోగా తన జీవితాంతం పీడ కలలాగా వెంటాడే సంఘటన జరిగింది.
తల్లి ఆరోగ్యం సీరియస్ గా వుందని వెంటనే బయలుదేరి రమ్మనే సమాచారాన్ని అందుకుని మద్రాసు వెళ్ళిన గీతా రామస్వామికి అక్కడకు వెళ్ళిన తర్వాతగాని ఆ వార్తలో నిజం లేదని, నక్సలైట్లలో తిరుగుతున్న కూతురిని వెనక్కురప్పించడం కోసమే తల్లితండ్రులు ఆడిన నాటకమని గుర్తించి హతాశురాలయ్యి వారితో ఘర్షణ పడుతుంది. మూడురోజుల పాటు తిండితిప్పలు పెట్టకుండా ఆమెను గదిలో బంధించి, డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి 20 రోజుల పాటు ఎలెక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఈ సంఘటన తన మానసిక శారీరక స్థితిని చాలా దిగజార్చిందని, తన జ్ఞాపకశక్తి మందగించి తాను వివాహం చేసుకోవాలనుకున్న వ్యక్తినే గుర్తించలేని స్థితికి చేరానని, డిస్సోరియంటేషన్, భయం ఆందోళన, నిస్సహాయత, విషాదం తనలో చాలా కాలంపాటు వుండేవని గుర్తు చేసుకుంది. ఆ కుటుంబ బందిఖానాలో నుంచి బయట పడాలని రకరకాలుగా ప్రయత్నించి చివరికి తన మిత్రుల సహకారంతో తప్పించుకుని హైదరాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్ కి వచ్చిన కొద్దికాలంలోనే గతంలో నిర్ణయించుకున్న విధంగా పార్టీ నాయకుడు చండ్ర పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గీత – సిరిల్ ల వివాహం జరిగింది. ఎమర్జన్సీ ఇంకా కొనసాగుతూ కనిపించిన వాళ్ళను కనిపించినట్లు ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది. రహస్య స్థావరాలపై దాడులు చేస్తోంది. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లోని పార్టీ రహస్య స్థావరాలపై పోలీసుల దాడులు జరిగాయి. రక్షణ కోసం హైదరాబాద్ కి వచ్చిన ఫారెస్టు కామ్రేడ్స్ ద్వారా అనేక విషయాలు తెలిసి నిర్ఘాంతపోయిన తాము ఆ విషయాలపై నాయకత్వాన్ని నిలదీశామని గీతా రామస్వామి చెపుతుంది. ఫారెస్టు ప్రాంతం విముక్తి అయిపోయి అక్కడ మన చట్టాలే అమలవుతున్నాయని నాయకత్వం తమకిచ్చిన తప్పుడు సమాచారం గురించి, విమెన్ కామ్రేడ్స్ పట్ల మేల్ కామ్రేడ్స్ వ్యవహరిస్తున్న తీరు, వారిని లోబరుచుకోవడానికి ప్రయత్నించడం, వారిపై జరుగుతున్న లైంగిక దాడులు, కార్యకర్తలకు పుట్టిన పసిబిడ్డలకు సంబంధించి పార్టీకి ఒక విధానమంటూ లేకపోవడం వంటి విషయాలపై వివరణను కోరుతూ అదే సందర్భంలో నాయకత్వం మీద పార్టీ మీద స్వయంగా తనకు సిరిల్ కు వున్న అభియోగాలను పేర్కొంటూ డాక్యుమెంట్ పెట్టినట్లుగా తెలిపింది. కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట పార్టీలో అమలయ్యేదానిలో కేంద్రీకృతమే తప్ప ప్రజాస్వామ్యం లేదని, పార్టీలోను నాయకత్వంలోను వ్యక్తం అవుతున్న ఆధిపత్య, పితృస్వామిక ధోరణులు, చిన్న పెద్ద సమస్యలకన్నింటికీ అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దళారీ పెట్టుబడిదారీ వ్యవస్థే కారణమని యాంత్రికంగా వల్లెవేయడం, తోటి విప్లవసంస్థల పట్ల పార్టీలు అనుసరించే సంకుచిత వైఖరులు, రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ ద్వారా అమలవుతున్న హింస అనివార్యం అనడం కంటే పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా చేసిన హింస అనే తీవ్రమైన ఆరోపణలు వున్నాయి. తాము పెట్టిన విమర్శలకు ప్రతిగా తమను నిర్మాణంలో నుంచి బహిష్కరించినట్లుగా పార్టీ ప్రకటించిందని పేర్కొంది. పార్టీ నుంచి బహిష్కరింపబడిన తర్వాత ఇంకా ఎమర్జెన్సీ కొనసాగుతుండడం వల్ల పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోడానికి సిరిల్ రెడ్డి సోదరుడు కారల్ రెడ్డి వున్న చండీఘర్ కు వెళ్ళి 1977లో ఎమర్జెన్సీ ఎత్తి వేసేంత వరకూ అక్కడ తలదాచుకున్నామని చెప్తుంది. తమపై ఏమైనా కేసులు వున్నాయో వుంటే వాటి పరిస్థితి ఏమిటో ఆంధ్రప్రదేశ్ లో నిర్బంధం ఎలా వుందో తెలియని అస్పష్టతతో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మరో మూడేళ్ళ పాటు నార్త్ ఇండియాలోనే కాలం గడిపారు. చండీఘర్ నుంచి ఢిల్లీలో కొంతకాలం, అక్కడి నుంచి 1980 లో హైదరాబాద్ కి వచ్హేంతవరకూ ఘజియాబాద్ లో వాల్మీకీల మధ్య జీవించారు.
పార్టీ నుంచి బయటకు వచ్చినా ప్రజల మధ్య తమ రాజకీయ కార్యాచరణను కొనసాగించాలనే అభిప్రాయం బలంగా వున్న గీతా రామస్వామికి NCERTలో పిల్లల సమస్యపై చేసిన ప్రాజెక్టు, వాల్మీకుల పిల్లలకు ఆంగ్లం బోధించడం వంటి పనులన్నీ పెద్దగా సంతృప్తిని ఇవ్వకపోగా NGOలు చేసే దాతృత్వపు పనులుగా తోచి చాలా అసంతృప్తికి గురిచేశాయి. నక్సల్బరీ ఇచ్చిన ప్రేరణ, ఆ స్వప్నం ఇంకా తనలో సజీవంగానే వుండి వున్నందువల్ల తన రాజకీయ క్రియాశూన్యత తనలో తీవ్ర మానసిక అశాంతికి, నిరాశా నిస్పృహలకు కుంగుబాటుకు, అనారోగ్యానికి గురి చేశాయంటుంది. సర్వస్వం పార్టీయే అనుకున్న పార్టీ లేదు, కుటుంబం లేదు. దేనిపైనా ఆసక్తి లేని స్థితిలో డిప్రెషన్ లోకి వెళ్ళి ఎన్నోసార్లు ఆత్మహత్య వైపు ఆలోచనలు సాగాయంటుంది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయబాటను విడనాడి దానికి భిన్నమైన మార్గంలో ప్రయాణించాలనుకునే స్త్రీలు అందుకు తమ జీవితమంతా చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుందనే వాస్తవం నా అనుభవం నాకు తెలియచేసింది అంటుంది.
తనకున్న రాజకీయ ఆసక్తితో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎం.ఎల్ పార్టీ నిర్మాణాలకు వెలుపల జరుగుతున్న ఉద్యమాలను పరిశీలించ సాగింది. చత్తీస్ ఘర్ లో శంకర్ గుహా నియోగి ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న స్వతంత్ర కార్మిక ఉద్యమం, మేధాపాట్కర్ నర్మదా బచావో ఆందోళన, ఛత్తీస్ ఘర్ ముక్తి మోర్చా, చిప్కో ఉద్యమం వంటివన్ని గీతా రామస్వామిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. అహింసాయుత మార్గంలో ప్రజాస్వామిక పద్ధతులలో ప్రజా ఉద్యమాలను ఏవిధంగా నిర్వహించవచ్చో పైన పేర్కొన్న ఉద్యమాలన్నీ తన ముందు ఒక ఉదాహరణగా నిలిచాయి. విప్లవం ఒక్కటే ఏకైక మార్గం కాదు, ఆ లక్ష్యానికి చేరడానికి అనేక మార్గాలున్నాయనే వాస్తవాన్ని ఈ ఉద్యమాలు తనకు వెల్లడి చేసాయంటుంది.
ఎం.ఎల్ పార్టీకి భిన్నంగా, అహింసాయుత మార్గంలో మానవత్వం, ప్రజాస్వామిక విలువల ఆచరణతో కూడిన ఒక మిలిటెంట్ ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలమా? గ్రామీణ పేదల ప్రజా సమస్యల పునాదిగా ప్రజల నాయకత్వంలో స్వయం పోషకమైన, పటిష్టమైన ఒక సంస్థను నిర్మించడం ఎలా? ఇటువంటి సందేహాలు ఆలోచనలు గీతా రామస్వామిని వేధిస్తూనే వున్నాయి.
హైదరాబాద్ తో తమకున్న అనుబంధం రీత్యా చిరకాల మిత్రుడు అజయ్ సిన్హా ఆహ్వానాన్ని అందుకుని 1980లో సిరిల్, గీత హైదరాబాద్ చేరుకున్నారు. సిరిల్ పేదప్రజలకు న్యాయ సహాయాన్ని అందించే లక్ష్యంతో న్యాయవాద కోర్సులో చేరాడు. చారు మజుందారు గ్రూపులో పనిచేసి ఎమర్జెన్సీలో అరెస్టయ్యి ఆ తర్వాత పార్టీలోనుంచి బయటకు వచ్చి చిత్తూరు జిల్లా నుంచి రెండుసార్లు ఎం.ఎల్.ఎ అయిన సి.కె. నారాయణ రెడ్డిని అదే సమయంలో కలవడం ఆ కలయిక భవిష్యత్తులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఏర్పాటుకి దారితీసింది.
1980 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని విప్లవ సంస్థల ఆధ్వర్యంలో పోరాటాలు వెల్లువెత్తుతున్న కాలం. అనేక మంది యువతీ యువకులు ఆ పోరాటాల పట్ల ఆకర్షితులవుతూ ఆ నిర్మాణాల వైపు అడుగులు వేస్తున్న కాలం. తెలుగు రాష్ట్రాలలో వున్న ఎం.ఎల్ పార్టీల లోని కార్యకర్తలలో పరిశీలనాత్మక లోతైన అధ్యయనం, సిద్ధాంత చర్చలు కొరవడడం, అందుకు అవసరమైన సాహిత్యం కూడా అందుబాటులో లేకపోవడం గమనించి ఆ లోటును తొలగించాలనే లక్ష్యంతో 1980లో నలుగురు కమిటి సభ్యులతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను ప్రారంభించామని అంటుంది. డిప్రెషన్ లో మునిగిపోయి వున్న తనకు HBT పని అందులోనుంచి బయట పడడానికి ఒక మందులా పని చేసిందని అంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో వచ్చిన మంచి సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి సామాన్య పాఠకులకు తక్కువ ధరకు అందించాలనే అభిలాషతో మొదలైన హెచ్.బి.టి. అంబేద్కర్ వాదులు వామపక్ష ఉద్యమకారులతో సంబంధాలను కొనసాగిస్తూ ఆర్ధిక, తాత్విక, సాంఘిక, చారిత్రక, వైజ్ఞానిక, విషయాలపై అవగాహనను అందించే పుస్తకాలను, స్పూర్తిని అందించే జీవిత చరిత్రలను, మార్క్సిస్టు ప్రాధమిక సూత్రాలను బోధించే పుస్తకాలను, కాల్పానిక సాహిత్యాన్ని, పోరాట చరిత్రలను వివరించే అనేక పుస్తకాలను ప్రచురించింది. హెచ్.బి.టి. పనిలో కీలక బాధ్యతలను నిర్వహిస్తూ రచయితలను, అనువాదకులను, ఆచార్యులను, కవులను కలవడం ప్రింటింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ అనేక విధులను నిర్వర్తించడం 1984 వరకూ ఈ పని ఒకమేరకు తృప్తిని కలిగించినా ప్రజలను సమీకరించే క్రియాశీల రాజకీయ కార్యాచరణ లేకపోవడం అనే లోటు గీతను వెంటాడుతూనే వుంది.
దళిత సంస్థలతో సిరిల్ కు గీతకు వున్న సంబంధాలు మరింత దగ్గరయ్యాయి. ఆ సంస్థలు నిర్వహించే మీటింగులకు వెళ్ళడం, ఆ మీటింగులలో, వాళ్ళు నిత్యం ఎదుర్కునే కులవివక్షత, అంటరానితనం, తమకు ఎవరూ ఇళ్ళు ఇవ్వకపోవడం, తమపై జరుగుతున్న అగ్రకుల దాడులు వంటి సమస్యల చుట్టూ సాగే వాళ్ళ ప్రసంగాలు తనకు చాలా ఆసక్తికరంగా వుండేవి. ఈ క్రమంలోనే ప్రముఖ లాయర్, దళిత నాయకుడు అయిన బొజ్జా తారకం గారితో, ఇబ్రహీంపట్నం లో NGOను నడుపుతున్న పాల్ దివాకర్ తో పరిచయాలు ఏర్పడ్డాయి.
అమెరికన్ ఫెమినిష్టులు రాసిన Our Bodies, Ourselves అనే పుస్తకాన్ని భారతదేశ పరిస్థితులకు అన్వయిస్తూ ఫెమినిస్టు కోణంలో నుంచి తెలుగు లోకి తీసుకు వచ్హేందుకు నిర్ణయించుకున్న’ స్త్రీ శక్తి సంఘటన ‘ గ్రూపుతో కలిసి ఆ పుస్తకంపై పనిచేస్తున్న గీత గ్రామీణ మహిళల ఆరోగ్య స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపేందుకు 1984 లో మొదటిసారి ఇబ్రహీంపట్నం లో అడుగు పెట్టింది.
క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఇబ్రహీంపట్నం వెళ్ళిన గీతా రామస్వామి కి పాల్ దివాకర్ సంస్థ ద్వారా పరిచయమైన శంకరయ్య, బుగ్గన్నతో కలిసి అనేక గ్రామాలు తిరిగింది. ప్రజలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ పర్యటనలో రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సాంఘిక, రాజకీయ స్వరూపం అర్ధమైయ్యింది. తెలంగాణ లోని మిగిలిన ప్రాంతాల మాదిరే రంగారెడ్డి జిల్లా కూడా ఫ్యూడల్ వ్యవస్థ బలంగా వున్న ప్రాంతం. ప్రజలను పీడిస్తున్న స్థానిక పెత్తందారులకు రాజకీయ పలుకుబడి వుండి, పాలకవర్గంతో సన్నిహిత సంబంధాలను కలిగి వున్నవాళ్ళు. సాంఘిక, రాజకీయ పెత్తనం అంతా ప్రధానంగా రెడ్డి భూస్వాములదే. రకరకాల కుట్రలు, కుతంత్రాలు దౌర్జన్యంతో, అవినీతి అధికారుల అండదండలతో వేల ఎకరాల ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, మిగులు భూములు, దేవుడి మాన్యాలను ఆక్రమించుకున్నారు. బతకడానికి పొట్ట చేత పట్టుకుని వచ్చిన రెడ్లు సైతం ప్రజల నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వందల, వేల ఎకరాల భూమిని కబ్జా చేసుకుని తరతరాలుగా అనుభవిస్తూ కౄరమైన భూస్వాములుగా అవతారమెత్తారు. 1952లో భూదాన చట్టం క్రింద పేద ప్రజలకు పంచిన భూములు కూడా బినామి పేర్లతో భూస్వాముల ఆక్రమణలోనే వున్నాయి. అంటరానితనం, కుల సమస్య తీవ్రంగా వుంది. కూలీలకు, మహిళలకు ఇచ్చే వేతనాలు నామమాత్రం. కనీసవేతనాల చట్టం, వెట్టి చాకిరి నిషేధ చట్టం వున్నా అవన్నీ వాళ్ళ అధికారం, పెత్తనం ముందు బలాదూర్. కూలీలు, వ్యవసాయ కార్మికులు, నిరుపేదలు అయిన మాదిగలు, మంగలి, చాకలి, మాల, తెలగ కుటుంబాలు తరతరాలుగా బలవంతపు వెట్టిచాకిరిలో మగ్గుతున్నాయి. వాళ్ళ పిల్లలు చదువులకు దూరమై భూస్వాములకు చెందిన పశువులను మేపుకుంటూ రాబోయే కాలపు కూలీలుగా జీతగాళ్ళుగా అవతారమెత్తేవారు. వివిధ రూపాలలో మహిళలపై భూస్వాముల సాంఘిక దోపిడీ అమలయ్యేది. లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు స్త్రీలను గురిచేసేవారు.
ఒక బలమైన ప్రజావుద్యమ నిర్మాణానికి అవసరమైన పునాది సాంఘిక నేపధ్యం, వున్నాయని గీతా రామస్వామికి అనిపించింది. స్థానికులైన శంకరయ్య, బుగ్గన్నలతో కలిసి గ్రామాలు తిరుగుతూ మాదిగపేటలలో మీటింగులు పెడుతూ ప్రజల సమస్యలపై వారిని చైతన్య పరుస్తూ ‘ఇబ్రహీంపట్నం వ్యవసాయ కార్మికుల సంఘం ‘ ఏర్పాటుకు గీత కృషి చేసింది. ఏడెనిమిది సంవత్సరాల కాలంలో ఏడు మండలాలలోని అరవై గ్రామాలకు సంఘం విస్తరించిందని పేర్కొంది.
వెట్టి చాకిరీని రద్దుచేసి, వారికి నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించాలనే డిమాండ్లతో భూస్వాములపై పోలీసు ఠాణాలలో కార్మికశాఖలో, కోర్టులలో కేసులు నమోదు చేయడంతో మొదలైన పోరాటం తమ యూనియంకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆకిలి వూకేది రద్దు కావాలని, దొరల దౌర్జన్యం, పోలీసుల జులుం నశించాలనే నినాదాలతోపాటు స్థానిక ఇతర సమస్యలను కూడా జోడించుకుంటూ ముందుకుసాగి భూపోరాటాల వైపు మళ్ళింది.
ఈ డిమాండ్లను సాధించుకోడానికి ప్రజలు ధర్నాలు, వూరేగింపులు నిర్వహించారని, గ్రామాలలో పనులను బందు పెట్టారని, తమపై దాడులు చేసిన భూస్వాములను వారి కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురిచేసారని గీతా రామస్వామి వివరించింది. ఈ పోరాటాలు, ప్రతిఘటన ద్వారా సాధించుకున్న విజయాలతో పొందిన విశ్వాసంతో ముందుకు సాగి మరింత ఐక్యత పట్టుదలను ప్రదర్శిస్తూ భూమి కోసం తమ పోరాటాన్ని ఎక్కుపెట్టారు. కల్లుకి, చిన్న మొత్తాల అప్పులకు దౌర్జన్యంగా లాకున్న భూములను తమకు తిరిగి ఇవ్వాలని, భూస్వాములు అక్రమంగా తరతరాలుగా చట్టవిరుద్ధంగా అనుభవిస్తున్న ప్రభుత్వ మిగులు భూములపై తమకు హక్కు కల్పించాలని ప్రజలు ఉద్యమించడాన్ని తమ పునాదులు కదులుతున్నట్లుగా భూస్వాములు, ప్రభుత్వం భావించాయని, తమ అధికారాన్ని, సాంఘిక పెత్తనాన్ని ప్రశ్నించడాన్ని సహించలేని భూస్వాములు ప్రజలపై దాడులకు దౌర్జన్యాలకు హత్యలకు పాల్పడ్డారని పేర్కొంది. తమ పశువులను మేపడానికి నిరాకరించిన పన్నెండు పదమూడేళ్ళ పిల్లలను కొట్టి 300 గుంజీళ్ళ శిక్షను విధించారు. ప్రజలు అడుగుతున్నవి చట్టబద్దమైన హక్కులే అయినా దొరల దోపిడీని నిలబెట్టడానికే వున్న పోలీసులు రంగంలోకి దిగి ప్రజలపై దాడులు, అక్రమ కేసులు అరెస్టులు సాగించారు. సంఘం నాయకత్వం మీదా, కార్యకర్తలమీదా అనేక తప్పుడు కేసులు పెట్టారు. గీతా రామస్వామిని పోలీసు స్టేషన్ కు పిలిచి అసభ్యంగా అతి నీచంగా మాట్లాడి పోలీసు అధికారులు అవమానపరిచారు. గీతా రామస్వామి ఆచూకి తెలపమని సంఘం కార్యకర్తలపై భూస్వాములు భౌతికదాడులు జరిపారు. గీత జాడ కోసం మాదిగ జుట్టు నర్సయ్యను భూస్వాములు వారి గుండాలు కొట్టి చంపారు. గీత ను హత్య చేయడానికి రెండు మూడు దఫాలు తీవ్రంగా ప్రయత్నించారు.
ఈ ఉద్యమం ద్వారా అధికారికంగా 1500 మంది, అనధికారికంగా 1420 మంది వెట్టి చాకిరి నుంచి విముక్తి చెందారని, ఏడు మండలాలలో 14,000 ఎకరాల భూమి భూస్వాముల స్వాధీనం నుంచి ప్రజల సాగులోకి వచ్చినట్లు గీతా రామస్వామి పేర్కొంది. వెట్టి చాకిరీ నుంచి విముక్తి చెందిన జీతగాళ్ళ పునరావాసం కోసం మరొక వంద ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి పొందినట్లు తెలిపింది. ప్రజలు సాధించుకున్న భూములను మళ్ళీ తమ ఆధీనం లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలను కొందరు భూస్వాములు ఈ పుస్తకం రాసే సమయానికి కూడా ఇంకా కొనసాగిస్తూనే వున్నారు. వారికి అనుకూలంగా కోర్టులు ‘స్టే’ లు ఇస్తూనే వున్నాయన్నారు. నెలసరి జీతాలు 180 నుంచి 300 వరకూ పెరిగాయని, బ్యాక్ వేజస్ క్రింద 2,00,000 రూపాయలను, ప్రమాద నష్టపరిహారం క్రింద భూస్వాముల నుంచి 66,000 రూపాయలను ప్రజలు సాధించుకున్నారని, భూస్వాముల పశువులను మేపడం మానేసిన పిల్లల చదువుకోసం వంద నాన్ ఫార్మల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసామని గీత రామస్వామి వివరించింది. ఇవేకాక కులాంతర వివాహాలను ప్రోత్సహించినట్లుగా పేర్కొంది. ఈ ఉద్యమం మొత్తంగానే ప్రజలందరిలో ఒక సామాజిక రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్హి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, గ్రామాల మధ్య ఐక్యతను నిర్మించగలిగిందని అభిప్రాయ పడింది. వినూత్న ఎత్తుగడలతో సృజనాత్మక పద్దతులలో స్త్రీలు భూస్వాములను, పోలీసులను ఎదుర్కున్నారని గీతా రామస్వామి అంటుంది.
ఈ లీగల్ పోరాటాలు, సాధించిన విజయాల వెనుక ‘సలహా ‘ వ్యవస్థాపకుడు సిరిల్ రెడ్డి కృషి ప్రత్యేకమైనదని చెబుతూ భూములకు సంభందించి ప్రజలు తెచ్హిన ప్రతి కాగితాన్ని లోతుగా అధ్యయనం చేసి సంబందిత కోర్టులలో కేసులు నమోదుచేయడం, అరెస్టయిన ప్రజలను బెయిల్స్ పెట్టి వెంటనే విడిపించుకురావడం, మేధావులను కూడగట్టడంలో ‘సలహా ‘ ఎంతో శక్తివంతంగా పనిచేసిందని అంటుంది. బొజ్జాతారకం, ఇతర న్యాయవాదులు, మేధావులు, శంకరన్, బి.డి.శర్మ లాంటి అధికారులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, పత్రికా రంగంలోని మిత్రుల సహాయ సహకారాలు లేకుండా ఇవి సాధ్యపడేవి కావు అని అంటుంది.
1993 నాటికి ఒక దశకు చేరుకున్న ఉద్యమం ఆ తరువాత ముందుకు వెళ్ళలేదు. ఉద్యమ నిర్మాణం ఆగిపోయింది. వ్యవసాయ కార్మికుల సంఘం తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఆ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళగలిగిన శక్తి పరిమిత లక్ష్యాలతో ఏర్పడిన సంఘానికి లేకపోవడమే అందుకు కారణమని గీతా రామస్వామి వెల్లడించింది. ఆ తరువాత శంకరయ్య లాంటి కార్యకర్తలు NFE స్కూల్స్ ట్రైనింగ్ బాధ్యతలను చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఉద్యమ నిర్మాణంలో వున్నప్పుడు HBT పనులను తనకు వీలైనప్పుడు మాత్రమే చూడగలిగిన గీత ఈ ఉద్యమ నిర్మాణం నుంచి విరమించుకున్న తరువాత HBT బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నది. ఇదీ క్లుప్తంగా ఈ పుస్తకంలోని సారాంశం.
ఈ పుస్తకం చదివిన తర్వాత పాఠకులకు కొన్ని సందేహాలు రాక మానవు. ప్రజాస్వామ్యయుతంగా, లీగల్ పరిధులలో శాంతియుత మార్గంలోనే పోరాడినా ఇబ్రహీంపట్నం వ్యవసాయ కార్మికుల సంఘం నిర్బంధాన్ని ఎందుకు ఎదుర్కోవలసి వచ్చింది? రంగారెడ్డి జిల్లాలో నిర్మాణమైన ఈ ఉద్యమం ఒక దశ వరకు వెళ్ళి ఎందుకు ఆగిపోయింది? లీగల్ పరిధిలోనయినా భూమి, ఆర్ధిక వనరులు, కులం, పితృస్వామ్యం వంటి మూలాలను కెలికితే రాజ్యం అంగీకరిస్తుందా? వ్యవస్థలో మౌలిక మార్పును కోరుకుంటూ అందుకోసం ప్రాణాలను పణంగా పెడుతున్న విప్లవ నిర్మాణాలు ఉండవలసినంత ప్రజాస్వామ్యబద్దంగా లేవని, పితృస్వామిక ధోరణులతో వున్నాయని మిత్రశిబిరం నుంచి కూడా పదేపదే వస్తున్న విమర్శల మాటేమిటి?
సమాజ మార్పుకు జరిగే ఉద్యమాలు శాంతియుత మార్గంలో జరగాలా లేక సాయుధపోరాట మార్గంలో జరగాలా అనే చర్చ గత అరవై ఏళ్ళుగా ఈ దేశంలో నలుగుతూనే వుంది. ఈ ‘పంథా ‘ సమస్యపైనే కమ్యూనిస్టులతో విభేదించి విప్లవకారులు వేరయ్యారు. ఈ ఆరు దశాబ్దాల కాలం అనేక అనుభవాలను గడించింది. తక్షణ రోజువారీ సమస్యలపై తాను అనుమతించిన పరిధిలో ఊరేగింపులో, ప్రదర్శనలో చేస్తే పాలకవర్గాలకు పెద్దగా అభ్యంతరం వుండకపోవచ్చు. ఆ అవకాశాలు కూడా నానాటికీ హరింపబడుతూ వ్యక్తి ప్రాథమిక హక్కులపైనే దాడి జరుగుతున్న రాజకీయ వాతావరణం నేడు వుంది. అటువంటిది ఏ ఆర్ధిక మూలాల మీద ఈ దోపిడీ వ్యవస్థ నిలబడివుందో వాటిని ప్రశ్నిస్తే రాజ్యం ఏమాత్రం అంగీకరించకపోగా నిర్బంధంతో విరుచుకుపడుతుందని అనేక గత అనుభవాలు రుజువు చేసాయి. రంగారెడ్డి జిల్లాలోని ఉద్యమం భూస్వాముల సొంత భూములపై తమకు హక్కు కావాలని కోరలేదు. భూస్వాములు చట్టవిరుద్దంగా అక్రమంగా దౌర్జన్యంతో ఆక్రమించుకున్న వందల వేల ఎకరాల ప్రభుత్వ మిగులు భూమిపై హక్కు కలిపించాలని మాత్రమే కోరారు. అందుకోసం శాంతియుతంగా పోరాడారు. భూపరిమితి చట్టాన్ని అమలు చేయమని అడిగారు. అది తాను రాసుకున్న రాజ్యాంగానికి విరుద్ధమైనది కాకపోయినా భూమిపై ప్రజలకు హక్కు కలిపిస్తే ప్రజల జీవితాలలో వచ్హే సాంఘిక రాజకీయ మార్పులు ఏమిటో పాలకులకు తెలుసు. కుల, వర్గ సమీకరణాలు మారిపోయి అది తమ దోపిడీ పునాదులనే కదిలిస్తుందనీ తెలుసు. అందువల్ల భూపోరాటాలు ఏ రూపంలో ఎంత శాంతియుతంగా జరిగినా రాజ్యం వాటిని అంగీకరించదు. అయినా ఎప్పటికప్పుడు ఇది ప్రజాస్వామ్య వ్యవస్తే, అందరికీ సమానావకాశాలు, హక్కులు వున్నాయని, చట్టం అందరికీ సమానమేనని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూనే వుంటుంది. అందుకోసం నామమాత్రంగానయినా కొన్నిచట్టాలను రూపొందిస్తుంది. ఆ చట్టాలలోని లొసుగులను ఆసరా చేసుకుని ఎంత పరిమిత స్థాయిలో ప్రజలకు మేలు జరిగినా వాటిని ఉపయోగించుకోవాలే తప్ప ‘లీగల్ ‘ పోరాటాలుగా వాటిని తేలికచేసి నిర్లక్ష్యం చేయరాదని వ్యవసాయ కార్మిక సంఘం అనుభవం రుజువు చేసింది. ప్రజల పోరాటాలకు అండగా మిత్ర పక్షాలతో సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించడం ఎంత అవసరమో ఈ ఉద్యమం నిరూపించింది.
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఉద్యమమైనా, దేశంలో మరోచోట జరుగుతున్న ఉద్యమాలయినా ఎందుకని ముందుకు వెళ్ళడం లేదు. మారుతున్న ఆర్ధిక, రాజకీయ వాతావరణంలో ప్రజలను వారు ఎదుర్కుంటున్న సమస్యలను, వాటి పరిష్కారాలను శాస్త్రీయంగా అర్ధం చేసుకోగలుగుతున్నామా! ఉద్యమాలు సంక్షోభ స్థితికి చేరడానికి రాజ్య నిర్బంధం మాత్రమే కారణమా లేక ఆయా వ్యక్తులకు, సంస్థలకు సిద్ధాంత, ఆచరణలో వున్న పరిధులు పరిమితులను కూడా దృష్టిలో వుంచుకోవాల్సి వుంటుందా!
పార్టీలో పితృస్వామిక ధోరణుల గురించి రచయిత ఇందులో పేర్కొన్నది. ఈ ఆరోపణలు 45 సంవత్సరాలనాటి క్రిందటివి. ఈ పుస్తకం రాసేనాటికి కూడా రచయిత ఇంకా అదే అభిప్రాయంతో వున్నదో లేదో స్పష్టత లేదు! ఈ ఆరోపణల గురించి పార్టీముందు పెట్టినప్పుడు నాయకత్వం ఇచ్హిన సమాధానం ఏమిటి? దానిపై వివరణ లేదు. విమర్శలతో డాక్యుమెంట్ పెడితే తమను పార్టీ నుంచి బహిష్కరించారు అని గీత రాసింది. పార్టీ ప్రతిస్పందన అదే అనుకోవాలా?
విప్లవ పార్టీలలోకి వచ్చేవారంతా అన్ని అవలక్షణాలు వున్న ఈ సమాజంలోనుంచి వచ్చినవారే. పార్టీలోకి అడుగుపెట్టగానే అవన్నీ మటుమాయమైపోయి కమ్యూనిస్టులయిపోతారనుకోవడం ఒక భ్రమ. అందువల్ల అటువంటి తప్పులు పార్టీ లోపల కూడా జరగవని అనుకోలేము. (అయితే ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడల్లా ఎన్ని ఏళ్ళయినా ఇదే సమాధానం చెప్పుకుంటే ఈ విషయంలో ఆ నిర్మాణాలు ఏమి నేర్చుకోనట్లే) జరిగినప్పుడు ఆయా నిర్మాణాలు వాటిని సరిదిద్దడానికి ఎటువంటి వైఖరిని అనుసరించాయి, అవి పునరావృతంకాకుండా నాయకత్వం తీసుకున్న చర్యలేమిటి అనేది ముఖ్యమైన అంశం. బూర్జువా సమాజం మాదిరి స్త్రీలను లైంగిక సాధనాలుగా, కుల, పితృస్వామ్య వ్యవస్థలను కాపాడవలసిన వాహకాలుగా కాక, స్వేచ్ఛ సమానత్వాలతో గౌరవిస్తూ ఆర్ధిక, రాజకీయ, సాంఘిక స్వాతంత్రం వుండాలనేది కమ్యూనిష్టు విలువ, ఆదర్శం. అవి ఆచరణ రూపం తీసుకోడానికి పార్టీల లోపల బయటా సమూహంగాను, వ్యక్తుల స్థాయిలోను నిరంతరం పోరాటం జరగవలసిందే. అది జరుగుతున్నదా లేదా జరిగితే ఎంత ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నది అన్నదే కీలకమైన అంశం.
కుటుంబాన్ని వ్యవస్థను అడుగడుగునా ధిక్కరిస్తూ ముందుకు సాగిన ఒక స్త్రీ చేసిన సాహస ప్రయాణం. తప్పకుండా చదవ వలసిన పుస్తకం.
(వ్యాసకర్త విప్లవోద్యమంలో పని చేసారు)
గీతా రామస్వామి పుస్తకం పై సమీక్ష బావుంది సంధ్యా.పుస్తకం లోని ముఖ్యమైన అంశాలన్నింటినీ పరిచయం చెయ్యటం బావుంది.మరీ ముఖ్యంగా వ్యాసం చివరలో లేవనెత్తిన ప్రశ్నలపై ఇప్పటికైనా లోతైన చర్చ జరగాల్సి ఉన్నది.
థాంక్స్ కాత్యాయని
పుస్తకం సమీక్ష అంతా ఒక ఎత్తు, చివర్లోని ప్రశ్నలు ఒక ఎత్తు. ఆ ప్రశ్నలు పరిచయాన్ని మరో తలంలో నిలబెట్టి ఆలోచనకు పురిగొల్పుతున్నాయి.
మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు థాంక్స్ ప్రభాకర్ గారు
కమ్యూనిస్టుల విలువలు,ఆదర్శాల గురించి వివరించి లేవనెత్తిన ప్రశ్నలు చాలావిలువైనవి. “లీగల్ పరిధిలోనయినా భూమి, ఆర్ధిక వనరులు, కులం, పితృస్వామ్యం వంటి మూలాలను కెలికితే రాజ్యం అంగీకరిస్తుందా? వ్యవస్థలో మౌలిక మార్పును కోరుకుంటూ అందుకోసం ప్రాణాలను పణంగా పెడుతున్న విప్లవ నిర్మాణాలు ఉండవలసినంత ప్రజాస్వామ్యబద్దంగా లేవని, పితృస్వామిక ధోరణులతో వున్నాయని మిత్రశిబిరం నుంచి కూడా పదేపదే వస్తున్న విమర్శల మాటేమిటి?” – వీటి గురించి అందరూ ఆలోచించమని ప్రేరేపిస్తుందీ సమీక్ష
Thanks for your observations siva